"అద్దిరి.. అనుకున్నట్టే అయ్యింది కదరా.. గురవయ్యగాడి ఎన్నిమాట్లు చెప్పానంటావ్.. వద్దురా ఎదవా, బసిరెడ్డికిగాని కోపం వచ్చిందంటే చెండాలెక్కన తీస్తాడు.. వూరుకోరా నాయాలా అని.. ఇన్నాడా." అన్నాడు సూరయ్య బీడి వెలిగించి.
"అది సరే మామా.. ఇప్పుడు వీడి గతేందని?" అడిగాడు గోపాలం మరో బీడీ అందుకుంటూ.
"ఏందంటావేందిరా ఎదవా? పిలిచినోడు వూరకే వదిలేత్తాడా? చమ్డకోల తీసుకోని తాటరేగ కొడతాడు. వీడి పెళ్ళాం పుస్తెలు గట్టివైతే బతికొస్తాడు లేకపోతే సాములోరి మటం అవతల వాగులో తేల్తాడు. ఖర్మ కాకపోతే ఈడికెందుకు చెప్పు" అంటూ తుప్పుక్కున వూసాడు. పోలిగాడు కొట్లో నించి బయటకివచ్చి సూరయ్య ముందు కూర్చొన్నాడు.
"ఏందయ్యా.. సంపేత్తాడంటావా ఆణ్ణి" అడిగాడు.
"సంపినా సంపుతార్రా. వూరికి పెద్దోడంటే పడగెత్తిన నాగుపాము లాంటోడు.దణ్ణం బెట్టి తొలిగావా నాగదేవతలాగా కాస్తాడు. కాదని తోక తొక్కావా కాటేసి కాటికి పంపుతాడు. మునుపు ఇట్టాగే గురవయ్యగాడి అయ్య సాంబయ్య, ఇదే సర్పంచి వాళ్ళ అయ్య సేసేది అన్నాయమని లేచాడు. ఏటైంది? నాలుగు రోజుల తరువాత రైల్టేషన్ కాడ పాడుబడ్డ క్వాటర్స్ కాడ చెట్టుకు ఏలాడతా కనిపించాడు"
"ఆడి పెళ్ళనికేదో రంకుందని కద వాడు సస్తా?" అన్నాడు పోలిగాడు.
"నోరుముయ్యరా. బంగారంలాంటి ఆడకూతురు గురించి తప్పుడు కూతలు కూస్తే కడుపుకి అన్నం పుట్టకుండా పోతారు.. ఆడు ఆత్మహత్య చేసుకోలేదురా సంపేశారు" సూరయ్య కోపంగా అన్నాడు. ఆ విషయాన్ని అప్పటికే సూరన్న చాలా చోట్ల చెప్పినా పోలిగాడికి విషయం తెలియకపోవడమేమిటా అని అతనికి చిరాగ్గావుంది.
"అంటే" అడిగాడు పోలిగాడు. గోపాలం అందుకున్నాడు -"అంటే ఏందసే.. ఆ దొరగారే..అదే ఇప్పుడు సర్పంచి బసిరెడ్డిగారు లేరూ ఆళ్ళ నాయన వెంకటి రెడ్డిగోరు, ఆయనే దగ్గరుండి ఆడికి వురిబిగించి చెట్టు ఏలాడేశారని అప్పుడు వూరంతా అనుకున్నార్లే" అన్నాడు. విషయం గురవయ్యని వదిలి ఎప్పుడో జరిగిన సాంబయ్య కథలోకి వెళ్ళడం నచ్చలేదేమో, గోపాలం మళ్ళీ వెనక్కి లాక్కొచ్చాడు -
"అయితే సూరయ్య మామా ఆ అయ్యకి పట్టిన గతేనా కొడుకుక్కూడా?"
"వొరేయ్ నీకో సంగతి చెప్తా ఇను. ఇప్పుడు ఈ పోలిగాడే వున్నాడు. పొరుగూరునించి వచ్చి ఇక్కడ టీకొట్టు పెట్టాడు. బజ్జీలని, పుణుకులనీ, నిమ్మపులిహోరని అమ్మడం మొదలుపెట్టాడు. అట్టాంటప్పుడు మన కుంటి సెట్టివూరుకున్నాడా?" అడిగాడు
"ఏడూరుకున్నాడు సూరయ్యమామా..!! బండిపెట్టినకాడి నుంచి ఎన్నిసార్లు రేత్రిళ్ళు రాళ్ళేయించాడు.. మోసం చేత్తన్నానని, చద్ది సరుకు అమ్ముతున్నానని పెచారం సేసాడు.. ఒక పాలి రేత్రేళ నా బండి తగలబెట్టించాడు.. ఆ తరువాత మీలాంటోళ్ళు నాలుగు డబ్బులిస్తే కదా ఈ కొట్టు పెట్టుకున్నాను" ఏకరువు పెట్టుకున్నాడు పోలిగాడు.
"అదే సెప్తండా.. కుంటి సెట్టి ఇదంతా ఎందుకు సేయించాడంటావ్?" మళ్ళీ అడిగాడు సూరయ్య.
"ఎందుకేంది మావా.. ఈ పోలిగాడు రాక మునుపు కుంటిసెట్టిగాడు ఇంటో కజ్జికాయలు, నువ్వుండలు, మణూబూలు చేసుకోని వూరెంట పొలం గట్లెంటా తిరిగి అమ్ముకునేవోడు. ఇప్పుడు పోలిగాడు రావటంతో ఆడి యాపారం దెబ్బైపోయింది. ఆడి చేతిలో వున్నది ఈడులాక్కుంటాంటే ఎవ్వడైనా అట్టాగేసేత్తాడు కదా? దానికి ఇప్పుడు గురవయ్యగాడికి ఏందంట కనెచ్చను?"అడిగాడు గోపాలం.
"అదే కనెచ్చను. సర్పంచిగారి దగ్గర అధికారం చెలాయించే కర్ర వుంది. మనదగ్గర ఆ కర్ర కి భయపడి దణ్ణంపెట్టే సేతులున్నాయి. అట్టా కాదని ఆయన కర్ర వూడబెరుకుంటానని అంటే ఆరు మాత్రం వూరుకుంటారా? మన గురవయ్యగాడేందిరా అంటే మొన్నా మొన్ననే వాళ్ళ నాన్న కథ తెలిసొచ్చింది. కసి తీర్చుకోడానికి ఆ ఎంకటిరెడ్డి లేడు. ఆయన కొడుకు మీన తిరగబడ్డాడు. అందినకాడల్లా మీటింగులు పెట్టి సర్పంచిగారు ఇట్టాసేత్తన్నాడు అట్టాసేత్తున్నాడు అనీ నానా యాగీ జేత్తన్నాడు. ఆయన మింగిన డబ్బుల లెక్కలు గట్టి అందరికీ సెప్తా వున్నాడు.
ఎవరైనాగాని ఎందుకూరుకుంటార్రా?" అంటూ ఆవలించాడు "సాయంత్రానికి గురవయ్యగాడు వంటినిండా దెబ్బల్తో అయినా సరే - వచ్చాడా ఆడి పెళ్ళాం అదృష్టం లేకపోతేదాని తాడు తెగినట్టే" అంటూ ఇంటికి పోయాడు.
పోలిగాడు, గోపాలం సర్పంచిగారి బంగళాలో ఏమి జరుగుతోందో వూహించుకొని ఒకళ్ళనొకళ్ళు చూసుకోని గుటకలు మింగారు.
***
"సూరయ్య మామా.. సూరయ్య మామా.. లెగు.. తొందరగా" లేపాడు గోపాలం. పోలిగాడి కొట్టునించి వచ్చి ఇంటిదగ్గర అన్నం తిని బయట రావిచెట్టు కిందపడుకోని వున్నాడు. ఒక గొంటైనా పడుకున్నాడో లేదో గోపాలం వచ్చి లేపాడు.
"ఏందిరా అల్లుడూ నిద్రపోతుంటే అంత కొంపలంటుకుపోయే సంగతి" అన్నాడు సూరయ్య నిద్ర మత్తుగా.
"అట్టాటిదే మామా.. ఆ గురవయ్యగాడు లేడు... గురవయ్యగాడు.." గోపాలం చెప్పేంతలో సూరయ్య నిద్ర మత్తు ఎగిరిపోయింది.
"చంపేసారేందిరా?" అన్నాడు నులకమంచం మీద కూర్చుంటూ.
"లేదు మామా.. ఆడు వచ్చి మన పోలిగాడి టీకొట్టు ముందు కూర్చోని వున్నాడు"
"కాళ్ళు సేతులు బాగానే వున్నాయట్రా?"
"ఆహా.. బెమ్మాణంగ వున్నాడు. ఒంటిమీద దెబ్బకాదు కదా ఆడు ఏసుకున్న సొక్కా కూడా నలగలేదు."
"ఇదెట్టా? ఏందిరా పులి గుహలోకి పొయ్యి మేకపిల్ల అట్నే బయటికొచ్చిందా? పద ఆ కతేందో సూద్దాం" అంటూ సూరయ్య తోలుచెప్పులు తొడుక్కోని వడివడిగా అడుగులేస్తూ కొట్టు దగ్గరకి వచ్చాడు.
గురవయ్య అక్కడ బల్ల మీద కూర్చోని టీ తాగుతున్నాడు. పోలిగాడు కొట్లొనించి సూరయ్యని, గురవయ్యని మార్చి మార్చి చూసి చిన్నగా నవ్వాడు.సూరన్నకి ఆ నవ్వు చూసి, వెక్కిరింపని అర్థం అయ్యింది, అయినా అదేం పట్టించుకోలేదు. నేరుగా గురవయ్య పక్కన కూర్చొని వొళ్ళంతా తడిమాడు.
"ఏరా సర్పంచిగారింటికి ఎళ్ళిన మాట నిజమేనా?" అడిగాడు అనుమానంగా.
"ఎళ్ళిన మాట నిజమే.. వచ్చిన మాట నిజమే" అన్నాడు గురవయ్య నవ్వుతూ.
"ఏందిరా.. రేపెప్పుడో శవంగా కనిపిస్తావని అంతా అనుకుంటుంటే దర్జాగావచ్చావు? ఆరు నిన్నేమి అనలేదా? కొరడాలతో కొట్టలేదా? చంపుతానని బెదిరించలేదా?"
"ఏంది సూరయ్యమామా? ఆయన ఎందుకంటాడు. పల్లెత్తు మాట కూడా అనలేదు. పైపెచ్చు కడుపునిండా అన్నం పెట్టి పంపించాడు" అన్నాడు గురవయ్య.
"అన్నం పెట్టాడా? ఇషం పెట్టాడా?" గోపాలం మనసులో అనుకోవాలనుకుంటూ బయటికి అనేశాడు.
"నోర్ముయ్యరా.. తప్పుడు కూతలు కుయ్యబాకు. మనం అనుకున్నట్టు ఆయనసెడ్డోడు కాదురా.. సానా మంచోడు" గురవయ్య చెప్పాడు. పోలిగాడు, గోపాలం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
సూరయ్య కొంచెం దగ్గరకు జరిగాడు. "వురేయ్.. గురవయ్య.. అసలేం జరిగిందిరా?" అన్నాడు.
"ఏముంది మామా.. ఆయన పాలేరుతో పిలిపిస్తే ఎళ్ళానా? మీరనుకున్నట్లే నన్ను కొడతాడో సంపుతాడో అని భయపడతానే వున్నా. తీరా ఎళ్ళాక సూత్తే ఏముంది? బాగా మాట్లాడాడు. "వురేయ్ మీ అయ్యని సంపింది మా నాయన కాదురా/ అప్పుడు మా అయ్య అసలు వూర్లోనే లేడు. నా మీద, మా అయ్య మీద కక్షగట్టినోళ్ళు నీకు లేని పోనివి ఎక్కేశారు" అని నచ్చజెప్పాడు. ఆయన గురించి నేను వూళ్ళో సేత్తున ప్రచారం గురించి అడిగాడు. అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పాడు. నిజంగానే ఆయన ఎలాంటి తప్పు సెయ్యలేదు. మునుపు ప్రసిడెంటుగా వున్నాడే నాయుడుగారు.. ఆయన సేసిన తప్పులంట ఇయన్నీ. ఆయన సేసిన మంచి పనుల గురించి సెప్పాడు. ఆయన సానా గొప్పోడు మామా" అన్నాడు గురవయ్య టీ తాగిన గ్లాసు తిరిగిస్తూ.
"ఇంకా ఎమన్నాడ్రా మీ మంచి సర్పంచి?" అడిగాడు సూరయ్య కొంచెం పెళుసుగా.
"సర్పంచేమిటి సర్పంచి..! ఆయనకున్న ఆస్థి, పరపతి ముందు సర్పంచి పదవొక లెక్కా? ఆ పదవి ఆయన వదిలేస్తున్నాడు. అంతేకాదు ఈసారి నన్నే నిలబడమని చెప్పాడు. ఈ సారి రిజర్వేషన్లో మా కులానికే వచ్చిందంట సీటు" చెప్పి లేచాడు గురవయ్య. అతను పదడుగులు వేసాడో లేదో గోపాలం అన్నాడు -
"ఏంది మామా కథ ఇట్టా అడ్డం తిరిగింది? పెద్దపులి వున్నట్టుండి ఆవు ఐపోయిందా?"
"ఎక్కడైందిరా.. పెద్దపులి పెద్దపులే"
"ఏంది మామా.. వాణ్ణేదో కొట్టేస్తాడు, సంపేస్తాడు అన్నావు."
"ఎందుకు కొట్టలేదురా..!! మీరన్నట్టు గురవయ్యని కొట్టలేదు.. ఇద్దరూ కలిసి గురవయ్యని నమ్ముకున్నోళ్ళనందరి కొట్టారు..!! తేలు కొండె ఎత్తుకొని తిరుగుతుంటే పైనించి ఎవ్వరూ పట్టలేరు. అదే అడుగున చెయ్యెయ్యగలిగితే తేలు నీ దగ్గరే వుంటుంది. కొండె అవతలోడి మీదకు విసురుతుంది. ఈ సంగతి బాగా తెలిసినోడు మీ మంచి సర్పంచి.." అన్నాడు సూరయ్య బీడీ వెలిగించి.
0 వ్యాఖ్య(లు):
కామెంట్‌ను పోస్ట్ చేయండి