“రేపు ఒక కాన్పరెన్స్ కోసం హైదరాబాద్ వస్తున్నాను. కుదిరితే డిన్నర్ కి కలవగలవా?”ఎన్నిసార్లు ఆ మెసెజ్ చూసుకున్నావో లెక్కేలేదు. అందులో ఒక్కొక్క అక్షరం నీలో ఎన్నో జ్ఞాపకాలను కదిలిస్తోంది. అక్కడికి రమణిని మర్చిపోయావని కాదు. గుర్తుకువచ్చేది. నువ్వు రమణిని వద్దనుకున్న కొత్తల్లో చాలా తరచుగా గుర్తుకువచ్చేది. కానీ నీ చదువులు, ఉద్యోగం, పెళ్ళీ వీటన్నింటి మధ్యలో రమణి జ్ఞాపకం ఎక్కడో తప్పిపోయింది. నువ్వు వూరు వెళ్ళినప్పుడో, రమణితో కలిసి చూసిన పాత సినిమాలు టీవీలో చూసినప్పుడో, ఏదో ఒక అర్థరాత్రి కలలో ఆమె కనిపించినప్పుడో ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చి నిన్ను అతలాకుతలం చేసేవి.చిన్నప్పుడు గుడి ముందర ఆడిన ఆటలు - దాగుడు మూతలు దండాకోర్ – పిల్లి వచ్చె ఎలకా భద్రం – ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ సాంబార్ బుడ్డి..ఆ తరువాత ఆటలతో పాటు తోండి చెయ్యడం కూడా నేర్చుకున్న రోజులు. ఇంటికి వచ్చే ముందు చీకట్లో దొంగిలించిన ముద్దులు. ఆటలు ఆడుతూ ఆడుతూ జారిపోయిన బాల్యం. రమణిలో కొత్తగా పూసిన రంగులు, సిగ్గులు. ఆ తరువాత తల్లిదండ్రుల కనుసన్నలలో కట్టడైన తొలి యవ్వనం. తొలిప్రేమ - మొదలు ఎక్కడో తెలియని మనసుల కలయిక. ఒకే బస్సులో కాలేజీ ప్రయాణాలు, ఆ కాలేజీలో ప్రణయాలు. ఒకరికొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పుకొకుండానే, అసలు ఆ విషయం తెలియకుండానే మునిగితేలిన ప్రేమానుభూతులు. ఇవన్నీ కలగాపులగం అయిపోయి ఒక కొలాజ్ లా నిన్ను కుదిపేసేవి.నీ కార్పొరేట్ వుద్యోగంలో, నీ ఉరుకుల పరుగుల జీవితంలొ, నీ సంసార వ్యవహారాల్లో ఎక్కడో తప్పిపోయిన అందమైన కల రమణి. చిన్నప్పటి పుస్తకాలను తిరగేస్తుంటే కనపడే నెమలిపింఛెం లా ఈ మెసేజ్ రూపంలో మళ్ళీ నీ ముందుకి వచ్చింది.కలిసినప్పుడు రమణి అడగబోయే ప్రశ్నలకు నీ దగ్గర జవాబు లేదని నీకు తెలుసు. ఆమె చూసే చూపులను తట్టుకునే శక్తి నీకు వుండదనీ తెలుసు. అయినా వెళ్ళాలి అనుకున్నావు.“తప్పకుండా వస్తాను..” రిప్లై పంపించి మర్నాడు సాయంత్రం కోసం ఎదురుచూస్తూ వున్నావు.***అన్నేళ్ళక్రితం ఎలా వుండేదో అలాగే వుంది. కొంచెం వళ్ళు చేసింది. కళ్ళకు అద్దాలు. ఆమెను చూడగానే నువ్వు కలవరపడటమో, కన్నీళ్ళు పెట్టడమో చెయ్యలేదు. అలా జరగకుండా జాగ్రత్తపడ్డావు. వయసుతో పాటు నీకు మెచ్యూరిటీ వచ్చిందనుకున్నావు. అయినా నీ మనసు మాత్రం పదహారేళ్ళ పసి వయసు వైపు పరుగులు పెడుతోంది. ఆ సంగతి నీకు మాత్రమే తెలుసు.డిన్నర్ చేసినంతసేపు చిన్నప్పుడు ఆడిన ఆటల గురించి, అప్పటి స్నేహాల గురించి సరదాగా మాట్లాడావు. పన్నెండేళ్ళ క్రితం వదిలేసిన కథని కొనసాగించినట్లే వుండాలని నీ ఆశ. అన్నేళ్ళు మీ ఇద్దరి మధ్య నిలిచిన మౌనవారధి ఎప్పుడు కూలిపోయిందో తెలియలేదని సంబరపడ్డావు. ఆమె ఆ ప్రశ్న అడిగే వరకు.“పెళ్ళి చేసుకున్నావా?”ఏ ప్రశ్నకి సమాధానం చెప్పడం నీకు ఇష్టం లేదో అదే ప్రశ్న వేసింది. తలూపావు.“నా సంగతి తెలుసుగా. పెళ్ళి, విడాకులు..!! ఐ యామ్ హాపీ దట్ ఐ యామ్ ఔట్ ఆఫ్ ఇట్..! పీఎచ్.డీ చేశాను. ఇప్పుడు హాయిగా వుంది.” అంది. నీకు ఆమె మాటల్లో వినపడిందంతా ఒక అవకాశం. ఒక ఆహ్వానం మాత్రమే.“ఒంటరితనం నాకు తెలుసు రమణీ. సరోజ చనిపోయి ఐదేళ్ళైంది. ఎండిపోయిన చెట్టులా పడివున్నాను” అంటూ విషాదాన్ని ఒలకబోశావు. ఆమె నుంచి ఎలాంటి సానుభూతి మాటలు లేవు.“అయినా ఫర్లేదు... కార్పొరేట్ వుద్యోగం.. పదవి.. హోదా.. ఏదో ఒక వ్యాపకం కావాలి కదా? మూడు బంగళాలు, నాలుగు ఫ్లాట్లు, కార్లు... జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తున్నాననుకో..” గర్వం గొంతులోకి వచ్చేలా చెప్పావు. ఆమె కళ్ళలలో ఆశ్చర్యమో, ఆరాధనో కనపడాలని నీ తాపత్రయం. ఆమె నవ్వింది.డిన్నర్ పూర్తైంది. నన్ను ఎందుకు వదిలేశావు అని ఆమె నిన్ను అడగలేదు. నువ్వు పెళ్ళి చేసుకోను అని చెప్పిన తరువాత ఆమె ఎంత బాధ పడిందో చెప్పలేదు. అసలేం జరగనట్లే వుంది. పాత స్నేహితుణ్ణి కలిసినట్లే మాట్లాడింది. నీ కారు దాకా వచ్చి నిన్ను సాగనంపి హోటల్ లో తన రూమ్ కి వెళ్ళిపోయింది.***రమణి అడగాల్సిన ప్రశ్నలు అడిగివుంటే నీ దగ్గర సమాధానాలు సిద్ధంగా వున్నాయి. కానీ ఆమె అడగలేదు, నీ సమాధానాలు బయటపడలేదు. సమాధానాలు వున్నాయి. ప్రశ్నలే లేవు.రాత్రంతా కలత నిద్ర. తెల్లవారగానే ఫోన్ చేశావు.“మరో గంటలో బయల్దేరుతున్నాను” చెప్పింది చల్లగా.“నేను వస్తున్నాను. డ్రాప్ చేస్తాను.” అన్నావు చొరవగా.“వద్దు. టాక్సీ బుక్ చేశాను.” అన్నదామె కటువుగా.వొప్పించేదాకా నువ్వూరుకుంటావా?బీయండబ్లూ నడుపుతున్న గర్వం నీ కళ్ళలో వుంది కానీ అది ఎక్కిన ఆనందం ఆమె ముఖంలో కొంచెమైనా లేదు. నీకెందుకో అసహనం.దారిలో చాలా విషయాలు మాట్లాడావు. నీ పెళ్ళి శుభలేఖ ఆమెకి పంపించావని అబద్ధం చెప్పావు.“అందలేదు..” అంది ఆమె.“నీ శుభలేఖ అందింది కానీ రావాలనిపించలేదు” అని చెప్పాలనుకున్నావు. “కుదరలేదు” అని మాత్రం చెప్పగలిగావు. మళ్ళీ మౌనవారధి ఇద్దరి మధ్య.“ఒంటరి బ్రతుకు చాలా దారుణంగా వుంటుంది రమణీ” చెప్పావు. ఆమె విన్నదో లేదో తెలియలేదు. కానీ నువ్వు మాట్లాడటం మాత్రం ఆపలేదు.నీ చుట్టూ వున్న కార్పొరేట్ ప్రపంచం ఎంత నిర్దయగా వుందో చెప్పావు. జ్ఞాపకాలలో శిధిలమైన రమణి స్నేహాన్ని గుర్తించానని చెప్పావు. రమణి ఇప్పుడు నీకు ఎంత అవసరమో చెప్పావు. అయినా ఆమె మాట్లాడలేదు. కనీసం ఏమైనా అడుగుతుందేమో అని నీకు ఆశ. ఆ ప్రశ్నలు సంధిస్తే నీ సమాధానాలు తయారుగా వున్నాయి.ఆమె అడగలేదు. నీ అసహనం తగ్గలేదు. నీకు తెలియకుండానే నీ కళ్ళలో నీరు.ఎయిర్ పోర్ట్ లో కారు ఆపి కిందకు దిగి లగేజ్ దింపావు. ఒక్కసారి ఆమె నిన్ను చిన్నగా హత్తుకుంది.“టచ్ లో వుంటావు కదూ” అన్నావు.ఆమె నవ్వింది.“నువ్వు పూర్తిగా మారిపోయావు రమణీ” అన్నావు.“నువ్వు ఏ మాత్రం మారలేదు ప్రదీప్...” అంది నవ్వి“అంటే?”“నువ్వు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా వున్నాయని నీకు తెలుసు... అవి అడిగే అవసరం లేకుండా చేశావు. నీ గురించి కాకుండా నిన్ను ప్రేమించేవాళ్ళ గురించి ఆలోచించడం నేర్చుకో... బై.” అని చెప్పింది రమణి.“ఫోన్ చేస్తావు కదూ..” అన్నావు వెనకనుంచి.ఆమె నుంచి సమాధానం లేదు.నువ్వు వెనక్కి తిరిగావు. ఆమె ముందుకు సాగిపోయింది.[ *** ]
(సారంగ సాహిత్య వారపత్రిక, 18 సెప్టెంబర్, 2013)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 వ్యాఖ్య(లు):
సర్, చాలాకాలం తరువాత మంచి శైలి దొరికింది చదవటానికి, మీ కథ ఎంతో ఆలోచింప చేస్తుంది, అంతే స్థబ్దతనూ ఇస్తుంది. అద్భుతమైన శైలి పొగద్త కాదు.
కధ మనసుకు హత్తుకునే విధంగా ఉంది. కానీ కధకుడే చెప్పినట్లుగా ఉంటే బాగుండేదని నా ఫీలింగ్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి