పనికిరాని ప్రేమలు


యూనివర్సిటీ క్యాంపస్ అంతా గగ్గోలు అయిపోయింది. నిప్పురాజుకున్న అడవిలాగా విషయం మొత్తం పాకింది. జూనియర్ల మొదలు ప్రొఫసర్లదాక, అటెండర్ మొదలు క్యాంటీన్ సర్వర్ దాకా అంతా ఒకటే మాట. అందరిలో ఒకటే ఆశ్చర్యం – “రాజేష్ అంత మాట అన్నాడా?” అని.
“ఏమన్నడేం?” అడిగాడు విషయం తెలియని ఒక సీనియర్.
“మీకు తెలియదా? ప్రేమలు పనికిరానివి అన్నాడు..” చెప్పాడో విషయం తెలిసిన జూనియర్.
“ఛ.. ఛ.. రాజేష్ అలా అనేవాడు కడు... పైగా ప్రేమలో వున్నవాడు... మన క్యాంపస్ లో ఎంతోమంది ప్రేమ జంటల్ని కలిపినవాడు... వాడు అంత మట అన్నాడంటే నేను నమ్మను..” నమ్మకంగా పలికాడు ఒక మిత్రుడు.
“భలేవాడివే... మన జోగినాథన్ లేడూ వాడు చెవులారా విని, ప్రవీణ్ కి చెప్తే వాడు ఆ జువాలజీ గ్యాంగ్ మొత్తానికి ప్రచారం చేశాడు... ఆ జువాలజీ జలజ వుందే ఆ అమ్మాయి చెప్పింది నాకు...” క్లారిఫై చేశాడు మరో మిత్రుడు.
“నేనింకా రాజేష్ ప్రేమలో సిన్సియర్ అనుకున్నాను... ఇప్పటికి తెలిసింది వాడి నిజస్వరూపం” నిష్టూరమాడింది గతంలో రాజేష్ తిరస్కారానికి లోనైన స్వరూప.
“అదంతా సరే... ఈ విషయం మన స్వప్నకి తెలిసిందా అని?” అనుమానం వ్యక్తం చేసింది అవ్యక్త.
స్వప్న పేరు చెప్పగానే క్యాంటీన్ నిశబ్దమైంది. క్లాసురూములు మొత్తం ఖంగారు పడ్డాయి.
“పాపం పిచ్చి పిల్ల... ఎంత ఇదిగా ప్రేమిస్తోందో..” అంది “ఇది” అంటే తెలియని ఓ ఇందువదన.
“అవును దాదాపు క్యాంపస్ మొత్తం తెలుసు వాళ్ళ ప్రేమ గురించి... ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అందరూ దాన్ని ఎలా చూస్తారో కదా?” అంటూ తన అనుభవాన్ని గుర్తుతెచ్చుకుంది మరో కుందరదన.
“ఛీ.. ఛీ.. పవిత్రమైన ప్రేమకి విలువ లేకుండా పోయింది... యూస్ లెస్ మనుషులు... యూస్ అండ్ థ్రో మనసుకులు..” నిరశించాడు ఒక ఛాందసుడు.
“మమతకు కాని కాలం... మనసుకు తీరని శాపం... ప్రేమికుడి తిరస్కారం... ఇదొక విషాద పరిణామం..” నీరశించాడు ఒక ఛందసుడు.
స్వప్న వచ్చింది. క్యాంటీన్ లో తనకీ, రాజేష్ కి ఇష్టమైన టేబుల్ దగ్గర కూర్చుంది. అందరి చూపులు ఆమె పైనే. రాజేష్ అన్న మాట వుంటే ఏమైపోతుందో... బాధపడుతుందో?.. వాడిపైన కత్తికడుతుందో..??
అంతా చుట్టూ మూగారు. కళ్ళతో పొడిచారు. నిట్టూర్పులు విడిచారు. ఏమిటన్నట్లు స్వప్న అడిగిందో లేదో..
“నీకింకా తెలియదా..??”
“అయ్యో ఎలా చెప్పాలీ..”
“రాజేష్ ఏమంటున్నాడో తెలుసా... పనికిరాని ప్రేమలు అంటున్నాడు..”
“నిన్ను నమ్మించి మోసం చేస్తున్నాడు..”
“నీ విలువ తెలుసుకోలేని మూర్ఖుడు..”
స్వప్న నవ్వింది. గట్టిగా నవ్వింది –
“అవును మావి పనికిరాని ప్రేమలే... ఒకరికొకరు ఏదో రకంగా పనికొస్తే అది స్వార్థం అవుతుందికానీ ప్రేమ ఎలా అవుతుంది..? ఒకరి నుంచి ఒకరం ఏమీ ఆశించని మా ప్రేమ నిజంగా పనికిరానిదే.. ఆ విషయం నాకు ఎప్పుడో చెప్పాడు..” అన్నది ఆమె.
రాజేష గట్టిగా నవ్వుకుంటూ వచ్చి ఆమె పక్కన కూర్చోవడంతో యూనివర్సిటీ మొత్తం సునామి తిరిగెళ్ళిన తీరంలా నిశబ్దంగా మిగిలిపోయింది.

(హాస్యానందం మార్చి సంచికలో ప్రచురితం)
Category:

3 వ్యాఖ్య(లు):

More Entertainment చెప్పారు...

hii.. Nice Post Great job. Thanks for sharing.

Best Regarding.

More Entertainment

Padmarpita చెప్పారు...

బాగుందండి:-)

Krishna Chaitanya చెప్పారు...

చాలా బావుంది