వద్దంటే వినడే.. పోకిరి..!!



కొంతకాలం క్రితం వచ్చిన ఒకానొక సినిమాలో పాట ఇది. ఆ కవిగారు తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు కాని వద్దంటే వినకపోవడం మన జీవ లక్షణం. తమాషా ఏమిటంటే తర్వాతర్వాత వచ్చిన పోకిరి మహేష్ బాబు కూడా "నా మాట నేనే విన" నని ప్రకటించేసుకున్నాడు. ఎందుకు చెప్తున్నానటే ఈ మధ్య మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ పిల్లావాణ్ణి దగ్గరకి తీస్తూ ఒక చాక్లెట్ ఇచ్చాను. చనువుగా "నాక్కూడా పెడతావా?" అని అడిగితే

"పెట్టనంటే పెట్టను పోరా" అన్నాడు వాడు.

వాళ్ళ నాన్న మందలించి "తప్పు కదా అలా అనకూడదు" అన్నాడు.

"అనచ్చు. నువ్వు వొద్దన్నావు కదా ఇంక నేను అంటూనే వుంటా" అన్నాడు ఆ సుపుత్రుడు.

ఇలా వద్దు అని చెప్పగానే ఆ పని చేసెయ్యడం చిన్నతనం నించే అబ్బుతుందని నా అనుమానం. సృష్టి మొదలైన దగ్గర్నుంచి మనిషి లక్షణమే అంత అని బైబిల్ కూడా చెప్తుంది. దేవుడు ప్రపంచాన్ని అంతటినీ సృష్టించిన తరువాత ఏడం ఈవ్ అనే జంటను సృష్టించి,

"ఈడెన్ వుద్యాన వనం మొత్తం తిరగండి.. కానీ ఫలానా ఆపిల్ చెట్టు కాయలు మాత్రం ముట్టుకోవద్దు" అంటూ చెప్పాడుట.

వద్దంటే వినని లక్షణం మొదట్నించి వుండటం వల్లే సదరు ఏడం ఈవ్లు ఆ చెట్టు కాయలు కోసుకోని తిన్నారని బైబిల్ మొదటి అధ్యాయంలోనే వుంది. ఆ తరువాత అదే పరంపర కొనసాగిస్తూ మానవ కోటి మొత్తం "వద్దంటె వినం" అంటూ యధా విధి వారసత్వం నిలబెడుతున్నారు.

మన పురాణాల్లో కూడా "చండి" అనే మహా ఇల్లాలు కథ వుంది. ఆవిడ భర్తగారు ఏదంటే దానికి వ్యతిరేకంగా ప్రవర్తించేదట. "సంధ్యా వందనం చేసుకోవాలి కమండలంలో గంగ నీరు పొయ్యవే" అంటే ఆ కమండలం నిండా బురద నీరు చేర్చేదట. అలాంటి భార్యతో ఎలా వేగాలో ఆలోచించి ఒక ఆలోచన చేశాడా మునిగారు. ఏదైనా పని జరపాల్సి వచ్చినప్పుడు రివర్స్లో చెప్పేవాడు. "ఈ రోజు మా నాన్న ఆబ్దికం. బ్రాహ్మల్ని పిలిచావో నీ చెండాలు తీస్తాను" అనేవాడట. "నువ్వు వద్దంతే నేను వింటానా.. ఇప్పుడే బ్రాహ్మల్ని పిలిపిస్తానని" అన్నంత పని చేసేదట ఆ మహా ఇల్లాలు.

మన చందమామ కథల్లో కూడా యువరాజు కొత్త వూరికి వెళ్ళి పేదరాసి పెద్దమ్మ ఇంట్లో భోజనాదులు కానిచ్చి ఆ వూరి విశేషాలు అడిగి చెప్పించుకునేవాడు. పెద్దమ్మ అంతా చెప్పి "ఫలానా తూర్పు దిక్కుకు మాత్రం వెళ్ళకు నాయనా.. ప్రమాదం" అని చెప్తుందా, వెంటనే యువరాజుగారు గుర్రం ఎక్కి ఠంచనుగా తూర్పు దిక్కుకేసి వెళ్ళేవాడు. అలాగే ప్రతి జానపద కథలోనూ ఇలా చెయ్యకూడని పని ఏదో ఒకటి వుండటం, హీరో గారు తప్పకుండ ఆ పని చెయ్యడం మనం వినే వుంటాం. ఇలా వద్దంటే వినని వాళ్ళ గురించి జానపదులు "ఎడ్డెమంటె తెడ్డెమంటావ్ ఏమన్నంటే ఎగిసి తంతావు.. వేగెదెట్టా యాద్గిరి మామా" అంటూ పాట కట్టి పాడారు.

ఈ రకంగా వద్దు అంటే అది ఖచ్చితంగా చెయ్యడం మన నర నరాల్లో వుండిపోయింది. ఆ లక్షణాలన్నీ ప్రతి రోజూ, ప్రతి క్షణం మనం ప్రదర్శిస్తూ వుంటాం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూడండి - ఎర్ర లైటు వున్నప్పుడు ముందుకు వెళ్ళకూడదు అని రూల్. మనం ఎర్ర లైటు వున్నప్పుడే ముందుకెళ్తాం. కనీసం "స్టాప్" అని వ్రాసి వున్న చోటు దాటి ఒక్క టైర్ అన్నా ముందుకు పెట్టపోతే మనకి తృప్తి వుండదు. ఎడమ చేతి వైపే వెళ్ళాలి అని చెప్తే అడ్డదిడ్డంగా బండిని సర్కస్లో లాగా పల్టీలు కొట్టిస్తే కాని మన కుర్రకారుకి బండి నడిపినట్లు వుండదు. హెల్మెట్ లేకుండ ప్రయాణం చెయ్యకూడదు అన్నారని హెల్మెట్ వుంచుకోని పెట్టుకోము. నో పార్కింగ్ అని ఎక్కడ వుందో చూసి మరీ బండి పార్క్ చేస్తాం. ఇక కార్లో సీటు బెల్టు పెట్టుకోవడం మర్చిపోయి చాలాకాలం అయ్యింది. ఇక సెల్ఫోన్ మాట్లాడుతూ బండి నడపడం మనకి వెన్నతో పెట్టిన విద్య కదా?

ఫుట్ బోర్డ్ ప్రయాణం మీకు ప్రమాదకరం అని చెప్పినా అది మనకి ప్రమోదకరమనే వినిపిస్తుంది. ఇక లేడిస్ సీట్లో కూర్చోని నిద్రపొతున్నట్లు నటించే పురుష పుంగవుల సంగతి చెప్పేదేముంది. దయచేసి క్యూలో రండి అంటే వరసలో ముందు వున్న వాళ్ళ దగ్గరకి వెళ్ళి ఒక్క టికెట్ కొని పెడతారా అంటూ దేబరించడం మనకి అలవాటైపోయింది. క్యూలో వున్న మిగతావారు పురుగు చూసినట్లు చూసి తల తిప్పుకుంటారే కాని "వరసలో రమ్మని" అననే అనరు.

ఎందుకంటే రేప్పొదున వాళ్ళు అలా రావాల్సిన వాళ్ళే కదా..! ఎందుకంటే అలా వద్దన్న పని చెయ్యడం మన జన్మ హక్కు కదా..!!