మొపాస కథలు: దారప్పోగు

సంత జరిగే రోజు. గోడేర్విల్లా పట్టణానికి చుట్టుపక్కల వుండే రైతులంతా తమతమ భార్యలతో సహా అక్కడికి చేరుకుంటున్నారు. మగవాళ్ళు నెమ్మదిగా నడుస్తున్నారు. పొడుగ్గా వంకరగా వున్న తమ కాళ్ళతో ఒక్కో అడుగు వేసినప్పుడల్లా వాళ్ళ శరీరాలు భారంగా కదులుతున్నాయి. వాళ్ళ శరీరం వంకరలన్నీ పొలం పనులు చేయడం వల్ల వచ్చినవే. నాగలిని బలంగా తోస్తూ నడవటం వల్ల వాళ్ళ ఎడమభుజాలు కుడు భుజం కన్నా ఎత్తుగా వుంటాయి. కోతలు కోయడానికి వంగడం వల్ల శరీరం ఒక పక్కకి ఒరిగి వుంటుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు జారకుండా వుండేందుకు కాళ్ళు ఎడంగా పెట్టడం వల్ల అవి అలాగే వంకరగా మిగిలిపోతుంటాయి. కాస్త గాడిగా వుండే వాళ్ళ నీలం రంగు జుబ్బాల చేతులమీద, మెడ చుట్టూ చక్కని అల్లికలు వున్నాయి. గంజి పెట్టి పెట్టి అవి కాస్త చీకిపోయినట్లు వున్నాయి. అయితే బక్కపల్చటి వాళ్ళ శరీరాల మీద వదులుగా వుండే ఆ జుబ్బాలు పగలడానికి సిద్ధంగా వున్న గాలిబుడగలులా ఊగుతున్నాయి. ఆ బుడగల నుంచి పొడుచుకొచ్చినట్లుగా ఎముకల్లాంటి కాళ్ళు చేతులు కనిపిస్తున్నాయి.
వాళ్ళలో కొంతమంది చేతుల్లో వుండే తాళ్ళ రెండో కొసకు ఒక ఆవో, దూడో కట్టి వుంది. వాటి వెనుకే ఆడవాళ్ళు నాలుగైదు ఆకులున్న చిన్న కొమ్మలు పట్టుకోని వాటిని అదిలిస్తూ నడుస్తున్నారు. వాళ్ళ రెండో చేతిలో వుండే గంపల్లో నుంచి కోడి పిల్లలో, బాతు పిల్లలో తలలు బయటికి పెట్టి చూస్తున్నాయి. ఆడవాళ్ళు చురుగ్గా, త్వరగా నడుస్తున్నారు. ఎండిపోయినట్లుండే వాళ్ళ శరీరాలు నిటారుగా వుండి వాళ్ళ వేగానికి దోహదపడుతున్నాయి. కండలేనట్లుండే వాళ్ళ శరీరం పైన ఎక్కువగా దుస్తులేమీ లేవు. నడుముకి ఓ గుడ్డ, ఎదపై ఓ గుడ్డ. జుట్టు కనపడకుండే చుట్టుకున్న తెల్లటి గుడ్డ మరికటి. అంతే!
అప్పుడప్పుడు అటుగా వెళ్ళే ఎడ్లబండ్లు గుంతల్లో పడ్డప్పుడల్లా విచిత్రంగా ఊగిపోతూ ముందు కూర్చున్న మగవాడినీ, చివర్లో కూర్చున్న ఆడవాళ్ళని అతలాకుతలం చేస్తున్నాయి. అందుకే వాళ్ళు బండి కొసల్ని బలంగా పట్టుకోని కుర్చున్నారు.
సంతలో ఎక్కడ చూసినా తొక్కిసలాటలే. నిండా జనం, జంతువులు. అదో మహా సముద్రంలా వుంది. సముద్రం పైన అలల్లా జంతువుల కొనదేరిన కొమ్ములు, ఎత్తైన మగవారి టోపీలు, ఆడవారి జడలు కనపడతున్నాయి. గొంతు చించుకోని కీచుమంటూ అరిచే అరిపులన్నీ కలిసి చెవులు దిమ్మెక్కించేలా వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఏ రైతో సంతోషం పట్టలేక గట్టిగా నవ్విన నవ్వులో, గోడవారగా కట్టేసిన ఆవు దీర్ఘంతీస్తూ అరిచే అరుపులో వినిపిస్తోంది.
ఆ గాలిలో పేడకళ్ళ వాసన వుంది. పాల వాసన వుంది. ఎండుగడ్డి వాసన వుంది. చెమట వాసన వుంది. సగం మనుషులకు సంబంధించిన వాసన, సగం గొడ్లకు సంబంధించిన వాసన కలగలిసి, పల్లెటూర్లో వున్నవాళ్ళకే పరిచితమైన వాసనలు గాలిలో తేలుతున్నాయి.
సరిగ్గా అలాంటప్పుడే బ్రేట్ గ్రామానికి చెందిన మాస్టర్ ఉష్కార్న్ అక్కడికి వచ్చాడు. సంత మధ్యలోకి వెళ్ళబోతున్న అతనికి నేలమీద ఓ సన్నటి దారపు ముక్క కనిపించింది. అందరు రైతుల్లానే ఉష్కార్న్ కాస్త పొదుపరి. పనికొచ్చే వస్తువు ఏదైనా కనపడితే దాన్ని తీసుకోడానికి ఏ మాత్రం వెనుకాడక్కర్లేదని అతని సిద్ధాతం. అందువల్ల అక్కడే ఆగి, కీళ్ళ నొప్పుల వల్ల కాస్త ఇబ్బందిపడుతూనే ముందుకు వంగి ఆ సన్నటి దారప్పోగును అందుకున్నాడు. దాన్ని జాగ్రత్తగా చుట్టచుట్టి సరిగ్గా దాచుకోడానికి సిద్ధపడుతున్నప్పుడే అతనికి మాస్టర్ మాలోందా అతని షాపు గుమ్మంలో నిలబడి అతన్నే చూస్తూ కనిపించాడు. అతను గుర్రాలకి జీనులు తయారుచేసి అమ్ముతుంటాడు. ఒకసారి పలుపుతాడు కొనే విషయంలో ఆ ఇద్దరి మధ్య కాస్త వాదులాట జరిగింది. ఇద్దరిలోనూ ఆ కడుపుమంట వుంది. తన శత్రువులాంటి వాడు తనని ఓ దారం ముక్క ఏరుకుంటుండగా చూశాడని అర్థం అవగానే ఉష్కార్న్ కి సిగ్గుగా అనిపించింది. చటుక్కున దారం ముక్కని జుబ్బా చేతుల కింద దాచి, కనపడకుండా నెమ్మదిగా దాన్ని జేబులోకి తోసి ఏమీ తెలియనట్లు నిలబడ్డాడు. నేల మీద ఏదో వస్తువు పోగొట్టుకున్నట్లు అక్కడక్కడే వెతికి చివరికి అది దొరకనట్టుగా నటించి, సంతలోకి వడివడిగా వెళ్ళిపోయాడు. ఆ నడక వల్ల అతని కీళ్ళ నొప్పులు రెండింతలయ్యాయి.
కదిలిపోతున్న జనంలో అతను కలిసిపోయాడు. సంతకొచ్చిన జనం సహజంగానే అవీ ఇవీ చూస్తే బేరాలాడుతూ నెమ్మదిగా కదులుతుంటారు. రైతులు వచ్చి ఆవుల్ని పరిశీలించి వెళ్ళిపోతారు. మోసపోతున్నామేమో అన్న అనుమానం వెంటాడుతుంటే మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తుంటారు. కొనాలో వద్దో తేల్చుకోరు. అమ్మేవాడు తప్పకుండా ఏదో మోసం చేస్తుంటాడని అది ఎలాగైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
ఆడవాళ్ళు గంపల్నికాళ్ళ దగ్గర దించుకోని, అందులో వున్న కోళ్ళనో, బాతుల్ని బయట వదిలిపెడుంటారు. వాటి కాళ్ళు కట్టేసి వుంటాయి కాబట్టి అవి కదల్లేక భయం భయంగా చూస్తుంటాయి. ఎవరో ఒకరు బేరమాడతారు. తగ్గించి అడుగుతారు. వీళ్ళ ధరలో ఏ మాత్రం మార్పూ రాదు. ముఖంలో ఏ భావం కనపడకుండా స్థిరంగా నిలబడతారు. అయినా ఒక్కోసారి దిగి వచ్చి, వెళ్ళిపోతున్న వాళ్ళని కేకేసి పిలుస్తారు.
“ఓమ్మో... నువ్వు చెప్పిన ధరకే ఇస్తాలే.. రా...రా..” అంటారు.
బేరాలన్నీ అయిపోతుంటే క్రమక్రమంగా ఆ ప్రాంతం పల్చబడుతుంది. సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి అక్కడి హోటళ్లు దూరం నుంచి వచ్చినవారితో కిక్కిరిసిపోతాయి.
జ్యోదా హోటల్ సంగతి చెప్పనే అఖ్ఖర్లేదు. తినడానికి వచ్చినవాళ్ళతో నిండిపోయేది. బయట రకరకాల బండ్లు ఒకదాని ఒకటి ఒరుసుకుంటూ నిలబెట్టేవాళ్ళు. ఒంటెద్దు బండ్లు, గుర్రపు బగ్గీలు, జోడెడ్ల బండ్లు ఇంకా ఏమిటేమిటో పేరులేని బండ్లు. వాటి నిండా మట్టి, దుమ్మ వుంటుంది. ఆకాశంలోకి చేతులు చాచినట్లు కొన్ని బండ్ల కాడెలు పైకి లేపి వుంటాయి. కొన్ని తమ ముక్కుని నేలకి రాస్తున్నట్లు ముందుభాగం భూమి మీద పడినట్లు వుంటాయి. చాలావరకు వంకర్లు తిరిగిపోయి, అక్కడక్కడ విరిగి అతుకులు వేసినట్లు వుంటాయవి.
లోపల సరిగ్గా భోజనాలు చేసే చోట ఒక పెద్ద నిప్పుగూడు వుంది. భగభగా కాలుతూ వెలుతురు చిమ్ముతూ వుంటుంది. అక్కడ కూర్చుని తినేవాళ్ళ వీపులు ఆ మంటకు వేడెక్కుతుంటాయి. మూడు ఇనుప చువ్వలకు రకరకాల మాంసాలు గుచ్చి వాటిని మంటల్లో తిప్పుతుంటారు. వాటి నుంచి వచ్చే వాసన చూస్తే చాలు అందరికీ నోట్లో నీరు వచ్చేస్తుంటుంది.
ఆ రోజు కూడా నాగలిపట్టే రారాజులంతా అక్కడే చేరారు. ఆ హోటల్ యజమాని మాస్టర్ జ్యోదా ఒకప్పుడు గుర్రాలను అమ్మేవాడు. తెలివైన వాడు, మాటకారి. ఆ రోజుల్లో బాగానే సంపాదించాడని చెప్పుకుంటుంటారు.
ఓ పక్క నుంచి పసుపు రంగులో వున్న వైను, మరో వైపు రకరకాల మాంసాహారం వస్తున్నాయు. వచ్చినవి వచ్చినట్లే అయిపోతున్నాయి. వాటి మధ్యలో ఆ రోజు ఏం కొన్నారో, ఏం అమ్మారో అన్నీ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు. పంటల గురించి తమ దృష్టికి వచ్చిన విషయాలను పంచుకుంటున్నారు. “ఈసారి వాతావరణం కాయగూరలకు బాగుంటుందంట. తేమ ఎక్కువగా వుంది కదా, ధాన్యం జోలికి వెళ్ళకపోతేనే మంచిది” అని చెప్పుకుంటున్నారు.
ఉన్నటుండి బయట నుంచి దండోరా మోత వినిపించింది. నిరాసక్తంగా వున్న కొద్దిమంది తప్ప మిగిలిన అందరూ బయటికి పరిగెత్తారు. కొంత మంది గుమ్మం దగ్గర నిలబడి చూస్తుంటే, మరి కొంతమంది కిటికీలో నుంచి చూస్తున్నారు. నోటి నిండా కుక్కోని, చేతిలో నేపకిన్లతో నిలబడ్డారు.
తన డప్పు మోత అందరూ విన్నారని నిర్థారించుకున్న తరువాత అతను డప్పు కొట్టడం ఆపి తన గొంతు సవరించుకోని, వాక్యంలో ఎక్కడ విరామమివ్వాలో తెలియని వాడిలా చెప్పడం మొదలుపెట్టాడు.
“గోడర్విల్లా ప్రజలారా, మరీ ముఖ్యంగా ఒక్కడికి వచ్చిన పొరుగు ప్రజలారా. ఈ రోజు ఉదయం తొమ్మిది, పది గంటల మధ్య బూజ్విల్లా రోడ్ దగ్గర నల్లటి లెదర్ తో చేసిన పాకెట్ బుక్ పోయింది. అందులో ఐదు వందల ఫ్రాంకులు, ముఖ్యమైన బిజినెస్ కాగితాలు వున్నాయి. అది ఎవరికైనా దొరికినట్లైతే దానిని మేయర్ ఆఫీస్ కి చేర్చవలసిందిగా వారి తరఫున ప్రకటిస్తున్నాను. అలా తెచ్చిచ్చిన వారికి ఇరవై ఫ్రాంకుల బహుమానం కూడా వుందహో...” అంటూ అరిచాడు.
దండోరా వేసినతను వెళ్ళిపోయాడు. మరోసారి దూరం నుంచి అతను కొట్టే డప్పు చప్పుడుని, వినపడీ వినపడని అతని మాటల్ని శ్రద్ధగా విన్నారు. ఆ తరువాత ఆ సంఘటన గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. పోగొట్టుకున్న వ్యక్తికి పాకెట్ బుక్ దొరుకుతుందా దొరకదా అని పందాలు వేసుకున్నారు.
అంతా భోజనాలు పూర్తి చేసి కాఫీలు తాగుతున్నారు. సరిగ్గా అప్పుడే సైన్యాధికారి ఒకతను వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డాడు.
“బ్రూటూ నుంచి వచ్చిన మాస్టర్ ఉష్కార్న్ ఇక్కడ వున్నాడా?” అని అడిగాడతను.
”నేనే, నేనే. ఇక్కడే వున్నాను” అంటూ టేబుల్ చివర కూర్చోని వున్న ఉష్కార్న్ లేచి నిలబడ్డాడు. ఆ తరువాత ఆ అధికారి వెనుకే నడుచుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు..
అతను అక్కడికి వెళ్ళేసరికి మేయరుగారు తమ సింహాసనం లాంటి కుర్చీ మీద కూచోని ఎదురుచూస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తానికి ఆయనే నోటరీ. బాగా ఎత్తుగా, ధృఢంగా వుంటాడు. మాట గంభీరంగా వుంటుంది.
“మాస్టర్ ఉష్కార్న్ ఈ రోజు ఉదయం బూజ్విల్లా రోడ్ లో మన్నెవైల్ నుంచి వచ్చిన మాస్టర్ ఉల్బ్రైక్ పాకెట్ బుక్ నువ్వు తీశావని నీ మీద ఫిర్యాదు అందింది” అన్నాడాయన.
ఏ పాపం ఎరుగని ఆ పల్లెటూరి మనిషి ఆశ్చర్యంగానూ, భయంగానూ మేయర్ వైపు చూశాడు. ఎందుకో తెలియదు కానీ అప్పటికే ఏదో అనుమానం అతన్ని వెంటాడుతోంది,
“నేనా? నేను ఆ పాకెట్ బుక్ తీశానా?” అన్నాడు.
“అవును, నువ్వే”
“ప్రమాణపూర్తిగా నాకేమీ తెలియదు”
“నువ్వు తీసుకుంటుండగా చూసినవాళ్ళు వున్నారు”
“చూశారా? నన్నా? ఎవరా చూసినవాళ్ళు?”
“గుర్రాలకు జీనులు తయారు చేసే మాలోందా”
అతనికి జరిగింది గుర్తుకొచ్చింది. విషయం అర్థం అయ్యింది. కోపంతో ముఖం ఎర్రబడింది.
“చూశాడట చూశాడు. వాడో పెద్ద వెధవ. నేను ఇదుగో, ఈ దారపు ముక్క తీసుకుంటుంటే చూశాడు దొరా” అంటూ తన జేబుల్లో చేతిని పెట్టి వెతికి చివరకు దారాన్ని తీసి చూపించాడు. మేయర్ అపనమ్మకంగా తల ఊపాడు
“నువ్వు ఎన్ని చెప్పినా నమ్మించలేవు ఉష్కార్న్. మాలోందా నమ్మదగ్గ వ్యక్తి. అలాంటి మనిషి ఒక దారప్పోగుని చూసి పాకెట్ బుక్ అనుకున్నాడు అంటే నమ్మమంటావా?”
ఉష్కార్న్ కోపం కట్టలు తెంచుకుంది. చేతిని ఒక్క ఊపుతో పైకెత్తి బలంగా భూమి మీద ఒట్టు పెట్టినట్లు కొట్టాడు.
“నిజం ఏమిటో దేవుడికి తెలుసు. దొరవారూ... నేను నా ప్రాణం మీద ఒట్టుపెడుతున్నాను. నాకేం తెలియదు” అన్నాడు. మేయర్ తన ధోరణిలోనే వున్నాడు.
“నువ్వు ఆ పుస్తకం తీసుకున్న తరువాత దానిలో నుంచి డబ్బులు ఏమైనా అక్కడ పడ్డాయేమోనని చుట్టుపక్కల మొత్తం వెతికావట కదా?” అన్నాడు.
ఇతని కడుపులో భయం మొదలై అది అక్కడ అరగకపోగా గొంతు దాకా వచ్చి మాటలు రానివ్వకుండా చేస్తోంది.
“ఎవరు మీతో చెప్పినవాళ్ళు? అసలు ఎలా చెప్పారండీ ఆ అబద్ధాలు... ఏ పాపం తెలియని వాణ్ణి! నా గురించి అలా ఎలా చెప్పారు?”
అతని వాదన బూడిదలో పోసిన పన్నీరైంది. ఎవరూ అతన్ని నమ్మలేదు. మాలోందాతో వాదన చాలా సేపు సాగింది. అతను తన వాగ్మూలం విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాదాపు గంట సేపు వాదించుకున్నారు. ఉష్కార్నే స్వయంగా కోరడంతో అతన్ని తనిఖీ కూడా చేశారు. ఏమీ దొరకలేదు.
చివరికి ఏం చేయాలో తోచక, మేయరుగారు ఉష్కార్న్ ని అక్కడ్నుంచి పంపించేశారు. ఈ విషయాన్ని పై అధికారులకి విన్నవిస్తాననీ, వారి ఆజ్ఞ ఎలా అయితే అలా జరుగుతుందని మాత్రం చెప్పాడు.
ఈ వార్త గుప్పుమంది. మేయరు ఆఫీసు నుంచి ఉష్కార్న్ బయటికి వచ్చేసరికి చాలా మంది అతని చుట్టూ మూగారు. నిజంగా సానుభూతో లేక వెటకారమో తెలియదు కానీ అందరూ ఎంతో ఉత్సుకతతో ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రశ్నల్లో అతనికి మాత్రం ఏ వ్యంగ్యమూ కనిపించలేదు. అందువల్ల తన దారం కథ మొత్తం వివరంగా చెప్పాడు. ఎవ్వరూ నమ్మలేదు. పడీ పడీ నవ్వారు.
అతను ముందుకు సాగిపోయాడు. దారి పొడుగునా ఎవరో ఒకరు అతని సంగతి గుచ్చి గుచ్చి అడిగారు. అతను కూడా కొంతమంది పరిచయస్థులకి వాళ్ళు అడగకపోయినా తన కథ మొత్తం చెప్పాడు. తన వాదన మొత్తం వినిపించుకున్నాడు. జేబులు తిరగేసి చూపించి, తనకే పాపం తెలియదని నిరూపించుకోవాలని చూశాడు.
“అమ్మ ముసలోడా! గట్టోడివే” అన్నారు కొంతమంది.
తన మాట నమ్మడంలేదన్న కోపంతో, కసితో మళ్ళీ మళ్ళీ తన కథని రోజంతా చెప్తూనే వున్నాడు.
సంధ్య గూట్లో పడింది. ఇంక అంతా ఇళ్ళకు వెళ్ళిపోయే సమయం. తన ఊరివాళ్ళు ముగ్గురు మిగిలారు. వారితో కలిసి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళకి దారం దొరికిన ప్రదేశం చూపించాడు. దారి పొడుగునా తన కథని మళ్ళీ మళ్ళీ వినిపించాడు.
బ్రూటూ చేరిన తరువాత ప్రతి ఇల్లూ తిరిగి అందరికీ తన కథ చెప్పాడు కానీ ఎవరూ అతన్ని నమ్మలేదు. రాత్రంతా ఆలోచిస్తూ గడిపాడు.
ఆ మర్నాడు మధ్యాన్నం సమయానికి ఇమోవిల్లాలో మాస్టర్ బ్రిటోన్ అనే భూస్వామి దగ్గర తోట పని చేసే మారీస్ పామేల్ అనే పాలేరు ఉల్ర్బైక్ పాకెట్ బుక్ తిరిగి ఇచ్చాడట. ఆ పుస్తకం తనకు ముందురోజు రోడ్డు మీద దొరికిందనీ, తనకి చదువు రాకపోవటం వల్ల ఆ పుస్తకాన్ని ఏం చెయ్యాలో తలియక ఇంటికి తీసుకెళ్ళి తన యజమానికి చూపించానని చెప్పాడు. ఆ వార్త సుడిగాలిగా తిరిగింది. మాస్టర్ ఉష్కార్న్ కి తెలియజేశారు. అతను తన కథ మళ్ళీ మళ్ళీ చెప్పసాగాడు. ఇప్పుడు ఆ కథలో ముగింపు అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పినట్లుగా అనిపించింది. తన మాటే నిజం అని తెలిసిపోయింది. తను గెలిచాడు!!
“నన్ను బాధపెట్టింది దొంగతనం కాదు! నేను అబద్ధాలాడానన్నారు చూడండి అది అన్నింటికన్నా అవమానకరం. అంత కన్నా దారుణం వుంటుందా” అన్నాడతను అందరితో.
రోజూ తన కథని సాహస గాధలా అందరికీ చెప్పుకున్నాడు. దారిన పోయేవారిని ఆపి మరీ చెప్పాడు. క్యాబరేలో తాగుబోతులకు చెప్పాడు. ఆదివారం చర్చి నుంచి బయటకు వచ్చే జనానికి బలవంతంగా చెప్పాడు. ఎవరో తెలియని అపరిచితులకు కూడా చెప్పడం మొదలుపెట్టాడు. అతనికేదో భారం దిగిపోయినట్లు వుంది. కానీ క్రమంగా ఏదో తేడా వున్నట్లుగా అనిపించసాగింది. అదేమిటో అర్థం కాలేదు. అతను చెప్పే విషయాన్ని అందరూ వింటున్నారు కానీ వాళ్ళకి అదేదో హాస్య కథలాగా అనిపిస్తున్నట్లుంది. అతను చెప్పే విషయాన్ని నమ్ముతున్నారని నమ్మకం లేదు. కథ చెప్పి అటు తిరగగానే అతని వెనుకే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆ తరువాత వచ్చిన మంగళవారం గోడర్విల్లా సంతకి మళ్ళీ వెళ్ళాడు ఉష్కార్న్. ఈసారి కేవలం తన కథ చెప్పుకోడానికే వెళ్ళాడు.
మాలోందా తన షాపు గుమ్మం ముందు నిలబడి ఉష్కార్న్ కనపడగానే గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. కారణం? తెలియదు.
మరో గ్రామానికి చెందిన ఓ రైతు కనపడితే అతనికి తన కథ చెప్పబోయాడు. కానీ అతను అవకాశం ఇవ్వలేదు. ఉష్కార్న్ కడుపులో చిన్నగా గుద్ది – “మొత్తానికి నువ్వు జగత్కిలాడివి” అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
మాస్టర్ ఉష్కార్న్ నోట మాట రాక నిలబడిపోయాడు. అసహనం ఎక్కువైంది. అతను ఎందుకు తనని “కిలాడి” అన్నాడు?
జ్యోదా హోటల్లో కూచున్నాక మళ్ళీ తన కథ వివరించే ప్రయత్నం చేశాడు. గుర్రాల వ్యాపారం చేసే మోంటీవిల్లా గ్రామస్తుడు ఒకతను గట్టిగా అరిచాడు – “రేయ్ ముసలోడా... నీ సంగతి, నీ దారం సంగతి మాకు బాగా అర్థం అయ్యిందిలేరా” అన్నాడు.
ఉష్కార్న్ తడబడ్డాడు. “అదీ.. ఆ పాకెట్ బుక్ తరువాత దొరికింది కదా” అన్నాడు.
“చాల్లే ఆపరా నీ కతలు. దొరికేది ఒకడికి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇంకొకళ్ళు. మీరు తప్ప ఇంక తెలివైనవాళ్ళే లేనట్టు..” అంటూ నవ్వాడతను.
పాపం ఉష్కార్న్ కి ఏం చెప్పాలో తెలియలేదు. ఆలోచిస్తే అర్థం అయ్యింది. ఆ పాకెట్ బుక్ తనే తీసుకున్నాడని అంతా నమ్ముతున్నారు. తిరిగి ఇచ్చింది తన తోడుదొంగ అని వాళ్ళ నమ్మకం. కాదని శతవిధాల వాదించాడు. అంతా నవ్వారే తప్ప నమ్మలేదు. భోజనం చెయ్యబుద్ధి కాలేదు. అందరూ ఎగతాళి చేస్తుంటే భరించలేక అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
నిరుత్సాహంగా ఇల్లు చేరుకున్నాడు. మనసంతా చికాకుగా, గందరగోళంగా తయారంది. కోపం, అసహనం గొంతుకు అడ్డంపడ్డట్టుగా అనిపించసాగింది. ఆలోచిస్తే ఒక విషయం అతనికి అర్థం అయ్యింది. తాను దొంగతనం చెయ్యాలంటే నిముషం పట్టదు. వాళ్ళు తనని వేలెత్తి చూపడం అటుంచి, తనే ఎంత తెలివిగా దొంగతనం చేశాడో అందరికీ చెప్పుకునేవాడు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తను ఏ తప్పూ చేయలేదని నిరూపించడం దాదాపు అసాధ్యంలా కనపడుతోంది. అనుమానం అనే భూతం చేసిన అన్యాయానికి తాను బలి అయిన భావన అతని గుండెల్ని పట్టేసింది.
ఆ రోజు నుంచి ప్రతి మనిషికీ ఈ కథ చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పిన ప్రతిసారి వివరాలు పెంచసాగాడు. అదనంగా తన అమాయకత్వాన్ని నిరూపించే సాక్ష్యాలను జోడించడం మొదలుపెట్టాడు. రోజు రోజుకి అతను చేసే ప్రమాణాల తీవ్రత వాటి పవిత్రత పెరగసాగింది. వాదనలో బలం పెంచుకుంటూ, అందరికీ చెప్పుకోసాగాడు. ఇంట్లో వంటరిగా వున్నప్పుడు కూడా ఇదే ఆలోచన. తాను నిర్దోషి అని ఎలా నిరూపించుకోవాలి? ఆ దారం ముక్క కథ అతని మనసులో చిక్కుపడి వుండిపోయింది. అతని వాదనలో తర్కం పెరిగేకొద్దీ, విన్నవారికి అది అబద్ధం అన్న నమ్మకం మరింత పెరగసాగింది.
“అబద్ధాలకి అరవైఆరు సాక్ష్యాలు” అతని వెనుక అనుకునేవారు. అయినా అతనికి అవి తగిలేవి. వాటిని తిప్పికొట్టాలని విశ్వప్రయత్నం చేసేవాడు. ఆ ప్రయత్నంలో అలసిపోయేవాడు. గంటలు, రోజులు గడిపేశాడు. అప్పుడప్పుడు కొంతమంది అతన్ని పిలిచి హాస్యానికి “దారప్పోగు కథ చెప్పు” అని చెప్పించుకుని నవ్వుకునేవాళ్ళు. ఇవన్నీ అనుభవించి, భరించి అతని మనస్సు వికలమైపోయింది.
డిసెంబరులో మంచానపడ్డాడు. జనవరి నెలాఖరులో చనిపోయాడు. చనిపోయే ముందు మాయ కప్పేసినా మాటలు మారలేదు.
“చిన్న దారప్పోగు... ఇదిగో.. చూడండి.. మీరే చూడండి... చాలా చిన్న దారం ముక్క...” అంటూనే పోయాడు.
<***>

అనువాదకుని మాట
ఈ కథతో “మొపాస కథలు” శీర్షిక ముగుస్తోంది.
మొపాస ఒక మాయాజాలం. అతని కథలు ఎన్ని చదివినా ఇంకా చదవాలనిపిస్తూనే వుంటుంది. వస్తు వైవిధ్యం, శిల్ప విన్యాసం నూట పాతికేళ్ళ క్రితమే సాధించిన కథలవి. శ్రీ ధనికొండ హనుమంతరావు, శ్రీ మహీధర జగన్మోహనరావు వంటివారు ఎంతో మంది మొపాసని అనువదించారు. మళ్ళీ అనువాదానికి పూనుకోవడం సాహసమే. అయినా అతని రచనలని పూర్తిగా అనుభవించాలన్న కోరికతో ఈ అనువాదాలకు పూనుకున్నాను. ఆ అనుభవాన్ని అభినందనలతో ద్విగుణం చేసిన కౌముది పాఠకులకు, నా బ్లాగ్ పాఠకులకు అభివందనాలు. రెండు సంవత్సరాలు మొపాసతో ప్రయాణించే అవకాశాన్ని ఇచ్చిన “కిరణ్ ప్రభ” గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.

అరిపిరాల సత్యప్రసాద్