మొపాస కథలు: బకరా


ఒక ఎండాకాలంలో కొంతమంది స్నేహితులతో కలిసి వేటాడదామని పికార్డీలో వున్న ఒక ఎస్టేటుకు వెళ్ళాను నేను. అక్కడికి వచ్చిన నా స్నేహితులందరికీ ప్రాక్టికల్ జోక్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి జోక్స్ అంటే ఇష్టంలేని వాళ్ళు ఎవరుంటారులెండి కానీ, వీళ్ళతో నాకు పెద్ద సమస్యే వచ్చి పడింది.

నేను రావటంతోనే నేనేదో యువరాజన్నట్లు ఆహ్వానిస్తున్నప్పుడే నాలో అనుమానం మొదలైంది. నేను రాగానే తుపాకులు గాలిలోకి కాల్చి, నన్ను పొగుడుతూ లోపలి తీసుకెళ్ళినప్పుడే నన్ను బకరా చేసి అందరూ నవ్వుకోబోతున్నారని భయపడ్డాను.

"
ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా వుండు... నిన్ను ఏదో చెయ్యబోతున్నారు" అని నాకు నేనే చెప్పుకున్నాను.
రాత్రి భోజనాలప్పుడు వాళ్ళ నవ్వులూ, ఉత్సాహం చూస్తే కొంచెం ఎక్కువ చేస్తున్నారని అనిపించింది. "చూస్తుంటే ఇక్కడున్నవాళ్ళందరికి కారణంలేకుండానే ఆనందం కలుగుతున్నట్లుంది. ఏదో పెద్ద జోకు ఒకటి ప్లాన్ చేసి వుంటారు. ఆ జోకుకి బలవ్వబోతున్న బకరా ఖచ్చితంగా నేనే. జాగ్రత్తగా వుండాలి" అని మళ్ళీ అనుకున్నాను.

ఆ తరువాత కూడా అందరూ అనవసరమైన విషయాలకి కూడా విపరీతంగా నవ్వడం గమనించాను. ఎక్కడో ప్రాక్టికల్ జోకు పేలబోతోందన్న వాసన పసిగట్టాను నేను. సరిగ్గా వేటాల్సిన జంతువు వునికిని వాసన ద్వారా కుక్క ఎలా పసిగడుతుందో అలా కనిపెట్టానన్నమాట. అయితే ఆ జోకు ఏమైవుంటుందో తెలియలేదు. తెలుసుకోవాలని ఆతృతగానూ, అసహనంగానూ వుంది. వాళ్ళు పలికే ప్రతి పదాన్ని, చెప్పే ప్రతి విషయాన్ని, చేసే ప్రతి చర్యని వదలకుండా గమనిస్తూ వున్నాను. అందరూ అనుమానించతగ్గట్టే కనపడుతున్నారు. ఆఖరుకి అక్కడ వున్న నౌఖర్లను కూడా వదలకుండా అనుమానంగానే చూశాను.

ఇక అందరం పడుకునే సమయం అయ్యింది. అందరూ నాటోపాటే నా గదిదాకా సాగనంపడానికి
వచ్చారు. అందరూ ఎందుకు వచ్చారు? ఏమో?

అండరూ గుడ్ నైట్ చెప్పిన తరువాత నా గదిలోకి అడుగుపెట్టి, తలుపేసి కదలకుండా అక్కడే నిలబడ్డాను. నా చేతిలో క్యాండిల్ వెలుగుతూ వుంది. బయట నుంచి నవ్వులు, గుసగుసలు వినపడుతున్నాయి. చుట్టూ వున్న గోడలని, పైన కప్పుని, గదిలో వున్న సామానునీ, గోడలపైన వున్న పటాలనీ ఆఖరుకి కింద
గచ్చుని కూడా పరిశీలనగా చూశాను. అక్కడ ఏదీ అనుమానాస్పదంగా కనిపించలేదు. బయట మనుషులు తచ్చాడుతున్నట్లు శబ్దాలు వినపడుతున్నాయి. బయట వాళ్ళు తాళం సందులోనుంచి లోపలికి చూస్తున్నారేమో అని అనుమానం వేసింది.

ఉన్నట్టుంది నాకో విషయం స్ఫురించింది. "నా చేతిలొ వున్న కొవ్వొత్తి ఆరిపోతే మొత్తం చీకటైపోతుందేమో"

అందుకే వడివడిగా దగ్గర్లోనే వున్న క్యాండిల్ స్టాండ్ దగ్గరకు వెళ్ళి దాని మీద వున్న కొవ్వొత్తులన్నీ వెలిగించాను. ఆ తరువాత మళ్ళీ పరిసరాలను పరిశీలనగా చూశాను కానీ ఏదీ తేడాగా కనిపించలేడు. గది మొత్తాన్నీ పరిశీలిస్తూ ఒక్కొక్కటిగా చిన్న అడుగులు వేసుకుంటూ గాలించాను. ఎక్కడా ఏమీ లేదు.
ప్రతి చిన్న వస్తువునూ పరిశీలించాను. అయినా ఏం కనపడలేదు. కిటికీ దగ్గరగా వెళ్ళాను. చక్కతో చేసిన షట్టర్ లాంటి తలుపులు తీసే వున్నాయి. నేను అతి జాగ్రత్తగా ఆ కిటికీ తలుపు దించి, వెల్వెట్ కర్టన్లు  మూసేసి వాటి ముందు ఒక కుర్చీ పెట్టాను. ఇక బయట నుంచి ఏదన్నా లోపలికి వస్తుందన్న భయం కూడా
లేకుండాపోయింది.

అక్కడే వున్న కుర్చీలో నేను చాలా జాగ్రత్తగా కూర్చున్నాను. కుర్చీ దృఢంగానే వుంది. మంచం మీద పడుకునేందుకు ధైర్యం చాలలేదు. రాత్రి గడుస్తున్న కొద్దీ నేను అనవసరంగా అనుమానిస్తున్నానేమో అని అనుకున్నాను. ఒకవేళ వాళ్ళు నా మీద నిఘా పెట్టి, వాళ్ళు వేసిన జోక్‌కి నేను బలౌతుంటే నవ్వుకుందామని చూస్తూ వున్నట్లైతే, ఇప్పుడు నేను భయపడి చేస్తున్న పిచ్చి చేష్టలకి ఇంకా విరగబడి నవ్వుతుంటారు కదా అనిపించింది. అంచేత, ఇంక ఏమైతే అది అయ్యిందని మంచం మీదే పడుకోడానికి నిశ్చయించుకున్నాను. కానీ మంచం మీద పద్ధతిగా పరిచిన పరుపుని చూస్తే నాలో అనుమానం మళ్ళీ మొదలైంది. కర్టన్లు తొలగి మళ్ళీ చూశాను.

మొత్తానికి ఎక్కడో ఏదో అపాయం పొంచి వుంది. బహుశా నేను పడుకోగానే నా మీద చల్లటి నీళ్ళు పడేట్లు ఏర్పాటు చేశారేమో. లేకపోతే నేను మంచం మీద వాలగానే పరుపుతో సహా కిందకి పడిపోతానేమో. నాకు గుర్తున్నంతవరకు నేను ఎదుర్కొన్న ప్రాక్టికల్ జోక్స్ అన్నింటిని గుర్తుతెచ్చుకునేందుకు ప్రయత్నం చేశాను. ఈ సారి ఎలాగైనా వాళ్ళకి దొరకిపోకూడదని నా ప్రయత్నం. “దొరకను... ఏమైనా సరే దొరకను గాక దొరకను.”
సరిగ్గా అప్పుడే నన్ను సురక్షితంగా వుంచే ఒక మహత్తరమైన ఆలొచన పుట్టింది. మంచం మీద వున్న పరుపుని ఒక మూల సుతారంగా పట్టుకోని నెమ్మదిగా నా వైపుకి లాగాను. ఆ పరుపుతో పాటు బెడ్ షీట్, దుప్పటి, దిండ్లు కూడా నా వైపు వచ్చేశాయి. వాటన్నింటినీ కిందకు లాగి, ఈడ్చుకుంటూ గది మధ్యలోకి తీసుకెళ్ళి సరిగ్గా తలుపుకి ఎదురుగా వేసుకున్నాను. ఆ తరువాత పక్క సర్దుకొని, ఒకటికి రెండుసార్లు చూసుకోని మంచానికీ, అనుమాస్పదంగా వున్న అన్ని ప్రదేశాలకీ దూరంగా వుందని నిర్థారించుకున్నాను. ఆ తరువాత కొవ్వొత్తులన్నీ ఆర్పేసి, తడుముకుంటూ వచ్చి దుప్పట్లో దూరాను.

దాదాపు ఒక గంటసేపు, ఏ చిన్న చప్పుడైనా అవుతుందేమోనని భయపడుతూ గడిపాను. ఎస్టేటు మొత్తం చడి చప్పుడు లేకుండా వుంది. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను.

చాలా సేపు అలాగే గాఢ నిద్ర పోయినట్లున్నాను. కానీ వున్నట్టుండి బరువైనది ఏదో నా మీద పడ్డట్టూ, అదే సమయంలో నా ముఖం మీద, గుండె మీద, మెడ దగ్గరా ఏదో వేడి వేడి ద్రవం పడ్డట్టు అనిపించి కెవ్వు మని కేకపెట్టాను. అదీ కాక ఏవో స్టీలు గిన్నలు స్టాండుతో సహా కిదపడ్డప్పుడు వచ్చే శబ్దంలాంటిది భయంకరంగా వినిపించడంతో మరింత అదిరిపడ్డాను.

కదులుదామంటే వీలులేకుండా నా మీద వున్న బరువు నన్ను అణగతొక్కేస్తోంది. అసలు నా మీద వున్నదేమిటో తెలుసుకోవాలని నా చేతిని దాని మీద పెట్టాను. ఏదో ముఖం, ముక్కు, మీసాలు లాంటివి తెలుస్తున్నాయి. అంతే నాకున్న బలం అంతా ఉపయోగించి ఆ ముఖం మీద ఒక్కటే ఒక్క గుద్దు గుద్దాను. వెంటనే నన్ను ఎవరో చరిచినట్లుగా అనిపించి, తడిసిపోయిన పరుపుమీద నుంచి ఒక్క గెంతు గెంతి
బయట కారిడార్ లోకి భయంతో పరుగెత్తాను.

బతుకు జీవుడా అనుకుంటూ బయట చూద్దునుకదా - తెల్లగా తెల్లవారి వుంది. అప్పటికే ఈ గోల అంతా విని నా స్నేహితులు మొత్తం అక్కడికి చేరుకున్నాదు. అందరం నా గదిలోకి చూసి ఆశ్చర్యపోయాం. అక్కడ తడిసి, నలిగిపోయి వున్న పరుపు మీద బిత్తర చూపులు చూస్తూ ఆ ఇంటి నౌకరు కనిపించాడు. పాపం అతను నాకొసం వేడి వేడి టీ తయారుచేసుకోని నా గదిలోకి వస్తూ గది మధ్యలో వున్న పరుపుని తట్టుకోని నా మీద పడ్డాడు. అతని చేతిలో టీ నా మీద, అతని మీద పడింది.

నేను ఏ ప్రాక్టికల్ జోకు జరగకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకోని గది మధ్యలో పడుకున్నానో అదే జోకు జరిగి పోయింది. అదీ నేను చేసిన పని వల్లే జరిగింది. ఇంకేం చెప్పమంటారు - రోజంతా పడీ పడీ నవ్వుతూనే వున్నారు నా స్నేహితులు.

(గై డి ముపాస ఫ్రెంచ్ కథకి స్వేఛ్చానువాదం)

(విపుల, డిసెంబర్ 2012)