అనామక భావుకులు (కవిత)

భావుకత్వం పాఠం కాదు

బడిలో చేరి నేర్చుకోవటానికి

స్పందన ఒక చర్య కాదు

శిక్షణతో అబ్బటానికి



నీ పక్కనే కూర్చుని

నువ్వు చూసేదే చూసి

నీకు తెలియని లోతుల్ని కొలిచేవాళ్ళు

నీ వూహకి దూరంలో వుంటారు



అక్షరం వ్రాయలేకపోయినా

లక్షల భావాలని ప్రకటించే

పలుకులమ్మ బిడ్డలు

నీ కంటి చూపుకి అవతల వుంటారు



ఏదో ఒక హోటల్లో

నీ ఎంగిలి పళ్ళెం కడుగుతుంటే

ఒక "నటరాజన్" చేతులకి

"శారదా" కటాక్షం కలగొచ్చు



నువ్వెక్కిన ఆటో మోతలో

సప్త స్వరాలు వినగల్గిన డ్రైవరు

ఆగిన ప్రతి ట్రాఫిక్ జాంలో

కథలల్లే కానిష్టేబులు



ఎంతో మంది భావుకులు

నీ చుట్టే వున్నా నీ కన్నే తెరుచుకోదు

భావుకత్వాన్ని కులానికో సంపదకో

బలవంతంగా అతికిస్తూ కళ్ళు మూసుకుంటావు



నీ కులమో నీ డబ్బో నిన్ను మహాకవిని చేస్తే

రొమ్ము విరుచుకోకు

పక్షపాతం లక్ష్మీదేవిదే కాని

చదువులమ్మది కాదుగా



("ఒక భావుకుడి ఆటోలోనించి రెండు కవితలు " అనే నా టపాకి స్పందించిన బొల్లోజు బాబాగారు, సుజాతగారు, అరుణగారు వ్రాసిన వ్యాఖ్యల స్పూర్తితో)
Category:

3 వ్యాఖ్య(లు):

నాగప్రసాద్ చెప్పారు...

చాలా బాగుంది ♥♥♥♥♥♥. "భావుకత్వం" అంటే ఏమిటి?

Unknown చెప్పారు...

శివా
నెనర్లు

నాగ మురళి,
చిన్న ప్రశ్న వేసి థీసిస్ అడుగుతున్నారు..:)

నాకు తెలిసినంతలో భావన చేసేవాడే భావుకుడు. పైన నేను వ్రాసిన దాంట్లో:

నీ పక్కనే కూర్చుని
నువ్వు చూసేదే చూసి
నీకు తెలియని లోతుల్ని కొలిచేవాళ్ళు

అనేది అసలైన అర్థం. అయితే వాడకంలో సున్నితంగా వున్న ప్రతి కవిత్వాన్ని భావకవిత్వం అనడం జరుగుతోంది. మొత్తం మీద సునిశితంగా తెలుసుకొని సున్నితంగా చెప్పటం భావుకత్వం అని నా అభిప్రాయం. నిజానికి చెప్పేదానికన్నా అనుభవిస్తే బాగా అర్థమయ్యేది భావుకత. భావకవి దేవులపల్లిని చదవండి.. భావుకత్వం పదం కాదు అనుభూతి అని తెలుస్తుంది.

నాకు తెలిసింది చెప్పాను. విజ్ఞులు వ్యాఖ్యల రూపంలో మరింత జోడిస్తె ధన్యుణ్ణి.

Bolloju Baba చెప్పారు...

కవిత అద్భుతంగా ఉంది.
ఒక ప్లాట్ ఫార్మ్ లేక ఎంతమంది కవులు, రచయితలు అజ్ఞాతంగా ఉండి పోతున్నారో కదా.

భావుకతను చక్కగా వివరించారు.