"అయితే డిల్లీలో వుంటున్నావన్నమాట..!! ఏమిటి ఢిల్లీ సంగతులు..??"
"అమ్మమ్మా.. ఢిల్లీ అనకూడదటండీ దిల్లీ అనాలట.. దిల్ వాలోంకా షహర్ దిల్లీ"
"అదేమిటయ్యా ఢిల్లీ మన దేశ రాజధాని అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా"
"నిజమే.. బాంగ్లోర్, కలకట్టా, బాంబే, మదరాసు అనే వూర్ల గురించి కూడా చదివే వుంటారు"
"అవును అయితే?"
"ఇప్పుడవి బెంగుళూరూ, కోల్‌కత్తా, ముంబై, చెన్నై కాలేదు.. అలాగే ఇదీనూ.."
"ఏమిటి పేరు మార్చేస్తున్నారేమిటి?"
"మారుద్దామనే అనుకుంటున్నారు.."
"సరే అలాగే మారనీ.. దిల్లీ అనే అందాం.."
"అమ్మమ్మా.. అలా మీరు తీర్మానిచ్చేస్తే ఎలా? దిల్లీ అనే పేరు అచ్చి రాదని సంఖ్యా శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలా చేస్తే రాజధానిలో అశాంతి పెరిగి కల్లోలాలు అధికమౌతాయట.."
"అక్కడికేదో తక్కువున్నట్లు.. ఢిల్లీలో క్రైంరేటు ఎక్కువైందని.. మన టీవీ చానల్లో "నేరాలు ఘోరాలు" "అర్థరాత్రి అకృత్యాలు" లాంటి సీరియల్ వాళ్ళంతా ఢిల్లీలోనే మకాం పెట్టారటగా.."
"నిజమేననుకోండి.. అవి ఇంకా ఎక్కువౌతాయని భయపెడుతున్నారు.."
"మరి ఎలా?"
"ఏముంది.. దిల్లీ పేరులో నాలుగు ఎల్(L) అక్షరాలు పెట్టమనో.. మూడు ఐ(I)లు వచ్చేట్లు పెట్టమనో అదే సంఖ్యా శాస్త్ర నిపుణులు చెప్తారు.. అందాకా ఢిల్లీ అనో కొత్త ఢిల్లీ అనో అనుకోవడమే.."
"బాగా చెప్పావ్.. అసలీ గోల లేకుండా పూర్వ నామం హస్తినాపురం వుండనే వుందిగా.."
"గట్టిగా అనకండి.. మళ్ళీ ఇదొక కొత్త గోల కాగలదు."
***
"అయితే డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఈ నేరాల విషయమై ఏం చేస్తున్నట్లు"
"తల పట్టుకు కూర్చున్నట్లు"
"అదికాదబ్బాయ్.. అవి తగ్గించడానికి ఏమి చెస్తున్నట్లు అని"
"అంతకన్నా పెద్ద సమస్య నెత్తిన వుంటే దీని సంగతేమి చూస్తుంది"
"ఏమిటి పవర్ కాపాడుకోవడమా?"
"కాదు పవర్ కట్ లేకుండా కాపాడుకోవడం"
"అంటే"
"అంటే విద్యుత్ అంతరాయాలు తగ్గించడం"
"ఏమిటి రాజధానిలో పవర్ కట్టా?"
"అది మాత్రం అడగకండి.. నాకు ఏడుపొస్తుంది"
"అదేం?"
"మొన్న రాత్రి ఐదు గంటలు కరెంటు లేదు"
"హమ్మయ్యో.. మరెలా?"
"ఏముంది.. మేలుకోని బాల్కనీలో కూర్చోని లైన్ మేన్ నుంచి పవర్ మినిష్టర్ వరకూ అందరినీ తిట్టుకుంటూ.. పిల్లలకి పుస్తకాలతో విసనకర్రలతో విసురుకుంటూ తూగడమే.."
"అయ్యయ్యో.. ఎందుకలా"
"డిల్లీకి అవసరమైనంత కరెంటు వుత్పత్తి కావటంలేదు.. కాదు కాదు.. వుత్పత్తి అవుతున్న విద్యుత్తు సరిపోవడంలేదు"
"ఎందుకలాగ?"
"అందరూ కూలర్లు, ఏసీలు రాత్రింబవళ్ళు నడుపుతుంటే ఎలా సరిపోతుంది?"
"ఎందుకలా నడుపుతున్నారు?"
"ఎండలండీ ఎండలు.. అవి సామాన్యమైన ఎండలా.. నిప్పులు చెరుగుతుంటే.."
"మరి కూలర్ కొన్నావా?"
"కొందామనుకున్నా.. వర్షాకాలం వస్తే అది పనికిరాదు.. వర్షాలలో గాలిలో తేమ ఎక్కువ కాబట్టి కూలర్ కన్నా ఏ.సీ. వుండటమే మంచిది.. చలి కాలంలో హీటర్ అవసరమౌతుంది.."
"అంత చలా"
"చలా అది.. మంచు ముక్కలు చెరుగుతుంది.."
"మరి ఏ.సీ. కొన్నావా?"
"లేదు.. కరెంటు లేనప్పుడు ఏ.సీ. కొని మాత్రం ఏం ప్రయోజనం?"
"మరేం చేశావు?"
"పెళ్ళాం పిల్లల్ని పుట్టింటికి పంపించి.. వుద్యోగం పేరుతో వూళ్ళు తిరుగుతున్నా.."
"బాగానేవుంది"
***
"ఇంతకీ డిల్లీలో ఎక్కడుంటున్నావేమిటి?"
"ద్వారక"
"నువ్వు మరీనోయ్.. ద్వారక వున్నది గుజరాతులో కదూ"
"కాదు మాష్టారు.. "అదిగో ద్వారక ఆలమందలవిగో"..అని చెప్పిన ద్వారక కాదిది..డిల్లీ లోనే ఒక ప్రాంతం"
"ఓహో.. బాగు బాగు.. శ్రీకృష్ణుడు ఢిల్లీ పక్కనే వున్న మథురని వదిలి పెట్టి ద్వారకకు వెళ్తే మళ్ళీ ద్వారకను ఢిల్లీ పక్కనే చేర్చారన్నమాట..!! అవునూ శ్రీకృష్ణుడు మథురని వదిలిపెట్టింది అక్కడి యూపీ, బీహారు జనాన్ని తట్టుకోలేకేనటగా.."
"మహాప్రభూ.. లేని పోని గొడవలు రేపకండి.. ఇక్కడ ఢిల్లీలో యూపీ బీహారోళ్ళు చాలామంది వున్నారు"
"అవునులే అక్కడ రాజ్ థాకరే లేడుగా..!! వీళ్ళంతా ఏం చేస్తుంటారేమిటి?"
"అన్ని పనులు చేసేవారూ వున్నారు..రోడ్డు సైడు బండ్లు పెట్టుకోని చాట్ అమ్ముకునేవాళ్ళు, రిక్షా నడిపేవారు ఎక్కువ బీహార్ యూపీయులే.."
"ఏమిటి ఇంకా అక్కడా రిక్షాలున్నాయటోయ్.."
"వున్నాయి.. తొక్కుడు రిక్షాలు.. మనలాగా ఇక్కడ బేషజాలకు పోయి ఆటోలోనే పోతానని ఎవ్వరూ అనరు.. ఎంతటివాళ్ళైనా దర్జాగా రిక్షా ఎక్కి వూరేగింపుగా వెళ్తారు.."
"మరి టాక్సీలు, ఆటోలు గట్రా లేవా?"
"లేకనేం? అవి నడిపేది ఎక్కువ పంజాబీయులు"
"మరి తెలుగువాళ్ళు లేరా?"
"తెలుగువాళ్ళు లేకుండానా.. నేను లేనూ.. నాలాగే ఇంకా చాలామంది.."
"వున్నారు సర్లే.. వాళ్ళేంచేస్తారని?"
"ఎవడి వుద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు.. "
"బాగానే వుంది.. మరి ఎప్పుడైనా కలుస్తుంటారా?"
"ఇండియా గేటు దగ్గర ఆంధ్రాభవన్ వుంది.. అక్కడి క్యాంటీనులో అచ్చ తెలుగు భోజనం, ఏపీ భవన్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.. అలాగే కరోల్ బాగ్ ప్రాంతంలో సదరన్ ట్రావెల్స్ వారి అమరావతి హోటల్లో కూడా మాంచి తెలుగు భోజనం దొరుకుతుంది.. అక్కడే తెలుగు సూపర్‌మార్కెట్టు వుంది.. అన్ని ప్రముఖ వార్తాపత్రికలకు డిల్లీ ఎడిషన్ వుంది.. వార పత్రికలు కూడా దొరుకుతాయి.."
"భలే బాగుందే... మరైతే మన బ్లాగుల ప్రచారం ఇక్కడ కూడా చెయ్యొచ్చుగా?"
"చేద్దామండీ.. ఇప్పుడేగా వచ్చింది.."
***
2 వ్యాఖ్య(లు):
చండ్ర నిప్పులు చెరగడమే విన్నానింతవరకూ. మంచు ముక్కల్ని చెరగడం ప్రయోగం బావుంది.
‘‘చలా అది.. మంచు ముక్కలు చెరుగుతుంది.’’
ఢిల్లీ అదే దిల్లీ పూర్వనామం హస్తినాపురం కాదండి. ఇంద్రప్రస్థం.
హస్తినాపురం ఉత్తర్ ప్రదేశ్ లోని మీరఠ్ దగ్గర ఉంది.
మన తెలుగు పత్రికల వాళ్ళు ఢిల్లీని హస్తినాపురం చేసేసారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి