తన పై అధికారి ఇచ్చిన ఒక
పార్టీలో ఒక అమ్మాయిని చూశాడు మాన్సియర్ లాన్టిన్. ఆ క్షణమే ఆమె పైన పీకలలోతు
ప్రేమలో పడిపోయాడు.
ఆమె టాక్స్ కలెక్టర్ గా పని
చేసిన ఓ అధికారి కూతురు. అప్పటికే ఆయన చనిపోయి చాలా కాలం అయ్యింది. ఆమె, ఆమె తల్లి
కలిసి ప్యారిస్ కి వచ్చి స్థిరపడ్డారు. తనకున్న పరిచయస్థుల ద్వారా కూతురికి మంచి
సంబంధం చూసి పెళ్ళి చేయాలని ప్రయత్నం చేస్తోంది ఆమె తల్లి.
ఆ కుటుంబానికి సంఘంలో గౌరవం
వుంది. కాస్తో కూస్తో డబ్బువుంది. అంచేత గుట్టుగా, ప్రశాంతంగా జీవనం సాగిస్తూ
వున్నారు.
ఆ అమ్మాయి సకల సద్గుణాల రాశి.
ఆమె చూసిన ఏ కుర్రవాడైనా ఆమె చేతుల్లో తన జీవితాన్ని అప్పజెప్పి సంతోషంగా వుండాలని
కలలు కంటారు. చక్కటి సొగసు, దేవత లాంటి అందం, సాదా సీదా వ్యవహారం ఆ అమ్మాయి సొంతం.
ఎప్పుడూ ఆమె పెదవులపైన కదలాడే స్వచ్చమైన చిరునవ్వు ఆమె మనసులోని నిర్మలత్వానికీ,
మంచితనానికి ప్రతికలా వుంటుంది. ఆ ప్రాంతంలో అందరూ ఆమెను పొగిడేవాళ్ళే. “ఏ
అదృష్టవంతుణ్ణి ఈమె వరిస్తుందో కానీ, ఇంతకన్నా గొప్ప భార్య దొరకదు గాక దొరకదు” అని
పదే పదే అనుకునేవాళ్ళు. అదే విషయాన్ని ఎన్ని సార్లైనా విసుగు విరామం లేకుండా
చెప్పుకునేవాళ్ళు.
అప్పట్లో మాన్సియర్ లాన్టిన్
రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఛీఫ్ క్లర్క్ గా
పనిచేస్తుండేవాడు. మూడు వేల అయిదొందల బొటాబొటీ జీతం. ఆ కాస్త సంపాదనలోనే సర్దుకోని
బతికేవాడు. అలాంటివాడు ఆ చక్కని పిల్లతో పెళ్ళి ప్రతిపాదన చేశాడు. అందరూ
సమ్మతించారు కూడా. పెళ్ళి జరిగిపోయింది.
లాన్టిన్ జీవితంలోకి
చెప్పలేనంత సంతోషం వచ్చి చేరింది. ఆ అమ్మాయి ఇంటి వ్యవహారాలన్నీ చక్కగా
చక్కబెట్టేది. చూసేవాళ్ళు వీళ్ళు బాగా వున్నవాళ్ళు కాబోలు అని అనుకునేలా
నడుపుకొచ్చేది. ఆమె దుబారా చేసేది కేవలం మొగుడు మీద ప్రేమని, ఆప్యాయతని మాత్రమే.
అతణ్ణి ముద్దు చేసేది, గోము చేసేది, అలరించేది. ఆమె కురిపించిన ప్రేమ ఎంత మత్తు
జల్లేదంటే, పెళ్ళైన ఆరేళ్ళ తరువాత మాన్సియర్ లాన్టిన్ ఆమెను హనీమూన్ కాలంలో
ప్రేమించినదానికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానని గుర్తించాడు.
అయితే ఆమెలో అతనికి నచ్చని
విషయాలు రెండున్నాయి. ఒకటి ఆమెకున్న నాటకాల పిచ్చి. రెండొవది గిల్టు నగలు అంటే వున్న ఇష్టం.
కొంతమంది ఆఫీసర్ల భార్యలు ఆమెకు స్నేహితురాళ్ళయ్యారు. వాళ్ళు అప్పుడప్పుడు
థియేటర్లో నాటకాలు చూడటానికి టికెట్లు సంపాదించేవాళ్ళు. సామాన్యంగా కొత్త నాటకాలు,
మొదటి ప్రదర్శనకు సంబంధించిన టికెట్లు వచ్చేవి. తప్పని పరిస్థితుల్లో లాన్టిన్ కి
కూడా భార్యతో కలిసి వెళ్ళాల్సివచ్చేది. అతనికేమో ఆ నాటకాలు బోరు కొట్టేవి. రోజంతా
ఆఫీసులో కష్టపడి వస్తాడేమో, నాటకాన్ని ఏ మాత్రం ఆస్వాదించగలిగేవాడు కాదు.
కొంతకాలం తరువాత ఇక
లాభంలేదనుకోని లాన్టిన్ తన భార్య ముందు ఒక ప్రతిపాదన పెట్టాడు. ఇక నుంచి థియేటర్
కి ఆమెకు పరిచయం వున్న ఎవరైనా స్నేహితురాల్ని తీసుకెళ్ళమని కోరాడు. రాత్రిళ్ళు
అవసరం అయితే ఆ స్నేహితురాలు తమ ఇంటికే వచ్చి వుండవచ్చని కూడా సలహా ఇచ్చాడు. ముందు
ఒప్పుకోకపోయినా, అతను బ్రతిమిలాడగా బ్రతిమిలాడగా ఒప్పుకుంది. అతనూ సంతోషించాడు.
అయితే ఈ నాటకాల పిచ్చికి,
నగల పిచ్చికి సంబంధం వుంది. ఆమె దుస్తులు అవీ అంతకు ముందులాగానే సాదాసీదాగానే
వుండేవి. కానీ కొంతకాలానికి ఆమె చెవులకు నకిలీ వజ్రాలు వున్న
పెద్ద పెద్ద జుంకాలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. అవి నిజంగా వజ్రాల్లా అన్నట్లు తళుక్కున
మెరుస్తూ వుండేవి. ఆ తరువాత మెడలో నకిలీ ముత్యాల దండలు వేయడం మొదలైంది. చేతికి
రోల్డ్ గోల్డ్ గాజులు వచ్చాయి. ఇంకా ఎవేవో కొనింది.
అతను చాలాసార్లు ఆమెకు
నచ్చజెప్పాలని చూశాడు.
“అమ్మాయిలు సహజమైన అందంవల్ల,
స్వచ్చమైన మనసు వల్ల గొప్పగా కనిపిస్తారు కానీ నగలవల్ల కాదు. మనం ఎలాగూ ఖరీదైనవి
కొనలేము కాబట్టీ నీ చిరునవ్వునే ఆభరణంగా ధరించాలి.” అన్నాడు.
ఆమె మాత్రం ఒప్పుకునేది
కాదు. సన్నటి అందమైన నవ్వు నవ్వేది.
“నన్నేం చెయ్యమంటావు చెప్పు?
నాకేమో నగలంటే ఇష్టం. అదొక్కటే నా వీక్ నెస్. నా స్వభావం. అది ఎలా మార్చుకోగలను
చెప్పు” అనేది.
ఆమె ముత్యాలదండని చేతివేళ్ళకు
చుట్టుకొని అవి మెరిసేలా పట్టుకోని అతనికి చూపించేది.
“చూడు ఎంత బాగున్నాయో?
ఎవరికైనా చూపిస్తే ఇవి నిజమైనవని ఒట్టేసి మరీ చెప్తారు” అనేది
"నీది మరీ పల్లెటూరి టేస్టు" అనేవాడు మాన్సియర్ లాన్టిన్
నవ్వుతూ.
ఒకోసారి సాయంత్రం పూట
నిప్పుగూడు దగ్గర కూర్చుని టీ తాగేటప్పుడు
తన నగలు దాచుకునే లెదర్ పెట్టే తెచ్చి టీ టేబుల్ మీద పెట్టేది. ఆమె నగలు అనుకునే
వాటిని అతను “చెత్త” అనేవాడు. ఆమె నగలనీ, అందులో వున్న నకిలీ రాళ్ళను, ఎంతో ఆరాధనగా
చూసుకునేది. వాటిని చూస్తుంటే ఏదో తెలియని ఆనందాన్ని పొందినట్లు వుండేది. ఒకసారి ఆ
నగలలో నక్లెస్ లాంటివి తీసి అతన్ని మెడచుట్టూ వేసుకోమని మారాం చేసేది. అతను
వేసుకోగానీ – “చూడు చూడు పెద్ద జోకర్లా వున్నావు” అంటూ ఆటపట్టించేది. ఆ తరువాత
అతని కౌగిలిలో ఒదిగిపోయి ప్రేమగా ముద్దులు పెట్టేది.
ఓ చలికాలం రాత్రి థియేటర్ లో
ఒపేరా చూడటానికి వెళ్ళి వచ్చేటప్పుడు పూర్తిగా మంచులో తడిసి వచ్చిందామె. మర్నాడు
దగ్గు మొదలైంది. మరో ఎనిమిది రోజులకు ఊపిరితిత్తుల సంబంధించిన సమస్యతో ఆమె
కన్నుమూసింది.
మాన్సియర్ లాన్టిన్ విషాదంలో
కూరుకుపోయాడు. నెల తిరగకుండానే అతని జుట్టంతా నెరిసిపోయింది. ఎడతెగకుండా గుండెలు
పగిలిపోయేలా ఏడుస్తూనే వున్నాడు. ప్రతి క్షణం ఆమె చిరునవ్వు, ఆమె గొంతు, ఆమెకు
సంబంధించిన ప్రతి అంశం గుర్తు తెచ్చుకుంటూ కుమిలిపోయాడు.
కాలం గడిచినా అది అతని
గాయాన్ని మాన్పలేకపోయింది. ఆఫీసులో వున్నప్పుడు అతని తోటివారు వ్యవహారిక విషయాలు
మాట్లాడుకుంటుంటే కూడా అతని కళ్ళలో ఒక్కసారిగా కన్నీరు నిండేది. గుండెల్లో వున్న
బాధను ఎక్కిళ్ళు పెట్టి మరీ తీర్చుకునేవాడు. అతని భార్య గది ఆమె మరణానికి ముందు
ఎలా వుందో అలాగే వుంచుకున్నాడు. ఆమె సర్దిన ఫర్నీచరు, బట్టలు అన్నీ ఆమె చనిపోయిన
రోజు ఎలా వున్నాయో అలాగే కదల్చకుండా వుంచేశాడు. అతని ఆనందానికి మూలమైన ఆమె
జ్ఞాపకాలలో ప్రతిరోజు మమేకమై గడపాలని అతను కోరుకున్నాడు.
అయితే అతని జీవితంలో సమస్యలు
చుట్టుముట్టడానికి ఎంతో కాలం పట్టలేదు. ఒకప్పుడు అతని భార్య వున్నప్పుడు ఇంటి
ఖర్చులన్నింటికీ సరిపోయిన అతని సంపాదన ఇప్పుడు కనీసవసరాలకు కూడా చాలటంలేదు. అంతే
డబ్బుతో ఆమె చక్కటి వైన్ తీసుకొచ్చేది. రుచికరమైన ఆహారపదార్థాలు తెచ్చేది. అవన్నీ
ఈ కాస్త డబ్బుతో ఎలా సాధ్యమయ్యేదా అని అతను ఆశ్చర్యపోయేవాడు.
అప్పులు మొదలయ్యాయి. క్రమంగా
కటిక దరిద్రుడిగా మారిపోయాడు. అలాంటప్పుడు ఒకరోజు ఉదయం చేతిలో చిల్లిగవ్వ కూడా
లేదని తెలుసుకోని, ఏదో ఒక వస్తువు అమ్మేయాలని నిర్ణయానికి వచ్చాడు. వెంటనే అతని
భార్య కూడబెట్టిన నకిలీ నగలు గుర్తుకొచ్చాయి. వాటి మీద అతనికి ఎలాంటి మక్కువలేదు.
పైపెచ్చు వాటిని ఆమె వేసుకోవడం ఏనాడు అంగీకరించలేదు. ఆమె మధురమైన జ్ఞాపకాల మధ్య
ఇష్టం లేని ఈ గిల్టునగలు వుండటం అతనికి నచ్చలేదు. వాటిని అమ్మేయాలని స్థిరంగా
అనుకున్నాడు.
ఆమె ఆఖరు రోజు దాకా ఏదో ఒకటి
కొంటూనే వుంది. దాదాపు ప్రతి సాయంత్రం ఓ కొత్త వస్తువు పట్టుకొచ్చేది. వాటిల్లో
వేటిని అమ్మాలా అని చూశాడు లాన్టిన్. చివరికి ఓ భారీ నక్లేస్ కనపడింది. ఆమెకు చాలా
ఇష్టమైన వాటిల్లో ఒకటి. గిల్టుదే, అయితేనేం అది తయారు చేసినవాడి పనితనం
కనపడుతోంది. ఓ ఆరో ఏడో ఫ్రాంకులకు తప్పకుండా అమ్ముడుపోతుందని అనుకున్నాడు.
దాన్ని జేబులో వేసుకోని
ఎవరైన నమ్మకమైన నగల వ్యాపారికి అమ్మాలనుకున్నాడు. వెతికి వెతికి ఒకతన్ని
ఎన్నుకున్నాడు. అయితే అతన్ని కలిసి, ఇలాంటి పనికిరాని వస్తువు అమ్మకానికి పెట్టి
తన దరిద్రాన్ని అతనికి చూపించడమా మానడమా అని వెనకాడాడు.
“అయ్యా.. దీనిని అమ్మితే ఏ
మాత్రం వస్తుందో విలువ కట్టి చెప్తారా” అన్నాడు వ్యాపారితో.
ఆ మనిషి నెక్లెస్ ను
పరిశీలించాడు. తన గుమాస్తాని పిలిచి లోగొంతులో ఏమిటేమిటో మాట్లాడాడు. తిరిగి ఆ
ఆభరణాన్ని కౌంటర్ దగ్గర పెట్టాడు. దూరం నుంచీ చూస్తూ దాని విలువ కట్టాలని
ప్రయత్నించాడు.
లాన్టిన్ ఈ తతంగమంతా చూసి
చిరాకుపడ్డాడు. “అది ఎందుకూ పనికిరాదని నాక్కూడా తెలుసు” అనబోయడు. అంతలోనే నగల
వ్యాపారి మాట్లాడాడు.
“అయ్యా, ఈ నెక్లెస్ దాదాపు
పన్నెండు, పదిహేను వేల ఫ్రాంకుల ధర పలుకుతుండి. కానీ నేను కొనాలంటే ఇది మీ దగ్గరకు
ఎలా వచ్చిందో చెప్పాల్సివుంటుంది” అన్నాడు.
ఆ వ్యాపారి చెప్పిన విషయం అర్థం
కాక కళ్ళు పెద్దవి చేసి, నోరు తెరిచి విస్తుపోయాడు లాన్టిన్.
“మీరు చెప్పేది... నిజమేనా”
అన్నాడు చివరికి తడబడుతూ.
“మీరు వేరే చోట కనుక్కోండి. నా
ఆఖరు మాట పదిహేను వేలు. ఇంకెవరైనా ఎక్కువిస్తే సరే, లేకపోతే మళ్ళీ ఇక్కడికే రండి”
అన్నాడు పొడిపొడిగా.
మాన్సియర్ లాన్టిన్
విభ్రమంగా చూస్తూ వుండిపోయాడు. ఆ తరువాత నెక్లెస్ తీసుకోని ఆ షాపు వదిలి
వెళ్ళిపోయాడు. ఆలోచించుకోడానికి సమయం కావాలని మాత్రం చెప్పాడు.
ఒకసారి బయటకు వెళ్ళిన తరువాత
వచ్చే నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు.
“వీడెవడో పిచ్చోడు
లాగున్నాడు. అంతే.. వాడు చెప్పింది నేను ఒప్పుకుంటే ఆరిపోయేవాడు. అసలు నగలకు నకిలీ
నగలకు తేడా తెలియనివాడు వీడేం వ్యాపారం చేస్తాడు” అనుకున్నాడు.
మరికొంత సమయం తరువాత నగరం
మధ్యలో వున్న ఓ పెద్ద నగల షాపుకు వెళ్ళాడు. ఆ షాపు యజమాని నక్లెస్ ని చూడగానే
గట్టిగే కేక వేసినంత పని చేశాడు.
"ఓహో ఇదా! ఇది నాకెందుకు తెలియదు. ఇక్కడే కదా కొన్నారు”
అన్నాడు.
లాన్టిన్ మళ్ళీ
చికాకుపడ్డాడు. “ఎంత చేస్తుంది” అడిగాడు.
“ఇరవై వేలకి అమ్మాను.
పద్దెనిమిది వేల ఫ్రాంకులకైతే తీసుకుంటేను. అయితే ఇది నీకు ఎలా వచ్చిందో నాకు
చట్టసమ్మతంగా నిరూపించాలి. నీ దగ్గరకు ఎలా చేరిందో తెలియాలి. అంతే” అన్నాడు.
చాలాసేపు లాన్టిన్ నోట మాట
రాలేదు.
“కానీ... కానీ... అసలు
సరిగ్గా చూసారా.. మళ్ళీ చూడండి. ఇప్పటిదాకా ఇది ఇమిటేషన్ అని అనుకున్నాను నేను”
చివరికి అన్నాడు.
“మీ పేరు చెప్పండి” అన్నాడు
“లాన్టిన్ – రెవెన్యూ
డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. నేను వుండేది నెంబర్ పదహారు, ర్లూడిమార్టియ”
వ్యాపారి పాత పద్దులు
తిరగేసి అమ్మకం వివరాలు వెతికాడు. “అవును ఆ నక్లెస్ మేడమ్ లాన్టిన్ పేరు మీద
కొనబడింది. అదే అడ్రస్, నెంబరు పదహారు ర్లూడిమార్టియ, తేది జులై 20, 1876” అన్నాడు.
ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు
చూసుకున్నారు. లాన్టిన్ కళ్ళలో విస్మయం. వ్యాపారి కళ్ళలో అనుమానం. చివరికి ఆ
వ్యాపారే మాట్లాడాడు.
“ఓ పని చెయ్యండి. మీరు ఈ నగ
ఇక్కడే పెట్టేసి వెళ్ళండి. ఓ ఇరవై నాలుగు గంటలు. మీకు నేను రసీదు కూడా ఇస్తాను”
అన్నాడు.
మాన్సియర్ లాన్టిన్ సరేనని
చెప్పి హడావిడిగా రశీదు జేబులో పెట్టుకోని అక్కడ్నుంచి బయటపడ్డాడు.
ఏం జరిగిందో అర్థం కాని
తికమకలో వీధులన్నీ పట్టుకోని పిచ్చివాడిలా తిరిగాడు. అంత ఖరీదైన నగ తన భార్య ఎలా
కొనగలిగిందో అతనికి ఎంత ఆలోచించినా తట్టలేదు. కొనే అవకాశమే లేదనుకున్నాడు.
అయితే ఎవరో ఆమెకు కానుకగా
ఇచ్చి వుండాలి - కానుకా?- కానుక – ఎవరిచ్చి వుంటారు? ఎందుకు ఇచ్చివుంటారు?
అతను ఓ వీధి మధ్యలో
నిలబడిపోయాడు. ఒక దారుణమైన అనుమానం అతని మనసులో మొదలైంది. అవునా?
అయితే ఆమె తెచ్చిన నగలన్నీ బహుమతులేనా? అతని
కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించింది. ఎదురుగా వున్న
చెట్టు కూలి అతని మీద పడినట్లు తోచింది. చేతులు ముందుకు చాచి
నేల మీద పడిపోయి స్పృహ తప్పాడు. కళ్ళు తెరిచేసరికి ఓ మెడికల్
షాపులో వున్నాడు. దారినపోయేవాళ్ళు ఎవరో అతన్ని అక్కడ
చేర్చారు. తనని ఇంటికి చేర్చమని అక్కడివాళ్ళని అడిగాడు.
ఇల్లు చేరాక తలుపులన్నీ వేసుకోని చీకటిపడే దాకా తన గదిలోనే ఏడుస్తూ
వుండిపోయాడు. అలసట తీరాక మంచం మీదపడి గాఢ నిద్రలోకి
జారుకున్నాడు.
మర్నాడు ఉదయం సూర్యకాంతి
అతణ్ణి నిద్ర లేపాక, నెమ్మదిగా బట్టలు వేసుకోని ఆఫీసుకు తయారయ్యడు. అంత షాక్
అనుభవించాక పనిచేయడం అసాధ్యం అనిపించింది. ఆ రోజుకి శెలవు ఇవ్వమని ఉత్తరం రాశాడు.
నగల వ్యాపారి దగ్గరకు వెళ్ళాలన్న సంగతి జ్ఞాపకం వచ్చింది. మనస్కరించలేదు. కానీ ఆ
నెక్లెస్ ను అక్కడ వదలడమూ ఇష్టం లేకపోయింది. బట్టలు వేసుకోని బయటపడ్డాడు.
ఆ రోజు వాతావరణం చాలా
ఆహ్లాదకరంగా వుంది. స్వచ్చమైన నీలాకాశం కింద హడావిడి పడుతున్న నగరాన్ని చూసి
నవ్వుతున్నట్లుంది. ఖాళీ సమయం వున్నవాళ్ళు చేతుల్ని జేబుల్లో పెట్టుకోని నెమ్మదిగా
నడుస్తున్నారు.
మాన్సియర్ లాన్టిన్ వాళ్ళని
గమనించాడు.
“డబ్బున్నవాళ్ళు ఎప్పుడూ
సంతోషంగానే వుంటారేమో. డబ్బుతో ఎంత లోతులో వున్న బాధలనైనా మర్చిపోవచ్చనుకుంటా.
మనసుకి నచ్చిన చోటుకి వెళ్ళచ్చు, అలాంటి ప్రయాణాలలో బాధల్ని మరపించే ఏదో వ్యాపకం
దొరుకుతుంది. నేను కూడా ఇలా ధనవంతుణ్ణి అయ్యుంటే..!!” అనుకున్నాడు.
ఆకలి వేసింది. జేబులు ఖాళీ.
నక్లెస్ మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. పద్దెనిమిది వేల ఫ్రాంకులు! పద్దెనిమిది వేలు!
ఎంత సొమ్మో!!
ఆ నగల షాపుకి వచ్చాడు.
పద్దెనిమిది వేల ఫ్రాంకులు అని మనసులో రొద. ఇరవై సార్లు వెళ్ళాలని
నిర్ణయించుకున్నాడు, కానీ ఆగిపోయాడు. అవమానభారం వెనక్కి లాగుతోంది. ఇంకో పక్క
విపరీతమైన ఆకలి. చేతిలో డబ్బు లేదు. నిర్ణయం తీసుకోడానికి అట్టే సమయం పట్టలేదు. ఆ
వీధి అటు వైపుకి వెళ్ళి, మళ్ళీ ఆలోచించుకునే అవకాశం లేకుండా ఒకటే పరుగుతో రోడ్డు
దాటి షాపులోకి వచ్చి పడ్డాడు.
ప్రొపరైటర్ అతన్ని చూడగానే
ఎదురువచ్చి మర్యాదగా కుర్చీలో కూర్చోమన్నాడు. గుమాస్తా పలకరింపుగా నవ్వాడు.
“నేను వివరాలన్నీ
కనుక్కున్నాను మాన్సియర్ లాన్టిన్. మీరు అమ్మడానికే నిశ్చయించుకుంటే మీకు నేను
చెప్పిన మొత్తం ఇవ్వడానికి సిద్ధంగానే వున్నాను” అన్నాడు
“అమ్ముతాను...” గొణిగాడు
మాన్సియర్ లాన్టిన్
ప్రొపరైటర్ సొరుగులాగి
పద్దెనిమిది పెద్ద నోట్లు తీసి, లెక్కపెట్టి మాన్సియర్ లాన్టిన్ చేతిలోపెట్టాడు.
అతను చేయవలసిన రశీదుల పైన సంతకాలు చేసి, వణుకుతున్న చేతులతో డబ్బు జేబులో
పెట్టుకున్నాడు.
బయటకు రాబోతున్నవాడల్లా
గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి, ఇంకా చిరునవ్వు పులుముకోని చూస్తున్న వ్యాపారి
వైపు చూశాడు.
“నా దగ్గర – నా దగ్గర ఇంకా
కొన్ని నగలు, ముత్యాలు వున్నాయి. ఈ నక్లెస్ వచ్చిన చోటు నుంచే వచ్చాయి. మీరు
వాటిని కూడా కొంటారా?” అడిగాడు.
వ్యాపారి వినయంగా తలవంచి
“తప్పకుండా సర్” అన్నాడు.
మాన్సియర్ లాన్టిన్ విషాదం
ధ్వనించే గొంతుతో –“సరే తెచ్చిస్తాను” అన్నాడు. ఓ గంట తరువాత అన్నట్టుగానే అవన్నీ
తీసుకోని వచ్చాడు.
వజ్రాల చెవిదుద్దులకు ఇరవై
వేలు, గాజులకు ముఫై ఐదు వేలు, ఉంగరాలకు పదహారు వేలు, పచ్చలు, నీలాలకు పధ్నాలుగు
వేలు సాలిటేర్ లాకెట్ వున్న
బంగారు నగకు నలభై వేలు అంతా కలిపి నూటా నలభై మూడు వేల ఫ్రాంకులు ధర పలికాయి.
“ఆమె మొత్తం డబ్బుని ఈ
రాళ్ళు, నగలలోనే దాచినట్లుందే” అన్నాడు వ్యాపారి నవ్వుతూ
మాన్సియర్ లాన్టిన్ చురుగ్గా
సమాధానం ఇచ్చాడు – “సంపాదన దాచుకోడానికి ఇది కూడా ఒక మార్గం”
ఆ రోజు పెద్ద హోటల్లో భొజనం
చేశాడు. ఇరవై ఫ్రాంకులు చెసే ఖరీదైన వైన్ సీసా మొత్తం తాగాడు. జట్కా కట్టించుకోని
చుట్టుపక్కల తిరిగొచ్చాడు. బాగా ధనవంతులు కట్టుకున్న భవంతులను చూసి – “నేను కూడా
ధనవంతుణ్ణే... రెండు లక్షలు ఖరీదు చేస్తాను నేను..” అంటూ అరిచాడు.
ఉద్యోగం సంగతి జ్ఞాపకం
వచ్చింది. నేరుగా ఆఫీసుకు చేరుకోని గాలిలో తేలినట్లు లోపలికి వెళ్ళాడు.
“సర్... నేను నా ఉద్యోగానికి
రాజీనామా ఇద్దామని వచ్చాను. నాకు మూడు లక్షల ఫ్రాంకులు వారసత్వంగా వచాయి” అన్నాడు.
తోటి ఉద్యోగస్థులను కలిసి,
అందరితో చేతులు కలిపి వాళ్ళతో తన భవిష్యత్ ప్రణాలికలు చర్చించాడు. అక్కడ్నుంచి
దగ్గర్లో వున్న కేఫ్ కి వెళ్ళాడు.
అతని పక్కన ఊర్లోని
పెద్దమనుషులు, అధికారులు కూర్చున్నారు. భోజనం చేస్తూ వాళ్ళతో రహస్యంగా తాను నాలుగు
లక్షల ఫ్రాంకులు సంపాదించానని ప్రకటించుకున్నాడు.
జీవితంలో మొదటిసారి
థియేటర్లో జరిగేదాన్ని ఆనందంగా అనుభవించాడు. రాత్రంతా సంతోషంగా, ఆనందంగా
గడిపేశాడు.
మరో ఆరునెల తరువాత, అతను
మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఆమె కూడా అనుకూలవతే కాకపోతే ముక్కు మీద కోపం. ఆ తరువాత
తరువాత ఆమె వల్ల అతని చాలా బాధలు కూడా కలిగాయట.
<< ?>>
0 వ్యాఖ్య(లు):
కామెంట్‌ను పోస్ట్ చేయండి