నమో (వి)నాయకా



వినాయకుడి వేష భాషలు చూసి అనుకున్నారో లేక ప్రాస కోసం వాడుకున్నారో కాని వినాయకుణ్ణి, రాజకీయ నాయకుణ్ణి కలిపి తల్చుకోవడం మనకి అలవాటైంది. అసలు వినాయకుడికి నాయకుడికి గల సంబంధం ఏమిటా అని ఈ మధ్యకాలంలో చాలా ఆలోచన చేశాను. నిజానికి వినాయకుడికి రాజకీయ నాయకుడికి కొంత సంబంధం లేక పోలేదు. చాలామంది రాజకీయనాయకులు తమ మొదటి సంపాదన గణేష్ పూజ చందాలతోనే మొదలు పెట్టి వుంటారని ఒక సర్వేలో తెలిసింది. అక్కడినుంచి పేట రౌడీలుగా ఆ పైన గూండాలుగా తరువాత ప్రజా ప్రతినిధులుగా రూపాంతరం చెందివుంటారని ఆంధ్ర డార్విన్ ఒకాయన శెలవిచ్చారుట.

అసలు వినాయకుడి తయారీలోనే ఏదో గడబిడ వుంది... మిగతా అందరిలా కాక పసుపు ముద్దతో మ్యానుఫాక్చరింగ్ జరిగింది. తయారు చేసింది అమ్మల గన్న అమ్మ. సరే బొమ్మ చేసి వూరుకోక ప్రాణం పోసింది. ఆయనగారేమో వెంటనే సెక్యూరిటీ డ్యూటీలో చేరిపోయి సాక్షాత్తూ పరమేశ్వరుణ్ణే ఆపేశాడు. అసలు ఇప్పుడు మాల్స్‌లోనూ, సినిమాహాళ్ళలోనూ వుండే సెక్యూరిటీని చూసి చిరాకు పడతాం కానీ సాక్షాత్తూ పరమేశ్వరుడికే ఆ కష్టం తప్పలేదని మనం మర్చిపోతుంటాం. సరే కథలోకి వస్తే పరమేశ్వరుడు అప్పుడే గజాసురుడి వుదరరచెర నుంచి వచ్చినవాడవటం చేత కొంచెం చిరాకు పడి, వినాయకుడి తల తెంచి ఆపైన గజాసురుడి తలతో సర్జరీ చేయించాడు. వినాయకుడిలాగానే రాజకీయనాయకుడి మానుఫాక్చరింగ్ గడబిడలేమైనా వున్నాయని అనుమానం నాకు. ఆయన భయం, భక్తి లేకుండా తండ్రి శివుణ్ణే ఎదిరిస్తే, వీళ్ళు సిగ్గు శరము లేకుండా వోట్లకోసం దేబరిస్తుంటారు.

అయినా వినాయకుడికి వేరే ఏ తల దొరకనట్టు ఏనుగు తల ఎందుకు పెట్టారో అర్థం కాదు. తరువాత తరువాత వినాయకుడు తలకి మాచింగ్‌గా శరీరాన్ని మలచుకున్నాడా, లేక అప్పటికే భారీగా వున్న శరీరాన్ని చూసి పరమేశ్వరుడు ఏనుగు తల ఎన్నుకున్నాడా అని ఒక పురాణ సందేహం. సరే ఏమైతేనేం మొత్తానికి గణేషుడి రూపం అది - ఏనుగు తల, బాన కడుపు, అమిత భోజనం, భుక్తాయాసం.

ఈ శరీరాకృతి మన రాజకీయ నాయకుల శరీరాకృతితో సరిపోవటం మనం గమనించాల్సిన ముఖ్యమైన సామీప్యం. లంబోదర లక్షణం ప్రస్ఫుటంగా ఇద్దరిలోనూ కనిపిస్తుంది. రాజకీయనాయకుణ్ణి చూస్తే పదవి వచ్చిన తరువాత పొట్ట పెరిగిందా లేక పొట్ట పెరిగిన తరువాత పదవి వచ్చిందా అని అనుమానం రావటం సహజం. (మరి పోలీసులూ కూడా అదే కోవకి వస్తారని అనుమానం మీకు రావచ్చు అందుకే మరింత వివరం ఇస్తున్నాను).



సరే ఆ విషయాన్ని అక్కడే వదిలిపెట్టి తరువాత సంగతి చూద్దాం. తరువాత కథ, మనం ప్రతి వినాయకచవితికి చదువుకునేదే - విఘ్న నాయకత్వం ఎవరికివ్వాలనేది. అప్పట్లో ప్రజాస్వామ్యం అంతగా పట్టుబడక పోవటం చేత, శివుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టి రమ్మని ఆజ్ఞాపించాడు. వినాయకుడు అంత కష్టపడకుండా తల్లి దండ్రుల చుట్టూ తిరిగి ప్రపంచమంతా తిరిగిన పుణ్యాన్ని పొందాడట. (కాదు తన లాప్‌టాప్‌లో గూగుల్ ఎర్త్ తీసి దాని చుట్టూ తిరిగాడని ఒక సాంకేతికుడి ఉవాచ - నమ్మకండి). ఇంతా చెప్పొచ్చేదేమిటంటే పదవికోసం ప్రదక్షణాలు చెయ్యటం అనే సాంప్రదాయాన్ని వినాయకుడే ప్రారంభించినట్లు, అదే సాంప్రదాయం నాయకులూ పాటిస్తున్నట్లు తెలియవస్తోంది.

విఘ్న నాయకత్వం వచ్చిన తరువాత అమితాహారం భుజించి, కుడుములు స్వాహా చేసి భుక్తాయాసంతో ఆయన పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదని మనం విని వున్నాం. సరిగ్గా అదే విధంగా పదవిలోకి రాగానే తెగ తినడం రాజకీయ నాయకులకు అలవాటైంది. మరో విశేషమేమంటే ఇలా తిన్న నాయకుణ్ణి వేలెత్తి చూపించినా, గట్టిగా నవ్వినా చంద్రుడికి పట్టిన గతే మనకీ తప్పదు. అంతే కాదండోయ్ వినాయకుడు తన శరీరాకృతిని మర్చిపోయి చిన్న ఎలుకనెక్కి తిరిగినట్టే మన నాయకులు కూడా అల్పప్రాణి అయిన సామాన్యుడి నెత్తినెక్కి తిరుగుతున్నారు. కాబట్టి నా బ్లాగులో మొదటి ప్రార్థనగా -

శుక్లాంభర ధరం విష్ణుం: తెల్లని బట్టలు ధరించేవాడు - ఖద్ధరు తెలుపు రాజకీయ నాయకుడి యూనీఫాం కదండి..!
శశి వర్ణం: మరే చంద్రుడి వర్ణమట - నిజమే..!! పగలంతా పూర్ణ చంద్రుడు పొద్దు గుంకితే అమావాస్య చంద్రుడు
చతుర్భుజం: నాలుగు చేతులు - అందుకే నాలుగు చేతులా దోచుకుంటున్నాడు
ప్రసన్న వదనం: ఇక చెప్పేదేముంది - అసంబ్లీలో ప్రతిపక్షం అరిచినా, స్కాముగుట్లు రట్టైనా, పదవి వున్నా వూడినా ప్రసన్న వదనానికి ఇంచుకైనా మచ్చ రాదు కదా?
ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే: అయ్యా అట్లాంటి మీకు దణ్ణం పెడతా - రింగురోడ్లని నా పొలం పనులకి విఘ్నం తీసుకురాకు, సెజ్‌లని నా ఇంటి ఆశలు ముంచవద్దు, బడ్జట్లని నా కోరికలను తుంచవద్దు.. నీకు దణ్ణం పెడతా..!! నీ కాల్మొక్కుతా..!!

10 వ్యాఖ్య(లు):

Malakpet Rowdy చెప్పారు...

కేక!

సత్యప్రసాద్ అరిపిరాల చెప్పారు...

@ మలక్‌పేట్: ప్రతికేక

సుజ్జి చెప్పారు...

:D Good Begin Sir..

Shiva Bandaru చెప్పారు...

:)

కొత్త పాళీ చెప్పారు...

బాగుంది.

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

సత్యప్రసాద్ గారు:

Welcome back.

సున్నిత విమర్శ, సునిశిత దృష్టి కలిసిన ఈ పోస్ట్ బాగుంది.

సత్యప్రసాద్ అరిపిరాల చెప్పారు...

అభినందించిన అందరికీ కృతజ్ఞతలు.

krishna చెప్పారు...

ఇప్పుడే మీ'మోసెవారెవరు రా?'కి కామెంటా!మళ్ళీ 'చాలా బాగుందీ అనడానికి బోరెడతుంది.ఇలా కాకుండా ఇంకోలా మీకు రాయడం రానట్టు వుందండీ!

www.raju చెప్పారు...

:) మీ విశ్లేషణ బాగుంది. చాలా రోజుల తర్వాత తెలుగు బ్లాగులలో మంచి టపా(లు) చదివాను. దీనికి ముందు మోసేయ్యటం చదివా. హాస్య రచన కి కావలసినది నిశిత పరిశీలన...అది మీ టపాలలో కనబడుతుంది.

vasantham చెప్పారు...

chaala bagundi..