మొపాస కథలు: బికారి

ఇప్పుడిన్న కష్టాలు పడుతున్నాడు కానీ, వాడి జీవితంలో ఇంతకంటే మంచిరోజులు లేకపోలేదు.

పదిహేనేళ్ళప్పుడు వార్విల్ రహదారి మీద బండి చక్రాలకింద పడి వాడి రెండు కాళ్ళూ నలిగిపోయిన తరువాతే ఇలాంటి దుర్భరమైన రోజులు దాపురించాయి. ఇక అప్పటి నుంచి చేతులకింద కట్టెలతో తన శరీరాన్ని ఈడ్చుకుంటూ పొలాల దగ్గర, దార్ల వెంట అడుక్కుంటూ బతికాడు. అలా చేతికింద కర్రలు పెట్టుకోని నడుస్తుంటే వాడి భుజాలు చెవులదాకా పోయి, వాడి తల రెండు కొడల మధ్య నలిగిపోతున్నట్లు కనపడేది.

చిన్నప్పుడే ఒక అనాథలాగా చెత్తకుప్పలో పడివున్న వాణ్ణి చర్చి ఫాదరు దగ్గరతీసి, బాప్టిజం ఇచ్చి పోషించాడు. అలా ఆయన దయాధర్మాలతో బతుకుతూ, చదువు సంధ్యలు లేకుండా, అక్కడే వున్న ఒక బేకరీ వాడు వూరికే ఇచ్చిన బ్రాందీ తాగుతూ అల్లరి చిల్లరిగా సంవత్సరాలు గడిపేశాడు. అందువల్ల రెండు కాళ్ళు పోయిన తరువాత చెయ్యి చాపి అడుక్కోవడం తప్ప ఇంకేమి చెయ్యలేని పరిస్థితికి వచ్చాడు.

ఒకసారెప్పుడో బారొనీస్ అనే ఆవిడ వాణ్ణి చూసి తన చావిట్లో కోళ్ళ బుట్ట పక్కన గడ్డి పరుచుకోని పడుకోడానికి అనుమతిచ్చింది. అవసరమైతే రెండు రొట్టముక్కలో, కాస్త మజ్జిగో వాడికి ఇచ్చేది. ఒకట్రెండుసార్లు చిల్లర డబ్బులు కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆవిడ కాలం చెయ్యడంతో వాడు మళ్ళీ వీధిన పడ్డాడు.

వూరేమో చిన్నది. వాడి ముఖం అందరికీ పరిచయం. నలభై ఏళ్ళుగా వాళ్ళ ముందే పెరిగాడు వాడు. అప్పుడు వాడి అల్లరి చూశారు, ఇప్పుడు ఆ చెక్క కట్టెల మీద శరీరాన్ని ఇళ్ళిల్లూ ఈడ్చుకుంటూ తిరగడం కూడా రోజూ చూస్తున్నారు. దాంతో వూర్లో జనం ఒక్కళ్ళు కూడా పైసా రాల్చేవాళ్ళు కాదు. వాడు మాత్రం ఇంకో చోటికి వేళ్ళాలన్న ఆలోచన కూడా చేసేవాడు కాదు. అసలు వాడికి ఆ చుట్టుపక్కల వున్న మూడు నాలుగు గ్రామాలు తప్పించి వేరే ప్రపంచం వుందని కూడా తెలియదు. తెలుసుకోవాలనీ లేదు. దాంతో తిరిగిన వూళ్ళోనే తిరుగుతూ, వాడికంటూ ఒక గిరిగీసుకోని అందులోనే అడుక్కుంటూ బతుకుతున్నాడు.

"ఎప్పుడూ ఇక్కడే కుంటుకుంటూ తిరక్కపోతే వేరే వూరు పొయ్యి చావకూడదూ" అని ఎవరో ఒక రైతు చిరాగ్గా అడిగేవాడు. వీడు మాత్రం సమాధానం చెప్పేవాడు కాదు.
"ఏదో తమ దయ" అనుకుంటూ పక్కకి తొలిగేవాడు.
వాడి ముఖంలో ఇలాంటి నిర్భాగ్యులందరి ముఖాల్లో కనిపించే దైన్యం కనిపిస్తుంది. ఆ వూర్లో అవే ముఖాలు, అవే చిరాకులు, అవే అవమానాలు పదే పదే చూసి చూసి ఎలాంటి భావన కనిపించని శవంలాంటి ముఖంలా తయారైంది వాడి ముఖం. అయితే ఎప్పుడైనా పోలీసులు కనిపిస్తే మాత్రం ఆ ముఖంలో భయం తాండవించేది. వాళ్ళు ఏ రోడ్డు చివరైనా వస్తూ కనిపిచారో, చటుక్కున ఏదో ఒక పొద చాటునో, రాళ్ళ గుట్ట చాటునో నక్కేవాడు.

దూరంగా పోలీసుల యూనిఫారం కనపడగానే పెద్ద పులిని చూసిన జింకలాగా వణికిపోయేవాడు. చేతిలో కట్టాలు జారి కిందపడిపోయేవి. ఒక్కసారి కింద మట్టిలో పడి ఆ దుమ్ములో పాక్కుంటూ పక్కకి వెళ్ళేవాడు. ముడుచుకుంటూ శరీరాన్ని వీలైనంత చిన్నదిగా చేసుకోని, మట్టిలో కలిసిపోయినట్లు వుండిపోయేవాడు. అయితే ఏ రోజూ పోలీసులు వాణ్ణి భయపెట్టింది లేదు. వాళ్ళను చూస్తేనే భయం కలుగుతుంది కానీ ఆ భయానికి కారణం ఏమిటో వాడికి కూడా తెలియదు. బహుశా ఎవరో తెలియని వాడి అమ్మా నాన్న దగ్గర్నుంచి వారసత్వంగా వచ్చిందేమో.

వాడికి వుండటానికి ఏ గూడూ లేదు. ఎండాకాలంలో ఎవరో ఒకరి ఇంటి అరుగు మీద గడిపేసేవాడు. చలికాలంలో మాత్రం గుట్టుగా ఏదో ఒక పశువుల కొష్టంలోకి దూరి, అక్కడే గడిపేవాడు. వాడు అక్కడ వున్న సంగతి ఆ ఇంటివాళ్ళు తెలుసుకునే లోపే అక్కడి నుంచి జారుకునేవాడు. ఏ ఇంటి పెరట్లోకి ఎలా దూరాలో వాడికి బాగా తెలుసు. కట్టెల మీద బరువు వేసి నడవటం వల్లేమో వాడి చేతుల్లోకి విశేషమైన బలం వచ్చింది. ఒకోసారి గడ్డి వాము పైకి చేతుల సహాయంతొనే ఎక్కేసి, గుట్టు చప్పుడు కాకుండా మూడు నాలుగు రోజులు గడిపేసేవాడు. అయితే ఆ మూడు నాలుగు రోజులకి సరిపడా తిండి దొరికినప్పుడే ఇలాంటి పని చేసేవాడు.

వాడు పేరుకి మనిషే కానీ అడవిలో జంతువులా బతికేవాడు. వాడి చుట్టూ వున్నవాళ్ళు కూడా మనుషులే కానీ ఏ ఒక్కరూ వాడి పట్ల ప్రేమ, జాలి చూపించరు. వాడికి కూడా ఎవరిపైనా ఎలాంటి అభిమానమూ లేదు. వాడి వాలకం అదీ చూసి అందరూ గేలి చేసేవారు. రెండు కట్టల మధ్య వూగుతుండే వాడి శరీరాన్ని చూస్తే చర్చిలో గంట గుర్తుకొస్తోందని వాడికి "గంటయ్య" అని పేరుపెట్టి నవ్వుకునేవాళ్ళు.

***
రెండు రోజులైంది వాడు కడుపుకి ఇంత ముద్ద తిని. ఎవరిని ఏం అడిగినా లేదు పొమ్మంటున్నారు. అందరిలో ఒక్కసారి జాలి, దయ ఇంకిపోయినట్లు అనిపించింది. ఏ ఇంటి ముందుకెళ్ళినా ఆ ఇంటి ఆడవాళ్ళు మొండి చెయ్యి చూపించారు.
"నువ్వెక్కడ దాపురించావురా దరిద్రుడా... మూడు రోజుల క్రితమేగా మిగిలిపోయిన బిర్యానీ పెట్టాను? మళ్ళీ ఇక్కడికే వచ్చావేం?" అరిచిందో మహాఇలాలు.
వాడు మాట్లాడకుండా కట్టెలు వేరే ఇంటివైపుకు తిప్పుకోని కదిలాడు. అక్కడ కూడా అదే అనుభవం అయ్యిందివాడికి.
ఆ ఇంటి ఇల్లాలు పక్కింటి పిన్నిగారితో మాట్లాడుతూ వుంది.
"ఇదెక్కడి చోద్యం పిన్నిగారూ... ఈ బద్దకపు ముండాకొడుక్కి సంవత్సరం అంతా మనమే తిడిపెట్టాలా ఏమిటి?" అంటూ ఈసడించింది.
వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం. బద్దకపు ముండాకొడుక్కైనా తినడానికి ఇంత తిండి కావాలిగా?

ఆ చుట్టు పక్కల వున్న సెయింట్ హిలేహ్, వార్విల్, లే బిలియ లాంటి వూర్లు అన్నీ తిరిగాడు వాడు. ఎక్కడా నయాపైసా కానీ, ఇంత ముద్దకానీ దొరకలేదు. ఇక మిగిలిందల్లా టోర్నోలే అనే వూరు. అక్కడికి వెళ్ళాలంటే మెయిన్ రోడ్డుమీదే నాలుగు మైళ్ళు నడవాలి. వాడికేమో అడుగుతీసి అడుగేసే వోపికలేదు. కడుపుతోపాటు జేబులు కూడా ఖాళీగానే వున్నాయి. తప్పదు కదా! టోర్నోలే వైపు కదలడం మొదలుపెట్టాడు.

మంచి శీతాకాలం. డిసెంబరు చలిగాలులు పొలాలమీదుగా, చెట్లమీదుగా కదులుతున్నాయి. నల్లటి ఆకాశంలో పనిలేని మబ్బులు పిచ్చిపట్టినట్లు తిరుగుతున్నాయి. ఆ అవిటివాడు బాధని పంటి బిగువున భరిస్తూ నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు. ఒక్కొక్క కట్టెని ముందు వేసుకుంటూ, శరీరాన్ని భారంగా లాగుతూ ముందుకుసాగాడు. దారిలో ఏ చెట్టు కిందో కొద్దిసేపు ఆగి, అలసట తీర్చుకుంటూ మూడు గంటలపాటు ప్రయాణం చేశాడు. ఆకలి లొపల్నుంచి దహిస్తుంటే వాడి బుర్ర పనిచెయ్యడం కూడా మానేసింది. తినాలి... ఎక్కడో అక్కడ, ఏదో ఒకటి తినాలి... అంతే. ఇదే ఆలోచిస్తోంది వాడు మెదడు. ఆ ఏదో ఒకటి ఎలా సంపాదించుకోవాలనేది మాత్రం వాడి ఆలొచనలోకి రావటంలేదు. తినాలి..! ఎలాగొలా తినాలి..!! అంతే..!!

వూరి పొలిమేరలో రోడ్డుపక్క చింతచెట్లు కనపడగానే వచ్చేశానన్న సంతోషంతో వూర్లోకి అడుగుపెట్టాడు. అప్పుడే పొలం బయల్దేరిన ఒక రైతు ఎదురొచ్చాడు.
"వోరి శనిగాడా... మళ్ళీ తగలబడ్డావా? మాకు నీ శని ఎప్పుడు వదుల్తుందిరా?" అంటూ తిట్టాడు.
'గంటయ్య' ఆ మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కనపడ్డ ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి చేతులు చాపాడు. చీవాట్లు, తిట్లు పలహారంగా దొరికాయి తప్ప చిల్లికాణీ కూడా ఎవరూ రాల్చలేదు.
వూరి చివర వున్న పొలాలదగ్గరికి కూడా వెళ్ళాడు. బురదమట్టిలో కట్టెలు తీసివేస్తూ నడవడానికే ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఎవ్వరూ చెయ్యి విదిలించలేదు. గడ్డకట్టించే చలికాలం అది. వాళ్ళ మనసులు కూడా గడ్డకట్టినట్లున్నాయి. చలికి ముడుచుకున్న ఏ ఒక్క చెయ్యి 'గంటయ్య'ను ఆదుకోవటం కోసం ముందుకు రాలేదు.

అవకాశం వున్న ప్రతిచోటా ప్రయత్నించిన తరువాత అలసిపోయి చిక్యువే అనే ఆసామి పెరడు పక్కన ఒక గుంటదగ్గర కూలబడ్డాడు. చేతి కట్టెలు పక్కన పడేసి కదలలేని బడలికతో మట్టిలో కదలకుండా పడుకున్నాడు. ఆకలికి అల్లాడుతూ ఆలొచించే శక్తి కోల్పోవటంవల్ల తాను అనుభవిస్తున్న దౌర్భాగ్యాన్ని కూడా గుర్తించలేని అశక్తుడై పడివున్నాడు.

మనిషి బతికున్నంతకాలం ఆశ కూడా వుంటుందికదా. ఈ 'గంటయ్య'కూడా అంతే. ఎదురుచూస్తూ కూర్చున్నాడు. దేనికోసమో తెలియదు. ఎవరికోసమో తెలియదు. ఏదైనా అద్భుతం జరిగి దేవుడు పైలోకం నుంచి ఏదైనా పంపిస్తాడేమో అని ఎదురుచూశాడు. లేకపోతే ఏ ధర్మాత్ముడైనా జాలిపడి ఒక రూపాయి ఇస్తాడేమో అనుకున్నాడు. ఆ సహాయం ఎప్పుడొస్తుందో తెలియక ఎదురుచూస్తున్నాడు. వస్తుందో రాదో తెలియకపోయినా ఎదురుచూస్తూనే వున్నాడు.

చలిగాలు వీస్తూనే వున్నాయి. చిక్యువే పెరట్లో కోళ్ళు అటూ ఇటూ పరుగెడుతున్నాయి. ప్రాణమున్న ఏ జీవికైనా ఉదరపోషణ తప్పదు కదా. వాటి తిండికోసం అవి వెతుక్కుంటున్నాయి. ఆ మట్టిలో ఒక గింజో, ఒక పురుగో దొరికితే దాన్ని మింగి ఇంకా రుచికరంగా ఏమన్నా దొరుకుతాయేమో అని మొత్తం వెతుకుతున్నాయి. కడుపు నిండిన తరువాత రుచి పచి కావాల్సివస్తుంది మరి.

మొదట గంటయ్య వాటి వైపు ఏ ఆలోచన లేకుండా చూశాడు. ఆ తరువాత అతని బుర్రకి కాదు కానీ కాలే కడుపుకి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ తిరుగుతున్న కోళ్ళలో ఒక్కటి దొరికినా తన ఆకలి తీరిపోతుంది అనుకున్నాడు. ఎండుపుల్లలు తగలపెట్టి కొడిని కాల్చుకోని తినవచ్చనే ఒక పథకం కూడా రూపుదిద్దుకుంది.
అతని ఆకలి అతని చేత దొంగతనం చేయిస్తోందని కూడా అతనికి అర్థంకాలేదు. అందుబాటులో వున్న ఒక రాయిని తీసుకోని గురి చూసి దగ్గర్లో వున్న కోడి మీదకు విసిరాడు. వంట్లో నీరసం వున్నా అతని గురి మాత్రం తప్పలేదు. రాయి తగిలిన కోడి రెక్కలు అల్లల్లాడించి తలవాల్చేసింది. గంటయ్య సంబరంగా కిందపడి వున్న కట్టెలను అందుకోని, అతి కష్టం మీద లేచి నిలబడి తాను సాధించుకున్న ఆహారం వైపు అడుగులేశాడు. చచ్చిపడున్న ఆ ఎర్రకోడి దగ్గరకు వెళ్ళాడో లేదో, సరిగ్గా అప్పుడే అతని వీపు మీద ఎవరో చరిచినట్లు పెద్ద దెబ్బపడింది. చేతిలో కెట్టెలు జారిపోయి, పదడుగుల అవతల పడ్డాడు వాడు. వెనక్కి తిరిగితే చిక్యువే. కోపంతో బుసలుకొడుతూ, చొక్కా చేతులు మడుచుకుంటూ అందిన చోటల్లా కొట్టాడు. కాళ్ళతో, చేతులతో ఎలా కుదిరితే అలా కొట్టాడు. గంటయ్య ఎదురుతిరిగే ఓపిక లేక ఆ తన్నులు తింటూ పడివున్నాడు.

చిక్యువే దగ్గర పని చేసే పాలేర్లు కూడా వచ్చి అయ్యగారి పనిలో పాలుపంచుకున్నారు. అందరు కలిసి కొట్టినంతసేపు కొట్టి, తీసుకెళ్ళి కొష్టంలో కట్టి పడేశరు. ఆ తరువాత పోలీసులకి కబురు చేశారు. గంటయ్య సగం చచ్చినట్లు అక్కడే పడివున్నాడు. రక్తం కారుతూనే వుంది. ఆకలి వేస్తూనే వుంది. సాయంత్రం అయ్యింది - చీకటి పడింది - మళ్ళీ తెల్లవారింది. పోలీసులు రాలేదు. గంటయ్య ఏమీ తినలేదు.

మధ్యాన్నానికి వచ్చారు పోలీసులు. ఎంతో జగ్రత్తగా వాడి కట్లు విప్పారు. వాడు తిరగబడతాడేమో అని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చిక్యువే వాళ్ళకు చెప్పిన సంగతి అలాంటిది మరి. "గంటయ్య తన మీద దాడి చేశాడనీ, తప్పనిసరి పరిస్థితిలో ఆత్మ సంరక్షణకోసం వాణ్ణి కొట్టాననీ" చెప్పాడు చిక్యువే.

"లేరా.. లే ఇక్కడ్నుంచి.." అన్నాడు పోలీసాయన.

గంటయ్య కదిలే పరిస్థితిలో లేడు. కట్టేలు అందుకోవాలని కష్టపడ్డాడు కానీ అందుకొలేకపొయ్యాడు. వాడి నిస్సహాయత మొత్తం నటనే అని నమ్మిన ఒక పోలీసు వాడి రెక్కపట్టుకోని ఈడ్చి కట్టెల మధ్య కుదేశాడు. గంటయ్యని ఒక్కసారిగా భయం కమ్మేసింది. పోలీసు యూనిఫారం కనపడితే వాడికి కలిగే భయం రాక్షసిలా నిద్రలేచింది. చిరుత పులిని చూసిన కుందేలులా వణికిపోయాడు. పిల్లి ముందు నిలబడ్డ ఎలుకలా ముడుచుకుపోయాడు. భయం వల్ల వచ్చిన శక్తితో కష్టపడి ఎలాగైతేనేం కర్రల సహాయంతో లేచి నిలబడ్డాడు.

"నడువ్.." అన్నాడు పోలీసు. వాడు కదిలాడు. చిక్యువే, అతని మనుషులు గంటయ్య బయటికెళ్ళేదాకా బుసలుకొడుతూ నిలబడ్డారు. ఆడవాళ్ళు శపనార్థాలు పెడుతూ మెటికెలు విరిచారు.
"పొయ్యాడు వెధవ."
"పీడా విరగడయ్యింది"
"శని వదిలింది"
ఇద్దరు పోలీసుల మధ్యలో నడిచాడు వాడు. ఎక్కడలేని శక్తి వచ్చేసింది వాడికి. అసహాయతలోంచి పుట్టుకొచ్చిన శక్తి అది. అలాగే సాయంత్రందాకా ఈడ్చుకుంటూ నడిచాడు. ఏం జరుగుతోందో తెలుసుకోనివ్వకుండా కళ్ళు బైర్లు కమ్మాయి. జరిగేది అర్థం చేసుకోనివ్వకుండా భయం కమ్మేసింది.
దారిలో ఎదురైనవాళ్ళు ఆగి మరీ వాడి వైపు చూసారు.
"ఏ దోంగతనమో చేసుంటాడు వెధవ" అనుకున్నారు.
సాయంత్రానికి పట్నం చేరారు అంతా. అంతదూరం నడిచిందే లేదు వాడి జీవితంలో. ఆ విషయం వాడికి కూడా అర్థం కాలేదు. అసలు అక్కడికి ఎందుకు తీసుకొచ్చారో, ఏం చెయ్యబోతున్నారో కూడా అర్థం కాలేదు. రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలు, ఈసడింపులు, ఇప్పుడీ కొత్త ముఖాలు వాడిని ఏమీ అర్థం చేసుకోనివ్వని స్థితిలోకి నెట్టేశాయి.
ఒక్క మాటకూడా మాట్లాడలేదు వాడు. మాట్లాడటానికి ఏముందనీ? ఏం జరుగుతోందో అర్థం అయితే కదా మాట్లాడటానికి? అసలు అడుక్కోడానికి చెయ్యి చాపడమే తప్ప మనుషులతో మాట్లాడి ఎన్ని సంవత్సరాలయ్యిందో. బహుశా వాడు నాలుక వాడటం కూడా మర్చిపొయాడేమో. అతనికే అర్థంకాని ఆలోచనలు నోట్లో నుంచి ఒక్క ముక్క కూడా రాకుండా చేశాయి.
లాకప్ లో పడేశారు. వాడికి తినడానికేమైనా పెట్టాలన్న ఆలోచన కూడా పోలీసులకు రాలేదు. వాణ్ణి అలాగే ఒంటరిగా గదిలో వదిలేశారు. మర్నాడు ఉదయం వచ్చి చూసేసరికి వాడు చచ్చిపడున్నాడు.

"ఎంత విచిత్రం? వాణ్ణి ఏమీ చెయ్యలేదు. ఊరికే చచ్చిపోయాడు" అంటూ ఆశ్చర్యపోయారు అంతా.

2 వ్యాఖ్య(లు):

prasad చెప్పారు...

bagundi. satya prasad garu. chala kalam taruvata mee kathalu chadivanu.
nenu blot loke chala rojula taruva vastunnanu.

Unknown చెప్పారు...

dear sir please call me once

sripathi 868611022

website-4dstudios.co.in