Unknown
హరిశ్చంద్రుడని ఒక రాజుగారున్నారు. అంటే మనకి అంతగా పరిచయంలేదు గాని ఆయన గురించి విన్నాను.. మీకు గూడా ఆయన సంగతులు తెలిసే వుంటాయి. సత్యాన్నే నమ్ముకోని, ఆలుబిడ్డలతో సహా అష్టకష్టాలు పడి చివరికి “సత్య”హరిశ్చద్రుడయ్యాడు. ఒకానొక బళ్ళో ఒక పంతులుగారు ఈ కథ వివరంగా చెప్పి. పిల్లల్ని - "ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకున్నాం?" అని అడిగాట్ట.. ఒక అతితెలివి కుర్రాడు నిలబడి - "నిజం చెప్తే ఇట్లే కష్టాలు వస్తాయి కాబట్టి నిజం చెప్పకూడదు" అన్నాట్ట... "కష్టములు ఎట్లున్ననూ పరమ పావన క్షేత్రమగు వారణాశీ క్షేత్రమును దర్శించుటకు వీలాయను కదా" అన్న హరిశ్చద్రుడి ఆశవహ దృక్పధం ఆ పిల్లవాడిలో లోపించదని ఆ పంతులుగారు బాధపడ్డారట.
ఏమైతేనేం.. ఈ హరిశ్చద్రుడనే సత్యసంధుడు తరువాత తరువాత తన వంశంలోనే పుట్టిన దశరథుడికి, శ్రీరామ చంద్రుడికీ ఆదర్శమై రామాయణాన్ని నడిపాడు. సత్యసంధత అనేది ఒకటి ఆ వంశంలో వుండబట్టే దశరథుడి వరాలు, రాముడి వనవాసాలు, రామరావణ యుద్ధాలు జరిగాయి. ఇహ అక్కడి నుంచి మన గాంధీ వరకూ అనేకమంది జీవితాల్ని హరిశ్చంద్రులవారు ప్రభావితం చేస్తూనే వున్నారు. అయితే ఇందాక కథలో ఆకతాయి కుర్రాడు గేలి చేసినట్లే ఇప్పటికీ కొంతమంది హరిశ్చంద్రుడి కథ అంతా పుక్కిటి పురాణమనీ, హరిశ్చంద్రుడు అహంభావి అవ్వటంవల్ల చేతకాని ప్రతిజ్ఞలు చేసి అవి నెరవేర్చడానికి పెళ్ళాం బిడ్డల్ని హింసించిన మూర్ఖుడనీ ప్రచారం చేస్తున్నారు.
అసలు హరిశ్చద్రుడి కథ నిజంగా జరిగిందా లేక కల్పిత గాధా? విశ్వామిత్రుడు వశిష్టుడిపై తన ఆధిపత్యాన్ని నిరూపించడంకోసం ఇలా అమాయక ప్రజలను హింసించడం భావ్యమా? ఒక ఏనుగుపైకెక్కి బలమైన యువకుడు ఒక మణి విసిరినంత ఎత్తు ధనరాశి ఒక కాటికాపరి దగ్గర వుండేదా? అంటే దళితులు అప్పట్లో అంత ధనవంతులా? ఇలాంటి ప్రశ్నలకు నేను ఇక్కడ సమాధానం చెప్పటంలేదు... కనీసం ప్రశ్నించడంలేదు. నేను చెప్పదల్చుకున్నవి - ఎందుకు ఈ కథ ఇంతటి విశేష ప్రచారం పొందింది..? ఇలా ఈ కథను ప్రచారం చెయ్యటం ద్వారా ఏమైనా సామాజిక ప్రయోజనం ఆశించారా? ఒక వేళ అలాంటి ప్రయోజనమే వుంటే మనం దాన్ని ఎలా వుపయోగించుకోవచ్చు..?
ముందుగా ఈ కథ ప్రచారం గురించి - నాకు బాగా గుర్తు మా చిన్నప్పుడు మా నాయనమ్మ ఈ కథ తరచుగా చెప్పేది. చెప్పినప్పుడల్లా ఒక సన్నివేశం దగ్గర ఆగిపోయింది. హరిశ్చద్రుడు, తన ముందు వున్న శవం లోహితుడిదే అని తెలుసుకున్న బాధతో "లోహితా.. లోహితా.." అంటూ.. విధినిర్వహణ ఆడ్డు వచ్చి ఆ బిడ్డ దహన సంస్కారానికి పైకం కట్టమనే సన్నివేశం అది. ఆ సంగతి చెప్పేటప్పుడు మా నాయనమ్మ ఖచ్చితంగా బాధపడేది.. ఏడ్చేది. ఎన్ని సార్లు ఈ కథ చెప్పించుకున్నా ఆమె మాత్రం ఆ సన్నివేశం చెప్తూ ఏడ్చేది. అంతగా ప్రభావితం చేసిన కథ హరిశ్చద్రుడిది.
అసలు రాముడికి చదువు సంస్కారం నేర్పేటప్పుడే దశరథుడు, విశ్వామిత్రుడు ఈ కథను చెప్పి ప్రచారం చేశారు. తర్వాత తర్వాత నాటకాలు, సినిమాలలో కూడా హరిశ్చంద్రుడి కథలు ప్రచారానికి నోచుకున్నాయి. (అసలు మొదటి సినిమానే హరిశ్చంద్ర కదా). బుద్ధుడు, గాంధీ కూడా ఈయనని తరచుగా తల్చుకోని ఈ కథని మనకి పదే పదే గుర్తుచేశారు. ఇక జాషువాగారి పద్యాల మూలంగా (అవి హరిశ్చంద్ర కోసం వ్రాసినవి కాకపోయినా) హరిశ్చంద్ర నాటకం, ముఖ్యంగా కాటి సీను జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి. ఈ రకంగా ప్రచారం పొందిన ఈ కథలో అంత విశేషమేముందో ఇప్పుడు చూద్దాం.
ఏదైనా సమాజంలో ఒక నడవడికనీ ఒక జీవన విధానాన్ని ప్రజల చేత పాటింపజేయాలనుకుంటే, ఆ సమాజం, ప్రజలు ఆ పని చేసే విధంగా కొన్ని రూల్స్ ఏర్పాటు చేస్తుంది.. అలా చెయ్యని పక్షంలో దానికి ఒక శిక్షని ఏర్పాటు చేస్తుంది. అలాగే ఆ రూల్ ప్రకారం పద్ధతిగా నడుచుకునే వారికి లాభం చేకూరే విధంగా ఈ రూల్స్ వ్రాయబడి వుంటాయి - (Rules with postive and negative incentives). ఇలాంటి రూల్స్ కాలానుగుణంగా ఆ సమాజ విలువలుగా మారి ఏమాత్రం గతి తప్పని శిలాశాసనాలుగా మిగిలిపోతాయి.
వుదాహరణకి మా కాలేజిలో జరిగిన చిన్న సంగతి చెప్తాను. నేను చదివింది వుత్తర భారత దేశంలో కాబట్టి అక్కడ గోధుమరొట్టెలు ప్రధాన ఆహారం. అన్నం వున్నా అది మన లాంటి దక్షిణ భారతీయులకు, ఒరిస్సా బెంగాలీయులకు మాత్రమే ప్రధాన ఆహారం. అందువల్ల రొట్టెలకు ఎక్కువ డిమాండ్ వుండేది. రొట్టెలు కావాలనుకున్నవాళ్ళు ఒక వరుసలో నిల్చోని తీసుకోవాలి. అన్నం కావాలనుకున్నవారు వెనుకగా వచ్చి తీసుకోవచ్చు. వెనుకగా వచ్చి రొట్టెలు తీసుకోవడం నిషిద్ధం. అలా తీసుకున్నవారికి రూ 50 పరిహారం. ఇలా (రూల్ ప్రకారం) లైన్‌లో వచ్చిన వారికి రొట్టెలు అనే లాభం కలుగగా, లైన్ తప్పినవారికి రూ 50 జరిమానా అనే నష్టం కలిగేది. అందువల్ల అందరూ లైన్‌లోనే వచ్చేవారు.
ఈ కథకి హరిశ్చద్రుడి కథకి సంబంధం ఏమిటా అని ఆలోచించకండి. చివర్లో ఎట్లాగూ నేనే చెప్తాను. అందాకా సావధానంగా వినండి -
ఒక సారి ఒక మిత్రుడు లైను వెనకనుంచి వచ్చి రొట్టెలు తీసుకోబొయ్యాడు. వారించిన వారితో - "కావాలంటే రూ 50 ఫైన్ వేసుకోండి" అంటూ నిర్లక్ష్యంగా చెప్పాడు. దాంతో మరో మిత్రుడు అడ్డుకొని, రూ 50 జరిమానా ఎటూ తప్పదు, కానీ రొట్టెలు మాత్రం తీసుకోనివ్వము అంటూ అడ్డం తిరిగాడు. మిగతావారు "కావాలంటే అన్నం పెట్టుకో మన్నారు" తర్వాత వారి సంభాషణ ఇది -
"అన్నం తింటే నిద్ర వస్తుంది.. నాకు ఇప్పుడు పరీక్ష వుంది.."
"వుంటే..?? నిద్ర వస్తే నిద్ర పో..! లేకపోతే ఏమి తినకుండా వెళ్ళు"
"అప్పుడు ఆకలేస్తుంది.. నేను పడిపోతే, చచ్చిపోతే..?"
"చచ్చిపో.. ఎందుకంటే నువ్వు చచ్చిపోవటం వల్ల మాకు మంచే జరుగుతుంది. లైన్‌లో రావాలనే నిబంధన కోసం ప్రాణాలర్పించిన వీరుడివి అవుతావు. ఆహా ఫలానా వీరుడు లైన్‌లో రావాలి అనే సిధ్ధాంతం కోసం ప్రాణాలే అర్పించాడు అంటే ఆ సిధ్ధాంతం విలువ పెరుగుతుంది.. ఇంక ఎవ్వరూ లైన్ తప్పడం జరగదు.. జరిమానా లేకపోయినా ఈ పధ్ధతి జనంలో జీర్ణిచుకుపోతుంది.." ఇలా అన్నది నా మిత్రుడే. ఇంక ఆ పిల్లాడు అప్పుడే కాదు ఇంకెప్పుడూ లైన్ తప్పి రావటం నేను చూడలేదు.
ఇంతా చెప్పొచ్చేదేమిటంటే - "త్యాగాల వల్ల సిధ్ధాంతం/పద్ధతి విలువ పెరుగుతుంది. ఇప్పుడు చెప్పిన లైన్‌లో రావటం దగ్గర్నుంచి, గాంధీ సత్యాగ్రహ సిధ్ధాంతం వరకు, జైలు శిక్షలు వురి శిక్షల నుంచీ, తీవ్రవాద ఆత్మాహుతి దాడులవరకు - వారు వారు చేసే త్యాగం లేదా పడే కష్టం వారి వారి సమాజాలకు మరింత స్థిరమైన, అభేధ్యమైన విలువలని అందిస్తుంది."
హరిశ్చంద్రుడి కథలో వున్నది కూడా అదే - "సత్యం పలకడం" అనే ఒక్క సిధ్ధాంతం కోసం కష్టాలు పడటం, త్యాగాలు చెయ్యడం వల్ల సత్య సంధత అనే విషయానికి విలువ పెరిగింది. ఇలా కష్టాలు పడుతున్నప్పుడు మాట తప్పడానికి అనేక అవకాశాలు హరిశ్చద్రుడికి కలుగుతాయి. అయినా అతడు నిజాన్ని విడువక వుండగలగటం ఇంకా కష్టం అనిపిస్తుంది - కష్టం ఎక్కువైతే విలువ మరింత పెరుగుతుంది. సత్యంకోసం బిడ్డ చనిపోతే కూడా అబద్ధమాడని హరిశ్చద్రుణ్ణి వింటే మన మనసుల్లో కూడా ఎక్కడో సత్య పలకడమనే సిధ్ధాంతానికి విలువ పెరుగుతుంది. అదే ఈ కథ ప్రచారంలో ప్రధానోద్దేశ్యం.
మనం కూడా చేతనైనంతలో చిన్న వైనా పెద్దవైనా త్యాగాలు చేసి ఇలాంటి విలువల్ని నిలబెట్టాలి. సినిమా మొదలైందని తెలిసినా లైన్‌లో నిలబడే టికెట్ తీసుకుంటే - మీరు త్యాగం చేసిన మొదటి పాట వల్ల లైన్‌లో రావాలనే పధ్ధతికి విలువ పెరుగుతుంది.. తినేసిన శనక్కాయ తొక్కలు, అరటి పండు తొక్కలు చేతిలో పట్టుకోని చత్త బుట్టకోసం వెతికి మరీ దాంట్లో వేస్తే - మీ అవన్నీ మోసుకుంటూ తిరిగటంలో వున్న ఇబ్బంది (Discomfort) కారణంగా చెత్త బుట్టలోనే వెయ్యాలి అన్న పధ్ధతికి విలువ పెరుగుతుంది. కాబట్టీ పెళ్ళాం పిల్లల్ని అమ్ముకున్న హరిశ్చద్రులం కాకపోయినా మన స్థాయిలో త్యాగాలు చేసి సామాజిక విలువల్ని కాపాడాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 వ్యాఖ్య(లు):
good analysis. baaga chepparu.
good one.
చక్కగ చెప్పారు. చివరి పేరాలోని చెప్పినవి ఇప్పటి కాలానికి చాలా అవసరం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి