దాదాపు
పదిహేనేళ్ళ తరువాత అమెరికా నుంచి ఆంధ్రాకి వచ్చాడు అప్పారావు. మనిషి పూర్తిగా
మారిపోయాడు. తల నెరుపు, ముఖంలో వయసు బరువు స్పష్టంగా తెలుస్తున్నాయి. పేరు కూడా
మారిపోయింది. అప్పు. ఆర్. కాక్ అని అక్కడ వ్యవహరించాడట అప్పారావు కాకర్ల. మొదట్నించి
అప్పు అని పిలవటం అలవాటవటం మూలాన కాక్ అనే పేరు చిత్రంగా తోచింది అందరికీ.
అదలా వుంటే
అప్పారావు వూర్లోకి వచ్చాడని తెలిసి అతని బంధువులు, స్నేహితులు అంతా అతని ఇంటికి
బయల్దేరారు. అమెరికా నుంచి వస్తూ వస్తూ అభిమానంతో అందరికోసం బొమ్మలో, ఎలక్ట్రానికి
వస్తువులో, కనీసం అమెరికా చాక్లెట్లో తెచ్చుంటాడని అందరి అభిప్రాయం. ఆశ కూడా.
అప్పారావు ఉరఫ్ అప్పు కూడా అమెరికా నుంచి వస్తూ వస్తూ విమానంలో పర్మిషిన్ ఇచ్చినంత
మేర రకరకాల వస్తువులు తెచ్చాడు. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే అమెరికా వెళ్ళిన
చాలాకాలం తరువాత తిరిగి వచ్చాడు కాబట్టి దగ్గర బంధువులను తప్ప ఇంకెవరినీ
గుర్తుపట్టలేకపోతున్నాడు. అయితే అప్పారావు బాగా తెలివైనవాడు కాబట్టి, ఆ విషయం
బయటపడకుండా జాగ్రత్తపడుతున్నాడు.
“ఏరా అల్లుడూ
బాగున్నావా?” అని ఎవరో అంటే – “అల్లుడు అంటున్నాడు కాబట్టి మామ వరసైవుంటాడు”
అనుకోని
“బాగున్నాను
మామా. మీరెలా వున్నారు” అన్నాడు.
“చూశావా
చూశావా... వాడికి నేనింకా గుర్తే...” అంటూ సంబరపడిపోయాడాయన. అమెరికా పెట్టె తెరిచి
చేతికందిందేదో తీసి – “నీకోసమే తెచ్చాను మామా” అని ఇస్తే ఆయన కన్నీళ్ళ పర్యంతమై
వెళ్ళిపోయాడు.
“ఎవరు ఎవరో
తెలియక ఇబ్బందిగా వుంది” అంటూ తల్లిదండ్రి దగ్గర ప్రస్తావించాడు ఎవరూ లేనప్పుడు.
“అమెరికా వెళితే
మాత్రం బంధుత్వాలు మరిచిపోతే ఎలాగురా?” అంటూ మందలించాడు తండ్రి.
అప్పు వాళ్ళ
అమ్మని దగ్గరుండి ఎవరు ఎవరో చెప్పమని చెప్పాడు కానీ, ఆమె కూడా నొచ్చుకోని “వాళ్ళంతా
నీకోసం వస్తే... నువ్వు మర్చిపోయావని తెలిస్తే బాధపడరట్రా...?” అంది. దానికి
పరిష్కారం కూడా ఆమే చెప్పింది. “వచ్చిన వాళ్ళని నేను ముందు పలకరిస్తాను...
దానిబట్టి నువ్వు నీకు ఏ వరస అవుతారో తెలుసుకోని మాట్లాడు...” అంది.
వినడానికి
సులభంగానే వుంది కానీ అప్పు కష్టం రెండింతలైంది. వాళ్ళ అమ్మకి ఆడపడుచు కొడుకంటే
తనకేమౌతాడో తెలుసుకోడానికి తలప్రాణం తోకకొచ్చింది. ఇహ ఇలా కాదని ఎవరు వచ్చినా నవ్వుతూ “బాగున్నారా? కులాసా?
ఆరోగ్యం ఎలా వుంది?” అంటూ చాలా సురక్షితమైన పలకరింపులు మొదలుపెట్టాడు.
ఇదిలా వుండగా, ఆ
రోజు వూరి బయట పోలేరమ్మ గుళ్ళో జాతర వుందనీ, కొడుకుని తీసుకెళ్ళాలని
తాపత్రయపడ్డారు అతని తల్లీతండ్రి. అయితే అప్పు ప్రయాణపు అలసటలో వున్నాడని
గుర్తించి కొంత వెసులుబాటు కల్పించారు. ఉదయం జరిగే పూజకు వాళ్ళు మాత్రం
వెళ్ళేటట్లు, సాయంత్రం జాతరకు అప్పు కూడా వచ్చేటట్లు ఒప్పుకున్నారు. ఇద్దరూ
బయల్దేరి వెళ్ళారు. అప్పుకి అన్ని జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది వాళ్ళమ్మ.
అప్పు బడలికగా
సోఫాలో కూలబడ్డాడు. అతని భయమల్లా ఒకటే – ఎవరైనా బంధువులో, (పాత)పరిచయస్తులో వస్తే
వాళ్ళు ఎవరో గుర్తుకురాక ఇబ్బందిపడతానేమో అని. అతను అనుకున్నంతా అయ్యింది. సరిగ్గా
సోఫాలో కూర్చున్న చోటే కిందకు జారి ఒక గంట నిద్ర పోయాడోలేదో ఏదో అలికిడి అయ్యి
మెలకువ వచ్చింది.
“ఎవరూ?” అన్నాడు
లేస్తూనే.
వచ్చిన వ్యక్తి
సమాధానం ఇవ్వలేదు సరికదా అప్పు వైపు చిత్రంగా చూస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళలోకి
చూసిన అప్పు ఆ కళ్ళలో ఆనందం కనిపించి ఎవరో బాగా తెలిసినవాళ్ళై వుంటారని అనుకోని
అలవాటైన పలకరింపు మొదలుపెట్టాడు.
“రండి.. రండి...
అక్కడే ఆగిపోయారే? అంతా కులాసానా?” అన్నాడు. అవతలి వ్యక్తి తలూపాడు.
“ఏమిటిలా
తయారయ్యారు? ఆరోగ్యం అదీ సరిగానే వుంది కదా?” అన్నాడు మళ్ళీ. అవతలి వ్యక్తి ఏదో ఒక
సమాధానం చెప్తే, దాని బట్టి బంధుత్వం తెలుసుకోవాలని అప్పు ప్రయత్నం. అవతలి వ్యక్తి
సమాధానం చెప్పకుండా నిలబడ్డాడు.
“కూర్చోండి...”
అంటూ బలవంతంగా కూర్చోబెట్టాడు అప్పు.
“మీకోసం అమెరికా
నుంచి ఇదిగో ఈ వాచి తెచ్చాను” అంటూ అందినదేదో తీసి చేతిలో పెట్టాడు.
“నాకెందుకులే
బాబూ” అన్నాడు అతను.
“భలేవారే...
తీసుకోండి... పిల్లలు ఎలా వున్నారు?” అన్నాడు అప్పు. నిజానికి చీకట్లో రాయి
వేశాడు. సరిగ్గా తగిలింది.
“బాగున్నారు
బాబూ... పెద్దది డిగ్రీ చదువుతోంది, చిన్నాడు స్కూల్ కి వెళ్తున్నాడు...”
అప్పుకి మరో క్లూ
దొరికింది కాబట్టి అల్లుకుపోయాడు. పెట్టెలో నుంచి రెండు చాక్లెట్ ప్యాకెట్లు తీసి-
“పిల్లాడికి..” అంటూ మొహమాటంగా నవ్వాడు. అతను తీసుకున్నాడు. అతన్ని పరిశీలనగా
చూశాడు. వేషధారణ చూస్తే అట్టే డబ్బున్న లక్షణాలు ఏవీ కనిపించలేదు.
“పిల్లల్ని బాగా
చదివించండి. ఏమన్నా ఇబ్బందైతే నాకు చెప్పండి...” అన్నాడు తన తెలివితేటలకి తానే
మురిసిపోతూ. ఆ తరువాత అలాగే మరో పావుగంట మాట్లాడి మరీ పంపించాడు అతన్ని.
అతను వెళ్ళిపోయిన
గంట తరువాత వచ్చారు అమ్మానాన్న. వచ్చిన వ్యక్తి వివరాలు చెప్పాడు అప్పు. అలాంటి
వ్యక్తి ఎవరున్నారా అని ఆలోచించారు కానీ ఎవరికీ అంతుపట్టలేదు. అతను రంగు, పొడుగు,
పోలికలు, బట్టలు అన్నీ చెప్పాడు కానీ ఎవరూ గుర్తుపట్టలేకపోయారు.
తెలిసినవాళ్ళందరినీ వాకబు చేసినా ఫలితం లేదు.
వాళ్ళు ఆ రోజు
సాయంత్రం కల్లుపాక దగ్గరకు వచ్చి వాకబు చేసుంటే విషయం తెలిసేది. అక్కడ ఫుల్లుగా
తాగేసిన గవర్రాజు తన మిత్రుడి దగ్గర మొత్తం చెప్పుకున్నాడు.
“ఏమైనా ఆయన
దొరబాబురా... దొంగతనానికి ఎళితే దగ్గరుండి మర్యాద చేసాడు... పిల్లల సదువులకి
డబ్బులిత్తానన్నాడు... ఇట్టాటోరింట్లో దొంగతనం చెయ్యడానికెళ్ళానని తెగ
ఇదైపోతన్నా.... ఇదే చెప్తన్నా ఇక దొంగతనాలు చెయ్యనుగాక చెయ్యను...” అంటూ
ప్రకటించాడు చిల్లర దొంగతనాలు చేసే గవర్రాజు.
ఆ తరువాత నెలకి
అప్పారావు తిరిగెళ్ళిపోయాడు. ఆ రోజు ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలియని మిస్టరీ
అతని మనసులో మిగిలిపోయింది. వూరు మొత్తానికి గవర్రాజు దొంగతనాలు ఎందుకు మానేసాడనేది
అంతుచిక్కని మిష్టరీగా మిగిలిపోయింది.
<< SS>>
(ఎంప్లాయీస్ వాయిస్, జూన్ 2013)
3 వ్యాఖ్య(లు):
లాభం లేదు గురూ గారు. అంత బావోలేదు మరి, ఏమీ అనుకోకండేం? ఏదో చివర్లో కాస్త క్యూరియాసిటీ పెంచారు కానీ ముగింపు కంపు కొట్టేసింది. అయినా రాయడం ఆపకండి. అనగనగ రాగమతిశయించుచుండు అన్నాడు కదా వేమన? అలాగే మాక్కూడా ఇలాంటివి చదివి చదివి, తినగతినగ వేమ తియ్యనుండు అవుతుందేమో లెండి :-)
బాగుంది..,నాకు తెలిసి చిన్న కధలకి ఇంతకన్న ఎక్కవ ముగింపు ఇవ్వలేరు ఏమో...!
బాగుంది..,నాకు తెలిసి చిన్న కధలకి ఇంతకన్న ఎక్కవ ముగింపు ఇవ్వలేరు ఏమో...!
కామెంట్‌ను పోస్ట్ చేయండి