ఏ తరానిదో తెలియదుగాని
ఈ ఇత్తడిబిందె అప్పటి నించీ మా ఇంట్లో జలసేద్యం చేసేది
ఎంతటి ఎండలైనా తడిగుడ్డ కప్పుకోని
తొణకని ప్రేమతో జలదానం చేసేది
మా ఇంటి కొత్తకోడలు చెరువుకెళ్తే
ఆమె నడుముపై సింగారంగా కూర్చోని
వీధి జనం చూపులకు దిష్టి తీసేది
గిలకబావి గట్టుపైన కుదురుగా కూర్చోని
చేదతో తోడిన నీళ్ళను, అమ్మలక్కల కబుర్లను
గుంభనంగా నింపుకోని ఒక్కసారిగా మోసుకొచ్చేది
శీతకాలపు శుభకార్యాలకు
తాను గుండమై వేడినీళ్ళను కాచి పెట్టి
వచ్చిన బంధువులందరికి మంగళస్నానాలు చేయించింది
ఎన్నిసార్లు కిందపడ్డా
ఖంగుమని సొట్టబోయి నొచ్చుకుందే కాని
నీరు నిలిపే పుణ్యకార్యం మాత్రం ఏనాడూ ఆపలేదు
పాపం
ప్లాస్టిక్ బిందెలతో పోటిపడలేని
తన వార్ధక్యపు బాధలన్నీ
అటక పైన చేరాక అందరితో చెప్పుకునేది
***
ఈ రోజు ఇంటి చిరునామా నేల కాక
గాలిలో లేచిన అపార్ట్మెంట్ అయినప్పుడు
బిందెకు జాగాలేక ఇరుకు మనసుతో
అమ్మేద్దామని తీసుకెళ్ళినప్పుడు-
ఇత్తడి బిందె దిగులుగా చూసింది
తన సొట్టకళ్ళలో కన్నీరు నింపుకుంది
(స్వల్ప మార్పులతో అవకాయ్.కాం లో April 16, 2009 న ప్రచురితం)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
15 వ్యాఖ్య(లు):
వాస్తవాన్ని ఎంత బాగా చెప్పారండి. ఇప్పుడెవరు ఇత్తడి సామాను వాడడం లేదు మా అమ్మా వాళ్ళింట్లో మంచినీళ్ళు కూడా ఇత్తడి గ్లాసుల్లో ఇచ్చేవారు. ఎంత బరువుండేవో. చాలా బాగుంది.
మా అమ్మమ్మ గారు ఉండే ప్రాంతం (శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం) లో ఒకప్పుడు ఇత్తడి పాత్రలు తయారు చేసే కంచర వాళ్ళు ఉండే వాళ్ళు. కొలిమిలో ఇత్తడిని వేడి చేసి కరిగించి బిందెలు, చెంబులు, పళ్ళేలు, ఇతర పాత్రలుగా మలిచేవారు. ఇప్పుడు స్టీల్ బిందెలు ఉన్నప్పుడు ఇత్తడి బిందెలు ఎవరు కొంటారు?
మీ కోసం మా ఇంటిలో ఉన్న ఇత్తడి ప్లేట్ కి ఫొటో తీసి, స్కాన్ చేసి, అప్ లోడ్ చేశాను: http://webhosting4india.net/images/brass_plate.png
అబ్బ, కదిలించేశారండీ! నా దగ్గర మా బామ్మగారు కాపురానికి వచ్చినపుడు తెచ్చుకున్న దాదాపు ఎనభయ్యేళ్ళనాటి ఇత్తడి బిందె ఉంది. దాన్ని తోమడం పెద్ద ప్రాసెస్ అని మనవలు, మనవరాళ్ళూ ఎవరూ తీసుకోలేదు.అపురూపంగా నాకు దొరికిన నిధి!
ఇత్తడి బెందెలో ఇత్తడి రాగి కలిసి ఉండటం వల్ల అందులో రెండు రోజులు నిలవ ఉంచిన నీళ్ళ సహజంగా germ free అయి, శ్రేష్టమైన రుచితో ఉంటాయట.
చాలా బావుంది.
అబ్బ, కదిలించేశారండీ! నా దగ్గర మా బామ్మగారు కాపురానికి వచ్చినపుడు తెచ్చుకున్న దాదాపు ఎనభయ్యేళ్ళనాటి ఇత్తడి బిందె ఉంది. దాన్ని తోమడం పెద్ద ప్రాసెస్ అని మనవలు, మనవరాళ్ళూ ఎవరూ తీసుకోలేదు.అపురూపంగా నాకు దొరికిన నిధి!
ఇత్తడి బెందెలో ఇత్తడి రాగి కలిసి ఉండటం వల్ల అందులో రెండు రోజులు నిలవ ఉంచిన నీళ్ళ సహజంగా germ free అయి, శ్రేష్టమైన రుచితో ఉంటాయట.
చాలా బావుంది.
మీరు రాసిన కవితతో ఇత్తడిబిందె కన్నీరు తుడుచుకుని కిల కిలా నవ్వింది!!:)
ఏటి గురూజీ వరస పెట్టి కవితలు రాసి పారేస్తన్నారు? ఢిల్లీ జీవితం అంత ఛండాలంగా ఉందా? ;-)
(నేనెవడ్ని? జి-ఎస్-ఐ-టి-ఆలుమ్ని ;-))
ఢిల్లీ జీవితం చండాలంగా అనిపించడంలో విచిత్రమేముంది? Delhi is one of the most polluted cities of India with highest record of asthma cases.
నేను కూడా ఒక కవిత వ్రాసాను http://sahityaavalokanam.net/?p=160
బాగుంది మీ కవిత, అయ్యో పాపం మా ఇంట్లోని ఇత్తడి బిందె అటక మీద ఇలానే కబుర్లు చెప్పుకుంటుందేమో హఠాత్తు గా దానిని చూడాలనిపించేస్తోంది.. అయ్యో..
వ్యాఖ్యానించిన అందరికీ నెనర్లు. ప్రవీణ్‌గారు మీ ఇత్తడి పళ్ళెం చూస్తే కూచిపూడి నృత్యం చేసే పళ్ళెం గుర్తొచ్చింది.
@ జి.ఎస్.ఐ.టి - ఢిల్లీ చండాలంగా వుంటే కవిత్వం ఎలా పుట్టుకొస్తుందీ..?? అసలు మన లైఫ్ బాగుంటే ఢిల్లీ మాత్రం ఏం చేస్తుంది..?? ;)
అసలు సంగతేమిటంటే మెట్రో రైల్లో వస్తూ పోతూ ఆలోచించుకోడానికి చాలా టైం దొరుకుతోంది.. ఎటొచ్చి వ్రాయడానికే టైం దొరకటంలేదు. కవితైతే తొందరగా అయిపోతుంది కాబట్టి లాగించేస్తున్నా. కథలు రాయడానికి కొంచెం టైం పడుతోంది.
చాలా బాగుందండి.మీ ఇత్తడి బిందె బరువు నామీద పడ్డట్టుంది.మనసంతా భారంగా అయిపోయింది.
గురూజీ
ఇత్తడి బిందె/కాగు లోంచి ఒకరకమైన వాసన. భలే ఉంటుందేం!!
ఇత్తడికాగు తో నీళ్ళు మోసేవాడిని నేను. ఎన్నిసార్లు దాన్ని కిందపడేసానో. సొట్టలుపడి, చిల్లులు పడి. చిల్లు పడినంతవరకు చింతపండుపెట్టేవాళ్ళం. ఇటుకరాయిపొడితోనో, ముగ్గుతోనో కడిగితే ధగధగ మెరిసిపోతూ ఉండేది.
కుంపటి - ఇత్తడి పాత్ర - ఉత్తిపప్పు.
ఐతే ఇత్తడి పాత్రలో మజ్జిగపొయ్యకూడదు అని..
ఇన్ని గుర్తుకుచేస్తే ఎలా?
మీ కవిత అప్పుడే ముగ్గు చింతపండు వేసి తోమిన ఇత్తడి బిందెలా ధగధగ లాడిపోతోంది.
chalabagundi anna......manam patinchukokunda vadilese chinna chinna vastuvulatho alanati marapurani sampradayanni teepi gurtulanu balega ponduparichavu........
ఆనాడు ఊళ్లేలిన ఇత్తడి బిందె ఈ నాడా పదం వివే ఏళ్ళయి పోయింది...
కామెంట్‌ను పోస్ట్ చేయండి