పతంగులు (కథ)

"దేనికి లప్పాయిస్తున్నావ్‌రా..?"


"అదేరా భై లాటీదార్‌కి..""అదా.. రోగ్ కొట్టు.. అదీ.. పేంచా..??"


"అరే డీల్ ఇదువ్‌రాభై"


"డీల్ ఏందిరా..? గుంజు... ఇది ఖీంచ్‌కట్.. డీల్ ఇడిస్తే సాదీలో పోద్ది.."


"అరే అప్ఫా.. ఛ.. మాంజ మంచిగా లేదురభై.. మంచిగుండే డప్పన్ పోయింది..."

వింటున్నానన్న మాటేగానీ ఒక్క ముక్కైనా అర్థమైతే వొట్టు. నాకు హిందీ బాగనే వచ్చు అనుకుండేవాడిని... హిందీ వస్తే హైదరాబాదులోబతికేయచ్చు అని విన్నాగాని.. ఇదేమిటి. ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డులో ఈఅర్థం కాని భాషేమిటి. నాకసలే హైదరాబాదు కొత్త. పోనీ మామగారినిబస్‌స్టాండ్‌కి రమ్మని చెప్దామంటే మరదలు, మరిది కలిసిఆటపట్టిస్తారేమో అని భయం. పెళ్ళిలో వాళ్ళుచేసిన అల్లరి ఇంకా నామనసులో మెదలుతూనే వుంది. అందుకే నాతోపాటే రమ్మంటే, కాదని శ్రీమతిపండక్కి పదిరోజులు ముందే వచ్చేసింది. ఇలాంటి వూర్లో సంబంధం చేసుకొని పండక్కొచ్చిన కొత్తల్లుణ్ణి కాకపోతే వెంటనే తిరుగు బండి ఎక్కి మా బందరు వెళ్ళిపోదును.

అత్తగారి ఇంటి ముందు ఆటో దిగుతుండగానే మామగారు నవ్వుతూ పలకరించాడు.


"రండి... అంతా మంచిగేనా..? పండగకి రెండు రోజులముందుగాని తీరికదొరక్లేదన్నట్టు..??" అన్నాడాయన.


"అబ్బే ఆఫీసులో కొద్దిగ పనెక్కువగా వుంటే.." అంటుండగానే మరదలు రవళిపరుగున వచ్చింది.


"హాయ్ బావా అచ్చినవా... నీ గురించి అక్క బేజారైతాంది.. అవు నువ్వేందట్లగడ్డం పెంచినవ్.. నీకు బెంగా..?" ఊపిరాడనీయకుండ మాట్లాడేస్తోంది.ఇంతలో అత్తగారు వచ్చారు.


"అబ్బా రవళీ అప్పుడే మొదలెట్టావా.. బావ దగ్గర బ్యాగ్ తీసుకొనిలోపలికెళ్ళు.." అంది మంచి నీళ్ళు అందిస్తూ.ఆ ఇంట్లో పాపం ఆమె మాట్లాడేదే తెలుగులా అనిపిస్తుంది నాకు. ఆమె పుట్టిల్లు రేపల్లె.

రవళి నా చేతిలో బ్యాగ్ లాక్కొని -"వుండు బావా.. అక్కతో జెప్పొస్తా.." అంటూ లోపలికి పరుగుతీసింది. కాళ్ళుకడుక్కొని మామగారితో కబుర్లు మొదలుపెట్టగానే మరిది రాజా వచ్చాడు.


"బావా ఎప్పుడొచ్చినావ్.. చలో నువ్వొచ్చినావంటే ఇంగ నాకు పతంగులేపతంగులు.. నాతోని పతంగులెగరెయ్యాల నువ్వు.."


చుట్టూ చూసి రవళి లేదని నిర్ధారించుకొని "నాకు రాదు" అన్నాను. వీడుమాత్రం ఏమన్నా తక్కువ తిన్నాడా..?


"అయ్యా.. నీకు రాదా.. పేంచ్ సరే అసలుడాయించడామే రాదా.."


"వూహు"


"ఏం ఫికర్‌జేయకు.. నేను నేర్పిస్తాలే... చలో అయితే పతంగులు మాంజా కొందాం." అని చెయ్యి పట్టుకొని లాగాడు. రవళి అల్లరి నించి, అత్తగారిభారీ మర్యాదల నుంచి తప్పించుకోవడానికి నాకొక మంచి అవకాశందొరికినట్లైంది. "సరే" అంటూ కదిలాను.


రాజా నన్నొక గాలిపటాల షాపుకు తీసుకెళ్ళాడు. నిజానికి అదొక చిన్నరేకుల షెడ్డు. ఆ షెడ్డులో ఎవరో కాపురం వున్నట్లున్నారు, వాళ్ళే ఇంటిముందు గాలిపటాలు అమ్ముతున్నట్టున్నారు. లోపలినుంచి ఒక నడి వయసు వ్యక్తిబయటికొచ్చాడు.

"ఏం గావాలె సారు.." అడిగాడు నన్ను చూసి.


"గాలిపటాలు కావాలి.." అంటూ రాజా వైపు తిరిగి "ఏది కావాలో తీసుకోరా.." అన్నాను.


"నాకు పౌండు డప్పన్ కావాలె.. తీసుకుంటూండు నేను జర్ర బోయస్తా.." అంటూపరుగు తీశాడు.


"అవేంటో నాకేం తెలుస్తాయిరా.." అన్న నా మాటలు వాడికి వినపడనట్లేవున్నాయి. ఆ నడి వయసు వ్యక్తికి మాత్రం వినపడ్డాయి.


"పౌండంటే ఈ సైజు సారు గంటే పెద్దదనంట్టు.. డప్పనంటే ఈ లెక్కపతంగుకి రెండు కళ్ళు లెక్కనుంటాయి.." అన్నాడు ఒక గాలిపటం చేతికిస్తూ.ఆ గాలిపటం చిత్రంగావుంది. మొత్తం ఒక రంగు కాగితంతో చేసి రెండుగుండ్రటి కాగితాలి వేరే రంగువి అంటించి వున్నాయి.


"అంటే ఇంతకంటే పెద్దవి వుండవా..?" అడిగాను కుతూహలంగా.


"ఉంటాయి సారు.. దాన్ని ధక్తా అంటారు... అది నా దగ్గర లేదు సారు..కావాల్నంటే రేప్పొద్దునకి ఇస్తా.."


"వద్దులే ఇదే ఇచ్చేయ్.."అతను ఇచ్చాడు -


"ఇంకేం గావాలె సారు..?" అడిగాడు.


"మంజానో ఏదో.. అడిగాడు వాడు.."


"మాంజా సారు.. అంటే ఇది" అంటూ రంగు దారపు వుండని చూపించాడు.


"ఇదెందుకు మాములు దారంతో ఎగరెయ్యకూడదా..?" అడిగాను.


"దేంతోనైనా ఎగరెయ్యచుగాని పేంచేసినప్పుడు అప్ఫా చెయ్యనీకి గావాలె కద సారు..!!"


"ఏంటో.. ఈ గాలిపటాల భాష నాకర్థం కాదులే.."


"పెంచంటే ఏంలేద్సారు... రెండు పతంగులెగరేసిన్రనుకో.. ఒక దాని మాంజాఅదే ఈ దారం ఇంకోదానికి తాకిస్తారు.. ఇద్దర్ల ఎవ్వళ్ళదో ఒక్కళ్ళది తెగేవరకు గుంజడమో.. ఇడవడమో చేస్తారు.. అదే పెంచ్ అంటే. గుంజిన్రనుకో అదిఖీంచ్ కట్, ఇడిస్తే అది డీల్.." వివరించాడతను.

"అయితే దానికీ ఈ.. ఇదేమిటి ఆ మాంజా.. ఈ మామజాకి ఏమితి సంబంధం..??" అడిగాను.


"మాంజ అంటే ఇస్పెషల్‌గా పతంగులెగరెయ్యనీకే తయారుజేస్తరనంట్టు..మంచిగున్న దారాన్ని సాదీ అంటరు. దానిని రంగు నీళ్ళల పెట్టి, అన్నం,కోడిగుడ్డు సొన, గాజుపెంకుల పొడి అన్నీ కలిపి ఆ దారానికి రుద్దుతారు.దాన్ని ఏండబెడితే అదే మాంజా అయితది..."


"అలాగా... ఈ చర్ఖా ఎంతుంటుంది..?"


"మొత్తం చర్ఖ మాంజ రెండొందలు, మూడొందలు అమ్ముతాం సారు.. "అన్నాడతను. నేను ఆశ్చర్యపోయాను.


"చాలా ఖరీదుందే.. మీకు మంచి లాభమే" అన్నాను.


"లేదు సారు.. బస్తీలకెళ్ళి ఇంక ఎక్కువకె అమ్ముతారు. ఇది నేనుజేసినాఅందుకే తక్కువలో ఇస్తన్నా.." అని అతను చెప్తుండగానే రాజా వచ్చాడు.


"ఏంటి బావా తీసుకున్నావా..?" అడిగాడు.


"లేదురా మాంజా చాలా ఖరీదుందిరా..!"


"ఏ మనకంతెందుకు బావా... ఒక్క చక్రీ దీస్కోరాదు... ముప్పైరూపయలైతది.." అన్నాడు వాడు. నేను తలాడించి ముప్పై రూపాయాలు వాడిచేతిలో పెట్టాను.


"మరి పతంగికో.." అన్నాడు. మళ్ళీ ఒక ఇరవై తీసిచ్చాను. డబ్బులిచ్చేసి అన్నాడు వాడు -

"నువ్విక్కడే వుండు బావా... మా వాడి పతగిని ఆ లంగోట్‌గాడు కోసిండు..వాడిది కోసి వచ్చేస్తా.." అల అంటూనే పరుగెత్తాడు.


"లోపలికి వచ్చి కూర్చోండి సార్" అన్నాడు ఆ కొట్టు యజమాని. నేను లోపలికివెళ్ళి కూర్చున్నాను.


"మా వాడు రెడ్‌లంగోట్ అంటున్నాడు.. అక్కడెవ్వరూ లంగోట్‌లో లేరే.." అన్నాను నేను. అతను నవ్వాడు.


"అది పతంగి పేరు సారు"


"పతంగులకీ పేర్లుంటాయా..?"


"అవును సారు.. ఈ లెక్కన ఒక కన్నుంటే గుడ్డి, పైన తలదగ్గర గీతలెక్కనుంటే నామందార్, అదే గీత కిందుంటే లంగోట్, ఇందాక మీవోడుతీసుకెళ్ళిండే గదేమో డప్పనన్నట్టు" చెప్పాడన్నట్టు.

ఆ తరువాత అతనితో మాటల్లో పడ్డాను. అతని పేరు హుస్సేన్ అని చెప్పాడతను.


"అవునూ... ఒక్క గాలిపటానికి.. అదే పతంగుకీ తోక లేదేమిటి..?? తోకలేనిగాలిపటం ఎగరదంటారు కదా..."


"గట్లేమీ లెదు సర్.. ఇక్కడెవ్వరైనా తోక పెట్టిండంటే ఆడుబఛ్ఛాగాడన్నట్టు.. దాన్ని తోక బల్లి అంటారు.. ఆడి గాలిపటాన్ని ఇంగఎవ్వరూ కొయ్యరన్నట్టు." చెప్పాడు హుస్సేన్.


"మరి ఇట్లా మాంజా తెగిన గాలిపటం ఏమైతుంది..?" అడిగాను


"మాంజ తెగినాక ఏమైతది సారు.. ఏడకనో ఎగిరిపోతది... ఏడకి పోతదోఏమౌతదో ఎర్కలేదు. ఎక్కడో పడిపోతుంది. అయినా దాన్ని పట్టలని పోరలుదాని ఎనకే వురుకుతారు.." నేను నవ్వాను. ఇంకా ఎదో పిచ్చాపాటి మాట్లాడుతుండగా పిల్లల ప్రస్తావన వచ్చింది.

"ఎంతమంది పిల్లలు నీకు..??" అడిగాను. అతని ముఖంలో భావాలు మారాయి.కొద్దిసేపట నిశబ్దం తరువాత అన్నాడు -

"ఉన్నార్లె సారు... ఇద్దరు.. ఈళ్ళతోనే పరేషాని... ఇద్దరూ గల్లీలెంటతిరగను, పోరిలిటల గానొస్తే చెడాయించను గింతనే యదవలు.." చెప్పాడు. నేనింక ఎక్కువ మాట్లాడించలేదు.

రాజా తిరిగి వస్తూనే -"అఫ్హా.. బావా అఫా.. మాంజా మంచిగుంది తాకించంగనే ఆళ్ళది పోయింది.."అన్నాడు సంబరంగా. ఇద్దరం బయటికి వచ్చి ఇంటికి బయల్దేరాం.నాలుగడుగులు వేసామో లేదో ఇద్దరు యువకులు వచ్చి ఆపారు.

"ఎంది బే.. మ పతంగినే అఫాజేస్తావుర... దమాకిట్ల ఖరాబైందిరా..??"అన్నాడొకడు రాజాతో

"ఏం.. మీరు మాది కొయ్యలే... గట్లనే.." అన్నాడు వీడు. నాకు భయంగానే వుంది.

"ఏంరో..! ఆవాజ్ జేస్తుండవ్... మెం జేస్తే నువ్ జేస్తవ్..??" అంటూమీదకొచ్చాడు. ఇంతలో హుసేన్ బయటికి వచ్చాడు.

"రేయ్.. వొదల్రా .. పతంగులెగరేసేది.. పేంచెయ్యడానికి కాదారా..ఫోండి.."అన్నాడు మా దగ్గరకు వస్తూ.

"మళ్ళీ మా పతంగ్ తట్టు వస్తే బతకవ్ బిడ్డా.." అంటూ వెళ్ళిపోయారు ఇద్దరూ.

"ఎవరు హుసేన్ వాళ్ళు.." అడిగాను.

"ఆళ్ళే సారూ నా బిడ్డలు.." అన్నాడతను కిందకి చూస్తూ.

***

ఆ తరువాత చాలారోజులు మళ్ళీ హుసేన్‌ని కలవలేదు నేను. మా మామగారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అవటంతో మళ్ళీ నాకు హైదరాబాదు వెళ్ళాల్సినఅవసరం రాలేదు. కానీ హుసేన్ మాత్రం అప్పుడప్పుడు గుర్తుకువచ్చేవాడు. అతనెలా వున్నాడో.. అతన్ని కొడుకులు చూస్తున్నారాలేదా అని అనుకునేవాడిని. మళ్ళీ నాకే అనిపించేది అతన్ని చూసుకోవల్సిన అవసరమేమిలేదు.. హుసేన్ తనబ్రతుకెదో తను బ్రతుకగలడు. అతనికేమైనా అయితే అతని కొడుకులేకష్టపడాలి అని. ఇట్లాగే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.

మళ్ళీ ఆఫీస్ పనిమీద ఒకసారి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. పని అయిన తరువాత నేనుండే హోటల్ హుసేన్ ఇంటికి దగ్గరే కావటంతో ఒక సాయంత్రం అటువైపు నడుచుకుంటూ వెళ్ళాను. ఆ పరిసరాలన్నీ చాలావరకు మారిపోయాయి. ఆ పతంగుల కొట్టు వుండాల్సిన చోట ఓక పాన్ షాప్, ఒక సెలూన్ వెలిసాయి. నేను పాన్ షాప్ దగ్గరకి వెళ్ళాను.


"బాబూ ఇక్కడ హుసేన్ అని వుండెవాడే.. అతనెక్కడుంటున్నాడు..??"

"ఏమాయె.. మీకెమైనా చుట్టమా..?" అడిగాడు.

"అబ్బేలేదు.. తెలిసినతను అంతే.." అన్నాను.

"ఆడు పోయి కరీబ్ ఏక్‌సాలైంది సాబ్.." అన్నాడతను. దూరంగా పతంగులు ఎగరేస్తున్న పిల్లలు అరుస్తున్నారు -

"పేంచ్.. పేంచ్..""మరి అతని కొడుకులు..." అడిగాను నేను.

"ఆళ్ళ సంగతేం అడుగుతార్లే సాబ్.. ఒకడెవర్నో ఖూనీ చేసిండని జైల్లో ఏస్తే ఆడకెళ్ళి పారిపోయిండు... ఇప్పుడేడున్నడో తెల్వదు.."

"మరి రెండోవాడు.." అడిగాను ఆతృతగా.

"ఆళ్ళెవరో కొట్టిన్రంట దవాఖానాలో వున్నడు.." అన్నాడు.

"అఫా.. అప్ఫా కటీ... పిల్లలు ఆనందంగా ఎగురుతున్నాడు. పిల్లలు కోసిన గాలిపటం ఎటో ఎగిరిపోయింది.హుసేన్ మాటలు గుర్తొచ్చాయి - "మాంజ తెగినాక ఏమైతది సారు.. ఏడకనో ఎగిరిపోతది... ఏడకి పోతదో ఏమౌతదో ఎర్కలేదు. ఎక్కడో పడిపోతుంది"

(2001)
Category:

4 వ్యాఖ్య(లు):

Uyyaala చెప్పారు...

పతంగుల పండుగ సమయంలో పతంగుల కథ భలే వుంది . హైదరాబాద్ వాసినైన నాకే తెలియని పలుపదాలు థ్రిల్ ని కలిగించాయి. అయితే ఆంధ్ర తెలంగాణా పాత్రల నేపధ్యం, హైదేరబాది మాండలికం మాత్రం కృతకంగా, అసహజంగా వున్నాయి.
- ప్రభాకర్ మందార

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

కథ బాగుంది... నేను కూడా పతంగుల గురించి ఒక టపా రాసాను.. మీ కథ చదివాక ఇంకా కొన్ని గుర్తుకు వచ్చాయి...

Unknown చెప్పారు...

the endind is verygud.principles and values r the real threads of life that controls the living of a person

Sunny చెప్పారు...

chala baga raasarandi!