ప్రశ్నార్థకాలు (కథ)


నీరసం వల్ల ఎక్కువ బాధ కలుగుతోందా? అవమానం వల్ల ఎక్కువ బాధ కలుగుతోందా? ఎందుకింత ఇంత చిరాకుగా ఉంది?

ఈ వచ్చేపోయేవాళ్ళకి వేరే పనిలేదా? ప్రతివాడు వచ్చి ఏమిటి సంగతి అని అడగకపోతే వాళ్ళ పనేదో చూసుకోకూడదూ? ఖర్మ కాకపోతే ఏమిటి? నా మీద కమీషనర్ గారికి కంప్లైంట్ అందడమేమిటి? ఆయనగారు వెంటనే కలవమనీ ఆర్డర్ వెయ్యడం ఏంటి? కంప్లైంట్ వస్తే సరిపోయిందా? అది నిరూపణ కావద్దూ? ఆ విషయం ఆయనకి మాత్రం తెలియదా? ఒకవేళ నిరూపణ కాదని తెలిసే, ఎదురుచూపులు అనే శిక్షవేసి పొద్దున్నుంచి కూర్చోబెట్టాడా?

లేచి నిలబడటానికే ఇంత కష్టంగా వుందే? మోకాళ్ళు పట్టేశాయేంటి? వయసు మీద పడటంలా? వయసు ప్రభావం జ్ఞాపకం మీద కూడా పడిందా ఏమిటి? కమిషనర్ గారి పియే పేరు గుర్తుకువచ్చి చావదే? నాగేశ్వరరావా? నాగభూషణమా?

“నాగభూషణం గారూ, సార్ ఏమైనా పిలిచారా?” నా గొంతులోకి కొత్తగా జంకు ఎక్కడ్నించి వచ్చిందో?

“పిలిస్తే చెప్పనా? వెయిట్ చెయ్యమన్నా కదా?” కోపాన్ని ముక్కు మీదే పెట్టుకు తిరుగుతుంటాడా ఈయన?

వయసులోనూ, సీనియారిటీలోనూ పెద్దవాణ్ణి కదా? ఇదే ఆఫీసులో వుంటే నన్ను సార్ సార్ అనేవాడు కాదూ? ఆ సీటు పలికిస్తున్న మాటలు కావూ ఇవి?

“ఒక్క టీ తాగిరావచ్చా?” అడిగానా? అర్థించానా?

“ఆయన పిలిచే టైంకి మీరు లేకపోతే? ఆ మనిషి కోపం సంగతి తెలుసుగా?”
ఉండాలా? వెళ్ళాలా?

ఈ ప్యూన్ సైదులు కనిపించిన ప్రతిసారీ ఎందుకు చెయ్యెత్తి విష్ చేస్తాడు?

“టీ తాగడానికేగా? త్వరగా వచ్చేస్తారుగా?” అడగకుండానే మనసులో విషయాలు వీడికెలా తెలుస్తాయో? సాయంత్రమయ్యాక చేసిన ప్రతి నమస్కారానికీ విలువ కట్టి నా దగ్గర్నుంచి వసూలు చేస్తాడేమో? కమిషనర్ గారు పిలిపించారంటే ఏదో పెద్ద చేప అయ్యుంటుందని అనుకుంటున్నాడా? విదిలిస్తే నా దగ్గర రెండు నీటి చుక్కలన్నా రాల్తాయనా?

ఏమిటిది? రోడ్డు మీద ట్రాఫిక్కా? వాహనాల ప్రవాహమా? మహానగరం అంటే ఇదేనేమో? అవునూ, గేటు బయట కుడి పక్కనే ఒక టీ బంకు వుండాలే? తీసేశారా? ఇంకేదో బండి వుందే? ఆ బండి దగ్గర వున్నామె అమ్ముతున్నదేంటి? టీయేనా? లేకపోతే, ఆ ప్లాస్టిక్ కప్పులు, ఫ్లాస్కులు ఎందుకుంటాయిలే?

“టీ ఇస్తావా?” ఆమె తలకూడా ఎత్తదే? కొత్తగా సిగరెట్ తాగాలనిపిస్తోందేంటి?

“సిగరెట్లు వున్నాయామ్మా?”

ఇరవై ఏళ్ళైందా నేను సిగరెట్ మానేసి? మళ్ళీ ఇప్పుడు తాగాలనిపించిందేమిటి? పొద్దున్నుంచి చీకటి గుహలా వున్న ఆఫీసులో వున్నందువలనా? ఆ పాత ఫైళ్ళ వాసన పడకపోవటం వల్లనా? లేకపోతే కమీషనర్ గారు ఏం చీవాట్లు వేస్తాడోనన్న టెన్షన్ వల్లనా

ఒక్క చుక్క టీ అయినా తాగనిస్తేనా? సిగరెట్ వెలిగించి కనీసం ఒక్క దమ్మైనా లాగానా? ఇంతలోనే ఆ సైదులుగాడు రావాలా?

“ఇక్కడున్నారా? రారా?” పిలిచాడా? బెదిరించాడా? కంగారుకి చెయ్యి వణికితే మాత్రం ఆ టీ చుక్కలు చొక్కా మీదే పడాలా? ఇప్పుడు టీ తాగాలా వద్దా? సిగరెట్ పడేయాలా వద్దా? అసలు ఆలోచించే ప్రశ్నలా ఇవి?

ఇదేమిటి? పర్సులో వెయ్యిరూపాయల కాగితం ఒకటే వుందే? పదిహేడు రూపాయలకి వెయ్యి కాగితమా?

“చిల్లర లేదా సార్?” అనుకున్నట్లే అడిగిందే?

“నీ దగ్గర లేదా?”

“వుంటే ఎందుకు అడుగుతాను?”

“పోనీ నీ దగ్గరే వుంచుతావా? చిల్లర వస్తుందిగా?”

వెయ్యి నోటు కన్నా కమిషనర్ గారి పిలుపు ముఖ్యం కదా? పరిగెట్టక తప్పుతుందా? అవునూ ఈ సైదులు గాడేడి? ఇంతలోనే వెళ్ళిపోయాడా? పరిగెత్తుతుంటే గుండె ఎందుకిలా దడ దడ లాడుతోంది? వయసైపోయిందా?

సైదులుగాడు ఇక్కడ కూడా లేడే? కమిషనర్ గారి రూమ్ లోకి వెళ్ళాడా? తలుపు వేసుందే? అది తెరుచుకోని వస్తోంది వాడేనా?

“ఏంటి సార్ మీరు?” అన్నాడు సరే, తల ఎందుకు కొట్టుకున్నాడు? కొంపదీసి కమిషనర్ గారికి కోపం వచ్చిందా?

“లోపలికి వెళ్ళమంటావా?”

“ఏంటి ఎళ్లేది? పిలిచినప్పుడు ఎక్కడికి పోయారు? మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో?”
ప్రాణం ఉస్సూరనదూ? పొద్దున్నుంచి ఎదురుచూసినదంతా వృధా అయినట్టేనా? పైగా పిలిచినప్పుడు లేనని పేరొకటా? మళ్ళీ ఎదురుచూపులు తప్పవా? అబ్బబ్బా... ఈ ఫ్యానెందుకు కటకటమంటూ తిరుగుతోంది?

వెయ్యి రూపాయల నోటు...??

ఈ నెలకి అదే ఆఖరు నోటు కదూ? ఎకౌంట్లో ఏమన్నా వున్నాయా? ఎందుకుంటాయి? పదమూడొందలు వుంటే మొత్తం డ్రా చేశాను కదూ? రెండొందలు ఛార్జీలకు అయిపోయిందా? ఇంకో వంద ఎక్కడ ఖర్చు పెట్టాను? ఆటోవాడికి ఇచ్చినట్లున్నాను కదూ?

ఇక ఇప్పుడు ఊరికి తిరిగి వెళ్ళాలంటే ఎలా? రాత్రికి నాలుగు మెతుకులు తినడానికి కూడా అవకాశం లేదా? ఆ ఒక్క నోటేగా మిగిలింది? కనీసం, టీ అయినా పూర్తిగా తాగనిస్తేనా? పని అయిపోయాకైనా ఒక సిగరెట్టు కొనుక్కోని మొత్తం నిదానంగా తాగగలనా? డబ్బు లేదే? ఆమె చిల్లర తెస్తుందా? ఇస్తుందా? ఇవ్వకపోతే?

పోనీ ఒకసారి వెళ్ళి అడిగితే? అంతలోనే పిలుపొస్తే? ఏమిటీ పాలుపోని పరిస్థితి? కడుపులో తిప్పినట్లుగా వుందేమిటి? చిరాకు వల్లా? ఆకలి వల్లా? లోపల సార్ ఏమంటారో అన్న భయం వల్లా? ఠక్కున ఒక్కసారి బండి దగ్గరకు పోయొస్తే? ఈసారి పిలిచినప్పుడు కూడా నేను లేకపోతే ఉద్యోగం ఊడిపోదూ?

“ఇంట్లో ఖర్చులకి పైసా లేకుండా చేశారుగా? కాలికొచ్చినా కడుపుకొచ్చినా ఏం చెయ్యమంటారు?” వచ్చేటప్పుడు సునంద అన్న మాటల్లో తప్పేముంది? తన మాట విని నాలుగు డబ్బులు ఇచ్చొచ్చినా మిగిలేవేమో? సాయంత్రం పనయ్యాక ఆ సైదులుగాడు చెయ్యి చాస్తే ఏమివ్వాలి?

ఛ.. ఛ.. ఏమిటిది? ఆమె నా డబ్బులు తిరిగి ఇవ్వదన్నట్లు ఎందుకు ఆలోచిస్తున్నాను? ఇస్తుందేమో? నేను కనపడగానే చిల్లర పైసలతో సహా చిల్లర మొత్తం చేతిలో పోస్తుందేమో? ఆమె ముఖం అదీ చూస్తుంటే తెలియట్లా? మంచి మనిషిలానే వుంది కదా? ఇస్తుందా..? ఇవ్వకపోతే..?? ఒకవేళ నా పనయ్యేసరికి ఆమె అక్కడ లేకపోతే?

పోనీ ఒకసారి వెళ్ళి చూసి వస్తే? చెప్పలేం కదా? చేతిలో డబ్బు కనపడుతుంటే నీతి నిజాయితీ పనిచేస్తాయా? అయినా ఆమె ఎక్కడికిపోతుంది? రేపైనా అక్కడే బండి పెట్టాలిగా? కానీ రేపటిదాకా నేను వుండాలిగా? లాస్ట్ బస్సు పట్టుకోనైనా ఇంటికి వస్తానని చెప్పాను కదా? ఇప్పుడు వుండిపోతే ఎలా? అసలు ఎలా వుండాలి? లాడ్జీలల్లో దిగడానికి చేతిలో నయాపైసా అయినా వుందా? స్నేహితులు ఎవరైనాఈ వూర్లో వున్నారా? వరహాలని ఒకడుండాలిగా...?? ఉన్నాడో? లేదో? ఉంటే ఎక్కడున్నాడో?

సైదులుగాడేమిటి? ఏదో పేపర్ ప్లేట్లలో సర్దుతున్నట్లున్నాడే? బిస్కెట్లా? అవేమిటి? ఆలూ చిప్సేనా? జీడిపప్పు కూడా పెట్టినట్లున్నాడే? వాటి పైన మసాలానా? మిరియాల పొడా? నా ఆకలి గుర్తించాడా ఏమిటి? ఇదేమిటి? నన్ను దాటుకుంటూ పోతున్నాడు? అయితే అవన్నీ కమిషనర్ గారి గదిలోకా? ఒక ప్లేటు నాకిచ్చి పోకూడదూ? ఏమిటీ వాసన? ఏసీ వాసనలో ఆలూ చిప్స్, మిరియాల పొడి వాసనలు కలిపినట్లుందే? ఆకలి మళ్ళీ విజృంభిస్తున్నట్లుందేమిటి? ఆ వాసన వల్లేనా?

వెళ్ళిన ప్లేట్లు ఖాళీ అయ్యేదాకా లోపల్నుంచి పిలుపు రాదేమో కదా? ఇంత కన్నా అవకాశం దొరుకుతుందా? వెంటనే వెళ్ళి రాగలనా? శక్తి వుందా?

బలమంతా కూడగట్టినా పరుగెత్తలేకపోతున్నానే? గేటు దాటేసరికే ఎంత ఆయాసం వచ్చిందీ? ఇదేమిటి? ఆమె లేదే? ఎక్కడపోయింది? కళ్ళేమిటి బైర్లు కమ్ముతున్నాయి? గుండె ఇంత వేగంగా కొట్టుకుంటోందేమిటి?

బండి వుంది కానీ, నా దగ్గర వెయ్యి కాగితం తీసుకున్న మనిషి ఏదీ? అంతా అయిపోయిందా? ఈ నెలకి ఆఖరు నోటుకి రెక్కలొచ్చినట్లేనా? ఆమె వస్తుందో? రాదో? ఇక్కడే కాపలా కాయాలేమో? రాత్రికి ఏ ప్లాట్ ఫారమ్ మీద పడుకోవాలో...?? ఆమె స్థానంలో ఎవరో పిల్లాడు వున్నారే? పది పదకొండేళ్ళు వుంటాయా వాడికి?

“బాబూ... ఇక్కొడొకామె వుండాలి?”

“మా అమ్మ? ఏం?”

“ఆమె నాకు చిల్లర ఇవ్వాలని ఏమైనా చెప్పిందా?”

“ఓ మీరేనా?”

“చెప్పిందా?”

“ఎంత ఇచ్చారు? ఏం తీసుకున్నారు?” వాళ్ళ అమ్మే అడగమందో? లేకపోతే వాడి తెలివితేటలో?

“వెయ్యి ఇచ్చి ఒక టీ, ఒక సిగరెట్ తీసుకున్నానని చెప్పలేదా?” తీసుకున్నాను కానీ తాగలేదన్న విషయమే ఎందుకు గుర్తుకొస్తోందిప్పుడు?

“అయితే మీరేనన్నమాట? కానీ చిల్లర రాలేదే?... ఇక్కడే వుంటారా?” అంటూనే ఆ వెయ్యి కాగితం పట్టుకోని రోడ్డు మీదకు అలా పరుగెత్తాడేమిటి?

నన్ను అవతల కమిషనర్ గారు పిలుస్తారేమో? ఇలాంటప్పుడే ఈ పిల్లాడు చిల్లర తెస్తానని పరుగెత్తాలా? ఎటూ తేల్చుకోలేని పరిస్థితై పోయిందే? ఆ పిల్లాడు రోడ్డు మీదకు అలా అడ్డంగా పరుగెడతాడేమిటి? డివైడర్ మీదనుంచి అమాంతంగా దూకేస్తాడేమిటి వీడు? పాన్ షాపు, మటన్ షాపు అంటూ అన్నీ షాపులు చిల్లర కోసం తిరుగుతున్నాడే? దొరికినట్లు లేదే? వచ్చేయమని ఎంత పిలిచినా పట్టించుకోడే? అటు కమిషనర్ గారి గది వైపు, ఇటు వీడు వైపు ఒకేసారి ఎలా చూడటం?

ఈసారి పరుగు అటు నుంచి ఇటుకా? అయ్యో... డివైడర్ మీద నుంచి దూకటం దూకటం అలా పడ్డాడేమిటి? ఆ స్కూటర్ వాడికి కళ్ళు కనపడటం లేదా? అలా గుద్దేసి పోతుంటే ఎవరూ ఆపరే? ఇంతలో ఎంత జరిగిపోయింది? ఆ పిల్లాడికేమైందో? కుడికాలు పట్టుకోని ఏడుస్తున్నాడంటే, విరిగుంటుందా? పెద్ద దెబ్బే తగిలుంటుందా? ఏమీ పాలుపోయి చావదే?

ఇప్పుడు నేనేం చెయ్యాలి? వెళ్ళి పిల్లాణ్ణి చూడాలా? అవతల కమిషనర్ గారు పిలిస్తే? కాదని వెనక్కి వచ్చేస్తే ఇక నా డబ్బులు తిరిగొస్తాయా? ఒకవేళ వాడి కాలు విరిగి వుంటే? హాస్పిటల్ తీసుకుపోతే అదెంత ఖర్చౌతుందో? వాడి దగ్గర అంత డబ్బు లేకపోతే?

నాకు చిల్లర ఇవ్వడానికే కదా ఆ పిల్లాడు పరుగెట్టాడు? నేను ఆ మాత్రం బాధ్యత తీసుకోవద్దూ? సరే బాధ్యత కాదు, కనీసం ఒక మనిషిగానైనా ఆలోచించాలా? అదీ కాదు, కనీసం ఆ పిల్లాడి మీద జాలి వుండాలా?

అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నానా? నేను వాడి దగ్గరకు వెళ్ళేసరికే ఇంతమంది గుమికూడారే? వాడేమిటి అలా విలవిలలాడుతున్నాడు? అంత రాద్ధంతంగా ఏడవటం ఎందుకు? లేవమంటే లేవడే? లేవలేని పరిస్థితిలో వున్నాడా? చెయ్యి అందించినా లేవనంటాడే? నా ఒంట్లో శక్తి లేదని నాకు తెలుసు కదా? నా బుద్ది తక్కువ కాకపోతే ఆ పిల్లాణ్ణి మోసుకోని రోడ్డు దాటడం ఎందుకు? వాడి మీద జాలా? లేకపోతే నా డబ్బుల గురించిన ఆందోళనా?

కమీషనర్ గదిలో నుంచి బయటి వస్తోంది డైరెక్టర్ మేడమే కదా? అంటే ఇప్పుడు నన్ను పిలిపిస్తాడేమో? పిలవకపోనూవచ్చుగా? పిలిచిన రెండుసార్లు నేనక్కడ లేనని తెలిస్తే? కనీసం ఆరొందల కిలోమీటర్ల అవతలకి ట్రాన్సఫర్ అయిపోదూ?

ఈ పిల్లాడు ఎంతసేపైనా ఏడుపాపడే? వాడి కళ్ళలో నీళ్ళు చూసి నేనెందుకు కరిగిపోతున్నాను? నాకెందుకింత బాధ కలుగుతోంది? వెళ్తున్న ఆటోని ఎప్పుడాపాను? పిల్లాణ్ణి ఎక్కించాను సరే, నేనెందుకు ఎక్కాను? ఆటో పోతుంటే కమిషనర్ ఆఫీస్ వైపే ఎందుకు చూశాను? ఎన్ని ప్రశ్నలు? వీటన్నింటికీ సమాధానాలు వున్నాయా? వున్నా నాకు తెలియటం లేదా?

నీ పేరేంటి? - బాబూ, మీ నాన్న పేరేంటి?

ఎంతకీ సమాధానం చెప్పడే? ఆ ఏడుపెందుకు మధ్యలో? మాటలు ఇక్కడున్నా నా మనసు కమిషనర్ ఆఫీస్ చుట్టే తిరుగుతోందేమిటి? వెనక్కి వెళ్ళిపోతే? మరి ఈ పిల్లాడు?? పోనీ హాస్పిటల్ దగ్గర వదిలేస్తే?? అన్యాయం కదూ??

“మీ అమ్మ ఎక్కడ వుంటుంది? - మీ అమ్మ సెల్ నెంబర్ తెలుసా?”

చూస్తుంటే ఈ రోజంతా ఇలాగే చచ్చేట్లుందే? ఏదీ సక్రమంగా జరగట్లేదేమిటి? పొద్దున్నే ఎవరి ముఖం చూసుంటాను?

హమ్మో, ఇదేదో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లాగుందే? ఆటోవాడికి ఈ హాస్పిటలే కనపడిందా? వైద్యం పేరుతో వున్నదంతా లాక్కుంటారేమో? వీల్ చైర్ ఎప్పుడు తెచ్చారో? ఎప్పుడు వాణ్ణి లోపలికి తీసుకెళ్ళారో? నేను ఎప్పుడు వెయిటింగ్ రూమ్ లో కూలబడ్డానో? అంతా నిముషం తిరిగే లోపలే జరిగిపోయినట్లుందే?

మళ్ళీ ఎదురుచూపులా? అవునూ, ఆఫీసులో ఏం సమాధానం చెప్పాలి? చీవాట్లు తప్పేదేముంది? కానీ పొద్దున్నుంచి కలవకుండా వుంచినందుకు చెప్పకుండా వెళ్ళిపోయానని అనుకుంటారేమో?నాకు పొగరెక్కువైందని నిర్థారణకు వస్తారేమో? ఇప్పుడు ట్రాన్స్ఫరా? లేకపోతే ఏకంగా సస్పెన్షనేనా? ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలో? ఏ యూనియన్ వాళ్ళని బతిమిలాడుకోవాలో?

ఇప్పుడు నాగభూషణం ఫోన్ చేస్తున్నాడేమిటి? ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళావంటే ఏం చెప్పను? మాట్లాడితే ఒక తంటా మాట్లాడకపోతే ఇంకో తంటా అయ్యేట్లుందే? చటుక్కున నిర్ణయించుకోవద్దూ? ఫోన్ ఆగిపోయేదాకా ఆలోచిస్తే ఎలా?

ఇది మరీ ప్రమాదం అయ్యేట్లుందే? నేను కావాలనే ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదని అనుకుంటే? ఏం చెయ్యలి? మళ్ళీ కాల్ చెయ్యాలా వద్దా?

“పిల్లాణ్ణి చూస్తారా?” నన్నేనా నర్స్ పిలిచింది?

అసలా పిల్లాడి వయసెంతనీ? రోడ్డుకి అడ్డంగా అట్లా పరుగెట్టడమేమిటి? వాళ్ళమ్మ మాత్రం? పిల్లాడిని అలా గాలికి వదిలేసి పోవడమేనా? ఏమన్నా అయ్యుంటే నన్ను నేరస్థుణ్ణి చేసేవాళ్ళు కాదూ?

 “ఎలా వుందిరా?”

“నాకేం సార్?” మళ్ళీ నాగభూషణం ఫోనా? ఇక అంతా అయిపోయినట్లేనా? ఇంక ఎత్తకుండా ఎలా వుండగలను?

“సార్? రమ్మంటారా సార్?”

“లక్ష్మమ్మ కొడుకుని హాస్పిటల్ కి తీసుకెళ్ళారట? ఏక్సిడెంట్ అంట? ఎలా వున్నాడు?”

“సార్, కమీషనర్ గారు పిలిచారా? రమ్మంటారా? ఇక్కడ్నుంచి ఎంతసేపు?”

“నేను లేనటండీ? కమీషనర్ గారికి ఏదోకటి చెప్పలేనా? ఆ పిల్లాడికి ఏం కాలేదు కదా? మీకు తెలియదు కదూ? వాడు లేకపోతే మన ఆఫీసులో సందడేముందందీ? టీలేనా? బిస్కెట్లేనా? సమోసాలేనా? ఆ తల్లికి వాడే కదా దిక్కు?” ఆయన గొంతులో కాఠిన్యం మొత్తం మాయమైనట్లు అనిపిస్తోంది నిజమేనా? “ఆఫీసయ్యాక వస్తానుగానీ మీరు అక్కడే వుంటారుగా? వాడు బాగానే వున్నాడుగా?”

“మరి కమీషనరుగారు?” వాక్యం పూర్తిచేసే ధైర్యమైనా లేదే నాకు?

“మాకు తెలియదటండీ? మీరేంటో? మీ పనేంటో? ఎవడో గిట్టనివాళ్ళు కంప్లైంట్ ఇస్తే మాత్రం మీ మీద మాట పడనిస్తామా? నేను లేను? ఉండనా మరి?” ఫోన్లో వున్నది నాగభూషణమేనా? నేను విన్నది నిజమేనా?

ఎవరో లోపలికి వస్తున్నట్లున్నారు? నాకు దణ్ణం పెడుతోందే? ఆ పిల్లాడి తల్లి కదూ?

“నాకెందుకమ్మా దండాలు పెడతావు? అసలు నా వల్లే ఇదంతా జరిగిందేమో?”

“అదేం మాట సార్? ఆడికి ఎన్నిసార్లు అట్టా లగెత్తదని చెప్పాననుకున్నారు? మీరు దయతో సాయం చెయ్యకపోతే...?” తల్లి ప్రేమ అంటే ఆ కన్నీరేనేమో?

“మీ డబ్బులు వద్దా సార్?” పిల్లాడికి అప్పుడే అంత ఓపిక వచ్చిందే? చేతిలో ఫెళఫెళలాడుతూ కనిపించేది నేనిచ్చిన వెయ్యి కాగితం కదూ?

“హాస్పిటల్ ఖర్చులు అవీ వుంటాయిగా? ఉంచుకోరాదూ?”

“మీ డబ్బులు నాకెందుకు సార్?”

“మరి నా టీ డబ్బులు తీసుకోవా?”

“మళ్ళీ వస్తారుగా? అయినా మేమెక్కడిపోతున్నాం?”

వీళ్ళనేనా అనుమానించింది నేను? నా డబ్బులు తీసుకోని పారిపోతారని కదూ అనుకున్నాను? వీడికి ఒక చిన్న సాయం చేసిన మరుక్షణం ఏ నాడూ మెత్తగా మాట్లాడని నాగభూషణం నాకు సాయం చేస్తాననడం ఏమిటి? నిజంగా డబ్బు కోసమే వీణ్ణి హాస్పిటల్ కి తీసుకొచ్చానా? లేకపోతే...?

ఇంక ప్రశ్నలేమీ లేవు. అన్నీ ప్రశ్నలకీ సరిపోయే సమాధానం దొరికినట్లనిపించింది. వాడి తల నెమిరి నవ్వుతూ బయటికి నడిచాను.

***

(నవ్య వీక్లీ - ఆటా కథల పోటీలో బహుమతి పొందిన కథ, నవ్య వీక్లీ 8 మే, 2016)

Category:

1 వ్యాఖ్య(లు):

lakshmimadhav చెప్పారు...

katha baagundi... nijangaa aa kathalnu nerugaa jarugutunnattle vraasaina meeku naa abhinandanalu.