ప్రవాసంలో వున్న ఆంధ్రులు సామాన్యంగా "అదే మా వూర్లో అయితేనా.." అనో "ఎంతైనా మనవాళ్ళు.." అనో అవకాశం వచ్చినప్పుడల్లా అంటారని నా అనుభవం. లక్నోలో వున్న ఒక తెలుగు స్నేహితుడు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడి ఆంధ్రా భవన్లో భోజనం చేసి, తెలుగు సరుకులు దొరికే షాపుల్లో కావాల్సినవి కొనుక్కోని కానీ తిరిగి వెళ్ళడు. (తెలుగు సరుకులేమిటి అనకండి - క్రేన్ వొక్కపొడి, ప్రియ పచ్చళ్ళు, నెల్లురు సోనా మసూరి, ఎంటీఆర్ గులాబ్‌జాం, బ్రూక్‌బాండ్ కాఫీపొడి, చింతపండు, బియ్యప్పిండి... ఇంకా ఇలాంటివన్నమాట. నేను చూసినంతలో ఇలాంటివి నార్త్ ఇండియాలో ఎక్కడా దొరకవు)
ఇది ఇలా పక్కన పెడితే మరో విషయం - నేను బ్లాగులు వ్రాయటం మొదలెట్టాక కొంతమంది మిత్రులకి లంకెలు పంపించాను. అందులో ప్రవాసాంధ్రులు వున్నారు.. వాళ్ళంతా అన్న మాటల్లో ముఖ్యమైనది, ప్రముఖమైనది ఏమిటంటే - "అబ్బ.. తెలుగు అక్షరాలు చూసి చాలా రోజులైంది.. థాంక్యు."
ఇలాగే ప్రవాసాంధ్రుల్లో తెలుగు మిస్ అయ్యేవాళ్ళు చాలామంది వుంటారని నా అనుమానం. మరీ ప్రత్యేకించి ప్రవాసంలో వున్న మహిళలు (Home makers) ఈ తెలుగుని ఎక్కువగా మిస్ అవుతారని నాకనిపిస్తోంది. ఇందుకు కారణం లేక పోలేదు - అయ్యగార్లు సామాన్యంగా ఆఫిస్ పనుల్లో ఇంగ్లీషు వాడుతుంటారు అది హైదరాబాదైనా, ముంబై అయినా..!! కాబట్టి వాళ్ళకి అంత మార్పు కనపడదు. కానీ ఆడవారికి అట్లాకాదు.. కూరగాయల బండి నించి ఇంట్లో పనిమనిషి దాకా ఏ హిందీలోనో లేకపోతే కూచిపూడి భరతనాట్యం భగిమల్లోనో మాట్లాడాలి.. (ఠక్కున చెప్పండి బూడిద గుమ్మడికాయని ఇంగ్లీషులో ఏమంటారు... పోనీ గిన్న అడుగంటింది గట్టిగా తోము అనేది హిందీలో చెప్పండి...). ఇలాంటి వారికి దగ్గర్లో తెలుగువారు లేరు అనే భావన తప్పకుండా వుంటుంది. మరీ ముఖ్యంగా తెలుగు నవలలు, వీక్లీ చదివటం అలవాటున్న ఆడవారికి ఈ ప్రవాసం ఒక ప్రహసనం. ఇలాంటివారిని మన బ్లాగ్ పాఠకులుగా చేసుకోవడం చాలా సులభమని నేననుకుంటున్నాను. (అయితే ఈ తెలుగు మిస్సింగ్ భావన ఆడవాళ్ళకు మాత్రమే కాదండోయ్.. ఆడవాళ్ళలో ప్రముఖం అని నా అభిప్రాయం)
మరి ప్రవాసంలో వున్న ఇలాంటివారందరినీ కలిసి మన బ్లాగులగురించి చెప్పే అవకాశం గురించి చెప్తాను -
నేను గమనించినంతలో ఎక్కడ పది పదిహేను కుంటుంబాల మేర తెలుగువాళ్ళున్నా అక్కడ ఒక తెలుగు అసోసియేషన్ లేదా తెలుగు క్లబ్ వుంటుంది. (నాకు తెలిసి - చెన్నై, ముంబై, పునే, అహ్మదాబాదు, భోపాల్, ఇండోర్, ఆనంద్, ఢిల్లీ, లక్నోలలో ఇలాంటి అసోసియేషన్లు వున్నాయి). విదేశాలలో అయితే ఖచ్చితంగా తెలియదుకానీ భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో వున్న అసోసియేషన్లలో కొన్ని చోట్ల తరచుగా కలిసినా ఎక్కువ శాతం కార్తీక మాసం, సంక్రాంతి, వుగాది సందర్భాలలో కలుస్తారు. అదే మనకి మంచి అవకాశం...!! మరో పక్షంలో రాబోతున్న సంక్రాంతికి మీరూ మీ ప్రాంతంలో వున్న తెలుగు అసోసియేషన్‌కి వెళ్ళండి. వాళ్ళు జరపబోయే కార్యక్రమాలలో మీరు పలు పంచుకోండి. అక్కడ ఈ-తెలుగు కర పత్రాలు ఇవ్వండి, మన బ్లాగుల విశేషాలు చెప్పండి. ఇప్పుడు యండమూరి రచనలు, వార పత్రికలు ఇంటెర్నెట్లొనే చదవచ్చని చెప్పండి. కొత్త తెలుగు సినిమాలు ఇప్పుడు అంతర్జాలంలొ చూడచ్చని చెప్పండి (ఇది అన్నిటికన్నా పెద్ద పాయింటు - తెలుగువారు సినిమా ఒక విడదీయరాని బంధం కదా). మీ బ్లాగులో మీరు రాసుకున్నదో, మరో బ్లాగర్ రాస్తే మీకు నచ్చినదో తీసుకెళ్ళి చదవండి. ఇంకా వీలైతే లైవ్ డెమాన్‌స్ట్రేషన్ చెయ్యండి, ఆఫ్‌లైన్లో లేఖినిలో తెలుగు అక్షరాలు చూపించండి.
మరో ముఖ్యమైన విషయం - సాధారణంగా కరపత్రంలో చూసి వుత్సాహపడినా ఇంటికెళ్ళిన తరువాత/ఆఫీస్ కి వెళ్ళిన తరువాత (చాలామంది ఆఫీస్‌లోనే అంతర్జాలం చూస్తారు) ఆ విషయం మర్చిపోతారు. గుర్తొచ్చినప్పుడు కరపత్రం ఎక్కడపెట్టారో గుర్తుకురాదు. అందుకే మనం కరపత్రాలతో పాటు మరో చిన్న పనిచేస్తే బాగుంటుంది. అదేమిటంటే ఆ సమావేశాలలో ఒక రిజిస్టరు పెట్టి వచ్చిన ప్రతివారి వివరాలు ముఖ్యంగా మైల్ ఐడీ వ్రాయమని చెప్పండి. ఆ తరువాత వారందరికీ లింకులిస్తూ ఒక వేగు పంపితే సరి. ఆ రోజు జరిగిన తెలుగువారి సమావేశం గురించి ఇంటర్నెట్‌లో మర్నాడు వస్తుందని మీ బ్లాగ్ లంకె ఇవ్వండి. మర్నాడు మీ బ్లాగ్‌లో ఆ విశేషాలు టపాగా వ్రాయండి.
ఈ సంక్రాంతికి నేను ఇండోరులో ఈ పని చెయ్యటానికి సరంజామా సిద్ధం చేసుకుంటున్నాను... మీరూ మొదలెట్టండి మరి..!!
ఇదంతా బాగానే వుంది మరి ప్రవాసంలో లేని వాళ్ళం ఏమి చెయ్యాలి అని అడగచ్చు... అలాగే ప్రవాసంలో వున్న వారు కూడా సంవత్సరానికొక పండగ.. ఇంటికెళ్ళాలి అంటున్నారా..?? అయితే వోకే. పండక్కి ఇంటికొచ్చే ప్రవాసాంధ్రులు చాలామందే వుంటారు. మీరూ ఇంటికెళ్ళినప్పుడు ఇలాంటి మిత్రులని తప్పకుండా కలుస్తారుగా..!! వారికి చెప్పండి.. మైల్ ఐడీ తీసుకోండి. వేగు పంపండి..!!
(వేగు విషయం వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. మొన్నా మధ్య నేను గుంపుకు పంపిన వేగులో చైన్ మైల్ గురించి ప్రస్తావించాను. హై. చర్చలో అది ఏ భాషలో వుండాలి అని ప్రశ్న వచ్చింది. తెలుగులో పంపితే మళ్ళీ డబ్బాలు కనిపిస్తాయేమో అన్నారు. ఈ మధ్య ఒక బ్యాంకు నాకు పంపిన మైల్ చూసి నాకు ఈ ఆలోచన వచ్చింది. మనం చెప్పదలుచుకున్నది బొమ్మ (image) రూపంలో పెట్టి వేగు పంపలేమా..?? టెక్కునిక్కులు తెలిసినవారెవరైనా వివరించగలరు)
మొన్నామధ్య అంతర్జాతీయ తెలుగు బ్లాగర్ల దినోత్సవం జరుపుకున్న సందర్భంగా గుంపుకి నేనొక వేగు పంపాను - "తెలుగు బ్లాగుల అభివృద్దికి మనమేమి చెయ్యొచ్చు??" అని. అందులో కొన్ని విషయాలను హై. సమావేశంలోనూ, అంతర్జాల సమావేశంలోనూ చర్చించారు. యోగ్యత అనుసరించి కొన్ని పాటించటం మొదలుపెట్టాము కూడా. చాలా సంతోషం. అందులోని విషయాలనే ఇంకొంచెం వివరంగా చర్చించాలని నా ప్రయత్నం. అందులో లేనివి కూడా కొన్ని సందర్భానుసారంగా ప్రస్తావిస్తాను.
తెలుగు బ్లాగుల ప్రచారోద్యమంలో ఈ-తెలుగు స్టాలు ఒక మైలు రాయి అనిపిస్తోంది నాకు. అక్కడ బ్లాగ్మిత్రులు తీసుకున్న శ్రమ, సమయస్ఫూర్తి (కరపత్రాలనించి స్టాలుకి, స్టాలు నుంచి స్టేజికి, చివరికి ఆ పుస్తక ప్రదర్శన సైటు మనమే తయారు చేసే దాకా) ఎంతో అభినందనీయం. అక్కడ నేను లేకపోతినే అంటూ చాలా మంది బ్లాగర్లు ఇప్పటికే అన్నారు. నేను అనలేదు... అనను కూడా... ఎందుకంటే నేనక్కడలేకపోయినా అందులో భాగస్వామినే. మా నాన్నగారు నాకు ఫోన్ చేసి "టీవీలో చూపిస్తున్నారు... ఎవరో తెలుగు బ్లాగర్లట అంతా కుర్రాళ్ళే (పద్మనాభంగారు కనపడలేదనుకుంటా.. కనపడ్డా ఆయన వుత్సాహంలో కుర్రాడేగా..!!) తెలుగుకోసం ఎంత పనిచేస్తున్నార్రా.." అని అంటే నేను "అవును నేను కూడా అందులో భాగమే... హైదరాబాదులో లేను కానీ లేకపోతే నేనూ అక్కడే వుండేవాడిని" అని చెప్పుకొచ్చా. విషయమేమిటంటే... నన్ను నేను అక్కడ శ్రీధర్‌లోనూ, శిరీష్‌లోనూ, లక్ష్మిలోనూ, కశ్యప్‌లోనూ, పద్మనాభంగారిలోనూ చూసుకున్నాను.
ఈ సమావేశం టపాలలో ఒక చిత్రం జరిగింది (వుద్దేశ్యపూర్వకమో కాదో కానీ...) ఈ-తెలుగు సమావేశంలో తీసిన (చాయా) చిత్రాలను బ్లాగుల్లో పెట్టినవారెవ్వరూ - ఇదుగో నిల్చున్నవారు కుడి నుంచి ఎడమకి - అని పేర్లు వ్రాయలేదు. నాకూ తెలుసుకోవాలనిపించలేదు. ఎందుకంటే వారందరిలో నేనూ వున్నాను... అక్కడ నాకు కనపడేది తెలుగు బ్లాగుల వ్యాప్తికి కృషి చేస్తున్న తెలుగు బ్లాగర్లు మాత్రమే. ఎవరో అనవసరం...!!
వీడేమిటి ఇలాగంటున్నాడు అనుకుంటున్నారా?? ఇక్కడ నేను అంటే తెలుగు బ్లాగర్. వ్యక్తిగతంగా నాకు తోటి బ్లాగర్లతో మాట్లాడాలని - దార్లతో దళిత సాహిత్యం, రామరాజుతో గుత్తి గుమ్మడికాయ, భగవాన్‌తో వ్యంగ్య హాస్యం, సౌమ్యతో నేను చదివిన పుస్తకాల గురించి - ఇలాంటివి ఎన్నో. కానీ ఇవన్నీ సత్యప్రసాద్‌గా, అదే తెలుగు బ్లాగర్లమై మనం కలిస్తే మనం మాట్లాడేది బ్లాగాభివృద్ధి, అంతర్జాల తెలుగు వైభవం.. కాదంటారా..??
ఒక్క విషయం గమనించండి ఈ-తెలుగు సమావేశాలలో కృషి చేస్తున్నది శ్రీధరో, భార్గవోకాదు - ఒక తెలుగు బ్లాగర్ మాత్రమే. "నేనక్కడ వుంటే నిశ్చయంగా అక్కడ నిలబడేవాడిని.." - ఈ మాట అనుకోని తెలుగు బ్లాగర్ ఎవరైనా వున్నారా? (వుంటే జోహార్... మీరీ టపా ఇక్కడిదాకా చదవటమే తప్పు. అర్జెంటుగా కంట్రోలు ఎక్స్ కొట్టండి). అంటే వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయం కాదా అనకండి.. నేననేది ఇదే అవకాశం మీ వూర్లో వస్తే మీరు కృషి చెయ్యరా అని? (చేస్తారా.. అయితే నా తరువాతి టపా తప్పకుండా చదవండి). మరో చిత్రం చూసారా - ఇప్పటిదాకా మనం చాలామంది బ్లాగరలను ముఖాముఖీ చూసిందిలేదు. అయినా ఏదైన విషయం వస్తే కత్తి మహేష్ అయితే ఇలా ఆలోచిస్తాడేమో, తాడేపల్లికి తెలిస్తే ఇంకో కొత్త తెలుగు పదం పుట్టిస్తాడు అనుకుంటాం. ముఖాలు తెలియకపోతేనేమి...?? కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే మనందరిలో అంతరాంతరాలలో తెలుగు బ్లాగర్ అనే ఒక సన్నని దారం సామ్యంగా కనపడుతోంది.
ఇప్పుడు అసలు విషయం -
మనమందరం పూలలాగా ఒక దారంతో కలిసిపోయి వున్నాం కదా.. అందరం కలిస్తే ఒక దండ అవుతాముకదా. ఆ దండకి ఇప్పుడు ఒక రూపం ఇవ్వాల్సిన అవసరం వుంది. నేననేది తెలుగు బ్లాగర్స్‌కి ఇప్పుడు ఒక చిహ్నం అవసరం. మనమందరం ఒకటి అని గుర్తుచేస్తూ వుండటానికి, సందర్భం వచ్చినప్పుడు చూసే వాళ్ళందరికి ఒహో వీళ్ళు ఫలానా కదూ అని చెప్పటానికి, ముఖాముఖి కలుసుకోని తెలుగు బ్లాగర్లందరికి ఒక రూపం తీసుకురావటానికి, ఏదైనా అవకాశం చిక్కినప్పుడు (పుస్తక ప్రదర్శనలాగా) దాన్ని బ్యానరు పైనా, బాడ్జీలపైనా వెయ్యటానికి, నాగ ప్రసాద్ లాంటివారు టీ షర్ట్‌పైన వెయ్యటానికి, తెలుగురత్న గ్రంధాలయంలో పెట్టే బ్లాగు ఈ-పుస్తకాలపైన వెయ్యటానికి, ప్రతి బ్లాగరు తన బ్లాగులో పెట్టుకొని బ్లాగు ప్రచారోద్యమంలో పాలు పంచుకోవటానికి, తరచుగా బ్లాగులగురించి వ్రాసే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఆ వ్యాసంలో ప్రచురించటానికి.. ఇంకా ఇలాంటివి ఒక ఇరవై ముప్పై అయినా వ్రాయచ్చు..!!
సరే చిహ్నం కావాలి...!! అది ఎలా వస్తుంది అని అడుగుతున్నారా..?? చెప్తా అదీ చెప్తా -
అ) తెలుగు బ్లాగర్ల చిహ్నం తయారు చెయ్యమని బ్లాగర్లనే అడగటం/పోటీ పెట్టడం. (ఈ విషయం ఇదివరకే ప్రస్తావనకి వచ్చింది.. మళ్ళి ఒక ఆలోచన పారెయ్యండి). మన దగ్గర భగవాన్, వెంకట్ (వెంకటూన్స్), పృధ్వీరాజు లాంటి మంచి ఆర్టిస్టులు వున్నారు. వారు వేసినా సరే లేదా మరెవరైనా ఔత్సాహికులు వేసినదానికి మెరుగులు దిద్దినా సరే.
ఆ) రెండొవది చాలా సులభమైనది. ఎవరైనా పేరుమోసిన ఆర్టిస్టుని పట్టుకోని బాబ్బాబు మేమిలాగిలాగ తెలుగు బ్లాగర్లం అని చెప్పుకోని బొమ్మ గీయించుకోవడం. దీంట్లో వున్న ఇబ్బంది ఏమిటంటే సదరు ఆర్టిస్టుకి మన సంగతులు వివరంగా తెలియజేయాలి, ఆయనా తెలుసుకోవాలి అది బొమ్మలో రావాలి. రెండొవ సమస్య మన బ్లాగర్లు అలా "బయట"వారు వేస్తే కలుపుకుంటారా లేదా అనేది ప్రశ్న. (ఈ ఆలోచన నచ్చితే బాపూగారితోనే వేయించగలిగితేనే సార్థకత అని నా విశ్వాసం.)
ఇ) మూడొవది మరీ తెలివైనది - పుణ్యం పురుషార్థం ఆలోచన. మనం తెలుగు బ్లాగర్లం ఏదైనా పత్రికలో పోటీ ప్రకటిద్దాం. మాకు చిహ్నం చేసిపెట్టేవారు కావలెను అని. తయారు చేసి సాఫ్ట్/స్కాన్‌డ్ కాపీ పంపించండి, ఎన్నికైన బొమ్మకి పారితోషికం అని. అసలు ఆలోచనేమిటంటే సదరు ఆర్టిస్టుగారు బొమ్మ వెయ్యాలంటే వివరాల కోసం మనం ఇచ్చే లంకెలు పట్టుకొని కూడలి, పొద్దు నించి మొదలెట్టి బ్లాగులు చదివి ఆకళింపు చేసుకొని బొమ్మ గీసే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రక్రియలో ఒక వందమంది అయినా "ఆర్టిస్టులు" బ్లాగులు చూస్తారు. (చదువరులు పెరుగుతారు, ఆర్ట్"ఇష్టులు" కాబట్టి మళ్ళీ వస్తారు, లేదా వారి బొమ్మలతో ఒక బ్లాగైనా పెడతారు.)
ఏది ఏమైనా ఇలాంటి చిహ్నం మనం తయారు చేసుకోవటం అవసరం, అత్యవసరం. తరువాతి టపాలో నేను చెప్పే కొన్ని విషయాలు ఇలాంటి చిహ్నంతో చేస్తే బాగుంటుంది. అందుకని యుద్ధప్రాతిపదికన మీ అభిప్రాయం వ్యాఖ్య రూపంలో చెప్పండి..!! (ఎందుకు బ్రదర్ అనవసర ప్రయాస అంటున్నారా సరే అదే చెప్పండి).
చాలా చిన్న ప్రశ్న, కానీ సమాధానం పెద్దది అందుకే టపాగా రాస్తున్నా.
దీనికి రెండు రకాల సమాధానాలు -
అ)వ్రాయటానికి సంబంధించి
అ.అ)మనమందరం మాతృభాషలోనే ఆలోచిస్తాం. ఇది శాస్త్రీయంగా నిర్ధారితమైన సత్యం. మనం ఆంగ్లమో మరో భాషో మాట్లాడాలన్నా తెలుగులో ఆలోచించుకొని మాటల్లోకి వచ్చేసరికి తర్జుమా చేసుకుంటాం. అలా ఆలోచించటంలో ఒక సౌలభ్యముంది (Comfort). అదే ఆలోచనలను మాతృభాషలో వ్రాయటం సులభం, తర్జుమా చేసి ఆంగ్లంలో వ్రాసేకన్నా. ఈ మాట తెలుగేతర భాష తెలిసిన వారందరూ వొప్పుకుంటారనుకుంటున్నా. తెలుగులో బ్లాగు వ్రాయటానికి ఇదే ప్రాధమిక కారణం అని నేను నమ్ముతున్నాను.
అ.ఆ) తరువాతది - "నాకు తెలిసిన చాలా విషయాలు తెలుగులో చెప్పటం, తెలుగువారితో చదివించడం సులభం". కవిత్వం, పద్యం, సంక్రాంతి ముగ్గులు, బాపు రమణలు, తెలుగు సినిమా, వాలు జడలు, వయ్యారి భామలు, పంచె కట్టులు, పాపిటబిళ్ళలు, పరికిణీలు, బతుకమ్మలు, చిరంజీవి - చంద్రబాబు, నుడికారం, సామెతలు... ఇలాంటివి వేరే భాషలో రాయాలంటే (రాయచ్చు) ఈ పదాలకి అర్థం రాయాటానికే ఒక టపా రాయాలి. (పరికిణీ అంటే ఒక రకం డ్రస్సు అంటే సరిపోతుందా..?? అందులో వున్న అందం, వయ్యారం, ఠక్కున గుర్తొచ్చే తెలుగుతనం గురించి వేరే భాషలో ఎంతవరకు చెప్పగలరు..??)
అ.ఇ) మూడొవది భాషాభిమానం. దీని గురించి నిన్నటి టపాలో కూడా ప్రస్తావించాను.
అ.ఈ) నాకు తెలుగు మాత్రమే తెలుసు. వేరే ఏ భాషపైనా పట్టులేదు
రెండొవది: మళ్ళీ అదే పాయింటు. ఆ)పాఠకులు.
ఇంగ్లీషులో బ్లాగులు మొదలెట్టి తెలుగులోకి వచ్చిన వాళ్ళు మన గుంపులో చాలామందే వున్నారనుకుంటా. నేను కూడా ఒకడిని. (నకిలీ కణికుడి గురించి చెప్పే అమ్మవొడి బ్లాగు మరొక వుదాహరణ). ఇందాక చెప్పినట్టు తెలుగు వారు చదివి అసోసియేట్ (associate)చేసుకోవటం సులభమనే కారణం ఒకటైతే, ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన బ్లాగు అగ్రిగేటర్ల ద్వారా పాఠకులు దొరుకుతారు అనే నమ్మకం మరొకటి.
ఏ రకంగా చూసినా పాఠకులే ప్రాధమికం. అయితే ఈ ప్రశ్న మన ప్రచారోద్యమంలో కొత్త కోణం చూపిస్తుంది. అదేమిటంటే మనం ప్రచారం చేసేటప్పుడు ఏ విషయం పైన ఫోకస్ చెయ్యాలి అన్నది.
తెలుగులో వ్రాయటానికి కారణం పైన చెప్పిన ఫలానా ఫలానా అయితే వాటి గురించే ప్రచారంలో ప్రస్తావించడం అవసరం -
ఉదా:
అమెరికాలో వుండి సంక్రాంతి ముగ్గులు, హరిదాసు పాటలు మిస్స్ అవుతున్నారా?
మీ పిల్లలకి వేమన పద్యాలు రావని బాధపడుతున్నారా?
అయితే నేడే చూడండి తెలుగు బ్లాగులు..!!
(వచ్చే టపాలో: తెలుగు బ్లాగర్లకొక రూపం కల్పిద్దాం)
ఇది ప్రాధమిక ప్రశ్న. తెలుగు బ్లాగుల వ్యాప్తికి కృషి చేద్దామని ఇప్పటికే పలు బ్లాగర్లు అనటం జరిగింది. వ్యాప్తి చెయ్యటమంటే ఏమిటి? బ్లాగులు పెంచాలా? బ్లాగర్లను పెంచాలా? పాఠకులని పెంచాలా?
అందుకే ఈ ప్రశ్న.
మనకి కావలసింది ఏమిటి?
దీనికి నాకు తోచిన జవాబు చెప్పే ముందు మరి కొంచెం లోతైన ప్రశ్న - ఆసలు మనం ఎందుకు బ్లాగుతున్నాం?
నా వరకు చెప్పాలంటే నేను బ్లాగు మొదలు పెట్టకుముందే అచ్చోసిన రచయితని (అనగా అడపాదడపా అచ్చులో నా రచనలు ప్రచురించబడ్డాయి). నేను బ్లాగటం మొదలు పెట్టింది నా దగ్గర వున్న రచనలని కొత్తగా మొదలైన ఒక మాధ్యమం (అంతర్‌జాలంలో) పెట్టడం. అంతే. అయితే వ్రాయటం మొదలెట్టాక అడపదడపా వ్యాఖ్యలు మొదలై తరచుగా రావటం మొదలైయ్యాయి. ఆ ప్రోత్సాహం మరిన్ని (కొత్త) కథలు రాయటానికి స్పూర్తి నిచ్చాయి. ఈ వ్యాఖ్యలు లేకపోతే గతంలో అచ్చైన కథలవరకు ఎక్కించేసి శెలవు పుచ్చుకునేవాణ్ణి. (అసలు నేను వ్రాయటం ఆపేసి అయిదు సంవత్సరాలైంది. మళ్ళీ రాస్తున్నానంటే అది మీ చలవే)
చెప్పొచ్చేదేమిటంటే.. నేను నాకోసమే బ్లాగు రాసుకుంటున్నాను, ఎవరు చదివినా చదవక పోయినా - అనే మాట అసంబద్ధంగా తోస్తుంది నాకు. అలాగైతే ఈ కూడళ్ళు, జల్లెడలూ ఎందుకు చెప్పండి? మీరు రాసుకునేది రాసుకోండి, రెండు మూడు సార్లు చదువుకోండి, మురిసిపోండి. ఇంకొకరు చదవాల్సిన పనిలేదు కాబట్టి ఏ ఆశలు ఆశయాలు లేవు..!!
నేను మాత్రం వొప్పుకోనండి..! ఎవరెన్ని చెప్పినా కళకారుడికి చప్పట్లే సన్మానపు దుప్పట్లు..!! బ్లాగరికి కామెంట్లే సన్మానపు దుప్పట్లు..!!
తనకోసమే వ్రాసుకునే వాళ్ళకి ఈ చర్చతో పనిలేదు. మీరు వ్రాసుకోండి.. అంతర్జాలంలో తెలుగు వెలుగుకి మీరూ ఒక సమిధనిచ్చారని (ఆ వుద్దేశ్యంతో కాకపోయినా) మీకు నెనర్లు. (ఈ విహారిణి కుడిచేతివైపు అన్నిటికంటే పైన ఒక ఇంటూ గుర్తు వుంటుంది అది నొక్కండి).
అలా కాదు నేను రాసేది ఇతరులు చదవటానికే అనే వాళ్ళు చదవటం కొనసాగించవచ్చు.
ఇతరులు చదవటానికి వ్రాసేవాళ్ళు అసలు ఎందుకు వ్రాస్తారా అని ఆలోచిస్తే నాకు తట్టిన సమాధానాలివి -
అ) నా భావాలు నలుగురితో పంచుకోవాలి
ఆ) నా అనుమానాలు, అభిప్రాయాలు, ఆలోచనలు ఎంతమందికి నచ్చుతాయో తెలుసుకోవాలి
ఇ) నేనూ రచయితనే.. ఈ సంగతి స్వాతీ ఆంధ్రభూమి తెలుసుకోలేకపోయాయి... మీరన్నా తెలుసుకోండి (నా లాంటివారు)
ఈ) నాకు తెలిసిన విషయం కొంత మందికైనా వుపయోగపడుతుంది..
ఉ) నా రచన చదివి ఎవరైనా వీరతాళ్ళేస్తే నాకు ఎంత సంబరమో
ఊ) వాడెవడో సత్యప్రసాదట - నేను వాడి కన్నా బాగ రాయగలనని నిరూపించాలి
ఇంకా ఇలాంటివి మరెన్నో వుండచ్చు - అన్నింటిలో సామ్యమైన విషయం ఏమిటంటే - నేను రాసింది చదివేవాళ్ళు కావాలి..!! నేను రాసినదానికి వ్యాఖ్యల రూపంలో అభినందనో, అభిప్రాయమో కావాలి. ఇది జరగాలంటే చదువరులు ఇంకా కావాలి.
బ్లాగర్లలో మరో వర్గం - తెలుగు భాషాభిమానులు. పైన చెప్పిన వర్గంలో భాషాభిమానులు లేరా అనకండి. ఇది ఇంకో రకమైన విభజన (Classification). దాదాపు అందరిలోను భాషాభిమానం వున్నా కొంచెం బలంగా అంటే బ్లాగు మాధ్యమంగా తెలుగు వాడకం పెంచాలనో, అంతర్జాలంలో తెలుగు వాడకం పెంచాలనో, కొండకచో "తెలుగు వాడుక భాషా దోషాలను సమూలంగా ప్రక్షాళన గావించెద" అనే తీవ్ర అభిమానులు వుంటారు. వీరి పుణ్యమే ఈ నాటి తెలుగు వెలుగులు, ఇంకా జరుగుతున్న అంతర్జాల తెలుగు భాషోద్యమ ప్రయత్నాలు. (నేను ఇక్కడకూడా వున్నాను అందుకే ఈ టపా). వీరి ప్రయత్నాలు ఫలించాలంటే అంతర్జాలంలో తెలుగు వెలుగుల గురించి మరింత మంది చదవాలి. వీరికీ చదువరులు మరింతగా కావాలి.
ఇక ఇంకొక విషయం - బ్లాగులు మొదలు పెట్టినవారి స్వగతాలో, సింహావలోకనాలో, లేదా మొదటి టపాలో చదవండి.
అ) నేను ఫలానా ఫలానా వారి బ్లాగు చదవటం మొదలు పెట్టాను. వారిలాగ/వారి కంటే బాగా రాయగలననే నేను మొదలెట్టా
ఆ) ఈనాడులో/ఆంధ్రజ్యోతిలో తెలుగు బ్లాగుల గురించి చదివాను.. నేనూ మెదలెట్టాను
ఇ) గూగులమ్మని ఏ వేమన గురించో పోతన గురించో అడుగుతుంటే తెలుగు పదాలు కనపడ్డాయి.. హై భలేగుందే అని ఒక నొక్కు నొక్కాను... ఆ తరువాత అ) పాయింటు చదువుకోండి.
ఇలాంటి కారణాలు కనిపిస్తాయి. కొంత మంది ఇంతకు ముందే అచ్చోసిన రచయితలు (నా లాంటోళ్ళూ) మినహాయిస్తే ఎక్కువగా బ్లాగులు మొదలెట్టిన వారు ముందు చదివారు, తరువాత మొదలెట్టారు. కాబట్టి మనం ఏం కనిపెట్టాం.. బ్లాగు రాయండి అని ప్రచారం చెయ్యటం కన్నా బ్లాగులు చదవండి అని ప్రచారం చేస్తే చదివిన వారు నెమ్మదిగా వ్రాస్తారు. పరంతూ... (అంటే కాకపోతే) ఇలాగొచ్చినవాళ్ళకి మీరూ వ్రాయండి... వ్రాయటం చాలా వీజీ అని చెప్తుంటే చాలు.
ఇప్పటికిక్కడ ఆపేస్తే మనకి కావల్సింది చదివేవాళ్ళు అని అనిపిస్తుంది నాకు. పాఠకులే ముఖ్యం..!! రచయితలు కాదు..!! నేటి పాఠకులే రేపటి రచయితలు..!! కాబట్టి అంతర్జాలంలో తెలుగు చదివేవారికోసం వుద్యమిద్దాం..!! (నాకు తోచిన కొన్ని అవిడియాలు తదుపరి టపాలలో)
మొన్నామధ్య మాయాబజార్‌లో ఒక సన్నివేశం పేరడీలో నేను చెప్పదల్చుకుంది అదే. జ్యోతిగారు కరెక్టో అని మార్కులేశారు. మీరేమంటారు? మీరంతా నిరభ్యంతరంగా విభేదించవచ్చు, అనామక వ్యాఖ్యలేసుకోవచ్చు... ఏదో ఒకటి చెప్పండి ఎందుకంటే నేను వ్రాసేది చదివేవారికోసమే... వారి వ్యాఖలకోసమే.
అరిపిరాల
చినమయ్య: అం అః ఇం ఇః - నవతరంగం, పొద్దు, ఈ మాట, వైజాగు డైలీ
తాన శర్మ: ఓహో హో ఇవి వెబ్ పత్రికలు
చినమయ్య: కూడలి, జల్లెడ, తెలుగు బ్లాగర్స్...
తందాన శాస్త్రి: ఇవన్నీ అగ్రిగేటర్లు
లంబు: రెండు రెండ్లారు, తోటరాముడు, నవ్వులాట, హాస్య దర్బారు, భగవాన్ కార్టూన్లు, వెంకటూన్లు, వికటకవి
తాన శార్మ: మాకు తెలుసులేవయ్యా ఇవి హాస్య బ్లాగులు
జంబు: సాహితీయానం, సంగతులు, దార్ల, కళాస్పూర్తి, పలకబలపం
తాన శర్మ: ఏవుంది.. సాహిత్యం బ్లాగులు
చినమయ్య: సరే ఇవి చూడండి సాములు - హరిసేవ, నరసింహ, దైవలీలలు
తందాన శాస్త్రి: ఆపు ఆపు.. ఇవి భక్తి బ్లాగులు
లంబు: కలగూర గంప, పర్ణశాల, గడ్డిపూలు...
తాన శర్మ: సర్లేవోయ్ ఇవన్నీ అనుభవాల బ్లాగులు
జంబు: ఇంకా వున్నాయి సాములూ
తాన, తందాన: మాకు తెలుసులేవయ్యా ఇంకా వంటకాల బ్లాగులు, పురాణాల బ్లాగులు, సంగీతాల బ్లాగులు వున్నాయి..!! అసలైనది ఏది కనపడదే?
లంబు జంబు: ఓ తెలిసింది తెలిసింది
తాన, తందాన: ఏమిటి తెలిసింది?
లంబు జంబు: బూతు బ్లాగులు...! బూతు బ్లాగులు..!!
తాన, తందాన: శివ శివ శివ శివా.. అలాంటి లేకపోవటమే కదా తెలుగు బ్లాగుల ప్రత్యేకత
లంబు జంబు: మరింకేం కావాలి సాములూ ??
తాన, తందాన: బ్లాగులు చదివేవాళ్ళు.. పాఠకులయ్యా చిన్నమయ్యా.... పాఠకులు, వ్యాఖ్యలు లేకపోతే మా ప్రభువులు ఒక్క టపా అయినా వ్రాయరు తెలిసిందా..!!
(సరదా వూహ రాగానే వ్రాసేశాను... ఇందులో వున్న బ్లాగులు అప్పడు గుర్తుకువచ్చినవి మాత్రమే... వేరే ఏ ప్రాధాన్యతలు లేవు )
"అయ్య.. రోగమొచ్చినదయ్య.. నాలుగు రూపాయలు రాగానే పోతాను.. పది నిముషాలు బాబు...!"
"ఛీ.. ఛీ.. ఎంత చెప్పినా బుద్దిరాదు.. ఎస్సైగారు వచ్చి నాలుగు తగిలిస్తేగాని కదలవు.." అంటూనే తన కుర్చీలో కూర్చున్నాడు.
రెండురోజులుగా ఇదే వరస. ముక్కోటి ఏకాదశికని స్పెషల్ డ్యూటీ మీద అమరావతి గుడి దగ్గర చిన్న టెంట్ వేసి పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేసారు. పెద్దగా జనంలేరు. పెద్దగా పని కూడా లేదు. అడపదడప మా పాప తప్పిపోయిందనో, పర్సు పోయిందనో వస్తున్నారు. ఎక్కువమంది వచ్చేది మాత్రం గుంటూరు బస్సు ఎప్పుడుందో కనుక్కోవడానికి.
రాముడు మాత్రం ప్రతి అరగంటకి లేచి ఎదురుగా కూర్చుని అడుక్కుంటున్న ముసలమ్మను అరుస్తూనే వున్నాడు. కేకలు వేసినంతసేపు వేసి, ఎస్సైగారు వస్తేగాని నీకు బుద్ధిరాదు అంటూ కూలబడుతున్నాడు. ముసలిదానికి నాలుగురూపాయలు రావటంలేదు.. అది అక్కడ్నించి కదలటంలేదు.
"ఫో.. లే ఇందాకట్నుండి చెప్తున్నానా... ఏం వినపడలేదా.. లే ఇక్కడ్నుంచి" మళ్ళీ అరిచాడు.
"అయ్యగారు.. అయ్యగారూ.." ముసల్ది.
"నోరు మూసుకొనిలే.. ఈ కర్రతో ఒక్కటిచ్చానా..!!" కర్ర పైకెత్తాడు.
"బాబుగారు.. బాబుగారు.. నీ కాళ్ళకు దణ్ణాం పెడతా... పోనీ అయ్యా ముసల్దాన్ని.."
"ఛీ ఛీ.. చెప్తే వినే రకమైతేగా.." మళ్ళీ యధాస్థానం. హెడ్‌కానిష్టేబుల్ విశ్వనాధం ఇదంత గమనిస్తూనే వున్నాడు.
మర్నాడు -
"మళ్ళీ దాపురించావూ..? నా ఖర్మ.. లే ఇక్కడ్నుంచి. ఈ రోజు వదలను నిన్ను. లే.. ఫో ఇక్కడ్నుంచి. ఇక్కడ అడుక్కోకూడదు.. బయటకిపో ఆ చివర్న కూర్చో ఫో..!!"
"అయ్యా అయ్యా.. ఆడ సానామంది వుండారు బాబుగారు.. ఈడుంటే నాలుగు డబ్బులైనా వస్తాయి... మందులు కొనుక్కోవాలయ్యా.."
"సెత్.. నీ యవ్వ... నీ తలకాయ పగలగొడితేగాని.." మళ్ళీ లాఠీ ఎత్తాడు.
"బాబుగారు.. కొట్టమాకండయ్యా.. ఈయాలొక్కరోజేనయ్యా.. రేపుటాలనుంచి ఈడ కూకోను బాబు.."
"సరే ఛావు ఈ రోజుకి.." విసురుగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.
విశ్వనాధం రాముడి భుజమ్మీద చెయ్యేసి అడిగాడు -
"ఏంట్రా రాముడు... ఎప్పుడూలేంది నీక్కూడా కోపం వస్తోందే..?? ఆ ముసల్దానితో మనకెందుకురా.. వచ్చిన డ్యూటీ చూసుకోక..?"
"మీకు తెలియదండి.. అది కొవ్వు పట్టి ఛస్తోంది.. మూడు రోజులబట్టీ చూస్తున్నారుగా..? ఒక్కసారైనా లేపగలిగానా..అని"
విశ్వనాధం మరి మాట్లాడలేదు.
మర్నాడు డ్యూటీకి బయల్దేరిన విశ్వనాధానికి నైట్ డ్యూటీ చెయ్యాల్సిన వీరన్న కనిపించాడు.
"మీతోపాటు ఈ రోజు నేనొస్తున్నాను విశ్వనాధం మాష్టారు.." వీరన్న అన్నాడు.
"అదేమిటి రాముడు రాలేదా.."
"మీకు తెలియదా వాడు రిజైన్ చేశాడు.."విశ్వనాధం అదిరిపడ్డాడు.
"ఏమిటి రిజైనా.. ఎప్పుడు..? అసలెందుకు..??"
"ఏమో మరి.. మొన్న అడ్జెస్ట్మెంట్లో నాకు బదులు నైట్ ద్యూటీకి వెళ్ళాడు. పొద్దున వస్తూనే ఎస్సైగారిని కలిసి వుద్యోగం వదిలేస్తున్నానని చెప్పాడు"
"అదే ఎందుకని..??"
"ఏమో మాష్టరు.. నేనూ అడిగాను.. మనసు చంపుకొని పోలీసుద్యోగం చెయ్యలేడట.. పోలీసుల్లో మనసున్నవాళ్ళు పనికి రారట.."
విశ్వనాధం ఆలోచనలో పడ్డాడు."ఆ రోజు రాత్రి ఏమైనా జరిగిందా..?"
"ఆ ఏముంది మాష్టరు.. ఎవరో ముసల్ది చచ్చిపోయింది.. మనవాడికి శవ జాగారం.. పంచనామ.. మనోడికి కొత్తనుకుంట.. భయపడుంటాడనే అనుకుటున్నారు అంతా..!!"
విశ్వనాధం గుండె కలుక్కు మంది. ఇద్దరూ కలిసి డ్యూటీ చేసిన రోజు జరిగినది గుర్తొచ్చింది. ఆ రోజు ఇద్దరూ కలిసి డ్యూటీ అయిపోయాక గుంటూరు బయలుదేరారు. దారిలో అడిగాడు విశ్వనాధం -
"రేయ్ రాముడు.. నిజం చెప్పరా.. ఆ ముసల్దాన్ని ఎందుకక్కడ అడుక్కోనివ్వడం లేదు..??""ఎందుకేంటి అక్కడ అడుక్కోకూడదు..."
"రేయ్ రూల్స్ గురించి నాకు చెప్పకు. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. సైకిల్‌మీద పొయ్యేవాడివికూడా ఆగి బిక్షగాళ్ళకి డబ్బులు వేయటం నేను చూశాను. అట్లాంటిది ఆ ముసల్దాన్నెందుకు అట్లా తరిమావు..?"
రాముడు రెండు నిముషాలు మాట్లాడలేదు. గట్టిగా నిట్టూర్చాడు. ఉన్నట్టుండి అన్నాడు -
"అది.. ఆ ముసల్ది నన్ను డ్యూటీ చేసుకోనివ్వటంలేదు సార్.. అది అంత బాధగా మూల్గుతూ.. దయనీయంగా అయ్యా అయ్యా అంటూ అడుక్కుంటుంటే.. నా గుండె మీద ఏదో బరువు పెట్టినట్టు వుండేది. ఒక్కడు.. ఒక్కడంటే ఒక్కడైనా దానికి డబ్బులేశాడా..? అన్నం తినలేదయ్యా అంటుంటే హేళనగా చూస్తున్నారు. అది పొద్దుననుంచి మన కళ్ళముందే పడి వున్నా, తిండి కూడా తినలేదని తెలిసినా.. అది చస్తుందని తెలిసినా నేను ఏమి చెయ్యలేను. పోలీసులే ఇలా అడుక్కునేవాళ్ళని ప్రోత్సహిస్తున్నారని అంటారు. పైగా నేను జాలి తలిస్తే అది ఇంక అక్కడే కూర్చుంటుంది.. నా బాధని ఎక్కువ చేస్తూ..!! అది అమ్మ అయ్యా అంటుంటే నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంది.. ఎంత తరిమినా పోదు.. నేను కొట్టలేను..ఏం చెయ్యాలి సార్..??" అంటుంటే రాముడు కాళ్ళలో నీళ్ళు కారుతున్నాయి.
విశ్వనాధం ఆశ్చర్యంగా అతని వైపు చూసాడు.
"ఇంత సెంటిమెంటల్‌గా వుంటే ఎలారా.. పోలీసు వుద్యోగానికి ఇలాంటివి పనికిరావు.."
"పోతే పోనీయండి సార్..!! మనసు చంపుకోని ఎవరు చేస్తారు వుద్యోగం" అన్నాడు రాముడు.
విశ్వనాధం బాధగా నవ్వాడు.
"పోలీసుల్లో మనసున్నవాళ్ళు లేక కాదురా.. నీలాగ మనసు కోసం, విలువలకోసం బ్రతుకుతెరువుని వదల్లేక" అనుకుంటూ అమరావతి బస్సెక్కాడు విశ్వనాధం.
(2001)
సుబ్బరాజుగారికి నిద్రలేస్తూనే పేపరందుకొని అందులో "నేటి మాట" చదవటం అలవాటు. అది చదవగానే చిన్న చిరునవ్వు మెరిసింది - బాగుందని కాదు - తనకెంతో తెలిసిన విషయం లాగుండటం వల్ల. లేచి తయారయ్యి అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో కిందకి దిగి, పాలపేకెట్ కొనడానికి బయలుదేరాడు.
"మీకెందుకు సార్ శ్రమ, రోజు మా కుర్రాడు తెచ్చి ఇస్తాడు కదా.. ఒక అర్థరూపాయేగా ఎక్కువ" అన్నాడు పాలబూత్ రమేష్.
"భలేవాడివే..! నేనొచ్చేది పాలపాకెట్ కోసం కాదయ్యా..!! నడవటంకోసం… కొంత కాలక్షేపం కోసం" అంటూ సుబ్బరాజుగారు అక్కడే వున్న చిన్న బల్లపైన కూలబడ్డారు. అక్కడ ఆయన్ని పలకరించే వాళ్ళు ఎవరూ లేరు, ఒకరిద్దరు పెద్దవాళ్ళు తరచుగా చూడటంవల్లేమో చిన్న చిరునవ్వు నవ్వుతారు. రాజుగారు నవ్వుతారు.. అంతే..!! ఆ ప్రాంతానికి వాళ్ళొచ్చి రెండేళ్ళు కావస్తోంది. వూరి మధ్యలో వున్న లంకంత సొంత ఇంటిని అమ్మి, కొంత విదేశాలకి వెళ్ళేందుకు వాడుకోని మిగిలిన దానితో వూరి బయట వున్న ఈ అపార్ట్మెంటులో ఒక ఫ్లాటు కొన్నారు. పాతింటి దగ్గరయితే గడ్డం బాబాయిగారు, కవిగారు, కానిస్టేబులు సత్యం, బండి మహబూబు అంతా తెలిసిన వాళ్ళే. ఇక్కడెవరున్నారు..??
సుబ్బరాజుగారు కళ్ళజోడు సర్దుకుంటూ వచ్చే పోయేవాళ్ళను తెరిపారా చూస్తున్నారు. కొంతమంది పట్టించుకోవటంలేదు.. కొంతమంది చిరాగ్గా చూస్తున్నారు.. కొంతమంది పలకరిస్తున్నారు. నైట్‌డ్రస్సులో వచ్చిన ఒక అమ్మాయి చంకనెక్కి వుందో చిన్న పిల్ల. సుబ్బరాజుగారు "చీ చీ.." అన్నారు పలకరింపుగా. ఆ అమ్మాయి ఏడుపుముఖం పెట్టింది.
"అయ్యో తాతమ్మా తాత... తాతకి హలో చెప్పు.. షేకాండివ్వు" వాళ్ళమ్మ చెప్పింది.
పసిపాప భయం భయంగా చెయ్యిచాచింది. సుబ్బరాజుగారు చెయ్యి పట్టుకొని చిన్నగా వూపాడు.
"తాత" అనిందా పాప.
"తన మనవరాలు ఏం చేస్తోందో…" అనుకున్నాడాయన. మొన్న ఇంటర్నెట్లో కెమరా పెట్టి చూపించారు.. బాగా మాటలు నేర్చింది. తాతా నాకు సైకిల్ కావాలి అని అడిగింది.
"చిన్న పిల్లల సైకిళ్ళెక్కడ దొరుకుతాయి రమేషూ…?" అడిగాడాయన.
"ఇక్కడ ఎక్కడున్నాయి సార్... ట్రంకు రోడ్లో వున్నాయి షాపులు, లేకపోతే గాంధిబొమ్మ సెంటర్… అయినా ఎవరికి సార్… మీ మనమళ్ళు అంతా అమెరికాలో వున్నారన్నారు"
"అమెరికా కాదయ్యా పెద్దవాడు ఇంగ్లాండు… రెండోవాడు దుబాయి… అయితే మాత్రం అక్కడే వుంటారా ఏం? వచ్చినప్పుడే కొనిద్దామని… సరే నే వస్తా... మా టీచరుగారికి కాలేజీ టైమైందంటే నన్ను చంపేస్తుంది." అంటూనే లేచి ఇంటికి బయలుదేరాడు.
ఎపార్ట్మెంట్ దగ్గరకి చేరాడో లేదో శారదమ్మ పరుగున ఎదురొచ్చింది.
"ఏంటి టీచరుగారు... పాలపేకెట్ తెచ్చేలోపలే తొందరైపోయిందా మీకు..."
"కాదండి… పెద్దాడు ఫోన్ చేసాడు..."
"అరె రే… ఎన్నిసార్లు చెప్పాను వాడికి కొంచెం ఆలస్యంగా చెయ్యరా అని... నేను మాట్లాడే వాడిని కదా…"
"మాట్లాడుదురుగానీలెండి... తీరిగ్గా మాట్లాడురు... వాళ్ళు వస్తున్నారు... వచ్చే నెల నా రిటైరుమెంట్‌కి..."
"వీడేమిటి ఏ విషయం నాకు చెప్పనే చెప్పడు… నేనడిగితే కుదరదు సెలవల్లేవన్నాడు…?"
"సర్లేండి… ఇప్పుడేమంటారు… రావద్దంటారేమిటి వాణ్ణి..? ఎదో సర్దుబాటు చేసుకొని వుంటాడు..." ఇద్దరూ లిఫ్ట్‌లో ఎక్కారు.
"ఇంకా ఏమి చెప్పాడు..?"
"ఇంకేముంది... అదే వస్తున్నామని…"
"అది కాకుండా ఇంకేమీ మాట్లాడలేదా..."
"ఆ... మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నాడు…"
"నా గురించి కాదులేవే... కోడలు, మనమడు... వాళ్ళ సంగతి"
"అంతా బాగున్నారు… కోడలితో కూడా మాట్లాడాను… మొన్న అనంతపద్మనాభ చతుర్దశికి పూజకూడా చేసుకుందట…"
"సరిపోయింది... ఇదా మీరు మాట్లాడుకుంది..." ఇంట్లోకి అడుగుపెడుతూనే పాల పేకెట్ ఆమె చేతిలో పెట్టి పేపరు పట్టుకొని కూర్చున్నాడాయన. ఆమె కాఫీ పెట్టి తీసుకువచ్చి ఆయన చేతికిచ్చింది.
"షుగర్ ఫ్రీ వేసావా…??"
"అరె రే మర్చిపోయి పంచదార వేసానండి…"
"చిన్నాడు అన్ని డబ్బాలు కొని ఇంట్లో పెట్టి వెళ్ళాడు… నా కోసం కాకపోయిన వాడికోసమన్నా వెయ్యచ్చు కదా….!!"
"అబ్బో నాకు తెలియదా చిన్నాడి మీద మీ ప్రేమ... ఇటివ్వండి నేను తాగుతాను, మీకు వేరే చేసుకొస్తా…"
"సరేలే రేపట్నించి వెయ్యి… అవును నేను ఎంత రమ్మన్నా రాని వాడు… నువ్వు పిలిస్తే ఎలా వస్తానన్నాడు..?"
"ఎవడు పెద్దాడా... అదే టీచరుగారి తెలివి. చిన్నాడు వస్తున్నాడు అందరం ఒకసారి కలిసినట్టుంటుంది అని చెప్పా.."
"చిన్నాడు రానన్నాడు కదే..."
"మీరున్నదెందుకు... ఇప్పుడు పెద్దాడు వస్తున్నాడు… నువ్వు కూడారా అని చెప్పండి మీ ముద్దుల కొడుక్కి.."
"వస్తాడంటావా..?"
"రావాలి… మనకి ఇక ముందు ఇంత మంచి అవకాశం రాదు... ఇద్దరూ వస్తేనే మనం అనుకున్నది కుదురుతుంది…"
"అవును నిజమే... నేను మాట్లాడతాను…"
శారదమ్మ కాఫీ కప్పు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బరాజుగారు కళ్ళజోడు సర్దుకొని పేపర్లో మునిగిపోయాడు.
చిన్నాడు వస్తానన్నాడు. ఇంక ఆ ఇద్దరి హడావిడి మొదలైంది. అందరు ఒక్కసారి కలిసి దాదాపు ఐదేళ్ళైంది... చిన్నాడి పెళ్ళిలో.
"టిచరుగారూ..!! వాళ్ళు వచ్చాక ఏమేమి చెయ్యాలనుకుంటున్నారో మెనూ తయారు చెయ్యండి. ఆ సరుకుల లిస్టేదో నాకిస్తే ఆ ఏర్పాట్లు చేస్తా.."
"అన్నట్టు గులాబ్‌జామూన్ రాసావా… అనిరుధ్‌కి అవంటే చాలా ఇష్టం."
"ఒక రోజు గడ్డం బాబాయిగారిని, పిన్నిగారిని పిలుద్దామండి. ఆప్యాయత కలిగిన మనుషులు.. మన పిల్లలు సగం వాళ్ళింట్లోనే పెరిగారు.. వాళ్ళని చూస్తే సంతోష పడతారు.."
"మూడు చెక్రాల సైకిలు కొనాలే… చిట్టితల్లి కావాలని అడిగింది.."
"అంతా సిద్దమైనట్లేగా... మనిల్లు సరిపోకపోతే పక్కింటి వాళ్ళని అడుగుదామా..?"
"మీరు మరీనూ..! సరిపోక ఏమండి.. ఎపార్ట్‌మెంట్ అన్నాక అంతే..! సర్దుకుపోవాలి..!! మన పాతిల్లైతే బాగుండేది.."
ఇదే హడావిడి.. ఇద్దరూ వయసు మర్చిపోయి ఆడపిల్ల పెళ్ళికి ఏర్పాట్లు చేసినట్లు చేస్తున్నారు.
"మన కానిస్టేబుల్ సత్యం లేడు నిన్న సాయంత్రం కాలం చేసాడటనే…"
"అయ్యో పాపం.. కొడుకెక్కడున్నాడో.."
"ఇంకెక్కడ.. ఆస్ట్రేలియాలోనే.. వస్తాడేమో చూడాలి.."
"సరే.. సత్యం రాతెట్లుందో... పదండి నేను ఆవిడని పలకరించి అట్నించే కాలేజికి పోతాను.. మీ సంగతి..?"
"నేను అక్కడే వుంటానే.. పాపం నలుగురులో కలిసిపోయే మనిషి. నా కన్నా చిన్నవాడే.."
ఆ ఇంటికి సంక్రాంతి రెండు నెలలు ముందే వచ్చినట్లుంది. పది మంది జనం ఆ ఇరుకింటిలో అందంగా కలిసిపోయారు. పిల్లల ఆటపాటలతో పెద్దవాళ్ళిద్దరికీ పొద్దే తెలియటంలేదు. సుబ్బరాజుగారు ఒక్కొక్కటే తను కొన్న బహుమతుల్ని తీసి పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళంతా "సర్‌ప్రైస్, సర్‌ప్రైస్" అని అరుస్తున్నారు.
"ఏంటమ్మా... నాన్న మాకేమి సర్‌ప్రైస్ ఇవ్వట్లేదా..??" అడిగాడు చిన్నాడు.
"ఇస్తార్రా... మీరు వస్తున్నారని తెలియగానే అన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నారు.. సరే కూరేమి చెయ్యమంటావు.. కాకరకాయ వేపుడు చెయ్యనా.. నీకిష్టం కదా"
"వేపుడొత్తయ్యా ఆయనని నూనె తగ్గించమన్నారు డాక్టర్లు.. అయినా ఆయనకి మీరు చేసే వేపుడు కన్నా నేను చేసే ఇగురంటేనే ఇష్టం" అన్నది కోడలు. శారదమ్మ కొడుకు వైపు చూసింది. అతను ఏమి మాట్లాడలేదు. కాకరకాయలు కోడలి చేతిలో పెట్టి తనూ కొడుకు దగ్గరే కూర్చుంది.
"ఇద్దరం రిటైరయ్యాము... మీరు ఏమి ప్లాన్ చేసారు" అడిగిందామె ఉండబట్టలేక.
"ప్లానేముంది అమ్మా..." అన్నాడే కాని తర్వాత ఏమనలేదు. పెద్దాడు అందుకున్నాదు.
"మాతో వచ్చి వుంటామంటే రండి. కాకపోతే అక్కడ మీరు సర్దుకోగలరా అనేది మీరే ఆలోచించుకోండి. కాలక్షేపం వుండదు.. భాష, వాతావరణం అంతా కొత్తగా వుంటుంది. ఇంక మీకు మీ కోడలికి మధ్య ఏదైనా ఇబ్బందులు వస్తే అదొక తల నొప్పి.. కోడల్లేని అత్త గుణవంతురాలని ఎంత దూరంగా వుంటే అంత మంచిదేమో. మీరే ఆలోచించుకోడి." పెద్దాడు చెప్పాడు.
చిన్నవాడు గట్టిగా నిట్టూర్చి అన్నాడు -
"మేము మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావటం అంత సాధ్య పడక పోవచ్చు. పేరుకి ఫారిన్ వుద్యోగాలేకాని మేము దాచిపెట్టేది చాలా తక్కువ. ఆ కాస్తా ఇలా ఫ్లైటు టికెట్లకి దండగ చెయ్యడం ఎందుకు చెప్పండి. అందుకే ఈ సారి వెళ్ళేటప్పుడు ఈ ఇంటిని కూడా బేరం పెట్టమని ఒక ఏజెంటుకి చెప్పాం. ఆ డబ్బేదో బ్యాంకులో వేసుకోండి. హాయిగా ఇక్కడే వుండండి"
"కాదు మాతోనే వస్తామన్నా ఓకే…! మీకు తెలుసుగా.. ఏదీ బలవంతం లేడు.. ఎట్లాగైనా అభ్యంతరమూ లేదు.. ఛాయిస్సు మీదే" అన్నాడు పెద్దాడు.
నిజంగా చాయిస్సు ఇచ్చాడా అని అనుమానం వచ్చింది శారదమ్మకు. పైకిమాత్రం ఏమి అనలేక వూరుకుంది. సుబ్బరాజుగారు పెద్దాడి పక్కగా వెళ్ళి రిమోట్ తీసుకొని టీవీ మ్యూట్‌లో పెట్టారు.
"మీరు చెప్పేది బాగానే వుందిరా.. మీరన్నట్టు అక్కడొచ్చి వుండలేము. ఇక్కడ మీరు లేకుండా కష్టమే.. పైగా పాతింట్లో అయితే చుట్టూ పదిమంది తెలిసినవాళ్ళు వుండేవారు.. ఆలోచిద్దాం.. అన్నట్టు పాతిల్లంటే గుర్తొచ్చింది.. మన సత్యంలేడు.. కానిస్టేబుల్ సత్యం.."
"ఆ ఆ పాపిన్స్ అంకుల్ అనేవాడిని.." చిన్నాడన్నాడు
"ఆ ఆయనే మొన్న పోయాడ్రా పాపం.."
"అరె రే... మంచివాడు." పెద్దాడన్నాడు. ఆ తరువాత వాళ్ళ చర్చ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది.
ఆ రోజు శారదమ్మగారి రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరిగింది. కాలేజి విద్యార్థులు, హితులు, బంధువులు చాలా మందే వచ్చారు. "దీని కోసం అంతంత ఖర్చు పెట్టుకొని రావాలా" అని పెద్ద కోడలు అన్న మాట వినపడలేదు కాబట్టి శారదమ్మ చాలా సంతోషపడింది. ఆ రాత్రి ఇల్లు చేరేసరికి పదకొండైయ్యింది. మర్నాడే చిన్నాడు వెళ్ళిపోతున్నాడని అందరూ రెండు గంటలదాకా కబుర్లు చెప్పుకొని పడుకున్నారు.
మర్నాడు ఆ ఇంట్లో పిడుగు పడ్డట్టైంది..!!
పెద్దవాళ్ళిద్దరూ లేవట్లేదని ఉన్నట్టుండి చిన్నాడు అరిచాడు.. ఇద్దరూ మంచమ్మీడ పడుకున్నట్లే పోయారు. పెద్దకొడుకు పరుగున అక్కడికి వెళ్ళాడు. కోడళ్ళు - "ఇప్పుడు ప్రయాణాలు కాన్సిల్ చెయ్యాలి కామోసు" అని సణిగారు. మనమళ్ళు, మనమరాలు గట్టిగా ఏడ్చారు.
చిన్నాడు మరో బాంబు పేల్చాడు - "ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.."
పెద్దబ్బాయికి వాళ్ళు చివరిగా రాసిన వుత్తరం దొరికింది. గట్టిగా చదివాడు -
"పిల్లలూ,
అవును ఆత్మహత్యే చేసుకున్నాం.
మీదగ్గరికి రావాలా ఇక్కడే వుండాలా అని ఆలోచించే అవసరం మాకు లేకుండా పోయింది. అందులో చాయిస్సులేదని మాకు అర్థమైయ్యింది. మీ దగ్గరకి వచ్చి వుండాలన్న ఆలోచన మాకెప్పుడూ లేదు. ఇక ఇక్కడే వుండటమంటారా.. మీరెవ్వరూ లేకుండా కొంచం కష్టమే. మళ్ళీ మళ్ళీ రావడం సాధ్యపడక పోవచ్చు అని మీరే అంటున్నారు. ఎదురు చూస్తూ బ్రతకటం ఇంకా కష్టం.
కానీ ఇవేవి మేము చనిపోవటానికి కారణం కాదు. మేము ఇలా చనిపోవాలని చాలా రోజులక్రితమే అనుకున్నాము.. స్థిరంగా నిర్ణయించుకుంది ఎప్పుడో తెలుసా.. మీరంతా వస్తారని తెలిసినప్పుడు.
కానిస్టేబుల్ సత్యం గురించి మీకో విషయం చెప్పలేదు. వాణ్ణి కరెంటు పెట్టి దహనం చేసారు. వాళ్ళబ్బాయి ఆస్ట్రేలియా నించి టైముకి రాలేదు. ఇదొక చాదస్తమని మీకనిపించవచ్చు, కాని ఎక్కడ బ్రతకాలనే కాదు, ఎక్కడ చావాలనేది కూడా ఒక ఛాయిస్సే.. మాకు మా పిల్లందరు వుండగా వాళ్ళ సంతోషం చూస్తూ పోవాలని ఆశ. మా కొడుకులే మాకు అంత్యక్రియలు చెయ్యాలని కోరిక. అదే ఇప్పుడు తీర్చుకుంటున్నాం. మీకిది ఏదో పిచ్చితనంగా కనిపించవచ్చు. కొంచం అలాంటిదే.. అర్థమైతే ఆలోచించండి..
ఇప్పటిదాకా టెర్రరిజానికి ముఖం లేదు అనుకున్నాం. దర్జాగా సీసీ కెమెరాల్లో ఫొటోకి ఫోజిచ్చినట్టు నిలబడ్డ పాతికేళ్ళ కుర్ర టెర్రరిస్టులు ఇప్పుడు అందరికీ కలల్లోకి వచ్చే టెర్రరిజం ముఖచిత్రాలు. అరవై గంటలపాటు పోరాడటానికి సరిపడా గ్రెనేడ్లు, తుపాకులు, బులెట్లు హోటల్ గదిలో నింపుకో గలిగిన తీవ్రవాదులు మన పోలీసు తెలివితేటల్ని నరిమన్ పాయింట్లో నగ్నంగా నిలబెట్టారు.
బులెట్ ప్రూఫ్ జాకెట్లు వున్నా మన పోలీసులు, కమేండోలు ఎందుకు చనిపోయారు అని ఒక్కరైనా అడగరేం..? అసలు పట్టుమని పది మందైనా లేని టెర్రరిస్టులని ఎదురుకోవడానికి నాలుగొందలు పైబడిన పోలీసులు, కమేండోలకి అరవై గంటలు ఎందుకు పట్టిందని ఎవరూ అడగరేం..? ఉన్నికృష్ణన్ శవం చూపిస్తూ - "మంజునాథన్.. ఉన్నికృష్ణన్ శవం చూడటానికి ఎవరెవరు వచ్చారు.. సినిమా స్టార్లు ఎవరైనా వచ్చారా..?" అని అడిగే టీవీ యాంకర్లకి ఈ ప్రశ్నలు గుర్తుకు రావా..?
గుర్తుకు రావు.. ఎవ్వరూ అడగరు.. ఎందుకంటే నిజాలు బయటికి వస్తాయి. నిజం వినాలని వుందా..??
పోలీసులు వేసుకున్న జాకెట్లను చూడండి.. గూగులమ్మని అడిగితే చిత్రాలతో ఆ జాకెట్ల గురించి చెప్తుంది. అవి బులెట్లను తట్టుకునే జాకెట్లు కావు. వాళ్ళు పెట్టుకున్న హెల్మెట్లు రాళ్ళ దాడిని మాత్రమే నిరోధించడానికి తయారు చేసినవి. బులెట్ల ధాటికి అవి ఆగలేవు..!! ఎందుకంటే పోలీసులు "ఇలాంటి" సంఘటనలు ఎదురుకోవడానికి సిద్ధంగా లేరు. ఏదో చెదురుమొదురు సంఘటనలంటారే అలాంటివాటికి మాత్రమే సిద్ధంగా వున్నారు. మొదటి రోజు రాత్రి బులెట్ ప్రూఫు జాకెట్లు తయారు చేసే సంస్థ ఒకటి వాటిని పోలీసులకు వుచితంగా పంచి పెట్టిన సంగతి మీడియా వారికి తెలియనే తెలియదెందుకో..?
అయితే పోలీసుల దగ్గర ఇవి లేవా అంటే.. వున్నాయి. టెండర్లలో అందరికన్నా చవకగా కొటేషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కొని (అంటే మీకు తెలుసుగా ఎవరి కొటేషన్ ఎందుకు తెల్లారే సరికి చౌకైపోతుందో) స్టోర్లో పెట్టి తాళంవేసి వుంచారు. ఇలాంటి సందర్భంలో ఆ స్టోరెక్కడ వుందో తెలుసుకోని, ఇండెంట్ పెట్టి తీసుకొని వేసుకోవాలి. అన్నట్టు మరిచాను.. దానికి ముందు టెర్రరిస్టులను అప్పటిదాకా ఆగండి నాయనా అని చెప్పి వెళ్ళి తెచ్చుకోవాలి..!!
పరామర్శ పేరుతో వచ్చే రాజకీయ నాయకులకు భద్రత కల్పించాలా లేక టెర్రరిస్టుల సంగతి చూడాలా అని అడిగే పోలీస్ ఆఫీసరు ఫ్రస్ట్రేషనంతా ఆ తీవ్రవాదిని కిటికీలోనించి పడేసటప్పుడు తీరి వుంటుంది. మునుపు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు విపరీతమైన మంచులో కాళ్ళకున్న జోళ్ళు చాలక మంచులో పనికొచ్చే షూస్ పంపించమంటే కాంట్రాక్టర్ల గోలుమాలులో చిన్న పిల్లల షూస్ పంపించిన అవినీతి నాయకులేగా వీళ్ళంతా..! ఆ రోజు కార్గిల్ మంచుకి తట్టుకోలేక రక్తపు అడుగులేసిన సైనికుడెవరైనా తాజ్ దగ్గర వుండుంటే ఆ పరామర్శగాళ్ళని ముందు కాల్చేసేవాడు.
అన్నట్టు మరో అనుమానం..!! నాలుగు వందల మంది ఎన్ఎస్‌జీ కమెండోలలో చాలావరకు ఉత్తర భారతీయులు వున్నార్ట.. ముంబైలో వుత్తర భారతీయులా...!! రాజ్ థాకరే..!! వీళ్ళనెలా రానిచ్చావ్.. తరిమికొట్టకపోయావా..!!
ఇదంతా జరిగి కొంత మంచీ చేసింది -
తీవ్రవాదులపై నెగెటివిటీని ఇంకా పెంచింది, ఈ రోజు తీవ్రవాదం వైపు అడుగులెయ్యబోతున్న వారిలో ఒక్కడైనా ఈ మారణహోమం చూసి కనీసం ఒక్క అడుగు వెనక్కి వేసుంటాడు.దేశం మొత్తం సంఘటితంగా నిలబడింది, బ్లాగులు, మొబైళ్ళు చివరికి పిచ్చా పాటి కబుర్లు కూడా నిరశన వార్తలు మోశాయి..మీడియాకు, రాజకీయాలకు కొత్త టాపిక్ దొరికింది. పాపం పోతూ పోతూ న్యూస్ చానళ్ళకు టీఆర్పీలు ఇచ్చి వెళ్ళారు కార్కర్, ఉన్నికృష్ణన్. పాకిస్తాన్ ఒక రకంగా అంతర్జాతీయ రాజకీయాలలో ఇరుకున పడేట్టుంది..
కానీ
ఎక్కడో వొకచోట ఆక్రోశం ప్రతిహింసకు పునాదులు తొవ్వేవుంటుంది.. అది ఏ దుర్వార్తలు మోసుకొస్తుందో చూడాలి..!!
నేను దేవుణ్ణి రోడ్డుమీదకు లాగుతాను
నాకు అన్నం పెట్టాలని నా దేవుళ్ళు
ఎంతోమందితో తొక్కించుకుంటారు
రంగులడబ్బా పట్టుకొని ఇంటినించి కదలగానే
నా బొమ్మ వెయ్యమంటే నా బొమ్మ వెయ్యమని
సాయిబాబా, సిలువెక్కిన ఏసు, వినాయకుడు
కలిసి నా బుర్రలో రంగులు కలిపినట్టు గిలక్కొడతారు
చెప్పులులేని నా కాళ్ళను చూసి తారురోడ్డు ఆబగా చుర్రెక్కుతుంది
దేవుళ్ళకి రంగులు రుద్ది రుద్ది నా వేళ్ళు అరిగిపోతాయి
మోకాళ్ళపై కూర్చొని బొమ్మవేసేసరికి ఏసుప్రభువు శిలువపై రక్తపు మరకలౌతాయి
బొమ్మలో అందంకన్నా మనసులో భక్తి చిల్లర పైసలై రాలుతుంది
నేను వేరే బొమ్మలు ఇంతకంటే బాగా వెయ్యగలను కానీ
వేసేది దేవుడి బొమ్మకాకపోతే మీ కాళ్ళకింద రంగులు నలిగిపోతాయి
అందుకే దేవుణ్ణి తెచ్చి రోడ్డుపై పరుస్తుంటాను
ఆ దేముణ్ణికి దణ్ణంపెట్టి పక్కనున్న నన్ను ఛీ కొట్టి వెళ్తారు జనం
ట్రాఫిక్ పోలీసు వస్తే నా రంగుడబ్బాని తన్ని కొత్త రంగులు పుట్టిస్తాడు
కారుపార్కింగ్లో బొమ్మేమిటని షాపువాడు నీళ్ళు కుమ్మరిస్తాడు
అయినా నా ఆకలి ఏ గుడి ముందో జాగా వెతికేస్తుంది
నా పేదరికం పేరు చెప్పుకొని ఒక కళ బతికేస్తుంది
ఈసారెప్పుడైనా నా బొమ్మ కనిపిస్తే మీరు కళను చూడపోయినా పర్లేదు
దాని వెనక నా కాలే కడుపును చూస్తే చాలు
మా అన్నయ్యను పెద్ద బావ అని పిలిచినా నన్ను మాత్రం చనువుగా బాచి అని పిలుస్తాడు. బాచి తిరగేస్తే చిబా అనీ, అంటే చిన్నబావ అని వ్యాఖ్యానం కూడా ఇచ్చుకున్నాడు. ఇద్దరం ఆ సంవత్సరం పదొవ తరగతి పరీక్షలు రాసి, పాసైపోవడంతో మొక్కుబడికని తిరుపతి బయలుదేరాము. రైలు రేణిగుంట దాటుతుండగా ఇదుగో ఇలా -
"లేవరా బాచిగా... తొందరగాలే.." గుస గుసగా అంటున్నాడుగాని గట్టిగా తడుతున్నాడు.
నేను లేచి కళ్ళు నులుముకోని - "ఏమిట్రా ఉమా..ఏమైంది???" అన్నాను
"నువ్వు ముందు లేవరా బాబూ.. త్వరగా" అన్నాడు. నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.
"ఏమిట్రా కొంపదీసి రైలేమైనా తగలబడుతోందా.." అన్నా అర్థంగాక.
"కాదెహే.. నువ్వు దిగు చెప్తా.. రా నాతోటి.." అంటూ బాత్రూంల వైపు పరుగెత్తాడు. వాడివెనకాలే నేనుకూడా.
"పద త్వరగా బాత్రూంలో చెయ్యాల్సిన పనులేమైనా వుంటే చేసై.." అన్నాడు అక్కడికెళ్ళగానే.
"ఇప్పుడేమిట్రా అంత తొందర..?"
"తొందరే మరి.. ఇంకా ఎవరూ లేవలేదు. లేచారంటే దానికి కూడా పోటీ.. పైగా ఎవడో వాడి పారేసిన బాత్రూంలోకి వెళ్ళాలంటే నాకు అసహ్యం. ఒకసారిట్లాగే వైజాగు వెళ్ళినప్పుడు లేటుగా లేచేసరికి నీళ్ళైపోయాయి. నాకు తెలియక ఎంటరైపోయా.."
"ఆ తరువాత..?"
"ఏం చేస్తాం..? లక్కీగా నా జేబులో ఏదో కాగితం వుండబట్టి సరిపోయింది గాని.."
"ఛీ"
"మరందుకే చెప్పేది.. వూ కానీ.. ఎంటర్ ది డ్రాగెన్"
"నాకంత ప్రాబ్లం లేదుకాని నువ్వు కాని.. నేను నిద్రపోతా.."
"నిద్ర పోతే ఎట్లా నా లగేజి చూస్తూ వుండు నేను వచ్చేస్తా.." అంటూ బాత్రూంలోకి దూరాడు. నిముషంలో బయటకి వచ్చాడు.
"ఏంట్రా అప్పుడే వచ్చావు ?.. అప్పుడే అయిపోయిందా?" అడిగాను నేను.
"ఏంటి అయిపోయేది.. మనకసలే పొలాల్లోకెళ్ళే అలవాటు.. ఈ అమెరికా బాత్రూములు మనవల్ల కాదు. దానికి తోడు ఇంత చలిగా వుంటే ఆ పింగాణీ మీద కూర్చుంటే ఆ చలికి నీలుక్కుపోవటమే గాని పని జరగదు.." అంటూ ఎదురుగా వున్న ఇండియన్ బాత్రూంలోకి దూరాడు.
నేను నవ్వుకుంటూ వచ్చి నా బెర్తు మీద పడుకున్నా. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు, లేచేసరికి తిరుపతిలో వున్నాం.
రైల్వే స్టేషన్లో స్నానాలు అది చేద్దాంరా అంటే ససేమిరా అన్నాడు ఉమాపతి.
"ఎందుకురా.. మనవూరి చెరువుగట్టు వర్ధనమ్మగారు లేరు, ఆవిడకి తెలిసిన వాళ్ళవి ఇక్కడ గెస్టుహౌసులు వున్నాయిట. ఆవిడ లెటరుకూడా ఇచ్చి పంపించారు. అక్కడికి వెళ్దాం పద" అంటూ కూలీని పిలిచాడు.
"ఇప్పుడు కూలీ ఎందుకురా..? ఏమంత లగేజీ వుందని??" అన్నాను నేను.
"నీకు తెలియదురా బాచి. తిరుపతి వచ్చేటప్పుడు ఇంట్లో మొక్కు పెట్టిన హుండీలో డబ్బులన్నీ తీసుకువచ్చాను. ఇంకా ఇంటి చుట్టుపక్కలవాళ్ళు అంతా హుండీలో వెయ్యమని తలా కొంత ఇచ్చారు"
"అయితే"
"అయితే ఏమిట్రా.. ఆ డబ్బులు మొత్తం దేవుడి హుండీలోనే వెయ్యఖ్ఖరలేదుట.. దర్శనం అయ్యేదాకా అదే డబ్బుని వాడుకోవచ్చు అని మా నాన్న చెప్పాడు.."
"తప్పురా.. దేవుడి డబ్బది.."
"అవును మనం ఖర్చు పెట్టేదికూడా ఆయన్ని చూడటానికే కదా.. నీకెందుకు నాతో రా.." అంటూ కూలి వెంట కదిలాడు.
స్టేషన్ బయట సుదర్శనం చేతికి కట్టించుకున్నాము. సాయంత్రం వేళకి దర్శనం సమయం ఇచ్చారు. అక్కడినుంచి చెరువుగట్టు వర్ధనమ్మగారి బంధువుల గెస్టుహౌసుకి వెళ్ళాం.
వాళ్ళు మమల్ని చూడగానే "అరెరే మీరు వర్ధనమ్మగారి తాలూకా.. రండ్రండ్రాండి" అనలేదు కాని ఒక రూమేదో ఇచ్చారు. అసలు పైన తిరుమలలో అన్ని సత్రాలుంటే ఇక్కడ సత్రమెందుకు పెట్టారో మాకర్థం కాలేదు. సరేలే ఏదైతేనేమి అనుకొని స్నానలు ముగించి బయటపడ్డాం. అక్కడినుంచి అలిపిరి ఆ పైన పైనున్న తిరుమల.
"ఉమా ఆకలేస్తోంది ఏదైనా టిఫిన్ చేద్దామేమిట్రా..?" అడిగాను
"తప్పురా.. స్వామివారి దర్శనం కాకుండా టిఫిన్ చెయ్యకూడదు. పద అక్కడ హోటల్లో కాఫీ తాగుదాం.." అన్నాడు.
నేను కాఫీ చెప్పాను, ఉమా బాదంపాలు చెప్పాడు. మా ఎదురుగా కూర్చున్న అరవాయన సాంబరులో ఇడ్లీ పిసుకుతూ పూరీ కూడా చెప్పాడు. ఆయన వైపే చూస్తూ ఉమాపతి మెల్లగా అన్నాడు -
"బాచి చూడరా ఎలా తింటున్నాడో.. సాంబారు బాగున్నట్టుందిరా... వాసనకే కడుపులో ఆకలి నిద్ర లేస్తోంది.." అన్నాడు.
అంతలో బేరర్ చల్లటి కాఫీ వేడి వేడి బాదంపాలు తెచ్చి పెట్టాడు. అలాగే ప్లేటు పూరీ అరవాయనకి.
"ఇదేమిటయ్యా బాదంపాలు వేడిగా వున్నాయి.."
"ఇక్కడలాగే వుంటాయి... చల్లగా కావాలంటే చల్లార్చుకో..." అంటూ వెళ్ళిపోయాడు బేరర్.
ఉమాపతి ఒకరకంగా ముఖంపెట్టాడు. "మా సత్తెనపల్లిలో అయితే బాదంపాలు అంటే చల్లగా.." అంటూ చెప్పబోయాడు.
"సర్లేరా.." అంటూ నేను కాఫీ ముగించాను. ఉమాపతి బాదంపాలు వూదుకుంటూ పూరీ ప్లేటు వైపు ఆశగా చూస్తూ తాగాడు.
"పూరీ కూర చాలా బాగా చేసినట్టున్నాడురా వీడు.." అన్నాడు చూపు మరల్చకుండానే. అరవాయన ఒక రకంగా మా వైపు చూసాడు. ఇద్దరం లేచి బయటపడ్డాము.
మూడు గంటల్లో అవుతుందనుకున్న దర్శనం ఐదు గంటలు పట్టింది. ఎవరో వీఐపీ వచ్చుంటారనుకున్నాము. చివరకి గర్భాలయంలోకి "గోవిందా గోవిందా" అంటూ అడుగుపెట్టాము.
"బాచి.. ఒరేయ్ బాచి.. అది చూసావా.." అంటూ మూలవిరాట్టువైపు చూపింఛాడు.
"స్వామినే చూస్తున్నానురా.."
"స్వామి కాదురా.. స్వామినెప్పుడైనా చూడచ్చు. వెనకాల ఆ ఫాను చూసావా.."
"ఫానా..?"
"అవునురా.. చూడు ఎంత స్పీడుగా తిరుగుతోందో.. అసలు రెక్కలున్నాయా లేవా.."
"ఉమా.. ఇంత దూరం వచ్చింది స్వామి దర్సననికిరా.. ఫానేమిటిరా ఫాను...??"
"స్వామిదేముందిరా.. కాలండర్లో కూడా చూడచ్చు.. రెక్కలు వున్నాయా లేవా అన్నట్టు తిరిగే ఆ ఫాను చూడరా.." అంటూనే వున్నాడు వాణ్ణి నన్ను కలిపి తోసేసారు. ఇంకేముంది బయట పడుతూనే బండనీతులు తిట్టాను. నువ్వు చెడింది కాక నన్నూ చెడగొడతావా అంటూ.. ఇంతలో ప్రసాదాల దగ్గరకి వచ్చాము. చక్కరపొంగలి చేస్తున్నారు. నేను, ఉమాపతి చెరొక ఆకు దొప్ప పట్టుకొని ప్రసాదం తీసుకున్నాం.
"పదరా ఆ పక్కన కూర్చొని లాగించేద్దాం.." అన్నా నేను.
"ఏమిటి తినేది.. ముదు అర్జెంటుగా పొద్దున్న వెళ్ళిన హోటల్‌కి వెళ్ళి సాంబార్ ఇడ్లీ, పూరీ కూరా తినాలి. పొద్దున చూసిన దగ్గర్నించి అవే కళ్ళముందు మెదుల్తున్నాయి.." అన్నాడు ఉమ.
నేను మాత్రం ప్రసాదం తినడం మొదలుపెట్టాను. అక్కడే వున్న చిన్న షాపుకు వెళ్ళి, వాళ్ళతో ఎదో గొడవ పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తెచ్చుకున్నాడు ఉమ. ఆ కవర్లో ప్రసాదం వేస్తుంటె నేను అడిగాను -
"ఏమిట్రా గొడవ..?" అని
"లేకపోతే డబ్బులిచ్చినా వుత్త కవర్లు అమ్మర్ట.. ఏదైనా కొనుక్కోవాళ్సిందే అన్నాడు.. నేను వదుల్తానా.."
"సరే ఇంద ప్రసాదం" అంటూ నా చేతిలో వున్న కొంచం మిగులు వాడి చేతిలో పెట్టాను. అది తింటూనేఎ వాడు అరచినంత పని చేసాడు.
"బ్రహ్మాండంగా వుందిరా.. బాచిగా.. ఇంత బాగుందని తెలిస్తే ఇక్కడే.." అంటూనే వునాడు వాడి చేతిలో కవర్ కింద అడ్డంగా చిరిగిపోయి చక్కర పొంగలి రోడ్డుమీద పడిపోయింది. ఆ కవరు ఇవ్వడానికి గొడవ పెట్టుకున్న షాపాయన పగలబడి నవ్వడం వినిపిస్తూనే వుంది. మేము ముఖ ముఖాలు చూసుకున్నాం. ఉమాగాడు ఆ పొంగలి మీదకు వంగి -
"చూడరా జీడిపప్పులు ఎట్లా కనిపిస్తున్నాయో... నెయ్యి కూడా దండిగా వేసినట్టున్నారు.."
"సర్లే పదరా... ఇప్పుడింకేమి చెయ్యగలం.."
"కానీ ఎంత బాగ చేసార్రా.. నీ కక్కుర్తి కాకపోతే మొత్తం నువ్వే తినాలా.."
"నువ్వే కద్రా వద్దన్నావు..!!" అన్నాను నేను
"అంటే మాత్రం తినెయ్యడమేనా... " అంటూనే ముందుకు నడిచాము. ఉమాపతి అప్పటికీ వెనక్కి తిరిగి తిరిగి చూస్తూనే వున్నాడు. ఇద్దరం హోటల్ దగ్గరకు చేరేసరికి రాత్రి పది కావొస్తోంది. హోటల్లోకి వెళ్ళగానే ఇడ్లీ సాంబార్, పూరీ కూరా అన్నాడు మనవాడు.
"ఇప్పుడు అవెందుకు దొరుకుతాయి సార్... చెపాతీ, భోజనం వున్నాయి" చెప్పాడు సర్వర్.
"రేయ్ అటు ప్రసాదమూ పాయే, ఇటు సాంబారూ పాయరా..!!"
"ఇంక సణుగుడు ఆపి, ఏం కావాలో చెప్పు.."
"చెపాతీ.."
"ఒక చెపాతి ఒక భోజనం" చెప్పను నేను సర్వర్‌తో.
భోజనం బాగానే వుంది.
"చెపాతీ కాస్త గట్టీగా వున్నటుంది..?" అడిగాను ఆపుకోలేక.
"గట్టిగానా.. మా గోవిందానికిస్తే చెప్పులు కుట్టిపెడతాడు.."
నేను నవ్వుకున్నాను. ఇద్దరం కానిచ్చి, హోటల్ కి వచ్చి ఖాళీ చేస్తున్నామని చెప్పాం. బ్యాగులు సర్దుకొని వచ్చే సరికి వాళ్ళు బిల్లు చేతిలో పెట్టారు.
"ఏమిటిది..??"
"బిల్లు సార్... పన్నెండువందల డెభై.."
"మేము చెరువుగట్టు వర్ధనమ్మగారి తాలూకా అని చెప్పాం కదా.. లెటర్ కూడా ఇచ్చాము."
"అయితే.. డబ్బులు కట్టరా..??మీరు వర్ధనమ్మ గారి తాలుకనో జిల్లానో మాకు తెలియదు. ఇక్కడ వుంచమని ఆమె లెటరిచ్చింది గాని వూరకనే వుంచమని కాదు."
"అంటే.. ఇప్పుడు.."
"డబ్బులు కట్టండి.. "
"అంత లేవే.."
"మాకు ముందే తెలుసు మీకంత లేదని.. వున్నవిచ్చి, వాచీలక్కడపెట్టండి.."
ఇద్దరం వున్నదంతా వూడ్చి అక్కడ పెట్టాం, వాచీలు కూడా.. అదృష్టం బాగుండి రిజర్వేషన్ టికెట్ వుంది. రిక్షా కని పదిహేను రూపాయలు తీసుకొని బయటపడ్డాం.
"ఏరా.. దేవుడి డబ్బులు దర్శనం దాకా ఎంతైనా వాడచ్చా..?? నిలువు దోపిడి అంటే తెలుసా నీకు.." ఆడిగాను నేను.
ఉమాపతి నా వైపు గుర్రుగా చూసాడు.
గోవిందా గోవిందా అన్నాను నేను.
ఫోటో చూసారుగా.. లోపలికి అడుగుపెడుతూనే కాలంలో వెనక్కి వెళ్ళిపోయామా లేక ఏదైనా చారిత్రక సినిమా చూస్తున్నామా అని అనుమానం వస్తుంది (హిందీ గదర్, ఉమ్రావ్ జాన్ లాంటి సినిమాలు ఇక్కడే తీసారుట). అక్కడి గైడులు అడక్కుండానే మొదలు పెట్టేస్తారు - "సార్ గైడులేకుండా లోపలికి వెళ్తే రెండురోజులైనా బైటికి రాలేరు" అని. అందుకే దాన్ని భూల్ భులయ్యా అన్నారు..!!
1784లో అసఫుద్ద్‌దౌలా అనే నవాబ్ గారి ఆదేశాల మేరకు ఈ కట్టడాన్ని కట్టారు. ఆ సమయంలో కరువు పరిస్థితులు చూసి నవాబుగారు కొన్ని వేల మందికి వుద్యోగం కల్పించాలని ఈ కట్టడాన్ని కట్టించారట. పైగా కట్టడం పూర్తైతే పని ఉండదని నవాబుగారు పగటిపూట కట్టినదాన్ని రాత్రిపూట కూలగొట్టేవారట. ఎంత ముందు చూపు..!!
ఈ ప్రాంగణంలో కనిపించేవి మూడు కట్టాడాలు - బరాఇమాంబారా, ఒక మసీదు, దిగుడుబావిగా రూపాంతరం చెందిన అయిదంతస్థుల భవనం. మూడూ మొఘలు-పెర్షీన్-గోథిక్ శైలుల సమాగమంగా కనపడుతాయి.
భూల్‌భులయ్య
ఇమాంబారాలో మూడు పెద్ద పెద్ద హాల్సు లాంటి గదులుంటాయి. ఈ ముడు గదుల మధ్య వుండే లింకులే మన భూల్‌భులయ్య. దాదాపు వెయ్యి గుమ్మాలతో ప్రతి పది అదుగులకి ఒక నాలుగు దారుల కూడలితో వుంటుంది. ఆ దారుల్లో కొన్ని అర్థాంతరంగా ఆగిపోతాయి. కొన్ని తిప్పి తిప్పి మళ్ళి అక్కడికే చేరుస్తాయి. కొన్ని రహస్య మార్గాలు గోమతి నదీ తీరానికి చేరుస్తాయి(ట).. ఇప్పుడు అవి మూసేసారులెండి. నిపుణుడైన మార్గదర్శకులు లేకపోతే ఎటువెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవడం అసాధ్యం. మనం ఒకసారి తిరిగిన చోటికే మళ్ళీ వచ్చినా గుర్తించటం చాలా కష్టం. అన్ని దారులు ఒకే లాగ వుంటాయి మరి..!!
అక్కడి గైడులు అంతా చూపించి చివరగా పై అంతస్థుకు తీసుకెళ్తారు. అక్కడ కిందికి వెళ్ళడానికి ఆరు దారులుంటాయి. మీ ఇష్టం వచ్చిన దారి ఎంచుకోండి ఎంత సేపటికి వెళ్ళగలరో చూద్దామని సవాలు విసురుతారు. (నాకు ఒక క్లూతో అరగంట పట్టింది - అసలు ఆ దారిలో తెలిసినవాడు కిందకి రావటానికి రెండు నిముషాలు పడుతుందట!!)
మరిన్ని విశేషాలు
ఒకేలా కనిపిస్తున్న ఆ మార్గాలో వెళ్తూ వెళ్తూ ఉన్నట్టుండి ఒక హాలు పై భాగంలో వుంటారు. "అదిగో చూడండి గుండ్రటి పైకప్పు చైనా శైలిలో నిర్మించారు" అంటాడు గైడు. కొంచం ముందుకి అంటే కుడి ఎడమలు ఎడాపెడా తిరిగి మళ్ళి అలాగే కనిపిస్తున్న ప్రదేశానికి చేరాక చూస్తే - అది గుండ్రటి కప్పున్న హాలు కాదు.. అంటే రొండొవ హాలన్నమాట. ఎప్పుడు మొదటి హాలులోనించి రెండోవ హాలులోకి వచ్చామో అర్థం కాదు. గుండ్రటి చైనా కప్పుకోసం చూస్తే అది పర్షియన్ శైలిలో కట్టిన చతురస్రాకారాకారపు కప్పు. "మీరు నిలిచున్న చోటే నవాబుగారు కూర్చునేవారు" అంటాడు గైడు మళ్ళి. వొల్లు జలదరిస్తుంది... ఈ నవాబుగారేమైనా బిల్డింగు నమూనా పట్టుకొని తిరిగేవారా అనిపిస్తుంది. ఇక్కడే ఒక మూల మనల్ని నిలబెట్టి గైడు అవతలి వైపు (330 అడుగులు) నిలబడి అగ్గిపుల్ల గీస్తాడు. ఆ శబ్దం మనకి స్పష్టంగా వినపడుతుంది. అలాగే కాగితం చించిన చప్పుడు సైతం మనకి వినపడుతుంది. శబ్దం ప్రాయాణించే మార్గాలని నిర్దేశించే పెర్షియన్ శైలి ఆర్చీలు నవ్వుతున్నట్టు కనిపిస్తాయి.
ఆ హాలుకి దక్షిణంవైపున్న కిటికీలలోనించి ప్రధాన ద్వారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ద్వారం దగ్గర నిలబడ్డవారికి ఈ కిటికీ దగర వున్న వాళ్ళు కనిపించే అవకాశమే లేదు. శత్రుదాడులేమైనా జరిగితే రక్షణ కోసమే ఈ ఏర్పాటు. ఆ పక్కనే వున్న గోడ దగ్గర నిలబడి గుస గుసగా మాట్లాడితే ఒక పదడుగుల దూరంలో నిలబడ్డ వాళ్ళకి వినబడటం మరొక ఆశ్చర్యం. "గోడకి చెవులుండటం అనే సామెత ఇందుకే వచ్చింది" అని గైడు నవ్వుతూ చెప్తాడు.
ఆ పరిసరంలోనే వున్న మరో కట్టడం పడమటివైపున్న షాహీ హమాం అనే భవంతి. ఇది ముందు సైనికుల నివాసంగా రూపొందించినా తరువాత తరువాత దుగుడు బావిగా మార్చారు (భవంతి అంత బావి..!!). ఆ భవంతి ముఖద్వారం దగ్గర నిలబడితే, అదంతస్తుల భవనం పైకప్పే కనపడుతుంది. ఆ భవంతిలో వున్న వారికి మాత్రం దర్వాజా దగ్గర నిలబడ్డవారు గురి చూసి బాణం వదిలేంత స్పష్టంగా కనపడతారు - అదీ నీటిలో..!!
ఈ భవనంలో ప్రస్తుంతం రెండు అంతస్థులు భూగర్భంలో నీటిలో వున్నాయి. ఈ బావి గోమతీ నదితో కలపబడిందని, లోతు తెలుసుకునే ప్రయ్త్నాలు అందుకే ఫలించలేదని చెప్తారు. ఈ భావికి ఎదురుగానే మసీదు వుంది - ఎదో టర్కీ దేశంలో వున్నాట్టు పొడవాటి మినార్లు అద్బుతంగా కనపడతాయి.
బయటికి వచ్చాక గుర్రపుబండ్లు ఎక్కి అలా ఆ వీధుల్లో తిరిగితే మనంకూడా ఏదో రాజ్యానికి నవాబులం అపోయినట్లుంటుంది.
దాదాపు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జానపద కళలో ప్రముఖంగా భారతం, రామాయణం (లంక దహనం మరీ ప్రత్యేకం. ఇక్కడ వున్న చిత్రాలు ఆ కథలోనివే) ప్రదర్శిస్తారు. ఆంగ్లంలో చెప్పే పప్పెట్రీని, షాడో ప్లేలని కలిపి చేసినట్టుండే ఈ కళ ఆంధ్ర తమిళనాడులకు మాత్రమే ప్రత్యేకం.
గొర్రె తోలును ఎండబెట్టి దానిపై రగులద్ది బొమ్మలను తయారు చేస్తారు. ఆ బొమ్మలు పారదర్శకంగా వుంటాయి కాబట్టి తెరవెనక నిలబెట్టి వాటి వెనక దీపాలు (పూర్వం ఆముదపు దీపాలు, ఇప్పుడు కరెంటు దీపాలు) పెడతారు. దాంతో ఆ బొమ్మల రూపం తెల్లటి తెరమీదుగా మనకి కనిపిస్తాయి.
చెన్నైలో వుండగా జరిగిన తెలుగు సభలలో తీసినవివి.
అంటే తాను మరణించాడా..? ఈ కనపడేవి స్వర్గ ద్వారాలేనా..??
"యుధిష్టిరునికి స్వాగతం" అన్నారు ద్వారానికి ఇరువైపులా వున్న భటులు. మహారాజా అన్న పిలుపుకి అలవాటు పడ్డందుకేమో యుధిష్టరుడనే పిలుపు కొత్తగా వినపడింది.
"నన్ను అందరూ ధర్మరాజంటారు.." చెప్పాడు
"మాకున్న ధర్మరాజు ఒకడే.. మా ప్రభువు యమధర్మరాజు.."
"అంటే ఇది స్వర్గం కాదా..?"
"ఇక్కడ స్వర్గమూ వుంది నరకమూ వుంది.." అంటుండగానే ఆ ద్వారాలు తెరుచుకున్నాయి.
యుధిష్టరుడు లోపలికి ప్రవేశించాడు. కొంత ముందుకెళ్ళగానే అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అక్కడ -
శొభాయమానమైన సింహాసనంపై ఆసీనుడై వున్నాడు ధుర్యోధనుడు. సకల సౌభాగ్యాలతో తులతూగుతూ, సుర్యతేజంతో ప్రభాసిస్తూ..
ఇది నిజమా.. లేక నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా..? అనుకుంటూ తల తిప్పేసుకున్నాడు. తనతో వస్తున్న భటులతో అన్నాడు -
"ఈ ముందుచూపులేని మూర్ఖుడు దుర్యోధనుడితో నేను ఈ లోకాన్ని పంచుకోలేను. కురుక్షేత్ర సంగ్రామానికి, కురు వంశ నాశనానికి కారణం అతడే. భటులారా నేను ఆతడి ముఖం కూడా చూడలేను. నన్ను దయచేసి నా తమ్ముల దగ్గరకు తోసుకెళ్ళండి.." అంటూ అడిగాడు. అంతలో ఒక మహాపురుషుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
"యుధిష్టిరా.. ఇది సమవర్తి లోకం.. ఇక్కడ ద్వేషానికి, శత్రుత్వానికి ఆస్కారంలేదు. దుర్యోధనుడి గురించి నీవటుల పలకరాదు. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధంలో పోరాడి మరణించి అంతను ఇక్కడ స్వర్గ సౌఖ్యాలనుభవిస్తున్నాడు. ఇక్కడ దేవతలు సైతం అతనిని పూజిస్తారు. కాబట్టి ఇక ద్వేషాన్ని మరచి అతనితో కలువు.." అంటు హితబోధ చేసాడు.
"సరే దురోధనుడు క్షత్రియ ధర్మాన్ని పాటించినవాడైతే అతన్ని ఇక్కడే వుండనీ... నేను మాత్రం ఇక్కడుండలేను. యుద్ధంలో మరణించినవారికే స్వర్గమైతే నా అభిమన్యుడెక్కడ, దుష్టద్యుమ్నుడు అతని కుమారులెక్కడ, గురు ద్రోణులు, పితామహుడెక్కడ... నా అగ్రజుడు కర్ణుడుడెక్కడ... నా తమ్ముళ్ళెక్కడ..?? నన్ను అక్కడికి తీసుకెళ్ళండి.."
"అవశ్యం. మీరు ఏది కోరితే అది నెరవేర్చమని మా ప్రభువు ఆజ్ఞ.. మా భటులతో వెళ్ళండి మీరు కోరిన చోటికి తీసుకెళ్తారు.." అంటూ ఆ దేవతాపురుషుడు అదృశ్యమయ్యాడు. భటులు ముందుకు కదిలారు. యుధిష్టరుడు వెనకే నడవసాగాడు.
ఆ దారంతా ఎంతో దుర్భరంగా వుంది. పాపాలు చేసిన మానవులంతటా పరుచుకొని వున్నారు. ఇనప ముళ్ళున్న కందిరీగలు కుడుతున్నాయి, కాకులు గద్దల ఇనుప ముక్కులతో రక్తమోడుతున్నాయి. కుళ్ళిపోయిన శవాలున్నాయి... వాటి నిండా దుర్గంధభరితమైన కీటకాలు. కొంత దూరం వెళ్ళాక మరుగుతున్న నీటితో నిండిన నది కనపడింది. అది దాటిన పిమ్మట ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. అక్కడి చెట్లకు కత్తులాంటి ఆకులున్నాయి.. అవన్ని యుధిష్టరుడికి గీసుకొని రక్తం కారసాగింది. కాగుతున్న నూనెలో మరుగుతూ, రాళ్ళతో, ఇనుముతో చేసిన ఆయుధాల దెబ్బలు తింటూ యమలోకపు శిక్షలనుభవిస్తున్న వారు చేస్తున్న ఆర్తనాదాలు భయంకరంగా వున్నాయి.
అక్కడి పరిస్థితి ముందుకెళ్తున్నకొద్దీ మరింత దుర్భరమవసాగింది. యుధిష్టరుడు అసహనంగా అడుగులు వెయ్యసాగాడు. చుట్టూ గాఢాంధకారం అలుముకుంది. కన్నుపొడుచుకున్నా కానరాని చీకటి.. భయంకరమైన దుర్గంధం తప్పించి తను ఎటు వెళ్తున్నది అర్థం కావటంలేదు. పాదాలలో సూదికొనయైన ముళ్ళు దిగబడి రక్తం ధారగా ప్రవహించసాగింది. ఇక ముందుకు అడుగులెయ్యలేక అక్కడే ఆగిపోయాడు.
"భటులారా.. ఇంకా ఎంత దూరం ఈ హేయమైనా ప్రదేశంలో నడిపిస్తారు... నా తమ్ముళ్ళను చూపించండి.. ఇక వారిని చూడటానికి నేను ఒక్క క్షణం కూడా వేచి వుండలేను.." అన్నాడు బాధగా.
"అయ్యా.. మనం చేరవలసిన చోటికి చేరుకున్నాము. మిమ్మల్ని ఇక్కడిదాకా మాత్రమే తీసుకురమ్మని మా ప్రభువుల ఆజ్ఞ. మీరు సమ్మతిస్తే ఇక్కడే వదిలేసి మేము తిరిగి వెళ్ళిపోతాము. లేదా మాతో తిరిగి రాదలుచుకుంటే తీసుకు వెళ్తాము. తమ ఆజ్ఞ ఏమిటో తెలియజేయండి."
యుధిష్టరుడు ఆశ్చర్యపోయాడు. కన్ను కానని ఈ చీకటిలో, భయంకరమైన ఆడవిలో ఎక్కడని తమ్ముళ్ళను గాలించగలడు. ఈ దుర్గంధాన్ని భరిస్తూ ఒక్క క్షణం కూడా జీవించి వుండలేడు. ఇలా అనుకుంటూ యుధిష్టరుడు వెనుతిరిగాడు. అంతలో నలువైపుల నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి..
"ధర్మనందనా.. మమ్మల్ని విడిచి వెళ్ళద్దు.."
"మమ్మల్ని కాపాడు అన్నయ్యా..."
"నీ రాకతో ఇక్కడికి పరిమళ భరితమైన సువాసనలు ప్రవేశించాయి.. మాకు ఈ దుర్గంధాన్ని తప్పించే ఆ ఒక్క మార్గాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నావా.."
యుధిష్టరుడు అదిరిపడ్డాడు. "ఎవరది.. ఎవరు మాట్లాడుతున్నారు..??" అడిగాడు
"అన్నయ్యా మేము నీ తమ్ముళ్ళం.. పాండు కుమారులం.."
"పెదనాన్నా మేము మీ పుత్రులం.. వుప పాండవులం"
"నేను ద్రౌపదిని"
"అభిమన్యుడను.."
యుధిష్టరుడి కంట అప్రయత్నంగా కన్నీరు వుబికింది.
"హతవిధీ.. ఏమిటీ ఘోరం..? మహావీరులైన తమ్ముళ్ళు, సాధ్వి ద్రౌపది, నా పుత్రులు వీరంతా వుండవలసిన చోటేనా ఇది. దుర్యోధనుడు చేసిన పుణ్యమేమిటి వీరంతా చేసిన పాపమేమిటి?? ఎందుకు వీరికీ శిక్ష విధించారు..? నా చిత్తమేమైనా చెలించినదా.. అస్వస్థుడనై నిద్రావస్థలో ఈ భయంకరమైన కలగంటున్నానా.." అనుకుంటూ అక్కడే కొంతసేపు నిలబడిపోయాడు.
అంతలోనే తేరుకొని భటులతో -
"మీరు వెళ్ళిపోండి.. మీ ప్రభువుతో నేను ఇక్కడే వుండటానికి నిశ్చయించుకున్నానని నివేదించండి. నా వునికి నా సోదరులకు ఇతర పాపులకి సాంత్వన కలగజేస్తుంటే వారి సుఖం కోసం నేను ఈ బాధలను భరించడానికి సిద్ధమే అని తెలుపండి.. వెళ్ళండి"
ఆ మాట వింటూనే వారు తిరిగివెళ్ళిపోయారు. యుధిష్టరుడు నిస్సహాయంగా నాలుగువైపుల చూసాడు.
"ఏమిటి విచిత్రం? నా తమ్ముళ్ళు నరకంలో వుండటమేమిటి? సరే, విధిరాతను తప్పించడం ఎవరికి సాధ్యం. నా పరివారానికి ఇదే రాసిపెట్టివుంటే అలాగే జరగునుగాక. సుయోధనుడు వీరమరణంతో అమరుడై వుంటే వుండుగాక. నేను మాత్రం ఇక్కడే వుంటాను. భూలోకంలో మహరాజుగా వీరందరి సేవలను అందుకున్నాను. ఇప్పుడు వీరందరికీ సేవ చేస్తాను. వారి సుఖంలోనే నాకు సుఖం వుంది, వారి సంతోషంలోనే నాకు సంతోషం వుంది, వారెక్కడ వుంటే అదే నాకు స్వర్గమౌతుంది" అనుకుంటూ ముందుకు కదలబోయాడు.
సరిగ్గా అప్పుడే దూరం నుంచి సుర్య తేజాన్ని మించిన వెలుగును చూసాడు. అది క్రమంగా దగ్గరకు రాసాగింది. ఆ వెలుగు ప్రసరించడంతో ఆ ప్రాంతమే మారిపోయింది. నరకలోక శిక్షలన్నీ మాయమై ఆ స్థానే దేవతా వృక్షాలు వాటికింద తపస్సు చేసుకుంటున్న మునులు కనిపించారు. అమోఘమైన పూల పరిమళాలు పరచుకున్నాయి. ఆ పరిసరాలన్నీ అద్భుతమైన దృశ్య కావ్యంగా మారిపోయాయి. ఆ వెలుగుతోబాటే ఇంద్రుడు, యమకుబేరాది అష్టదిక్పాలకులు వచ్చి యుధిష్టరుడి ముందు నిలబడ్డారు.
"ధర్మరాజా.." అన్నాడు ఇంద్రుడు.
"లేదు ప్రభూ నేను యుధిష్టరుడిగానే సంతుష్టుడిని. నా పరివారమంతా నరకంలోవుంటే నన్ను ధర్మరాజని పిలవడాం హాస్యాస్పదంగా వుంటుంది." అన్నాడు యుధిష్టరుడు చేతులు జోడించి.
"నీ పరివారమెవ్వరూ నరకంలో లేరు ధర్మనందనా.. అది కేవలం నీ భ్రమ మాత్రమే. రాజుగా పుట్టినవాడు నరకాన్ని చూసితీరాలని ప్రతీతి. అందునా ద్రోణుణ్ణి వధించడానికి నీవు మోసానికి పాల్పడ్డావు. మరణిచినా ఈర్షాద్వేషాలు నీలో చావలేదని దుర్యోధనుణ్ణి చూసి చెప్పకనే చెప్పావు. వీటన్నిటి పర్యవసానమే ఈ నరకలోక అనుభవం.." చెప్పాడు ఇంద్రుడు.
యమధర్మరాజు పుత్రవాత్సల్యంతో -"నాయనా.. నేను నీకు పెట్టిన మూడొవ పరిక్ష ఇది. పూర్వం ద్వైత వనంలో నీవు సమిధలకై వచ్చినప్పుడు ఒక తటాకం వద్ద నిన్ను ప్రశ్నించాను, మహాప్రస్థానంలో కుక్కగా నీ వెంట వచ్చి పరీక్షించాను, ఈ నరకానుభవం కూడా అలాంటిదే. అసూయ ద్వేషాన్ని విడనాడి నీ పరివారానికి తోడుగా నిలవాలని ఎప్పుడు నిర్ణయించుకున్నావో అప్పుడే నీ శిక్ష ముగిసింది. నరకము స్వర్గము అని రెండు వేరు వేరు ప్రదేశాలు లేవు. నీ మనసులో ఈర్ష వున్నప్పుడు ఇదే నరకం, సంతోషమున్నప్పుడు ఇదే స్వర్గం" అన్నాడు నవ్వుతూ.
"ధర్మరాజు" నమస్కరించాడు.
03.10.2008
అనగనగనగ అమెరికాలో ఒక గన్నాయిగాడున్నాడు. సదరు గన్నాయిగాడికి ఎప్పటినుంచో ఒక ఇల్లు కొనుక్కోవాలని ఆశ. వాళ్ళూరిలోనే వున్న పిటి బాంకుకు వెళ్ళి అడగ్గా వాళ్ళు -
“నువ్వు చేసే వుద్యోగమేమిటి.? నీ దగ్గర ఇతర ఆస్తులేమైనా వున్నాయా..? నెల నెలా ఈఎంఐ ఎలా కడతావు..” లాంటి ప్రశ్నలన్నీ వేశారు. గన్నాయిగాడి దగ్గర అవేమి లేకపోవటంతో అప్పు ఇవ్వముగాక ఇవ్వమని చెప్పేసారు పిటిబ్యాంకు వాళ్ళు.
గన్నాయిగాడు కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాడు.
2004 - 2007
లేమాన్ తమ్ముళ్ళని ఒక ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీవాళ్ళు, పిటీ బ్యాంకువాళ్ళను కలిసారు.
“పిటీ బ్యాంకూ పిటీ బ్యాంకూ నువ్వు ఇళ్ళు కొనుక్కోటానికి లోన్లు ఇస్తావటకదా.. ఆ లోన్లు తీరి ఆ డబ్బంతా నీ దగ్గరకు వచ్చేసరి ఇరవై ముప్ఫై ఏళ్ళు పడుతుందికదా.. అప్పటిదాకా నీ డబ్బులు ఇరుక్కుపోయినట్లే కదా”
“అవును అదే చాలా ఇబ్బందిగా వుంది… ఏదైనా వుపాయం చెప్పరాదూ..” అన్నారు పిటీ బ్యాంకర్లు.
“అయితే విను… నీ హోం లోన్లన్నీ నాకు అమ్మేసెయ్యి నేను కొనుక్కుంటాను… నీకు ఒక్కసారే డబ్బులిస్తాను అది నువ్వు మళ్ళీ నీ బ్యాంకు పనులకి వాడుకోవచ్చు… నాకు మాత్రం నెల నెలా లోను తీసుకున్నవాళ్ళు ఇచ్చే నెల వాయదాల్లో కొంత భాగమివ్వు చాలు..” అని లేమాన్ తమ్ముళ్ళు చెప్పారు.
భలే భలే అని బ్యాంకులన్నీ అప్పులను అమ్మడానికి సిద్ధమయ్యాయి. అనుకున్నట్టే బ్యాంకులు తమ తమ అప్పులన్నీ తమ్ముళ్ళకి అమ్మేసాయి. తమ్ముళ్ళిచ్చిన డబ్బులను మళ్ళీ అప్పుగా ఇవ్వడం మళ్ళీ తమ్ముళ్ళకి అమ్మటం.. ఇలా సాగుతోంది ప్రహసనం.
తమ్ముళ్ళు ఆ అప్పులన్నీ ఒక కుప్ప పోశారు. వాటిని విలువ, వ్యవధి, వడ్డిని బట్టి భాగాలుగా కోసారు. ఒక్క భాగాన్నికి 'STRUCTURED ENHANCED HOME LOAN CREDIT LEVERAGE FUND' లాంటి పెద్ద పెద్ద పేర్లు పెట్టి అమ్మకానికి పెట్టారు. (అమ్మకానికైతే అంత పేరుగాని అసలు వీటిని COLLETARALIZED DEBT OBLIGATIONS అంటారు)
ఈలోగా మరోపక్క వేరే కథ నడుస్తోంది. ప్రపంచంలో వున్న అనేక కంపెనీలు అంటే జపాను ఇన్సురెన్సు కంపెనీ, ఫిన్లాండు పెన్షన్ కంపెనీ లాంటివి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని వాటిని ఎక్కడ పెడితే ఎక్కువ రిటన్సు వస్తాయా అని చూస్తున్నాయి. ఇంతకు మునుపైతే అమెరికా గవర్నమెంటు బాండ్లలో పెడితే 4-5% దాకా వచ్చేది, సెప్టెంబరు పదకొండు తర్వాత అమెరికా 1% కన్న ఇవ్వట్లేదు. సరిగ్గా అప్పుడే తమ్ముళ్ళు పెట్టిన అమ్మకం గురించి వీళ్ళకి తెలిసింది.
వాళ్ళు తమ్ముళ్ళ దగ్గరకు వచ్చి –“అబ్బాయిలూ మీరు అమ్ముతున్నది బాగానే వుంది కాని గవర్నమెంటు బాండులు కొనుక్కుంటే మాకేదో గ్యారంటీ వుండేది.. నీ బాండులు కొంటే రేప్పొద్దున అప్పుతీసుకున్నవాళ్ళు తిరిగివ్వకపోతే బ్యాంకు నీకు డబ్బులివ్వదు, బాంకు నీకివ్వకపోతే నువ్వు మాకివ్వవు, మేము ఇవ్వకపోతే మా వూళ్ళో నిలబెట్టి తంతారు… అందుకని నువ్వు వద్దు నీ బాండులు వద్దు..” అన్నారు.
తమ్ముళ్ళు వెంటనే – “అంతే కదా ఇక్కడే వుండండి” అని KIG అనే ఒక ఇన్సురెన్సు కంపెనీ దగ్గేరకి వెళ్ళారు. .
“కేఐజీ కేఐజీ ఇలాగిలాగ మేము అప్పులు కొనుక్కున్నాము… ఎవడన్నా అప్పుతీర్చకపోతే మా డబ్బులు నువ్విచ్చేట్టు ఒక ఇన్సూరెన్సు తయారు చెయ్యి… ప్రీమియము ఎంతైతే అంత నీకిస్తాము..” అన్నారు.
KIG సరే లెమ్మని “CREDIT DEFAULT SWAPS” అనే ఒక ఇన్సూరెన్సు తయారు చేసి పెట్టారు. తమ్ముళ్ళు అది కొనుకున్నారు. ఇకనే… అప్పు తీసుకున్నవాళ్ళు ఇవ్వకపోయినా ఇన్సురెన్సు కంపెనీ ఇస్తుంది కదా అని ప్రపంచంలో వున్న రకరకాల కంపనీలు తమ్ముళ్ళ దగ్గర బాండులు కొనడం మొదలెట్టాయి.
బ్యాంకులు అప్పులియ్యను, తమ్ముళ్ళు కొనుక్కోను, KIG ఇన్సుర్ చెయ్యను పెట్టుబడిదారులు కొనుక్కోను… ఇలా సాగుతోంది వరస. ఆప్పు కొన్నా నష్టపోయేది లేదు కాబట్టి తమ్ముళ్ళు బ్యాంకులను ఇంక ఇంకా లోనులివ్వమని ప్రోత్సహించారు. తాము తయారు చేసిన విధానంలో విశ్వాసంతో తమ్ముళ్ళు కూడా తమ గొడ్డు గోదా అన్నీ అమ్మి ఇందులో పెట్టారు.
బ్యాంకులు ఎవడు దొరుకుతాడా అప్పిద్దామని ఎదురు చూడసాగాయి. కనపడ్డవాడినల్లా అప్పు కావాలా అప్పు కావాలా అని వేధించసాగాయి. లోను దొరకటం చాల సులభమైపోయింది. ఒక రోజు గన్నాయిగాడిని పట్టుకోని పిటీ బ్యాంకువాళ్ళు బలవంతంగా లోను అంటగట్టారు. దమ్మీడి ఆదాయంలేదు నాకెందుకయ్యా లోను అంటే, కాదు కూడదు తీసుకోవాల్సిందే అని బ్రతిమిలాడారు. అమెరికాలో రియలెష్టేటు మాంచి బూం లో వుంది. మేమిచ్చిన డబ్బులుతో ఇల్లు కొనుక్కోని వెంటనే అమ్మేసినా బోలెడు డాలర్లు వెనకేసుకోవచ్చు అని ఆశపెట్టాయి.
ప్రతివాడు ఎగబడి ఇళ్లు కొనడంతో ఇళ్ళు కట్టే వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి , టైలు కట్టిన మేనేజర్లను పెట్టి ఎడా పెడా ఇళ్ళు అమ్మేసుకున్నారు. ఇందులో భాగస్వాములైన కంపనీలన్నీ దిన దిన ప్రవర్ధమానమై వెలగ సాగాయి. తమ్ముళ్ళు లాంటి వారు, పిటీ లాంటి బ్యాంకులు, KIG లాంటి ఇన్సురెన్సు కంపెనీలు, ఇళ్ళుకట్టే కంపెనీలు, తమ్ముళ్ళ దగ్గర అప్పు ముక్కలు కొనుక్కునే కంపెనీలు వగైరాలన్నమాట. ఇంకేముంది వీటి చుట్టు సాఫ్టువేరు కంపెనీలు, HR కంపెనీలు, కన్సల్టెంటులు, ఏసీ సప్లై చేసేవాడి దగ్గరనుంచి, ఆఫీసులో చెత్త వూడ్చే వాడిదాక, అసలు ఇది ఇంత సక్సస్ ఎందుకైందో రీసర్చ్ చేసేవారి నుంచి ఇలాంటి వుద్యోగాల్లో చేరటానికి కోచింగ్ సెంటర్లు దాకా అన్ని ఎక్కడికక్కడ ఎదో పదో పరకో సంపాయించుకుంటున్నాయి.
KIG లాంటి ఇన్సురన్సు కంపనీలైతే… ఈ పాలసీలమీద క్లయిములెట్టాగు రావు కాబట్టి ఎవరైనా ఈ రిస్కుని మా దగ్గర కొనుక్కుంటే మీకు ప్రీమియంలో భాగమిస్తామన్నాయి. (బ్యాంకులు అప్పులమ్మినట్టే ఇన్సురన్సు కంపెనీలు ఇన్సురన్సు కవర్ అమ్మసాగాయి)
2008
బ్యాంకులు ఇచ్చిన అప్పులన్నీ వేరియబుల్ వడ్డి రేట్లు. అంటే నెల నెలా కిస్తులు స్థిరంగా వుండవ్. అదీ కాక అప్పులు ఇచ్చేవాళ్ళు ఎక్కువవటంతో జనాలు పోనీలే ఇల్లు కొంటే దాని ధర ఎప్పటికైనా పెరుగుతుంది అని ఎడా పెడా కొనేసారు. నిజానుకి డబ్బులు దండిగా దొరకటంతో గన్నాయిగాడుకూడా కొత్తిల్లే కొన్నాడు. అవసరమైతే అమ్మి అప్పు కడదామనుకున్న వాళ్ళకి వడ్డి పై వడ్డిలు పడ్డాయి. అమెరికా రియలెస్టేటు బుడగ ఒక రోజు బుడుగున మునిగింది.
గన్నాయిగాడు ఆలోచించాడు -
“ నేనెట్టాగు అప్పుతీర్చలేను… రెండురోజులైనా సొంతింట్లో వున్నాను.. నా కల రెండురోజులకైనా నెరవేరింది…” అనుకున్నాడు. అప్పు తీర్చడం మానేసాడు – కావాలంటే ఇల్లు జప్తు చేసుకోమన్నాడు.
పిటీ బ్యాంకుకు మతి పోయింది… అసలు లేదు, వడ్డి లేదు పైగా ఆ ఇంటిని జప్తు చేసి అమ్ముకుంటే లోనులో సగంకూడా వచ్చేట్టు లేదు. తమ్ముళ్ళని పిలిచి –
“అయ్యా ఇదీ పరిస్థితి… కనక మేము నీకు డబ్బులిచ్చుకోలేము” అని తేల్చేసారు. తమ్ముళ్ళు నానా హైరాన పడి KIG దగ్గరకు వెళ్ళారు. KIG కొంతకాలం పాపం వోపిక పట్టి కొన్ని తీరని అప్పులు తీర్చింది. అవి మరీ ఎక్కువైపోతుండటంతో తనూ చేతులెత్తేసింది. ఇంకేముంది – తమ్ముళ్ళు, KIG ఇద్దరూ ఐపీ పెట్టారు. దుకాణాలు మూసేసారు.
తమ్ముళ్ళదగ్గర అప్పు ముక్కలు కొన్న కంపనీలన్నీ ఏడుపు ముఖాలు పెట్టాయి. ఆయా దేశాలలో వాటి షేర్లూ ఏడుపు ముఖమే పట్టాయి. అలాగే తమ్ముళ్ళను నమ్ముకున్న సాఫ్టువేరు ఇత్యాది కంపనీలన్నీ హడావిడిగా మీటింగులు పెట్టేసుకున్నాయి. కొన్ని దుకాణాలు కట్టేసాయి, కొన్ని మనుషుల్ని బయటికి గెంటేసాయి.
దాంతో ప్రపంచంలో వున్న అన్ని మార్కెట్లు నేల చూపులు చూసాయి. తమ్ముళ్ళ దగ్గర అప్పు ముక్కలు కొన్న కంపనీలు మనదేశంలో లేక పోయినా… వాళ్ళకి BPOలు, సాఫ్టువేర్లు, హార్డువేర్లు, మంత్రిచ్చినవేర్లు గట్రా సేవలందించే కంపనీల వల్ల, తమ్ముళ్ళ దగ్గర అప్పుముక్కలు కొన్న కంపనీలన్ని నష్టాలని తగ్గించుకోవడానికి మన దేశంలో పెట్టిన డబ్బులు వెనక్కి తీసుకోవడం వల్ల, ప్రపంచంలో మార్కెట్టులన్ని పడిపోతున్నాయి కాబట్టి మన మార్కెట్టు పడిపోవాలి అనే పిచ్చి నమ్మకం వల్ల, కొండక చో మన బ్యాంకులు మూత బడుతున్నాయహో అని పనిలేని వాళ్ళు పుట్టించే పుకార్ల వల్ల మన మార్కెట్టు పడిపోతోంది. కోలుకోవడానికి సమయం పట్టినా కోలుకోవడం ఖాయం.. ప్రాణ భయమేమి లేదు అంటున్నారు (ఆర్థిక) డాక్టర్లు. సరే చూద్దాం ఏంజరుగుతుందో…
కొసమెరుపు
కథ అంతా విన్న శిష్యుడు గురువు మణి సిద్దుడితో అన్నాడు –
“గురువుగారు, అంతా బాగానే వుంది కాని.. ఇప్పుడు మన దేశంలోనూ రియలెస్టేటు బూం అంటున్నారు కదా.. బ్యాంకులూ వెంటబడి లోన్లిస్తున్నాయి… మరి రేపో మాపో మనకీ అమెరికా గతి పడుతుందంటారా..?”
“పిచ్చివాడా… భారత దేశం ఈ విషయంలో ప్రపంచంలో అందరికన్నా ముందుంది. అమెరికా లాంటి చోట బాంకులు ఇచ్చిన అప్పుతోనే ఇల్లు కొంటారు కాబట్టి, అప్పు తీర్చలేనప్పుడు… ఇల్లు వదిలేసుకుంటారు..
అదే మన దేశంలో అయితే బ్యాంకు ఇచ్చిన అప్పుకు దాదాపు సమానంగా నల్ల ధనం చేతులు మారుతోంది. అంటే బ్యాంకు దృష్టిలో నీ ఇంటికిచ్చిన అప్పు 30 లక్షలైతే నిజానికి నువ్వు కట్టిన డబ్బు యాభయ్యో అరవయ్యొ లక్షలుంటుంది. ముప్పై లక్షల అప్పుకి అరవై లక్షల ఇల్లు ఎవరైనా వదులుకుంటారా.. అందుకే తల తాకట్టు పెట్టైనా మనవాళ్ళు ఇంటిమీది అప్పులు తీరుస్తుంటారు…”
“అంటే గురువుగారు… నల్ల ధనమే మన దేశాన్ని సంక్షోభంలోకి పోకుండా కాపాడుతోందన్నమాట…”
“నిశ్చయంగా..”
(హాస్యదర్బార్ సీరియల్ తరువాత నేను రాయబోతున్న సీరియల్ కథ కోసం ఇది రాసుకున్నాను. మార్కెట్టు "నెత్తురు కక్కుంటూ నేలకి రాలటం" చూసి సందర్భం కుదిరిందని ఇప్పుడే ప్రచురించాను.)
"బాబూ రిక్షా.." అతికష్టం మీద పిలిచింది రాములమ్మ. ఆమె కళ్ళు, డొక్క లోపలికి పోయినాయి. కాళ్ళు చేతులు సన్నగా కట్టెపుల్లల్లా వున్నాయి. మాసిన పాత చీర, చిరుగులు పడ్డ జాకెట్టు తొడుక్కొని వుంది. నెరిసిన జుట్టు మీద పడ్డ దుమ్ము జుట్టు రంగునే మార్చేసింది.
"ఏటే.. ఏడకి పోవాలే" అడిగాడు రిక్షావాడు. ఆమె చెప్పింది.
"అరే.. ఆ గల్లీలెంట బోవాలె.. ఇదేమన్న రిక్ష అనుకున్నవా.. ఇమానమనుకున్నావా..?? అసలు నీకాడ పైసలున్నాయే..?" వ్యంగ్యంగా అడిగాడు.
"పైసల్లేవు బిడ్డ.. ఆడకు పోగానే నా కోడుకిస్తడు.. నడ్వలేకున్నా జరంత తోల్కపో బిడ్డా.." ఆమె ప్రాధేయపడింది.
"ఏందిరన్నా సంగతి.." అంటూ వచ్చాడు మరో రిక్షావాడు.
"బస్తిలెంట గల్లీలెంట బోవాలంటది. పైసలు మాత్రం దీని బిడ్డ ఇస్తడంట.."
మధ్యలోనే అందుకుంది రాములమ్మ
"అవు బిడ్డ.. కాళ్ళునొస్తున్నాయ్.. జర నువ్వైనా జెప్పు నాయనా.."
"ఈళ్ళంత ఇంతెనే.. దా నా బండెక్కు నే తోల్కబోతా.." అంటూ ఆమెనెక్కించుకున్నాడు.
***
"నీ పేరిందిర బిడ్డ" దారిలో అడిగింది
"నా పేరేదైతేనేంటిలే అవ్వా.."
"ఏంలేదు.. మంచి తీరుగున్నవని అడిగిన.."
"అందరూ యాదగిరి అంటరు.."
"గట్లనా.."
అంతకు మించి ఏమి మాట్లాడుకోలేదు. బండి వీధులన్నీ తిరిగి తిరిగి చేరవలసిన చోటికి చేరింది.
"ఏడనే వుండు బిడ్డా.. నా బిడ్డ వచ్చి పైసలిస్తడు.." అంటూ లోపలికెల్లింది రాములమ్మ.
"ముసల్దొచ్చింది" లోపలినుంచి విసురుగా ఒక ఆడగొంతు.
"ఇదేందే ఇప్పుడొచ్చినావ్.. ఇంకా నాల్గుదినాలుండెగా.." కోపంగా మొగగొంతు.
"అదిగాదురయ్య.. ఆడనే సూపుగానక ఓ బుడ్డి పగలగొట్టిన.. ఆడు ఇంట్లోంచి తరిమేసిండ్రా.. మళ్ళ గిట్ల రావద్దండు.." బావురుమంది రాములమ్మ.
"ఆడు దరిమేస్తే.. గిట్లెందుకొచ్చినావ్..? నా కొంప సత్రం లెక్క గానొస్తుందానె.." అంటూ కసురుకున్నాడు.
"అది గాదురా అయ్యా.. ఆడు అసలు ఇంట్లోకే రానీయననిండు.."
"ఆడు దరిమితే.. నేనేమైనా పాగల్గాన్నా నిన్నుంచుకోడానికి.. నేను ఇంట్లోకి రానీయ్య.. బయటకిపో.."
"నువ్ గూడ గిట్లంటే నేనేంగావాల్రా..?"
"ఏహె గదంతా నాకెర్కలేదు నూవ్ ముందైతె ఇంట్లకెల్లి పో.."
రాములమ్మ పైటచెంగుతో గుడ్లొత్తుకుంది.
"గట్లనేకాని బిడ్డ.. బయట రిక్షావోడున్నడు.. ఆనికి పైసలిస్తే.."
"మంచిగనేవుంది.. నీ కోడుకులేమైనా పటేల్లనుకున్నవా.. రిక్షాల్లో తిరిగి రాజ్యాలేలనీకి.." కసురుకుంటూ డబ్బులిచ్చింది కోడలు. చివుక్కుమన్న గుండెతో రావులమ్మ బయటకి వచ్చింది.
"ఛీ ఛీ.. ఈ నాకొడుకులంతా ఇంతే.. కన్న తల్లిని జూస్కోడానికేమాయే..!!" అనుకున్నాడు యాదగిరి.
బయటకువచ్చి డబ్బులిచ్చింది రాములమ్మ. యాదగిరి వద్దనాడు. రాములమ్మ ఏమి మాట్లాడలేదు.
"నేనంతా ఇన్నాన్లే.. ఇప్పుడెక్కడికి పోతావ్.." యాదగిరి అడిగాడు.
"ఏడకని బోతా నైనా..! ఏ సెట్టు కిందో పుట్టకిందో.. గిట్లనే సచ్చిందనక.." ఆ పైన మాట్లాడలేదు. ఆ వయసులో నిస్సహాయంగా ఏడవటానికి మనస్కరించక కళ్ళలో నీళ్ళను తొక్కి పట్టింది.
"నా రిక్షా ఎక్కు.. నిన్ను ఆ పార్కు కాడ వదుల్తా.."
రాములమ్మ మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది.
"గట్లైతే నికు ఇద్దరు బిడ్డలా..?" యాదగిరి అడిగాడు రిక్షా తొక్కుతూ.
"అవు బిడ్డా..! ఇంకొకడుండె గాని.." అంటూ ఆపేసింది.
"ఆనికేమైంది.."
"ఆడు సిన్నప్పుడే తప్పిపోయాడు బిడ్డ.. ఆడి సిన్నతనంలో నేను ఇస్కూళ్ళ ఆయాగా చేస్తుండె. ఇస్కూల్ల సారు సానా మంచిగుంటుండె. నా బిడ్డలకు వుట్టిగనే సదువుకూడ సెప్పిండు. ఆ యెదవ ఆయనకాడ చోరి చేసిండు. నే తంతానని ఆడ నించే పారిపోయిండు.. ఇప్పుడు ఏడున్నడో ఏమో...! ఆని పేరు కూడా యాదగిరే.."
యాదగిరి రిక్షా వేగం తగ్గింది. చిన్నప్పుడు హెడ్డుసారు ఆఫీసులో తనుచేసిన దొంగతనం గుర్తొచ్చింది.
"ఆడు గానొస్తే గుర్తుపడతావా..?" అడిగాడు అనుమానంగా.
"ఆయాల్టినుంచి గనపడనేలేదు.. ఇప్పుడు నీయంతై వుంటడు. ఆని మెళ్ళో ఒక దండ వుంది. ఆ ఇస్కూళ్ళ సారే ఆని మెళ్ళో ఏసిండు.. దానిపైన వోళ్ళ దేముడు బొమ్మ కూడా వుంది." చెప్పింది రాములమ్మ
యాదగిరి గుండె చప్పుడు వేగంపెరిగింది. రిక్షా దాదాపు ఆగిపోయింది. బుర్ర నిండా ఆలోచనలు -
"అయితే నేనేనా ఈమె బిడ్డని..?" మనసులో రొదగా వుంది.
"అమ్మా.." అని పిలవబోయాడు. అప్రయత్నంగా ఆ పిలుపు గొంతు దగ్గర ఆగిపోయింది. గొంతు ఆగిపోయి బుర్ర పనిచెయ్యడం మొదలెట్టింది.
"ఇప్పుడు ఈమే అమ్మని తెలిస్తే.. ఇంటికి దీస్కపోవాల.. ఇంటికాడ యాదమ్మ నన్ను సంపతాది.. మనం తినేదానికే లేకపోతే ఈ ముసల్దానేడకెళ్ళి దెచ్చినావ్ అంటది"
"అది సెప్పేది నిజమే.. ఈ రిక్షాపైన నాకెన్ని పైసలొచ్చినా అయి మా తిండికే సాలవు.. ఇంక దీన్నేస్కెల్తే కర్సులెక్కువైతాయి.. అయినా ఆళ్ళిద్దరూ తరిమేసిన్రు.. నడిమిట్ల నేనెందుకు సూడాలే..??"
ఆలోచన్లలోనే పార్కు దగ్గరకు వచ్చేసాడు. రిక్షా ఆపి కిందకి దిగాడు.
"పార్కు వచ్చేసింది.." అన్నాడు.
రావులమ్మ పలకలేదు.. ఇక పలకలేదు కూడా. అచేతనంగా పడిపోయివుంది.
యాదగిరి మాట్లాడలేదు. అతనికి ఏడుపు కూడా రావట్లేదు. ఆమె వైపే చూస్తూ నిలబడి పోయాడు. చుట్టూ జనం చేరారు.
"పాపం..!! కొడుకులు తరిమేసరికి గుండ పగిలి చచ్చిపోయింది.." ఎవరో పెద్దమనిషి అన్నాడు.
"ఛి.. ఛి..!! ఈ నా కొడుకులంతా ఇంతే.. కన్నతల్లిని చూస్కోడానికి యేమాయే.." ఇంకెవరో అంటున్నారు.
యాదగిరి గుండె కలుక్కుమంది. సూర్యుడి కిరణం పడి అతని మెడలో దండకున్న సిలువ తలుక్కుమంది.
(1995 ఆదివారం ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
మళ్ళి మరో దెబ్బ...!
నా కొమ్మలపై గూళ్ళు కట్టుకుని వుంటున్న పిట్టలన్ని చివాల్న లేచి నిద్రమత్తును దులుపుకున్నాయి. ఒక్కొక్క దెబ్బ పడుతునేవుంది. నాకు తెలుసు ఈరోజు నన్ను నరికించి అక్కడ కార్ షెడ్డు కట్టుకోబోతున్నారని. అలాగని శేఖరం నిన్న సాయంత్రమే నిర్ణయించాడు. తెల్లవారుతూనే ఇదుగో ఇలా...
నా కథ ఈ రోజుతో ముగిసిపోతోంది. నేను పుట్టి ఎన్నాళ్ళైందో...? బహుశా నూటాభై యేళ్ళు..?? లేక ఇంకా పైనే నేమో..??
ఇన్నేళ్ళలో ఎన్ని అనుభూతులు..? ఎన్ని అనుభవాలు..?? ఎన్నన్నని చెప్పను.
మా వూరి జమిందారు, రాజావారు వస్తున్న సందర్భంలో నా నీడలో ఏర్పాటు చేసిన గానా బజానాలు.. చల్లని రాత్రుళ్ళో నా చెట్టుకింద జరిగిన తోలుబొమ్మలాటలు, శేఖరం తాతగారు ఈ స్థలంలో ఇల్లు కడుతూ "పచ్చని చెట్టు ఇంటిముందుంటే మనమూ పచ్చగా వుంటాము" అంటూ ఆప్యాయంగా నన్ను నెమరిన సంగతి.. ఆ తరువాత నా చెట్టునీడలో పిల్లకి పాఠాలు చెప్పడం.. ఎన్నో మధుర స్మృతులు.
శేఖరం తాతగారు నా కుడివైపు కొమ్మ విరిగినప్పుడు చేయించుకొన్న చేతికర్ర ఇప్పటికీ వారింట్లో వేలాడుతోంది. శేఖరం నాన్నగారు నా ఆకు పసరుతో ఊరందరికి వైద్యం చేసేవాడు. నాకివన్నీ గుర్తే.. మరి శేఖరానికి గుర్తులేవా..?? బడి ఎగ్గొట్టడానికి నా పైకి ఎక్కి కూర్చున్న రోజులు, నా చుట్టు తిరుగుతూ ఆడుకున్న ఆటలు.. ఇవన్నీ మర్చిపోయాడా..? అయ్యో నన్ను ఇంతకాలం తన నేస్తంలా చూస్తున్నాడనుకున్నానే..!!
నాపైన ఏం హక్కున్నదని నన్ను కొట్టిస్తున్నాడు? అతనింట్లో వున్నంత మాత్రాన నేనతని సొత్తేనా..?? నేను ప్రకృతినికదా..!
అబ్బా.. అబ్బా ఈ గొడ్డలి దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను. ఎంత కర్కశులీ మానవులు.? శేఖరం కూతురు భవాని అక్కడే నిలబడి చిత్రంగా నావైపు చూస్తోంది. చూడటానికి ఎంత ముద్దుగా వుందో.. వసంతంలో నేనున్నట్లు..!!
ఒకరోజు అన్నం తిననని మారాం చేస్తూ నా చుట్టు తిరగబోయి నా వేర్లు తగులుకొని కింద పడ్డప్పుడు చెయ్యి అందించలేని నా అశక్తతకు ఎంత విలపించానో నాకు తెలుసు. ఈ పాపకు కూడా నా మీద దయ లేదా..? నా నీడ లో కూర్చొనే కదా -
"చెట్లు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి.. చెట్లు నరకడం వల్ల కాలుష్యం పెరుగుతుంది.. వృక్షో రక్షతి రక్షితః " అంటూ పాఠాలు చదివింది.
మరో పోటు నాలో దిగబడింది. కొద్దిగా తూలుతున్నాను. నా పైనున్న పక్షులన్నీ రెక్కలు టపటపలాడించుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఒంటరి రాత్రులలో ఇవే కదా నాకు నేస్తాలు..? ఎన్ని పగళ్ళు వీటి బిడ్డలకు కాపలా కాశాను..? ఎన్ని రాత్రులు నా వెచ్చటి ఆకుల దుప్పట్లు కప్పుకొని ఇవి పడుకున్నాయి..? ఈ రోజు ఇలా విడిచి వెళ్ళిపోవలసినదేనా..?
నా చివరి కొమ్మ మీద తేనెపట్టు ఒకటుంది. ఆ తేనెటీగలు నా రక్షణకొచ్చాయి. నన్ను గొడ్డలితో కొడుతున్న వీరయ్య మీదకి వురుకాయి. తేనెటీగలు కుట్టడంతో వీరయ్య గొడ్డలి వదిలి దూరంగా జరిగాడు. తరువాత పొడవాటి కర్ర తెచ్చి ఆ తేనెపట్టును కదిపాడు. నా నుంచి ఏదో భాగాన్ని వేరు చేసినట్లైంది. తేనె పట్టు తొలగించి దూరంగా వున్న తన కొడుకుకు ఇచ్చాడు. చిత్రం ! తేనెటీగలు ఒక్కటీ ఇటు రాలేదు. వాటికీ ఎంత స్వార్ధం..! వాటికి ఆసరాగా నిలిచిన నన్ను అంతలోనే మర్చిపోయాయా..??
మళ్ళి మొదలయ్యాయి గొడ్డలిపోట్లు... ఒంటరినై బాధగా ఈ దెబ్బలను భరిస్తున్నాను.
అప్పుడు పలికింది భవాని...
"నాన్నా! ఈ చెట్టును కొట్టేయద్దు నాన్నా.. ఇదెంతో మంచి చెట్టు నాన్నా.. మనకి చాలా పండ్లిచ్చింది కదా నాన్నా"
చాలు..! నా జన్మకిది చాలు..!! ఎంత ప్రేమగా చెప్పింది భవాని. ఇద్దామంటే నా వంటి మీది పళ్ళన్నీ నిన్ననే దులిపేశారు. గొడ్డలి దెబ్బలకు కాండం చివరిదాక వచ్చింది. మరో రెండు దెబ్బలు.. అంతే..!!
ఈ లోగా భవానికి ఏదో ఒకటి ఇవ్వాలి. నా శరీరాన్ని పూర్తిగా పరికించాను. ఎక్కడో ఒక మూల చివర ఆకులచాటున వుంది దోరమాగిన పండు.
గొడ్డలి దెబ్బ మరికటి పడింది..నా కొమ్మలని కదుపుతూ ఆ కాయను కోస్తున్నాను..మరో దెబ్బ...! అదుపు తప్పి వూగిపోతున్నాను.. కాయను గట్టిగా కోస్తున్నాను...ఇక వొరిగిపోతున్నాను.. సరిగ్గా అప్పుడు తెగిన కాయ భవాని ముందు పడింది. నేను క్రింద పడిపోతూ వున్నాను. వీరయ్య చిన్నగా నవ్వి చెమట తుడుచుకుంటున్నాడు.
మగత కళ్ళు మూతలు పడుతుండగా భవాని వైపు చూసాను. కిందపడిన పండుని అందుకొని పరుగున శేఖరం దగ్గరకు వెళ్ళింది.
"నాన్నా నేను ఈ పండు పెరట్లో నాటుతాను నాన్నా.. మళ్ళి ఇలాంటి చెట్టే వస్తుంది.." అంటోంది వాళ్ళ నాన్నతో.
నేను ఆనందంగా కళ్ళు మూసుకున్నాను.
("వాయిస్ - విద్యుల్లత" పర్యావరణ కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ, సెప్టెంబరు 1997)
నేను చేస్తున్న ఎంబీయేలో భాగంగా ఒక ప్రాజక్ట్ విషయమై ఆ సంస్థలో అడుగుపెట్టాను. నాకు కావల్సిన వివరాలు సేకరించిన తరువాత బయల్దేరబోతుంటే ఆ సంస్థ రిసోర్స్ మొబిలైజేషన్ శాఖలో పనిచేస్తున్న జేరూఖాన్ చిన్నమాట అంటూ నన్ను ఆపేసారు.
"ఈ రోజు మా సంస్థలో ఒక ఈవెంట్ వుంది.. మీరుకూడా వుండి చూస్తే మాకు చాల సంతోషం" అన్నదామె హిందీలో."ష్యూర్" అని ఆమెతోపాటే మెట్లుదిగి కిందికి వచ్చాను. అక్కడే ఈవెంట్ జరగబోతోందని చెప్పారావిడ.
వారం రోజులుగా ఆ సంస్థలో ట్రైనింగ్ పొందిన యువతీ యువకులు, ఆ రోజు తల్లిదండ్రులు, అతిథుల ముందు వాళ్ళు నేర్చుకున్నది ప్రదర్శించబోతున్నారు. కొంతసేపటికి ప్రదర్శన ప్రారంభమైంది. యువకులంతా ఒక ఇనుప పోల్ మీద యోగాసనాలు ప్రదర్శించారు. ఆడపిల్లలంతా అవే ఆసనాలను ఒక వ్రేలాడుతున్న తాడు పై చేసి చూపించారు. ఏమైన ఆ ఆసనాలు కొంచం కష్టమనే చెప్పాలి.
మేము చప్పట్లు కొట్టినప్పుడల్లా వాళ్ళ సంతోషం ముఖంలో వెలుగై పూస్తోంది. ప్రతి అభినందనకి వారంతా రెట్టించిన వుత్సాహంతో ప్రదర్శిస్తున్నారు. ఆక్కడ నిలబడ్డ తల్లి దండ్రులకు అంతా సంభ్రమంగా వుంది. అసలు ఇన్ని ఫీట్లు చేస్తున్నది తమ పిల్లలేనా అని ఆశ్చర్యపోతున్నారు. దాదాపు అరగంట జరిగిన కార్యక్రమంలో నెను చప్పట్లు ఆపనేలేదు.. అసలు ఆపబుద్దే వెయ్యలేదు. అంతా అయిపోయిన తరువాత కలిశానా అమ్మాయిని. పద్దెనిమిది పంతొమ్మిదేళ్ళుంటాయేమో ఆ పిల్లకి. అనుకోకుండా వచ్చి నాకు తగిలింది.
సారీ చెప్తూనే "ఎలా చేసాను సార్ నేను" అంటూ అడిగింది.
"బ్రహ్మాండం" అన్నానేను.
ఆ అమ్మాయి నవ్వింది.
మ నో హ రం గా...
ఎంత స్వచ్చంగా వుందా నవ్వు...
నేను ఆమె వైపే చూస్తూవుండిపోయాను. ఆ అమ్మాయి మాత్రం నన్ను చూడట్లేదు.
నేను చొరవ చేసి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని "నిన్ను నీ రూందగ్గర వదిలి పెట్టనా..?" అని అడిగాను.ఆ అమ్మాయి మళ్ళి నవ్వింది -
"నా అంతట నేను వెళ్ళగలను.." అంటూ నా చెయ్యి విడిపించుకొని వెళ్ళిపోయింది
అంతే.. ఇదుగో.. నేనిక్కడ సముద్రపువొడ్డున బెంచీపై కూర్చొని.. ఎంతసేపు అలావుండిపోయానో నాకే గుర్తులేదు. ఏమేమి ఆలోచించానో తెలియదు. కూర్చున్నాను అంతే.. ఇలాంటిచోట పని చెయ్యాల్సి రావటం నా అదృష్టమేమో.. రేపు ఇలాంటిదే మరో సంస్థకి వెళ్ళాలి. అక్కడ ఇంకేమనుభవముందో.. లేచి నిలబడి టాక్సి ఆపాను -
"దాదర్" చెప్పాను ముక్తసరిగా.
టాక్సి కదలబోయే ముందు మళ్ళి ఒక్కసారి ఆ బిల్డింగ్ వైపు చూసాను -
నల్లటి గేటు మీద తెల్లటి అక్షరాలతో ఆ సంస్థ పేరు రాసుంది -
"నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్"
(ఇది కథ కాదు. మూడేళ్ళ క్రితం నాకు అనుభవమైన సంగతి)