మొపాస కథలు: అజరామరమైన ప్రేమ

బెట్రాన్స్ దొరగారు తన అతిధులతో కలిసి భోజనాలు పూర్తి చేసిన తరువాత అక్కడే కూర్చోని చర్చ మొదలుపెట్టారు. దీపాల వెలుగులో ఆ బల్ల మీద వున్న పండ్లు పూలు మెరిసిపోతున్నాయి. చర్చ అటుతిరిగి ఇటు తిరిగి ప్రేమ మీదకు మళ్ళడంతో అంతా అత్యుత్సాహంతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఎప్పటికీ తెగని అదే చర్చ – ప్రేమ ఒకసారే కలుగుతుందా లేక ఎన్నిసార్లైనా ప్రేమించడం సాధ్యమా అని. ఒకసారి కన్నా ఎక్కువసార్లు ప్రేమలో పడ్డవారి గురించి ఉదాహరణలు ఇచ్చారు. అవన్నీ మరీ లెక్కలేనన్ని సార్లు ప్రేమలో పడినవారికి సంబంధించినవి. చివరికి అక్కడున్న వారిలో మగవాళ్ళు అంతా కలిసి ప్రేమ ఒక జ్వరం లాంటిదనీ, ఒకసారి వచ్చినంత మాత్రాన మళ్ళీ రాకూడదని నిబంధన ఏదీ లేదనీ తీర్మానించారు. మరీ చంపేసేంత జ్వరం లాంటి ప్రేమ కలిగితే తప్ప ఒక్కటే ప్రేమతో జీవితం గడిచిపోదని అనుకున్నారు. మగవారందరూ తమ తీర్మానానికి తిరుగులేదన్నట్లుగా భావించారు.

అయితే అక్కడున్న ఆడవారి అభిప్రాయం వేరేగా వుంది. వాళ్ళ అభిప్రాయం వ్యవహారికం కాకపోగా కేవలం కావ్యాలలో చెప్పినట్లు నిజమైన ప్రేమ ఒకసారే కలుగుతుంది అంటూ వాదించారు. నిజమైన ప్రేమ ఒక పిడుగుపాటు లాంటిదని అన్నారు. “ఒకసారి పిడుగు పడితే ఆ వేడికి ఏ వస్తువైనా ఎలా దగ్ధమౌతుందో అలాగే ఒకసారి ప్రేమలో పడ్డ మనసు ఆ ప్రేమలో జ్వలించి ఇక వేరే ఏ భావనకి చోటులేని విధంగా తయారౌతుంది” అన్నారు.

ఎన్నో ప్రేమ వ్యవహారాలు నడిపిన బెట్రాన్స్ దొర అందుకు ఒప్పుకోలేదు.

“నేను చెప్పేది వినండి... ఒకే హృదయంతో.. ఒకే మనసుతో అనేకమార్లు ప్రేమలో పడటం సాధ్యమే... మీరు తొలిప్రేమ విఫలమైందని ఆత్మహత్యలు చేసుకున్నవారి ఉదాహరణలు ఇస్తున్నారు. అంటే రెండో ప్రేమకి వాళ్ళు అవకాశం ఇవ్వటంలేదనే కదా అర్థం. ఆ అమరప్రేమికులు తెలివితక్కువగా చచ్చారు కానీ లేకపోతే వాళ్ళకి సరికొత్త ప్రేమ లభించి ఉండేది... ఆ తరువాత మరొకటి లభించేది.. అలా జీవితాంతం జరిగేది కూడా. ప్రేమ ఒక మత్తు పానీయం లాంటిది. ఒకసారి ఆ అనుభవాన్ని రుచి చూస్తే ఇక ప్రేమకి బానిసగా బ్రతకాల్సిందే... అది స్వభావికమైన దేహప్రవృత్తి” అన్నాడాయన.

ఇరువర్గాలవారు తమ వాదనను తీర్చడానికి మధ్యవర్తిగా ఒక వృద్ధుడైన వైద్యుణ్ణి ఎంచుకున్నారు. ఆయన దొరగారి మాటలతో ఏకీభవిస్తూ “అవును ప్రేమించడం చాలా స్వాభావికమైనది” అంటూ కొనసాగించాడు.

“అయితే నాకు తెలిసినంతలో ఒక ప్రేమ వుంది. ఏభై ఐదు సంవత్సరాలు నిరాటంకంగా సాగిన ప్రేమ అది. కేవలం మృత్యువు మాత్రమే ముగించిన ప్రేమ కథ అది” అన్నాడు. దొరగారి భార్య ఆసక్తిగా చేతులు ముడిచి ముందుకు వంగింది.

“ఆహా అద్భుతం... అలాంటి ప్రేమ కలలోనైనా సాధ్యమేనా? చెక్కుచెదరని ఆ ప్రేమామృతంలో యాభై ఐదేళ్ళు వుండగలగడం ఒక అందమైన అనుభూతి కాక ఇంకేమిటి? అంతగా ప్రేమించబడ్డవాళ్ళ జీవితమే ఒక దివ్యవరం అయ్యుంటుంది” అన్నదామె. ఆమె మాటలు విన్న వైద్యుడు నవ్వాడు.

“మీరు పొరపాటు పడ్డారు దొరసాని... నేను చెప్తున్న కథలో ప్రేమించబడినవాడు మీకూ తెలుసు... మన మందులు షాపు నడిపే ఛౌక్యే. ఇక ఆ అమ్మాయి, ఆమె కూడా మీకు తెలిసినదే... మన ఊరికి ప్రతి సంవత్సరం వచ్చి కుర్చీలు అవీ బాగుచేసే మేదరి పిల్ల”
అందరు ఆడవాళ్ళలో ఒక్కసారిగా ఉత్సాహం చప్పబడిపోయింది. అద్భుతమైన ప్రేమకథలో పాత్రలు కేవలం సామాన్యులా అనుకుంటూ కొంతమంది ఉస్సూరన్నారు. అయినా డాక్టర్ గారు ఆపలేదు.

“దాదాపు మూడు నెలల క్రితం నన్ను చావు బతుకుల్లో వున్న ఒక స్త్రీ ఇంటికి పిలిపించారు. ఆ పాతకుర్చీలు బాగుచేసే ఆవిడ దగ్గరకే పిలిపించింది. నా కన్నా ముందే చర్చి ఫాదర్ కూడా వచ్చారు.  ఆవిడ తన వీలునామా నాకు వివరించి, దాని ప్రకారం జరిపించాల్సిన బాధ్యత నాకు అప్పగించింది. ఆ వీలునామాలో విషయాలు వివరించడానికి ఆమె తన కథంతా చెప్పింది. ఆ కథ నన్ను ఎంతగానో కదిలించింది.

ఆమె తల్లిదండ్రులు కూడా ఇలాగే ఊరూరు తిరిగి కుర్చీలను బాగు చేస్తూ పొట్టపోసుకునేవాళ్ళు. అందువల్ల ఈవిడ ఒక ఇంట్లో స్థిరంగా వున్నదే లేదు. చిన్నపిల్లగా వున్నప్పుడు వాళ్ళతో పాటే మట్టికొట్టుకోని, అపరిశుభ్రంగా, ఆకలితో నీరసంగా తిరుగుతూ వుండేది. ఊరూరూ తిరిగేవాళ్ళు. ప్రతి ఊరి పొలిమేరలో వాళ్ళ గుర్రాన్ని, బండిని, పెంపుడు కుక్కనీ, ఈ పిల్లని వదిలేవాళ్ళు. పెద్దవాళ్ళు ఇద్దరూ ఊర్లో నుంచి పాడైపోయిన కుర్చీలను తెచ్చి మరమత్తు చేసుకుంటుంటే ఆ అమ్మాయి అక్కడే గడ్డిలో ఆడుకుంటూ గడిపేది. ఆ కుంటుంబంలో ఎవరూ పెద్దగా మాట్లాడేవాళ్ళు కాదు. “కుర్చీలు రిపేరు చేస్తామమ్మా.. కుర్చీలు..” అని అరవడం తప్ప.

ఎప్పుడన్నా ఆడుతూ ఆడుతూ కాస్త దూరంగా వెళ్ళిందంటే వాళ్ళ నాన్న కోపంగా అరిచే అరుపుతో వెనక్కి వచ్చేది. అంతే తప్ప ప్రేమగా పిలిచే పిలుపు ఏ నాడు వినలేదు. కాస్త వయసు వచ్చాక, విరిగిపోయిన కుర్చీలను మోస్తూ తల్లిదండ్రులకి సాయం చేసేది. ఆ తరువాత ఆ చుట్టుపక్కల వీధుల్లో ఉండే పిల్లలతో స్నేహం చేసింది. అయితే కాళ్ళకు చెప్పులు కూడా లేని మడ్డి పిల్లతో స్నేహం చెయ్యద్దని ఆ పిల్లల తల్లిదండ్రులు కోప్పడేవాళ్ళు. ఆకతాయి మగపిల్లలు ఈ అమ్మాయి మీద రాళ్ళు వేసేవాళ్ళు.
ఒకసారి ఎవరో జాలిపడ్డ తల్లి ఆ పిల్ల చేతికి నాలుగు డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బుని ఎంతో పదిలంగా దాచుకుంది.

ఒకరోజు.. ఆ అమ్మాయికి పదకొండేళ్ళ వయసు వున్నప్పుడు, ఊరి శివార్లలో తిరుగుతుంటే స్మశానం పక్కన ఒక పిల్లాడు ఏడుస్తూ కనిపించాడు. తన స్నేహితుడు తన రెండు గోలీలు తీసుకున్నాడని ఏడుస్తున్నాడు. అతన్ని చూస్తుంటే డబ్బున్న పిల్లాడిలా వున్నాడు. అలాంటి మనుషులకు బాధలే వుండవని నమ్మిన ఈ అమ్మాయిని, ఆ అబ్బాయి కన్నీళ్ళు చాలా ఇబ్బంది పెట్టాయి. అతని దగ్గరగా వెళ్ళి కారణం తెలుసుకోని, తన దగ్గర భద్రంగా దాచుకున్న కాస్త డబ్బు వాడి చేతిలో పోసింది. ఏ మాత్రం మొహమాటం లేకుండా వాటిని తీసుకోని కళ్ళు తుడుచుకున్నాడు పిల్లాడు. పట్టలేని సంతోషంతో ఆ అబ్బాయికి ముద్దు పెట్టిందీ పిల్ల. డబ్బులు లెక్కబెట్టుకునే హడావిడిలో కాదనలేదు అతను. వద్దని చెప్పకపోవటంతో మరింత చొరవగా అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకోని అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది.

పాపం ఆ పిల్ల చిన్న మనసులో ఏముందో.. తన దగ్గర వున్నదంతా ఆ పిల్లాడి ధారపోసినందుకో, లేకపోతే తొలిముద్దు ఆ పిల్లాడికే ఇచ్చినందుకో కారణం ఏదైనా ఆ పిల్లాడి మీద మనసు పారేసుకుంది. అందుకు కారణం మాత్రం ఆ పసి వయసులోనూ తెలియలేదు, వయసు వచ్చినా అర్థం కాలేదు. కొన్ని నెలలు అదే స్మశానాన్ని, మూలగా వున్న సమాధిని పక్కన ఆ పిల్లాణ్ణి ఊహించుకుంటూ కలలు కనేది. అడపదడపా సరుకులు కొనడానికి ఇచ్చిన డబ్బులలోనించో, కుర్చీ రిపేరు డబ్బులలోనుంచో మిగిలిన చిల్లర తల్లిదండ్రుల దగ్గర అడిగి దాచిపెట్టుకునేది. మళ్ళీ ఈసారి స్మశానానం దగ్గరకు వచ్చేసరికి ఆ అమ్మాయి దగ్గర రెండు ఫ్రాంకులు వున్నాయి, కానీ ఆ పిల్లాడే కనిపించలేదు.

ఆ పిల్లాడి తండ్రి నడిపే మందుల షాపు ముందు నుంచి నడుస్తూ కౌంటర్ వెనుక నిలబడి వున్న ఆ పిల్లాణ్ణి చూసింది. అమ్మకానికి పెట్టిన ఒక ఎర్రటి గ్లోబు, నీలం రంగు గ్లోబు మధ్యలో నుంచి కనిపించాడతను. ఆ రంగుల ప్రపంచాలను చూసిన మైమరపులో అతని మీద ఇష్టాన్ని మరింతగా పెంచేసుకుంది. ఆ సన్నివేశాన్ని యధాతధంగా గుర్తు చేసుకుంటూ ఉండటానికి ఇష్టపడేది.

ఆ తరువాత సంవత్సరం స్కూల్ దగ్గర గోలీలాడుతూ మళ్ళీ కనిపించాడా పిల్లాడు. ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడ చుట్టూ చేతులు వేసి గాఢంగా ముద్దు పెట్టింది. దాంతో భయపడిపోయిన పిల్లాడు కేకలు పెట్టాడు. అతని అరుపులు అదుపు చెయ్యడానికి తన దగ్గర వున్న డబ్బు మొత్తం మళ్ళీ అతని చేతిలో పోసింది. మూడున్నర ఫ్రాంకులు.. ఆ పిల్లాడి దృష్టిలో బంగారు గనితో సమానం. చూస్తూ వుండిపోయాడు.

ఆ తరువాత ఆ పిల్ల ఎప్పుడు ముద్దుపెట్టినా వద్దనలేదు కుర్రాడు. నాలుగు సంవత్సరాల పాటు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆ అమ్మాయి తను దాచుకున్న ప్రతి పైసా అతని చేతిలో పోసేది. అందుకు ప్రతిఫలంగా ముద్దులు పెట్టుకోనిచ్చేవాడు పిల్లాడు. ఒకసారి రెండు ఫ్రాంక్లు, మరోసారి ముఫై సౌలు... మరోసారి పన్నెండు సౌలు (ఆ సంవత్సరం ఆదాయం పెద్దగా లేదని బాధతో అవమానంతో కుచించుకుపోతూ వివరించింది).  ఆ తరువాత సంవత్సరం అయిదు ఫ్రాంకులు తీసుకురాగలిగినప్పుడు మాత్రం ఎంతో సంబరంగా, సంతోషంగా అనిపించింది ఆమెకు.

ఆ అమ్మాయికి ఆ అబ్బాయి తెప్ప వేరే ధ్యాసే లేదు. ఆ పిల్లాడు కూడా ఆ అమ్మాయి కోసం ఆతృతతో ఎదురు చూసేవాడు. ఆ అమ్మాయిని కలవడం కోసం తనే ఎదురు పరుగెత్తి వెళ్ళేవాడు. ఇదంతా చూసి ఆ అమ్మాయి గుండె చప్పుడు ఆనందంతో వశం తప్పేది. అయితే ఉన్నట్టుండి ఆ అబ్బాయి అదృశ్యం అయిపోయాడు. బోర్డింగ్ స్కూల్లో వేశారు. ఎంతో జాగ్రత్తగా పరిశోధించి మరీ ఈ విషయాన్ని తెలుసుకుందా అమ్మాయి. ఎంతో చాకచక్యంగా తల్లిదండ్రులతో మాట్లాడి, ఎప్పుడూ వెళ్ళే దారిలో కాకుండా ఆ బోర్డింగ్ స్కూల్ ముందు నుంచి వెళ్ళే విధంగా ఒప్పించింది. దాదాపు సంవత్సరం శ్రమిస్తే కానీ ఆమె అనుకున్నది జరగలేదు. ఈ కారణంగా అతన్ని మళ్ళీ చూడటానికి రెండేళ్ళు పట్టింది. ఈ విరామంలో చాలా మారిపోయి గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాడు. పొడుగొచ్చాడు, మరింత అందంగా కనిపిస్తున్నాడు, ఇత్తడి గుండీలున్న యూనిఫార్మ్ వేసుకోని చాలా హుందాగా వున్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియనట్టే నటించాడు. కనీసం చూడనైనా చూడకుండా వుండిపోయాడు. రెండు రోజులు ఏకధాటిగా ఏడ్చింది. ఇక అప్పటినుంచి ఆమె ప్రేమలో బాధ కలగలిసిపోయింది.

ప్రతి సంవత్సరం అతను ఇంటికి వచ్చేవాడు. ఆమె అతని ముందు నుంచే నడుచుకుంటూ వెళ్ళేది. ఆమె అతని వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేది. అతనైనా ఓ మెట్టుదిగి ఆమె వైపు చూస్తాడా అంటే అదీ లేదు. ఏ మాత్రం ఆశ లేకపోయినా ఆమె అతన్ని ఇంకా పిచ్చిగా ప్రేమిస్తూనే వుంది. ఒకసారి నాతో అన్నది –

“నాకు తెలిసిన పురుషుడు అతనొక్కడే... వేరే ఉన్నారన్న ధ్యాస కూడా నాకు లేదు” అని. అంతగా ప్రేమించింది.
ఆ తరువాత  ఆ పిల్ల తల్లిదండ్రులు చనిపోయారు. కుటుంబవృత్తిని ఆమె కొనసాగించింది.

మరోసారి ఆ వూర్లోకి వెళ్ళి తన హృదయాన్ని చేజార్చుకున్న చోటుకు వెళ్ళింది. మందుల షాపు లో నుంచి ఆ యువకుడు బయటికి వచ్చాడు. అతని భుజాల మీద వాలిపోయి ఎవరో ఒక స్తీ! ఆమె అతని భార్య..!!

ఆ రాత్రి నదిలో దూకిందా పిల్ల. ఎవరో తాగుబోతు అటుగా వెళ్తూ ఆమెను బయటకు లాగి కాపాడే వుద్దేశ్యంతో మందుల షాపు దగ్గరకే తీసుకెళ్ళాడు. షాపు పైన వాటాలోనించి నైట్ డ్రస్ లో వచ్చాడతను. ఆమె ఎవరో గుర్తించకుండానే పైపై ఆఛాదనలు తొలగించి, చేతులతో రుద్ది కాపాడే ప్రయత్నం చేశాడు.

“నీకేమన్నా పిచ్చా... ఇలాంటి పనులు చెయ్యచ్చా?” అంటూ గట్టిగా మందలించాడు. అతని గొంతు ఆమె గుండెల్లో ప్రాణాన్ని నిలిపింది. అతను ఆమెతో మాట్లాడాడు..! ఆమె డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించినా అతను ఒప్పుకోలేదు. ఆమె మాత్రం ఆ తరువాత ఎంతో కాలం ఆనందంగా వుంది.

ఆమె జీవితం అంతా అలాగే గడిపింది. పని చేసేది. ఎప్పుడూ అతని గురించే ఆలోచించేది. అదే మందుల షాపుకు వెళ్ళి మందులు కొనుక్కునేది. అతనితో మాట్లాడటానికి అమెకు అదో ఆస్కారం. ఏదో రూపంలో అతని చేతిలో డబ్బులు ఉంచడానికి అవకాశం.

ఆ తరువాత ఓ చలికాలం సాయంత్రం ఆమె చనిపోయింది. ఈ విషాదమైన ప్రేమ కథ మొత్తం నాకు చెప్పి చివర్లో ఆమె సంపాదించినది మొత్తం ఆమె ప్రేమించిన ఆ వ్యక్తి ఇచ్చే బాధ్యత కూడా అప్పగించింది. తను వున్నా లేకపోయినా అతనికి తన జ్ఞాపకంగా వుండాలని రాత్రింపగళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము అది. అంత్యక్రియల కోసం యాభై ఫ్రాంకులు ప్రీస్ట్ చేతిలో పెట్టాను.

మర్నాడు ఉదయం అతని ఇంటికి వెళ్ళాను. భార్యాభర్త అప్పుడే ఉదయం టిఫిన్లు కానిచ్చి ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చోని వున్నారు. జీవితంలో అన్నీ సాధించినట్లు, ఎంతో గౌరవానికి అర్హులైనట్లు స్థిరంగా వున్నారు. నన్ను ఆహ్వానించి కాఫీ ఇస్తే తీసుకున్నాను. ఆ తరువాత నేను వణుకుతున్న గొంతుతో ఆ కథ చెప్పడం ప్రారంభించాను. ఆ కథ పూర్తయ్యేసరికి వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయని అనుకున్నాను.

“ఎవరూ... ఆ కుర్చీలు బాగుచేసే మేదరి పిల్లా? ఆ దరిద్రపుదేనా?” అన్నాడను తనని ప్రేమించిన అమ్మాయి గురించి వినగానే. తన పేరు, ప్రతిష్ఠ ఆ ఒక్క విషయంతో మంటగలిసిపోయానని అతను భావించాడు. ప్రాణంకన్నా మిన్నగా పదిలంగా చూసుకున్న తన గౌరవమర్యాదలు బూడిదలో కలిసినంతగా బాధపడ్డాడు.

“ఛీ.. ఆ దిక్కుమాలినదా? ఆ బికారా?” అంటూ ఆవేశంగా ఆయాసపడుతూ అరిచింది అతని భార్య.
ఆమె గొప్పదనం ఏ మాత్రం అర్థంకాని అతను లేచి నిలబడి చిన్నగా అడుగులేస్తూ గొణిగాడు.

“మీకో విషయం తెలుసా డాక్టర్ గారూ.. ఆమె బతికుండగానే ఈ విషయం నాకు తెలిసుంటే దాన్ని జైల్లో పెట్టించేవాణ్ణి... మళ్ళీ బయటికిరాకుండా చేసేవాణ్ణి...”

నాకు నోట మాట రాలేదు. ఏం ఆలోచించాలో, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అయినా వచ్చిన పని పూర్తి చెయ్యాలని అనుకున్నాను.

“ఆమె నా పైన ఒక బాధ్యత ఉంచింది.. ఆమె దాచుకున్న సొమ్ము.. దాదాపు మూడు వేల అయిదు వందల ఫ్రాంక్ లు... మీకు ఇవ్వమని చెప్పింది. మీరు ఇప్పుడు చెప్పేదాని బట్టి చూస్తే, ఆ డబ్బు మీద మీకు ఎలాంటి ఆసక్తి లేదనిపిస్తోంది. బహుశా మీరు ఆ డబ్బుని ఏ పేదవాళ్ళకో ఇచ్చేస్తారేమో అనుకుంటున్నాను...”

మెగుడూ పెళ్ళాలు ఇద్దరూ నా వైపు ఆశ్చర్యంతో ఉలుకూ పలుకు లేకుండా చూస్తూ నిలబడిపోయారు. నేను నా జేబులో నుంచి ఆ డబ్బులు మొత్తం బయటికి తీశాను. నలిగిపోయిన డబ్బు.. చిల్లర.. కాగితాలు.. ఆ పిల్ల ఊరూరా తిరిగి సంపాదించి దాచుకున్న డబ్బు...

“ఏం చెయ్యమంటారు వీటిని?” అడిగాను.

అతని భార్యే ముందు తేరుకోని మాట్లాడింది – “పాపం ఆవిడ ఆఖరు కోరిక అని చెప్తున్నారు కదా... కాదని ఎలా అనగలం చెప్పండి?” అంది.

“అవునవును... మనకోసం కాకపోయినా... పిల్లలకైనా ఏదన్నా కొనివ్వడానికి వాడచ్చు...” అన్నాడతను కాస్త మొహమాటంగా.

“మీ ఇష్టం” అన్నాను నేను అభావంగా

“మీ బాధ్యత మీరు నెరవేర్చండి... వాటిని ఏదైనా మంచి పనికే ఉపయోగిస్తాములే..” అన్నాడతను.

ఆ డబ్బు వారి చేతిలో పెట్టి ఒక నమస్కారం చేసి అక్కడి నుంచి బయటపడ్డాను.
ఆ మర్నాడు ఆయనగారు మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు.
“ఆమె బండి కూడా ఒకటి వుంది కదూ... ఏం చేశారు దాన్ని?” అడిగాడు సూటిగా.
“ఏం చెయ్యలేదు.. మీకు కావాలంటే తీసుకోండి”
“అదే.. నాకు కావాలనే అడిగాను..” అని వెళ్ళబోయాడు. నేనతన్ని వెనక్కి పిలిచాను.

“అలాగే ఆమెకు సంబంధించి ఒక ముసలి గుర్రం, రెండు కుక్కలు కూడా వున్నాయి.. మీకేమన్నా కావాలా?” అన్నాను.అతను ఆశ్చర్యంగా నా వైపు చూశాడు.

“నాకా.. అవన్నీ నేనేం చేసుకుంటాను... మీ ఇష్టం వచ్చినట్లు చేసేయండి...” అని నవ్వుతూ నా చేతికి చెయ్యందించాడు. నేను కూడా చెయ్యి అందించి ఊపాను. ఏం చెయ్యగలను చెప్పండి? నేనేమో డాక్టర్ని, అతను మెడికెల్ షాప్ ఓనర్.. అతనితో నాకెందుకు విరోధం అనుకున్నాను. కుక్కలను నేనే ఉంచుకున్నాను. గుర్రాన్ని చర్చికి ఇచ్చేశాను. ఆ బండి మాత్రం ఆయన దగ్గరే వుంది. వచ్చిన డబ్బులతో ఆయనేదో గవర్నమెంటు బాండ్లు కొనుక్కునాడని తెలిసింది... అంతే... అదే నాకు తెలిసిన ప్రేమ కథ... ఒక అజరామరమైన ప్రేమ కథ...!

డాక్టర్ గారు కథ ముగించి తలెత్తి చూశాడు. దొరగారి కంట్లో నీరు. ఆయన గట్టిగా నిట్టూర్చాడు.
“ప్రేమించడం ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు.. అందులో ఏ అనుమానమూ లేదు..” అన్నాడు.


<< ?>>

3 వ్యాఖ్య(లు):

anu చెప్పారు...

కథ బాగుంది సత్యప్రసాద్ గారూ.. కథ చూస్తే అనువాదంలా అనిపించింది.. ఒకవేళ అయితే.. రచయిత పేరు కూడా ఇవ్వండి..

Unknown చెప్పారు...

అనుగారు స్పందనకి ధన్యవాదాలు. ఇది గై ది మొపాస అనే ఫ్రెంచ్ రచయిత రాసిన కథ. శీర్షికలోనే మొపాస కథలు అని రాశాను.

anu చెప్పారు...

శీర్షికే రచయిత పేరని తెలియలేదండి.. అందుకే అడిగాను. Thank you.