అదీ సంగతి (కథ)

"రశీదు కావాలి" అన్నాడతను. నేను చప్పున అతని వైపు తిరిగాను. సరుకులు కొనడమన్నమాటే కాని ఏనాడూ రశీదు తీసుకున్న పాపాన పోలేదు నేను. నేనే కాదు ఎవరూ రశీదు విషయంలో జాగర్త తీసుకోరనేది సర్వవిదితమే.


"రశీదా? రశీదు మేము ఇవ్వం సార్.." చెప్పాడు కొట్టువాడు.


"రశీదు లేకపోతే నాకీ వస్తువులు వద్దు.." అన్నాడతను. నిజంగా మనం కూడా అంత ఖచ్చింతంగా వుంటే అసలు వినియోగదారులకు సమస్యలే వుండవనిపించింది నాకు. ఆ క్షణమే అతను నాకు ఆదర్శమైపోయాడు.


"ఫర్లేదు సార్.. తీసుకెళ్ళండీ... గ్యారంటీ సరుకు" సముదాయించబోయాడు వాడు.

"సరుకు ఏమైన కాని.. నాకు మాత్రం రశీదు కావాలి.. అంతే.. రేప్పొద్దున ఈ సరుకుల్లో ఏమైనా తేడాలొస్తే మీ దగ్గర కొనలేదని బుకాయిస్తారు.."

"అబ్బె మేమలాంటి వాళ్ళాం కాదు సార్.. మా మాట నమ్మండి.."

"నమ్మకమా? అడగగానే రశీదు ఇచ్చి వుంటే కలిగి వుండేది.." అంటూనే సంచీలో సరుకులు తీయబోయాడు.

"సార్.. రసీదు కావాలంటే అయ్యగారు రావాలి.. లేటౌతుంది..." అన్నాడు.

"ఫర్వాలేదు.. నేను వైట్ చేస్తాను" అన్నాడు అతను అక్కడే వున్న బల్ల మీద కూర్చుంటూ. నేను నెమ్మదిగా అతను పక్కన చేరాను.

"వీళ్ళేప్పుడూ ఇంతే సార్.. రసీదులు ఇవ్వరు..." అన్నాను అతనితో మాట కలిపే ఉద్దేశ్యంతో.

"మీలాంటి వాళ్ళంతా ఇలా చూస్తూ వూర్కోబట్టే ఇలా తయారౌతున్నారు... ఏమైన నేను రసీదు తీసుకోందే ఇక్కడ్నుంచి కదలను.." అన్నడతను దృఢంగా.


"అవునులెండి.. మనమిలాగే గట్టిగా ఉంటే అతను మాత్రం ఏం చేస్తాడు.. అసలు ఈ సరుకు చూడండి..! నిండా రాళ్ళు.. కల్తీ.. ఇది చూడండి నిర్మా సోప్ అడిగితే సరిగ్గా అలాగే వున్న బర్మా సోపు అంటగట్టాడు.." అన్నాను.

"మరి ఇవన్నీ చూస్తూ ఎలా ఊరుకున్నారండీ వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టక..!!" అన్నాడతను. పక్కన కొట్టువాడు అదిరిపడ్డాడు.

"అబ్బే అంత దూరం ఎందుకులెండి.. ఇదుగో అయ్యగారు వచ్చేశారు.. అయ్యా రసీదు అడుగుతున్నారు.." అన్నాడతను.

"రసీదా" అంటూ చిత్రంగా చూశాడు ఓనర్.

"అవును రసీదే ఇస్తారా లేక.." నా పక్కనున్నతను అన్నడు.

"అబ్బె అవన్నీ ఎందుకు లెండి.. అయ్యా మీరు ముందు రసీదివ్వండి.." అన్నాడు కొట్టువాడు. రసీదు తీసుకోని ఇద్దరం బయటపడ్డాం.

"ఏ మాత్రం అవకాశమిచ్చినా వీళ్ళు మన మెడకు బిగిస్తారు.. అందుకే నేను ప్రతిచోట ఇలాగే గట్టిగా వుంటాను.." అన్నాడతను.

"అవునవును.. ఇలానే వుండాలి.. అన్నట్టు మీ పేరు?" అడిగాను నేను.

"నా పేరు రామకృష్ణ.. నిజాయితీగా వ్యాపారం చేసి నష్టపోయాను.. ప్రస్తుతానికి చిన్న చిట్‌ఫండ్ కంపెనీతో కాలం గడుపుతున్నాను.." అంటూ తన వివరాలు చెప్పాడు. ఆ రోజు నుంచి నాకు మంచి స్నేహితుడయ్యాడతను. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాడిలాగా మాట్లాడేవాడు. అతని మాటలేకాదు చేతలు కూడా నన్ను ఆకర్షించేవి. చిన్న బండివాడి దగ్గర్నుంచి.. సినిమాహాలు ఓనరుదాకా అంత అతడు అనే "ఫోరం" అనే మాటతో బెదిరిపోయేవారు. తద్వారా తను పొందవలసిన హక్కులన్నీ పొందేవాడు.

"మనం అవకాశమిచ్చిన కొద్దీ వీళ్ళు మోసం చేస్తూనే ఉంటారు.. అసలు మోసగాళ్ళను కనిపెట్టి వాళ్ళకి దూరంగా ఉండటం ఎంతో అవసరం..! అది కూడా ఒక కళేననుకోండి..." అంటూ అతను చెప్పే విషయాలు నాకెంతో ఆసక్తిని కలిగించేవి.

అతనిలో ఉన్న ఒకానొక మంచి గుణం కనపడ్డ వారినందరినీ పరిచయం చేసుకోని కలుపుగోలుగా మాట్లాడటం. ఆ కళ అతనికి, అతని చిట్‌ఫండ్ కంపెనీకి ఎంతో సహాయపడింది. అతని చిట్‌ఫండ్ స్కీములు చాలా బాగున్నాయి. ప్రతినెలా లక్కీడిప్‌లు, ప్రతివారికి ఏదోక ప్రైజు.. ఇంకా ఇలాంటి 'ఎట్రాక్షన్స్'తో ఎంతో ఆర్జించటం మొదలుపెట్టాడు. నేను కూడా చాలా స్కీముల్లో దాదాపు ఐదారు వేలు పెట్టాను.

ఒకరోజు నాకొక వాల్‌క్లాక్ ప్రైజ్ తగిలిందన్నాడు.. అన్నటుగానే ఒక వాల్‌క్లాక్ తెచ్చిపెట్టాడు. ఎంతో అందంగా ఉందా క్లాక్. గోడకు తగిన మాచింగ్ కలర్‌లో ప్రతి ఒకళ్ళని ఆకర్షించింది. దాదాపు వారం రోజుల తర్వాత ఉదయన్నే చూసేసరికి ఆ వాచి ఆగిపోయింది. ఏ వస్తువు కొన్నా ఆచితూచి కొనే రామకృష్ణ ఇచ్చిన వాచి ఇలా ఆగిపోవడం ఆశ్చర్యం కలిగించింది.

ఆ రోజు టిఫిన్ చేసి ఆ వాచీతో అతనింటికి బయలుదేరాను. ఇంటిముందు బాగా జనం పోగై ఉన్నారు. వాళ్ళలో తెలిసినతన్ని పట్టుకొని విషయం అడిగాను.

"మీకింకా తెలియదా.. అయ్యో! ఆ రామకృష్ణ మనల్నదరినీ మోసం చేసి డబ్బుతో సహా పరారైపోయాడు.. రాత్రికి రాత్రే ఉడాయించాడు.." అన్నాడు. ఒక్కసారిగా గుండాగినంత పనైంది.

నాకు నమ్మకం కుదరలేదు. గుంపులోకి వెళ్ళేసరికి మధ్యలో పోలీసులు, పేపరువాళ్ళు హడావిడి చేస్తూ కనపడ్డారు. వాళ్ళు కూడా ముందు విన్న మాటల్ని ధృవపరిచారు. కడుపులో బాధను దిగమింగుకొని వాచ్‌షాపుకు వెళ్ళాను. షాపువాడు అంతా ఇప్పదీసి -

"ఇదెక్కడ పట్టుకొచ్చారు సార్.. ఒకా పార్టు సవ్యంగా లేదు.. ఏభైరూపాయలు కూడా చెయ్యదు.." అన్నాడు వెటకారంగా

తల దిమ్మెక్కుతుంటే రామకృష్ణ మాటలు గుర్తొచ్చాయి -

"మోసగాళ్ళను కనిపెట్టి దూరంగా ఉండటం ఎంతో అవసరం.. అది కూడా ఒక కళేననుకోండి.."

(వనిత - ప్రగతి నియోగదారుల కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ - వనిత ఆగస్టు 1995)

Category: