ముస్లిం దృక్కోణంలో మనిషి కథలు - (పుస్తక సమీక్ష)

నూరేళ్ళు పైబడ్డ తెలుగు కథ అనేక వాదాలు, ఉద్యమాల మీదుగా ప్రయాణం చేసింది. ప్రముఖంగా గత రెండు మూడు దశాబ్దాలలో స్త్రీవాద, దళితవాద కథలు, ఈ మధ్య కాలంలో మైనారిటీ కథలు విరివిగా వచ్చి తెలుగు కథకు విస్తృతిని పెంచాయి. ఈ తరహా కథలను నేను రెండు రకాలుగా విభజిస్తాను. మొదటిరకం కథలు ఒక వర్గం మరో వర్గం నుంచి ఎదురయ్యే discrimination గురించి తెలియజేసేవి. ఆ రకంగా చూస్తే ప్రతి పేదవాడి తిరుగుబాటు కథ ఇదే కోవలోకి వస్తుంది. పురుషాహంకారాన్ని వ్యతిరేకిస్తూ రాసిన ప్రతి స్త్రీవాద కథా ఇదే కోవలోకి వస్తుంది. బ్రాహ్మనిజాన్ని అధిక్షేపించే ప్రతి దళిత కథ ఇదే కోవలోకి వస్తుంది. ఇక రెండో వర్గం కథలు చూపించే జీవితాలు, వినిపించే వ్యధలు వేరే. ఇవి ఆయా సామాజిక వర్గానికి మాత్రమే చెందిన కొన్ని పార్శ్యాలను చూపిస్తాయి. వారి జీవనవిధానాన్ని, వారికి జీవితాలలో మాత్రమే జరిగే కథలను వినిపిస్తాయి.
ఈ రెండు రకాల కథలకూ వాటి వాటి ప్రయోజనాలు ఉన్నాయి. సాహిత్యంలోనే కాకుండా, సోషయలజీ దృక్కోణంలో చూసినా ఈ రెండు రకాల కథల అవసరం ఉంది. మొదటిది కొంత ధిక్కార ధోరణిని, మరి కొంత తిరుగుబాటు లక్షణాలని ప్రదర్శిస్తూ కొన్ని మౌలికమైన ప్రశ్నలతో సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. రెండో రకం కథ ఆయా సామాజిక, సాంఘిక వర్గాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం ద్వారా రెండు వర్గాల మధ్య సమన్వయానికి దోహదపడుతుంది. నా ఉద్దేశ్యంలో మొదటి రకం కథ రాయడం కన్నా రెండో రకం కథలు రాయటం కష్టమైన పని. అందుకు ఎంతో అవగాహన, ప్రశ్నించే కసితో పాటు మరెంతో సంయమనం అవసరం. అలాంటి సంయమనంతో రాసిన కథలే వేంపల్లి షరీఫ్ రాసిన జుమ్మ లో కనిపిస్తాయి.
నిజానికి ఈ కథలలో అత్యధికం ముస్లిం జీవనానికి సంబంధించినవే అయినప్పటికీ వీటిని కేవలం మైనార్టీ కథలుగా గుర్తించడం ఆ కథల విస్తృతిని కుదింపజేయడమే అవుతుంది. దృక్కోణం ఒక సామాజిక వర్గానిదే అయినా సార్వజనీయమైన ఒక మానవతాంశాన్ని కదిలించి, ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టించగలగడం ఈ కథల ప్రత్యేకత. ప్రతి కథ రాయటంలో ఎంతో శ్రద్ధ, కథాంశంలో ఒక నిబద్దత, అక్షరం అక్షరం వెనుక ఒక తపన స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్లే ఈ కథలు జాతీయస్థాయి గుర్తింపును అందుకోగలిగాయి.
ఈ పుస్తకంలో ఉన్న మొదటి మూడు కథలు పర్దా, జుమ్మా, ఆకుపచ్చ ముగ్గు, తెలుగోళ్ళ దేవుడు కథలను మినహాయించి మిగిలిన కథలలో ముస్లిం పాత్రలను తీసి వేరే ఏ పేరు పెట్టినా కథ మారదు. ఆ మూడింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. మిగిలినవి ఇందాక చెప్పినట్లు సార్వజనీయమైన కథలు. చాపరాయి”, ’జీపొచ్చిందికథలు ముస్లింలకు సంబంధించినవి కావు. నిజానికి రజాక్ మియా సేద్యంకథలో రజాక్ మియాకి, “జీపొచ్చిందికథలో వెంకట్రెడ్డి కి కథ పరంగా చూస్తే పెద్ద తేడా వుండదు. రజాక్ మియాను వేధించింది అంగబలం వున్న వ్యక్తి అయితే, వెంకట్రెడ్డిని వేధించింది సాక్షాత్తూ సర్కారే. కానీ ఒక ముస్లిం సేద్యం చెయ్యాలని ప్రయత్నించడంలో ఒక వేదన వుంది. తరతరాలుగా దర్జీలుగా, మెకానిక్కులుగా వుంటూ తద్ఫలితంగా పేదరికాన్ని అనుభవిస్తున్న ఒక జాతి మొత్తాన్ని అతను ప్రతిబింబిస్తాడు. అలాగే అమ్మమ్మ దగ్గరకు వెళ్ళాలన్న కోరిక తీరక దస్తగిరి చెట్టుచెట్టును అరచేతిలోనే చూసుకోని మొక్కుకునే పిల్లాడు ప్రతి పేదింటిలోనూ కనిపిస్తాడు. ఎవరో అంజనంవేసి చెప్పిన మాట నమ్మి తన బిడ్డ వస్తాడని ఆశగా ఎదురుచూసే జమ్రూత్ లాంటి అమ్మలు అందరికీ తెలిసివాళ్ళే. పలక పండగకోసం పలక కావాలని వేధించే మదారు లాంటి పిల్లలూ మనకి కొత్తకాదు. రూపాయి కోడిపిల్లతో ఆడుకునే అంజాద్ మనందరి బాల్యంలోనూ వున్నాడు.
అలాగని కథకుడు ముస్లింలకి, ముస్లిమేతరులకు మధ్య వున్న వ్యత్యాసాన్ని, ఇతరులలో ముస్లింల పైన వున్న అభిప్రాయాన్ని విస్మరించాడని అనడానికి లేదు. అమ్మమ్మోళ్ల వూరికెళ్తే ఏమొస్తాదిరా నీ బొంద…. ఎక్కడిగైనా ఎళ్లి ఒగ మంచి పదేశం జూసిరాఅనే ఎక్కాల్సారు (దస్తగిరి చెట్టు), “పిల్లాడికి పలకిప్పంచంది బడికి పంపొద్దనిచెప్పే రామకృష్ణ సారు (పలక పండగ), “సాయిబులు మీకెందుకు మామా సేద్యంఅనే అంజిగాడు (రజాక్ మియా సేద్యం) వీళ్ళందరూ ముస్లిం జీవన విధానాన్ని, వారి పేదరికాన్ని విస్మరించారని అంతర్లీనంగా చెప్తూనే వున్నాడు. ఇక తెలుగోళ్ళ దేవుడుకథలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తూ, పరిష్కారానికి అందరూ కలిసి నడవాలని సూచించాడు కూడా.
ఇక ఈ కథా సంకలనానికి తలమానికమైనవి మొదటి మూడు కథలు.
కొడుకు చిన్నప్పుడు పస్తులున్నాడని ఇల్లిల్లూ అడుక్కున్న తల్లి, అదే బిడ్డ పెద్దై గోషా పేరుతో పర్దా కట్టడాన్ని నిరసించే జేజి కథ – “పర్దా”. ఇక్కడ పర్దా కేవలం ముస్లిం సాంప్రదాయానికి సంబంధించినది కాదు. పర్దా మనందరిలో వుండే హిపోక్రసీకి ఒక సింబల్. అందుకే మన చుట్టుపక్కల హిపోక్రసీ కనపడినప్పుడల్లా జేజిఒక దెప్పిపొడుపులా గుర్తొచ్చి తీరుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా జేజి పాత్ర మనకు బాగా పరిచయమైన వ్యక్తి లాగే వుంటుంది. తిరిగే కాలు, తిట్టే నోరుతో రౌడీలా బతికిన జేజి కేవలం చరమాంకంలో కొడుకు, కోడలు పంచన చేరి మాటపడాల్సి రావడం బాధిస్తుంది. ఎన్ని మాటలన్నా పడ్డ జేజి కొడుకు పరువు కోసం సంప్రదాయం ముసుగును పర్దాగా వేస్తానంటే తిరగబడుతుంది. పల్లె పట్నం మధ్య వున్న వ్యత్యాసాన్ని గుర్తించి – “అడుక్కున్నా పర్వాలా.. నేనీడ ఉండలేనుఅని ప్రకటిస్తుంది.
అవకాశం లేకపోయినా ఆశల్ని వదులుకోని జీనత్ అక్క ఆకుపచ్చ ముగ్గులో అబ్బురపరుస్తూనే కలుక్కుమనిపిస్తుంది. హిందువుల ఇంటి ముందు ముగ్గు ముస్లిం చేతి పైన మెహందీ అవుతుంది. రెండు మతాల మధ్య తేడా ఇంతేనా అంటాడు కథకుడు. ఇంత చిన్న వ్యత్యాసాన్ని తెలుసుకోడానికి జీనత్ అక్క చిన్నప్పటి నుంచి ఎన్ని తిట్లు తింటుందో. ఎన్నెన్ని కష్టాలు కొని తెచ్చుకుంటుందో. ఇదంతా ఒక ఎత్తు.. జీనత్ అక్క పట్టుదలతో చెయ్యాలనిపించిన పని చెయ్యగలగడం చూస్తే మనకి ఏదో పర్వతారోహణ చేసిన తృప్తి కలుగుతుంది. అలాంటి అక్క మీద జాలేస్తుంది. ఆమె గుంటపడిన కళ్ళలో కన్నీరవ్వాలనిపిస్తుంది.
ఇక జుమ్మా ఇది జుమ్మా కథే కాదు. అమ్మ కథ కూడా. ప్రతి జుమ్మాకీ మసీదు వెళ్ళాలని కొడుకుని ప్రోత్సహించిన ఓ తల్లి, ఒక శుక్రవారం మసీదులో జరిగిన బాంబు పేళ్ళుళ్ళకి భయపడి – “నువ్వు కానీ మసీదుకు వెళ్ళలేదు కదా నాయనాఅంటుంది. ఆ మాట అనడానికి ఆ తల్లి ఎంత మధనపడి వుంటుందో కదా..! కన్నపేగు కోసం మతాచారాన్నే కాదనాల్సి వచ్చిందని ఆ తల్లి ఎంత తల్లడిల్లి వుంటుందో..!! కలకాలం గుండెల్లో గుబులుగా మిగిలిపోయే కథ.
ఈ కథలు ఇంత బలమైన అనుభూతిని ఇవ్వగలిగాయంటే అందుకు కారణం ఒకటే ఇవన్నీ ప్రతి మనిషికి సంబంధించిన primal emotions తట్టి లేపుతాయి. కాబట్టే ఇవి ఇంత వైశిష్ట్యాన్ని సంతరించుకున్నాయి.
తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
(వేంపల్లి షరీఫ్ కేంద్ర సాహిత్య అకాడమీ వారి యువ సాహితీ పురస్కార గ్రహీత)

పుస్తకం: జుమ్మా
రచన: వేంపల్లి షరీఫ్
ప్రచురణ: సాఫిర్ పభ్లికేషన్స్, వేంపల్లి
వెల: రూ 60
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు, కినిగె

మొపాస కథలు: కేశపాశం

ఆకురాల్చే కాలం. ఎండిన ఆకులు కాళ్ళ కింద పడి చిత్రంగా చప్పుడు చేయాల్సిన రోజులు. కానీ ఆ సంవత్సరం వర్షాలు పడటంతో రాలిన ఎర్రటి ఆకులు పారుతున్న నీళ్ళకింద మునిగి మురిగిపోతున్నాయి. అంతా బాగుంటే వేటాడటానికి అనువైన సమయం. పరిస్థితులు అలా లేకపోవటం వల్ల ఈ కథ బయటకి వచ్చింది.
అడవంతా చిత్తడిగా వుంది. అందులో నుంచి వచ్చే గాలిలో వర్షపు నీటి వాసన, తడిసిన గడ్డి వాసన, తడిమట్టి వాసన కలగలిసి మత్తును కలిగిస్తున్నాయి. వేటగాళ్ళు వర్షం వల్ల ముందుకు వంగి మరీ పరుగెత్తడంతో అలిసిపోతున్నారు. వేట కుక్కలు తమ తోకల్ని కాళ్ళ మధ్యలో ఇరికించుకుంటున్నాయి. వాటి వంటి మీద బొచ్చు తడిసి శరీరానికి అతుక్కుపోతోంది. ఆడవాళ్ళ బట్టలన్నీ తడిసి ముద్దైపోతున్నాయి. ప్రతి సాయంత్రం ఇలాంటి పరిస్థితిలో శరీరం, మనసు రెండూ అలసిపోయి వెనక్కి వస్తున్నారు.
రాత్రి భోజనాలయ్యాక పెద్ద డ్రాయింగ్ రూమ్ లో చేరి అంతా అష్టాచెమ్మ లాంటి ఆటలు అనాసక్తంగా ఆడుతున్నారు. ఇంటి చుట్టూ ఈదురుగాలి ఈల వేసుకుంటూ తిరుగుతోంది. అందరూ ఎప్పుడో చదివిన కథలను చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆసక్తికరమైన కథలు ఎవరూ ఊహించలేకపోయారు. వేటగాళ్ళు వేటాడటంలో నైపుణ్యం గురించి, కుందేళ్ళని కొట్టడం గురించి చెప్పారు. ఆడవాళ్ళు తమ మనసులోని ఊహల్ని కదిలించాలని విశ్వప్రయత్నం చేశారు కానీ ఏ అద్భుతగాథలు బయటికి రాలేదు. ఇక కథలు చెప్పుకోవడం ఆపేద్దామని అంతా అనుకుంటున్నారు. అక్కడే ఓ పడుచుపిల్ల ఒక ముసలామె పక్కన కూర్చోని ఆమె చేతిని నెమురుతూ వుంది. అనుకోకుండా ఆ ముసలామె చేతికి వున్న ఉంగరం ఈ పిల్ల కంటబడింది. గోధుమరంగు జుట్టుతో తయారు చేసిన ఉంగరం అది. ఆ ఉంగరాన్ని చాలా సార్లు చూసింది కానీ ఎప్పుడూ అంత ప్రాధాన్యత ఇవ్వలేదు.
దానిని సుతారంగా తాకుతూ – “ఆంటీ, ఇదేం ఉంగరం? చూస్తుంటే ఈ జుట్టు చిన్నపిల్లలది లాగా వుందే?” అంది.
ఆ పెద్దామె కాస్త సిగ్గుపడింది, ఆ తరువాత ఆమె ముఖం పాలిపోయింది. వణుకుతున్న గొంతుతో సమాధానం చెప్పింది –
“బాధేస్తుంది. ఆ విషయం గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా చాలా బాధేస్తుంది. నా జీవితంలో వున్న విషాదమంతా అక్కడే గూడు కట్టుకోని వుంది. ఆ సంఘటన జరిగినప్పుడు నేను యవ్వనంలో వున్నాను. అవి ఎంత బాధాకరమైన జ్ఞాపకాలంటే, ఈ రోజు దాకా వాటిని తల్చుకోని ఏడవని రోజు లేదు.”
అందరికీ ఆ కథేమిటో తెలుసుకోవలన్న ఆసక్తి కలిగింది. కానీ ఆ ముసలామె చెప్పనంటే చెప్పనంది. చాలాసేపు బ్రతిమాలాడిన తరువాత చెప్పడానికి ఒప్పుకుంది. ఇదీ ఆ కథ:
“నేను ఎప్పుడూ చెప్తుంటాను చూశారూ సాంతీజ్ కుటుంబం ఒకటి వుండేదని, ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరూ లేరని.. ఆ కుటుంబంలోని చివరి ముగ్గురు మగవాళ్ళూ నాకు తెలుసు. ముగ్గురూ ఒకే విధంగా చనిపోయారు. ఈ జుట్టు ఆ ఆఖరువాడిది. వాడు నాకోసం ప్రాణాలు వదిలినప్పుడు వాడికి పదమూడేళ్ళు. చిత్రంగా అనిపిస్తోంది కదూ?
“చిత్రమే మరి. ఆ కుటుంబమే అంత. మీరు పిచ్చి అని కూడా అనుకోవచ్చు. కానీ అదో అద్భుతమైన పిచ్చిదనం. ప్రేమ అనే పిచ్చిదనం. తండ్రీ అంతే కొడుకూ అంతే. వాళ్ళ శరీరం నిండా ఒకలాంటి తపన వుండేది. అనూహ్యమైన పనులు చేసేందుకు అదే పురిగొల్పేది. పిచ్చిపట్టినట్లే ఆవేశం ఫూనేది. ఆఖరుకు ఎంత ఘోరమైనా చేయడానికైనా వెనకాడేవారు కాదు. కొంత మందికి పుట్టుకతోనే భగవంతుడి మీద భక్తి కలిగినట్లే వీళ్ళకి ఈ పిచ్చి ఆవేశం కలిగింది. వల పన్ని వేటాడే వేటాగాడికి, వాడి వెనకే నడిచే అనుచరుడికీ తేడా వుండదూ? అలాగే ఇది కూడా. అందుకే మన ప్రాంతంలో అంటుంటారు - వుంటే సాంతీజ్ కుటుంబం లాగా కోరికతో రగులుతూ వుండాలని. వాళ్ళని చూస్తేనే ఆ విషయం తెలిసిపోతుంది. వాళ్ళ జుట్టు కనుబొమ్మల మీద పడి గాలికి నిర్లక్ష్యంగా ఊగుతుంటుంది. గిరజాల గడ్డం, పెద్ద పెద్ద కళ్ళు ... ఆ కళ్ళే..!  సూటిగా మనిషి లోపలికి దిగబడి, కదిలించే చూపు. అలా ఎందుకు జరిగుతోందో తెలియకుండానే జరిగిపోయేది.
“ఇదిగో ఇలా ఉంగరంగా మారిన జుట్టు ఓ పిల్లవాడిదని చెప్పాను కదా, ఆ పిల్లవాడి తాత దగ్గర కథ మొదలైంది. ఆయన జ్ఞాపకంగా ఇదొక్కటే మిగిలింది. ఆయన చాలా కాలం సాహసాలనీ, మల్ల యుద్దాలనీ ఎక్కడెక్కడో తిరిగాడు. ఎవరెవరినో లేపుకుపోయాడు. అరవై అయిదేళ్ళ వయసొచ్చాక ఓ రైతు కూతురి మీద ప్రేమలో పడ్డాడు. నాకు ఇద్దరూ తెలుసు. ఆమె తెల్లగా, ఎర్రటి జుట్టుతో ప్రత్యేకంగా కనిపించేది. మంచి గొంతు, చక్కని మాట తీరుతో ఎంత పొందిగ్గా వుండేదంటే ఎవరైనా చూసి ఆమే మడోనా అని పొరపాటు పడేవాళ్ళు. ఈ పెద్దాయన ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళాడు. పూర్తిగా ఆమెతో మమేకం అయిపోయాడు. ఇక ఆ అమ్మాయిని వదిలి నిముషం కూడా వుండలేని పరిస్థితికి వచ్చాడు. దూరంగా ఎక్కడో పట్నంలో వుండే ఆయన కూతురు, కోడలు కూడా ఆ విషయాన్ని తప్పు పట్టలేదు. అదంతా చాలా సాధారణమైన విషయంలానే తోచింది వాళ్ళకి. ఆ కుటుంబంలో ప్రేమ ఒక ఆచారం అన్నట్లుండేది. ఇలాంటి మోహం చూసినా వాళ్ళకి ఎలాంటి ఆశ్చర్యమూ కలిగేది కాదు. విడిపోయిన ప్రేమికుల గురించో, ప్రేమలో ద్రోహం గురించో, ఆ తరువాత జరిగే ప్రతీకారం గురించో ఎవరైనా వచ్చి చెబితే కూడా అంతగా స్పందించేవాళ్ళు కాదు. “ఆ స్థితికి చేరుకున్నారంటే ఎంత వేదనని అనుభవించారో” అని సానుభూతి చూపించేవారు. ప్రేమ తాలూకు విషాదాలను అనుభవించి బాధపడేవాళ్ళే తప్ప కోపగించుకునేవాళ్ళు కాదు.
“ఇదిలాగుండగానే ఓ రోజు మాన్సియర్ ది గ్రాడెల్లీ అనే పెద్దమనిషిని ఆ ప్రాంతంలో వేటాడటానికి పిలిపించారు. ఈ అమ్మాయి అతనితో లేచిపోయింది.
“సాంతీజ్ పెద్దాయన ఏమీ జరగనట్లే ప్రశాంతంగా కనిపించాడు. ఏం లాభం? ఓ రోజు పొద్దున్నే కుక్కల కోసం కట్టిన చిన్న గదిలో ఉరిపోసుకోని కనపడ్డాడు.
“అతని కొడుకూ అలాగే చనిపోయాడు. 1841లో ప్యారిస్ కి వెళ్ళి అక్కడ ఓ ఒపేరా గాయని మోసం చేసిందని హోటల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
“అప్పటికే అతనికి ఓ పన్నెండేళ్ళ కొడుకు. అతని భార్య మా వైపు బంధువులామే. అప్పుడు మేము బెర్టిలాన్ లో వుండేవాళ్ళం. ఆ పిల్లాణ్ణి తీసుకోని ఆమె మా ఇంటికి వచ్చేసింది. అప్పటికి నా వయసు పదిహేడేళ్ళు.
“చెప్తే నమ్మవు కానీ ఆ పిల్లాడు అప్పటికే పెద్ద ఆరిందలా వుండేవాడు. ఆ కుటుంబంలో అందరి నాజూకుతనమూ, గొప్పదనం మొత్తం ఈ పిల్లడికి పోతపోసినట్లు వుండేది. ఎప్పుడూ ఏదో కల కంటున్నట్లు, అడవికి వెళ్ళే దారుల్లో ఎత్తైన చెట్ల మధ్య ఒంటరిగా నడుస్తుండేవాడు. నేను కిటికీలోంచి గమనించేదాన్ని. తల వంచి, చేతుల్ని వెనక్కి పెట్టుకోని ఆచి తూచి అడుగులేస్తూ నడిచేవాడు. అప్పుడప్పుడు ఆగి కళ్ళు పైకెత్తి చూసేవాడు. ఆ వయసులో అర్థంకాని విషయాలన్నీ క్షుణ్ణంగా అర్థమైనట్లు ప్రవర్తించేవాడు.
“రాత్రిపూట భోజనాలు అయిపోయాక నా దగ్గరకు వచ్చేవాడు.
“పద అలా బయటికి వెళ్ళి కాసిన్ని కలలుకందాం” అనేవాడు. ఇద్దరం దగ్గర్లో వున్న పార్కుకు వెళ్ళేవాళ్ళం. చంద్రుడు ప్రసరించే వెలుగు చెట్లపైన దీపాల్లా పరుచుకునే చోట అతను ఉన్నట్లుండి ఆగిపోయేవాడు. నా చేతిని మృదువుగా నొక్కుతూ –“చూడు చూడు..!! నేను చెప్పినా నీకు అర్థం కాదేమోలే.. నేను ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నాను. నీకు కూడా అర్థం అయితే ఇద్దరం సంతోషంగా వుండచ్చు. ప్రేమలో పడితే కానీ అర్థం కాదేమోలే..” అనేవాడు. వాడికి నా మీద వున్న ప్రేమ చూసి ముచ్చటేసి ముద్దు పెట్టుకోని నవ్వేసేదాన్ని.
“ఒకోసారి భోజనం తరువాత మా అమ్మ మోకాళ్ళమీద కూర్చోని – “ఆంటీ నాకు మంచి ప్రేమ కథలు చెప్పవూ” అని అడిగేవాడు. వాడు హాస్యమాడుతున్నాడని అనుకోని అమ్మ నవ్వేసేది. వాణ్ణి కూర్చోపెట్టి వాడి తాత ముత్తాల కథలు చెప్పేది. ప్రేమ మత్తులో వాళ్ళు చేసిన సాహసాలు చెప్పేది. అందులో నిజాలకి కాస్త కల్పన జోడించేది. వాళ్ళందరూ ప్రేమ సాహసాల చేయడం వల్లనే గతించారు. ఆ ప్రేమ కోసం చేసిన సాహసాలలోనే వాళ్ళకి గుర్తింపు, ఆ కుటుంబానికి విలువ వున్నాయని నమ్మారు.
“ఓ వైపు ఆహ్లాదకరంగా అనిపిస్తూనే మరో వైపు భీభత్సరసం నింపుకున్నట్లు కనిపించే ఆ ప్రేమ కథలు విని ఈ పిల్లాడు ఉత్తేజితుడయ్యేవాడు. చప్పట్లు కొట్టేవాడు. కన్నీళ్ళు కార్చేవాడు.
“నాక్కూడా ప్రేమించడం తెలుసు. వాళ్ళందరికన్నా గొప్పగా ప్రేమించగలను” అనేవాడు.
“అప్పటి నుంచి నా మీద ఎంతో ప్రేమ కురిపించేవాడు. అది ఎంతో సుతారమైన, సుకుమారమైన ప్రేమ. అందరికీ అదో సరదా సన్నివేశం. పకపక నవ్వేవాళ్ళు. పొద్దున్నే పూలు ఏరుకొచ్చి నా చేతికి ఇచ్చేవాడు. రాత్రిళ్ళు నిద్రపోయే ముందు నా చేతిని ముద్దు పెట్టుకొన్ని సన్నని గొంతులో “ఐ లవ్ యూ” అనేవాడు.
“నేను చేసింది కూడా తప్పే. చాలే పెద్ద తప్పు. అందుకే ఇప్పటికీ అది తలుచుకోని బాధ పడుతుంటాను. నాకు నేనే జీవితాంతం శిక్ష వేసుకున్నాను. ఇదిగో ఇలా ఎవరినీ పెళ్ళి చేసుకోకుండా కన్యగా.. కాదు కాదు అతని విధవగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను.
“వాడి ప్రేమని ఓ చిన్న పిల్లవాడి అమాయకపు చేష్ట అనే అనుకున్నాను. వాడు అలా చేయడానికి నేనూ దోహదపడ్డాను. ప్రేమించినవాడు ఒక మగవాడు అన్నట్లే ప్రవర్తించాను. కాస్త ప్రేరేపించాను. ఓకోసారి వాడితో కటువుగా వున్నా మరోసారి వాడితో సరసాలాడాను. వాడలా పిచ్చివాడు కావటానికి నేనే కారణం. నాకదో ఆటలా వుండేది. ఆ ఆట వాడి తల్లికి, నాకు జరిగిపోయిన విషాదం నుంచి కాస్త తెరిపినిచ్చేది. నువ్వే చెప్పు – పన్నేండేళ్ళు వాడికి. ఆ పసివాడి ప్రేమలో నిజంగానే అంత గాఢత వుందని ఎవరు మాత్రం ఊహించగలరు? వాడు అడిగినప్పుడల్లా ముద్దులు పెట్టాను. కాగితాల మీద ఏవో ముద్దు మాటలు రాసిచ్చేదాన్ని. నేను రాసింది మా ఇద్దరి అమ్మలూ చదివేవారు కూడా. వాడు మాత్రం ఎంతో శ్రద్దగా ఉత్తరాలు రాసేవాడు. అవన్నీ దాచుకునేదాన్ని. వాడికేమో ఇదంతా ఓ రహస్యం అని అనిపించేది. వాడి వంశంలో వున్న శాపం సంగతి మాకెవ్వరికీ గుర్తులేదు.
“దాదాపు సంవత్సరం ఇలాగే గడిచింది. ఓ సాయంత్రం పార్కులో వున్నప్పుడు వాడు నా కాళ్ళ దగ్గర కూర్చోని పిచ్చి పట్టినట్లు నా గౌను అంచుల్ని ముద్దులు పెట్టుకున్నాడు.
“ఐ లవ్ యూ... నేను నిన్ను ప్రేమిస్తున్నాను...” అని పదే పదే అన్నాడు. “నువ్వు నన్ను మోసం చేశావో... నన్ను కాదని ఇంకెవరితోనైనా వెళ్ళిపోయావో, మా నాన్న చేసిన పనే చేస్తాను. తెలుసుగా మా నాన్న ఏం చేశాడో?” అన్నాడు. వాడు గొంతులో స్థిరత్వం చూస్తే భయం వేసింది. చివరిగా వాడన్న మాట నా నరనరాల్లో వణుకు పుట్టించింది.
“నేను భయంతో లేచి కొయ్యబారిపోయి నిలబడ్డాను. వాడు కూడా లేచి నాకేదో చెప్పాలని, నా ఎత్తుని అందుకోడానికి మునికాళ్ళు పైకెత్తి నా చెవి దగ్గర నా పేరు పలికాడు. “జెనివైవీ”. మంద్రమైన ఆ గొంతులో వున్న కమ్మదనం, తీయదనం నాలో భయోత్పాతంగా మారింది.
“పద ఇంటికి వెళ్దాం.. పద వెళ్దాం” అన్నాను వణుకుతూనే.
“వాడు ఇంకేమీ మాట్లాడలేదు. నా వెనుకే ఇంటిదాకా నడిచాడు. మెట్లెక్కుతున్నప్పుడు నన్ను ఆపాడు.
“నువ్వు నన్ను కాదని వెళ్ళిపోతే నేనే వుండను. చచ్చిపోతాను” అన్నాడు.
“విషయం చెయ్యి దాటిపోయిందని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి నుంచి వాడితో ముభావంగా వున్నాను. వాడికిది ఎంతమాత్రం నచ్చలేదు. అడిగితే చెప్పాను – “నీతో సరదాగా ఉండేందుకు నువ్వు చిన్న పిల్లాడివీ కాదు, సరసంగా వుండేందుకు పెద్దవాడివీ కాదు. కొంత కాలం ఆగితే మంచిది”
“సమస్య అక్కడితో తీరిపోతుందని అనుకున్నాను. ఆ తరువాత ఎండాకాలం అయిపోగానే వాణ్ణి హాస్టల్ లో వేశారు. ఆ తరువాత సంవత్సరం శెలవలకి వాడు వచ్చేసరికి నా పెళ్ళికి నిశ్చితార్థం అయ్యి వుంది. వాడికి వెంటనే విషయం అర్థం అయిపోయింది. మరో వారం దాకా ముభావంగా ఉండిపోయాడు. నాలో ఆదుర్దా ఎక్కువైంది.
“వాడు వచ్చిన తొమ్మిదోరోజు నా గది తలుపు దగ్గర ఓ చిన్న కాగితం కనపడింది. ఒక్క ఉదుటున దాన్ని అందుకోని గబగబా తెరిచి చదివాను – “నువ్వు నన్ను కాదన్నావు. నేను చెప్పింది నీకు గుర్తుందిగా. నాకు చావు తప్ప వేరే మార్గం లేని స్థితిలోకి నువ్వే నెట్టావు. అందుకని వేరే ఎవరో వచ్చి నన్ను కనుక్కోవటం నాకిష్టంలేదు. పార్కులో పోయినేడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన చోటికి వచ్చి చూడు”
“నాకు పిచ్చిపట్టినట్లైంది. త్వరత్వరగా బట్టలు మార్చుకోని పరిగెత్తుకుంటూ వాడు చెప్పిన చోటుకి దూసుకుపోయాను. దారిలో బురదలో వాడు పెట్టుకునే టోపీ కనిపించింది. రాత్రంతా వర్షంపడ్డ ఆనవాళ్ళు వున్నాయి. బలంగా గాలి వీస్తోంది. తల పైకెత్తి చూశాను. చెట్ల మధ్యలో ఏదో ఊగుతున్నట్లు తెలిసింది.
“అంతే. ఆ తరువాత ఏం చేశానో కూడా నాకు గుర్తులేదు. అరిచానేమో. స్పృహ తప్పి పడిపోయానేమో. మా ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్ళానేమో. ఏమో. ఏమీ తెలియదు. నాకు తెలివి వచ్చేసరికి నేను నా మంచం మీద వున్నాను. నా పక్కన అమ్మ వుంది.
“జరిగిందంతా కలేమో అనిపించింది. ఓ పీడకల అయ్యింటుందనుకున్నాను. “వాడేడి. వాడేమయ్యాడు?” అడిగాను. సమాధానం లేదు. అంటే..! అది కల కాదు. నిజం.
“నేను వాణ్ణి అలా చూసే ధైర్యం చెయ్యలేదు. వాడి గోధుమరంగు జుట్టు కావాలని మాత్రం అడిగాను. ఇదిగో – ఇదే అది!”
అలా అంటూ ఆ ముసలామె వణుకుతున్న తన చేతిని ముందుకు చాచి నిర్లిప్తంగా పైకెత్తింది. చాలా సార్లు నిట్టూర్చింది. కళ్ళు తుడుచుకోని కొనసాగించింది.
“పెళ్ళి వద్దనుకున్నాను. కారణాలు చెప్పలేదు. నేను అప్పట్నుంచి ఇలాగే పదమూడేళ్ళ పిల్లాడి విధవగా మారిపోయాను. అలాగే మిగిలిపోయాను.” అలా అంటూనే తల ముందుకు వాల్చేసి చాలాసేపటి వరకూ ఏడుస్తూనే వుండిపోయింది.
అతిధులందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఓ భారీ మనిషి పక్కన వున్న అతని చెవి దగ్గర అన్నాడు. “భావుకత కలిగి వుండటం కూడా ఒక విషాదమే కదూ” అని. ఆమె చెప్పిన కథ అతనిలో అలజడి రేపినట్లుంది.
***
Original: Guy De Mauppasant

Original Title: A Widow

కోతి కొమ్మచ్చి – కొని తెచ్చి.. చదివిచ్చి..!!

మై గాడ్ బయింగ్ బుక్స్! బార్బేరియస్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్!..అన్నాడు గిరీశం. పుస్తకానికి ఖోపం వచ్చేసింది. పుస్తకాలతల్లి సరస్వతమ్మకి (అంటే సరస్వతిగారి అమ్మగారు కాదు సరస్వతిగారే అమ్మగారు) ఇంకా చాలా ఖొపం వచ్చేసింది. హాం ఫట్ అనగానే ముళ్ళపూడి వెంకట రమణ పుట్టాడు.
అమ్మా ఒక పది కాణీలు వుంటే అప్పిస్తావా?” అన్నాడు పుట్టగానే.
నీకు అప్పులిచ్చేవాళ్ళని తిప్పలిచ్చేవాళ్ళని మా ఆయన పుట్టిస్తున్నాడు గానీ నువ్వు నాకొక పని చేసి పెట్టాలిఅన్నది.
ఓస్ అంతే కదా.. ఏమిటో చెప్పుఅన్నాడు రవణ
ఈ టెలుగుస్ వున్నారే వీళ్ళకి పుస్తకం విలువ, చదువుల విలువ, అక్షరం విలువ అట్టే తెలిసినట్టు లేదు.. నువ్వెళ్ళి అలాంటి వాళ్ళందరిచేత పుస్తకం కొనేట్టు చెయ్యాలి..
హమ్మబాబోయ్.. అంత పని నా వల్ల కాదు నాకు ఎవరైనా తోడు కావాలి..
తోడుకేం తక్కువోయ్ ఇదుగో బొమ్మల బాపు, అంత్యప్రాసల ఆరుద్ర, “పొగలసెగల శ్రీశ్రీ, నండూరి నీకు ఫ్రెండూరి.. అందాల రాముడు అక్కినేని, దుక్కిపాటి, భానుమతి..
ఇంకా ఇంకా..!!
కష్టాలు కన్నీళ్ళు.. ఇబ్బందులు సొబ్బందులు..
విల విల లాడించే సంతోషాలు, పక పకలాడించే కష్టాలు..
హన్నా..
హ హఇంకా చెప్తాను చూడు.. బుడుగు, సీగానపెసునాంబ, రెండు జెళ్ళ సీత, గోపాలం, అప్పుల అప్పారావు, జనతా ఎక్స్ ప్రెస్ జనాలు.. వీళ్ళు నేను పుట్టించిన మనుషులు.. మీ ఆయన పుట్టించిన మనుషులకి నకలు డిటోకి కాపి స్ఫూర్తి..
ఏమిటా కోతివేషాలు..
అమ్మా ఇదేదో బాగుందే.. కోతి వేషాలు, కోతి గెంతులుకోతి కొమ్మచ్చులు
తథాస్తు
మరి నువ్వు రావా అమ్మా..?”
పిచ్చినాయనా.. నిన్ను చూసుకోడానికి నేనెందుకూ? నా బదులుగా తొమ్మిదిమంది అమ్మల్ని ఇస్తాను సరేనా?”
సరే
***
పుస్తక సమీక్ష అనుకుంటే ఈ సొంత పైత్య పరీక్ష ఏమిటనుకుంటున్నారా.. ఇది నా స్థాయిలో కోతి కొమ్మచ్చి. చెట్టు మీదనుంచి చెట్టుకు కాకపోయినా ఒక పూల కుండీ మీద నుంచి మరో పూల కుండీ మీదకి.
స్వాతి వార పత్రికలో ముళ్ళపూడి వెంకట రమణగారు ఆడిన కోతి కొమ్మచ్చులన్నీ కుదురుగా కూర్చి పెట్టిన పుస్తకమిది. ఈ పుస్తకం తిసుకోని ఎక్కడినించి మొదలు పెట్టినా ఎటువైపు చదువుకుంటూ వెళ్ళినా ఎక్కడా ఆగదు. ఆప బుద్ధెయ్యదు. మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే-కోతిపిల్ల తల్లికోతిని కరుచుకున్నట్లు రమణగారిని కరుచుకుంటే చాలు ఎన్ని జీవితాల చెట్లు, ఎన్ని అనుభవాల కొమ్మలు, ఎన్ని సంతోషాల పూలు, ఎన్నెన్ని కన్నీళ్ళ పేళ్ళు.. అన్నింటినీ దాటిస్తూ దూకిస్తూ సాగుతుందీ ఆత్మ కథ. కథలో నించి కథలోకి, పిట్టకథలోకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయామో అర్థంకాక వెనక్కి రావడం తెలియక అభిమన్యుడిలా ఎన్నిసార్లు ఇరుక్కుపోయినా ఈ పద్మవ్యుహాల పుస్తకం చదువుతుంటే ఆహ్లాదంగానే వుంటుంది. అదో కొత్త సొగసుగా వుంటుంది.
మనం చిన్నప్పుడు చదువుకున్న తెలుగు వాచకంలో పది పేజీల ప్రోజు మొత్తం అయిపోయాక చివర కథా సారాంశం (సమ్మరీ) అంటూ ఒక్క పేరాగ్రాఫులో కథ వివరం మొత్తం ఇచ్చేవాళ్ళు. ఆ ఒక్క పేరగ్రాఫు చదువుకుంటే మొత్తం కథ చదివిన పుణ్యం..!! అలాగే ముళ్ళపుడిగారు వ్రాసిన పది వాక్యాలకి ఒక్క గీతతో తిలకం పెట్టేస్తారు బాపు గారు ఒకోసారి నామం కూడా అనుకొండి. ఆ బొమ్మలు ఇందాక చెప్పిన సారాంశానికి రెండాకులు ఎక్కువ. ఎందుకంటే ఇవి కథ సంగ్రహంగా చెప్పడమే కాదు ఆ కథలో ఆత్మని మన ముందు నిలబెట్టేస్తాయి. చాలా సార్లు ఈ బొమ్మలు రమణగారు చెప్పిన కథకి కొత్త అర్థాన్ని సరికొత్త రూపాన్ని ఇస్తాయి. ఆ రకంగా ఆయన అక్షరాలతో బొమ్మలేస్తుంటే ఈయన బొమ్మలతో కథలు చెప్పేస్తుంటాడు. అందుకే ఈ పుస్తకం ముళ్ళపూడి పుస్తకం అనటంకన్నా బాపూరమణీయం అనటమే సబబు.
అయితే ఇందులో కథేమిట్రా అబ్బాయ్అని ఎవరైనా అమాయకులు అడిగితే చెప్పడానికి కొంచెం కష్టమే ఇదేమైన సినిమా రీలా? “లలిత శివ జ్యోతి కంబైన్స్ లవకుశఅంటూ మొదలెట్టి శుభం కార్డుదాకా చెప్పడానికి? ఇది మన తాతయ్య దగ్గర కుర్చోని ఆయన జ్ఞాపకాల తుట్టెను కదిపితే ఒకదానికొకటి అల్లుకోని వున్న అనుభవాలన్ని తియ్యటి తేనెలాగా కారినట్టు వుంటుంది, మనసులో ఊరినట్టౌతుంది..
ధవళేశ్వరంలో బ్రతికి చెడ్డ కుటుంబంలో పుట్టి ఇంతింతై ఖాళీ పర్సంతై, ఎమ్టీ పాకెటంతై, జేబుకు చిల్లంతై కష్టాలు, కన్నీళ్ళు, బాధలను చిరునవ్వులతో చెరిపేస్తూ ఆత్మ విశ్వాసంతో (కొన్ని భాషల్లో దీన్నే పొగరంటారు) ఎదిగి అప్పులుపడి, అకలిపడి, తిప్పలుపడి స్నేహాలతో కడుపు నింపుకొని, సంగీతంతో దాహం తీర్చుకొని, సాహిత్యంతో సరసమాడుకొని ఈ రమణ అనే వ్యక్తి ఎక్కిన మెట్లు, దూకిన చెట్లు, పడిన తిట్లు అన్నీ వున్నాయి. అక్కడికి ఇదేదో విశాల విషాద గాథ అనుకునేరు. ఇవి కాకుండా నడుమ్మీద చేతులు వేసుకున్న సంధర్భాలు, కాలరూ ముక్కు రెండూ ఎగరేసిన పొగరులు, మెచ్చుకోళ్ళు, మంచి మాటలు, చప్పట్లు, సన్మానపు దుప్పట్లు కూడా వున్నాయి.
మొత్తం మీద ఇది జివన సారం, సరదా ముసుగుతో వైరాగ్య విహారం.. చిరునవ్వులతో కళ్ళు చెమర్చే కథా సాగరం.
పుస్తకం నిండా ముళ్ళపూడి మార్కు పదవిన్యాసాలు మచ్చుకి -
కుళ్ళిపాయల కూర
ఎర్రటి ఎండలో 56 పేజీలు నడిచాను
పొగరెట్ కథలు” (పొగ గురించి, పొగరు గురించి)
పక్కింటి బంతి పూల రథం
ఫిలిం ప్రొడ్యూస్రూ పేపర్ ప్రొప్రయిటర్లూ చిలకా గోయంకల్లా, విస్కీ సోడాల్లా, పెసరట్ వుప్మాల్లా, బుగ్గాముద్దులా..
“(
వద్దంటే పెళ్ళి సినిమా) నిడివి: మూడు మైళ్ళ 5 ఫరలాంగుల 9 గజా 6 అడుగుల 9 అంగుళాలు..
ఇందులో (సినిమాలో) కథానాయిక పన్నాగా జమున అభినయించింది. సిపాయి పాత్రను గుమ్మడి భరించాడు. రాజుగా నాగయ్య, దుష్ట సేనానిగా రాజనాల నటించారు, కైకాల సత్యనారాయణను యువరాజు పాత్ర ధరించింది..
ఇంకా ఎన్నో మరెన్నో.
మొత్తం మీద కొనిచదవాల్సిన పుస్తకం. చదివిన తరువాత పదిలంగా పెట్టుకోవాల్సిన పుస్తకం.
***
కోతి కొమ్మచ్చి విడుదలైంది. రవీంద్రభారతిలో భారతికి అక్షరాభిషేకం జరిగింది. కని విని ఎరుగని రీతిలో మొదటి ప్రచురణ వారం రోజులకే ఖాళీ అయిపొయినట్లు ప్రకటించారు హాసం వారు.
రవింద్ర భారతిలో భారతి -

నాయనా మొత్తానికి బార్బేరియస్ అన్నవాళ్ళే తెలుగు పుస్తకాన్ని కొనేట్టు చేశావు.. చాలా సంతోషంగా వుంది
అప్పుడే ఏమైందమ్మా? కోతికొమ్మచ్చి రెండొవ భాగం రాబోతోంది.నవ్వాడు రమణ. ఆ వెనకే బాపూ కూడా.
(అప్పుడెప్పుడెప్పుడో పుస్తకం వచ్చిన కొత్తల్లో పుస్తకం.నెట్ లో రాసుకున్న సంగతులు...)