పెసరట్టు చదువుతూ - పుస్తకం తింటూ...

నిన్న ఆఫీసులో పని వుండి కొంచెం ఆలస్యమైంది. ఇంటికెళ్ళినా స్వయంపాకం చేసుకునే వోపిక లేకపోయింది. దగ్గర్లోనే విజయవాడ వారి అమరావతి హోటల్ గుర్తుకొచ్చింది. రిక్షా ఎక్కి అక్కడి చేరుకోని ముందుగా అక్కడే వున్న సౌత్ ఇండియన్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళాను. నాకు కావాల్సిన సరుకులు తీసుకుంటుంటే కొత్తగా వచ్చిన స్వాతి వారపత్రిక కనపడింది. తెలుగుపుస్తకం కనపడితే (అందునా ప్రవాసంలో వున్నప్పుడు) చేతులు ఎలా ఆగుతాయి.?? వెంటనే కొనుక్కోని హోటల్లోకి అడుగు పెట్టాను.


స్వాతి చేతిలోకి రాగానే అనివార్యంగా చూసేవి బాపు కార్టూనులు - ఆపైన కోతికొమ్మచ్చి - తరువాతే ఏదైనా. ఈ వారం కోతి కొమ్మచ్చి పుస్తకావిష్కరణ గురించి ఎంబీయస్ ప్రసాద్‌గారి వ్యాసం కూడా వుంది.


"సార్ ఆడర్ ఇవ్వండి" అన్నాడు సర్వరుడు.


"ఇడ్లీ.. ఇదుగో ప్లేట్లో ఒక మూలగా కొద్దిగా కారప్పొడి కూడా వేసుకొస్తావా?" చెప్పాను.


మళ్ళీ పుస్తకంలోకి -


భలే వుందీ కార్టున్.. బాపుగారికి టీవీ సీరియల్ అంటే మా చెడ్డ కోపం అనుకుంటా - అవి చూసే లేడీస్ మీద ఎన్ని కార్టూన్లు వేసారో.. కోతి కొమ్మచ్చిఎక్కడా కనపడదే - ఆ దొరికింది.


సాక్షి - వారెవా.. అరే ఆమ్యామ్యా అనే పదం కనిపెట్టింది అల్లురామలింగయ్యగారా.. బాగుంది..

"నా రాజ్యం పెళ్ళాం ఇప్పిస్తావా అల్లు రామం?.."ఓహో సుగ్రీవుడన్నమాట.. కార్టూను హ హహ్హదిరింది


"సార్ ఇడ్లీ"


"వీడొకడు మధ్యలో... ఏమైనా ఈడ్లీ తిని ఎన్నాళ్ళైందో.. తెలుగు వారి ఇడ్లీ..!!"


అహా ముళ్ళపూడి బొమ్మ బాపు రచన.. అదేనండి ముళ్ళపూడి మాటలతో బొమ్మలేస్తున్నారు బాపూ బొమ్మల్తో కథలు చెప్పేస్తున్నారు..


ఏమిటిది చట్నీలో నల్లగా - ఒహో పోపు మాడ్చినట్లున్నాడు. సరేలే కారప్పొడి వుందిగా.. ఏదీ?? అర్రెర్రె ఇడ్లీ కింద దాకున్నావా.. వుండు నీ పని చెప్తా..


హ్మ్మ్.. అయితే ఏమంటారు.. సాక్షి సినిమాకి పల్లెటూర్లో అన్నసంతర్పణలు చేసారా? సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల - అదేదో పాటుండాలే - "దయ లేదానీకు దయలేదా..!!" పీబీ శ్రీనివాస్ కదూ పాడింది.


"సార్.. ఇంకేమన్నా కావాలా?"


"పెసరట్టు.. కొద్దిగా వుల్లిపాయలు వేసి"


కోతికొమ్మచ్చి మొదటిభాగం పుస్తకం మాత్రం దొరకలేదు. మొన్నామధ్య నెల్లూరు వెళ్ళినప్పుడు ప్రభవలో దొరుకుతుందేమోనని చూశాను. "రేగడివిత్తుల" చంద్రలతగారిదే కదా ప్రభవ.. అక్కడ రిజిస్టర్‌లో రాసి వచ్చాను తెప్పించమని. తెప్పిస్తే మా వాళ్ళకి చెప్పి కొనిపించి వుంచాలి..!!


పుస్తకావిష్కరణ గురించి చాలా బాగా వ్రాసారు ప్రసాద్ గారు - ఎంత అదృష్టం బాపు రమణల్ని సన్మానించడం వారి చేతులు మీదుగా సన్మానం పొందడం..! వేమూరి బలరాం గారు చాలా గొప్‌ప్‌ప్ఫ పని చేశారు. మళ్ళీ వంశీతో "మా దిగువ గోదావరి కథ"లట. మళ్ళీ బాపు కుంచె ఝుళిపిస్తారు..!!


ఏమిటిది పెసరట్టు మాడినట్లుంది - మాడినా పెసరట్టు అల్లం చెట్ని రుచే వేరు - ఒహో ఇది అల్లం చెట్నీ కాదా సాంబారు కాస్త గట్టిపడినట్లుంది -ఫర్లేదులే -


ఇంతకీ ఏమిటంటారు - రమణగారు మాట్లాడదామని మైకు ముందుకి రావటమే గొప్ప విషయం.. ఈ జనాలు సరిపోయారు ఏకబిగిన అలా చప్పట్లు కొడితే చివర్లో కొట్టే చప్పట్లు అనుకున్నారేమో ఆయన మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయారట. ఏమిటిది నా కళ్ళు చమర్చాయి - అబ్బే లేదు లేదు మిరపకాయ కొరికినట్లున్నా..!! రావికొండలరావు మాష్టరుతో ఏకిభవిస్తున్నా - ఏమిటీ.. కోతి కొమ్మచ్చి అంటూ ఈ బాపూ రమణలు అటూ ఇటూ గెంతుతూ - చక్కగా సూటిగా ఒక్క విషయం చెప్పలేరూ - సాంబారులో ఏమిటిది వుప్పు తక్కువ!!


ఎక్కడిదీ కాఫీ ఘుమ ఘుమ? - నా ముందే పెట్టాడే..! ఒహో నేనే ఆడర్ ఇచ్చానా?ఎప్పుడూ? గుర్తులేదే?

హమ్మయ్య స్వాతిలో నేను చదవాలనుకున్నవి అయిపోయాయి. ఇంక తీరిగ్గా ఇంటికివెళ్ళి మిగిలినవి చదువుకోవచ్చు.

"టిఫిన్ ఎలా వుంది సార్"


"బాగానే వుంది - సాంబారులో వుప్పు తగ్గింది, చట్నీలో పోపు మాడింది, పెసరట్టు ఎక్కువగా కాల్చారు.. ఇదుగో పెసరట్టులో వుల్లిపాయలంటే చిన్నచిన్న ముక్కలుగా తరగాలి - ఇలా పెద్ద పెద్ద ముక్కలు కాదు. కాఫీ రుచిపచి లేదు"

"అది కాఫి కాదు సార్.. టీ"


"ఏదో వొహటి.. చేతులు కడుక్కొస్తా గ్లాసులో కాసిని నీళ్ళు పొయ్యి" అంటూలేచాను. చేతులు కడుక్కోని తిరిగొచ్చేసరికి స్వాతి పుస్తకం మీద నీళ్ళుపడి "రేయ్.." వు-న్నా- "సర్వరా.." యి.


"సార్"


"నీకు కళ్ళు కనపడటంలేదా? పుస్తకం మీద నీళ్ళు పోస్తావా? అదీ బాపుకార్టూన్ తడిసేట్టు పోస్తావా.. నువ్వేం గడ్డి పెట్టినా తిన్నాను.. ఇదామర్యాదా.. ధాం ధూం.."


పెట్టిన టిఫిన్ బాలేకపోయినా ఏమి అననివాడు పుస్తకం తడిస్తే ఎందుకు అరుస్తున్నాడో సర్వరుడికి అర్థం అయినట్లు లేదు.


(బాపూ రమణలకి జయహో)

6 వ్యాఖ్య(లు):

Padmarpita చెప్పారు...

Ha:) Ha:)

durgeswara చెప్పారు...

amte namdi nannu timtoo chadavoddani maa amma ippudu maaaavida sataayistumtaaru .

అజ్ఞాత చెప్పారు...

చంద్రలత గారి బ్లాగు మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ, ప్రభవో, ఇంకేదో అయినా కావాలంటే ఇక్కడికెళ్ళి, ఆవిడకు ఒక కామెంటు కొట్టండి.

http://chandralata.blogspot.com/

Unknown చెప్పారు...

@పద్మార్పిత గారు,
నెనర్లు
@దుర్గేశ్వరగారు
మీ మాట నిజమే.. కానీ చదవాల్సిన విషయం చేతిలో వుంటే ఎలా ఆగగలం చెప్పండి..!!
@అజ్ఞాత
"మడతపేజి" మునుపే చూశాను.. చంద్రలతగారికి ఒక మైల్ కూడా పెట్టాను.. ఇంతకీ విషయం ఏమిటంటే కోతికొమ్మచ్చి పుస్తకం ఆంధ్రదేశంలో ఎక్కడా దొరకటంలేదు..

వేమన చెప్పారు...

చాలా బావుందండీ :)
పెసరట్టు తింటూ పుస్తకం చదువుతుంటే ఆ మజాయే వేరు !

సిరిసిరిమువ్వ చెప్పారు...

ప్రసాదు గారూ, కోతికొమ్మచ్చి పుస్తకం హైదరాబాదులో బాగానే దొరుకుతుందే!