నీకు ఫ్రీ... నీకు ఫ్రీ...




ఎక్కడైనా ఉచితం అన్న మాట కనపడితే మన చూపు క్షణంకాలమైనా అక్కడ ఆగకుండా వుండదు. ఊరికే వస్తే ఫినాయిల్ కూడా తాగుతారని మనం తరచుగా చెప్పుకునే సామెత ఒకటి వుండనే వుంది. ఈ విషయం బాగా తెలిసిన వ్యాపారస్తులు ఒక సబ్బు కొంటే మరో సబ్బు ఫ్రీ అని ప్రకటించేస్తుంటారు. ఇప్పుడిప్పుడే ప్రతి లావాదేవీల్లోకీ కంజూమరిజం ఎగపాకుతోంది కాబట్టి త్వరలోనే పురుడు పోసుకుంటే పీడియట్రిస్ట్ ఫ్రీ అనే రోజులు కూడా దాపురించచ్చు.

అసలు ద్రౌపది స్వయవరం అర్జునుడు గెలిస్తే బోనస్‌గా నలుగు భర్తలు ఫ్రీగా దొరికారని మొన్న ఒక కొంటె కోణంగి నాతో అన్నాడు. బహుశా అదే ఇలాంటి ఫ్రీ సాంప్రదాయానికి మూలమేమోనని కొత్త ప్రతిపాదన కూడా చేశాడు. విషయం తెలిసిన ఒక పెద్దాయన - "కాదు కాదు... మహా భారతంలో అంతకు ముందే భీష్ముడు సత్యవతితో మా నాన్నని పెళ్ళి చేసుకుంటే నీ కొడుకులకి రాజ్యం ఫ్రీ అన్నాడు కాబట్టి అది ఫ్రీ సాంప్రదాయానికి మొదలు" అని వివరించాడు.

"అయ్యో రామా... ఇంతకన్నా ముందు రామాయణంలొనే ఉచిత పధకాలు అమలులో వున్నాయి" అని మరో మహానుభావుడు చెప్పుకొచ్చాడు. ముక్కు కొయించుకుంటే చెవుల కటింగ్ ఫ్రీ ఆఫర్ లక్ష్మణుడు శూర్పణకకి ఇచ్చాడనీ, చూసి రమ్మని చెప్పిన రాముడికి హనుమంతుడు కాల్చి రావటమనేది ఫ్రీగా ఇచ్చాడని ఆయన వాదన. ఈ ఉచిత పధకాల ఆవిర్భావానికి సంబంధించి రీసర్చ్ చేసి పీ.ఎచ్.డీ సంపాదించే పనిలో వున్నాడాయన.

ఏది ఏమైనా ఉచిత పధకాలను సందర్భోచితంగా వాడేది ఇద్దరే - ఒకరు కార్పొరేట్లు, మరొకళ్ళు ప్రభుత్వాలు. మధ్యాహ్నం ఉచిత భోజనం దగ్గర్నుంచి మాపటేల వుచిత మద్యం (ఓటర్లకు మాత్రమే) దాకా అనేకానేక సందర్భాలలో ఎన్నో పధకాలు కల్పించబడ్డాయి. అవన్నీ అటుంచి ప్రభుత్వంతోపాటు అవినీతిని కూడా కలగలిపి ఇస్తున్నారని అన్నా హాజరే నిరశన ప్రకటించాడు. "నగదు బదిలీ పథకం" అనేది ఒకటి రాలేదు కానీ అది వీటన్నింటికీ "బాబు" లాంటి పథకం. వూరకే డబ్బులిస్తే సోమర్లు తయారవుతార్రా బాబూ... అన్నా వినలేదు ఆ పెద్దాయన.

ఇక సూపర్ మార్కెట్‌కి వెళ్తే నేను ఫ్రీ.. నేను ఫ్రీ అంటూ కేకలు వేస్తాయి అక్కడి వస్తువులు. ముఫై లీటర్ల నూనె కొంటే మూడు దువ్వెన్లు వుచితం అనగానే ఒక మహా ఇల్లాలు అంత నూనె కొని, దువ్వెన్ల పళ్ళు విరిగిపోయినా నూనె ఖర్చు కావటం లేదని వాపోయిందట. ఇక మనకి అట్టే అవసరం లేనిది, షాపు వాడికి అమ్ముడు పోని వస్తువులకీ ఏదైనా చిన్న పిల్లల బొమ్మలో, చాక్లెట్లో ఉచితం అని చెప్తే కాగల కార్యం పిల్లలే నెరవేరుస్తారని ఒక సిద్ధాతం.

ఇలా ప్రదిదానికీ ఉచితం అనేస్తుంటే ఆ ఉచితం అనేదానికి విలువ లేకుండా పోతోంది. ఏ తిరుపతో, బాసరో వెళ్ళామనుకోండి - ఉచిత దర్శనానికి వెళ్ళాలంటే మనకి నామోషీ. మూడు వందలో, అయిదు వందలో పెట్టి టికెట్టు దర్శనానికే వెళ్ళడం మనకి అలవాటైపోయింది. ఈ అలవాటు ఎంత బలంగా వుందంటే, ఉచిత దర్శనం క్యూ ఖాళీగా వున్నా జనాలు టికెట్టు దర్శనానికే వెళ్తున్నారు. (బాసరలో నాకు ప్రత్యక్ష అనుభవం).

ఈ మధ్య హైదరాబాద్‌లొని ఒక సాయిబాబా మందిరంలో అంతర్భాగంగా ఒక హాస్పిటల్ చూశాను. ఈ హాస్పిటల్‌లొ ఎవరికైనా ఉచిత సేవలు అందిస్తారు. ఇక్కడ డాక్టర్ ఫీజుల పేరుతో పర్సులు, టెస్ట్‌ల పేరుతో ఆస్తులు లాక్కోరు. ఏవైనా టెస్టులు చేయాల్సి వస్తే ఖర్చులకు మాత్రం సరిపోయేట్టు చాలా చిన్న మొత్తాన్ని తీసుకుంటారు. నేను ఈ ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్‌ని కలిసి, వైద్య సహాయం పొందిన తరువాత విరాళంగా కొత్త మొత్తం ఇస్తానని చెప్పినా వాళ్ళు అంగీకరించలేదు. ఆ ఇవ్వదల్చుకున్నది సాయిబాబా హుండీలో వెయ్యమని సూచించారు. అలా హుండీలో పొగైన డబ్బులతోనే ఈ హాస్పిటల్‌ను నడుపుతారట. చిత్రమేమిటంటే డబ్బుల హుండీతో పాటు ఒక మందుల హుండీ కూడా ఏర్పాటు చేశారు. మన దగ్గర వూరకే పడివున్న అనవసర మందులన్నీ అందులో వేస్తే అవసరాన్ని బట్టి వాటిని రోగులకు వుచితంగా ఇస్తారు.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను వైద్య పరమైన ఏ అవసరం వచ్చినా ఇక్కడికే వెళ్తాను. స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు బాబా దర్సనం, వైద్య సందర్శనం రెండూ జరిగిపోతాయి కాబట్టి. ఇలా నేను ఫ్రీ డాక్టర్ దగ్గరకి వెళ్తానని తెలిసి ఒక మిత్రుడు - "అది పేద వాళ్ళ కోసం... నువ్వు డబ్బులు తీసుకునే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి కానీ, ఇలాంటి డాక్టర్ దగ్గరకి కాదు" అని ఒక ఉపన్యాసం ఇచ్చాడు.

నిజానికి ఆ అభిప్రాయం తప్పు. అందరూ పేదవాళ్ళే ఆ ఆసుపత్రికి వెళ్ళారంటే ఆ ఆసుపత్రి త్వరలోనే మూతపడుతుంది. ఎందుకంటే అందరూ డబ్బులేని వాళ్ళే అక్కడికి వెళ్తే హుండీలో ఎవరూ డబ్బులు వెయ్యరు. తద్ఫలితంగా గుడి ఆదాయం తగ్గి, వైద్య సేవలు కుంటు పడతాయి. కాబట్టి డబ్బున్న ప్రతివాడూ ఇలాంటి వుచిత సేవని మొహమాటం లేకుండా స్వీకరించాలి. ఒక మామూలు హాస్పిటల్‌కి వెళ్తే ఎంత ఖర్చౌతుందో లెక్కకట్టి కనీసం అంత మొత్తం అక్కడ హుండీలో వేసి రావాలి. అప్పుడు గుడి ఆదాయం పెరిగి, మరి కొంతమందికి సహాయపడే అవకాశం వుంటుంది. ఇదే విషయాన్ని మా మిత్రుడికి వివరిస్తే ప్రశ్నార్థక ముఖం ఒకటి పెట్టి జారుకున్నాడు.


(నేను ప్రస్తావించిన గుడి హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలో వుంది.)

6 వ్యాఖ్య(లు):

సాయి చెప్పారు...

gud post

Anil చెప్పారు...

"చిత్రమేమిటంటే డబ్బుల హుండీతో పాటు ఒక మందుల హుండీ కూడా ఏర్పాటు చేశారు. మన దగ్గర వూరకే పడివున్న అనవసర మందులన్నీ అందులో వేస్తే అవసరాన్ని బట్టి వాటిని రోగులకు వుచితంగా ఇస్తారు."
కాస్త దాని చిరునామ తెలియజేయండి..వారికి /మీకు అభ్యంతరం లేకపోతే..

G.Mahesh Kumar చెప్పారు...

This comment has been removed by the author.

G.Mahesh Kumar చెప్పారు...

Nice analysis sir. This is called nothing but the completeness and the perfection on what we wants to convey to country. Really it is great sir.

kalpana చెప్పారు...

MADAN MOHAN SETTY
REAL SPIRITUALITY LIES IN UR THEORY OF BEHAVIOURAL ECONOMICS. FANTASTIC.ANALYSIS IS GOOD.

buddha murali చెప్పారు...

ఉచితం గురించి సరదాగా పోస్ట్ రాసినా ఆలాంటి ఆస్పత్రుల గురించి విడిగా అడ్రెస్స్ తో సహా పోస్ట్ రాస్తే బాగుంటుంది. చాలా మందికి ఉపయోగ పడుతుంది ఇంద్రా పార్క్ ఎదురుగా ఉన్న రామకృష్ణ మటం లో కూడా ఇలానే వైద్య సేవలు అందిస్తున్నారు