మోసే వారెవరురా..!!



మోసెయ్యడమంటే రక రకాల అర్థాలు వాడకంలో వున్నాయి. గుర్రం గాడిద లాంటి కొన్ని జంతువులు మొయ్యడానికే పుట్టాయని కొందరి అభిమతం.. కాదు అది రెటమతం అని బ్లూక్రాస్ వాదన. ఏమైనా మన దేవతలనందరినీ మొయ్యడానికి రక రకాల జంతువులను ఏర్పాటు చెయ్యడం జరిగింది. పూర్వం రాజుల హయాంలో పల్లకీ మోసే బోయీలు వున్నారని మనకి తెలుసు. "అందరూ ఎక్కేవాళ్ళే అయితే మోసే వాళ్ళు ఎవరు" అని ఒక సామెత కూడా మనకి వుంది. దీనర్థం ఏమిటయ్యా అంటే - ప్రతి వొక్కరూ సుఖాల్ని కోరుకోవడమే కాదు కష్టాలను కూడా అదే విధంగా అనుభవించాలని చెప్పారు కొందరు తత్వవేత్తలు. అలాకాదు అందరూ ప్రమోషన్లు కొట్టేసి పైకి పైపైకి వెళ్ళిపోతే కింద పనిచేసేదెవ్వరు అంటూ కార్పొరేట్ బాసు శెలవిచ్చి ప్రమోషన్లు ఎగ్గొడుతున్నారు. ఏది ఏమైనా అన్నమయ్యని సాక్షాత్తూ వెంకటేశ్వరుడే మోసేసినట్లు కథ చెప్పారు మన దర్శకేందృడు. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు అష్ట దిగ్గజాలను పల్లకీలో మోసారడనీ (ఒక్కసారి కాదు.. ఒక్కరినే..) అందుకు ప్రతిఫలంగా ఆ కవులంతా రాజుగారిని తెగ మోసేసారని చెప్పారు కొందరు విమర్శకేంద్రులు.



అవునండోయ్... ఈ మోసెయ్యడం ఇంకొకటి వుంది. దీన్ని పొగడ్తకి పై మెట్టుగా చెప్పవచ్చు. ప్రమోషన్ల కోసం బాసుల్ని మోసెయ్యడం, పట్టు చీరకోసం మొగుణ్ణి మోసెయ్యడం ఇలాటి వాడుక ప్రయోగాలు వున్నాయి. అయితే పదవులకోసం హైకమాండ్‌ని మోసేసే వాళ్ళు మరీ ఎక్కువగా కనిపిస్తున్నారు. మొన్నామధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లో మాయావతి చేత నోట్ల హారం భారం మోయించి తద్వారా మోసేసిన నాయకులు మనకి బాగా తెలుసు. ఇక మరో రకం మోయ్యటాని ఈ మధ్యనే ఒక నాయకుడు ప్రదర్శించాడు.. రాహుల్ గాంధి చెప్పుల్ని భరతుడిలా నెత్తిన పెట్టుకోని మోసేసేవారిలో తనని మించినవారు లేరని నిరూపించుకున్నాడు.



పదవులకోసం మోసే మోతలలో మరో రకం మోత కూడా వుంది. అది మాటల్ని మొయ్యడం. ఇక్కడి మాటలు అక్కడికి, అక్కడి మాటలు ఇక్కడికి మోసేసే మోతశిఖామణులు ప్రతి ఆఫీసుల్లోనూ మనకి కనిపిస్తారు. మోతకు తగ్గ ప్రతిఫలం కూడా వీళ్ళు తరచుగా పొందుతుంటారు.



ఇవే కాకుండా పేరు మొయ్యడాలు, కీర్తి ప్రతిష్టలు మొయ్యడాలు, బరువు బాధ్యతలు మొయ్యడాలు లాంటివి చాలా వున్నాయి. శ్రీకృష్ణుణ్ణి వసుదేవుడు మోసిన కథ, శిలువను మోసిన ఏసు కథ, తల్లిదండ్రుల్ని మోసిన శ్రవణ కుమారుడి కథ మనం చదువుకున్నాం. ఎవరెంత మోసినా చివరికి మోసేది "ఆ నలుగురే" అని తాత్విక చింతనలో పడేసాడు ఒక సినిర్మాత.



మరో రకం మొయ్యడం గురించి నేను విన్న ఓ కథ చెప్పి ముగిస్తాను -



అనగనగా ఒక గురువుగారు, వారి శిష్య బృందం అడవుల గుండా ప్రయాణిస్తూ ఒక వాగు వొడ్డుకు చేరుకున్నారట. అక్కడ ఒక అందమైన అమ్మాయి నిలబడి వుంది. వీరిని చూడగానే - "అయ్యా నాకు ఈత రాదు. దయచేసి నన్ను ఎత్తుకోని అవతలి వొడ్డుకు చేర్చగలరా" అంటూ ప్రాధేయపడిందట.


దానికి వాళ్ళు - "ససేమిరా వీల్లేదు.. మేం సన్యాసులం, బ్రహ్మచారులం.. ఆడ స్పర్శ నిషిద్ధం" అన్నారు. వెంటనే గురువుగారు ఆ అమ్మాయికి సాయం అందించి, తన వీపు పైన ఆ అమ్మాయిని మోస్తూ వాగు దాటించారు. ఆ తరువాత బృందమంతా ప్రయాణం కొనసాగించారు. దారి పొడవునా శిష్యులు ఎంతో మధనపడి, గురువును ప్రశ్నించలేక తటపటాయిస్తూ ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక అడిగారట -



"గురువుగారు.. మనవంటి బ్రహ్మచారులకు స్త్రీ స్పర్శ నిషిద్ధమని తమరే కదా శలవిచ్చారు, మరి ఆ అమ్మాయిని అలా వీపుమీద అంగాంగం తగిలేలా ఎందుకు మోసారూ?" అని. దానికి గురువుగారు నవ్వి -



"నాయనలారా ఆ అమ్మాయిని నేను వాగు దాటగానే దింపేశానే.. మీరింకా ఎందుకు మోస్తున్నారు?" అన్నాట...!


5 వ్యాఖ్య(లు):

ravichandrae చెప్పారు...

బాగుందండీ మోత బాగోతం :-)

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ.....

krishna చెప్పారు...

చాలా బాగుంది అండీ!

Ranjith చెప్పారు...

మెత్తానికి మీకు సినిమా ల మీద & పురాణాల మీదా మాంచి పట్టుందని తెలియచెసుకున్నారు ఈ టపా తొ :)

Samrat Uday Bhaskar Rao Varma చెప్పారు...

మొత్తానికి మొయ్యడం గురించి చెప్పి మా అందరి చెవుల ముందర శంఖం మోత మ్రోగించారు