గూడు బోసిపోతే.. గుండె మూగవోదా..??

"ఒంటరితనంలో వున్న కష్టమొక్కటే - తోడులేదు అన్న సంగతి గుర్తుకురావటం"

సుబ్బరాజుగారికి నిద్రలేస్తూనే పేపరందుకొని అందులో "నేటి మాట" చదవటం అలవాటు. అది చదవగానే చిన్న చిరునవ్వు మెరిసింది - బాగుందని కాదు - తనకెంతో తెలిసిన విషయం లాగుండటం వల్ల. లేచి తయారయ్యి అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో కిందకి దిగి, పాలపేకెట్ కొనడానికి బయలుదేరాడు.

"మీకెందుకు సార్ శ్రమ, రోజు మా కుర్రాడు తెచ్చి ఇస్తాడు కదా.. ఒక అర్థరూపాయేగా ఎక్కువ" అన్నాడు పాలబూత్ రమేష్.

"భలేవాడివే..! నేనొచ్చేది పాలపాకెట్ కోసం కాదయ్యా..!! నడవటంకోసం… కొంత కాలక్షేపం కోసం" అంటూ సుబ్బరాజుగారు అక్కడే వున్న చిన్న బల్లపైన కూలబడ్డారు. అక్కడ ఆయన్ని పలకరించే వాళ్ళు ఎవరూ లేరు, ఒకరిద్దరు పెద్దవాళ్ళు తరచుగా చూడటంవల్లేమో చిన్న చిరునవ్వు నవ్వుతారు. రాజుగారు నవ్వుతారు.. అంతే..!! ఆ ప్రాంతానికి వాళ్ళొచ్చి రెండేళ్ళు కావస్తోంది. వూరి మధ్యలో వున్న లంకంత సొంత ఇంటిని అమ్మి, కొంత విదేశాలకి వెళ్ళేందుకు వాడుకోని మిగిలిన దానితో వూరి బయట వున్న ఈ అపార్ట్మెంటులో ఒక ఫ్లాటు కొన్నారు. పాతింటి దగ్గరయితే గడ్డం బాబాయిగారు, కవిగారు, కానిస్టేబులు సత్యం, బండి మహబూబు అంతా తెలిసిన వాళ్ళే. ఇక్కడెవరున్నారు..??

సుబ్బరాజుగారు కళ్ళజోడు సర్దుకుంటూ వచ్చే పోయేవాళ్ళను తెరిపారా చూస్తున్నారు. కొంతమంది పట్టించుకోవటంలేదు.. కొంతమంది చిరాగ్గా చూస్తున్నారు.. కొంతమంది పలకరిస్తున్నారు. నైట్‌డ్రస్సులో వచ్చిన ఒక అమ్మాయి చంకనెక్కి వుందో చిన్న పిల్ల. సుబ్బరాజుగారు "చీ చీ.." అన్నారు పలకరింపుగా. ఆ అమ్మాయి ఏడుపుముఖం పెట్టింది.

"అయ్యో తాతమ్మా తాత... తాతకి హలో చెప్పు.. షేకాండివ్వు" వాళ్ళమ్మ చెప్పింది.

పసిపాప భయం భయంగా చెయ్యిచాచింది. సుబ్బరాజుగారు చెయ్యి పట్టుకొని చిన్నగా వూపాడు.

"తాత" అనిందా పాప.

"తన మనవరాలు ఏం చేస్తోందో…" అనుకున్నాడాయన. మొన్న ఇంటర్నెట్లో కెమరా పెట్టి చూపించారు.. బాగా మాటలు నేర్చింది. తాతా నాకు సైకిల్ కావాలి అని అడిగింది.

"చిన్న పిల్లల సైకిళ్ళెక్కడ దొరుకుతాయి రమేషూ…?" అడిగాడాయన.

"ఇక్కడ ఎక్కడున్నాయి సార్... ట్రంకు రోడ్లో వున్నాయి షాపులు, లేకపోతే గాంధిబొమ్మ సెంటర్… అయినా ఎవరికి సార్… మీ మనమళ్ళు అంతా అమెరికాలో వున్నారన్నారు"

"అమెరికా కాదయ్యా పెద్దవాడు ఇంగ్లాండు… రెండోవాడు దుబాయి… అయితే మాత్రం అక్కడే వుంటారా ఏం? వచ్చినప్పుడే కొనిద్దామని… సరే నే వస్తా... మా టీచరుగారికి కాలేజీ టైమైందంటే నన్ను చంపేస్తుంది." అంటూనే లేచి ఇంటికి బయలుదేరాడు.

ఎపార్ట్మెంట్ దగ్గరకి చేరాడో లేదో శారదమ్మ పరుగున ఎదురొచ్చింది.

"ఏంటి టీచరుగారు... పాలపేకెట్ తెచ్చేలోపలే తొందరైపోయిందా మీకు..."

"కాదండి… పెద్దాడు ఫోన్ చేసాడు..."

"అరె రే… ఎన్నిసార్లు చెప్పాను వాడికి కొంచెం ఆలస్యంగా చెయ్యరా అని... నేను మాట్లాడే వాడిని కదా…"

"మాట్లాడుదురుగానీలెండి... తీరిగ్గా మాట్లాడురు... వాళ్ళు వస్తున్నారు... వచ్చే నెల నా రిటైరుమెంట్‌కి..."

"వీడేమిటి ఏ విషయం నాకు చెప్పనే చెప్పడు… నేనడిగితే కుదరదు సెలవల్లేవన్నాడు…?"

"సర్లేండి… ఇప్పుడేమంటారు… రావద్దంటారేమిటి వాణ్ణి..? ఎదో సర్దుబాటు చేసుకొని వుంటాడు..." ఇద్దరూ లిఫ్ట్‌లో ఎక్కారు.

"ఇంకా ఏమి చెప్పాడు..?"

"ఇంకేముంది... అదే వస్తున్నామని…"

"అది కాకుండా ఇంకేమీ మాట్లాడలేదా..."

"ఆ... మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నాడు…"

"నా గురించి కాదులేవే... కోడలు, మనమడు... వాళ్ళ సంగతి"

"అంతా బాగున్నారు… కోడలితో కూడా మాట్లాడాను… మొన్న అనంతపద్మనాభ చతుర్దశికి పూజకూడా చేసుకుందట…"

"సరిపోయింది... ఇదా మీరు మాట్లాడుకుంది..." ఇంట్లోకి అడుగుపెడుతూనే పాల పేకెట్ ఆమె చేతిలో పెట్టి పేపరు పట్టుకొని కూర్చున్నాడాయన. ఆమె కాఫీ పెట్టి తీసుకువచ్చి ఆయన చేతికిచ్చింది.

"షుగర్ ఫ్రీ వేసావా…??"

"అరె రే మర్చిపోయి పంచదార వేసానండి…"

"చిన్నాడు అన్ని డబ్బాలు కొని ఇంట్లో పెట్టి వెళ్ళాడు… నా కోసం కాకపోయిన వాడికోసమన్నా వెయ్యచ్చు కదా….!!"

"అబ్బో నాకు తెలియదా చిన్నాడి మీద మీ ప్రేమ... ఇటివ్వండి నేను తాగుతాను, మీకు వేరే చేసుకొస్తా…"

"సరేలే రేపట్నించి వెయ్యి… అవును నేను ఎంత రమ్మన్నా రాని వాడు… నువ్వు పిలిస్తే ఎలా వస్తానన్నాడు..?"

"ఎవడు పెద్దాడా... అదే టీచరుగారి తెలివి. చిన్నాడు వస్తున్నాడు అందరం ఒకసారి కలిసినట్టుంటుంది అని చెప్పా.."

"చిన్నాడు రానన్నాడు కదే..."

"మీరున్నదెందుకు... ఇప్పుడు పెద్దాడు వస్తున్నాడు… నువ్వు కూడారా అని చెప్పండి మీ ముద్దుల కొడుక్కి.."

"వస్తాడంటావా..?"

"రావాలి… మనకి ఇక ముందు ఇంత మంచి అవకాశం రాదు... ఇద్దరూ వస్తేనే మనం అనుకున్నది కుదురుతుంది…"

"అవును నిజమే... నేను మాట్లాడతాను…"

శారదమ్మ కాఫీ కప్పు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బరాజుగారు కళ్ళజోడు సర్దుకొని పేపర్లో మునిగిపోయాడు.

***

చిన్నాడు వస్తానన్నాడు. ఇంక ఆ ఇద్దరి హడావిడి మొదలైంది. అందరు ఒక్కసారి కలిసి దాదాపు ఐదేళ్ళైంది... చిన్నాడి పెళ్ళిలో.

"టిచరుగారూ..!! వాళ్ళు వచ్చాక ఏమేమి చెయ్యాలనుకుంటున్నారో మెనూ తయారు చెయ్యండి. ఆ సరుకుల లిస్టేదో నాకిస్తే ఆ ఏర్పాట్లు చేస్తా.."

"అన్నట్టు గులాబ్‌జామూన్ రాసావా… అనిరుధ్‌కి అవంటే చాలా ఇష్టం."

"ఒక రోజు గడ్డం బాబాయిగారిని, పిన్నిగారిని పిలుద్దామండి. ఆప్యాయత కలిగిన మనుషులు.. మన పిల్లలు సగం వాళ్ళింట్లోనే పెరిగారు.. వాళ్ళని చూస్తే సంతోష పడతారు.."

"మూడు చెక్రాల సైకిలు కొనాలే… చిట్టితల్లి కావాలని అడిగింది.."

"అంతా సిద్దమైనట్లేగా... మనిల్లు సరిపోకపోతే పక్కింటి వాళ్ళని అడుగుదామా..?"

"మీరు మరీనూ..! సరిపోక ఏమండి.. ఎపార్ట్‌మెంట్ అన్నాక అంతే..! సర్దుకుపోవాలి..!! మన పాతిల్లైతే బాగుండేది.."

ఇదే హడావిడి.. ఇద్దరూ వయసు మర్చిపోయి ఆడపిల్ల పెళ్ళికి ఏర్పాట్లు చేసినట్లు చేస్తున్నారు.

***

"మన కానిస్టేబుల్ సత్యం లేడు నిన్న సాయంత్రం కాలం చేసాడటనే…"

"అయ్యో పాపం.. కొడుకెక్కడున్నాడో.."

"ఇంకెక్కడ.. ఆస్ట్రేలియాలోనే.. వస్తాడేమో చూడాలి.."

"సరే.. సత్యం రాతెట్లుందో... పదండి నేను ఆవిడని పలకరించి అట్నించే కాలేజికి పోతాను.. మీ సంగతి..?"

"నేను అక్కడే వుంటానే.. పాపం నలుగురులో కలిసిపోయే మనిషి. నా కన్నా చిన్నవాడే.."

***

ఆ ఇంటికి సంక్రాంతి రెండు నెలలు ముందే వచ్చినట్లుంది. పది మంది జనం ఆ ఇరుకింటిలో అందంగా కలిసిపోయారు. పిల్లల ఆటపాటలతో పెద్దవాళ్ళిద్దరికీ పొద్దే తెలియటంలేదు. సుబ్బరాజుగారు ఒక్కొక్కటే తను కొన్న బహుమతుల్ని తీసి పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళంతా "సర్‌ప్రైస్, సర్‌ప్రైస్" అని అరుస్తున్నారు.

"ఏంటమ్మా... నాన్న మాకేమి సర్‌ప్రైస్ ఇవ్వట్లేదా..??" అడిగాడు చిన్నాడు.

"ఇస్తార్రా... మీరు వస్తున్నారని తెలియగానే అన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నారు.. సరే కూరేమి చెయ్యమంటావు.. కాకరకాయ వేపుడు చెయ్యనా.. నీకిష్టం కదా"

"వేపుడొత్తయ్యా ఆయనని నూనె తగ్గించమన్నారు డాక్టర్లు.. అయినా ఆయనకి మీరు చేసే వేపుడు కన్నా నేను చేసే ఇగురంటేనే ఇష్టం" అన్నది కోడలు. శారదమ్మ కొడుకు వైపు చూసింది. అతను ఏమి మాట్లాడలేదు. కాకరకాయలు కోడలి చేతిలో పెట్టి తనూ కొడుకు దగ్గరే కూర్చుంది.

"ఇద్దరం రిటైరయ్యాము... మీరు ఏమి ప్లాన్ చేసారు" అడిగిందామె ఉండబట్టలేక.

"ప్లానేముంది అమ్మా..." అన్నాడే కాని తర్వాత ఏమనలేదు. పెద్దాడు అందుకున్నాదు.

"మాతో వచ్చి వుంటామంటే రండి. కాకపోతే అక్కడ మీరు సర్దుకోగలరా అనేది మీరే ఆలోచించుకోండి. కాలక్షేపం వుండదు.. భాష, వాతావరణం అంతా కొత్తగా వుంటుంది. ఇంక మీకు మీ కోడలికి మధ్య ఏదైనా ఇబ్బందులు వస్తే అదొక తల నొప్పి.. కోడల్లేని అత్త గుణవంతురాలని ఎంత దూరంగా వుంటే అంత మంచిదేమో. మీరే ఆలోచించుకోడి." పెద్దాడు చెప్పాడు.

చిన్నవాడు గట్టిగా నిట్టూర్చి అన్నాడు -

"మేము మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావటం అంత సాధ్య పడక పోవచ్చు. పేరుకి ఫారిన్ వుద్యోగాలేకాని మేము దాచిపెట్టేది చాలా తక్కువ. ఆ కాస్తా ఇలా ఫ్లైటు టికెట్లకి దండగ చెయ్యడం ఎందుకు చెప్పండి. అందుకే ఈ సారి వెళ్ళేటప్పుడు ఈ ఇంటిని కూడా బేరం పెట్టమని ఒక ఏజెంటుకి చెప్పాం. ఆ డబ్బేదో బ్యాంకులో వేసుకోండి. హాయిగా ఇక్కడే వుండండి"

"కాదు మాతోనే వస్తామన్నా ఓకే…! మీకు తెలుసుగా.. ఏదీ బలవంతం లేడు.. ఎట్లాగైనా అభ్యంతరమూ లేదు.. ఛాయిస్సు మీదే" అన్నాడు పెద్దాడు.

నిజంగా చాయిస్సు ఇచ్చాడా అని అనుమానం వచ్చింది శారదమ్మకు. పైకిమాత్రం ఏమి అనలేక వూరుకుంది. సుబ్బరాజుగారు పెద్దాడి పక్కగా వెళ్ళి రిమోట్ తీసుకొని టీవీ మ్యూట్‌లో పెట్టారు.

"మీరు చెప్పేది బాగానే వుందిరా.. మీరన్నట్టు అక్కడొచ్చి వుండలేము. ఇక్కడ మీరు లేకుండా కష్టమే.. పైగా పాతింట్లో అయితే చుట్టూ పదిమంది తెలిసినవాళ్ళు వుండేవారు.. ఆలోచిద్దాం.. అన్నట్టు పాతిల్లంటే గుర్తొచ్చింది.. మన సత్యంలేడు.. కానిస్టేబుల్ సత్యం.."

"ఆ ఆ పాపిన్స్ అంకుల్ అనేవాడిని.." చిన్నాడన్నాడు

"ఆ ఆయనే మొన్న పోయాడ్రా పాపం.."

"అరె రే... మంచివాడు." పెద్దాడన్నాడు. ఆ తరువాత వాళ్ళ చర్చ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది.

***

ఆ రోజు శారదమ్మగారి రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరిగింది. కాలేజి విద్యార్థులు, హితులు, బంధువులు చాలా మందే వచ్చారు. "దీని కోసం అంతంత ఖర్చు పెట్టుకొని రావాలా" అని పెద్ద కోడలు అన్న మాట వినపడలేదు కాబట్టి శారదమ్మ చాలా సంతోషపడింది. ఆ రాత్రి ఇల్లు చేరేసరికి పదకొండైయ్యింది. మర్నాడే చిన్నాడు వెళ్ళిపోతున్నాడని అందరూ రెండు గంటలదాకా కబుర్లు చెప్పుకొని పడుకున్నారు.

మర్నాడు ఆ ఇంట్లో పిడుగు పడ్డట్టైంది..!!

పెద్దవాళ్ళిద్దరూ లేవట్లేదని ఉన్నట్టుండి చిన్నాడు అరిచాడు.. ఇద్దరూ మంచమ్మీడ పడుకున్నట్లే పోయారు. పెద్దకొడుకు పరుగున అక్కడికి వెళ్ళాడు. కోడళ్ళు - "ఇప్పుడు ప్రయాణాలు కాన్సిల్ చెయ్యాలి కామోసు" అని సణిగారు. మనమళ్ళు, మనమరాలు గట్టిగా ఏడ్చారు.

చిన్నాడు మరో బాంబు పేల్చాడు - "ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.."

పెద్దబ్బాయికి వాళ్ళు చివరిగా రాసిన వుత్తరం దొరికింది. గట్టిగా చదివాడు -

"పిల్లలూ,

అవును ఆత్మహత్యే చేసుకున్నాం.

మీదగ్గరికి రావాలా ఇక్కడే వుండాలా అని ఆలోచించే అవసరం మాకు లేకుండా పోయింది. అందులో చాయిస్సులేదని మాకు అర్థమైయ్యింది. మీ దగ్గరకి వచ్చి వుండాలన్న ఆలోచన మాకెప్పుడూ లేదు. ఇక ఇక్కడే వుండటమంటారా.. మీరెవ్వరూ లేకుండా కొంచం కష్టమే. మళ్ళీ మళ్ళీ రావడం సాధ్యపడక పోవచ్చు అని మీరే అంటున్నారు. ఎదురు చూస్తూ బ్రతకటం ఇంకా కష్టం.

కానీ ఇవేవి మేము చనిపోవటానికి కారణం కాదు. మేము ఇలా చనిపోవాలని చాలా రోజులక్రితమే అనుకున్నాము.. స్థిరంగా నిర్ణయించుకుంది ఎప్పుడో తెలుసా.. మీరంతా వస్తారని తెలిసినప్పుడు.

కానిస్టేబుల్ సత్యం గురించి మీకో విషయం చెప్పలేదు. వాణ్ణి కరెంటు పెట్టి దహనం చేసారు. వాళ్ళబ్బాయి ఆస్ట్రేలియా నించి టైముకి రాలేదు. ఇదొక చాదస్తమని మీకనిపించవచ్చు, కాని ఎక్కడ బ్రతకాలనే కాదు, ఎక్కడ చావాలనేది కూడా ఒక ఛాయిస్సే.. మాకు మా పిల్లందరు వుండగా వాళ్ళ సంతోషం చూస్తూ పోవాలని ఆశ. మా కొడుకులే మాకు అంత్యక్రియలు చెయ్యాలని కోరిక. అదే ఇప్పుడు తీర్చుకుంటున్నాం. మీకిది ఏదో పిచ్చితనంగా కనిపించవచ్చు. కొంచం అలాంటిదే.. అర్థమైతే ఆలోచించండి..

- అమ్మ నాన్న.”
Category:

7 వ్యాఖ్య(లు):

మధురవాణి చెప్పారు...

కథ చాలా బాగా రాసారు.
కానీ మనసు చాలా భారంగా అయిపోయింది :(
కానీ, ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురౌతున్నాయి పెద్దవాళ్ళకి పాపం :(

Niru చెప్పారు...

chaala baavundandi..Kaani chaala baadha ga kooda vundi.!!!!

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ముగింపు చాలా బాధాకరం.హృదయం భారమయ్యింది.

అజ్ఞాత చెప్పారు...

కధ బాగుంది.
కాకపోతే నిరాశావాదం ఎక్కువయినట్లనిపించింది.

Unknown చెప్పారు...

@ మధురవాణి గారు
@ నీరూ గారు
@ విజయమోహన్ గారు

నెనర్లు. రాసేటప్పుడే మనసు భారమైంది.

@ భవాని గారు

నెనర్లు. నిరాశావాదమంటారా.. నిజమే. కొంచెం ఎక్కువైన మాట వాస్తవమే. గట్టిగా అరిస్తేకాని వినపడదుకదా. ఇలాంటి కథలు పేపర్లో చూసిన తరివాతే ఈ కథ పుట్టింది. నేను కూడా గత నెల రోజులుగా ఈ కథలో మార్పులు చేస్తునే వున్నాను. సత్యదూరం కాదనిపించాకే ప్రచురించాను.

Aruna చెప్పారు...

నన్ను అమాయకురాలు గా చూసే నా స్నేహితులకు ఈ కథ చదివాక ఐనా అర్ధం అవుతుందేమో నేను విదేశాల్లో స్థిరపడడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తానో.

అజ్ఞాత చెప్పారు...

ఈకథ ఆంధ్రజ్చోతిలో ఇచ్చిన లింకు చదివాను. మీరు నాటపాకి రాసిన వ్యాఖ్య చూసి అడుగుతున్నాను. ఏభాగాలు వారు కత్తిరించేసేరా హైలైటు చేస్తే ఇంకా స్పష్టంగా తెలుస్తుందనుకుంటాను.