ఇందోరుకు వీడ్కోలు (మూడోవ భాగం): గుళ్ళు గోపురాలు; ఉజ్జైని


ఇందోరులో చెప్పుకోదగ్గ ప్రదేశాలలో ఒకటి "బడా గణపతి" మందిర్. ప్రాచీనమైనది కాకపోయినా కేవలం పెద్దదైన ఆకారం కారణంగా ఇది ప్రసిద్ధికి ఎక్కింది. అయితే ఇక్కడి ప్రజలు ఎక్కువగా నమ్మే దేవుడు ఖజరానా గణపతి. ఇది కూడా ఆధునుక దేవాలయమే కాని ఎందుకో బాగా ప్రసిద్ధి. ఇక్కడ చాలా మంది ఈ దేవుణ్ణి ప్రతి మంగళ బుధవారాల్లో దర్శించుకుంటారు.



ఈ దేవాలయం చుట్టు దాదాపు అందరు దేవుళ్ళ చిన్న చిన్న మందిరాలు వుంటాయి. ఇదుగో ఈ ఫోటో అక్కడిదే.


అలాగే గీతా భవన్, అన్నపూర్ణ మందిర్ కూడ బాగా పేరు పొందాయి.


ఇక ఇందోరు దగ్గర్లో వున్న దేవాలయాలలో అత్యంత ప్రముఖమైనది - ఉజ్జైని.





మనకి బాగా తెలిసిన ద్వాదశ (12) జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర ఆలయం, అలాగే అష్టాదశ (18) శక్తి పీఠాలలో ఒకటైన మహాకాళి ఇద్దరూ కలిసిన ప్రదేశం కావటమే ఈ ప్రాంతం విశిష్టత. కాశీలో విశ్వేశ్వరుడు, విశాలాక్షి; శ్రీశైలంలో బ్రమరాంబా మల్లికార్జునులు మాత్రమే ఇలా కనిపిస్తారు.


ఉజ్జైనిలో మరో విశేషమేమంటే ఇక్కడ మహాకాలభైరవుడి మందిరం కూడా వుంది. ఇలా ముగ్గురు దేవతలు (మహాకాళుడు, మహాకాలి, భైరవుడు) క్షుద్ర పూజకి చెందిన వారు కావటంతో అలాంటి ప్రయత్నాలు చేసేవారు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.





చిన్నప్పుడు చందమామ కథల్లో మనం చదువుకున్న విక్రం-భేతాళ్ కథలు ఇక్కడికి సంబంధించినదే. ఇప్పటికి బర్తృహరి తపస్సు చేసినట్లు చెప్పబడే గుహలు కనిపిస్తాయి.




విక్రమార్కుడి సింహాసనం దొరికిన గుట్టకూడా ఇక్కడి సిప్రా నది మధ్యలో కనిపిస్తుంది. తదనంతరం భోజరాజు పరిపాలిచినట్లు కూడా చారిత్రక ఆధారాలు వున్నాయి.



సరే అసలు విషయానికి వస్తే - ఇక్కడున్న గుళ్ళు చాలా ప్రాచీనమైనవి. అందులో వున్న దేవతల మూర్తులు చూస్తేనే ఆ విషయం అర్థమౌతుంది. అక్కడి పద్దతులు కూడా అంతే విచిత్రంగా వుంటాయి. అవేంటో ఒక్కొక్కటి -



మహాకాలుడు ఇక్కడి ప్రధాన దేవుడు. ఈయనే మృత్యుంజయుడు కూడా. అపమృత్యు దోషం నివారణకోసం చాలామంది ఇక్కడికి వస్తారు. ఈయనకి తెల్లవారుఝామునే హారతి ఇస్తారు. అయితే ఇక్కడిచ్చే హారతి మామూలు దీప హారతి కాకుండా భస్మ ఆరతి అంటారు (వీడియో లింకు). ఈ భస్మం కూడా ఉజ్జైని శ్మశానం నుంచి తెచ్చిన శవభస్మం. అయితే ఇప్పుడు శవభస్మం వాడట్లేదనీ ఆవు పేడ పిడకల భస్మం వాడుతున్నారని కొందరు అంటారు.



కాల భైరవుడిది ఇంకొక ప్రత్యేకత - ఈయనకి నైవేద్యం సారాయి. గుడి ముందు నాటుసారా నించి మంచి బ్రాండు విస్కీలదాకా గుప్పు గుప్పున అమ్మకాలు సాగుతుంటాయి. "స్వామీ నా కోరిక తీర్చు.. నీకు మంచి స్కాచ్ పట్టిస్తా" అని మొక్కుకుంటుంటారు కొందరు.

ఇలా లోపలికి తీసుకెళ్ళిన సారాయి మన కళ్ళముందే దేవుడికి పట్టిస్తారు. లోపల దేవుడి నోటి దగ్గర చిన్న చీలక వుంటుంది. అందులో ఒక ప్లేటు లాంటిది పెట్టి సారాయి (నీటే..!) పోస్తారు. మన పానకాల స్వామిలాగ ఈయన మందు మొత్తం లోపలికి తీసుకుంటాడు. (మన పానకాల స్వామి కొంచెం వెనక్కి ఇస్తాడని ప్రతీతి. ఇక్కడ అదీ లేదు. పోసేటప్పుడే కొంచెం మిగిల్చి తీర్థంగా తిరిగిస్తారు)


ఇక మహాకాళి. ఆ గుడికి వెళ్తే అది ఒక అష్టాదశ పీఠమని అనిపించనే అనిపించదు. చాలా సాదాసీదా గుడి. కాళిదాసుని కరుణిచిన కాలిక ఈమే. అక్కడికి కొంచెం దూరంలో హరిసిద్ధీ మాత ఆలయం వుంది. విక్రమార్కుడు కొలిచిన దేవత, భట్టి తన ప్రాణార్పణ చేసి సాహసం ప్రదర్శించి అమ్మవారిని మెప్పించిన గుడి. ఆ పక్కన కర్కాటకేశ్వరుడి గుడి (తమాషా ఏమిటంటే కర్కాటక రేఖ సరిగ్గా ఈ ప్రాంతం నుంచే వెళ్తుంది. ఇక్కడికి దగ్గర్లో ఒక పల్లెటూరిలో సంవత్సరంలో ఒకరోజు సూరుడు సరిగ్గా తల మీద చేరటంతో నీడలు మాయమౌతాయని చెప్పుకుంటారు).

ఇవి కాక శ్రీరాముడు అరణ్యవాసంలో దశరధ మరణవార్త విని తర్పణాలు వదిలిన శిప్రా నది, కుజదోషం వున్నవారు విషేష పూజలు జరిపించే మగళనాథుని గుడి, బర్తృహరి గుహలు, శ్రీకృష్ణుడు, కుచేలుడితో సాందీపముని దగ్గర విద్యనభ్యసించిన ఆశ్రమం ఇవన్నీ వున్నాయి చూడటానికి.

ఉజ్జైనికి సంబంధించిన మరో విశేషమేమంటే ఇక్కడ మహాకాలుడే మహారాజు. అందువల్లే ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఇక్కడ బస చేసేవారు కాదు. ఇప్పటికీ ఇక్కడికి వచ్చే మంత్రులు, ఎం.పీ.లు, ఎం.ఎల్.ఏలు, ఇతర అధికార యంత్రాంగం రాత్రిళ్ళు ఇక్కడ బస చెయ్యరు.
జై మహాకాల్

7 వ్యాఖ్య(లు):

Bhãskar Rãmarãju చెప్పారు...

>>నైవేద్యం సారాయి
ఆశ్చర్యంగా ఉందే.
అన్నట్టు మీరు వారణాశికి వెళ్ళినప్పుడు మీరు కాలభైరవుడిని దర్శించుకున్నారా?

Bhãskar Rãmarãju చెప్పారు...

భస్మహారతి బొమ్మ చూసి కాస్త పులకించా.
ధన్యవాద్ గురుజీ

Unknown చెప్పారు...

భాస్కర్ రామరాజుగారు,

నిజం చెప్పద్దు... ఈ టపాలలో వున్న చిత్రాలన్నీ నేను తీసినవే ఆ ఒక్క భస్మ ఆరతి ఫోటో తప్ప. నిజంగా పులకరించే దృశ్యమనే అంతర్జాలంలో వెతికి మరీ పెట్టాను. అన్నట్టు భస్మ ఆరతి అని వ్రాసి వున్న దగ్గర వీడియో లింకు వున్నది. చూసి తరించండి.

కాలభైరవుణ్ణి సేవించుకోలేదు భాస్కర్‌గారు.. ఏదో గంగ నాలుగు చుక్కలు చల్లుకున్నా, నాలుగు చుక్కలు ఆయన తలపైన పోసాను, పక్కనే అన్నపూర్ణమ్మను కలిశాను. ఈ సారి ఆఫీసు పని మీద కాకుండా ప్రత్యేకంగా కాశి చూడటానికే వెళ్తాను... అప్పుడు అన్ని వివరంగా మరో టపా..!

అజ్ఞాత చెప్పారు...

ఆసక్తికరమైన విశేషాలు. ఏదయినా పత్రికలో ప్రచురిస్తే మరింతమందికి అందుబాటులోకి వస్తాయి.

Bhãskar Rãmarãju చెప్పారు...

సత్యప్రసాద్ గారు,
కాశికి వెళ్ళేప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలట. ఇన్ని రోజులు ఉండలి అనే ఓ లెక్క ఉంటుందట. నాకవన్నీ తెలియదు నేను వెళ్ళినప్పుడు. నేను మాత్రం మూడు రాత్రులు ఉందాం అనుకున్నా. ఉన్నా.
నాకు ఎక్కడ శివలింగాన్ని చూసినా అలా వళ్ళు జ్లదరిస్తూంటుంది. ఒక రకమైన భావానికి గురౌతుంటా. శ్రీశైలం కి వెళ్ళినప్పుడు మాత్రం శ్రీశైలమల్లన్నని తాకంగనే ఒకరకమైన షాకు తగిలింది.

అజ్ఞాత చెప్పారు...

కాశీ మె హర్ కంకర్ శంకర్ హై! అని నానుడి.

తిండి దొరకలేదన్న కోపంలో కాశీని శపించబోయిన వ్యాసుణ్ణి శివుడిలా అంటాడు... "మహాభారతం రాసిన శుంఠా వెళ్ళు ఇక్కడ్నుండి." ఆ తర్వాత అన్నపూర్నమ్మ కనికరించి అన్నం పెట్టినట్టు కథ.

అజ్ఞాత చెప్పారు...

You have to also talk about "Ganne kA ras" stalls that spring up like mushrooms in Indore in summer ;-)