మొపాస కథలు: క్షమయా ధరిత్రి

ఆమె కుటుంబం ప్రపంచానికి దూరంగా వుండటానికి ఇష్టపడేది. ఈమె కూడా అలాగే పెరిగింది. ప్రపంచంలో ఏం జరిగినా ఆ ఇంటికి దూరంగా వుండేది. ఎప్పుడైనా రాత్రి భోజనాలప్పుడు దేశ రాజకీయల గురించి వాళ్ళు మాట్లాడుకునేవారు. అవి ఎప్పటి సంగతులంటే, వాళ్ళు చరిత్ర పుస్తకంలో విషయాలు మాట్లాడుకున్నట్లు వుండేది. నెపోలియన్ దేశంలో దిగినట్లు, పదహారో లూయీస్ మరణించినట్లు విశేషాలు చెప్పుకునేవారు.

ప్రపంచం తనపాటికి తను మారిపోయేది. ఫ్యాషన్లు మారిపోయి కొత్త కొత్తవి వచ్చేవి. కాలం పథ్థతులను మార్చివేసేది. కానీ ఆ కుటుంబంలో మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఒకే సాంప్రదాయం నడిచేది. ఆ ప్రాంతంలో ఏదైనా హేయమైన సంఘటన జరిగితే ఆ వార్త ఈ ఇంటి గుమ్మం ఎక్కక ముందే చచ్చిపోయేది. ఎప్పుడైనా ఒకసారి ఆ తల్లి తండ్రి సాయంత్రం ఏకాంతంలో ఇలాంటివి మాట్లాడుకునేవాళ్ళు – అది కూడా గుసగుసగా! గోడలకు చెవులుంటాయిగా మరి!!

“ఆ రివోయిల్ కుటుంబంలో ఎంత ఘోరం జరిగిందో విన్నావా?” ఎక్కువగా చప్పుడు చెయ్యకుండా అడిగేవాడు తండ్రి.

“అవునవును. అసలు ఊహించలేము కదా! దారుణం” అనేది.

పిల్లలు విన్నా ఏమీ అర్థం అయ్యేది కాదు. అర్థం చేసుకోకుండా ఏళ్ళు గడిపేశారు. వయసుకు వచ్చారన్నమాటే కానీ కళ్ళకు, మొదళ్ళకు గంతలు కట్టుకోని పెరిగారు. జీవితంలో వాస్తవం అనే కోణం ఎలా వుంటుందో తెలియదు. మనుషులు మాట్లాడేది వేరు ఆలోచించేది వేరు ఆచరించేది వేరు అని తెలియదు. బతకాలంటే యుద్ధాలు చేయాలనీ, తుపాకీ పహారాలోనే శాంతి వుంటుందనీ, ముందు ముందు అలాంటి జీవితాలే గడపాలనీ తెలియదు. ఏ కల్మషం లేకుండా సాదాసీదాగా వుండేవాళ్ళను ప్రపంచం మోసం చెయ్యాలని చూస్తుందనీ తెలియదు. నిష్కపటంగా వుండేవాళ్ళని ఎగతాళి చేస్తారనీ, మంచివాళ్ళు వేధించబడతారనీ తెలియదు.

ఇలాంటి వాళ్ళు చాలా మంది వుంటాఋ. వాళ్ళలో కొంతమంది చివరిదాకా గుడ్డినమ్మకంతో, ప్రపంచం మీద, మనుషులమీద విశ్వాసంతో స్వచ్ఛంగా బతికేస్తారు. వాళ్ళ స్వచ్ఛతే వాళ్ళని కళ్ళు తెరువనివ్వకుండా గంతలు కట్టేస్తుంది. మిగిలినవాళ్ళు అలా కాదు. తప్పులు చేస్తారు. ఆ తరువాత ఆశ్చర్యపోతారు. అసహనంగా తయారౌతారు. ఇదంతా విధి ఆడిన నాటకం అనుకుంటారు. పరిస్థితుల చేతిలో ఓడిపోయామని బాధపడతారు. మనుషుల్లో అరుదుగా మాత్రమే తటస్థించే చెడ్డవాళ్ళు తమకే ఎందుకు కలిసారని ఆలోచిస్తారు.

ఆ కుటుంబం పేరు సవిన్యోల్. కూతురు బెర్తా. ఆమెకు పద్దెనిమిదేళ్ళు రాగానే ఘనంగా పెళ్ళి జరిపించారు. జార్జి బెరోన్ అనే పారశీ యువకుడుతో ఆమె పెళ్ళైంది. స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో పని చేసెవాడతను. అందగాడు, మంచి మర్యాద తెలిసినవాడు. అతన్ని చూస్తేనే అన్నీ సుగుణాలే వున్నట్లు అర్థం అవుతుంది. కాకపోతే అతనికి ఎక్కడో అంతరాళాలలో అత్తమామలంటే చులకన భావం వుంది. దగ్గర వాళ్ళతో వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళని “అవశేషాలు” అని వెక్కిరించేవాడు.

అతను మంచి కుటుంబం నుంచి వచ్చాడు. అమ్మాయిది కూడా బాగా ధనవంతుల కుటుంబం. ఇద్దరూ ప్యారిస్ లో స్థిరపడ్డారు. ఎంతో పేరుపడ్డ భర్త కుటుంబంలో ఆమె కూడా ఒక భాగమైపోయింది. ఇక్కడ కూడా బయట ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండానే ఆమె జీవితం గడిచిపోసాగింది. ఆ మహానగర సాఘిక జీవనం, సరదాలు, సంతోషాలు, వేడుకలు ఇవేవీ ఆమెకు పరిచయం కాలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవితాన్ని చూడలేకపోయింది. అందువల్లే మోసాలనీ, మాయామర్మాలనీ, విశ్వాసఘాతుకాలని కూడా చూడలేకపోయింది.
తన ఇంటికీ, కుటుంబానికీ అంకితమై వుండిపోయిందే తప్ప ఆమె వుండే వీధికి అవతల జరిగే విషయాలను కూడా తెలుసుకోలేదు. ఎప్పుడైనా అవసరానికి ప్యారిస్ నగరంలోని మరో వైపుకి వెళ్ళిన రోజు దుర్గమైన మార్గాలు దాటి అంతుతెలియని మాయాప్రపంచాన్ని చూసినంత ఆనందపడేది. అలాంటి రోజు సాయంత్రం భర్త కలిసినప్పుడు –
“ఈ రోజు ఊర్లోకి వెళ్ళాను తెలుసా” అంటూ ఏదో సాధించినట్లు చెప్పుకునేది.

ఒకటో రెండుసార్లు ఆమెకి నాటకాలు చూపించాడు అతను. అవి ఆమె మనసులో ఎన్నటికీ వాడిపోని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. అలా వెళ్ళి వచ్చిన చాలా రోజుల తరువాత కూడా ఆమె మాటల్లో ఆ విశేషాలు దొర్లుతుండేవి. ఒకోసారి ఏ మూడు నెలల తరువాతో ఉన్నట్టుండి ఆమె పగలబడి నవ్వేది.

“నీకు గుర్తుందా? జనరల్ వేషం వేసినవాడు కోడిలా భలే కూశాడు కదూ” అని గుర్తు చేసుకునేది. అటు అమ్మగారింటి వైపు, ఇటు అత్తగారింటి వైపు వున్న బంధువులే ఆమెకు తెలిసిన స్నేహితులు.

ఆమె భర్త మాత్రం ఆయన ఇష్టప్రకారమే నడుచుకునేవాడు. ఇష్టం వచ్చిన వేళకి ఇంటికి వచ్చేవాడు. ఒకోసారి బిజినెస్ కారణాలు చెప్పి చాలా ఆలస్యంగా వచ్చేవాడు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లు అతని నడవడి వుండేది. ఏ కల్మషమూ లేని భార్య మనస్సులో ఎలాంటి అనుమానాలు వుండవని అతనికి నమ్మకంగా తెలుసు.

కానీ అనుకోకుండా ఒక రోజు ఉదయం ఆమెకు ఓ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. ఆమె నెత్తిన పిడుగు పడ్డట్లైంది. స్వచ్ఛమైన ఆమె మనసుకి సంతకం లేని ఆ ఉత్తరం చేస్తున్న అపవాదుల తీవ్రత అర్థం కాలేదు. కానీ, అన్యాయాన్ని ఎదిరించడానికీ, నిజాన్ని బతికించడానికీ, ఆమె సంతోషాన్ని నిలబెట్టడానికి రాస్తున్నట్లుగా చెప్పుకున్న ఉత్తరాన్ని కాదని పడెయ్యలేకపోయింది. ఆమె భర్త గత రెండేళ్ళుగా రోసే అనే వితంతువుతో సంబంధం పెట్టుకోని, ప్రతి సాయంత్రం ఆమె దగ్గరే గడుపుతున్నట్లుగా ఆ జాబులో వుంది.

బెర్తాకి తన బాధని ఎలా దాచుకోవాలో తెలియలేదు. భర్తని అనుమానించి ఆరా తీసే ఆలోచనాలేదు. అతను మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఆ వుత్తరాన్ని అతని ముందు పడేసి భోరున ఏడుస్తూ తన గదిలోకి పరుగెత్తింది.

దాంతో సమాధానాన్ని తయారు చేసుకోడానికి అతని కావల్సినంత సమయం దొరికింది. వెళ్ళి భార్య గది తలుపు కొట్టాడు. ఆమె చటుక్కున తలుపు తీసింది కానీ అతని వైపు చూసే ధర్యం చెయ్యలేకపోయింది. అతను చిరునవ్వులు నవ్వుతూ కూర్చోని ఆమెని తన దగ్గరకు లాక్కోని కాస్త ఎగతాళి ధ్వనిస్తున్న గొంతులో చెప్పడం మొదలుపెట్టాడు.

“పిచ్చిపిల్లా, నిజమే నాకు రోసే అన్న పేరుతో ఒక స్నేహితురాలు వుంది. పదేళ్ళుగా పరిచయం. ఆమె అంటే నాకు ఎంతో గౌరవం. ఇంకా చెప్పాలంటే నేను నీతో ఎప్పుడూ ప్రస్తావించని స్నేహితులు చాలామంది వున్నారు. నీకేమో కొత్త పరిచయాలు నచ్చవు, ఫంక్షన్లు నచ్చవు, అసలు బయట ప్రపంచంతో సంబంధమే వుండదు కదా? ఇప్పుడేమో ఇలాంటి తప్పుడు నిందలు నమ్మి భయపడుతున్నావు. సరే ఒక పని చేద్దాం. భోజనం చేసిన తరువాత నువ్వు తయారవ్వు. ఇద్దరం కలిసి వెళ్ళి ఆ అమ్మాయిని కలుద్దాం. నువ్వు ఒక్కసారి కలిశావంటే నీక్కూడా ఆమె మంచి స్నేహితురాలౌతుంది. నా మాట నిజం” అన్నాడు.

ఆమె భర్తని గట్టిగా ఆలింగనం చేసుకుంది. ఒకసారి రాజుకుంటే ఆరిపోని నిప్పులాంటి స్త్రీ సహజమైన కుతూహలంతో అతనితో వెళ్ళి ఆమెని చూడటానికి ఒప్పుకుంది. ఇప్పుడు ఆమెకు అణువంత కూడా అసూయ లేదు. ప్రమాదానికి సిద్ధపడటం అంటే ఆ ప్రమాదాన్ని ఎదిరించే సామాగ్రిని సిద్ధం చేసుకోవడం అని మాత్రం అనిపించింది.
***
ఓ అందమైన ఇంటి నాలుగో అంతస్థులో చక్కగా అమర్చిన చిన్న ఫ్లాట్ లో ప్రవేశించారు ఇద్దరూ. పరదాలు, కర్టన్లతో చీకటిగా మారిపోయిన డ్రాయింగ్ రూమ్ లో ఓ అయిదు నిముషాలు ఎదురుచూశాక తలుపులు తెరుచుకున్నాయి. కాస్త పొట్టిగా, కొంచెం లావుగా, చామనఛాయలో వున్న స్త్రీ ఆశ్చర్యంగా చూస్తూ, చిరునవ్వులు నవ్వుతూ వచ్చింది.
 “ఈమె నా భార్య – ఈమె మేడమ్ జూలీ రోసే” జార్జి ఒకరికొకరిని పరిచయం చేశాడు.

ఆమె ఆశ్చర్యం, ఆనందం కలగలిపిన గొంతుతో సగం అరుపు అరిచి ఆ పైన అణిచేసుకుంది. చేతులు ముందుకు చాపి బెర్తా వైపుకు పరుగు తీసింది. మేడమ్ బెర్తా ఎవరినీ కలవదని తనకు తెలుసనీ అందుకే ఇలా ఇంటికే వచ్చేస్తుందని అసలు ఊహించలేదనీ చెప్పింది. ఆమె పరిచయం కలగడం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో చెప్పుకొచ్చింది. జార్జి అంటే తనకి ఎంతో ఇష్టమనీ (జార్జి అనే పేరును ఆమె ఎంతో కలగొలుపుగా, ఒక సోదరిలా పిలుస్తుంది) అందువల్ల అతని భార్యని కలిసి ఆమెతో కూడా స్నేహం చేయాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నట్లు కూడా చెప్పింది.

ఓ నెల గడిచేసరికి ఈ కొత్త స్నేహితులది విడదీయరాని బంధమైపోయింది. ప్రతి రోజూ కలుసుకునేవాళ్ళు. ఒకో రోజు రెండుసార్లు కలుసుకునేవాళ్ళు. ఒకరోజు వీళ్ళింట్లో భోజనం, మరోసారి వాళ్ళింట్లో. జార్జి ఇప్పుడు ఇంటిపట్టునే వుంటున్నాడు. అతని మాటల్లో బిజినెస్ ఇబ్బందులు మచ్చుకైనా కనపడటంలేదు. తన ఇంట్లో నిప్పుగూడు పక్కన కూర్చోవడంలో ఎంత ఆనందం వుందో చెప్తుండేవాడు.

ఓకసారి మేడమ్ రోసే వుంటున్న బిల్డింగ్ లోనే మరో ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది. బెర్తా క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఫ్లాట్ కొనేసింది. తన స్నేహితురాలితో మునుపటి కన్నా ఎక్కువ సమయం గడిపేందుకు అది మంచి అవకాశం అనిపించిందామెకు.

రెండేళ్ళపాటు వాళ్ళ స్నేహబంధం ఏ కారుమబ్బులు కమ్మకుండా సాగింది. ఆ అనుబంధం హృదయాలనూ, మనస్సులనూ కలిపింది. స్వచ్ఛమైన, సుకుమారమైన, అంకితమైన బంధంగా ఎదిగింది. ఇప్పుడు రోసే పేరు పలకకుండా బెర్తా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమెకు రోసే అంటే పరిపూర్ణమైన వ్యక్తిత్వం. ఇప్పుడు బెర్తా జీవితంలోకి సంతోషం, సాంత్వన, సంతృప్తి ప్రవేశించాయి.

కానీ మేడమ్ రోసే అనారోగ్యం పాలైంది. బెర్తా దగ్గరే వుండి సేవలు చేసింది. రాత్రిళ్ళు ఆమె దగ్గరే వుండేది. బాధతో విలవిలలాడేది. ఆమె భర్త అయితే అలవికాని దుఃఖానికి లోనయ్యాడు. ఓ రోజు ఉదయం రోసేని పరీక్షించిన డాక్టరు జార్జినీ, అతని భార్యని విడిగా తీసుకెళ్ళి మాట్లాడాడు. రోసే పరిస్థితి ఏమంత బాలేదనీ, కోలుకోకపోవచ్చనీ చెప్పాడు.
ఆయన వెళ్ళిపోయాక ఇద్దరూ బాధతో ఒకరికి ఎదురుగా మరొకరు కూలబడిపోయి కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. ఆ రాత్రి ఇద్దరూ ఆమె మంచం దగ్గరే మేల్కోని వుండిపోయారు. బెర్తా తన స్నేహితురాలికి పదే పదే ముద్దుపెడుతూ వుండిపోయింది. జార్జి ఆమె పాదాల దగ్గర నిలబడి జీవం కోల్పోయిన ఆమె ముఖాన్ని పరికిస్తూ గడిపాడు.

మర్నాటికి పరిస్థితి మరింత విషమించింది. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి తాను బాగానే వున్నానని చెప్పింది రోసే. స్నేహితులు ఇద్దర్నీ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి రమ్మని బలవంతం చేసి మరీ పంపించింది.

వాళ్ళి తమ ఇంట్లో భోజనానికి కూర్చున్నారన్న మాటే కానీ ఏమీ తినడానికి ప్రయత్నించలేదు. పనిమనిషి జార్జికి ఏదో కాగితం తెచ్చి ఇచ్చింది. అతను దాన్ని తెరిచి చదివాడు. ముఖం పాలిపోయింది. తన కుర్చీలోనుంచి లేచి భార్యవైపు చూశాడు.

“ఇక్కడ వుండు. నేను వెళ్ళక తప్పదు. పది నిముషాలలో వచ్చేస్తాను. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ్నుంచి కదలకు” అన్నాడు. తన గదిలోకి పరుగులు పెట్టి తన హ్యాట్ తెచ్చుకున్నాడు.

బెర్తా అతని కోసం ఎదురుచూస్తూ వుండిపోయింది. కొత్త భయాలేవో ఆమెని కమ్ముకున్నాయి. విధేయత ఆమె స్వభావం కాబట్టి భర్త వచ్చేదాకా తన స్నేహితురాలిని కలవడానికి కూడా వెళ్ళలేకపోయింది. ఎంతసేపైనా అతను తిరిగిరాలేదు. ఒకవేళ బిజినెస్ పని మీద వెళ్ళాడా అని అనుమానించింది. బిజినెస్ పని అయితే తప్పకుండా గ్లౌజులు వేసుకొని వుంటాడు కాబట్టి అతని గదిలోకి వెళ్ళి చూద్దామనుకుంది. వెళ్తే అవి ఎదురుగానే కనపడ్డాయి. వాటి పక్కనే హడావిడిలో నలిపి పడేసినట్లుగా ఒక కాగితం కూడా కనపడ్డది. అది నిస్సందేహంగా ఇంతకు ముందు జార్జి చూసిన కాగితమేనని అర్థం అయ్యింది.

ఆమెను మొదటిసారిగా ఓ కుతూహలం కమ్మేసి ఆ కాగితాన్ని చదివి అతను ఎందుకు అంత అర్థాంతరంగా వెళ్ళిపోయాడో తెలుసుకోమంది. అంతరాత్మ తిరగబడి అది తప్పని మాత్రం చెప్పగలిగింది కానీ భయం కలగలిసిన కుతూహలాన్ని మాత్రం జయంచలేకపోయింది. చప్పున కాగితాన్ని అందుకోని, సాపు చేసి వణుకుతున్న చేతులతో పట్టుకోని చూసింది. అది రోసే చేతి రాత!

“ఒక్కసారి ఒంటరిగా వచ్చి నాకు ముద్దు పెట్టవా ప్రియా! నా సమయం అయిపోవచ్చింది”

రోసే చావుకి సంబంధించిన విషయమే గమనించిన ఆమె మెదడుకి అసలు విషయం వెంటనే అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆమె చదివిన వాక్యాల అర్థం ఆమె ముఖం మీద ఒక విస్ఫోటనంలా విరుచుకుపడింది. ఆ పెన్సిల్ రాత ఆమె ఉనికినే ప్రశ్నించే దిగులు వెలుగును ప్రసరించింది. అతి హేయమైన ఒక నిజాన్ని బట్టబయలు చేసింది. ఆమెను ఇంతవరకూ బలి చేసిన ఒక విశ్వాసఘాతుకాన్నీ, మోసాన్ని తేటతెల్లం చేసింది. సంవత్సరాలుగా సాగుతున్న ద్రోహాన్ని, ఆమెను ఆట బొమ్మను చేసి ఆడించిన దుర్మార్గాన్ని తెలియపరిచింది.

ఆ ఇద్దరూ ఆమెకు కనపడ్డారు. ఏదో ఒక సాయంత్రం చిరుదీపపు వెలుగులో ఇద్దరూ పక్కపక్కనే కూర్చోని ఒకే పుస్తకంలో చదువుతూ పేజి చివరిలో ఒకరి ముఖం ఒకరు చూసుకున్న దృశ్యం మళ్ళీ ఆమెకు కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ప్రేమకు పేదయై, క్షోభపడి, రక్తమోడుతున్న ఆమె మనసు ఆమెను అంతు తెలియని నిరాశల ఊబిలోకి తోసేసింది. ఆడుగుల చప్పుడు వినపడింది. ఆమె పరుగున తన గదిలో వెళ్ళి తలుపులు వేసుకుంది. బయట నుంచి భర్త పిలిచాడు.

“త్వరగా రా, మేడమ్ రోసే చావుబతుకుల్లో వుంది” అన్నాడు

బెర్తా బయటకు వచ్చి వణుకుతున్న పెదాలతో సమాధానమిచ్చింది – “నువ్వు వెళ్ళు. ఆమెకు నాతో అవసరం లేదులే”

ఆమె సమాధానం అర్థం కాక అతను ఆమె వైపే చూశాడు. తిరిగి హెచ్చరించాడు: “చెప్తున్నాను కదా... వెంటనే బయల్దేరు. ఆమె చనిపోయేలా వుంది”.

“నీ స్థానంలో నేనుంటే వెళ్ళిపోయేదాన్ని” బెర్తా అంది.

చివరికి విషయం అర్థం చేసుకొని, ఆఖరిఘడియల్లో వున్నఆమె దగ్గరకు గడపడానికి వెళ్ళిపోయాడు.

ఆమె మరణం తరువాత బాహాటంగా విలపించడానికి ఏ మాత్రం సంకోచించలేదతను. అతని భార్య విషాదం మరో రకంగా సాగింది. భర్తతో మాట్లాడటం మానేసింది. కనీసం చూడనైనా చూడటంలేదు. తన చుట్టూ అసహ్యమనే కంచె కట్టుకోని, ఏహ్యభావం నిండిన కోపంతో కలిసి ఒంటరిగా బతుకుతోంది. పగలు రేయి తేడా లేకుండా భగవంతుడికి ప్రార్థనలు చేస్తోంది.

ఒకే ఇంటిలో ఉన్నా ఇద్దరూ వేరు వేరు ప్రపంచాలలో వుండేవారు. భోజనానికి కూర్చుంటే టేబుల్ ఆ చివర ఒకరు, ఈ చివర ఒకరు. ఇద్దరి మధ్య మౌనం, నైరాశ్యం పరుచుకోని వుండేది. విషాదం క్రమంగా కరిగిపోయింది కానీ ఆమె మాత్రం అతన్ని క్షమించలేదు. అందువల్ల ఇద్దరి జీవితాలు నిస్తారంగా చేదు విషంలా కొనసాగాయి.

దాదాపు ఓ సంవత్సరం పాటు ఇద్దరూ అపరిచితుల్లా బతికారు. బెర్తా ఆలోచించడం కూడా మానేసింది.

కానీ ఓ రోజు ఉదయం బయటికి వెళ్ళిన బెర్తా ఎనిమిది గంటలకు తిరిగి వచ్చింది. ఆమె చేతిలో తెల్లటి రోజాలతో చేసిన పెద్ద బొకే! భర్తతో మాట్లాడాలనుకుంటున్నట్లు వర్తమానం పంపింది. అతను ఖంగారుపడుతూ, భయపడతూ వచ్చాడు.

“మనం బయటకు వెళ్ళాలి. ఈ పువ్వులు మీరు తీసుకుంటారా? బాగా బరువుగా వున్నాయి” అంది.

వాళ్ళు ఎక్కిన జట్కా స్మశానం గేటు ముందు ఆగింది. వాళ్ళు దిగారు. బెర్తా కంటిలో కన్నీరు,

“ఆమె సమాధి దగ్గరకు తీసుకెళ్తావా?” అంది జార్జితో.

అతను ఖంగారుపడ్డాడు. ఎందుకు ఆ కోరిక కోరిందో అర్థం కాలేదు. కానీ కాదనకుండా అక్కడకు తీసుకెళ్ళాడు. అతని చేతిలో పూలు అలాగే వున్నాయి. చివరకు ఒక తెల్లటి పాలరాతితో కట్టిన సమాధి ముందు ఆగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చెయ్యెత్తి అ సమాధిని చూపించాడు.

ఆమె అతని చేతిలో బొకే అందుకోని సమాధి ముందు మోకరిల్లి వాటిని అక్కడ పెట్టిండి. తరువాత మౌనంగా మనసులోనే ప్రార్థనలు చేసింది. గతం మొత్తం జ్ఞాపకం చేసుకుంటూ ఆమె భర్త వెనుకే నిలబడ్డాడు.
ఆమె నిలబడి తన చేతిని అతని వైపు చాపింది.

“నీకిష్టమైతే మనం స్నేహితులుగా వుండిపోదాం” అంది.


***