పోరాడాల్సింది ఎవరితో..?

ఇప్పటిదాకా యుద్ధం అంటే ఎక్కడో దేశ సరిహద్దులో జరిగేదనుకునేవాళ్ళం... దేశానికి వాణిజ్య రాజధాని ముంబై నగరంలో అత్యంత సంపన్నులుండే ప్రదేశంలో, చారిత్రాత్మక గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర్లో, వాటిని వీక్షించడానికొచ్చే సందర్శకుల్తో కిట కిట లాడే ప్రాంతంలో యుద్ధం జరుగుతుందని మనం ఎవరం వూహించి వుండం..!! పోలీసులూ, నిఘా వర్గాలూ వుహించి వుండక పోవటం కొసమెరుపు..!!


ఇప్పటిదాకా టెర్రరిజానికి ముఖం లేదు అనుకున్నాం. దర్జాగా సీసీ కెమెరాల్లో ఫొటోకి ఫోజిచ్చినట్టు నిలబడ్డ పాతికేళ్ళ కుర్ర టెర్రరిస్టులు ఇప్పుడు అందరికీ కలల్లోకి వచ్చే టెర్రరిజం ముఖచిత్రాలు. అరవై గంటలపాటు పోరాడటానికి సరిపడా గ్రెనేడ్లు, తుపాకులు, బులెట్లు హోటల్ గదిలో నింపుకో గలిగిన తీవ్రవాదులు మన పోలీసు తెలివితేటల్ని నరిమన్ పాయింట్లో నగ్నంగా నిలబెట్టారు.


బులెట్ ప్రూఫ్ జాకెట్లు వున్నా మన పోలీసులు, కమేండోలు ఎందుకు చనిపోయారు అని ఒక్కరైనా అడగరేం..? అసలు పట్టుమని పది మందైనా లేని టెర్రరిస్టులని ఎదురుకోవడానికి నాలుగొందలు పైబడిన పోలీసులు, కమేండోలకి అరవై గంటలు ఎందుకు పట్టిందని ఎవరూ అడగరేం..? ఉన్నికృష్ణన్ శవం చూపిస్తూ - "మంజునాథన్.. ఉన్నికృష్ణన్ శవం చూడటానికి ఎవరెవరు వచ్చారు.. సినిమా స్టార్లు ఎవరైనా వచ్చారా..?" అని అడిగే టీవీ యాంకర్లకి ఈ ప్రశ్నలు గుర్తుకు రావా..?


గుర్తుకు రావు.. ఎవ్వరూ అడగరు.. ఎందుకంటే నిజాలు బయటికి వస్తాయి. నిజం వినాలని వుందా..??


పోలీసులు వేసుకున్న జాకెట్లను చూడండి.. గూగులమ్మని అడిగితే చిత్రాలతో ఆ జాకెట్ల గురించి చెప్తుంది. అవి బులెట్లను తట్టుకునే జాకెట్లు కావు. వాళ్ళు పెట్టుకున్న హెల్మెట్లు రాళ్ళ దాడిని మాత్రమే నిరోధించడానికి తయారు చేసినవి. బులెట్ల ధాటికి అవి ఆగలేవు..!! ఎందుకంటే పోలీసులు "ఇలాంటి" సంఘటనలు ఎదురుకోవడానికి సిద్ధంగా లేరు. ఏదో చెదురుమొదురు సంఘటనలంటారే అలాంటివాటికి మాత్రమే సిద్ధంగా వున్నారు. మొదటి రోజు రాత్రి బులెట్ ప్రూఫు జాకెట్లు తయారు చేసే సంస్థ ఒకటి వాటిని పోలీసులకు వుచితంగా పంచి పెట్టిన సంగతి మీడియా వారికి తెలియనే తెలియదెందుకో..?


అయితే పోలీసుల దగ్గర ఇవి లేవా అంటే.. వున్నాయి. టెండర్లలో అందరికన్నా చవకగా కొటేషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కొని (అంటే మీకు తెలుసుగా ఎవరి కొటేషన్ ఎందుకు తెల్లారే సరికి చౌకైపోతుందో) స్టోర్లో పెట్టి తాళంవేసి వుంచారు. ఇలాంటి సందర్భంలో ఆ స్టోరెక్కడ వుందో తెలుసుకోని, ఇండెంట్ పెట్టి తీసుకొని వేసుకోవాలి. అన్నట్టు మరిచాను.. దానికి ముందు టెర్రరిస్టులను అప్పటిదాకా ఆగండి నాయనా అని చెప్పి వెళ్ళి తెచ్చుకోవాలి..!!


పరామర్శ పేరుతో వచ్చే రాజకీయ నాయకులకు భద్రత కల్పించాలా లేక టెర్రరిస్టుల సంగతి చూడాలా అని అడిగే పోలీస్ ఆఫీసరు ఫ్రస్ట్రేషనంతా ఆ తీవ్రవాదిని కిటికీలోనించి పడేసటప్పుడు తీరి వుంటుంది. మునుపు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు విపరీతమైన మంచులో కాళ్ళకున్న జోళ్ళు చాలక మంచులో పనికొచ్చే షూస్ పంపించమంటే కాంట్రాక్టర్ల గోలుమాలులో చిన్న పిల్లల షూస్ పంపించిన అవినీతి నాయకులేగా వీళ్ళంతా..! ఆ రోజు కార్గిల్ మంచుకి తట్టుకోలేక రక్తపు అడుగులేసిన సైనికుడెవరైనా తాజ్ దగ్గర వుండుంటే ఆ పరామర్శగాళ్ళని ముందు కాల్చేసేవాడు.


అన్నట్టు మరో అనుమానం..!! నాలుగు వందల మంది ఎన్ఎస్‌జీ కమెండోలలో చాలావరకు ఉత్తర భారతీయులు వున్నార్ట.. ముంబైలో వుత్తర భారతీయులా...!! రాజ్ థాకరే..!! వీళ్ళనెలా రానిచ్చావ్.. తరిమికొట్టకపోయావా..!!

ఇదంతా జరిగి కొంత మంచీ చేసింది -


తీవ్రవాదులపై నెగెటివిటీని ఇంకా పెంచింది, ఈ రోజు తీవ్రవాదం వైపు అడుగులెయ్యబోతున్న వారిలో ఒక్కడైనా ఈ మారణహోమం చూసి కనీసం ఒక్క అడుగు వెనక్కి వేసుంటాడు.దేశం మొత్తం సంఘటితంగా నిలబడింది, బ్లాగులు, మొబైళ్ళు చివరికి పిచ్చా పాటి కబుర్లు కూడా నిరశన వార్తలు మోశాయి..మీడియాకు, రాజకీయాలకు కొత్త టాపిక్ దొరికింది. పాపం పోతూ పోతూ న్యూస్ చానళ్ళకు టీఆర్పీలు ఇచ్చి వెళ్ళారు కార్కర్, ఉన్నికృష్ణన్. పాకిస్తాన్ ఒక రకంగా అంతర్జాతీయ రాజకీయాలలో ఇరుకున పడేట్టుంది..

కానీ

ఎక్కడో వొకచోట ఆక్రోశం ప్రతిహింసకు పునాదులు తొవ్వేవుంటుంది.. అది ఏ దుర్వార్తలు మోసుకొస్తుందో చూడాలి..!!

8 వ్యాఖ్య(లు):

durgeswara చెప్పారు...

mana charmaalu moddubaari vunnaayi.chevulu kallu manasu annee paraadheenamai aatmagouravam nivurugappivunnadi.adi melkonnadaakaa imte

krishna rao jallipalli చెప్పారు...

అవును. మొన్నామధ్య కార్గిల్ యుద్దమప్పుడు .. నా కొడుకులు శవాల పెట్టెల మీద కూడా కమిషన్ కొట్టేసారు. తీవ్రవాదులతో పాటు .. ఇటువంటి నా కొడుకులని ముందు ఏరి వేయాలి.

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

అవును జవాబులు లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి.

Anil Dasari చెప్పారు...

బాగా రాశారు. మరోటి కూడా ఉంది. ఎంతో ఊదరగొట్టిన ఎన్.ఎస్.జి. కమాండోలకున్న అరకొర సదుపాయాల గురించి మాట్లాడేవారేరీ? బొంబాయిలో ఘాతుకం జరిగిన రెండు గంటల్లోపే బ్లాక్ క్యాట్స్‌ని దించుతున్నామని ఇంటిమంత్రిగారు టీవీల్లో ఘనంగా ప్రకటించారు. వాళ్లు బొంబాయిలో దిగటానికేమో పదకొండు గంటలు పట్టింది. కారణం? This best trained commando force in India doesn't even have its own chopper! కనీసం మిలిటరీ విమానాలూ దయచెయ్యలేదు వీళ్లకి. మామూలు కమర్షియల్ లైనర్లు పట్టుకుని వాళ్లొచ్చి బొంబాయిలో వాలేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. పైగా, మన ఘనత వహించిన ఇంటి మంత్రిగారా సంగతి తొమ్మిది గంటల ముందే గొప్పగా టీవీల్లో చెప్పేసేసరికి తీవ్రవాదులకి కమాండోలని ఎదుర్కోటానికి కావల్సినంత సమయం దొరికింది!

మనం డబ్బా కొట్టుకుంటున్న ఎలైట్ కమాండో ఫోర్స్‌కే ఇంత ఘోరమైన సదుపాయాలుంటే, పోలీసుల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్ల గురించి మాట్లాడుకోవటమూ దండగే.

శ్రుతి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రుతి చెప్పారు...

రాజకీయ నాయకులని అనిఎంలాభం చెప్పండి. ఎవరెలా పొతే మాకెం, వొటేసామా నోటు తేసుకున్నామా అనుకునే ఓటర్లకుండాలి. ఈ నాయకులను రీకాల్ చేయలేని మన యువతకుండాలి బుద్ది.

సీతారామ శాస్త్రి గారు చెప్పినట్లు, మనం గొర్రెలం.

ఎవరేది చెప్తే అదే నిజమనుకొనే తలలేని జనం.

ఇవి జవాబు లేని ప్రశ్నలు కాదు, ప్రతి ఒక్కరు జవాబు ఇవ్వాల్సిన ప్రశ్నలు.

మీ ప్రశ్నలు కొందరినైనా ఆలొచింప చేస్తయని, మర్పు తెస్తాయని, తేవాలని ఆశిస్తున్నాను.


శ్రుతి
http://manaanubhoothulu.blogspot.com/

తెలుగుకళ చెప్పారు...

మనుషులన్న మాట మరచి కనీస బాధ్యత లేకుండా కాకమ్మ కబుర్లతో కాలక్షేపం చేసే పనికిమాలినవాళ్ళని కూడా పనిలో పనిగా కాల్చిపడేయాల్సింది.

సమస్య ఏర్పడితే గానీ ఎవరికి ఏయే ప్రాథమిక వస్తువుల అవసరం ఉంటుందో తెలియని అసమర్థుల్ని కీలక నిర్ణయాలు తీసుకొనే స్థాయిలో నియమించడం ఎంతవరకు సబబు?

మిలిటరీలు మనకి రక్షణ ఇవ్వల్సిన వాళ్ళు. వాళ్ళ రక్షణ విషయంలో కూడా కక్కుర్తి పడ్డ దరిద్రుల్ని వదిలిపెట్టకూడదు.

ప్రశించేవాళ్ళు లేరన్న ధీమా ఎంతకయినా తెగిస్తుంది.

అన్ని కాలాల్లోనూ అందరినీ మోసం చెయ్యటం వీలుకాదన్న విషయం వాళ్ళు గుర్తుంచుకోవాలి.

మాకు తెలియని కొత్త విషయాలు తెలిపారు.

ధన్యవాదాలు.

Unknown చెప్పారు...

http://in.news.yahoo.com/48/20081201/804/tnl-cop-surfs-net-for-bulletproof-jacket.html