ఒక భావుకుడి ఆటోలోనించి రెండు కవితలు

మొన్నా మధ్య ఇండోరులో ఒక ఆటో ఎక్కాను. డ్రైవర్ సీటుకి వెనక భాగంలో హిందీలో ఏదో వ్రాసి వుండటం చూశాను. ఏదో అల్లరి రాతలై వుంటాయని అట్టే పట్టించుకోలేదు. దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆటో ఆగితే చదవటం మొదలెట్టాను. షాయరీ..!! అందులో రెండు కవితలు వాటికి నా స్వేచ్చానువాదం:

1. మన్ తెరా సచ్చా తో కిస్మత్ తేరీ రాశీ
కిస్మంత్ తేరీ అచ్చీ తో ఘర్ మే మథురా కాశీ

తెలుగు: మంచిదైన మనసు నీదైతే
సొంతమౌను అదృష్టాల రాశి
ఆ అదృష్టం సొంతమైతే
నీ ఇల్లే మథుర కాశి

2. పానీ పానీ సబ్ మాంగే గంగా జల్ కుచ్ ఔర్ హై
సవారీ సబ్ ఆతీ హై ఆప్కా ఆనా కుచ్ ఔర్ హై

తెలుగు: నీళ్ళు నీళ్ళనే అంతా అడిగేరు కానీ
అందులో గంగా జలమే వేరులే
ప్రయాణికులు ఎందరో వచ్చేరు కానీ
మీ రాక ప్రత్యేకతే వేరులే

ఆటో దిగుతూనే అడిగాను ఎవరు వ్రాశారని.

"నేనే వ్రాశాను సార్.. ఎప్పుడో ఆటో కొన్న కొత్తల్లో రాట్రిపూట వ్రాశాను... అందుకే చేతి వ్రాత సరిగా లేదు.."

"అయితే నువ్వు కవిత్వాలు కూడా వ్రాస్తావా..??"

అతను సమాధానం చెప్పలేదు. ఒక చిరునవ్వు నవ్వి ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు.

ఆ నవ్వు - "ఏం ఆటో నడుపుకుంటే కవిత్వం వ్రాయకూడదా" అని అడిగినట్టు నాకెందుకనిపించింది??

4 వ్యాఖ్య(లు):

Bolloju Baba చెప్పారు...

సినీదర్శకుడు వంశీ వ్రాసిన ఆనాటి వానచినుకులు కధ లోని సారాంసం మీరు చెప్పిన ఈ సంఘటనే. ఎంత యాదృచ్చికమో కదా.

సుజాత వేల్పూరి చెప్పారు...

అవును బాబాగారు,
ఆ కథలో రిక్షా వాడు తన రిక్షా వెనక రాసుకున్న వాక్యమే "ఆనాటి వాన చినుకులు"! బాగా గుర్తు చేశారు. శారద పేరుతో అనేక ఉత్తమ రచనలు చేసిన నటరాజన్ తెనాలిలో ఒక హోటల్లో సర్వర్ గా పని చేశారట. తగిన అవకాశం లభించక ఎంత మంది కవులు, రచయిలూ మౌనంగా మరణిస్తున్నారో కదా!

అజ్ఞాత చెప్పారు...

సత్యప్రసాద్ గారూ,
మంచి టపా.
‘ఆటోవాడినైతేనేమి.. కవిత్వం రాయకూడదా.. అని అడిగినట్టు నాకెందుకనిపించింది...’ ‘బ్లాగెందుకు’ వంటి టపాల్లో ఎప్పటికప్పడు మీ భావాల్లోని నిజాయితీ మనసుకు హాయిగా అనిపిస్తుంది. కర్నూల్లో ఇలాగే ఒక ఆటోడ్రైవరున్నాడు, ముస్లిం, తెలుగు సాహిత్యమంటే అతనికెంత ఇష్టమో. ఎంతో చదువుతాడతను. వరంగల్లో ఒక పోలీసు కానిస్టేబుల్ కూడా. మరో ఎస్సయి స్థాయి వ్యక్తి కవితా సంకలన్నే వెలువరించాడు. మనిషిని బట్టి, రూపురేకల్ని, కులమతాల బట్టి అతనిలోని విద్యను అంచనా వెయ్యడం మన దగ్గరున్న దౌర్భాగ్యం అంతే.
సుజాత గారు,
ప్రతిభ ఉన్న వారికి అవకాశం లభించకపోవడం వెనక కూడా ఇవే కారణాలు, కులమతాలు, గ్రూపులు, పెద్దలని చెప్పుకునేవారి అండాదండా లేకపోవడం... ఏం చేస్తాం!

అజ్ఞాత చెప్పారు...

బాబాగారు,
సుజాతగారు,
అరుణగారు,

మీ అభిమానానికి నెనర్లు. మీ వ్యాఖలు నా మనసులో కవితని చిలుకుతున్నాయి. తరువాత టపా అదే.

అరిపిరాల