ఇది నా వందొవ టపా - ఆఖరు టపా

"ఓసోస్.. ఏతంతవూ.. వంద టపాలు రాసీసినావా.. ఎలగెలగా..!!"

"యోవ్.. ఏందయ్యానువ్వా.. వంద టపాలు రాయంగానే సరా.. పదిమందైనా చూడబళ్ళేదాంట.."

"ఏంరా భై.. పరేషాన్ జేస్తున్నవ్.. దమాకిట్ల ఖరాబైంద మళ్ళ.. ఎంత మంది జూసిన్రనిగాదు.. ఎన్ని కామెట్లు గొట్టిన్రో జూడాలే.. గప్పుడే టపా మంచిగగొట్టినవా బేకారుగొట్టినవ ఎర్కైతది.."

"అదేమిటండీ మాష్షారూ.. అలాగంటే ఎలాగండీ.. వ్యాఖ్యలూ వ్యాఖ్యానాలు సరేనండీ.. అందులో "భేషుగ్గా వుంద"ని ఎన్ని వచ్చాయి.. "అబ్బే బాగాలేదురా అబ్బి" అని ఎన్ని వచ్చాయి? అది తేల్చండీ ముందు.."

***

"అయ్యా పాఠక మహాశేయులారా.. పుణ్య పోషకులారా.. మా బ్లాగు పాలిటి దేవతలారా..."

"ఏమిటా హరి కథ?"

"అబ్బ చెప్పనిస్తేగా.. ఇది నా వందో టపా.."

"ఓహో ఇలాంటివి చాలా చూశాం.. వంద టపాలు, వెయ్యి హిట్లు అనుకుంటూ.. విషయం చెప్పు"

"చెప్పడానికేముంది.. ఈ విధంబుగా నా బ్లాగును ఆదరించి, అభిమానించి, ఆస్వాదించి, ఆశీర్వదించి.."

"ఇంకా ఏమిటి దించేది.."

"దించడమంటే ఆ దించడం కాదయ్యా.. ఆనందించి, అభినందించి"

"ఈ దించుడు - నంచుడు ఆపి విషయం చెప్పవోయ్"

"అలాగలాగే. ఈ బ్లాగులో నేను కథలు వ్రాసితిని. కవితలు వ్రాసితిని. కబుర్లు వ్రాసితిని"

"ఏమిటది ఏడో ఎక్ఖం వొప్పజెప్పినట్లు? సరిగ్గా చెప్పు."

"ఇలాగైతే నా వల్లకాదండీ... నేను ఏమి చెప్పలేను."

"చెప్పకపోతే ఫో.. నువ్వుకాకపోతే కూడలికి పోతే సవాలక్ష బ్లాగులు"

"అదే చెప్పేది.. ఆ సవా లక్ష బ్లాగుల మధ్యలో మా బ్లాగు నిలబడిందా లేదా"

"ఏమిటి నీ ప్రజ్ఞే.."

"అబ్బే నా ప్రజ్ఞేపాటిది.. ఏదో చదివేవాళ్ళు పదిమంది వుండబట్టి నా రాతలు గాని.."

"పోనీలే సత్యం గ్రహించావు.."

"అది మన పేరులోనే వుంది కదా"

"ఏమిటి"

"సత్యం"

"బాగానే వుంది సంబడం.. పేరు పెట్టుకోగానే సరా? అక్కడికి లక్ష్మీ పేరు పెట్టుకున్నవాళ్ళు చెయ్యెత్తితే డబ్బులు రాలుతున్నట్లు"

"ఇదుగో మా ఆవిడనేమన్నా అన్నావో.."

"ఏమిటీ మీ ఆవిడ పేరు లక్ష్మా? ఏదో తెలియక అన్నానయ్యా బాబు. క్షమించు."
"క్షమించాములే ఫో"

"అది సరేగాని ఇంకా ఎంతకాలమిలా పలక మీద బలపం పెట్టి పిచ్చి రాతలు... దీనికి అడ్డు ఆపు ఏమైనా వుందా?"

"ఎందుకులేదు.. అయినా నా బ్లాగు మూసెయ్యాలనుకుంటున్న విషయం నీకెలా తెలుసు?"

"ఏమిటి నిజంగానే"

"అంత సంతోషపడకు.. ఇదంతా తాత్కాలికమే.. పలక-బలపం మీద రాతలు అయిపోయాయి.. పలక నిండిపొయింది. ప్రమోషన్ వస్తే కలం-కాగితం పట్టుకుంటా. లేకపోతే మళ్ళీ ఇదే క్లాసుకి వచ్చి పలకమీద రాతలన్నీ కడుక్కోని మళ్ళీ మొదట్నించి మొదలెడతా.. అంతదాకా శెలవలే శలవలు.."

(శలవు)

14 వ్యాఖ్య(లు):

జ్యోతి చెప్పారు...

అదేంటి వంద టపాలు ఒకె. అభినందనలు. అఖరు అనే మాట ఒప్పుకునేది లేదంటే లేదు. కొద్ది రోజులు సెలవులు తీసుకుని ఫ్రెష్ గా వచ్చేయండి కొత్త రాతలతో..

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

తథాస్తూ.... శీఘ్రమేవ కలం కాగితం ప్రాప్తిరస్తూ.....
all the bestoo........... :)

durgeswara చెప్పారు...

ఇలా ప్రతివాల్లూ అలిగిపోతే కూడలివారేమిగాను ?

Shiva Bandaru చెప్పారు...

బావుంటాయండి మీ పోస్టులు. ఈ ఒక్క కామెంటూ వందకామెంట్ల కింద లెక్క, ప్రతీ పోస్టుకు ఒకటి.

శత పోస్టులు సందర్బంగా క్రమం తప్పకుండా ౩ బ్లాగులు , వందలాది పోస్టులు చేస్తున్న మీకు "బ్లాగుధీర" బిరుదు ఇస్తున్నాము . :)

కొత్త పాళీ చెప్పారు...

Congrats on 100th.
Please don't stop writing. Take a break if you want, but do continue writing.

Bhãskar Rãmarãju చెప్పారు...

నూరటపాల వీరతాడు అందుకోండి..
కొట్టుమూసేయడం దేనికీ అంటా!!
కొంతకాలం శెలవలు ప్రకటించండి కావాలంటే.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఆభినందనలు.పదోన్నతి ఇచ్చేశాం పుచ్చుకోండి.పలక బలపం పాతదయింది,కాగితం కలం కూడా పాతదే అయిపోయింది ఇక మానిటర్ కీబోర్డులిచ్చేశాం పుచ్చుకొని విజృంభించండి.

రవి చెప్పారు...

వంద వీరతాళ్ళు. నేనూ మీ గ్యాంగే. నూరు టపాల గ్యాంగు. కొన్ని రోజులు రెస్టు తీసుకుని మళ్ళీ వచ్చేద్దాం. టోటల్ గా మానెయ్యకండి ప్లీజ్.

Anwartheartist చెప్పారు...

సత్య ప్రసాద్ గారు వొ నాలుగు రొజులు డిల్లి లొ కాపురం పెట్టబొతున్నా, మీరూ డిల్లి లోనే వున్నారని చిన్న అనుమానం మీ ఫొన్ నంబర్ ఇస్తే కలుస్తా, మీరు తీరిగ్గా వుంటేనే నా mail id indianinker@gmail.com.

cbrao చెప్పారు...

"ప్రమోషన్ వస్తే కలం-కాగితం పట్టుకుంటా." -ఏమి ప్రొమోషన్ ఆశిస్తున్నారు? బ్లాగులు వ్రాసి వ్రాసి అలసినారా? కొన్నిరోజులు మా ఇంట గడిపివెళ్లండి . కొత్త ఉత్సాహంతో బ్లాగులొకంలోకి అడుగెట్టండి.

Unknown చెప్పారు...

రాయడం ఆపవద్దని ఇంతమంది కోరటం ఆశ్చర్యంగానూ, ఒకింత గర్వంగానూ వుంది. దుర్గేశ్వర మాష్టరూ.. నేనెవరిమీద అలగలేదండి.. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం లాగా ఇదీ ఒక రకమైన వైరాగ్యం - బ్లాగు వైరాగ్యం. అట్టే కాలం వుండదనే అనుకుంటున్నాను..!!

నిజం చెప్పద్దూ ప్రస్తుతం వేరే కార్యక్రమం మొదలెట్టాను. రెండు పడవల మీద ప్రయాణం సాధ్యం కాదని ఇలా విరమణ ప్రకటన చేశాను. నేను మొదలెట్టిన మరో కార్యక్రమం ఏమిటో అది పూర్తయ్యాక చెప్తాను. అది విజయవంతమవడమే ప్రమోషన్.. అది వస్తే తిరిగి వస్తాను.

హాస్యదర్బార్ కూడా త్వరలోనే ముగించబోతున్నాను.

బ్లాగులు చూడటం మాత్రం మానట్లేదు కాబట్టి అడపదడప కామెంట్లతో కలుస్తాను.

సర్వేజనా సుఖినోభవంతు.

మంచు చెప్పారు...

""నిజం చెప్పద్దూ ప్రస్తుతం వేరే కార్యక్రమం మొదలెట్టాను"" అంటున్నారు ?? పుస్తకం ఎమయినా రాస్తున్నారా ?..
మీరు రాసిన కర్పొరెట్ కాశిమజిలి కథలు బుక్ గా వస్తె బాగుండును అనుకునే వాడిని.
Anyway -
I want to Thank you for spending your valuable time in sharing lot of knowledge and for you patience in explaining all our doubts. I wish you best of luck for your next project.

Vasuki చెప్పారు...

మీరు 100 టపాలు పూర్తిచేసినందుకు అభినందనలు. మరి మానేయడం దేనికి ద్విశతకం పూర్తిచేయండి. నాకో అనుమానం మీ 100వ వ్యాఖ్యని నా టపాలో కాని వ్రాసారా ఏమి. ఇకపై వ్యాఖ్యలు కూడా వ్రాయనంటారేమో అని భయం. కొద్ది ఆలోచించండి.

అజ్ఞాత చెప్పారు...

కొట్టుమూసేయడం దేనికీ అంటా!!
కొంతకాలం శెలవలు ప్రకటించండి కావాలంటే.

very nice comment.(so copy and pasted ditto ditto, and also I forgot how to type in telugu)

prasad garu,

apoddu babu mee bandini.

kaumudi lo ketaki chusanu.bagundi.

with regards
Prasad Indore mar 21 2010