హౌసీ (లేదా బింగో) గురించి చాలమందికి తెలిసే వుంటుంది. అడ్డంగా అయిదు నిలువుగా మూడు గళ్ళ పెట్టెల్లో ఒకటి నుంచి తొంభై తొమ్మిది దాకా అంకెలు వుంటాయి. ఏ రెండు కార్డులు ఒకటిగా వుండవు. నిర్వాహకులు ఒక్కొక్క అంకె లాటరీ తీసినట్టు తీసి ఆ అంకె గట్టిగా చెప్తారు. ఆ అంకె వున్న వాళ్ళు కార్డులో ఆ అంకె చుట్టూ చుట్టు చుడ్తారు. అలా ఎవరి కార్డు ముందుగా పూర్తైతే వాళ్ళు (బింగో అని అరుస్తారు) నెగ్గినట్టు. ఇది కాక జల్దీ ఫైవ్ అని, వరుసలు వారీగా, నాలుగు మూలలనీ అనేక విధాలుగా గిలిచినవారికి ఇతోధికంగా (అమ్ముడైన కార్డులననుసరించి) బహుమతులు ఇస్తారు.
ఇదంతా మాకూ తెలుసులేవోయ్ అంటున్నారా..? సరే అసలు విషయానికి వస్తున్నా -
అసలు ఇలా కార్డులలో అంకెలే ఎందుకుండాలి అని ఒకసారి మా మిత్ర బృందానికి అనుమానం వచ్చింది. కొంచెం ఆలోచించి చిన్న మార్పుతో మూజికల్ హౌసీ తయారు చేశాం. అదెలాగంటే - ప్రతి కార్డు పైనా అంకెతో బాటు ఏదైనా (సినిమా) పాట మొదటి పంక్తి వుంటుంది. వుదాహరణకి (18. జాణవులే నెరజాణవులే: ఆదిత్య 369) ఇలాగన్నమాట. యధావిధిగా అంకెలు తీయగానే ఆ అంకె వరుసలో వున్న పాట వినిపించడం జరుగుతుంది. ఆ పాట వున్నవాళ్ళు కార్డులో దాని చుట్టూ చుట్టు చుడతారు. మిగితా పద్ధతి మామూలే.
దీని వల్ల రెండు వుపయోగాలు:
1. ఎప్పుడూ అదే అంకెల గోల లేకుండా వెరైటీగా వుండటం. పాటలు వింటూ ఆడే అవకాశం.
2. గెలిచినవారు ఆ పాటకు డాన్సు వేసుకుంటూ రావాలని చెప్పటంతో అదో మజా..!
అయితే ఇబ్బందులు లేకపోలేదు
1. 99 పాటలు సేకరించడం. అన్నీ క్యాసెట్లలోనే.. పెట్టగానే ప్రతి పాట మొదలు వచ్చేట్టు సిద్ధం చేసి వుంచడం. (ఇది పదిహేనేళ్ళ క్రిందటి మాట. అప్పటికింకా కంప్యూటర్ తాకలేదు మేము)
2. అన్ని కార్డులు చేత్తో (రాత్రంతా) వ్రాస్తూ కష్టపడటం
3. సామాన్యంగా ఒక్కరే వుండే నిర్వాహకుడి బదులు నెంబర్లు తీసే వాడొకడు, పాటలు వెతికే వాళ్ళు ఇద్దరు, పాటలు పెట్టేవాడొకడు ఇలా నిర్వాహక బృందం ఏర్పాటైంది.
4. పాటలు పెట్టడం వల్ల (మొదటి లైన్లే ప్లే చేశామనుకోండి.. అయినా) సమయం ఎక్కువసేపు పట్టింది.
ఇబ్బందులు వుంటే మాత్రం వదులుతామేమిటి.. మూడు రోజుల శ్రమ తరువాత మా కాలేజి పూర్వ విద్యార్ధుల మీటింగులో నిర్వహించి పలువురి అభినందనలు అందుకున్నాం.
నాలుగేళ్ళ క్రితం మళ్ళీ ఈ ఆలోచన వచ్చింది. గుజరాత్‌లో ఒక తెలుగు సంఘం ఉగాది సంబరాల్లో చెయ్యాలని నేను మరో మిత్రుడు ఆలోచన చేశాం. అప్పటికి కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి పాటలకి క్యాసెట్ల గొడవేలేదు. కంప్యూటర్ పెట్టి ప్రతి పాటని దాని సంబంధిత నెంబరుతో సేవ్ చేస్తే, నెంబరు చెప్పగానే ఆ నెంబరు పాటని నొక్కడమే. లేదూ.. అన్ని పాటలని ప్లేయర్లో పెట్టి రాన్‌డం(random) ప్లే నొక్కామా అన్నీ అదే చూసుకుంటుంది అనుకున్నాం. అయితే కార్డులు తయారు చెయ్యటం ఎలా? అప్పుటికి మా చదువులు తారా స్థాయిలో వున్నాయి. ఏప్రియల్‌లో పరీక్షలు..!! ఇక లాభం లేదనుకోని ఆ ప్రయత్నం విరమించి సినిమా పాటల్తో (ఆడియో విజువల్) సినిమా క్విజ్ నిర్వహించి వూరుకున్నాం.
ఆ ఆలోచన మాత్రం నా బుర్రలో తిరుగుతూనే వుంది. ఇన్నాల్టికి దానికీ సమాధానం కనిపెట్టాను. మనం కార్డులలో వుండాల్సిన పదాలు/పాటలు ఏవైనా లిస్టు వ్రాసిస్తే కార్డులు తయారు చేసే సైట్లు వెలిశాయి. ఇదుగో వాటిల్లో నాకు నచ్చినదొకటి ఈ లింకులో.
http://www.saksena.net/partygames/bingo/
ఇంకనే.. అవకాశం రాగానే త్వరలోనే ఇలాంటిదొకటి నిర్వహించాలి...!! అనుకున్నా..
అంతటితో ఆగుతానా... అంతలోనే మరో ఆలోచన. అసలు అంకెలైనా, పాటలైనా ఎందుకుండాలి. అది ఎవరో లాటరీ తీసి చెప్తేనే మనం గెలిచినట్టా? ఇలాగని ఆలోచిస్తూ గూగలమ్మని అడిగితే బిజినెస్ బింగో అనే కొత్త విషయం తెలిసింది. అదీ ఇలాంటి ఆటే. కాకపోతే కార్డు మీద రకరకాల బిజినెస్ పదాలు (జార్గాన్స్) వ్రాసుకోని కార్పొరేట్ మీటింగులలో కూర్చోవాలిట. మీటింగులో చెప్పే విషయాలలో మన కార్డులో వున్న పదమేదైనా వుంటే మనం చుట్టు చుట్టాలి. అలా అన్నీ అయిపోగానే మీటింగ్ మధ్యలో లేచి బింగో అని అరవాలిట. బాగుంది కదూ..!!
దానికి మరో రూపాంతరం ఆలోచించాను: అన్నీ సినిమా హీరోల పేర్లతో కార్డులు తయారు చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకి తలా వొకటి ఇచ్చి టీవీ చానళ్ళు మారుస్తూ ఎవరి కార్డులో వున్న హీరో కనపడితే చుట్టు చుట్టమనండి. చాలా సింపుల్‌గా చేసుకో దగ్గ "హౌసీ" కదూ ఇది.
ఇప్పుడు బ్లాగర్లకు హౌసీ ఆట. ఈ క్రింది బ్లాగుల పేర్లను కాపీ చేసి బింగో కార్డులు తయారు చేసే సైటులో పెట్టండి. కార్డు తయారు చేసుకోండి. ఆ కార్డును ముందు పెట్టుకొని కూడలి తెరవండి. ఎవరి బ్లాగు పోస్టు వస్తే ఆ బ్లాగు పేరు చూట్టూ చూట్టూ చుట్టండి.
(సాహితి, తెలుగురత్న, శ్రీపదములు, సాహితీయానం, రౌడీరాజ్యం, న ప్రపంచం, పలకబలపం, విశ్వామిత్ర, ఉత్సాహంగా ఉల్లాసంగా, లీలామోహనం, రాతలు-కోతలు, మూడు బీర్ల తరువాత, జీడిపప్పు, నవతరంగం, చదువరి, సందేశం, సత్యశోధన, తెలుగు తులిక, కలగూరగంప, హాస్యదర్బార్, జ్యోతి, సౌమ్య, దార్ల, నాగన్న, పొగ్మంచు, నా మదిలో, లేవండి మేల్కొనండి, హరిసేవ, నరసిమ్హ, నా ప్రపంచం, జనశక్తి, సరిగమలు, జీవితంలో కొత్తకోణం, కాలాస్త్రి, నాన్న, నైమిశారణ్యం, రచన, రాతలు కోతలు, నా స్వగతం, అలలపై కలలతీగ, అర్జునుడి బాణాలు, సాహితీ ఝరి, ఆయుష్మాన్‌భవ, దిల్ సే, నువ్వుసెట్టి బ్రదర్స్, మరువం, గోదావరి, వరూధిని)
ఇలా బ్లాగుల పేర్లు పెడితే తయారైన కార్డులు చూడండి:
ఇంకనేం.. కార్డులు తయారుచేసుకొని కూడలి చూస్తూ వుండండి..!! అన్ని గడులూ చుట్టాక తెలుసుగా - బింగో అని క్రింద వ్యాఖ్య వ్రాయాలి..!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 వ్యాఖ్య(లు):
కామెంట్‌ను పోస్ట్ చేయండి