పురాణం
విశ్వనాధశాస్త్రి అంటే ఆ చుట్టుపక్కల పది పదేహేను వూర్లలో తెలియనివాళ్ళు లేరు.
పురాణం ఆయన ఇంటిపేరు కాదు. ఆ పది పదిహేను గ్రామాల్లో జరిగే జాతర్లకి, సంబరాలకి,
పండగలకి ఆయన పురాణం పెట్టించేవారు. ముఖ్యంగా చైత్రమాసం శ్రీరామనవమి పందిళ్ళలో
సీతాకల్యాణం, భాద్రపదంలో వినాయక
నవరాత్రుళ్ళకి వినాయక విజయం, ఇక ఆశ్వీజమాసంలో దేవీనవరాత్రులకి దేవీ భాగవతం లాంటి
పురాణపఠనం చెయ్యడం వల్ల ఆయన పేరుకు ముందు పురాణం వచ్చి చేరింది. మామూలుగా కాశీపురం
అనే వూర్లో రామాలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ వచ్చీపోయే భక్తులకు ధర్మసూక్ష్మాలు,
జాతక వాస్తు విశేషాలు చెప్తుండాయన. సాయంత్రం అయ్యిందంటే చాలు అదే గుళ్ళో చిన్న
అరుగులా వుంటే ప్రదేశంలో కూర్చిని భాగవతంలో పద్యాలో, భగవద్గీతలో పంక్తులో పాడుతూ
వాటి గురించి విశ్లేషించేవారు.
ఆయన ఉపన్యాస
ధోరణే కొంత విచిత్రంగా వుంటుంది. చెప్పేది ఎంతో లోతైన తాత్విక విషయమైనా చాలా
సరళంగా ఎంతో విశదంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆ ఊర్లో జరుగుతున్న భాగోతాలని భాగవత
కథలతో ముడిపెట్టి చెప్పటంతో క్లిష్టమైన విషయాలను సైతం సులభంగా అర్థం
చేసుకునేవాళ్ళు ఆయన శ్రోతలు.
ఒకరోజు
గోపాల్రావు అనే పెద్దమనిషి సాయంసంధ్యవేళ వచ్చి దర్శనం చేసుకోని వెళ్ళబోతుండగా
శాస్త్రిగారు ఆపారు.
“చిన్న కథ ఒకటి
చెప్పాలనుకుంటున్నాను... వినిపోతావా గోపాల్రావు?” అన్నాడాయన.
“ఏంటి
శాస్తుర్లుగారు... ఈ ఊరికి దేముడు తరువాత దేముడంతవోళ్ళు... మీరు సెప్తానంతే
ఇనకుండా వుంటానా” అంటూ అక్కడే ఒక స్థంభానికి ఆనుకోని కూర్చున్నాడు గోపాల్రావు.
శాస్త్రిగారు సావకాశంగా పూజలు అవీ కానిచ్చుకోని, వచ్చినవాళ్ళకి తీర్థం ఇవ్వడానికి
చిన్న పంతుల్ని నిలబెట్టి తానూ వచ్చి గోపాల్రావు ముందు కూర్చున్నాడు. అప్పటికే
రోజూ శాస్త్రిగారు చెప్పే కథలు వినడానికి వచ్చే నలుగురైదుగ్గురు కూడా వచ్చారు.
శాస్త్రిగారు మొదలుపెట్టారు –
“కురుక్షేత్ర
యుద్ధం జరిగే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా వుండటానికి ఒప్పుకున్నాడు
కదా? ఆ తరువాత ఒక రోజు యిద్ధం జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే అర్జునుడు యధాలాపంగా
అలా అశ్వశాల వద్దకు వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత ఏం చూశాడో తెలుసా?
సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అక్కడ వున్న అర్జునుడి రధాశ్వాలను కడిగి
శుభ్రం చేసి, వాటికి దాణా వేసి నెమ్మదిగా వాటి జూలును నెమరుతూ వాటిని
ఉత్సాహపరుస్తున్నాడట. అది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయి – ’అయ్యో బావా! నీకెందుకీ
శ్రమ? నువ్వు ఎంతటివాడవు? ఈ పని చెయ్యాల్సిన అగత్యం ఏమొచ్చింది?’ అంటూ బాధపడ్డాడట.
దానికి కృష్ణుడు నవ్వి – ’అర్జునా, నీ రథసారధ్యం వహిస్తానని ఒప్పుకున్నాను కదా?
మరి అలాంటప్పుడు అశ్వసంరక్షణ బాధ్యత కూడా సారథిదే కదా? ఏ పనైనా ఒప్పుకున్నప్పుడు
అది శ్రమ అయినా, నచ్చనిదైనా, ఇచ్చిన మాటకోసం నిర్వర్తించడం మన బాధ్యత. అందుకే
ఇదంతా చేస్తున్నాను...’ అని చెప్పాడట ఆ మహానుభావుడు.” అంటూ గోపాల్రావు వైపు చూశారు
శాస్త్రిగారు.
అప్పటికే విషయం
అర్థమైన జనం ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఆ నవ్వుల వెనక అంతరార్థం అర్థం అయ్యి
గోపాల్రావు మొహమాటంతో మెలికలు తిరిగి అక్కడ ఉండలేక లేచి వెళ్ళిపోయాడు. జనంలో
కూర్చున్న ఒక ఆసామి గట్టిగా నవ్వి -
“భలేబాగా బుద్ది
చెప్పారండీ... లేకపోతే ఉపసర్పంచ్ పదవైతే తీసుకున్నాడుకానీ, సర్పంచ్ పదవి రాలేదని
అక్కసుతో ఒక్క పని చెయ్యడూ, ఇంకొకళ్ళని చెయ్యనివ్వడు... ఈ దెబ్బతో బుద్ధిరావాలి
వాడికి” అన్నాడు.
శాస్త్రిగారు
చిన్నగా నవ్వుతూ భాగవతం పుస్తకం తెరుస్తూ –
“మనం ఏం
చెయ్యాలో, ఎలా చెయ్యాలో అన్నీ పురాణాల ద్వారా కథల ద్వారా ఎప్పుడో చెప్పారు మన
పూర్వికులు. ఆ చెప్పిన విషయాన్ని తెలుసుకోని అర్థం చేసుకుంటే మానవ జన్మ
ఎత్తినందుకు ధన్యులం అవగలం...” అని ఆ నాటి పురాణం మొదలుపెట్టారు శాస్త్రిగారు.
***
శాస్త్రిగారికి
ఇద్దరు మగపిల్లలని ఇచ్చి కాలం చేసింది ఆయన భార్య భూలక్ష్మి. పెద్దవాడు జనార్థన్,
రెండొవవాడు అచ్యుత్. జనార్థన్ బాగా చదువుకున్నాడు. ఎల్.ఎల్.బి. చేసి హైదరాబాదులో
లాయరుగా బాగా పేరు సంపాదించుకున్నాడు. బాగా కేసులు పెరిగిపోవటం మూలానేమో ఎప్పుడో
ఒకసారిగానీ కాశీపురం వచ్చేవాడు కాదు. అలాగని తండ్రి మీద, తమ్ముడి మీద ప్రేమ లేదని
కాదు. ఎప్పుడు వచ్చినా పట్నం రారమ్మని ఒకటే బలవంతం చేశేవాడు. శాస్త్రిగారు మాత్రం
నవ్వేసి –
“ఈ ఊరిలో, ఈ
గుడిలో నా బతుకంతా గడిచిందిరా... గుడిని దేవుణ్ణి వదిలిపెడితే, నేను ఈ కట్టెను
వదిలిపెట్టినట్లే” అంటూ వారించేవాడు.
చిన్నవాడు
అచ్యుత్ కి అంతగా చదువబ్బలేదు. తండ్రి దగ్గరే నాలుగు మంత్రాలు, చిన్న చిన్న పూజలు,
పుణ్యఃవాచనం వంటివి నేర్చుకోని ఆ గుడి బాధ్యతలో తండ్రికి ఆసరాగా వుండేవాడు.
“పోనీ అన్నయ్యతో
నువ్వు వెళ్ళు కొన్ని రోజులు వుండిరా నాన్నా... ఈ గుడీ అదీ నేను చూసుకుంటాను కదా.
నువ్వు ప్రయాణం కట్టు” అంటూ తనూ ఒక మాట వేశాడు అచ్యుత్.
“వయస్సు అయిపోయింది... ఇంక ప్రయాణం చేస్తే ఈ
వైష్ణవాలయం నుంచి ఆ శైవక్షేత్రం శ్మశానానికే...” అంటూ నవ్వారు శాస్త్రిగారు.
ఆయన మాట నిజమే
అయ్యింది. జనార్దన్ తిరిగి వెళ్ళిపోయిన నెల రోజులకే మంచానపడ్డాడు.
“మారకం
నడుస్తోందిరా... ఈ పౌర్ణమి చూస్తానో లేదో... ఒక్కసారి పెద్దవాణ్ణి పిలిపించరా”
అన్నాడు ఆయన అచ్యుత్ తో. అచ్యుత్ జనార్దన్ కి ఫోన్ చేశాడు కానీ జనార్దన్ రాలేనని
చెప్పాడు. ఏదో పని వున్నందువల్ల మరో వారం దాకా రానని చెప్పాడు.
“వీలు చేసుకోని
రారా... నీతో మాట్లాడేపని వుంది” అన్నారు శాస్త్రిగారు జనర్దన్ తో ఫోన్ లోనే.
“వీలు
చేసుకుంటానులే నాన్నా” అన్నాడు జనార్దన్. అయితే మరో పదిరోజులు కదలలేని పరిస్థితి
వచ్చింది అతనికి.
ఆ తరువాత మరో
నాలుగు రోజులకి శాస్త్రిగారి మాట పడిపోయింది. మరో రెండు రోజుల తరువాత ఒక సాయంత్రం
సంధ్యావందనం చేస్తున్న అచ్యుత్ ని ఆయన చప్పట్లు కొట్టి పిలిచి, తన భగవద్గీత
పుస్తకం పెద్దవాడికి ఇవ్వమని చెప్పి కొడుకును తనదగ్గరే కూర్చోమని చెప్పాడు.
అచ్యుత్ ఆయన పక్కనే మంచం మీద కూర్చోని తల నెమురుతూ ఉండగా ప్రశాంతంగా కోమాలోకి
వెళ్ళిపోయారు. ఆయన పరిస్థితి అటో ఇటోగా వుందని అర్థం అయిపోయింది అచ్యుత్ కి. అక్కడ
జనార్థన్ బయల్దేరానని ఫోన్ చేశాడు.
సరిగ్గా జనార్థన్
తండ్రి దగ్గరకు వచ్చి “నాన్నా” అని పిలుస్తుండగా ఆయన విన్నట్టుగా తలాడించారు. అంతే
ఆ తరువాత ప్రాణం పొయింది. జనార్ధన్ ఏ మాత్రం చలించలేదు. ఒక్క నిముషం మౌనంగా
కూర్చోని ఆ తరువాత ఏదో యజ్ఞానికి పూనుకున్నవాడిలా లేచి తమ్ముణ్ణి ఓదార్చాడు. బయట
అంబులెన్స్ లో వున్న డాక్టర్ ను పిలిపించాడు. ఆయన, మరో ఇద్దరి సహాయంతో
శాస్త్రిగారిని అంబులెన్స్ లోకి ఎక్కించారు. అప్పటికే విషయం తెలుసుకోని అక్కడికి
చేరుకున్న ఊరి జనం అంతా ఆశ్చర్యంగా జరుగుతున్నది చూశారు.
“ఇంకా
ఎందుకన్నయ్యా అంబులెన్సు? హాస్పిటల్సు? నాన్న ఇక లేడు కదా?” అన్నాడు అచ్యుత్
ఏడుస్తూనే.
“నాన్నని
వైద్యానికి తీసుకెళ్ళటంలేదురా... ఆయన ఆఖరి కోరిక తీర్చడానికి తీసుకెళ్తున్నాను...
మొన్న నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు నాన్న చెప్పారు... ఆయన చనిపోయిన తరువాత ఆయన
శరీరంలో భాగాలను అవసరం అయినవారికి దానం చెయ్యమని...” చెప్పాడు జనార్థన్. ఆ విషయం
వింటూనే భోరున ఏడ్చాడు అచ్యుత్.
బయట జనంలో కలకలం
రేగింది.
“బాబూ...
శాస్త్రులుగారంటే మాకు ఎంత గౌరవమో తమకి తెలియంది కాదు... అట్టాటిది ఆయనకి ఇట్టాటి
గతి పట్టిస్తా వుంటే ఎట్టా వూరుకోమంటారు?” అన్నాడు ఆ వూరి పెద్ద.
“కొడుకుగా ఆయనకి
వైద్యం చేయించడానికి అంబులెన్స్ తెచ్చావనుకున్నాం కానీ, ఇట్టా చేస్తావనుకోలేదయ్యా”
అన్నదో ముసలామె.
“ఎంతో పవిత్రం
బ్రతికిన మనిషాయన... ఆయన శరీరంలో భాగాలు తీసి ఎవరెవరికో పెడతామంటే మేం ఒప్పుకోం”
అన్నాడు మరోకాయన. సరిగ్గా అప్పుడే తండ్రి పెద్దకొడుక్కి ఇమ్మని ఇచ్చిన భగవద్గీత
తెచ్చి జనార్దన్ చేతిలో పెట్టాడు అచ్యుత్. అందులో నుంచి జారిపడిందో ఉత్తరం. దాన్ని
ఆశ్చర్యంగా అందుకోని చదవడం మొదలుపెట్టాడు జనార్దన్.
“ప్రియమైన గ్రామ
ప్రజలకు,
ఎక్కడో పుట్టి
పొట్ట చేతబట్టుకోని ఈ వూరొచ్చిన నాకు ఇన్నాళ్ళుగా ఆసరాగా నిలిచిన ఈ ఊరికి, మీకు
నేను ఎప్పటికీ రుణపడివుంటాను. ఈ రోజుతో నాటకంలో నా పాత్ర ముగిసిపోయింది. నా ఆఖరి
కోరిక గురించి నా పెద్ద కొడుకు మీ అందరికీ చెప్పే వుంటాడు. అవును, నా శరీరభాగాలను
దానం చెయ్యమని చెప్పింది నేనే. ఇప్పుడు వాడు నా కొడుకుగా నా కోరికి తీర్చడమనే
కర్తవ్యపాలనే చేస్తున్నాడు. దయచేసి వాడికి అడ్డురాకండి.
నేను ఇక్కడ
వున్నన్నాళ్ళు మీకు పురాణాల పేరుతో ఎన్నో కథలు చెప్పాను. మీరూ వాటినుంచి ఎన్నో
విషయాలు నేర్చుకున్నారు. కానీ కేవలం మీకు నేర్పించడమే కాదు, మీకు నేర్పించే
క్రమంలో నేను ఏమి నేర్చుకున్నాను అనేది కూడా ఆలోచించాలి. మరి ఇన్ని కథలు చెప్పిన తరువాత
నేను నేర్చుకున్నదేమిటి? ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని వేదాలు చదివినా అవన్నీ
చెప్పేది ఒకటే – పరోపకారం ఇదం శరీరం. ఇప్పుడు నేను చేస్తున్నది అదే.
నన్ను చూడగానే
మీరందరూ శాస్త్రిగారూ అంటారు. మీరు అలా పిలిచేది నా శరీరాన్నా? ఆత్మనా? శరీరాన్ని
అయితే ఇప్పుడు ఆ శరీరం కేవలం ఒక కట్టె. శాస్త్రి అనే ఆత్మ ఆ పరమాత్ముడి సన్నిధిలో
వుంది. శిధిలమైన శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోతుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు
చెప్పినది మీకు అందరికీ చెప్పాను. అలా శిధిలమైన శరీరం మరికరికి పనికివస్తుందంటే
అంతకన్నా కావల్సినది ఏముంది? నేను ఎప్పుడు పురాణం చెప్పినా, పది మందికి ఉపయోగపడే
నీతి చెప్పినా పిట్టకథల ద్వారానే చెప్పాను. ఇప్పుడు నేను చేస్తున్నపని మీరు కథలా
అందరికీ చెప్పండి. దానివల్ల నాలాంటివారు మరికొందరు తయారౌతారు. అదే మనం చెయ్యగలిగిన
పరోపకారం. ఇక శలవు.
ఇట్లు
మీ శ్రేయోభిలాషి
పురాణం విశ్వనాధశాస్త్రి
ఉత్తరం చదవడం
పూర్తిచేసి భగవద్గీతలో పెట్టాడు. అప్రయత్నంగా శాస్త్రిగారు ఎర్రరంగుతో గీతలు గీసి
పెట్టుకున్న పంక్తులను చూసి వాటిని ఆర్తిగా తడుముతూ చదివాడు.
వాసాంసి జీర్ణాని యదా విహాయ; నవాని గృహ్ణాతి నరోపరాణి
తదా శరీరాణి విహాయ జీర్ణాని; అన్యాని సంయాతి నవాని థేహీ
తదా శరీరాణి విహాయ జీర్ణాని; అన్యాని సంయాతి నవాని థేహీ
జనం దారి వదలడంతో
అంబులెన్స్ ముందుకు సాగిపోయింది. గుడిలో గంటలు మోగాయి.
<< ?>>
(జాగృతి - సంక్రాంతి ప్రత్యేక సంచిక 2013)
0 వ్యాఖ్య(లు):
కామెంట్‌ను పోస్ట్ చేయండి