Unknown
"భారత స్వాతంత్ర దినోత్సవం"
"అంటే?"
"అదేరా ఇండిపెండెన్స్ డే"
"అయితే?"
"అందుకని మన కంపెనీలో ప్రత్యేకంగా ఫాన్సీ డ్రస్ కాంపిటీషన్" చెప్పాడు రాజు
"ఫాషన్ షోనా?" తన అమాయకత్వం వెలిబుచ్చాడు సుందరం.
"ఫ్యాషన్ షో కాదురా... ఫాన్సీ డ్రస్.. అదీ మన స్వాతంత్ర సమర యోధుల గెటప్పుల్లో రావాలట"
"బాగానే వుంది.. అయితే నేను ఎన్టీ రామారావు గెటప్పులో వస్తా.."
"ఓరేయ్.. స్వాతంత్ర సమరయోధుడంటే ఎన్టీ రామారావు.. అక్కినేని నాగేశ్వరరావు కాదు..!"
"మరి?"
"అంటే గాంధీ నెహ్రూ... ఇలాగన్నమాట"
"అయితే నేను నెహ్రూ..."
"అలా కాదు.. మన ఆఫీసులో అన్ని రాష్ట్రాల వాళ్ళు వున్నారు కదా.. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం నాయకుడి గెటప్పులో రావాలి.."
"అంటే?"
"అంటే మన శుక్లాజీ వున్నారు కదా.. ఆయనదేమో యూపీ..! అందుకని ఆయన నెహ్రూ గెటప్పులో వస్తాడట.."
"అయితే మన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎవరి గెటప్పు వేస్తే బాగుంటుంది?"
"అదే ఆలోచిస్తున్నా.. మన సరళ లేదు.. ఆవిడేమో సరోజినీ నాయుడు గెటప్పులో వస్తుందట.. నేను టంగుటూరి ప్రకాశం గెటప్పులో వద్దామని..."
"తూచ్.. నేనొప్పుకోను.. నేను ప్రకాశం గెటప్పులో వద్దామనుకుంటుంటే.."
"అహా.. కుదరదు.. నేను ముందే చెప్పేశాను.."
"పోనీ ఇంకెవరైనా వుంటే చెప్పు.."
"పింగళి వెంకయ్య?"
"ఆయనెవరు?"
"వురేయ్.. మన జాతీయ పతాకం రూపొందించిన వ్యక్తి.."
"ఆయన ఎలా వుంటాడో తెలియదే..!!"
"అవును నిజమే.. పోనీ భోగరాజు పట్టాభిసీతారామయ్య?"
"ఈయనెవర్రా బాబు? అసలు తెలియనే తెలియదే..!"
"ఏమోరా.. నాకు ఇంకెవరూ గుర్తులేరు.."
"పోనీ శ్రీశ్రీ?"
"శ్రీశ్రీ ఆత్రేయ చంద్రబోసు.. వీళ్ళు దేశనాయకులు కాదురా.."
"ఆ గుర్తొచ్చింది.. చంద్రబోస్.. సుభాష్ చంద్రబోస్"
"చంద్రబోస్ ఒరిస్సాలో పుట్టిన బెంగాలీ... తెలుగువాడు కాదుగా..?"
"మరి వెంకటేష్ సినిమాలో వేషం వేశాడుగా"
"ఆ చంద్రబోసు.. ఈ చంద్ర బోసు ఒకళ్ళు కాదురా"
"సరే నేనేదో ఆలోచిస్తాలే.."
"సరే రేపు కలుద్దాం"
"బై"
"బై"
***
"ఇడుగడుగో.. ఇడుగడుగో.. ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడిడిగో అగ్గిపిడిగు అల్లూరి.." పాడుకుంటూ వచ్చాడు సుందరం
"వురేయ్ ఏమిటిరా ఈ గెటప్పు" అడిగాడు ప్రకాశం పంతులు గెటప్పులో వున్న రాజు.
"ఏం.. ఇదికూడ తెలియదా.. సూపర్ స్టార్ కృష్ణగారు.. అన్నగారు వేసిన గెటప్పు..అల్లూరి సీతా రామరాజు"
"అది సరే.. ఈ చొక్కా లేకుండా ఈ బాణాలేమిటి? ఈ గడ్డం ఏమిటి?"
"మరి అల్లూరి అంటే క్లీన్ షేవింగ్ చేసుకోని.. జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడా? కరెక్ట్‌గానే వుందిగా"
"వుంది సరే.. ఇలా ఆఫీసుకి చొక్కా లేకుండా వస్తే ఎట్లారా?"
"మరి అల్లూరి సీతారామరాజు చొక్కా వేసుకోడు కదా?"
"కరెక్టే.. అప్పుడు వేరే ఏదైనా గెటప్పు వేసుకోవచ్చుగా?"
"నాకు ఇంకెవ్వరూ గుర్తు రావటంలేదురా... శ్రీహరి సినిమా హనుమంతు గుర్తుకొచ్చింది కాని మళ్ళీ అది నిజం కాదంటావని ఇదుగో ఇలా.."
"అదుగో బాసు వస్తున్నాడు.."
"ఏమిటి సుందరం ఈ గెటప్పు..??" ఇంగ్లీషులో అడిగాడు భగత్‌సింగ్ గెటప్పులో వున్న జస్ప్రీత్.
"మీకేమి సార్.. మీ భగత్‌సింగ్‌కి చొక్కా వుంది.. మా అల్లూరి గెటప్పు ఇంతే మరి"
"అయితే వేరే ఏదైనా గెటప్పులో రావాలి.. ఇలా చొక్కా లేకుండా ఆఫీసుకు వస్తారా? ఇప్పుడు మన ప్రొప్రైటర్గారు వచ్చారంటే ఏం సమాధానం చెప్పాలి?"
"అదుగో ప్రొప్రైటర్ కారు వచ్చింది" చెప్పాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గెటప్పులో వున్న సుబేంద్రు రాయ్.
అందరూ అలెర్ట్ అయిపొయారు. మన సుందరం గుండె గడబిడ గడబిడ అని కొట్టుకుంటోంది..!!
అంతలో -
అక్కడ కారులోనించి చిన్న పంచెతో పైన మరో చిన్న గుడ్డతో, చేతిలో కర్రతో దిగాడు బట్టతల ప్రొప్రైటర్ - జిగ్నేష్ భాయ్..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 వ్యాఖ్య(లు):
Happy Indipendence day
బ్లాగరులందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి