Unknown
నేను ఇలా అంటే మీకందరికీ కోపం రావచ్చు.. నా దేశభక్తి మీద అనుమానం రావచ్చు.. నాకేదో ఉగ్రవాద సంస్థలతో లింకులున్నాయని పుకార్లు పుట్టచ్చు. కానీ నేను చెప్పేది నిజం. అవును, కసబ్‌కి విధించిన వురిశిక్ష.. అదే నాలుగు వురిశిక్షల గురించే నేను మాట్లాడేది. నేను ఎందుకలా మాట్లాడుతున్నానో కొంచెం వివరంగా చెప్తాను వినండి.. ఆ తరువాత మీరు ఏమన్నా పడతాను..!!
అసలు చట్టం ఎందుకు వున్నట్లు? శిక్షలు ఎందుకు పెట్టినట్లు? ఎవరైనా తప్పు చేస్తే వాడికి అందుకు ప్రతిఫలంగా శిక్ష విధిస్తే చెల్లుకి చెల్లు అయిపోతుందనా? కాదు..! ఫలానా తప్పుకు ఫలానా శిక్ష పడుతుందని తెలిస్తే ఆ తప్పు చెయ్యకుండా వుండేందుకు. ఫలానా వాడి కన్ను తీశావు కాబట్టి నీ కన్ను తీస్తాను, కాలుకి కాలు అంటూ చెల్లు కి చెల్లు కొట్టే శిక్షలు భారతదేశంలో లేవు. మన శిక్షలన్నీ తప్పు చెయ్యకుండా ఆపడానికే కాని, తప్పు చేసినవాడిని శిక్షించడానికి కాదు. ఎవరికైనా పడిన శిక్ష ఆ వ్యక్తికి పశ్చాత్తాపాన్ని కలిగించినా లేకపోయానా, అలాంటి తప్పు చెయ్యడానికి ఇంకెవ్వరూ ముందుకి రాకుండా చెయ్యడామే ఆ శిక్ష ప్రధమోద్దేశ్యం.
మనం చేసే ప్రతి పనికి ఒక పర్యవసానం వుంటుందని ఇంతకు ముందు టపాలో చెప్పాను. ఆ పర్యవసానం మన మీద వుండచ్చు, మన ఇరుగు పొరుగు మీద వుండచ్చు, తరువాతి తరాలమీద వుండచ్చు అని కూడా విన్నవించాను. అసలు తప్పు అనే చర్య ఏమిటి అని ఆలోచిస్తే ఆ పని యొక్క చెడు పర్యవసానం పది మంది మీద పడి, దాని వల్ల జరిగే మంచి కేవలం ఒక్కడికే కలిగితే ఆ పని తప్పుగా నిర్ణయించవచ్చు. (ఇది అర్థం కావటం కష్టమే అయినా, కొంచెం ఆలోచించండి, మరో టపాలో వివరిస్తాను). వుదాహరణకి బస్సు ఎక్కడానికి లైన్లో నిల్చున్నాం అనుకోండి ఎవడో ఒకడు లైనుని కాదని తోసుకుంటూ వెళ్ళి బస్సులో సీటు పట్టుకుంటాడు. ఈ చర్య వల్ల నష్టం లైన్లో నిలబడ్డవారికి - సీటు న్యాయంగా దొరకాల్సినవాడికి దొరకకపోవటం, లైన్లో వున్న మరికొంతమంది బలవంతులు లైను తప్పి తోసుకోవడం, స్థూలంగా లైన్లో రావాలి అన్న సామాజిక బాధ్యతకి విలువ తప్పిపోవడం - ఇవీ నష్టాలు. కానీ అదే చర్యకు "పాసిటివ్" పర్యవసానం ఆ లైను తప్పినవాడికి - సీటు దొరకడం ద్వారా లభించింది - లాభించింది. అదువల్ల ఇది తప్పు - ఈ తప్పుని శిక్షించాలి.
ఎలా శిక్షించాలి? అతనికి ఏదైతే లాభం కలుగుతోందో ఆ లాభాన్ని లేకుండా చెయ్యాలి - లేదా ఆ లాభానికి సరిపడ విలువైనదేదైనా అతనిని నుంచి తీసుకోవాలి. అది ఫైన్ కావచ్చు, బస్సులో ఎక్కిన వారంతా అసహ్యించుకోవడం కావచ్చు, లేదా బస్సు యాజమాన్యం ఒక ప్రకటన చెయ్యవచ్చు - లైన్లో వచ్చిన వారికి సీటు, రాని వారు నిలబడాలి అని. అంటే ఏదైతే "ఆశించే ప్రవనర్త (Desired behaviour)" వుంటుందో ఆ ప్రవర్తనని అభినందిస్తూ "పాజిటివ్ ఇన్సెంటివ్ (Positive Incentive)" ఇవ్వడం, లేదా ఎవరైతే "ఆశించే ప్రవర్తన"కు భిన్నంగా ప్రవర్తిస్తారో వారికి "నెగటివ్ ఇన్సెంటివ్ (Negative Incentive)" ఇవ్వడం అనే రెండు విధానాల ద్వారా మనిషి ప్రవర్తనని నియంత్రిచడమే చట్టం, న్యాయ వ్యవస్త అన్నీనూ. ట్రాఫిక్ పోలీసు ఫైన్ వేసినా, టికెట్టు లేని ప్రయాణం నేరం అందుకు రూ 500 వరకూ జరిమానా అంటూ బోర్డులు పెట్టినా అవన్నీ ఇందుకే.
అయితే ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ "నెగెటివ్ ఇన్సెంటివ్" ఆ తప్పు చేస్తున్న వ్యక్తికి లభిస్తున్న లాభానికి కనీసం సమానంగా, ఆ ఫలితానికి వ్యతిరేకంగా వుండాలి (atleast equal but opposite). సమానం అనేది ఆర్థికంగా మాత్రమే కాకపోవచ్చు. బాగా డబ్బున్న వాడు కారులో రాంగ్ సైడ్ వెళ్తే అతనికి ఐదువందల రూపాయల జరిమానా వేస్తే అతనికి అదేం పెద్ద లెఖ్ఖ కాదు. డబ్బులు పడేసి దర్జాగా పోతాడు. కావాలనే రోజూ రాంగ్ రూట్లో వచ్చి "ఆఫ్ట్రాల్ అయిదొందలు" పడేసిపోతాడు. అదే అతనిని కార్లో నించి దించి ఒక గంట ఎండలో నిలబెట్టి (ఇదుగో మా ఎస్సైగారు వస్తున్నారు, అదిగో సీయం కారు వస్తోంది అంటూ..)కావాలనే తాత్సారం చేసి, డబ్బులు తీసుకోకుండా పంపించినా మళ్ళీ అటు వైపుకి రావాలంటే జంకుతాడు. ఇలా జంకి "తప్పు" పనులు చెయ్యకుండా వుండటమే శిక్షల వుద్దేశ్యం.
కసబ్ సంగతి చెప్తూ ఈ కథలన్నీ ఏమిటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. మన న్యాయస్థానం కసబ్‌కి వురి శిక్ష విధించింది. వురి అనే ప్రాణం తీయటం నిజంగానే పెద్ద శిక్షా? అని ప్రశ్నఒకటుంది. సరే అది అక్కడే వుంచి - అసలు కసబ్‌కి వురి నిజంగా శిక్షా అని ఆలోచిద్దాం. ఒకసారి టెర్రరిస్ట్ దృష్టితో చూడండి -
కసబ్ టెర్రరిస్ట్ ట్రైనింగ్‌లో ఏమని చెప్పి వుంటారు - "మన జిహాద్ అనే పవిత్ర యుద్ధం కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధం అవ్వాలి" - అని వుర్దూలో చెప్పి వుంటారా? దానికి సిద్ధపడే కసబ్ భారతదేశానికి వచ్చాడా? వాడు సిద్ధపడ్డ చావుని వాడికే ఇచ్చి దాన్ని శిక్ష అని అంటే హాస్యాస్పదంగా కనిపించడంలేదూ? అతన్ని చంపడం ద్వారా ఉగ్రవాదులకి మన ప్రభుత్వం ఇచ్చే సందేశమేమిటి? "కసబ్‌ని చంపారూ రేపు మనల్ని కూడా చంపుతారు" అంటూ ఉగ్రవాదులు గజ గజ వణుకుతారా? లేదే..!!
ఉగ్రవాదం కోరుకునేదేమిటి? ముంబై తరహా చర్యల వల్ల ఏం సాధిస్తారు?
- భారతదేశానికి ఆర్థిక, రాజకీయ పరంగా నష్టం కలిగించడం
- భారతదేశ సార్వభౌమత్వాన్ని, మిలటరీ వ్యవస్థని ఎదిరించి వీలైతే వాటిని తక్కువ చేసి చూపించడం
- ముఖ్యంగా ప్రజలలో ఆందోళన, భయాన్ని సృష్టించడం తద్వారా అస్థిరత్వాన్ని తీసుకురావడం
ఇక ఆత్మాహుతి దాడి చెయ్యడానికి కారణం?
- తమ సిద్ధాంతాల, పైన చెప్పిన ఆశయాల సాధనకి ప్రాణాల్ని సైతం బలిపెట్టగలం అని ప్రకటించుకోవడం
- తమ ప్రాణాలని సైతం లెఖ్ఖ చెయ్యని తీవ్రవాదాన్ని చూసి ప్రజలు మరింత భయపడేలా చెయ్యడం
- చావుకైన సిధ్ధపడ్డ వాళ్ళని చూపించి, ఈ పోరులో చనిపోయిన వారిని చూపించి తమ ఆశయాలకు, సిద్ధాంతాలకు మరింత బలం చేకూర్చుకోవటం, మరింత మందిని ఇలాంటి చర్యలకు సిధ్ధం చేసుకోవడం
తీవ్రవాదం ఆశయాలు, కోరికలు ఇవైనప్పుడు మనం ప్రకటించే ఈ తీర్పు ఈ ఆశయాలకు కనీసం సమానంగా, వ్యతిరేక దిశలో వుండాలి. వుందా?
లేదే..!!
లేకపోగా మన తీర్పు తీవ్రవాదులు కోరుకున్న ఆశయాలకు బలం ఇచ్చేదిగా వుంది.
ఎందుకంటే.. ఇప్పుడు టెర్రరిస్ట్ కేంపుల్లో కసబ్ ఒక అమర వీరుడు.. అతని స్ఫూర్తితో మరింతమంది చావడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు టెర్రరిట్ ట్రైనింగ్‌లో - "మీరు చావడానికి సిద్ధపడండి, వీలైనంతమందిని చంపి మీరు ఆత్మాహుతి చేసుకోండి.. అలా చంపి చావడమే మన యుద్ధ న్యాయం.. ఒక వేళ దొరికిపోతే భారతదేశమే మిమ్మల్ని చంపుతుంది.." అంటూ కొత్త పాఠాలు చెప్తారేమో.
ఇప్పుడు ఆత్మహత్య చట్ట రీత్యా నేరం, అందుకని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్న వాడికి ఉరి శిక్ష వేస్తే ఎలా వుంటుంది? జడ్జిగారు - "ఆత్మహత్యా యత్నం నేరం కింద నిన్ను వురి తీస్తున్నాను" అంటూ తీర్పు ఇస్తే ఆ ముద్దాయి కూడా నవ్వుకోడా? నిజమైన తీవ్రవాది అయితే కసబ్ కూడా అలా నవ్వుకుంటాడేమో?
ఈ వురి శిక్ష కారణంగా పాకిస్తాన్ గజ గజ లాడుతుంది, ఉగ్రవాదులు ప్యాంట్ తడుపుకుంటారు, అమెరికా పాకిస్థాన్‌కి ఆర్థిక సాయం ఆపేస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది వున్నారు - టీ.వీలో కనిపిస్తుంటారు. వాళ్ళను చూసి జాలి పడటం మినహా నేను చెయ్యగలిగిందేమి లేదు. భారతదేశంలో జరిగిన ఒక నేరము-శిక్ష కారణంగా అంతర్జాతీయ రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టి పాకిస్తాన్, అమెరికాలు చేతులు కట్టుకోని నిలబడతాయంటే అంత కన్నా పెద్ద జోక్ లేనే లేదు.
ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం (న్యాయమైనా అన్యాయమైనదైనా) చేస్తున్న వారిని ప్రభుత్వం చంపేస్తే ఆ పోరాటాలు మరింత బలంగా తయారయ్యాయి, ఆ చనిపోయిన వాళ్ళు ఆ పోరాటనికి అమర వీరులయ్యారు. ఆ విషయం భారతదేశంతో సహా ప్రపంచ దేశ చరిత్రలన్నింటిలోనూ వుంది..! రేపు ఉగ్రవాదులకు కూడా కసబ్ ఒక అమర వీరుడే అవుతాడు.. ఈ పాటికే భారత న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పుకి తీవ్రవాదులు పండగ చేసుకుంటుంటారు. కసబ్ నిజంగా కరడు గట్టిన తీవ్రవాదే అయితే ఈ తీర్పుకి అప్పిలు అడగడు.. ఆనందంగా వురి తగిలించుకుంటాడు... ఎందుకంటే అతను చంపడానికీ, చావడానికే కదా భారతదేశానికి వచ్చింది. చంపడం అతను చేశాడు, అతను చావడం అనే కోరిక మాత్రం ప్రభుత్వం తీరుస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 వ్యాఖ్య(లు):
మరీ ధర్మసందేహాల్ని కలిగిస్తున్నారు గురువుగారూ!
మరి ఏమి చేయాలంటారు
మీ విశ్లేషణ బాగుంది. కానీ ఇంతకన్నా గొప్ప తీర్పు మన ప్రభుత్వం నుండి ఆశించటం కష్టమే !!
మీరు చెప్పినది నిజమే
అరిపిరాల గారూ, మీ వాదనా పటిమ అద్బుత౦. దీనికి పరిష్కార౦ కూడా మీ మాటల్లోనే వినాలని ఉ౦ది.
Satya Prasad garu,
Next tapaa, twaraga post cheyyandi ....or else, we may following kind of news about Kasab as well !
http://www.eenadu.net/story.asp?qry1=23&reccount=37
-Sriram
అసలు వాడు అంతమందిని చంపుతున్న వీడియో దొరికీ, వాడూ దొరికాక చాదస్తం కాకపోతే అప్పుడే చంపి అవతల పారేయక ఇంత ప్రజాధనం ఖర్చుపెట్టి ఇంత విచారణ జరిపి, జైల్లో వాడు చావకుండా చూసి, వాడు అడిగిన బిర్యానీలు పెట్టి...ఇదంతా చూస్తూ పాకిస్తాను అంతా దొర్లి దొర్లి నవ్వుకుని ఉంటుంది.
వాళ్ళకు వాడెప్పుడో చచ్చినవాళ్లలో జమ!
దాడులు జరిగినపుడే అదే వూపులో చస్తానని అనుకుని కదా వాడొచ్చింది? అప్పుడేమో చావకుండా దొరికాడు. ఇన్నాళ్ళు జైల్లో ఉండేసరికి ప్రాణం మీద తీపి పుట్టింది. రాఖీలు కూడా కట్టించుకోవాలనే కోరిక పుట్టింది అయ్యవారికి. ఎంత తీపి లేకపోతే ఉరిశిక్ష వేశామని చెప్పగానే హృదయ విదారకంగా ఏడుస్తాడు?
చదువరి గారు,
వీడిని జైల్లో ఉంటే ఇంకెవర్నో కిడ్నాప్ చేసి విడిపించుకునేంత సీన్ ఉందంటారా వీడికి? వీడేమీ వ్యూహకర్త కాదు కదా! వ్యూహాన్ని అమలు పరిచిన చిన్న పావు. వీడు ఉన్నా చచ్చినా ఒకటేగా వాళ్ళకి? పైగా వీడికి పెద్ద తలకాయల పేర్లు, రహస్యాలు తెలిసే అవకాశాలు కూడా తక్కువే!
ఈమాత్రం దానికి యండమూరి ని ప్లాన్ అడిగితే ఈ మొత్తం విచారణ కి అయినదానికంటే ఎక్కువ ఫీజు అడుగుతాడు. :-))
కాకపోతే నిర్దోషులుగా బయట పడ్డ ఇంటిదొంగల మీద ఇంకా విచారణ జరగాలని,వాళ్ళ మీద వాళ్ళ చర్యల మీద నిఘా ఉండాలని నా డిమాండ్!
plz read for information on following blogs
gsystime.blogspot.com - telugu
galaxystimeblogspot.com - english
galaxystartime.blogspot.com - animation engines
Thanks
కామెంట్‌ను పోస్ట్ చేయండి