పండు ఎప్పుడూ అలిగింది లేదు. అసలు వాడికి అలగాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే వాడు సాక్షాత్తూ మినిస్టర్ వరదరాజు మనవడు. పండు తండ్రి, అంటే మినిస్టర్ గారి కొడుకు పెద్ద పెద్ద కంపెనీలకు ఓనరు. పండు తల్లి చిన్న చిన్న కంపెనీలకి వోనరు. అలాంటిది పండు అలిగాడంటే దాని పరిణామం దాదాపుగా జపానులో వచ్చిన భూకంపంతో సమానం. మినిస్టరుగారు ఇంటికొచ్చేలోపల ఆ అలక తీరలేదో అప్పుడు జరగబోయేది భూకంపం తరువాత సునామీతో సమానం. అందుకే ఇంట్లో అందరూ ఖంగారు పడుతున్నారు.
“ఎక్కడ నా పండు ఎక్కడ.. నా బంగారం ఎక్కడ..” అంటూ రానే వచ్చాడు వరదరాజు. ఇంట్లొకి రాగానే పండును పిలిచి, చాక్లెట్ ఇచ్చి కొద్దిసేపు ఆడుకోవడం ఆయనకి అలవాటు. అది గుర్తొచ్చి ఒక్కసారిగా అందరి గుండెల్లో అణుబాంబులు పేలినట్టైంది. అందరి నోర్లు సైలెంట్ మోడ్ లోకి మారిపోయాయి.
“రా నాయనా.. ఏం ఆలస్యమైంది?” అంటూ మాట మార్చబోయింది జేజవ్వ.
“ఏదో అయ్యిందిలే కానీ.. పండు ఎక్కడమ్మా?” అడిగాడు వరదరాజు.
“ఎక్కడికి పోతాడు వుంటాడ్లే, నీకు కాఫీ పంపేదా? టీ పంపేదా?” ఆడిగిందామె తెలివిగా. ఇంట్లో కృష్ణా రామా అనుకునే ఆమెకే అన్ని తెలివితేటలు వుంటే, రాజకీయంలో తలపండిన వరదరాజుకి ఎన్ని బుర్రల తెలివి వుండాలి?
“అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకి మేం డొంకతిరుగుడు సమాధానాలు చెప్పినట్టు మాట్లాడుతున్నావంటే ఎదో అబద్ధం చెప్తున్నావన్నమాట... నాకు ముందు వాణ్ణి చూపించు..” అంటూ ఇంట్లో వున్ననలభై ఆరు గదులు వెతకటం మొదలుపెట్టాడు. రెండో అంతస్థులో పన్నెండో గదిలోనే వున్నాడు పండు. కానీ ఏం లాభం అలిగి మాట్లాడను ఫో అంటూ అటు తిరిగి పడుకున్నాడు. వాణ్ణి బుజ్జగించి, లాలించి చివరికి కిందకు తీసికొచ్చి సోఫాలొ కూర్చోబెట్టాడు.
“నువ్వు అలగడమేంది బంగారం... నీకేం కావాలో చెప్పు, మన నలభై నాలుగు కార్లు కాకుండా నలభై అయిదొవ కారు కావాలా... మీ స్కూల్లో ఎవరైనా టీచర్ వుద్యోగం తీసెయ్యాలా..?? చెప్పు నీకేం కావాలంటే అది ఇప్పిస్తా” అన్నాడు తన దర్పాన్ని ఒలకబోసుకుంటూ. పండు తన తాతయ్య వైపు, జేజెమ్మ వైపు చూశాడు.
“గిలక్కాయ్” అన్నాడు
“ఏమిటదీ?” ఆశ్చర్యపోయాడు వరదరాజు.
“అవును తాతయ్యా.. నాకు గిలక్కాయ్ కావాలి... అది కూడా తాటాకు గిలక్కాయి...” చెప్పాడు గోముగా.
వాడు గిలక్కాయ్ అడగడమేమో కానీ, జేజవ్వ గొంతులో వెలక్కాయ్ పడ్డట్లైంది. అంతకు రెండు గంటలకి ముందు ఈ ప్రపంచంలో గిలక్కాయ్ అనే వస్తువు వుంటుందని వాడికి మొదటిసారి చెప్పింది జేజవ్వే మరి.
అసలేం జరిగిందంటే - వాళ్ళ తాతయ్య లండన్ వెళ్ళినప్పుడు తెచ్చిన ఎలక్ట్రానిక్ బొమ్మని తీసుకోని జేజమ్మ దగ్గరకి వెళ్ళాడు పండు. జేజవ్వ యధాలాపంగా దాన్ని అందుకోని –
“ఇవేం చిత్రమైన బొమ్మలొనమ్మా... మా రోజుల్లో ఇలాంటివన్నీ ఎరుగుదుమా? ఏదో తాటాకుతో అల్లిన గిలక్కాయలతో ఆడుకునేవాళ్ళం... ఇప్పుడు వచ్చే వాటిల్లో ఆ శబ్దమూ లేదు ఆ అందమూ లేదు...” అంది బొమ్మని తిరిగి ఇస్తూ. అలా అనటం వయసుమళ్ళిన వాళ్ళ జన్మహక్కు. అలా అనకపోతే వాళ్ళు బామ్మలు తాతలు ఎలాగౌతారు. కాకపోతే పండు ఆ మాటని పట్టుకున్నాడు – “నాకూ తాటాకు గిలక్కాయ్ కావాలీ..” అంటూ రాగం అందుకున్నాడు. అదీ సమస్య.
అదృష్టం బాగుండి వరదరాజు ఆ గిలక్కాయ్ గురించి ఎవరు చెప్పారు అని అడగలేదు. వెంటనే ఒక నౌకరుని పిలిచి – “ఒరేయ్... అట్లా బజారుకు వెళ్ళి ఒక తాటాకు గిలక్కాయ్ పట్రా” అన్నాడు అయిదు వందల కాగితం ఇస్తూ.
“తాటాకు గిలక్కాయలు అమ్మరురా... మా చిన్నతనంలో ఎరుక చెప్పేవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు...” అందించింది జేజవ్వ నోరూరుకోక.
“అయితే ఇదంతా నీ నిర్వాకమే అన్నమాట... సరే ఏమైతేనేం.. అట్టాంటోళ్ళని వెతికి పట్టుకోని అయినా సరే చేయించుకు తీసుకురా..” అన్నాడు నౌకరుతో. వెంటనే పండు వైపు తిరిగి – “సరేనా.. ఇంక అలక మానిరా... జీడిపప్పులు తిందాం...” అంటూ మనవణ్ణి అనూనయించబోయాడు. పిల్లాడు ససేమిరా అన్నాడు – “గిలక్కాయ్ వస్తేనే అలక మానేది..” అన్నాడు మొండిగా.
అదెంతపనిలే అనుకున్నాడు వరదరాజు. ఆ తరువాతే తెలిసింది అదెంత కష్టమైన పనో. బజారుకు వెళ్ళిన నౌకరు సాయంత్రానికి గానీ తిరిగిరాలేదు.
“మొత్తం వూరంతా తిరిగాను దొరా... ఎరుక చెప్పేవాళ్ళు సానామంది వుండారు కానీ, ఎక్కడా అట్టాంటి గిలక్కాయ చేయడం వచ్చినవాళ్ళు దొరకలేదు..” నౌకరు బిక్కు బిక్కుమంటూ చెప్పాడు.
వరదరాజు కోపంగా అరిచాడు... పనిలోనించే తీసేస్తానన్నాడు... గిలక్కాయ కోసం మంచి పనివాణ్ణి వదులుకోవడం ఎందుకులే అని మానుకున్నాడు. ఆ మర్నాడు తన ఆఫీసుకి ఫోన్ చేశాడు.
“మొత్తం డిపార్ట్మెంట్ మనుషుల్ని మొత్తం ఇదే పనిలో పెట్టండి.. సాయంత్రానికల్లా తాటాకు గిలక్కాయ్ చేసేవాడు నా ముందర వుండాలి” అంటూ ఆర్డర్ వేశాడు.
“జీ.వో. పాస్ చెయ్యమంటారా సార్?” అన్నాడు అవతలి వ్యక్తి. వరదరాజు చిరాకు నషాళానికి అంటింది..
“నిన్ను చంపేస్తా పీనుగా.. ఏది పర్సనలో ఏది అఫీషలో అర్థం కాదా నీకు..” అంటూ కసిరాడు.
రాజధాని నుంచి రాష్ట్రం నలుమూలలా ఫోన్లలో ఆర్డర్లు వెళ్ళాయి. పెద్దసారు పర్సనల్ పని అనే సరికి అవసరం కన్నా అత్యవసరం, అర్జెంట్ మెదలైన పదాలు తోడయ్యాయి. సాయంత్రం కల్లా గిలక్కాయ్ తెచ్చిచ్చినవారికి అవార్డులు ప్రకటించబడ్డాయి. మొదటిసారి ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా పని చెయ్యడం మొదలైంది. మంత్రిగారి పియే గంట గంటకి అప్ డేట్ అడుగుతున్నాడు.
సాయంత్రానికి ఒక్కొక్క ప్రాంతం నుంచి రిపోర్ట్స్ మొదలైయ్యాయి..
“అలాంటిదాని గురించి మా ఏరియాలో ఎవరూ వినలేదు సార్..”
“అంటే ఏంటని అడుగుతున్నారు సార్..!!”
“ఒక ముసలామె వచ్చని అంది కానీ, చూపు కనపడక చెయ్యలేక పోతోంది”
ఇలా వున్నాయి వార్తలు. ఆ రోజు మంత్రిగారి సభలో కనీసం ఇద్దరి వుద్యోగాలు పోవటం ఖాయమని డిపార్ట్మెంట్ లో అంతా చర్చించుకుంటున్నారు. అప్పుడు వినపడింది శుభవార్త.
“దొరికాడు సార్... నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర ఒక పల్లెలో దొరికాడు... పేరు ముసలయ్య... వీడు ఆ వూర్లో చిన్నపిల్లలకి తాటాకు గిలక్కాయలు చేసి పదో పరకొ
తీసుకుంటుంటాడు....” చెప్పాడు నెల్లూరు జిల్లా ఇంఛార్జ్ శ్రీనివాసులు. వెంటనే వాడిని ఇక్కడ ప్రవేశపెట్టండి అని ఏలినవారి ఆజ్ఞ.
***
మర్నాడు తెల్లవారుతూనే సర్కారువారి సకల మర్యాదలతో, కారులో ముసలయ్య అనే బక్కపల్చటి శల్తీ వచ్చి భవంతి ముందున్న లాన్లో పడింది. తను చేసిన తప్పేమిటో, ఎందుకు అంతదూరం నుంచి తీసుకొచ్చి ఈ పట్నంలో పడేశారో అతని అర్థం కాలేదు. ఇంట్లో ఖాళీగా వుండటం ఇష్టంలేక తటాకు గిలక్కాయలు చేసి అమ్ముకునేవాడు, ఇంతలోనే పేరులేని వడగండ్ల వానలాగా వచ్చి అమాంతంగా ఎత్తుకోని తెచ్చి ఇక్కడ పడేశారు.
“నీకు తాటాకు గిలక్కాయ్ తయారు చెయ్యడం వచ్చా?” అడిగాడు వరదరాజు లానులోకి వస్తూనే.
“చిత్తం దొరగారు... అదేం పెద్ద బ్రమ్మవిద్యండీ అయ్యగారూ..” అన్నాడు ముసలయ్య దణ్ణం పెడుతూ.
“ఎవర్రా అక్కడ... వీడికి తాటాకులు తెచ్చిపడేయండి..” అంటూ రాజావారిలా చప్పట్లు చరిచి మరీ ఆర్డర్ వేశాడు వరదరాజు. యువరాజులా నవ్వాడు పండు. మరో రెండు నిముషాలలో గుట్టలు గుట్టలుగా తాటాకులు రావడం, అందులో ఒకటి ముసలయ్య అందుకోవడం, అది గిలక్కాయగా మారిపోవడం జరిగింది.
యువరాజు దాన్ని అపురూపంగా అందుకొని మురిసిపోయాడు. రాజుగారు ఛాతిని విశాలంగా విస్తరించి, తాపీగా నవ్వి – “బాగుందిరా ముసలొడా... ఆ మిగిలిన తాటాకులు తీసుకెళ్ళి కప్పేసుకో... ఇంద ఈ పది వుంచు” అంటూ దానకర్ణుడిలా పది కాగితం వదిలాడు. ముసలయ్యకి మతిపోయింది. తీసుకొచ్చినప్పటి మర్యాదలన్నీ మాయమయ్యాయి. "పది రూపాయలతో నెల్లూరుదాకా ఎట్ట పోవాల్రా బగమంతుడా.." అనుకుంటూ బయటికి నడిచాడు.
తన మనవడు ఆ గిలక్కాయతో ఆడుకుంటుంటే సంతోషపడ్డాడు వరదరాజు. పండుగాడి పంట పండింది. అనుకున్నదే తడవు తాటాకు గిలక్కాయ్ దొరికింది. అందులోంచి వచ్చే శబ్దమూ బాగుంది. ఆ రోజంతా అదే ఆట అయిపోయింది. సాయంత్రం వాళ్ళ నాన్న వామనరావు వచ్చేదాకా..!
"నాన్నా... నాన్నా.. ఇదుగో చూడు తాటాకు గిలక్కాయ్ " అంటూ చూపించాడు.
వామనరావు యధాలాపంగా చూశాడు. అంతలోనే ఏదో స్ఫురించినట్లు అందుకోని పరిశీలనగా చూశాడు.
నష్టాల్లో వున్న తన బొమ్మల కంపెనీ గుర్తుకొచ్చింది. తాటాకు గిలక్కాయ్ ఆ నష్టాలను గట్టెక్కించే ఆయుధంలా తోచింది.
"ఎవరక్కడ... వెంటనే బొమ్మల ఫ్యాక్టరీ ఇంజనీర్లను, డిజైనర్లను పిలిపించండి.."
అంటూ అరిచాడు. ఆ అరుపుకో, తన గిలక్కాయ తిరిగి ఇవ్వనందుకో తెలియదుకానీ పండు గుక్కపెట్టి ఏడవటం మొదలెట్టాడు.
మరో గంటలో అంతా హాజరయ్యరు. "ఇదిగో చూడండి... కొత్త రకం బొమ్మ...
ఇలాంటి బొమ్మ తయారు చెయ్యండి... ఎలా చెయ్యాలో కనిపెట్టండి"
అంటూ గిలక్కాయ్ వాళ్ళమధ్యలోకి విసిరాడు. అప్పుడు
మొదలైంది శల్య పరీక్ష. ఇంజనీర్లు లెక్కలు కట్టారు, డిజైనర్లు బొమ్మలు గీశారు. ఏడుస్తున్న పండుని వామనరావు
ఓదార్చాడు.
"ఇంకా ఎంతసేపు... అబ్బాయికి గిలక్కాయ్ కావాలి.." హూంకరించాడు వామనరావు.
"చిత్తం సార్... ఎంత చూసినా ఎలా తయారు చేశారో అంతు చిక్కటంలేదు సార్... పోనీ ఒకసారి విప్పి చూసి మళ్ళీ అల్లమంటారా?" అన్నాడు
అందరిలోకి పెద్ద ఇంజనీరు.
"ఏదో ఒకటి ఏడవండి..."
హుకుం జారీ అయినవెంటనే గిలక్కాయ్ వలిచేశారు ఇంజనీర్లు. పండు మళ్ళీ ఏడుపులంకించుకున్నాడు.
"విప్పినా తెలియటంలేదు సార్...
మళ్ళీ అల్లుదామన్నా మా వల్లకావటంలేదు.." భయం
భయంగా చెప్పాడు సీనియర్ డిజైనర్. పండు ఏడుపు తారాస్థాయికి చేరుకుంది.
వామనరావు కోపంతో ఊగిపోయాడు. ఇంతవరకు కనీవినీ ఎరుగని కొత్త కొత్త తిట్లు తిట్టాడు. పండుగాడు ఏడుపు ఆపేశాడు.
"ఆ ముసలయ్యని మళ్ళీ పిలిపించండి.."
అరిచాడు.
***
ఈ సారి ముసలయ్యకి కార్పొరేట్ మర్యాదలు. గెస్ట్ హౌస్ మకాం, హోటల్ భోజనం. మూడు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించాడు. మూడు రోజులకి
మూడొందలు ఇచ్చారు. ఇంజనీర్లు, డిజైనర్లు
తాటాకు గిలక్కాయ్ తయారు చెయ్యడంలో మెళకువలు తెలుసుకున్నారు. ఫాక్టరీలో
పని మొదలైంది. ముసలయ్య మళ్ళీ వీధిన పడ్డాడు.
ప్లాస్టిక్ గిలక్కాయలు వచ్చేశాయి...
రకరకాల రంగుల్లో అచ్చం తాటాకు గిలక్కాయ్ని పోలిన ప్లాస్టిక్ గిలక్కాయలు వచ్చేశాయి. దానికి తగ్గట్టు టీవీలో వచ్చే ప్రతి కార్టూన్ చానల్లో విపరీతంగా ప్రకటనలు. గిలక్కాయ్ వుంటే సూపర్ మాన్ అయిపోవచ్చని... గోడలెక్కి దూకచ్చని ఏమిటేమిటో వింత ప్రకటనలు.
గిలక్కాయ్ బాలల జన్మ హక్కని చాటారు.
పిల్లలకి గిలక్కాయ్ పిచ్చి పట్టినట్లైంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ గిలక్కాయలు. అక్కడ వామనరావు ఫాక్టరీలో లాభాలే లాభాలు. నాలుగేళ్ళ అధికారంలో వరదరాజు సంపాదించినంత ఒక్క సంవత్సరంలో ఒక్క గిలక్కాయ్ మీదే సంపాదించాడు వామనరావు. ప్రయోజకుడైన కొడుకుని చూసి మీసం మెలేశాడు వరదరాజు.
అక్కడ నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర ముసలయ్య తాటాకు గిలక్కాయలు కొనేవాళ్ళు కరువయ్యారు. తన దగ్గర గిలక్కాయ చెయ్యడం నేర్చుకున్నవాళ్ళే తన కడుపు కొడుతున్నారని తెలుసుకోలేకపోయాడు ఆయన. కూలి చేసుకోనైనా బతుకుదామని తమిళనాడుకి వలసపోయాడు.
సరిగ్గా అప్పుటి నుంచి ఫాక్టరీలో నష్టాలు మొదలయ్యాయి. అమ్మకాలు నెల నెల క్రమ క్రమంగా క్షీణించడం మొదలై అధమానికి పడిపోతున్నాయి. జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు వామనరావుకి. మార్కెట్ మొత్తం సర్వే చేయించాడు. అప్పుడు బోధపడింది అసలు రహస్యం - చైనా గిలక్కాయలు...!!
అచ్చం వామనరావు తయారు చేయించిన గిలక్కాయల్లాగే వున్నాయి... కానీ సగం ధరకే...!! ఇంకేముంది? అందరూ వామనరావు గిలక్కాయల్ని వదిలేసి చైనా గిలక్కాయలమీద పడ్డారు.
"ఇది అన్యాయం మన దగ్గర డిజైన్ కొట్టేసి చైనాలో చవగ్గా తయారు చేసి అమ్మేస్తున్నారు.." అంటూ వరదరాజు దగ్గర గోలపెట్టాడు వామనరావు. సరిగ్గా అప్పుడే పండు మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చాడు.
"నాన్నా.. నాన్నా... నాకు ఈ ప్లాస్టిక్ గిలక్కాయ్ వద్దు... నాకు ఆ తాటాకు గిలక్కాయే కావాలి..."
అంటూ మళ్ళీ ఏడవటం మొదలుపెట్టాడు. వామనరావు తలపట్టుకున్నాడు. వరదరాజు మళ్ళీ కలగజేసుకోని -
"ఇదుగో... ఆ నెల్లూరు శ్రీనివాసులుకి చెప్పి ఆ ముసలయ్యని మళ్ళీ పిలిపించండయ్యా..." అంటూ ఆర్డరు వేశాడు.
శ్రీనివాసులు ఇంకా నెల్లూరు జిల్లా అంతా వెతుకుతూనే వున్నాడు. ముసలయ్య కనపడటం లేదు.
<***>
(నవ్య వీక్లీ, 12 నవంబర్, 2014)
0 వ్యాఖ్య(లు):
కామెంట్‌ను పోస్ట్ చేయండి