ఇండోరులో పుస్తక ప్రదర్శన
ఇలా పేపర్లో చూశానో లేదో ఎగిరి గంతేశాను. పైన ఫాను తగిలింది.
చిన్నప్పుడు సరుకులు తెమ్మని ఇంట్లో వాళ్ళు పంపితే, నేను ఎంతకీ రావట్లేదని నాకోసం వచ్చేవాళ్ళు. చూస్తే ఏముంది...!! మా సరుకుల షాపు వెంకటేశ్వర్లు తచ్చి పెట్టుకున్న పొట్లాలు కట్టే కాగితాలలో నచ్చినవి ఏరుకోని చదువుతుండేవాడిని. ఒక్కోసారి త్రాసులో కాగితం వేసి ఏ పంచదారో శనగలో వంపుతుంటే "ఆగాగు" అని ఆ కాగితం లాక్కొని "వేరే కాగితం వేసుకో.. ఇందులో నేను చదవాల్సిన విషయం వుంది" అనేవాణ్ణి. మరోసారి నా మాట వినకుండా మా వెంకటేశ్వర్లు శనగలు వంపేసేవాడు. నేను వూరుకుంటానా - ఇంటికి వెళ్ళగానే ఆ పొట్లం విప్పి శనగలు డబ్బాలో పోసేదాకా పేచీ పెట్టి, అప్పుడు కాగితాన్ని జాగర్తగా మడతలు పొయ్యేట్టు సాపు చేసి చదువుకునేవాణ్ణి. ఇప్పటికీ ఎక్కడైనా పుస్తకం కనపడితే ఆగిపోతానని నా శ్రీమతి అంటుంటుంది.
ఏం చేస్తాం చెప్పండి? అది నా బలహీనత. నచ్చిన పుస్తకం కనపడితే వెనకాముందు చూడకుండా కొనెయ్యటం మరో బలహీనత. ఈ మధ్య పని వత్తిళ్ళు ఎక్కువగా వుండటం, మా అమ్మాయి దోగాడే వయసు నించి అడుగులేసి పుస్తకాల రాకు అందుకునే వయసుకి రావటంతో పుస్తకాలు చదవటం కొంతవరకు తగ్గింది. పుస్తకాలు చదవటం తగ్గిందేకాని బ్లాగుల పుణ్యమాని చదవటం మాత్రం తగ్గలేదు.. అలాగే పుస్తకాలు చదవటంలేదు కదా అని కొనటం మాత్రం తగ్గిస్తామా... అందుకే అంత ఆనందం.
ఆంధ్రప్రదేశ్‌లో వున్నప్పుడు హైదరాబాదులో జరిగినా విజయవాడలో జరిగినా నేను ఖచ్చితంగా వెళ్ళేవాడిని. గత కొంతకాలంగా వేరే రాష్ట్రాలలో వుండటం వల్ల ఇలాంటి ప్రదర్శన చూసి చాలా కాలమైంది. సరే, ఈ రోజు ఆఫీసు మధ్యాహ్నం ఒంటిగంట దాకే కావటంతో వెంటనే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించేసుకున్నాను. కార్పొరేట్ వుద్యోగం.. పైగా మాసాంతం..!! అంత సులువుగా బయటపడగలనా? అప్పటికీ మూడు గంటలకి బయటపడ్డాను. అప్పటికింకా భోజనం చెయ్యలేదు. "ఒక పూట భోజనం లేకపోయినా ఫర్లేదు ఒక పుస్తకం కొనుక్కోమన్నారు పెద్దలు" అని నాకు నేనే చెప్పుకొని ఆటో ఎక్కాను.
"ముందు పుస్తకాలకి బడ్జెట్ ఎంతో అనుకోవాలి. లేకపోతే ఎడా పెడా కొని తర్వాత బాధపడాలి" అనుకోని, "ఎమైనా సరే వెయ్యి రూపాయల నించి రెండు వేలు లోపలే కొనాలి" అని తీర్మానించి, ఎందుకైనా మంచిదని ఏటీయంలో నాలుగువేలు డ్రా చేసాను.
ప్రదర్శన జరిగే గాంధీ భవన్ చేరుకోని ఒక టీ కొట్టి లోపలకి వెళ్ళబోతే గేటు దగ్గర "టికెట్టు ??" అన్నారు.
"హవ్వ... హవ్వ ఎంత చోద్యం... ఈ వింత నేనెక్కడా ఎరగనమ్మా..!! పుస్తకాలేమైనా తోలుబొమ్మలాటా?? టికెట్టు కొనుక్కోని చూసిపోడానికి?" అనుకున్నాను కానీ కొనక తప్పింది కాదు.
లోపలికి వెళ్ళాక నాకు మొదటి నిరుత్సాహం మొదలైంది. పట్టుమని ఇరవై స్టాళ్ళైనా లేవు. అందులో నాలుగు ఫెంగ్షూయీ స్టాళ్ళు, ఒకటి చిన్న పిల్లల బొమ్మల స్టాలు, రెండు తినుబండారాల స్టాళ్ళు.
కడుపులో ఆకలి కాలింగ్ బెల్లు కొట్టి -
"రేయ్ పుస్తకాల పిచ్చోడా.. ఇప్పటికైనా నా మాట విని ఏమైనా తిని తగలడు. ఆ తరువాత వున్న వాటిల్లో ఏ ముగ్గుల పుస్తకమో కొనుక్కోని ఇంటికి పో" అని అరిచింది. అంతలో మిణుకు మిణుకుమంటూ ఒక ఆశాదీపం వెలిగింది. ఒక స్టాలు దగ్గర ఒకటే జనం. పాంటు పైకి లాక్కొని పరుగెత్తుకెళ్ళాను.
హిందీ పుస్తకాలు..!! నేను హిందీ చదవగలను కానీ హిందీ పుస్తకాలు ఆఖరుగా చదివింది పదో తరగతిలో అనుకుంటా.
"లేకపోతే తెలుగు పుస్తకాలు దొరుకుతాయనుకున్నావా..." కడుపులోంచి వినపడింది.
ఆ పక్కన కొంచెం చిన్న స్టాలు. పల్చగా జనం. వెళ్ళి తొంగి చూశాను.
పుస్తకాలన్నీ నేలమీద గుమ్మరించి వున్నాయి. జనాలు వాటిల్లోంచి ఏరుకుంటున్నారు. "ఇదేమైనా కొత్త స్కీమా?" అడిగా స్టాలు ఓనర్ని.
"ఏ పుస్తకమైనా ఇరవై రూపాయాలు" అన్నాడు వాడు. నాకు ఏదో సినిమాలో శ్రీ కృష్ణుడి విశ్వరూపం చూపించేటప్పుడు వినిపించే ఫ్లూట్ వినపడింది. ఆ షాపు వోనరు నలభై చేతులతో ఒక్కొక్క చేతిలో పదేసి పుస్తకాలతో కనిపించాడు. నేను కళ్ళ నీళ్ళు తుడుచుకొని - "ఈ షాపు మొత్తం ఎంతకి అమ్ముతావు" అని అడగబోయి.. ఎందుకులే మనకి కావల్సినవి ఏరుకుందామని పుస్తకాల మీద పడ్డాను.
అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే..!
అన్నీ ఫారిన్ ఎడిషన్లే..!!
అయితే అందులో ఏవీ పేరుపడ్డ పుస్తకలేమీ కాదు. ఠాఠ్..!! ఏమైతేనేమి పుస్తకాలే కదా..!! పేరున్న రచయితల అంతగా పేరుపడని పుస్తకాలు, ఇదుగో ఇది ఫలానా ఫలనా అవార్డు పొందిన పుస్తకం, ఈ పబ్లిషర్ మంచి పుస్తకాలు వేస్తాడు.. ఈ రకంగా ఏరుకున్నాను. ఏరుకుంటూ ఆ పుస్తకాల గుట్ట చుట్టూ నాలుగు ప్రదక్షిణాలు చేసాను. ఏరుకున్న పుస్తకాలని పట్టుకునేందుకు చేతులు చాలట్లేదు. అంతలో అడుగున ఒక పుస్తకం ఎర్రట్ట తళుక్కున మెరిసింది - టక్కున గుట్ట మీద పడిపోయి సర్రున లాగాను. దాన్ని పట్టుకొని దానితో పాటే ఒక పిల్లాడు బయటకి వచ్చాడు.
"నీ దుంపతెగ నువ్వెట్టా వచ్చావురా..??" అంటే
"చాల్లే సంబడం నాలాంటి సాహిత్యాభిమానులు రెండురోజుల్నించి లోపలే మకాం... పుస్తకాలు ఏరుకుంటున్నాం" అన్నాడు.
"బాగానే వుంది సంబడం" అనుకోని నేను ఏరిన పుస్తకాలలో కొన్ని "తీసి" "వేసి" ఒక ఇరవైదాకా తెచ్చుకున్నాను. మొత్తం ఖర్చు: నాలుగు వందల యాభై అయిదు. అప్పటికే ఆకలిగాడు అడ్రస్ లేకుండా పోయాడు. వాణ్ణి వెతికి పట్టుకొని భోజనం చేయిస్తూ అన్ని పుస్తకాల అట్టల్ని నమిలేశాను. ఇక పేజీల వంతు..!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
11 వ్యాఖ్య(లు):
బాగా రాశారండి. మీరు ఇప్పటివరకు చదివిన పుస్తకాల లిస్టు మీ బ్లాగులో పెట్టకపోయారా?
నేను కూడా చిన్నప్పుడు రోడ్డు మీద కనిపించిన కాగితం ముక్కైనా వదిలే వాడిని కాదు. ప్రతీ ఆదివారం ఈనాడు పుస్తకం ఇంటికి తీసుకు వెళ్తూ రోడ్డు మీదే చదువుతూ వెళ్ళే వాడిని.
ఏదైనా ఊరు వెళ్తుంటే షాపు పేరులు కూడా చదువుతూ ఉండే వాడిని. అంటే సుమారు పదేహేను సంవత్సరాల క్రితం అనుకోవచ్చు. ప్రతీ షాపు పైన అడ్రస్సు రాసేవారు. అది కూడా తెలుగులో. ఇప్పుడు దాదాపు అన్నీ ఆంగ్లమే. ఇది ఒక దుస్తితి అని భాద పడాల్సిందే.
అభినందనలు...
మీ పోస్ట్ నవ్యలో పడినందుకు అభినందనలు
http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2009/feb/1-2navya5
హ హ బావుంది మీ పుస్తక కొనుగోలు. మీ ఇండోరులోలానే మన హై.లో కూడా లోపలికి పోయేందుకు టిక్కెట్టు ఉందండి. విజయవాడలో మాత్రం లేదు.
అన్నట్టు, ఆంధ్రజ్యోతిలో మీ బ్లాగులపై వ్యాసం వచ్చినందుకు అభినందనలు.
రాజేంద్ర,ఇక్కడ మీ ప్రశ్నకు కొంత సమాధానం దొరుకుతుంది. మరో వెర్రి బాగులోడు దొరికాడు. :)
http://netijen.blogspot.com/2007/09/blog-post_4607.html#comments
సత్యప్రసాద్ గారూ, మీ బ్లాగు చాలా బాగుంది. దూరమైన కొలదీ పెరుగును అనురాగం అన్నట్లె, తెలుగేతర ప్రాంతాంల్లో ఉన్న మీలాంటీ, నా లాంటి వాళ్ళకు తెలుగువారు తారసపడినా, తెలుగుమాట వినపడినా, తెలుగు పుస్తకాలు, పత్రికలు దొరికినా నా మనసంతా నువ్వే అని తెలుగును మెచ్చుకుంటూ మైమరచిపోతుంటాము. తెలుగు దూరం కాలేం కావున ఇలాంటి బ్లాగులతో మన తెలుగు సంబంధాలను నిరంతరం తాజాగా ఉంచుకొనేందుకు ప్రయత్నిస్తాము. సాహితి ద్వారా నేను చేస్తున్నదానికంటే పలకా బలపం ద్వారా మీరు కాస్త ఎక్కువే చేస్తున్నారు తెలుగుసేవ. నాకున్న బహుభాషా వ్యామోహం వల్ల నేను అన్ని భాషలకు ఏదో కొంత అన్నట్లు నిరంతరం బ్లాగుతూనే ఉన్నాను. సాహితి మీ కీబోర్డు నుండి కూడా రచనలనూ ఆశిస్తోంది.http://saahitee.blogspot.com/
డాక్టర్ సి. జయ శంకర బాబు
బావుందండీ మీ పుస్తకాల కొనుగోలు ప్రహసనం :)
నవ్యలో మీ బ్లాగ్ గురించి వచ్చినందుకు.. అభినందనలు.
how are you reading BOOKS on internet for free? Also few days ago you said you were reading telugu books on internet for free (eg. veerendranath's). How is this possible? ceppi punyam kattukOMDi.
thank god u did not fell in that heap of book els we might hav missed ur stories
అచ్చంగా ఇది నా కథే .... నేను అంతే పుస్తకం కనబడితే వదలను, ఇక చిల్లర కొట్లోనో , బజ్జిల బండి లోనో పేపరు కనబడితే , ఆ పేపర్లో వాడు కట్టిన బజ్జిల నూనె కు అది తడిసి వెనక ముందు అక్షరాలు కలిసి పొతే , ఆ కలిసి పోఇన అక్షరాలను అతి సులువుగా నేను చదువుతుంటే , అప్పడు మా ఆవిడ కోపం నషాళానికి వెళ్తుంటే , నన్నెందుకు పెళ్లి చేసుకొన్నారు, పుస్తకాలనే చేసుకోలేక పోయారా అంటుంటే......................................
కామెంట్‌ను పోస్ట్ చేయండి