"రామబాణం బావా నేను గోపాలాన్ని.. ఇప్పుడే జింగాలియా అనే దేశంలో వున్న బొర్రు తెగ పాటల ఆల్బం విన్నాను.. కొప్పరొకం అనే ఇంకో దేశం పాటలు కూడా విని తీసుకొస్తా.... నువ్వు నెక్స్ట్ ఆల్బం ప్లాన్ చేసుకో.." చెప్పాడు గోపాలం అవతలివైపు నుంచి.
"వద్దురా గోపాలం.. ఇంక అర్జెంటుగా వచ్చేసై.. ఇక్కడ చాలా కష్టంగా వుంది.." చెప్పాడు రామబాణం.
"ఏంటి బావా ఏమైంది?" అడిగాడు గోపాలం ఖంగారుగా.
"ఏముందిరా.. ఈ ముదనష్టపు ఇంటర్‌నెట్ ఒకటి వచ్చి చచ్చిందిగా.. ఈ మధ్య నేను ఏ పాట చేసిచ్చినా నిర్మాతలు - "ఇది ఫలానా అప్పడిక్కం దేశం పాట కదా" అని కనిపెట్టేస్తున్నారు." వాపోయాడు.
"అదెలా జరిగింది బావా?"
"ఏం చెప్పమంటావురా మొన్నెప్పుడో కక్కుర్తికి పోయి గొంగారియా దేశం జాతీయ గీతం ట్యూన్‌లో పాట కట్టేశా.. అది తెలిసి ఆ దేశంవాళ్ళు నిర్మాత మీద దావా వేశారు.. ఇక అప్పటి నుంచి నేను ఏ పాట చేసిచ్చినా దాని గురించి ఇంటర్నెట్‌లో వెతికి మరీ కనిపెట్టేస్తున్నార్రా..!! నువ్వు తొందరగా రారా.. ఇక్కడ పరిస్థితి దారుణంగా వుంది.. బాధతో నేను హార్మోనియం పట్టడం కూడా మానేశాను.."
"సరేలే నేను వచ్చి ఒక కొత్త ఐడియా చెప్తాను.. అయినా నీకు హార్మోనియం వాయించడం రాదు కదా బావా"
"సరేలేవోయ్.. ఇప్పుడది చెప్పకపోతే ఏంటట..??" అంటూ ఫోను పెట్టేశాడు రామబాణం.
***
ఆ తరువాత ఒక నెల రోజులకి "ఇరుగు-పొరుగు" టీవీ చానల్‌లో ప్రకటన వచ్చింది..
"త్వరలో మీ ఇరుగు-పొరుగు చానల్లో... గోపాలం ప్రొడక్షన్స్... టీవీ చరిత్రలోనే అది పెద్దదైన పాటల పోగ్రాం "పాటాడుకుందాం రా..!!"..!! ఇందులో పాల్గొనాలంటే మీ వయసు మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు వుండాలి. మీ పిల్లల పాటగాని, మాంఛి శృతిలో ఏడుపుగాని రికార్డ్ చేసి మాకు పంపించండి.."
మరో నెలకి పోగ్రాం షూటింగ్ ప్రారంభమైంది.
ఏంకరు చిట్టి అనబడే చింతపల్లి చిట్టెమ్మ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
"ఇరుగు పొరుగు ఛానల్ సమర్పిస్తున్న " పాటాడుకుందాం రా..!" కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి జెడ్జీలుగా ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ రామబాణంగారు, ప్రముఖ సినిమా కవి శ్రీ వరదరాజులుగారు, ప్రముఖ సింగర్ కోకిలా దేవిగారు వ్యవహరిస్తారు.." అంటుండగానే రామబాణం అందుకున్నాడు -
"ఈ కార్యకరమంలో పాల్గొనడం చాలా సంతోషంగా వుంది. అందుకే మీకోసం ఈ పాట -
"ఎంత మేలు చేసావయ్యా.. నన్ను ఎంత ఎత్తుకు ఎత్తావయ్యా.. ఓ ఓ నా బావమరిదయ్యా" అంటూ పాడి, గోపాలం వంక కృతజ్ఞతగా చూసి కళ్ళు తుడుచుకున్నాడు. వెంటనే వరదరాజులు అందుకోని -
"బాగా పాడారండీ కాకపోతే మీ శ్రుతి ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుండేది.. అలాగే లిరిక్‌లో పాట పల్లవితరువాత.. కొంచెం స్పష్టంగా పలకాలి.." అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. గోపాలం పరుగెత్తుకొచ్చాడు..
"సార్.. సార్.. ఇంకా పోగ్రాం మొదలవలేదు సార్.. అప్పుడే ఇలా కామెంట్స్, మార్కులు ఇచ్చేస్తే ఎట్లా? కొంచెం ఆగండి." అన్నాడు ఖంగారుగా.
"ఆల్రెడీ ఇలాంటి పోగ్రాం ఒకటి చేశాను అందుకే అలవాటులో పొరపాటు.." అంటూ నాలిక కరుచుకున్నాడు వరదరాజులు.
ఇంతలో ప్రముఖ సింగర్ కోకిలాదేవి గోపాలాన్ని పక్కకి పిలిచి - "గోపాలంగారు.. నాకు ఇలాంటి కామెంట్లు చెప్పడం రాదు.. ఇప్పుడేమిటి చెయ్యడం?" అంటూ వాపోయింది.
'ఏమి రాని నిన్ను సింగర్ ఎవరు చేశారమ్మా' అనబోయి, తన బావ రామబాణమే ఈమెకు తొలి అవకాశం ఇచ్చాడని గుర్తొచ్చి చల్లబడ్డాడు.
"మరేం ఫర్లేదు మేడం.. నేను కొన్ని కామెంట్లు వ్రాసి ఇస్తాను.. పాట అయిపోగానే అందులో వున్నవి ఏమైనా చదవండి.." అంటూ ఒక కాగితం మీద కొన్ని వ్యాఖలు వ్రాసిచ్చాడు.
మొదటి పాట మొదలైంది. విజయనగరం నుంచి వచ్చిన తార అనే రెండేళ్ళ పాప "జుంబాలో జుగుంబలాలో.." అనే కొండజాతుల పాట పాడింది. పాట అయిపోగానే అందరూ చప్పట్లు కొట్టారు. కోకిలాదేవిని తన అభిప్రాయం చెప్పమంది ఏంకరు చిట్టి.
కోకిల వుత్సాహంగా గొంతు సర్దుకోని -
"పాట బాగానేవుంది లేదా ఫర్లేదు.. కొంచెం ఫీల్ తక్కువైంది.. పాట గొంతులోనించి లేదా కడుపులోనించి లేదా మనసులోనించి రావాలి.. టెంపో కొంచెం ఎక్కువైంది లేదా తక్కువైంది.." అంటూ చెప్పసాగింది.
"కొంపలు మునిగాయి.." అంటూ గోపాలం పరుగెత్తుకోని కోకిల దగ్గరకు వచ్చాడు. "అమ్మా.. నేను వ్రాసిచ్చినవన్నీ ఒకేసారి చదవకూడదమ్మా.. ఏదైనా ఒక్కటే చదవాలి.. ఒక పని చెయ్యి.. ముందు మా బావ రామబాణం ఏం చెప్తాడో విను.. నువ్వు కూడా అదే చెప్పు.. సరేనా అమ్మా?" అడిగాడు.
"సరే.." అంది కోకిల.
"తరువాత పాట పాడేది.. కోరెట్లపాలం నుంచి సీత." చెప్పింది ఏంకరు. ఒక ఐదేళ్ళ పాప స్టేజిమీదకొచ్చి చుట్టూ బిత్తర చూపులు చూసింది. జనంలో కూర్చున్న వెంకన్నను చూడగానే "నాన్నా.." అంటూ కేక పెట్టింది.
అప్పుడు కాని వెంకన్నకి అర్థం కాలేదు, ఆ వచ్చింది తన కూతేరేనని. "ఓలయ్యో.. ఏందిది.. ఇట్లాంటి బట్టలేశారు.. నా కూతురు పేరు సీతాలైతే సీతంటారేంది.. నేనొప్పుకోను" అంటూ చిందులు వెయ్యసాగాడు. రామబాణం దిగులుగా గోపాలం వైపు చూశాడు.
గోపాలం మళ్ళీ పరుగెత్తుకుంటూ వెంకన్న దగ్గరకి వచ్చారు.
"అయ్యా.. సీతాలు పేరు మరీ పాత చింతకాయలాగా వుంది.. అందుకే సీత అని పెట్టాము."
" అయితే మాత్రం.. ఎట్టాగంటే అట్టా పేరు మార్చేస్తే వూరుకుంటానా.. రేపు మా వూళ్ళో ఈ పేరు విని ఇదెవరో వేరే పిల్ల అంటే మా గతేంకావాలి..? అయినా ఆ బట్టలేంది? మట్టసంగా మేము పట్టు లంగా వేసి పంపిస్తే అయ్యి గాదని ఇట్టా పేలికలు గట్టారు?" అడిగాడు వెంకన్న రొప్పుతూ.
"అయ్యా వెంకన్నగారు.. ఇవాళ ఎపిసోడు "అడవి జాతుల" ప్రత్యేకం అందుకే ఇలాంటి బట్టలేశాము. రేపు ఉగాది ఎపిసోడ్ వుంది అప్పుడు పట్టు లంగ వేద్దాం.. ముందు మీరు కూర్చోండి.." అన్నాడు గోపాలం.
"మరి పేరు సంగతేందని?"
"అలాగే బాబూ.." అంటూ ఏంకరు వైపు తిరిగి "ఇదుగో చిట్టీ..! సీతాలనే చెప్పు" అంటూ ఇంకా ఏదో గొణిగి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
ఏంకరు వచ్చి ఇప్పుడు మన రామబాణంగారు స్వరపరిచిన "చెంచురామయ్య" చిత్రంలోని పాట.. పాడుతున్నది సీతాలు" అంటూ చెప్పింది.
రామబాణం ఆ మాట వింటూనే చెంచురామయ్య చిత్రం రికార్డింగ్ రోజు గుర్తు తెచ్చుకున్నాడు. ఎక్కడో ఒరిస్సా అడవుల్లో పాడుకునే పాటని తను ఎలా కాపీ కొట్టిందీ.. ఎలా ఆ పాటకు డైరెక్టరు, ప్రొడ్యూసరు ఆనందపడిపోయి.. తనకి పార్టీ ఇచ్చింది.. ఆ పాట ఎంత పెద్ద హిట్టైంది.. తల్చుకుంటూ చిన్న కునుకు తీసాడు. నిద్ర లేచేసరికి సీతాలు స్టేజిమీద లేదు. వెంటనే మైకు ముందుకు వంచుకోని -
"చాలా బాగా పాడింది. ఈ అమ్మాయి గొంతులో ఒక ప్రత్యేకత వుంది. కొంచెం టెంపో పెంచితే ఇంకా బాగుండేది.. నేనిచ్చే మార్కులు తొమ్మిది" అన్నాడు, తను నిద్రపోయిన విషయం తెలియకూడదని.
వెంకన్నకి ఏమి అర్థంకాలేదు -
"ఏందిది.. మా అమ్మాయి పాడకుండానే మార్కులిస్తాడేంది ఈయన" అన్నాడు గట్టిగా.
ఇంతలోనే కోకిలాదేవి తొమ్మిదిమార్కుల బోర్డు పైకెత్తి - "అవును. సార్ చెప్పిన మాటే నా మాట కొంచెం టెంపో పెంచుకుంటే.." అంటూ చెప్పబోయింది.
గోపాలం జుట్టు పీకున్నాడు - "ఆపమ్మా.." అరిచాడు "ఇంకా పాడిందే లేదుగాని టెంపో కావాలంట టెంపో" అన్నాడు అరుస్తూ.
"నాకేం తెలుసు. మీరేగా చెప్పారు సార్ ఏం చెప్తే అదే చెప్పమని" కోకిల పలికింది.
"ఏంటి బావా ఇది" దీనంగా అడిగాడు గోపాలం. అప్పటికి తన తప్పు అర్థమైంది రామబాణానికి.
"సారీ గోపాలం. చిన్న కునేకేసి లేచాను. ఈ లోపల పాట అయిపోయిందేమో అని.." సణిగాడు రామబాణం. అప్పటిదాకా మాట్లాడకుండా వున్న వరదరాజులు లేచాడు -
"ఇది సంగీతానికి జరిగిన అవమానం. సరస్వతీదేవికి జరిగిన అవమానం. రామబాణంగారు క్షమాపణ చెప్పేదాకా నేను ఈ పోగ్రాంలో జడ్జీగా కూర్చోను.." అంటూ చెర చెరా వెళ్ళిపోయాడు. గోపాలం వెనక పరుగెత్తాడు.
"సార్.. సార్.. వరదగారు"
"నో.. రాజులు.. వరదరాజులు.."
"అదే సార్ వరదరాజులుగారు.. ఇలా మీరు అర్థాంతరంగా వెళ్ళిపోతే ఎలా సార్.. పోగ్రాం ఆగిపోతుంది సార్.." ఏడ్చినంత పనిచేశాడు గోపాలం.
"ఎందుకయ్యా అంత ఫీల్ అవుతావు.. ఇదంతా ఏక్షనే కదా.. ఇంతకు ముందు నేను చేసిన రియాలిటీ షోలో.. ఇలా చేస్తే ఎంత పాపులారిటీ వచ్చిందో తెలుసా. అదే అనుభవంతో.."
"సార్.. మీ అనుభవం మా చావుకొచ్చింది సార్. ముందు కూర్చోండిసార్..!!" అంటూ ఆయన్ని లాక్కొచ్చి కూర్చోబెట్టాడు గోపాలం.
సీతాలు పాట మొదలైంది.
"ఓలమ్మో చెంచోడు.. నా సంచీ చించాడు.." అంటూ డబల్ మీనింగ్ పాట పాడింది. అందరూ చప్పట్లు కొట్టారు.
"బాగుంది.. చాలా బాగుంది అసలు నీ వాయిస్ భలే కొత్తగా వుంది" అన్నడు రామబాణం
"అవును భలే కొత్తగా వుంది" అంది కోకిలమ్మ.
"సార్ ఎవరిదో చెంచు డ్రస్సు నాకు వేశారు.. అది గొంతు దగ్గర టైట్‌గా వుంది అందుకే నా గొంతు అలా వుంది" అసలు విషయం చెప్పింది సీతాలు. మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టడంతో ఆ మాటలు వినపడలేదు.
***
“పాటాడుకుందాం రా” పెద్ద హిట్టైంది. చెంచు పాటలకి, గొబ్బెమ్మపాటలకి, బూతుపాటలకి ఒక్కొక్కదానికి ఒక ప్రత్యేక ఎపిసోడ్లు పెట్టారు. ఆ వారంలో ఎవరి సినిమా ఫ్లాపైతే ఆ సినిమా హీరోనో, డైరెక్టర్‌నో ప్రత్యేక గెస్టుగా పిలిపించాడు గోపాలం. వాళ్ళందరికీ డైలాగులు ముందే రాసిచ్చాడు.
"ఇంత గొప్ప సినిమా తీసిన డైరెక్టరుకు జై" అని రామబాణం అంటే కోకిలమ్మ కూడా "అవును సార్ చెప్పినట్లే జై" అనేది. మధ్య మధ్యలో వరదరాజులు లేచి వెళ్ళిపోయేవాడు. ఆయన్ని బ్రతిమిలాడే సీన్లు పెద్ద హిట్టైపోయాయి. ఇలాంటి సన్నివేశాలు, డైలాగులు వ్రాయడంకోసం డైలీ సీరియల్ రచయితలను పెట్టుకున్నాడు గోపాలం.
అలాంటి ఎపిసోడ్‌కి - "మళ్ళీ లేచెళ్ళిపోయిన వరదరాజులు.. తప్పక చూడండి ఈ వారం పాటాడుకుందాం రా..!!" అంటూ వారం రోజులముందునుంచే తెగ పబ్లిసిటీ ఇచ్చేవారు. తీరా ఆ వారం అందరూ కళ్ళు అప్పగించుకోని ఎపిసోడ్ అంతా చూస్తే ఎప్పుడో చివర్లో మార్కులు చెప్పేముందు ఆయన లేచి వెళ్ళిపోయేవాడు.
"వరదరాజులుగారు ఎందుకు లేచెళ్ళిపోయాడు.. చూడండి రేపటి ఎపిసోడ్‌లో.." అంటూ బీపీ పెంచేసేవాళ్ళు. మర్నాడు ఆడవాళ్ళు అన్నం వండటం మానేసి, మొగుళ్ళతో పోరాడి ఆ ఎపిసోడు చూస్తే వరదరాజులు తిరిగి వచ్చేవాడు.
"ఎందుకు సార్ లేచి వెళ్ళిపోయారు?" అంటే
"పొద్దున్న సమోసాలు తిన్నాను.. కడుపులో గడబిడ" అంటూ చల్లగా చెప్పేవాడు వరదరాజులు.
ఇలా సాగుతుండగా వెంకన్నకు నెమ్మదిగా రియాలిటీ షోలలో రియాలిటి ఏమిటో తెలిసొచ్చింది. అసలు పాటని వదిలేసి ధ్యాసంతా వేషాల పైనా, నాటకాలపైనా వుండటం అతనికి నచ్చలేదు. అవకాశం కోసం చూస్తున్నాడు.
ఆ అవకాశం అతనికి ఫైనల్ ఎపిసోడు ముందే వచ్చింది.
విజయనగరం తార, కోరెట్లపాలం సీతాలు, మరో ఇద్దరు ఫైనల్స్ దాకా చేరుకున్నారు. జనాలంతా సీతాలు గెలుస్తుందా, తార గెలుస్తుందా అంటూ పందాలు వేసుకుంటున్నారు. ఆ రోజు గోపాలం జడ్జీలని కూర్చోబెట్టి విషయం చెప్పాడు -
"అయ్యా.. ఈ షోకి డబ్బులు పెట్టిన రాజుగారు తరువాత "పాటాడుకుందాం రా - 2" కి డబ్బులు పెడతామంటున్నారు. అందులో మూడు నెలల నించి రెండు సంవత్సారాల లోపు పిల్లలుంటారు.. కాకపోతే వాళ్ళది ఒక కండీషన్"
"ఏమిటది?" అడిగారు జడ్జీలు ఆసక్తిగా.
"ఈ ఫైనల్స్‌లో తార అనే అమ్మాయే గెలవాలి. ఏదో వొకటి చేసి ఆ అమ్మాయినే గెలిపించాలి" అన్నాడు.
ఈ మాటలు వెంకన్న చెవినబడ్డాయి. అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. అప్పటికి సమయం కాదని వూరుకోని, గోపాలం ఒక్కడే వున్నప్పుడు అతని గదిలోకి వెళ్ళి చొక్కా పట్టుకున్నాడు..
"ఎంటయ్యా ఇది? నా కూతుర్ని కాదని ఇంకెవరినో గెలిపించమని సిఫార్సులు చేస్తున్నావు?” అడిగాడు కోపంగా.
"అబ్బా అదికాదయ్యా.. ఇప్పుడు తారకి నీ కూతురికి మధ్యే కదా కాంపిటీషను.. మీ అమ్మాయి బాగానే పాడుతుందికాని ఆ అమ్మాయికి క్రేజ్ ఎక్కువ, పైగా పెద్ద పెద్ద వాళ్ళ రికమండేషను.. అందుకని.." ఏదో చెప్పబోయడు గోపాలం. వెంకన్న ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నాడు. వెంటనే అందుకున్నాడు -
"చిన్నపిల్లలతో రాజకీయం చేస్తానంటావు.. మీకసలు మనస్సనేది వుందా? పాటలు పాడదామని వస్తే నానా రకాల వేషాలు వేయించారు.. ఒకసారి ముసలమ్మ పాటల్ని ముసలి వేషం, భయంకరమైన పాటలని భేతాళ వేషం వేయించారు.. దీనికన్నా మా వూర్లో వీధి నాటకం వేసుకోవచ్చు.." అన్నడు కోపంగా.
గోపాలం సర్ది చెప్పబోయేంతలో మళ్ళీ అందుకున్నాడు.
“పాటలపోటీ అని చెప్పి రికమండేషను పిల్లకి ప్రైజ్ ఇస్తారా? మీ సంగతి తేలుస్తా.. అట్టాగాని జరిగిందో మా పిల్ల చేత ఆత్మహత్య నాటకం ఆడిస్తా.. జడ్జీలు చేసిన మోసం వల్లే ఇలా జరిగిందని నేను నాలుగు న్యూస్ ఛానళ్ళలో గగ్గోలు పెడతా.. గోపాలంగాడే ఇదంతా చేయించాడని చెప్తా.. పేపర్లలో మీ పోగ్రం గురించి నానా తప్పుడు కూతలు వ్రాయిస్తా.." అంటూ శివతాండవం చేసేశాడు.
దాంతో బిక్క చచ్చి గోపలం మళ్ళీ జడ్జీల దగ్గరకి పరుగెత్తాడు. "అయ్యా.. ఎలాగైనా ఆ సీతాలునే గెలిపించండి" అంటూ బ్రతిమిలాడాడు.
"అదేంట్రా.. ఇందాక తారని గెలిపించాలన్నావు.." అడిగాడు రామబాణం.
"అవును అన్నావు" అంది తందాన కోకిల.
"అన్నాను బావా.. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. తార గెలవకపోతే నెక్స్ట్ పోగ్రాంకి డబ్బులు రావు.. సీతాలు గెలవకపోతే మనకి ఇంక బతుకే వుండదు" అంటూ జరిగింది చెప్పాడు.
"అవునవును.. అలా చేసినా చేస్తారు.. మునుపు నేను చేసిన పోటీలో ఇలాంటిదే నాకు అనుభవమైంది.." చెప్పాడు వరదరాజు. గోపాలం కన్నీళ్ళ పర్యంతమై -
"మీకు దణ్ణం పెడతాను.. మీ అనుభవాలు పక్కన పెట్టి ఆ అమ్మాయినే గెలిపించండి" అన్నాడు.
"ఈ గోలంతా దేనికి.. ఎవరు బాగా పాడితే వారినే గెలిపిద్దాం" అన్నాడు రామబాణం.
"అవును సార్ చెప్పినట్లే చేద్దాం" అంది తందాన కోకిల.
గోపాలం బాధగా "సరే కానివ్వండి" అన్నాడు.
అక్కడ పోటి చివరికి వచ్చింది. ఏంకరు విజేత ఎవరో ప్రకటించబోతోంది.
"ఇంతకాలం మీరెంతగానో ఆదరించిన పాటాడుకుందాంరా.. పోటిలో చివరికి నలుగురే మిగిలారు.. అందులో చివరి రౌండు వచ్చేసరికి ఇద్దరే మిగిలారు. ఆ ఇద్దరు ఎవరో కాదు.. విజయనగరం నుంచి వచ్చిన తారంగం తార.. కోరెట్లపాలం సీతాలు.. ఈ ఇద్దరిలో విజయం ఎవరిది? ఎవరు ఇంటిదారి పడతారు..??"
"లబ్.. డబ్.. లబ్.. డబ్.." గుండె చప్పుడు మ్యూజిక్‌గా పెట్టారు.
"తొందరగా చెప్పవమ్మా.. ఇక్కడ టెన్షన్ ఎక్కువైపోతోంది" ఎవరో అరిచారు.
"ఆ విజేత ఎవరో" కొంచెం ఆపింది ఏంకరు. మళ్ళీ "లబ్.. డబ్.. లబ్.. డబ్.." సౌండు తరువాత కొనసాగించింది ఏంకరు - "వచ్చే వారం తెలుసుకుందాం.."
టెన్షన్ తట్టుకోలేక గొపాలం గుండె పట్టుకోని కింద పడిపోయాడు.