కథానాయకుడి కథ

వెతకగా వెతకగా దొరికాడు నా కథానాయకుడు. నా కథని తన భుజస్కంధాలపైన మోసే ధీరుడు. నాకూ, నా కథకీ శాశ్వతమైన కీర్తిని ప్రసాదించబోయే కల్పతరువు. ప్రపంచ కథకుల మధ్య నాకూ స్థానం కల్పించబోయే నా కామధేనువు. ఎంతగా వెతికాను వీడి కోసం. గవర్నమెంట్ ఆఫీసుల్లో, మధ్యతరగతి ఇళ్ళలో, పూరిగుడిసెల్లో, కల్లుపాకలో, సానికొంపల్లో చివరికి ఇలా... ఇక్కడ ఈ నగరం నడిబొడ్డున రోడ్డుకి అడ్డంగా నైరాశ్యం, నిర్వేదం కలగలిసిన రుషిలా, కఠినమైన తారు రోడ్డుపై సాక్షాత్తు శ్రీమహావిష్ణువులా పవళించి పడివున్నాడు వాడు. వాడే.. వాడే... నా కథానాయకుడు.
ఎవరై వుంటాడు?... ఎవరైతేనేం? వీడి జీవితంలో కష్టాలేమిటో... కన్నీళ్ళేమిటో... వాడి మీద ఈ సమాజం కక్షగట్టి ఎన్నెన్ని పరీక్షలు పెట్టిందో. ఎన్ని కష్టాల గంజినీళ్ళు వీడి ముఖాన కొట్టిందో... అవే.. అవే కావాలి నాకు. నా కథలో కరుణరసం పాతళగంగ పైకి తన్నినట్లు ఉబిఉబికి రావాలి. ఆ కథ చదివిన పాఠకులు కన్నీళ్ళై కరిగిపోయి నా కలానికి సలాములు చెప్పాలి. దీనజన ఆర్తనాదాన్ని విన్న కథకుడినై... “దీనకథాప్రవీణ”, “రోదనకథావిశారద”. నేనే... సన్మానపు దుప్పట్లు, హాలంతా చప్పట్లు. ఓహ్..!! దానికన్నా ముందు వీడి కథేమిటో తెలియాలిగా...!
ఎవరెవరో వస్తున్నారు.. పోతున్నారు. కార్లు, బండ్లు, బస్సులు వాణ్ణి తప్పుకుంటూ, దాటుకుంటూ, రాసుకుంటూ ఎవరినా ఆగితే కదూ..?? అవునూ ట్రాఫిక్ కానిష్టేబుల్ ఒకడుండాలే ఇక్కడ. ఏడీ ఆ నగరరహదారి వాహన చలన నియంత్రణా ధురీణుడు.
“కానిష్టేబుల్... కానిష్టేబుల్... ట్రాఫిక్ కానిష్టేబుల్ ఎక్కడున్నా సరే వెంటనే ఇక్కడికి రావలెను”
“పిలిచారా సార్”
“అవునయ్యా... ఏమిటిలా రోడ్డుని వీధిమీద వదిలేసి ఎక్కడికి పొయ్యావు?”
“టీ తాగుతున్నాను సార్... ఇంతకీ మీరెవరు?”
“ఈ కథ రాస్తున్నవాణ్ణి. కథకుణ్ణి... అద్సరే ఇలా వదిలేసిపోతే ట్రాఫిక్ ఎలా కట్రోల్ అవుతుంది? చెప్పు”


“సార్... ఇది పెద్ద పెద్ద వాళ్ళు వుండే ఏరియా. అంతా చదువుకున్నవాళ్ళు. ఎర్ర రంగు కనిపిస్తే ఆగుతారు, పచ్చ రంగు కనిపిస్తే కదులుతారు. రోడ్డుకు ఎడమపక్కనే నడుస్తారు...”
“చాల్లే ఆపు... ఈ కథ రాస్తున్నవాణ్ణి నేనే అని చెప్పాను కదా... నిజం నిజంగా చెప్పు”
“సరే సార్. ఇక్కడ తిరిగేదంతా బాగా బలిసినవాళ్ళు. ఆపమంటే ఆపరు. ఆపినా పైసా ఇవ్వరు. అందుకే ఆ పక్కసందులోకి వెళ్ళి ఫ్రీగా వచ్చే టీ తాగుతూవున్నా. అయినా వీళ్ళని కంట్రోల్ చెయ్యడం బ్రహ్మతరం కూడా కాదు.”
ఎంత మాట అన్నాడు. వీళ్ళని ఆపడం ఎవరితరం కాదా? ఇన్నిన్ని పాత్రలు సృష్టించే అపరబ్రహ్మని నా తరం కూడా కాదా? ఎందుకు కాదు? అదీ చూద్దాం.
“అన్ని బండ్లు ఇప్పుడే ఇక్కడే ఆగిపోవునుగాక. అందరూ నా కథానాయకుడి చుట్టూ గుంపుగా మూగుగాక.”
బిలబిల వచ్చేశారు జనం. ప్యాంట్లు, పంచెలు, నిక్కర్లు, చీరలు, చుడీదార్లు...
“సార్ సార్... నా కంచిపట్టు చీర గురించి కూడా కాస్త రాయరూ?”
“ఎవరమ్మా నువ్వు?”
“బాగా బతుకుతున్న బంజారాహిల్స్ భామని.”
“నీ చీర సంగతి రాయాలో లేదో నేను చూసుకుంటాను. ముందు ఈ కథానాయకుడి గురించి నీకేమనిపిస్తోందో చెప్పు”
“ఏముంది రైటరుగారూ... ఇలాంటివాళ్ళని ఎంతమందిని చూడలేదు. పగలంతా మందు కొడతాడు. ఇంటికి వెళ్తే పెళ్ళాన్ని కొడతాడు. నాకు తెలియనివా వీళ్ళ బతుకులు”
“అలాగేం? మరి మీ ఆయన?”
“ఆయన మందు కొట్టేది నిజమే. నన్ను కొట్టేది మాత్రం అబద్ధం. మందుకొట్టాక ఆయన చిలక్కొట్టుడుకి గెస్ట్ హౌస్ కి వెళ్తారుగా...” ఆమె చెప్తుండగా తోసుకుంటూ వచ్చాడు ఒక భారీశాల్తీ.
“నువ్వు కాస్త పక్కనుండమ్మా... ఇదుగో రైటరూ... వాణ్ణి అక్కణ్ణుంచి తీసేసినట్లు రాయవయ్యా... అర్జెంటుగా పోవాలి” అన్నాడాయన గసపెడుతూ.

“అలాగే పక్కన పడేద్దాం కానీ ముందు వీడి గురించి ఏమైనా చెప్పండీ, కథ రాసుకోవాలి” అన్నాను.
“ఛీ.. ఛీ... వీళ్ళ గురించా కథ రాస్తారు. ఎందుకండీ అనవసరపు ప్రయాస. ఇంటికెళ్ళి ఏ ఫ్రెంచ్ కథలనో తిప్పిరాసేసి మీ కథేనని చలామణీ చేసుకోవచ్చుగా?”
“ఏదీ మీరు వేరే భాషల సినిమాలు తెలుగులో తీసి అవార్డులు కొట్టాస్తారు అలాగా?”
“అవన్నీ ఎందుకయ్యా ఇప్పుడు... వీడి గురించి నాకేమనిపిస్తోందో చెప్పాలి. అంతే కదా? రాసుకో... వీడి తల్లి దరిద్రపుదై వుంటుంది. తండ్రి తిరుగుబోతు అయ్యుంటాడు. అసలు పిల్లలు వద్దని వీడి తల్లీదండ్రీ అనుకోనే వుంటారు. ఎలానో పుట్టాడు వీడు... ఎలాగేముందిలే. ఆవేశం అణుచుకోలేక చేసిన ఏక్సిడెంట్ లో పుట్టుంటాడు...” గట్టిగా నవ్వాడు.
“మరి ఏం చేద్దాం వీణ్ణి?”
“చెప్పానుగా బతుకుంటే పక్కకు దొర్లించు. పోతే మున్సిస్పాలిటీ వాళ్ళతో ఈడ్పించు...”
“మరీ ఈ రచయితకు దయాజాలీ లేవని అంటారేమో... వేరే ఏదైనా ఆలోచన చెప్పండి” అన్నాను.
“నేను చెప్తాను... నేను చెప్తాను...” అంటూ వచ్చాడు ఒక సూటూబూటు వేసుకున్న పెద్దమనిషి.
“వీణ్ణి పోలీసులకి పట్టించండి. ఖచ్చితంగా వీడు దొంగ అయ్యుంటాడు. మొన్నామధ్య మీరు రాసిన కథలో నా పర్సు ఇదే ఏరియాలో పోయింది కదా...”
“అది నీ పెళ్ళామే తీసిందని చెప్పాను కదా?”
“చాల్లే వూరుకోండి. ఆ కథే బాగాలేదు. వీడే.. వీడే తీశాడని రాయండి. పోలీసులకి పట్టివ్వండి. జైల్లో తోయించి, ఏ మంత్రిగారి రికమండేషనో పెట్టించి, నా పర్సు రికవరన్నా చేయించండి...”
“సరే మీరు చెప్పినట్లే చేద్దాం.. అదిగో పోలీసు ఆఫీసర్ గారు కూడా వచ్చారు... ఆయన్నే అడిగితే సరి...” పోలీసు పేరు చెప్పగానే గుంపులో సగం మంది తప్పుకున్నారు.
“ఏమిటండీ హడావిడి. మీ కథకి ఈ రోడ్డే దొరికిందా?”


“కాదండీ... అదుగో ఆ కుర్రాడు.. నా కథానాయకుడు... వాడు అలా ఎందుకు పడిపోయాడో... ఏమిటో... తెలుసుకోని మీ దగ్గరకే పంపిద్దామని అనుకుంటున్నాము... ఇంతలోనే మీరు వచ్చారు...”
“అంతే కదా... నేను చెప్తాను వినండి. వీడి బతుకంతా చీకటి బతుకైవుంటుంది. తల్లి వేశ్య. అంత మంది అమ్మమొగుళ్ళలో తండ్రి ఎవరో తెలియక, మత్తు మందుకి, డ్రగ్స్ కి అలవాటు పడి, ఆ డబ్బుకోసం దోపిడీలు, హత్యలు చేస్తూ బతుకుతుంటాడు... ఏమంటారు?”
“అనడానికేముంది? బాగా సంపన్నులు వుండే ఏరియాకి ఆఫీసర్ కదా మీరు. సినిమా తారలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలతో మీకు పరిచయాలు. పబ్బులు, డ్రగ్గులు మీకు తెలిసినంత మాకెక్కడ తెలుస్తాయండీ? ఇంతకీ ఏం చేద్దామంటారు వీణ్ణి?”
“ఏదైనా ఒక ఎన్.జీ.వో. వాళ్ళకి అప్పజెప్తే, మంచి మాటలు చెప్పి, వాడి అలవాట్లు మాన్పించి ఒక దారికి తీసుకొస్తారు..”
ఇదేదో బాగానే వున్నట్లు అనిపిస్తోంది నాకు. ఏమంటారు? ఎవరైనా సంఘసేవకుణ్ణి పిలుద్దామా?
“సంఘసేవకుడు గారూ, సంఘసేవకుడు గారూ, సంఘసేవకుడు గారూ”
“జీ హుజూర్... చెప్పండి ఏం చెయ్యాలి...” సంఘసేవకుడుగారు హాజరయ్యారు.
“అదిగో అక్కడ పడున్నాడే... నా కథానాయకుడు... వాణ్ణి తీసుకెళ్ళి. క్షవరం చేయించి, స్నానం చేయించి, వాడి దురలవాట్లన్నీ మాన్పించి వాడి కథేమిటో కనుక్కోని నాకు చెప్పాలి... సరేనా?”
“అబ్బే... మీరు పొరబడుతున్నారు. సమస్య మూలాల్లోకి వెళ్ళాలి మీరు. వీడి సమస్య తల్లిదండ్రులూ కాదూ, నేరప్రవృత్తీకాదు, మత్తు నిషా అంతకన్నా కదు. వీడు ఇలా పడి వుండటానికి కారణం అనారోగ్యం అయ్యింటుంది. ఏదైనా హాస్పిటల్ కి తీసుకెళ్తే ఉపయోగం వుండచ్చు...”
“మరి మీరు...?”
“భలేవారే... నాకెన్ని పనులు... ఫారిన్ నుంచి డబ్బులిచ్చే దాతలొస్తున్నారు... సాయత్రం నాకు సన్మాన కర్యక్రమం... మీరు డాక్టర్ ని పిలవండి చెప్తాను...”
“డాక్టర్... డాక్టర్... డాక్టర్...”

“చెప్పండి. ఏమిటి సమస్య?”
“సమస్య అంటే ఏం లేదండీ... ఇదుగో ఇక్కడ పడున్నాడే కథానాయకుడు. వాణ్ణి మీ ఆసుపత్రికి తీసుకెళ్ళి...”
“ఓకే... ఓకే... నాకు అర్థం అయ్యింది. ముందు బ్లడ్ టెస్ట్ చేయించండి. ఆ తరువాత ఎమ్.ఆర్.ఐ., స్కానింగ్, నాలుగు ఎక్సరేలు... లిపిడ్ ప్రొఫైల్..”
“వీటన్నింటికీ ఖర్చుకాదటండీ?” అన్నాను.
“అవుతుంది. హాస్పిటల్ అంటే మరి వూరికే వైద్యం చేస్తారా? డాక్టర్ చదువంటే ఎంత డబ్బుపెట్టాలో తెలుసా? మరవన్నీ వడ్డీ కట్టి వసూలు చేసుకోవద్దూ...”
“నిజమే. మీరు చెప్పినదాంట్లోనూ పాయంటు వుంది... కనీసం వాడి చెయ్యపట్టుకోని బతికున్నాడో లేదో చూస్తే...”
“మరి నా కన్సల్టేషన్ ఫీజు రెండొందలు...”
“ఏమిటండీ మీ దబాయింపు... నేను రైటర్ ని... ఈ కథ రాస్తున్నదే నేను... మిమ్మల్ని సృష్టించిందే నేను...”
“అలా వచ్చారా... సరే అయితే. నా క్లినిక్ లో హ్యాండ్ వాష్ చేసుకునేందుకు డబ్బా ఒకటుంది. అది తీసుకొచ్చి చూస్తాను... చూశారుగా వాడూ వాడి మడ్డి చేతులూ...” అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్.
“వెళ్ళిపోయాడా... ఇంకేం వస్తాడు... పైసా లేనిదా పసరుకూడా పొయ్యడు మహానుభావుడు...” ఎవరో అన్నారు.
పాత్రలు నా మాట వినడంలేదు... చెయ్యిదాటి, కాగితందాటి, కథని దాటి వెళ్ళిపోతున్నాయి. నా కథానాయకుణ్ణి కూడా దాటిమరీ పోతున్నాయి. “ఎవరైనా చెప్పండయ్యా.... ఏంటి నా కథానాయకుడి పరిస్థితి?”
“అబ్బే ఇలాంటి వాళ్ళ సంగతి పట్టించుకుంటూ కూర్చుంటే మా బతుకులేం కావాలి? పేరుకి పెద్ద రచయితలు... నా మొఖాన ఒక ప్రమోషనో... ఒక ఇంక్రిమెంటో... కనీసం ఒక లాటరీ టికెట్టో రాయలేరుగానీ...” ఒక నీటు క్రాఫు గవర్నమెంటు ఉద్యోగి ఈసడించాడు.
“అయినా వీడు కథానాయకుడేమిటండీ... సంఘానికి పట్టిన చీడపురుగులైతేనూ... నా లాంటి కుర్రవాణ్ణి హీరోగా పెట్టి ఓ ప్రేమ కథ రాసెయ్యకూడదూ...” సలహా విసిరాడో కాలేజీ విద్యార్థి.

“ప్రజాపాలనలో అయిదేళ్ళకోసారి సారా పేకట్టు పధకం పెట్టాం కదా... ఇంకా నిత్యపూజలకి వీధివీధినా వైన్ షాపులు వుండనే వున్నాయి... అయినా ఇలాంటివాళ్ళు పుట్టుకొస్తూనే వున్నారు. ఇంకా ఏం చెయ్యమంటారండీ?” అడిగాడు ఖద్దరుచొక్కా.
ఇవన్నీ కాదు. అసలు కథానాయకుడి కష్టం ఏమిటో తెలుసుకోవాలి కదా. ఆ కష్టంలోనుంచే కదా అసలు కథ పుట్టేది. వాడి దయనీయమైన దరిద్రం గురించి రాస్తేనే కదా నా కథ ఆణిముత్యమయ్యేది. వాడి గురించి చెప్పండిరా అంటే నా పాత్రలన్నీ ఏదేదో వాగుతున్నాయి. పోనీ వాడి ముఖాన సోడా నీళ్ళు కొడితే... తప్పేదేముంది. కథ కావాలంటే ఈ ఒక్క రూపాయి ఖర్చు తప్పేట్టు లేదు.
వాడు లేచాడు. కథానాయకుడు లేచాడు.
“లేచారా? బాబూ కథానాయకుడు గారు... తమరు ఎందుకిలా పడిపోయి వున్నారు? అసలు మీ పేదబ్రతుకులో వున్న కష్టాలేమిటి? నువ్వు పొలం వదిలి పట్నం వచ్చిన రైతువా? పిల్లలు గాలికొదిలేస్తే ఎగురుకొచ్చిన గాలిపటానివా? పిల్ల పెళ్ళికి కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధపడ్డ తండ్రివా? ఎవరు బాబూ నువ్వు? నీ కథ చెప్పవూ?”
“చెప్తానుగానీ... ఇంతకీ మీరెవరండీ?”
“నేనా... భలేవాడివే... ఈ కథ రాస్తున్న రచయితని. నీ బాధల్ని, కష్టాలనీ తెలుసుకోని కథగా అల్లే ప్రయత్నంలో వున్నాను...”
“నేను ఎంతసేపటి నుంచి ఇలా పడి వున్నాను?”
“కథ మొదలైన దగ్గర్నుంచి ఇలాగే పడివున్నావు... మందుగానీ పట్టించావా? ఏ బూర్జువా బియండబ్లూనో గుద్దితే ఇలా పడిపోయావా? చెప్పు బాబు చెప్పు... నా కలం కాగితం సిద్ధంగా వున్నాయి...”
“అంతసేపటి నుంచి పడివుంటే ఇలా చూస్తూ వూరుకున్నారా మీరూ, మీ పాత్రలు...? మీరు రచనలు మానేసి టీవీ జర్నలిష్టుగా చేరండి పైకొస్తారు...”
“అదేంటి బాబూ... అంతమాట అనేశావు... నువ్వు ఎవరివో? ఎందుకు పడిపోయి వున్నావో? అనే కదా చర్చిస్తున్నాము...”


“అయితే వినండి... అప్పుడెప్పుడో దేశం కోసం, స్వతంత్రం కోసం నిరాహారదీక్ష మొదలుపెట్టాను... ఈ మధ్య మళ్ళీ అవినీతి పైన పోరాడుతూ నిరాహారదీక్ష చేశాను... న్యాయం కోసం, నిజమైన నాయకులకోసం నిరాహారదీక్షలు చేస్తున్నాను... శోష వచ్చి పడిపోయానే తప్ప నేను అనుకునేవేవీ జరగడం లేదు... ఇలా ఎన్నాళ్ళు స్పృహలేకుండా వుండాలో నేను అనుకున్నది సాధించడానికి...” అనుకుంటూ వెళ్ళిపోయాడు కథానాయకుడు.
ఛీ... వీడొక కథానాయకుడు. వీడిదొక కథ. ఒక సెంటిమెంటు లేదు. గుండెల్ని పిండే కష్టంలేదు....  పేదరికం లేదు. బీద అరుపులూ లేవు. నా కథ మొత్తాన్ని పాడుచేశాడు. వీడి కథా నేను రాసేది. ఛీ... ఛీ.. రాయనంటే రాయను. అంతే...!!

<< ?>>
’జ్యోతి’ రాఘవయ్యగారి స్మారక ఆహ్లాదకర కథల పోటీలో బహుమతి పొందిన కథ
రచన, జూన్ 2013
Category:

1 వ్యాఖ్య(లు):

sujalaganti చెప్పారు...

బాగు౦ద౦డి స౦ఘ౦లో ఉన్న కుళ్ళును వ్య౦గ ధోరణిలో బాగా చూపి౦చారు.