ఎర్ర గోదారిఅమ్మా గోదారమ్మా..!! అంతదాహమేసిందా..??
పాతకాగితాల పడవలైన బాల్యాన్ని ఒక్క గుక్కలో మింగేసావే?
నీ గట్టుపై చేపలై ఈతగొట్టే పిల్లల్ని
అమాంతంగా అడుగీతలో ముంచేసావే?కార్తీకంలో నీ కురులపై దీపాల పూలు పెట్టి
అట్లతద్దెకి నీ కళ్ళముందు వుయ్యాలలూగి
నీ పాదాల నీళ్ళు చల్లుకొని కాపురానికెళ్ళిన
ఆ బంగారుతల్లి కాపురం నీళ్ళపాలేనా?వెలుగు రేఖలు రాకముందే తట్టిలేపి
గుండెలోతున నిన్ను కావలించుకొని
నీ చన్నీళ్ళ వణుకుతొ రాగసుప్రభాతం పలికే
సంగీతం మాష్టారు గొంతునొక్కేసావే?కడుపులో ఆక్రోశం వరదలై పొంగుతుంటే
కావలసినవాళ్ళ శవాలను మోస్తూ కొందరు
నీ బురద నీటిలో కన్నీటి తర్పణం విడుస్తున్నారు
నీ దాహం తీరిందా..? అమ్మా గోదారమ్మా..!!


(06.08.2008న భద్రాద్రిలో నలభై ఎనిమిది అడుగుల గోదావరిని చూసి... గోదావరి కబళించిన వార్తలు విని. )
Category:

1 వ్యాఖ్య(లు):

రానారె చెప్పారు...

బతికున్నవాడు ఎంతగా అడుగుతున్నా, ఏడుస్తున్నా, తిడుతున్నా, భయపడుతున్నా గోదారమ్మ ఒక పలుకైనా పలుకునా!?