మొన్నా మధ్య బిగ్ బజార్ కి వెళ్ళాను. ఎండాకాలం సందర్భంగా గొప్ప "కార్నివాల్" జరుగుతోందట. ఎటు చూసినా డిస్కౌంట్లే డిస్కౌంట్లు. ఆ డిస్కౌంట్లు కోసం ఎగబడుతున్న జనం. ఏమిటీ విధి లీలావిలాసం. ఈ బిగ్ బజార్ అనే సంస్థ గోప్ఫ ధార్మిక సంస్థ కాదే.. ప్రజలకు చౌక ధరకే సరుకులు అందుబాటులోకి తెచ్చే ప్రభుత్వ సంస్థ కాదే - ఇది లాభాలనే మూల మంత్రాధారమైన పెట్టుబడిదారీ సంస్థ కదా? మరి అట్లాంటి సంస్థలో లాభాలు మర్చిపోయి "మన" కోసం అత్యంత తక్కువ ధరకే అన్ని సరుకులు ఇస్తున్నారంటే ఎలా నమ్మేది? మరి వచ్చిన జనమంతా ఎందుకు నమ్మినట్లు?
ఒక్క బిగ్ బజార్ అనే కాదు, ఏ చందనా, బొమ్మనా, అమ్మనా బ్రదర్స్ ముందు నిలబడినా ఇలాంటి డిస్కౌంట్లు కనిపిస్తూనే వుంటాయి. "ఇంత వరకూ కనీ వినీ ఎరుగని డిస్కౌంట్లు. నేడే ఆఖరు" అన్న పర్మెనెంట్ బోర్డు రోజు కనిపిస్తూనే వుంటుంది. అంతెందుకు చిన్నా చితకా బట్టల షాపు ముందు నిలబడినా అక్కడ అమ్మే నైటీలు, పైజామాల పైన ఒక చిన్న బోర్డు వుంటుంది. దానిమీద "Rs 150" అని వ్రాసి కొట్టేసి "Rs 100 ఓన్లీ" అని వ్రాసి వుంటుంది. అదేదో సినిమా టైటిల్లో సెన్సారు వారు వద్దన్న పదాలు కొట్టేసి పోస్టర్లో వేసినట్లు వుంటుంది.
డిస్కౌంట్లలో మరో పోకడ 50% + 50% డిస్కౌంట్ అని పెట్టడం. ఏభై ఏభై కలిపితే 100% డిస్కౌంట్ ఇస్తాడా అని లెక్కలు రాని ఓ రావుగారు సందేహించారు. నిజానికి వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ ఎంతో లెక్కగట్టమని పిల్లలకి లెక్కలు నేర్పుస్తున్నాడొక సంసారి. మరో చోట ఇలాంటి లెక్కల తికమకతో మరో డిస్కౌంట్ స్కీం- ఒకటి కొనండి పన్నెండు వుచితంగా పొందండి అంటూ. అంటే ఎంత శాతం తగ్గింపు ఇచ్చాడో అని లెక్కల పేపర్లో ఒక మూడు మార్కుల ప్రశ్న వేసుకోవచ్చు.
కొన్ని సంస్థలవాళ్ళు మరీ తెలివిమీరి ఇప్పుడే కొనండి రేపు రేటు పెరుగుతుంది అంటూ భయపెట్టెస్తుంటరు. మన "శ్రీ కృష్ణ తులాభారం"లో కూడా నారదుడు శ్రీ కృష్ణుణ్ణి అమ్మాకానికి పెట్టినప్పుడు - "భలే మంచి చౌక బేరము. ఇది సమయము మించినన్ దొరుకదు. త్వరన్ గొనుడు సుజనులారా" అంటూ తొందర పెట్టేశాడు. అప్పటి కంజ్యూమర్స్ కృష్ణుణ్ణి కొన్నా ఆయన పాలు పెరుగు వెన్న వంటివాటికి, అయనతో పాటు వచ్చే పన్నెండువేల ఎనిమిది మంది మైంటైనెన్స్ ఖర్చుకి తమ ఆస్థులు కరిగిపోతాయని కొనలేదనుకోండి. అదివేరే విషయం. మరో చిత్రమేమిటంటే డిస్కౌంట్లు ప్రకటించని చోట మనమే చొరవ తీసుకోని "పోనీ ఇంతకిస్తావా?" అంటూ బేరం పెట్టేస్తాం. లేదంటే "కొసరు" అడగడం మన సాంప్రదాయంలోనే వుంది - "అసలు కన్నా కొసరు" ముద్దని - "కొసరి కొసరి వడ్డించడమనీ" సామెతలే పెట్టుకున్నాం.
ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే మనకి డిస్కౌంట్ కనపడిందంటే వంటి మీద గుడ్డ వున్నది లేనిది కూడా గుర్తుండదు. లగెత్తుకెళ్ళి అవసరం వున్నా లేకపోయినా కొనేసుకుంటాం. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు దానిని చక్కగా వుపయోగించుకుంటున్నారు. బిహేవియరల్ ఎకనామిక్స్ (Behavioural Economics) లో "లాస్ ఎవర్షన్ (Loss Aversion)" అని ఒక సబ్జెక్ట్ వుంది. ఆ సిద్ధాంతం ప్రకారం ఒక మనిషి రూ.100 సంపాదిస్తే కలిగి ఆనందం కన్నా రూ. 100 కోల్పోతే కలిగే బాధ రెండు రెట్లు ఎక్కువగా వుంటుంది. వచ్చింది, పోయింది ఒకటే అయినా బాధ సంతోషాలు సమానంగా వుండవని చెప్తుందీ సిద్ధాంతం. అందుకే మనం రూపాయి డిస్కౌంట్ అనగానే తొమ్మిది రూపాయలైనా సంతోషంగా ఖర్చుపెట్టేస్తాం. పైగా "లిమిటెడ్ పిరియడ్ ఆఫర్" అని చెప్పగానే ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే నష్టం తప్పించడానికి ఇప్పుడు ఖర్చు పెంచేసుకుంటాం.
"ఈ మిక్సీ బాగుంది - ఎంతకి కొన్నారేమిటి పిన్నిగారు?" అంటూ ఇరుగుపొరుగు అడిగేది ఈ "లాస్ ఎవర్షన్" కోసమే. పైగా - "ఓహో అంత పెట్టి కొన్నారా? మా వేలువిడిచిన చిన్న మామగారి పెద్దల్లుడు డిల్లీ నుంచి ఇలాంటిదే సగం రేటుకే తెచ్చాడమ్మా" అంటూ సన్నాయి నొక్కులు నొక్కేది అందుకే. మీరు నష్టపోయారు అని చెప్పడం ద్వారా - "పోస్ట్ పర్చేజ్ డిసోనెన్స్" కల్పించడానికి.
మరో చిత్రమేమిటంటే, ఇదే లాస్ అవర్షన్ కారణంగా మనం ఒక సారి కొన్న వస్తువు తక్కువ ధరకే దొరుకుతుంది అని తెలియగానే - "పోనిస్తురూ అది తక్కువ రకం అయ్యుంటుంది" అంటూ తిప్పికొడతాం. ఏదైనా ఒక పనిమీద కొంత డబ్బు, శ్రమ, సమయం వెచ్చించాక ఆ పని నష్టం వస్తుందని తెలిసినా ఆపం. "ఎట్లాగు ఇంత దాకా వచ్చాం.. పోనీ పూర్తి అయ్యేదాకా కానిద్దాం" అంటాం. ముఖ్యంగా ఈ మధ్య తెలుగు సినిమా హాలులో ఇలాంటి మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి.
అలా మధ్యలో వదిలేస్తే డబ్బు, శ్రమ నష్టపోవటమే కాక మనం తప్పు చేశాం అని ఒప్పుకున్నట్లైతుంది. అది చెయ్యడానికి మనకి మనసొప్పదు. అందుకే మనం తప్పుగా ఎన్నుకున్న నాయకుణ్ణి మధ్యలో దింపాలని కూడా ఆలోచించం.. మన సంగతి ఏలా ఒక సారి మొదలు పెట్టిన యుద్ధాల్ని, తీవ్రవాదాన్ని ఆపలేక అల్లాడుతున్న దేశాలు మనకి తెలియదూ..?? అవును మరి దేశమంటే మట్టి కాదు, మనుషులే కదా - ఆ మనుషుల్లో వున్న సిద్ధాంతాలు, సైకాలజీలు అన్నీ కలిపి సగటు చేస్తేనే కదా దేశం సిద్ధాంతం, సైకాలజీ తయారయ్యేది..!!
సర్వే జనా సుఖినోభవంతు..!!