Unknown
నిన్న ప్రకటించిన మాయాబజార్ క్విజ్ అంటే ఆ చిత్ర అభిమానులు విరివిగా పాల్గొంటారని అనుకున్నాను కానీ, మరీ బొత్తిగా ఇద్దరే సమాధానాలు వ్రాసారు. సరే ఏమైనా మరోసారి ప్రశ్నలు చూసి మీకేమైనా సమాధానం తెలుసేమో చూడండి.
1. తానశర్మ తందానశాస్త్రి పెట్టిన ముహూర్తం "దగ్ధయోగం"లో వుందని, బలరాముడి ఆస్థాన పురోహితులు వారిస్తారు. (తరువాత శశిరేఖాభిమన్యుల పెళ్ళి అదే ముహూర్తానికి జరుగుతుందనుకోండి అది వేరే విషయం). ఆ వారించిన పురోహితుడి పేరేమిటి?
2. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయనం చేసిన నటుడెవ్వరు?
3. తానశర్మ, తందాన శాస్త్రి విడిదిలో కొన్ని రకాల భ్రాంతులకు లోనౌతారు. అవేమిటి?
4. శకునిమామను ఈ చిత్రంలో నలుగురు వ్యక్తులు పందెం వెయ్యమని అడుగుతారు. చిత్రంగా అందరూ రెండు వెయ్యమంటారు. ఒక్కరు తప్ప. పందెం అడిగేదెవ్వరు? రెండు కాకుండా వేరే పందెం అడిగేదెవ్వరు?
5. శాకంబరీదేవి ప్రసాదం ఏమిటి?
6. సుభద్రాభిమన్యులను రథంపై ద్వారక నుంచి ఘటోత్కచుని ఆశ్రమానికి చేర్చే సారథి ఎవరు?
7. శశిరేఖ ఇష్ట సఖి పేరేమిటి?
8. అడవిలో సుభద్రాభిమన్యులను గోడకట్టి అడ్డుకునే రాక్షసుడి పేరేమిటి?
9. సుభద్రాభిమన్యులను అడవిలో ఘటోత్కచుడి రాక్షసులు ఎదుర్కునేటప్పుడు నేపధ్య సంగీతం ఏమిటి?
10. ఘటోత్కచుడి ఆశ్రమంలో దీవించడానికి వాడే పదం ఏమిటి?
జవాబులు:
1. బలరాముడి ఆస్థాన జ్యోతిష్యులు శంకుతీర్థుల వారు.
2. హాస్యనటుడు బాలకృష్ణ (అంజిగాడు) ఇందులో రెండు పాత్రలలో కనిపిస్తారు. హస్తినాపురంలో లక్ష్మణకుమారుడి సారథిగా, ద్వారకలో ఘటోత్కచుడు తొలిసారి వచ్చినప్పుడు ద్వారపాలకుడిగా లల్లాయిపాట పాడుతూ కనిపిస్తాడు.
3. వివాహభోజనంబు మాయం అయ్యి మళ్ళీ ప్రత్యక్షమైనప్పుడు "మనఃభ్రాంతి", గింబళిపైన తొమలపాకుల పళ్ళెం జరిగినప్పుడు "లోభ్రాంతి", గింబళి ఇద్దరినీ కప్పేసినప్పుడు "సమాధి భ్రాంతి". ఈ విషయాన్ని అల్లురామలింగ-తానశర్మ వివరిస్తాడు.
4. దుశ్శాసనుడు, కర్ణుడు, దుర్యోధనుడు, మాయాశశిరేఖ పందెం చెప్తారు. ముక్కామలదుర్యోధనుడు ముందు "అదే రెండు" అని చెప్పినా, "అహ కాదు కాదు ఒకటి" అంటాడు. "తడబడుతూ అడిగితే అది కూడా తడబడుతూ ఒక్కటే పడింది" అంటాడు సీయస్ఆర్‌శకుని. మాయా శశిరేఖ అడిగినప్పుడు ముందు ఒకటి పడ్డట్టు కనిపించినా మళ్ళీ రెండుగా కనపడుతుంది. "శశిరేఖ కనికట్టు నేర్చినదా లేక నా కన్నేమైనా చెదిరినదా " అంటాడు సీయస్ఆర్.శకుని.
5. "ఏమిటా.. గోంగూర.. శాంకంబరీ దేవి ప్రసాదం..ఆంధ్రశాకం అది లేకపోతే ప్రభువులు ముద్దైనా ముట్టరు తెలిసిందా?"
6. దారుకుడు - భళి భళి మాధవపెద్ది
7. మైనా - ఘటోత్కచుడు ద్వారక వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు "మైనా ఇకనుంచి నీవు ఇతనికే ఇష్ట సఖివి" అంటూ పురమాయిస్తాడు.
8. కుడ్యాసురుడు - కుడ్యం అంటే గోడ.
9. "కోర్ కోర్ శరణు కోర్..".. "ఫో ఫో వెనక్కి ఫో.." లాగా వినిపిస్తుంది కాని, "కోర్ కోర్.." వున్నట్టు గతంలో హాసంలో వివరించారు.
10. అలమలం.. అలమలం పుత్రా అలమలం..
మరోసారి ఈ చిత్ర సృష్టికర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ.. శలవు.
Unknown
ఆ మధ్య మాయాబజార్ రంగుల్లో వచ్చినప్పుడు మా అమ్మాయిని తీసుకెళ్ళాను (రెండున్నర సంవత్సరాల వయసు). అంత చిన్న పిల్లకు కథ అర్థం కాదేమోనని దగ్గర కూర్చోపెట్టుకోని చెప్పాలని ప్రయత్నిస్తే వద్దని వారించి తనే స్వయంగా చూసింది. పైగా విరామ సమయంలో పక్కన వున్నవారికి జరిగిన కథంతా వల్లె వేసి ఆశ్చర్యపరిచింది. మొత్తమ్మీద ఆ సినిమా మా అమ్మాయికి నచ్చింది.
నచ్చింది కదా అని మొన్న ఈ సినిమాతో పాటు పిల్లలకు నచ్చే సినిమాలు (అనుకుని) బాలభారతం, యశోదాకృష్ణ, లవకుశ, భక్తప్రహ్లాద వంటి సినిమాల సీడీలు కొనుక్కొచ్చాను. అన్ని సీడీలలో మాయాబజార్ సీడిని గుర్తుపట్టి (అన్నగార్ని, ఎస్వీఆర్‌ని), అదే పెట్టమంటూ మారాం చేసింది. "ఆహా ఎంత గొప్ప సినిమా.. యాభై సంవత్సరాల తరువాత కూడా ఈ తరానికి నచ్చడమే గొప్ప.." అనుకుంటూ ఆ సినిమా పెట్టాను. మా అమ్మాయేమో ఎంతో జ్ఞాపకం పెట్టుకోని.. ఇదుగో ఇప్పుడు శశి పాట పాడుతుంది.. ఘటోత్కచుడు మీసం మెలేస్తాడు.. ఆయన చేతులు అతుక్కుపోతాయి అంటూ ముందే చెప్పేస్తోంది. నేనూ సంతోషపడి నా ఫేస్‌బుక్‌లో కూడా వ్రాసుకున్నాను..!!
ఆ తరువాత మొదలయ్యాయి మా కష్టాలు -
ఇక రోజూ అదే సినిమా.. పగలు.. రాత్రి.. మళ్ళీ మళ్ళీ.. "ఇంక చాలమ్మా" అంటే వినదు.. ఇంతకు ముందే మాయాబజార్ సినిమా డైలాగులన్నీ నోటికి వచ్చనుకుంటున్న నాకు, ఇప్పుడు నేపధ్య సంగీతం కూడా నోటికి వచ్చేసే పరిస్థితి.. మా అమ్మాయి ఇప్పటికే మాటలు పాటలు నేర్చేసుకుంటోంది..
సరే ఏది ఏమైనా ఇన్ని సార్లు మాయాబజార్ చూడటం కూడా ఒక అనుభవమే - సెట్టింగుల దగ్గర్నుంచి, ఆహార్యం వరకు, కెమెరా సంగతులు, జూనియర్ ఆర్టిస్టుల నటన దాకా గమనించే అవకాశం కలిగింది. ఆ చిత్రం పైన, ఆ దర్శకాది సాంకేతిక నిపుణులపైనా గౌరవం పెరిగింది. ఆ అనుభవంతో ఇదుగో ఈ క్విజ్.. ప్రయత్నించండి -
1. తానశర్మ తందానశాస్త్రి పెట్టిన ముహూర్తం "దగ్ధయోగం"లో వుందని, బలరాముడి ఆస్థాన పురోహితులు వారిస్తారు. (తరువాత శశిరేఖాభిమన్యుల పెళ్ళి అదే ముహూర్తానికి జరుగుతుందనుకోండి అది వేరే విషయం). ఆ వారించిన పురోహితుడి పేరేమిటి?
2. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయనం చేసిన నటుడెవ్వరు?
3. తానశర్మ, తందాన శాస్త్రి విడిదిలో కొన్ని రకాల భ్రాంతులకు లోనౌతారు. అవేమిటి?
4. శకునిమామను ఈ చిత్రంలో నలుగురు వ్యక్తులు పందెం వెయ్యమని అడుగుతారు. చిత్రంగా అందరూ రెండు వెయ్యమంటారు. ఒక్కరు తప్ప. పందెం అడిగేదెవ్వరు? రెండు కాకుండా వేరే పందెం అడిగేదెవ్వరు?
5. శాకంబరీదేవి ప్రసాదం ఏమిటి?
6. సుభద్రాభిమన్యులను రథంపై ద్వారక నుంచి ఘటోత్కచుని ఆశ్రమానికి చేర్చే సారథి ఎవరు?
7. శశిరేఖ ఇష్ట సఖి పేరేమిటి?
8. అడవిలో సుభద్రాభిమన్యులను గోడకట్టి అడ్డుకునే రాక్షసుడి పేరేమిటి?
9. సుభద్రాభిమన్యులను అడవిలో ఘటోత్కచుడి రాక్షసులు ఎదుర్కునేటప్పుడు నేపధ్య సంగీతం ఏమిటి?
10. ఘటోత్కచుడి ఆశ్రమంలో దీవించడానికి వాడే పదం ఏమిటి?
మీ సమాధానాలు వ్యాఖ్య పెట్టండి.. నా సమాధానాలు రేపటి టపాలో)
Unknown
హరిశ్చంద్రుడని ఒక రాజుగారున్నారు. అంటే మనకి అంతగా పరిచయంలేదు గాని ఆయన గురించి విన్నాను.. మీకు గూడా ఆయన సంగతులు తెలిసే వుంటాయి. సత్యాన్నే నమ్ముకోని, ఆలుబిడ్డలతో సహా అష్టకష్టాలు పడి చివరికి “సత్య”హరిశ్చద్రుడయ్యాడు. ఒకానొక బళ్ళో ఒక పంతులుగారు ఈ కథ వివరంగా చెప్పి. పిల్లల్ని - "ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకున్నాం?" అని అడిగాట్ట.. ఒక అతితెలివి కుర్రాడు నిలబడి - "నిజం చెప్తే ఇట్లే కష్టాలు వస్తాయి కాబట్టి నిజం చెప్పకూడదు" అన్నాట్ట... "కష్టములు ఎట్లున్ననూ పరమ పావన క్షేత్రమగు వారణాశీ క్షేత్రమును దర్శించుటకు వీలాయను కదా" అన్న హరిశ్చద్రుడి ఆశవహ దృక్పధం ఆ పిల్లవాడిలో లోపించదని ఆ పంతులుగారు బాధపడ్డారట.
ఏమైతేనేం.. ఈ హరిశ్చద్రుడనే సత్యసంధుడు తరువాత తరువాత తన వంశంలోనే పుట్టిన దశరథుడికి, శ్రీరామ చంద్రుడికీ ఆదర్శమై రామాయణాన్ని నడిపాడు. సత్యసంధత అనేది ఒకటి ఆ వంశంలో వుండబట్టే దశరథుడి వరాలు, రాముడి వనవాసాలు, రామరావణ యుద్ధాలు జరిగాయి. ఇహ అక్కడి నుంచి మన గాంధీ వరకూ అనేకమంది జీవితాల్ని హరిశ్చంద్రులవారు ప్రభావితం చేస్తూనే వున్నారు. అయితే ఇందాక కథలో ఆకతాయి కుర్రాడు గేలి చేసినట్లే ఇప్పటికీ కొంతమంది హరిశ్చంద్రుడి కథ అంతా పుక్కిటి పురాణమనీ, హరిశ్చంద్రుడు అహంభావి అవ్వటంవల్ల చేతకాని ప్రతిజ్ఞలు చేసి అవి నెరవేర్చడానికి పెళ్ళాం బిడ్డల్ని హింసించిన మూర్ఖుడనీ ప్రచారం చేస్తున్నారు.
అసలు హరిశ్చద్రుడి కథ నిజంగా జరిగిందా లేక కల్పిత గాధా? విశ్వామిత్రుడు వశిష్టుడిపై తన ఆధిపత్యాన్ని నిరూపించడంకోసం ఇలా అమాయక ప్రజలను హింసించడం భావ్యమా? ఒక ఏనుగుపైకెక్కి బలమైన యువకుడు ఒక మణి విసిరినంత ఎత్తు ధనరాశి ఒక కాటికాపరి దగ్గర వుండేదా? అంటే దళితులు అప్పట్లో అంత ధనవంతులా? ఇలాంటి ప్రశ్నలకు నేను ఇక్కడ సమాధానం చెప్పటంలేదు... కనీసం ప్రశ్నించడంలేదు. నేను చెప్పదల్చుకున్నవి - ఎందుకు ఈ కథ ఇంతటి విశేష ప్రచారం పొందింది..? ఇలా ఈ కథను ప్రచారం చెయ్యటం ద్వారా ఏమైనా సామాజిక ప్రయోజనం ఆశించారా? ఒక వేళ అలాంటి ప్రయోజనమే వుంటే మనం దాన్ని ఎలా వుపయోగించుకోవచ్చు..?
ముందుగా ఈ కథ ప్రచారం గురించి - నాకు బాగా గుర్తు మా చిన్నప్పుడు మా నాయనమ్మ ఈ కథ తరచుగా చెప్పేది. చెప్పినప్పుడల్లా ఒక సన్నివేశం దగ్గర ఆగిపోయింది. హరిశ్చద్రుడు, తన ముందు వున్న శవం లోహితుడిదే అని తెలుసుకున్న బాధతో "లోహితా.. లోహితా.." అంటూ.. విధినిర్వహణ ఆడ్డు వచ్చి ఆ బిడ్డ దహన సంస్కారానికి పైకం కట్టమనే సన్నివేశం అది. ఆ సంగతి చెప్పేటప్పుడు మా నాయనమ్మ ఖచ్చితంగా బాధపడేది.. ఏడ్చేది. ఎన్ని సార్లు ఈ కథ చెప్పించుకున్నా ఆమె మాత్రం ఆ సన్నివేశం చెప్తూ ఏడ్చేది. అంతగా ప్రభావితం చేసిన కథ హరిశ్చద్రుడిది.
అసలు రాముడికి చదువు సంస్కారం నేర్పేటప్పుడే దశరథుడు, విశ్వామిత్రుడు ఈ కథను చెప్పి ప్రచారం చేశారు. తర్వాత తర్వాత నాటకాలు, సినిమాలలో కూడా హరిశ్చంద్రుడి కథలు ప్రచారానికి నోచుకున్నాయి. (అసలు మొదటి సినిమానే హరిశ్చంద్ర కదా). బుద్ధుడు, గాంధీ కూడా ఈయనని తరచుగా తల్చుకోని ఈ కథని మనకి పదే పదే గుర్తుచేశారు. ఇక జాషువాగారి పద్యాల మూలంగా (అవి హరిశ్చంద్ర కోసం వ్రాసినవి కాకపోయినా) హరిశ్చంద్ర నాటకం, ముఖ్యంగా కాటి సీను జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి. ఈ రకంగా ప్రచారం పొందిన ఈ కథలో అంత విశేషమేముందో ఇప్పుడు చూద్దాం.
ఏదైనా సమాజంలో ఒక నడవడికనీ ఒక జీవన విధానాన్ని ప్రజల చేత పాటింపజేయాలనుకుంటే, ఆ సమాజం, ప్రజలు ఆ పని చేసే విధంగా కొన్ని రూల్స్ ఏర్పాటు చేస్తుంది.. అలా చెయ్యని పక్షంలో దానికి ఒక శిక్షని ఏర్పాటు చేస్తుంది. అలాగే ఆ రూల్ ప్రకారం పద్ధతిగా నడుచుకునే వారికి లాభం చేకూరే విధంగా ఈ రూల్స్ వ్రాయబడి వుంటాయి - (Rules with postive and negative incentives). ఇలాంటి రూల్స్ కాలానుగుణంగా ఆ సమాజ విలువలుగా మారి ఏమాత్రం గతి తప్పని శిలాశాసనాలుగా మిగిలిపోతాయి.
వుదాహరణకి మా కాలేజిలో జరిగిన చిన్న సంగతి చెప్తాను. నేను చదివింది వుత్తర భారత దేశంలో కాబట్టి అక్కడ గోధుమరొట్టెలు ప్రధాన ఆహారం. అన్నం వున్నా అది మన లాంటి దక్షిణ భారతీయులకు, ఒరిస్సా బెంగాలీయులకు మాత్రమే ప్రధాన ఆహారం. అందువల్ల రొట్టెలకు ఎక్కువ డిమాండ్ వుండేది. రొట్టెలు కావాలనుకున్నవాళ్ళు ఒక వరుసలో నిల్చోని తీసుకోవాలి. అన్నం కావాలనుకున్నవారు వెనుకగా వచ్చి తీసుకోవచ్చు. వెనుకగా వచ్చి రొట్టెలు తీసుకోవడం నిషిద్ధం. అలా తీసుకున్నవారికి రూ 50 పరిహారం. ఇలా (రూల్ ప్రకారం) లైన్‌లో వచ్చిన వారికి రొట్టెలు అనే లాభం కలుగగా, లైన్ తప్పినవారికి రూ 50 జరిమానా అనే నష్టం కలిగేది. అందువల్ల అందరూ లైన్‌లోనే వచ్చేవారు.
ఈ కథకి హరిశ్చద్రుడి కథకి సంబంధం ఏమిటా అని ఆలోచించకండి. చివర్లో ఎట్లాగూ నేనే చెప్తాను. అందాకా సావధానంగా వినండి -
ఒక సారి ఒక మిత్రుడు లైను వెనకనుంచి వచ్చి రొట్టెలు తీసుకోబొయ్యాడు. వారించిన వారితో - "కావాలంటే రూ 50 ఫైన్ వేసుకోండి" అంటూ నిర్లక్ష్యంగా చెప్పాడు. దాంతో మరో మిత్రుడు అడ్డుకొని, రూ 50 జరిమానా ఎటూ తప్పదు, కానీ రొట్టెలు మాత్రం తీసుకోనివ్వము అంటూ అడ్డం తిరిగాడు. మిగతావారు "కావాలంటే అన్నం పెట్టుకో మన్నారు" తర్వాత వారి సంభాషణ ఇది -
"అన్నం తింటే నిద్ర వస్తుంది.. నాకు ఇప్పుడు పరీక్ష వుంది.."
"వుంటే..?? నిద్ర వస్తే నిద్ర పో..! లేకపోతే ఏమి తినకుండా వెళ్ళు"
"అప్పుడు ఆకలేస్తుంది.. నేను పడిపోతే, చచ్చిపోతే..?"
"చచ్చిపో.. ఎందుకంటే నువ్వు చచ్చిపోవటం వల్ల మాకు మంచే జరుగుతుంది. లైన్‌లో రావాలనే నిబంధన కోసం ప్రాణాలర్పించిన వీరుడివి అవుతావు. ఆహా ఫలానా వీరుడు లైన్‌లో రావాలి అనే సిధ్ధాంతం కోసం ప్రాణాలే అర్పించాడు అంటే ఆ సిధ్ధాంతం విలువ పెరుగుతుంది.. ఇంక ఎవ్వరూ లైన్ తప్పడం జరగదు.. జరిమానా లేకపోయినా ఈ పధ్ధతి జనంలో జీర్ణిచుకుపోతుంది.." ఇలా అన్నది నా మిత్రుడే. ఇంక ఆ పిల్లాడు అప్పుడే కాదు ఇంకెప్పుడూ లైన్ తప్పి రావటం నేను చూడలేదు.
ఇంతా చెప్పొచ్చేదేమిటంటే - "త్యాగాల వల్ల సిధ్ధాంతం/పద్ధతి విలువ పెరుగుతుంది. ఇప్పుడు చెప్పిన లైన్‌లో రావటం దగ్గర్నుంచి, గాంధీ సత్యాగ్రహ సిధ్ధాంతం వరకు, జైలు శిక్షలు వురి శిక్షల నుంచీ, తీవ్రవాద ఆత్మాహుతి దాడులవరకు - వారు వారు చేసే త్యాగం లేదా పడే కష్టం వారి వారి సమాజాలకు మరింత స్థిరమైన, అభేధ్యమైన విలువలని అందిస్తుంది."
హరిశ్చంద్రుడి కథలో వున్నది కూడా అదే - "సత్యం పలకడం" అనే ఒక్క సిధ్ధాంతం కోసం కష్టాలు పడటం, త్యాగాలు చెయ్యడం వల్ల సత్య సంధత అనే విషయానికి విలువ పెరిగింది. ఇలా కష్టాలు పడుతున్నప్పుడు మాట తప్పడానికి అనేక అవకాశాలు హరిశ్చద్రుడికి కలుగుతాయి. అయినా అతడు నిజాన్ని విడువక వుండగలగటం ఇంకా కష్టం అనిపిస్తుంది - కష్టం ఎక్కువైతే విలువ మరింత పెరుగుతుంది. సత్యంకోసం బిడ్డ చనిపోతే కూడా అబద్ధమాడని హరిశ్చద్రుణ్ణి వింటే మన మనసుల్లో కూడా ఎక్కడో సత్య పలకడమనే సిధ్ధాంతానికి విలువ పెరుగుతుంది. అదే ఈ కథ ప్రచారంలో ప్రధానోద్దేశ్యం.
మనం కూడా చేతనైనంతలో చిన్న వైనా పెద్దవైనా త్యాగాలు చేసి ఇలాంటి విలువల్ని నిలబెట్టాలి. సినిమా మొదలైందని తెలిసినా లైన్‌లో నిలబడే టికెట్ తీసుకుంటే - మీరు త్యాగం చేసిన మొదటి పాట వల్ల లైన్‌లో రావాలనే పధ్ధతికి విలువ పెరుగుతుంది.. తినేసిన శనక్కాయ తొక్కలు, అరటి పండు తొక్కలు చేతిలో పట్టుకోని చత్త బుట్టకోసం వెతికి మరీ దాంట్లో వేస్తే - మీ అవన్నీ మోసుకుంటూ తిరిగటంలో వున్న ఇబ్బంది (Discomfort) కారణంగా చెత్త బుట్టలోనే వెయ్యాలి అన్న పధ్ధతికి విలువ పెరుగుతుంది. కాబట్టీ పెళ్ళాం పిల్లల్ని అమ్ముకున్న హరిశ్చద్రులం కాకపోయినా మన స్థాయిలో త్యాగాలు చేసి సామాజిక విలువల్ని కాపాడాలి.
Unknown
సోనీ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే "ఇండియన్ ఐడల్" ఐదొవ అంకంలో మనవాడు.. మన తెలుగువాడు.. "శ్రీరామచంద్ర" టాప్ 13లో ఒకడుగా నిలిచాడు. ఇంతవరకూ ఈ పోటీలో కారుణ్య తరువాత ఇంత ఎత్తుకు ఎదిగింది.. రామచంద్ర మాత్రమే.. గతంలో ఈ టీవీ "సై", "ఒక్కరే" పాటల పోటీలో విజేతగా నిలిచిన శ్రీరామచంద్ర ఈ పోటీలో కూడా గెలవాలని తెలుగువారే కాదు.. దక్షిణభారతీయులం అందరం కోరుకోవాలి... గతంలో "కారుణ్య" ఎస్.ఎమ్.ఎస్. ల కారణంగా ఈ అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు.. అలా మన శ్రీరామచంద్రకి జరకకూడదంటే.. వెంటనే మొబైల్ అందుకోండి... 52525కు "SREERAM" అని టైప్ చేసి పంపించండి... లేదా ఏ మొబైల్ నించి అయినా 505252507కి, బీఎస్‍ఎన్‍ఎల్ నుంచి అయితే 1861888252507కి కాల్ చెయ్యండి.. ఒక తెలుగువాడు "ఇండియన్ ఐడల్" అయ్యేందుకు సహకరించండి..
నా బ్లాగులో శ్రీరామచంద్రని గెలిపించమని అభ్యర్ధిస్తూ ఒక బ్యానర్ పెట్టాను. మీ బ్లాగులో కూడా అలా పెట్టదలిస్తే ఆ బొమ్మని తీసుకోవచ్చు.
(ఈ రోజు అనుకోకుండా కలిసిన శ్రీరామచంద్ర తండ్రిగారు.. ఎమ్.ఎస్.ఎన్. ప్రసాద్ గారి అభ్యర్థన మేరకు)
Unknown
నేను ఇలా అంటే మీకందరికీ కోపం రావచ్చు.. నా దేశభక్తి మీద అనుమానం రావచ్చు.. నాకేదో ఉగ్రవాద సంస్థలతో లింకులున్నాయని పుకార్లు పుట్టచ్చు. కానీ నేను చెప్పేది నిజం. అవును, కసబ్‌కి విధించిన వురిశిక్ష.. అదే నాలుగు వురిశిక్షల గురించే నేను మాట్లాడేది. నేను ఎందుకలా మాట్లాడుతున్నానో కొంచెం వివరంగా చెప్తాను వినండి.. ఆ తరువాత మీరు ఏమన్నా పడతాను..!!
అసలు చట్టం ఎందుకు వున్నట్లు? శిక్షలు ఎందుకు పెట్టినట్లు? ఎవరైనా తప్పు చేస్తే వాడికి అందుకు ప్రతిఫలంగా శిక్ష విధిస్తే చెల్లుకి చెల్లు అయిపోతుందనా? కాదు..! ఫలానా తప్పుకు ఫలానా శిక్ష పడుతుందని తెలిస్తే ఆ తప్పు చెయ్యకుండా వుండేందుకు. ఫలానా వాడి కన్ను తీశావు కాబట్టి నీ కన్ను తీస్తాను, కాలుకి కాలు అంటూ చెల్లు కి చెల్లు కొట్టే శిక్షలు భారతదేశంలో లేవు. మన శిక్షలన్నీ తప్పు చెయ్యకుండా ఆపడానికే కాని, తప్పు చేసినవాడిని శిక్షించడానికి కాదు. ఎవరికైనా పడిన శిక్ష ఆ వ్యక్తికి పశ్చాత్తాపాన్ని కలిగించినా లేకపోయానా, అలాంటి తప్పు చెయ్యడానికి ఇంకెవ్వరూ ముందుకి రాకుండా చెయ్యడామే ఆ శిక్ష ప్రధమోద్దేశ్యం.
మనం చేసే ప్రతి పనికి ఒక పర్యవసానం వుంటుందని ఇంతకు ముందు టపాలో చెప్పాను. ఆ పర్యవసానం మన మీద వుండచ్చు, మన ఇరుగు పొరుగు మీద వుండచ్చు, తరువాతి తరాలమీద వుండచ్చు అని కూడా విన్నవించాను. అసలు తప్పు అనే చర్య ఏమిటి అని ఆలోచిస్తే ఆ పని యొక్క చెడు పర్యవసానం పది మంది మీద పడి, దాని వల్ల జరిగే మంచి కేవలం ఒక్కడికే కలిగితే ఆ పని తప్పుగా నిర్ణయించవచ్చు. (ఇది అర్థం కావటం కష్టమే అయినా, కొంచెం ఆలోచించండి, మరో టపాలో వివరిస్తాను). వుదాహరణకి బస్సు ఎక్కడానికి లైన్‌లో నిల్చున్నాం అనుకోండి ఎవడో ఒకడు లైనుని కాదని తోసుకుంటూ వెళ్ళి బస్సులో సీటు పట్టుకుంటాడు. ఈ చర్య వల్ల నష్టం లైన్‌లో నిలబడ్డవారికి - సీటు న్యాయంగా దొరకాల్సినవాడికి దొరకకపోవటం, లైన్‌లో వున్న మరికొంతమంది బలవంతులు లైను తప్పి తోసుకోవడం, స్థూలంగా లైన్‌లో రావాలి అన్న సామాజిక బాధ్యతకి విలువ తప్పిపోవడం - ఇవీ నష్టాలు. కానీ అదే చర్యకు "పాసిటివ్" పర్యవసానం ఆ లైను తప్పినవాడికి - సీటు దొరకడం ద్వారా లభించింది - లాభించింది. అదువల్ల ఇది తప్పు - ఈ తప్పుని శిక్షించాలి.
ఎలా శిక్షించాలి? అతనికి ఏదైతే లాభం కలుగుతోందో ఆ లాభాన్ని లేకుండా చెయ్యాలి - లేదా ఆ లాభానికి సరిపడ విలువైనదేదైనా అతనిని నుంచి తీసుకోవాలి. అది ఫైన్ కావచ్చు, బస్సులో ఎక్కిన వారంతా అసహ్యించుకోవడం కావచ్చు, లేదా బస్సు యాజమాన్యం ఒక ప్రకటన చెయ్యవచ్చు - లైన్‌లో వచ్చిన వారికి సీటు, రాని వారు నిలబడాలి అని. అంటే ఏదైతే "ఆశించే ప్రవనర్త (Desired behaviour)" వుంటుందో ఆ ప్రవర్తనని అభినందిస్తూ "పాజిటివ్ ఇన్సెంటివ్ (Positive Incentive)" ఇవ్వడం, లేదా ఎవరైతే "ఆశించే ప్రవర్తన"కు భిన్నంగా ప్రవర్తిస్తారో వారికి "నెగటివ్ ఇన్సెంటివ్ (Negative Incentive)" ఇవ్వడం అనే రెండు విధానాల ద్వారా మనిషి ప్రవర్తనని నియంత్రిచడమే చట్టం, న్యాయ వ్యవస్త అన్నీనూ. ట్రాఫిక్ పోలీసు ఫైన్ వేసినా, టికెట్టు లేని ప్రయాణం నేరం అందుకు రూ 500 వరకూ జరిమానా అంటూ బోర్డులు పెట్టినా అవన్నీ ఇందుకే.
అయితే ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ "నెగెటివ్ ఇన్సెంటివ్" ఆ తప్పు చేస్తున్న వ్యక్తికి లభిస్తున్న లాభానికి కనీసం సమానంగా, ఆ ఫలితానికి వ్యతిరేకంగా వుండాలి (atleast equal but opposite). సమానం అనేది ఆర్థికంగా మాత్రమే కాకపోవచ్చు. బాగా డబ్బున్న వాడు కారులో రాంగ్ సైడ్ వెళ్తే అతనికి ఐదువందల రూపాయల జరిమానా వేస్తే అతనికి అదేం పెద్ద లెఖ్ఖ కాదు. డబ్బులు పడేసి దర్జాగా పోతాడు. కావాలనే రోజూ రాంగ్ రూట్లో వచ్చి "ఆఫ్ట్రాల్ అయిదొందలు" పడేసిపోతాడు. అదే అతనిని కార్లో నించి దించి ఒక గంట ఎండలో నిలబెట్టి (ఇదుగో మా ఎస్సైగారు వస్తున్నారు, అదిగో సీయం కారు వస్తోంది అంటూ..)కావాలనే తాత్సారం చేసి, డబ్బులు తీసుకోకుండా పంపించినా మళ్ళీ అటు వైపుకి రావాలంటే జంకుతాడు. ఇలా జంకి "తప్పు" పనులు చెయ్యకుండా వుండటమే శిక్షల వుద్దేశ్యం.
కసబ్ సంగతి చెప్తూ ఈ కథలన్నీ ఏమిటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. మన న్యాయస్థానం కసబ్‌కి వురి శిక్ష విధించింది. వురి అనే ప్రాణం తీయటం నిజంగానే పెద్ద శిక్షా? అని ప్రశ్నఒకటుంది. సరే అది అక్కడే వుంచి - అసలు కసబ్‌కి వురి నిజంగా శిక్షా అని ఆలోచిద్దాం. ఒకసారి టెర్రరిస్ట్ దృష్టితో చూడండి -
కసబ్ టెర్రరిస్ట్ ట్రైనింగ్లో ఏమని చెప్పి వుంటారు - "మన జిహాద్ అనే పవిత్ర యుద్ధం కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధం అవ్వాలి" - అని వుర్దూలో చెప్పి వుంటారా? దానికి సిద్ధపడే కసబ్ భారతదేశానికి వచ్చాడా? వాడు సిద్ధపడ్డ చావుని వాడికే ఇచ్చి దాన్ని శిక్ష అని అంటే హాస్యాస్పదంగా కనిపించడంలేదూ? అతన్ని చంపడం ద్వారా ఉగ్రవాదులకి మన ప్రభుత్వం ఇచ్చే సందేశమేమిటి? "కసబ్‌ని చంపారూ రేపు మనల్ని కూడా చంపుతారు" అంటూ ఉగ్రవాదులు గజ గజ వణుకుతారా? లేదే..!!
ఉగ్రవాదం కోరుకునేదేమిటి? ముంబై తరహా చర్యల వల్ల ఏం సాధిస్తారు?
- భారతదేశానికి ఆర్థిక, రాజకీయ పరంగా నష్టం కలిగించడం
- భారతదేశ సార్వభౌమత్వాన్ని, మిలటరీ వ్యవస్థని ఎదిరించి వీలైతే వాటిని తక్కువ చేసి చూపించడం
- ముఖ్యంగా ప్రజలలో ఆందోళన, భయాన్ని సృష్టించడం తద్వారా అస్థిరత్వాన్ని తీసుకురావడం
ఇక ఆత్మాహుతి దాడి చెయ్యడానికి కారణం?
- తమ సిద్ధాంతాల, పైన చెప్పిన ఆశయాల సాధనకి ప్రాణాల్ని సైతం బలిపెట్టగలం అని ప్రకటించుకోవడం
- తమ ప్రాణాలని సైతం లెఖ్ఖ చెయ్యని తీవ్రవాదాన్ని చూసి ప్రజలు మరింత భయపడేలా చెయ్యడం
- చావుకైన సిధ్ధపడ్డ వాళ్ళని చూపించి, ఈ పోరులో చనిపోయిన వారిని చూపించి తమ ఆశయాలకు, సిద్ధాంతాలకు మరింత బలం చేకూర్చుకోవటం, మరింత మందిని ఇలాంటి చర్యలకు సిధ్ధం చేసుకోవడం
తీవ్రవాదం ఆశయాలు, కోరికలు ఇవైనప్పుడు మనం ప్రకటించే ఈ తీర్పు ఈ ఆశయాలకు కనీసం సమానంగా, వ్యతిరేక దిశలో వుండాలి. వుందా?
లేదే..!!
లేకపోగా మన తీర్పు తీవ్రవాదులు కోరుకున్న ఆశయాలకు బలం ఇచ్చేదిగా వుంది.
ఎందుకంటే.. ఇప్పుడు టెర్రరిస్ట్ కేంపుల్లో కసబ్ ఒక అమర వీరుడు.. అతని స్ఫూర్తితో మరింతమంది చావడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు టెర్రరిట్ ట్రైనింగ్‌లో - "మీరు చావడానికి సిద్ధపడండి, వీలైనంతమందిని చంపి మీరు ఆత్మాహుతి చేసుకోండి.. అలా చంపి చావడమే మన యుద్ధ న్యాయం.. ఒక వేళ దొరికిపోతే భారతదేశమే మిమ్మల్ని చంపుతుంది.." అంటూ కొత్త పాఠాలు చెప్తారేమో.
ఇప్పుడు ఆత్మహత్య చట్ట రీత్యా నేరం, అందుకని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్న వాడికి ఉరి శిక్ష వేస్తే ఎలా వుంటుంది? జడ్జిగారు - "ఆత్మహత్యా యత్నం నేరం కింద నిన్ను వురి తీస్తున్నాను" అంటూ తీర్పు ఇస్తే ఆ ముద్దాయి కూడా నవ్వుకోడా? నిజమైన తీవ్రవాది అయితే కసబ్ కూడా అలా నవ్వుకుంటాడేమో?
ఈ వురి శిక్ష కారణంగా పాకిస్తాన్ గజ గజ లాడుతుంది, ఉగ్రవాదులు ప్యాంట్ తడుపుకుంటారు, అమెరికా పాకిస్థాన్‌కి ఆర్థిక సాయం ఆపేస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది వున్నారు - టీ.వీలో కనిపిస్తుంటారు. వాళ్ళను చూసి జాలి పడటం మినహా నేను చెయ్యగలిగిందేమి లేదు. భారతదేశంలో జరిగిన ఒక నేరము-శిక్ష కారణంగా అంతర్జాతీయ రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టి పాకిస్తాన్, అమెరికాలు చేతులు కట్టుకోని నిలబడతాయంటే అంత కన్నా పెద్ద జోక్ లేనే లేదు.
ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం (న్యాయమైనా అన్యాయమైనదైనా) చేస్తున్న వారిని ప్రభుత్వం చంపేస్తే ఆ పోరాటాలు మరింత బలంగా తయారయ్యాయి, ఆ చనిపోయిన వాళ్ళు ఆ పోరాటనికి అమర వీరులయ్యారు. ఆ విషయం భారతదేశంతో సహా ప్రపంచ దేశ చరిత్రలన్నింటిలోనూ వుంది..! రేపు ఉగ్రవాదులకు కూడా కసబ్ ఒక అమర వీరుడే అవుతాడు.. ఈ పాటికే భారత న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పుకి తీవ్రవాదులు పండగ చేసుకుంటుంటారు. కసబ్ నిజంగా కరడు గట్టిన తీవ్రవాదే అయితే ఈ తీర్పుకి అప్పిలు అడగడు.. ఆనందంగా వురి తగిలించుకుంటాడు... ఎందుకంటే అతను చంపడానికీ, చావడానికే కదా భారతదేశానికి వచ్చింది. చంపడం అతను చేశాడు, అతను చావడం అనే కోరిక మాత్రం ప్రభుత్వం తీరుస్తోంది.
Unknown
వుదాహరణకి ఒక ఆఫీసరుగారు గుమస్తాని తిడితే గుమాస్తా ఇంటికి వెళ్ళి ఆ కోపం పెళ్ళాం మీద చూపిస్తాడు. సదరు ఇల్లాలు భర్తని ఏమీ అనలేని పరిస్థితిలో కొడుకుని నాలుగు చీవాట్లేసి కూర్చోపెడుతుంది. మరి కొడుకు చిన్నవాడైపోయే.. ఎవరినీ ఏమీ అనలేక, వెళ్ళి ఒక కుక్కని తంతాడు. ఇలా మనల్ని మోసం చేసే గొలుసు వ్యాపారాల్లాగా ఒకళ్ళనించి మరొకళ్ళకి "పర్యవసానం" పాకుతూనే వుంటుంది. ఒక్కోసారి అదే పర్యవసానం తిరిగి తిరిగి మొదలు పెట్టినవాడి మీదకే వచ్చి పడుతుంది. ఇందాక చెప్పిన కథలో పిల్లాడు కుక్కని కొట్టగానే కుక్క తిరగబడి కరిచిందనుకోండి, తల్లి మీద ఖంగారు ఆందోళన అనే ఎఫెక్ట్ పదుతుంది - అక్కడి నుంచి తండ్రిగారైన గుమాస్తాకి ఫోన్ వెళ్తుంది, గుమాస్తా గారు శెలవడిగితే బాసుగారు కాదంటారు - దాంతో రెచ్చిపోయిన గుమాస్తా - "కన్న కొడుక్కి కష్టం వస్తే శలవివ్వవా? నీలాంటి వాడికింద పనిచెయ్యడం కంటే శనక్కాయలు అమ్ముకోవడం నయం" అని రాజీనామా మొహం మీద కొట్టి వచ్చేస్తాడు.. చూశారా..!! భూమి గుండ్రంగా వుందన్నట్టు తిరిగి తిరిగి బాసు నెత్తినే వచ్చి పడింది కదా?
అయితే చాలా సందర్భాలలో ఇలాంటి ఎఫెక్ట్ వెంటనే రాదు. ఏ సంవత్సరానికో, ఐదు సంవత్సరాలకో, కొన్ని దశాబ్దాలకో ఒక్కోసారి కొన్ని తరాల తరువాతో పర్యవసానం వచ్చి పడుతుంది. ఇప్పుడు మనం ఒక నాయకుణ్ణి ఎన్నుకున్నాం అనుకోండి ఆ నాయకుడి అసలు స్వరూపం వెంటనే తెలుస్తుందా? పాపం పండాలి, ప్రెస్ కన్ను పడాలి, స్ట్రింగ్ ఆపరేషన్ జరగాలి.. అప్పుడు మనం చేసిన తప్పు మనకి తెలుసుతుంది. అయితే అది తప్పు అని వొప్పుకోడానికి మనకి మనసొప్పదనుకోండి అది వేరే విషయం (దీని గురించి మరో టపా వచ్చే వారం). మరో విశేషమేమిటంటే పర్యవసానం వచ్చి మొహం మీద కొట్టినా ఆ పర్యవసానానికి మనం చేసిన తప్పుకి లింకు దొరకదు. లంకా వినాశనం సీతాపహరణం వల్లే జరిగిందని రావణుడికి కనీసం తమ్ముళ్ళు చెప్పేరు, వివేకవంతుడు కాబట్టి తెలుసుకున్నాడు. మహాభారత యుద్ధం, కౌరవవినాశనం తన గారాబం వల్లే జరిగిందని దృతరాష్ట్రుడు తెలుసుకోలేకపొయాడు. గాంధార రాజ్యంపైన దండెత్తి శకునిని బంధించినప్పుడే తన పతనం ఆరంభమైందని దుర్యోధనుడూ తెలుసుకోలేకపొయ్యాడు.
తెలుసుకున్నా తెలుసుకోక పోయినా పర్యవసానం అనేది బూమరాంగ్ లాగా తిరిగి వచ్చి కొట్టకుండా వూరుకోదు. "ఎవరు చేసిన కర్మ వారు అనుభవించకా తప్పదూరా అన్నా.." అంటూ తత్వాలు పాడినా.. "నరకమనేది ఒకటి వుందంటూ" పెద్దలు చెప్పినా.. "ఏ చెట్టు నాటితే ఆ ఫలాలే తినా"లంటూ సామెతలు చెప్పినా విషయమదే. పిల్లల పసి వయసులో నేర్పించని బుద్ధులు పెద్దైన తరువాత రమ్మన్నా రావని చెప్పడానికే - మొక్కై వంగనిది మానై వంగునా అంటూ చెప్పారు. ఈ విషయం మీద మరో కథ గుర్తుకువస్తోంది -
ఒక తల్లి, ఒక కొడుకు. కొడుకు చిన్ననాడే పక్కింట్లో తోటకూర దొంగతనం చేసి తల్లికి తెచ్చిచ్చి వండమన్నాడట. ఆ తల్లి "నా తండ్రే ఈ రోజు కూరగాయల ఖర్చు మిగిల్చావు" అంటూ ఆ పిల్లడ్ని ముద్దాడింది. తరువాత తరువాత ఆ పిల్లాడు పెరుగుతున్న కొద్ది తోటకూర నుంచి డబ్బు, నగలు, ఆఖరుకు ప్రాణాలు దోచుకునే స్థితికి వచ్చి పోలీసులకు చిక్కాడు. తల్లి పరామర్శకొస్తే - "అమ్మా తోటకూర కట్టనాడే తప్పని చెప్పి వుంటే నాకీ పరిస్థి రాకపోవును కదా" - అంటూ బాధపడ్డాడట.
ఈ రోజు మనం అందరం ఆ తల్లి లాగే ప్రవర్తిస్తున్నాం. మన పిల్లలకి మనమే వుదాహరణలై తప్పు పనులు చేసి నేర్పిస్తున్నాం. చాక్లెట్ తింటే దాని కాగితం చెత్త బుట్టలో వెయ్యాలని చెప్పడం మరుస్తున్నాం. పబ్లిక్ పార్క్‌లో పూలు కొయ్యద్దంటూ బోర్డు వున్నా పూలు కోస్తూ ఫొటోలు తీసుకుంటాం, రోడ్డు జీబ్రా క్రాసింగ్ దగ్గరే దాటాలనే రూల్ మర్చిపోయి పిల్లల్ని ఎత్తుకోని అడ్డంగా రోడ్డు దాటేస్తుంటాం. రోడ్డు మీదే వుమ్మేస్తుంటాం, నిషేదించిన ప్రదేశాల్లో సిగరెట్ తాగేస్తుంటం, టాక్సులు ఎగ్గోట్టినా లంచాలు తీసుకున్నా ఇంట్లోనే దర్జాగా మాట్లాడుకుంటాం.
ఏదో ఒకరోజు వీటన్నిటి పర్యవసానం వచ్చి పడుతుంది - మన మీదో మన పిల్ల మీదో. నాడు మా ముందు తరాలు ప్లాస్టిక్ వాడకపోయి వుంటే, కాలుష్యం పెంచకుండా వుండివుంటే ఈ రోజు మాకు గ్లోబల్ వార్మింగ్ వుండేది కాదు కదా అని మన ముందు తరాలు అనుకోకూడదు. తోటకూర కట్టనాడే చెప్పివుండల్సిందని మన పిల్లలు మనల్ని అడగే పరిస్థితి రాకూడదు. అలా ముందు తరాల ముందు తల దించుకోకూడదంటే ఇప్పటి నించే మనం మారాలి - ఎందుకంv మంచి చేస్తే దాని పర్యవసానం కూడా వెనక్కి వచ్చి మనకి మంచి చేస్తుంది. లేదంటే చేస్తున్న తప్పు గుర్తించని దృతరాష్ట్రులమై మిగిలిపోతాం..!!
సర్వే జనా సుజనో భవంతు
సర్వే సుజనా సుఖినోభవంతు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)