వీడొక సామాజికుడు

సావిత్రి మొగుడికి ఏక్సిడెంట్ అయ్యిందని తెలిసేటప్పటికి నేను విజయవాడలోనే వున్నాను. అయితే ఏం? నేనేం హడావిడి పడలేదు. సావిత్రి మొగుడు నాకేమన్నా చుట్టమా? బంధువా? ఇక సావిత్రంటారా కాలేజీలో స్నేహితురాలు. అంతే కదా? అంత మాత్రానికే హైరానా పడిపోయి హాస్పిటల్ కి పరుగెత్తిపోవాలా? రోజు ఉదయాన్నే భగవద్గీత చదివే నాలాంటి వాడే స్థితప్రజ్ఞత అనేది మర్చిపోతే ఎట్లా? నిదానంగా నింపాదిగా నా వ్యాపారం పనులు చూసుకోని సాయంత్రంగా వీలైతే వెళదాంలే అని నిర్ణయించుకోని ఆ నిర్ణయాన్ని అమలుపరుస్తూ వుండిపోయను. స్వార్థం, మిత్రద్రోహం అని అంటే ఎలా? ఎవరైనా అదే చేస్తారు... మీరు నా స్థానంలో వుంటే అదే చెయ్యరూ?

వెధవది.. మనసొకటి వుండి ఏడ్చింది కదా..! మనల్ని సామాజికులుగా బ్రతకనిస్తుందా అది? ఎంతసేపు ఒకటే రొద. పాపం సావిత్రి అంటుంది.

నిజం చెప్పద్దూ.. మా రవిగాడు ఫోన్ చేసి “సావిత్రి మొగుడి ఏక్సిడెంట్ అయ్యిందటరా” అనగానే మనసు రెండు అంగుళాలు మేర కుంగింది. అప్పుడే ఒక మంచి హోటల్లో పెసరట్ ఉప్మా తింటున్నాను నేను. సరే.. విషాద వార్తే కావచ్చు. అంత మత్రాన నెయ్యి వేసి సన్నగా రోస్ట్ చేయించుకున్న పెసరట్టు వదిలేస్తామటండీ? అదీ ఇలాంటి మూడు ముక్కల పెసరట్టుకు పేరుగాంచిన బెజవాడలో? శవం లేచిన ఇంట్లో అన్నం వండరా ఏమిటి? ఇదీ అంతే..!!

“అయ్యో... ఇప్పుడెలాగ వుందట?” అన్నాను ఒక్క ముక్క పెసరట్టు నోట్లో కుక్కుతూ.

“కండీషన్ సీరియసే... రాత్రి బైక్ మీద వస్తుంటే ఏదో వ్యాన్ గుద్దిందట..!! నువ్వు అక్కడే వున్నావు కదా అని ఫోన్ చేశాను” చెప్పాడు రవి.

“చూస్తాను రవీ... నా పనులు అయ్యాక ఒకసారి వెళ్ళి వస్తాను..” చెప్పి ఫోన్ కట్టేశాను. వెళ్తానో వెళ్ళానో... కానీ అలాగే చెప్పాలి..!! లౌక్యం తెలిసినవాణ్ణి కదా? మూడు ముక్కల పెసర ముఫై ముక్కలై మాయమైంది.

దీని దిబ్బలో కొట్ట..!! అబ్బే పెసరట్టుని కాదండీ... మనసుని. ఈ దిక్కుమాలిన మనసుందే దాన్ని తీసుకెళ్ళి దిబ్బలో కొట్టాలి. మరే పనీ లేనట్టు సావిత్రి ముఖాన్నే రీలు వేసి చూపిస్తోంది. అవునులే అప్పట్లో ఈ మనసునే కదా ఆ పిల్లని ప్రేమించింది. దానికి ఆ మాత్రం కృతజ్ఞత అనేది వుంటుంది కదా..!!

ప్రేమలేదు.. దోమ లేదు. భగవానుడు చెప్పినట్లు అంతా ఖర్మ. సావిత్రి ఖర్మ. ఆ పిల్ల హాయిగా నన్ను చేసుకోని సుఖంగా బతికుండకూడదూ..! వాణ్ణెవడినో చేసుకోని ఈ అగచాట్లు పడకపోతే. సరే అప్పుడు నేనే ధైర్యం చెయ్యలేదనుకో... అయినా నాకు అప్పుడు ధైర్యం రాకపోవటం కూడా సావిత్రి ఖర్మే..!! దాని ముఖాన ఆ తాగుబోతు మొగుడు రాసిపెట్టి వుంది కాబట్టే నేను ముందుకి అడుగెయ్యలేక పోయాను.

“ఆ ఏముంది తాగుబోతు వెధవట కదా... రాత్రి ఫుల్లుగా తాగేసి వుంటాడు. ఏ రాంగు రూట్‍లోనో వచ్చి వ్యాన్‍కి గుద్ది వుంటాడు. మందు తాగి తాగి ఎప్పుడో చస్తాడనే అనుకున్నా... చంపింది మందేకానీ, కోంచెం ముందే చంపింది..” చెప్పాను మరో ఫ్రెండ్‍తో. నేను బెజవాడలో వున్నానని, పాత స్నేహితులందరూ సావిత్రి మొగుడు గురించి ఎంక్వైరీలు మొదలుపెట్టారు.

“నువ్వు కలిశావుట్రా?” అడిగాడు వాడు.

“కలుస్తాలేరా... సాయంత్రం. ఇప్పుడంతా బిజీగా వున్నాను. అయినా నేను చెప్పినట్లే జరిగుంటుంది. మ్యాటర్ సీరియస్సే..” చెప్పాను నేను. నేను వూహించుకున్న కథ మీద నాకు ఎంత నమ్మకమో. సావిత్రి మొగుడు తాగి బండి నడపడం, వ్యాన్‍కి గుద్దడం నాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా వుండగలను?

మధ్యాహ్నం భోజనం తరువాత ఒక్క క్షణం నిద్రపోదామని నడుం వాల్చానా? అబ్బే కునుకైనా వస్తే కదా? పాడు మనసు. ఒకటే గోల...! సావిత్రి కనిపిస్తుంది. నవ్వుతుంది. ఆ నవ్వు నా చావుకొచ్చింది. నవ్వుతుండే సావిత్రి ముఖం చూస్తే వెంటనే ఆ పిల్ల కష్టం వచ్చిందనీ గుర్తొస్తుంది.

ఈ మనసుకో దణ్ణం పెట్టాలి. ఈ మనసు చేసే పని ఏమిటో తెలుసా? ఎక్కడో లోపల సావిత్రి పైన వున్న ప్రేమ, అనురాగం, కోరిక అన్నింటినీ బయటికిలాగి, వాటిమీద సావిత్రి నవ్వుతున్న ముఖాన్ని చూపించి, వెనకాల రవి ఫోన్‍లో చెప్పిన “కండీషన్ సీరియసే” అనే మాటని పదే పదే వినిపిస్తూ వుంటుంది. దీని దుంపతెగ మనసు.

సరే కానీ వెళ్దాంలే అని దానికి నచ్చచెప్పుకోని, ఒక్క చిన్న కునుకుతీసా. మధ్యాన్నం ఒక్క అరగంటైనా నిద్రపోలేదా ఇక ఆ రోజు నా తలనొప్పి ఇంతా అంతా కాదు. సరే స్నేహం, ప్రేమా అన్నీ వున్నాయి... కాదనటంలేదు. కానీ వ్యవహారికంలో బ్రతకాలి కదా. ఎక్కడో ఊహల్లో, కథల్లో, సినిమాల్లో జరిగినట్లు జరగాలంటే ఎలా జరుగుతుంది? కేవలం కలల్లో మాత్రమే జరుగుతుంది. అందుకే కలగన్నాను.

వంటినిండా కట్లు కట్టుకోని సావిత్రి మొగుడు.

“నేను ఇంకా ఎంతోసేపు బతకను... నా భార్యను నీకు అప్పజెప్తున్నాను...” నా చేతిలో ఆమె చెయ్యిపెట్టి కొనసాగించాడు. “సావిత్రి జా... గ... ర్” పోయాడు.

“ఏమండీ..” సావిత్రి ఏడ్చింది.

“ఊరుకో సావిత్రి... నేనున్నానుగా...” ఆమెను గట్టిగా గుండెలకి హత్తుకున్నాను. ఆమె నా చుట్టూ చేతులు వేసింది.

అంతే చిత్రం...!! సావిత్రి మొగుడి శవం ఏమైందో తెలియదు. మేమిద్దరం పచ్చని పార్కులో తిరుగూ, పూలపరిమళాల మధ్య ముద్దాడుతూ, సలయేర్ల సరసాలాడుతూ...తేలిపోతూ, తూలిపోతూ, సోలిపోతూ... ఎక్కడో తెలియని చీకటిలో పట్టెమంచం పైన ఒకరితో ఒకరం...!!

ఛీ.. ఛీ.. ఛీ... పాడు కల... పాడు కలని..!! ఇలాంటి కలలు వస్తాయంటే అసలు నిద్ర పొయ్యేవాడినే కాదు. ప్రేమించుకున్న మాట నిజమే... నాకు కోరిక వున్న మాట కూడా నిజమే. అయినా సావిత్రిని అలా వూహించచ్చా మనసు. పాడు మనసు... పాడు మనసుని. దీన్ని కాష్టంలో తగలెయ్య..!!

ఇంకేం చేస్తాం. నిద్ర ఎలాగూ చెడింది. అనుకున్న బిజినెస్ పనీ అయ్యేటట్టులేదు. రేపు ఇక్కడే వుండి అన్నీ చక్కబెట్టుకోని వెళ్ళాలి. సాయంత్రం ఖాళీనేగా... పోనీ ఒకసారి అలా హాస్పిటల్ వైపు పొయ్యొస్తే పోలా?

వెళ్దాం..! వెళ్దాం..! వెళ్దాం...!! నసపెట్టే మనసుతో ఇదే గొడవ. ఒక ఆలోచన వచ్చిందే అనుకో, దాన్ని పట్టుకోని ఇలా నక్షత్రకుడిలా వేధిస్తే ఎట్లా? ఈ మనసునీ తొక్కి పట్టి...

అయినా మనసు చెప్పేదే రైటు... ఒకసారి వెళ్ళివస్తే రేప్పొద్దున ఏ తలకుమాసిన వెధవ నన్ను పట్టుకోని – “ఎరా అక్కడే వుండి అంత కష్టంలో వున్న పిల్లని పలకరింఛలేక పోయావా?” అని అడగకుండా సరిపోతుంది. సదరు తలకుమాసిన వెధవ ఇక్కడ వున్నా వాడికీ వెళ్ళాలని వుండకపోవచ్చు... వెళ్ళాకపోనూవచ్చు...!! కానీ అడుగుతాడు. ఎందుకు అడిగించుకోవాలి? పోదాం.

ఆసుపత్రికి వెళ్ళి సావిత్రి మొగుడు అంటే వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది? వాడికీ ఏదో పేరు వుండే వుంటుంది. ఏ సుబ్బారావో... గోపాలరావో...!!

“రాత్రి తాగి స్కూటర్ నడుపుతూ వ్యాన్‍ని గుద్దిన ఏక్సిడెంట్ కేసండీ... ఇక్కడే వున్నారని చెప్తేనూ...” నా కల్పిత కథే నాకు ఆసరా.

“రాత్రి ఒక ఏక్సిడెంట్ కేస్ వచ్చిందండీ... కానీ తాగి డ్రైవింగ్ చెయ్యలేదు... వ్యాన్ డ్రైవరే రాంగ్ రూట్‍లో వచ్చి గుద్దాడు... అతని పేరు అభిరామ్.. ఐ.సీ.యూ. లో వున్నారు..” చెప్పింది ఆ అమ్మాయి.

పరమ తాగుబోతు అని విన్నానే...!! తాగలేదా? వీళ్ళు అవన్నీ ఎందుకులే చెప్పడంలేదా? నిన్న గురువారం కదూ అందుకని తాగుండడు... అయినా గురువారాలు శనివారాలు నాలాంటి భయం భక్తి వున్నవాళ్ళకి కానీ, ఇట్లాంటి పచ్చి తాగుబోతులకి ఎందుకు వుంటాయి...!

ఏమిటో ఈ మనసు... ఎం జరిగిందో.. ఎలా జరిగిందో అన్నీ కావాలీ మనసుకు. బస్సులో పోతూ పోతూ ఏదో ఒకచోట ఏక్సిడెంట్ అనగానే తలకాయలు కిటికీలోంచీ కొంగల్లా బయటికి సాగదీసి చూసే మనసు..!! ఎక్కడలేని కుతూహలం..! దీనెమ్మ మనసు..!!

పేరేదో చెప్పారే...!! గుర్తొచ్చింది... అభిరామ్ కదూ... అబ్బో మంచి పేరే..! నా పేరు కన్నా... అయినా నా పేరుతో ఏం పనిలే...!

“అభిరామ్...?” అడిగాను అక్కడ కూర్చున్న ఒక పెద్దమనిషిని. నా ప్రశ్నకు అర్థం ఏమిటి? “అభిరామ్ రూమ్ ఇదేనా?” అనా? “మీరు అభిరామ్ తాలూకా” అనా? లేకపోతే “అభిరామ్ వున్నాడా పోయాడా?” అనా? నువ్వు నోరు ముయ్యవే ముదనష్టపు మనసా.

“అవును బాబూ.. లోపల వున్నాడు. నువ్వెవరు బాబూ? అబ్బాయి స్నేహితుడివా?”

“అవునండీ...” చెప్పాను అక్కడే కూర్చుంటూ. సావిత్రి స్నేహితుణ్ణి, కావల్సినవాణ్ణి, మొగుడు కావల్సినవాణ్ణి ఇవన్నీ ఎలా చెప్తాం మరి? సావిత్రి గురింఛి అడగాలా వద్దా అని సంశయం. బహుశా లోపలే వుండి వుంటుంది.

“ఎలా జరిగిందండీ?” అడిగాను. అన్ని దొంగవేషాలు. అక్కడ నర్సు చెప్పింది కదా... అయినా అడగాలి. అదే పద్దతి.
ఆయన చెప్తున్నాడు. మధ్య మధ్యలో నేను – “అయ్యయ్యో.... చ్చొ.. చ్చొ... చ్చొ... పాపం” అంటూ శబ్దాలు చేస్తున్నాను.

అయిపోయింది. నా వూహకి నిజానికి ఏ మాత్రం సంబంధంలేదు. అభిరామ్ తాగుబోతూ కాదూ, కనీసం సిగెరెట్‍బోతు కూడా కాదట. సావిత్రిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడట. ఇద్దరూ మొగపిల్లలే. సుఖం, సంతోషం అన్నీ వున్న సంసారం.

ఛీ... ఇక్కడికి రాకపోయినా బాగుండేది. నా వూహల్లో ఏదో సాంత్వన దొరికేది. నిజం కనపడితే ఎలా తోసిపుచ్చేది. సావిత్రిని ఒక్కసారి బయటికి రానీ... ఒకే ఒక్కసారి పలకరింఛి, ఆ అమ్మాయి కన్నీళ్ళు తుడిచి, నీకు నేనున్నాను బాధ పడకు అని చెప్పి...  నువ్వు నోరు ముయ్యవే మనసా...!! చూడటం. అయ్యో అనడం వెళ్ళిపోవడం. అంతే..!!
మళ్ళీ అంచనా తప్పు. సావిత్రి గదిలో నుంచి కాదు, వెనక నుంచి వచ్చి పలకరించింది.

“ఏం సుందరం బాగున్నావా?” అంది. ఇదెక్కడి చోద్యం... నేను కదా పలకరించాలి.. ఆమె భర్త గురించి వాకబు చెయ్యాలి.. ఆమెకు అయ్యో పాపం అని సానుభూతి వ్యక్తం చెయ్యాలి...

“ఏదో వున్నాలే... ఎలా వుంది మీ ఆయనకి?” అడిగాను బాధగా ముఖం పెట్టి.

“గంటలో రోజులో తెలియదు... డాక్టర్ల  వాళ్ళ చేతిలో ఏమీ లేదన్నారు..” చెప్పింది బాధగా. అంత బాధలోనూ ఏడవలేదు. ఎందుకేడుస్తుందీ... ఆ మొగుడిమీద కొండంత ప్రేమ వుంటే ఏడుస్తుందికానీ... వాడి సంగతి ఇంతకు ముందు ఎన్నిసార్లు వినలేదూ... ఉత్త సన్నాసిట...!!

“వెళ్ళకు... వుండు..” నా చెయ్యి పట్టుకోని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.

ఇంకేముంది... దీని సిగదరగ మనసు... కుప్పిగంతులు మొదలుపెట్టింది. చెయ్యి పట్టుకుందా? లేదా? ఒక పక్క మొగుడు చచ్చే పరిస్థితిలో వుంటే నిమ్మళంగా మాట్లాడిందా లేదా? వుండు.. వుండిపో అని అన్నదా లేదా? ఇంకేముంది కల నిజమాయగా... ఛీ.. ఛీ.. ఛీ దుర్మార్గపు మనసా. మంఛితనం ముసుగేసుకోని ప్రశాంతగా సామాజికుడిగా బ్రతుకుదామంటే బ్రతకనీయవు కదా..!!

సావిత్రి వెళ్ళి గంటైంది. చీకటి పడుతోంది. ఒక్కణ్ణే కూర్చోని ఆశతో పొంగుతున్న మనసుపై సంస్కారం నీళ్ళు చల్లుతూ కూర్చున్నా. నా పక్కనే ఉన్న సావిత్రి బంధువులు చర్చ మొదలుపెట్టారు. వాళ్ళేమనుకుంటే మనకెందుకు అని అనుకున్నానుకానీ, చెవినపడుతున్న మటలు వినపడకుండా ఎలా పోతాయి..?

“డాక్టర్లు బ్రతకడంటున్నారట..”

“అయ్యో పాపం... ఇద్దరు చిన్న పిల్లలు..”

“పిల్లల సంగతి సరే... ఊరికే హాస్పిటల్‍లో పెట్టుకున్నందుకు రోజుకి పదివేలు అవుతాయట... ఇంతా చేస్తే బ్రతుకుతాడా అంటే అదీ లేదు... చావుని ఇంకో రోజో పూటో పొడిగించడానికే ఈ అనవసరపు ఖర్చు..” ఆయన చెప్తుంటే నేను అనుకున్నదే జరుగుతున్నందుకు తెలియని సంబరం మొదలైంది నా మనసులో.

“అవునండీ సావిత్రి కూడా చెప్పింది... పాపం ఆ అమ్మాయి దగ్గర అట్టే డబ్బుకూడా వున్నట్టులేదు... వున్నదంతా ఇలా వైద్యానికి తగలేస్తే రేపు ఆమె బ్రతికేది ఎట్లా చెప్పండి?” అడిగాను నేను కలగజేసుకుంటూ.

“మరే.. పైగా ఇద్దరు పిల్లలు కూడానూ..” అందించాడు మరోకాయన.

“డాక్టర్లే కాదనిన తరువాత ఇంకా ఎందుకండీ... ఆ అబ్బాయి ఎలాగూ కోమాలో వున్నాడు... బ్రతికే అవకాశమూ లేదు...” చెప్తూ ఆగిపోయాను. నాకు నచ్చింది నేను చెప్పచ్చు కానీ నేను చెప్పింది వాళ్ళకి నచ్చకపోతేనే సమస్య.

“ఏమంటున్నారండీ మీరు?” అడిగాడు మరో పెద్దాయన.

“కొంచెం ప్రాక్టికల్‍గా ఆలోచించండి... డబ్బులు ఖర్చు తప్ప ఆ అబ్బాయి బ్రతికేది లేదు.. అలాంటప్పుడు ఆ డబ్బు మిగిలిస్తే ఆమెకో పిల్లలకో పనికొస్తాయి కదా..” అడిగాను. అడ్డెడ్డేడ్డే... చూశారా... చూశారా నా మనసు ఎంత గొప్పదో. సావిత్రికి డబ్బు మిగల్చడానికి, అవసరమైతే ఆమెను ఆదుకోడానికి కూడా సిద్ధపడింది. అందుకే ఈరకంగా ప్రతిపాదన చేసింది. కానీ పాడు జనం ఆ విషయాన్ని అర్థం చేసుకుంటేనా?

“అంటే ఆ కుర్రాణ్ణి చంపేస్తారా?” అడిగాడు ఒక బట్టతల పెద్దాయన.

“హరి హరీ... మనం ఎందుకు చంపుతామండీ... మనమేమీ కిరాతకులమా? అయినా చంపేదీ, బ్రతికించేదీ మనమటండీ... ఏదో భ్రమ కాకపోతే... ఆ అబ్బాయి మరణం భగవంతుడి చేతుల్లో వుంది... డాక్టరుతో మాట్లాడి డిస్చార్జి చేయిద్దాం... కారులోనో, అంబులెన్స్ లోనో తీసుకోని ఇంటికి పోతామా... ఆయుష్షు వుంటే వుంటాడు... లేదా దైవేఛ్ఛ..” చెప్పాను దణ్ణంపెట్టి పైన వున్న దేవుణ్ణి తల్చుకున్నట్లుగా.

“అవునులెండి... మీరు చెప్పింది సబబుగానే వుంది...” మరోకాయన నన్ను సమర్థించాడు. మనుషులంతా ఒకటే, ఆయనకి ఏం స్వార్థముందో ఇందులో..!!

“అయితే సావిత్రికి ఏం చెప్తాము...” బట్టాతలాయన మళ్ళీ ఒక పాయింటు పీకాడు. అందరూ సమాధానం కోసం నా వైపే చూశారు.

తప్పదు... బాధ్యత తీసుకున్నాను కదా. ఇదంతా నిర్వహించాలి... ఆ తరువాత అదే చేత్తో సావిత్రి బాధ్యత కూడా తీసుకోవాలి. తప్పనిసరై ఇదంతా చేస్తున్నాను కానీ, సావిత్రి మీద ఇంకా మోజు చావలేదని ఎవరైనా అనుకుంటే వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు.

“ఇదంతా సావిత్రికి చెప్తామటండీ... ఆ అమ్మాయి భోజనానికి వెళ్ళినప్పుడో ఎప్పుడో డిశ్చార్జి చేయిద్దాం... పోయిన తరువాతే డిశ్చార్జి చేశారని చెప్పేద్దాం... ఎలాగూ అంబులెన్స్ లో ఎక్కించగానే పోతాడు కదా...” నా తెలివితేటలన్నీ ఉపయోగించి సమస్యకు పరిష్కారం ఇచ్చాను.

అందరూ ఆమోదించారు. సమస్య పరిష్కారమైన సందర్భంగా తలా ఒక కూల్ డ్రింకు కూడా తాగాం. ఇంక ఎవడో ఒకడు మొగుడు పోయిన తరువాత సావిత్రి పరిస్థితి ఏమిటి? అన్న పాయంటు లాగాలి. నేను బట్టతలాయన వైపు చూశాను.

“ఏమైనా గొప్ప నిర్ణయం తీసుకున్నామండీ... ఆ కుటుంబాన్నీ అనవసరపు ఆర్థిక కష్టాలనుంచి కాపాడటానికి, ఒకరకంగా ఇది కారుణ్యమరణమే... ఇతోపినేషియా...” అన్నాడు కూల్డ్ డ్రింక్ చప్పరిస్తూ.

“ఇతోపియా కాదండీ.. ఈతనేషియా..” నా పరిజ్ఞానం ప్రకటించాను.

“అదే... అదే... అయినా పాపం సావిత్రికి చిన్న వయసులో ఈ ఖర్మేమిటీ...” సానుభూతి ప్రకటించాడు ఆయన. సరిగ్గా అదే... నేను అనుకున్న పాయంటులోకి సరిగ్గా వచ్చాడు.

“నిజమేనండీ... ఖర్మ కాకపోతే ఆ ఏక్సిడెంటు ఎందుకు జరగాలీ... ఇలా చావు బతుకు మధ్య ఆమె మొగుడు ఊగిసిలాడటమేమిటి.... ఏదో మనలాంటి పెద్దమనుషులం ఆదుకోని ఆ అబ్బాయికి ఆ బాధ నుంచి విముక్తి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి సరిపోయింది... అలాగే మనమే పూనుకోని సావిత్రి జీవితాన్ని కూడా ఆదుకోని...” చెప్తున్నాను నేను.

ఇంతలో ఎక్కడినుంచో సావిత్రి గొంతు – “ఒరేయ్...” అంటూ. తిరిగి చూద్దునుకదా సావిత్రి ఆవేశంగా అంగలు వేసుకుంటూ వచ్చి నా కాలర్ పట్టుకుంది.

“ఎరా ముదనష్టపు ఎదవల్లారా? నేనేమన్నా మీ సాయం అడిగానా? నన్ను నా జీవితాన్ని కాపాడమని మిమ్మల్ని అడిగానా? నా మొగుణ్ణి చంపడానికి నిర్ణయం తీసుకోడానికి మీరెవర్రా?...”

సావిత్రి అరుపులకు విషయం అర్థమై బట్టతలాయన, మరో పెద్దమనిషి నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి జరుగుతున్న తంతుని చూస్తున్నారు. సావిత్రి నా చొక్క కాలర్ పట్టుకోని వదలడంలేదు.

“నా మొగుణ్ణి నేను కాపాడుకుంటానురా... అవసరం అయితే ఇల్లు, నగలు మొత్తం అమ్మేస్తాను... నా పిల్లల భవిషత్తుని కూడా పణంగా పెట్టైనా సరే ఆయన్ని కాపాడుకుంటాను... ఎందుకంటే ఆయనే మా భవిష్యత్తు... అసలు ఒక మనిషిని చంపాలన్న ఆలోచన మీకెలా వచ్చిందిరా... థూ.. మీ బతుకులు చెడ...” ఇంకా ఏమిటేమిటో అంటోంది. నా కాలర్ వదిలిపెట్టగానే గబగబా నాలుగైదు అడుగులు అవతలికి వెళ్ళి ఆమెనే చూస్తూవున్నాను.
ఎబ్బే... కొంత మంది ఇంతే. అవతలి మనిషి సహాయానికి వస్తే అర్థం చేసుకోకపోగా... ఛీ ఛీ ఛీ... చూడండి ఆ సావిత్రిని... అలగా జనంలాగా హాస్పిటల్ లో ఆ అరుపులేంటి? ఆ గోలేంటి? ఒక పట్టాన ఆపేటట్టిలేదు.... ఆమేదో పురాణాల్లో సావిత్రిలా మొగుణ్ణి కాపాడుకుంటుందట. అక్కడికి మేమేదో యమధర్మరాజు అయినట్లు. అరుచుకోనీ... మనకెందుకు..!!

అక్కడి నుంచి బయటికి కదిలాను.

కొంతమంది అంతే జీవితంలో ఏం కోల్పోయామో తెలుసుకోకుండా, తాము బతికేదే జీవితం అనుకోని బ్రతికేస్తుంటారు. అయ్యో రామా... నా గురించి కాదండీ... సావిత్రి గురించి చెప్తున్నా...!!

***

(నవ్య వీక్లీ 23 జులై, 2014)

మొపాస కథలు: ఆ చేతి కదలికలు...

(కథా నేపధ్యం: దక్షిణమధ్య ఫ్రాన్స్ లో “ఫై ది డోమ్” అనే పర్వతం దగ్గర ఈ కథ జరుగుతుంది. ఈ పర్వతం ఒకప్పటి అగ్నిపర్వం కావటం వల్ల, ఆ పర్వత ప్రాంతంలో వేడి నీటి ఊటలు (hot springs) చాలా ఏర్పడ్డాయి. ఈ నీటికి అనారోగ్యాలను బాగుపరిచే శక్తి వుందని ఒక నమ్మకం. అందువల్ల అక్కడికి వచ్చి, అక్కడే ఏదో ఒక హోటల్లో బస చేసి ఆ నీటి ద్వారా స్వస్థత పొందాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఒక హోటల్లో కథ మొదలౌతుంది.)
– అనువాదకుడు
ఆ హోటల్లో బస చేసిన అతిథులు ఒక్కొక్కరే వచ్చి డైనింగ్ రూమ్ లో కూర్చుంటున్నారు. వెయిటర్లు ఏ మాత్రం తొందరపడకుండా ఆలస్యంగా వచ్చి చేరే అతిథులు కూడా వచ్చేదాకా ఎదురుచూస్తున్నారు. అలాగైతే మళ్ళీ మళ్ళీ పదార్థాలు తీసుకొచ్చే పని తప్పుతుందని వాళ్ళ ఆలోచన. ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చేవాళ్ళు, దాదాపు ఆరోగ్యాలు కుదుటపడి చివరి అంకంలో వున్నవాళ్ళు అక్కడ చేరి తలుపు తెరుచుకున్నప్పుడల్లా తల తిప్పి ఎవరివైనా కొత్త ముఖాలు కనిపిస్తాయేమోనని చూస్తున్నారు.
ఇలాంటి పర్యాటక స్థలంలో ఇదే సమస్య. ఇక్కడికి వచ్చేవాళ్ళంతా ఎప్పుడెప్పుడు రాత్రి భోజనాల వేళ అవుతుందా, ఎప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ ముఖాలని చూద్దామా అని ఎదురు చూస్తుంటారు. వచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకు వచ్చారు? వాళ్ళ మనసులో ఏ ఆలోచనలు వున్నాయి? అని గుచ్చి గుచ్చి చూస్తుంటారు. సాధారణంగా మనందరికి కూడా కొత్తవాళ్ళని అందునా కాస్త ఆహ్లాదాన్ని ఇచ్చే వాళ్ళని కలవాలని, పరిచయాలు పెంచుకోవాలని అనిపిస్తూనే వుంటుంది. బహుశా ఏదైనా ప్రేమ సంబంధమైన సాహసాలు చేసే ఉద్దేశ్యాలు కలగవచ్చు కూడా. ఒకళ్ళనొకళ్ళు తోసుకుబతికే ఈ జీవితాలలో అపరిచితులతో పరిచయం ఎంతో ప్రాధాన్యత కలిగివుండటంలో ఆశ్చర్యమే లేదు. వాళ్ళ వల్ల ఏదో కుతూహలం కలుగుతుంది, వాళ్ళపైన కురిపించడానికి జాలి కరుణ పొంగుకొస్తుంటుంది, కలుపుగోలుతనం ఒక నియమంలా తయారౌతుంది.
మన స్నేహాల కాలం నెలనాళ్ళైతే, వైరాల వ్యవధి వారాలు మాత్రమే. ఇలాంటి చోట పరిచయస్తులను చూసే విధానంలోనే మార్పు వుంటుంది. పరిచయమైన కొత్తల్లో అంతా బాగానే వుంటుంది. రాత్రి భోజనం తరువాత, పార్కులో చెట్టు నీడన, ఔషధ ఊటల దగ్గర ఓ గంట మాట్లాడితే చాలు – ఆ మనిషిలో ఎంతో విద్వత్తు, ఆశ్చర్యపరిచే విజ్ఞానం కనిపిస్తాయి. ఓ నెల తిరిగిన తరువాత మనల్ని అబ్బురపరిచిన ఆ కొత్త స్నేహితుడు కనీసం గుర్తు కూడా వుండడు.
అలా కాకుండా చిరకాలం నిలిచే బలమైన బంధాలు కూడా ఇలాంటి చోట ఏర్పడచ్చు. అదే మనుషుల్ని పదే పదే చూడటం వల్ల త్వరగా పరిచయస్థులుగా మారే అవకాశం కూడా వుంది. ఆ పరిచయంలో ఒకలాంటి తియ్యందనం వుంటుంది. అదే ఎంతో కాలం ఏ ఆటంకం లేకుండా నిలిచే ఆత్మీయతకు కారణం అవుతుంది. ఆ తరువాత ఎంతో కాలం గడిచిపోయినా సరే ఆ స్నేహపరిమళం జ్ఞాపకం వస్తూనే వుంటుంది. మొదటి సారి కలిసినప్పుడు మనసుల్ని ఆవిష్కరించిన సంభాషణలు, చూపులతోనే వేసుకున్న ప్రశ్నలు, చెప్పుకున్న సమాధానాలు, చెప్పాలని చెప్పకుండా ఆగిపోయిన రహస్యాలు, మొదటిసారి కలిగిన నమ్మకం, ఆ నమ్మకం ఆధారంగా ఎదుటి వాళ్ళు మనతో మనసు విప్పి మాట్లాడతారని నమ్మి వారి ముందు ధైర్యంగా మనసు విప్పి చెప్పిన సంగతులు, ఇవన్నీ గుర్తుకువస్తూనే వుంటాయి.
వైద్యానికి ఊటనీటిని వాడే ఇలాంటి ప్రదేశాలలో విషాదాలకూ కరువేముండదు. ఆ విషాదాల మధ్య ఏ మాత్రమూ మార్పు లేకుండా ఏకరీతిన సాగిపోయే రోజులలోని ప్రతి నిముషమూ మనసు వైశాల్యాన్ని పెంచుకోమని ప్రోత్సహిస్తుంటాయి.
ఇంతకూ జరిగిందేమిటంటే, ప్రతి రోజులాగే ఈ సాయంత్రం కూడా మేమంతా కలిసి, ఎవరివైనా కొత్త ముఖాలు చూసే అవకాశం వస్తుందేమోనని ఎదురుచూస్తూ వున్నాం.
రెండు కొత్త ముఖాలు వచ్చాయి. అయితే రెండూ విలక్షణమైనవి. ఒక ఆడ, ఒక మగ – తండ్రి, కూతురు. నాకెందుకో ఎడ్గర్ పో కథల్లో పాత్రలు గుర్తొచ్చాయి. వెంటనే వాళ్ళ ముఖాలు నన్ను ఆకర్షించాయి. వాళ్ళ ముఖాలలో కనపడిన దురదృష్టం వల్ల కలిగిన ఆకర్షణ అది. నాకు వాళ్ళు విధి వంచితులుగా కనిపించారు.
మగమనిషి బాగా పొడుగ్గా సన్నగా, కాస్త ముందుకు వంగిపోయి వున్నాడు. పూర్తిగా తెల్లటి జుట్టు. అతని శరీరం యువకుడిలా వున్నదన్న మాటే గానీ జుట్టు అలా లేదు. ప్రొటెస్టెంట్లలో మాత్రమే కనపడే కాఠిన్యం అతనిని ఆవరించి వుంది. కూతురి వయసు ఇరవై నాలుగు-ఇరవై ఐదు వుండచ్చు. గువ్వలా చిన్న శరీరం. ఆమె కూడా బాగా సన్నగా పాలిపోయినట్లు వుంది. మొత్తం మీద ఆమె బడలిక వల్ల సోలిపోయిన లక్షణం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మనకి ఇలాంటి మనుషులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. దినచర్యలను కూడా చేసుకునే ఓపిక లేని మనిషుల్లా కనిపిస్తారు. కనీసం కదలడానికి కూడా ఓపికలేనట్లు వుంటారు. చూడటానికి చక్కగానే వుంది. ఏదో దైవత్వం పల్చటి పొరగా కనిపిస్తోంది. ఆమె చాలా నెమ్మదిగా తింటోంది. చేతిని కదపడానికి కూడా శ్రమ పడుతున్నట్లుగా అనిపిస్తోంది.
ఖచ్చితంగా ఆమెకు ఈ వూరి జలాలని ఇప్పించడానికే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
నేను కూర్చున్న టేబుల్ దగ్గరే, నాకు ఎదురుగా కూర్చున్నారిద్దరూ. నేను వెంటనే గమనించింది ఆయన చేతుల కదలికలు. ఏదో నరాలు బలహీనత వున్నట్లు చేతిని ఒక రకంగా విదిలిస్తున్నాడు. ఏదైనా వస్తువుని అందుకోవాలని చేతిని చాస్తే అది వంకర టింకరగా కదిలి అందుకోవాల్సినది అందుకునేది. అలా అతను చేస్తున్న కొద్దీ, కొంతసేపటికి నాకు చిరాకనిపించి, అటు చూడకుండా తల తిప్పుకున్నాను.
అంతే కాదు, నేను గమనించినదాని ప్రకారం, ఆ అమ్మాయి భోజనం చేస్తున్నంత సేపూ చేతికి గ్లవ్స్ వుంచుకోనే వుంది.
భోజనం అయిన తరువాత పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన పార్కులో అలా తిరిగొద్దామని బయల్దేరాను. ఆ దారి వెంటే వెళితే ఛాసెల్-గుయాన్ ప్రాంతానికి చెందిన లిటిల్ ఔవర్గ్నెస్ స్టేషన్ చేరుకోవచ్చు. పెద్ద పెద్ద పర్వతాలు ప్రారంభమయ్యే ఆ ప్రాంతంలోనే వేడి జలాల ఊటలు ఉంటాయి. ఎప్పుడో అంతరించిపోయిన అగ్నిపర్వాల కారణంగా ఈ జలాలు పుట్టుకొస్తుంటాయి. మన తలలు ఎత్తి దూరంగా చూస్తే అక్కడ ఆరిపోయిన అగ్నిపర్వాతాలు గోపురాల్లాగా బూడిద రంగులో, మిగిలిన పర్వతాలకన్నా ఎత్తుగా కనిపిస్టాయి. ఛాసెల్-గుయాన్ ఆ పర్వతాలకు మొదట్లో వుండటం వల్ల అలా ఎత్తుగా కనిపిస్తుంది.
ఆ కొండకు ఆవల ప్రాంతమంతా పర్వతాలతో నిండి వుంటుంది. ఇంకా అవతల అన్నీ మొనదేలిన శిఖరాలు కనిపిస్తాయి.
“పై ది డోమ్” అని పిలవబడే పర్వతం అన్నింటికన్నా ఎత్తైనది. “పీక్ ఆఫ్ సాన్సీ” అన్నింటికన్నా ఎత్తులో వుంటుంది. “కాన్టల్” మిగిలిన పర్వతాల కన్నా ఎక్కువగా మొనదేలి వుంటుంది.
వెచ్చని సాయంత్రం కావడంతో చెట్ల నీడల వెంటే నడుస్తూ ముందుకు సాగాను. దూరంగా పార్కు వైపుకు కట్టిన స్టేజ్ పైన క్యాసినో బాండ్ వాళ్ళు వాయిస్తున్న సంగీతం వింటూ నడుస్తున్నాను.
అంతకు ముందు కనపడ్డ తండ్రీ కూతుర్లు నా వైపే నెమ్మదిగా నడుచుకుంటూ రావడం గమనించాను. ఆ ప్రాంతంలో హోటల్లో తమతో పాటే వున్న వారికి తోటివారు అభివాదం చేసే విధంగా నేను కూడా వాళ్ళ వైపు కొద్దిగా వంగి అభివాదం చేశాను. నడుస్తున్న వాడల్లా అతను ఉన్నట్లుండి ఆగి నాతో మాట్లాడాడు.
“మాన్సియర్, ఇక్కడ్నుంచి చిన్నగా కాస్త దూరం ఆహ్లాదంగా నడవాలనుకుంటున్నాము. ఎత్తులు ఎక్కాల్సిన అవసరం లేకుండా ఎటు వెళ్తే మేలో కాస్త చెప్పగలరా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని మాత్రం అనుకోకండి” అన్నాడు.
నేనే దారి చూపించడానికి సిద్ధపడ్డాను. అటూ ఇటూ పచ్చని చెట్లతో, మధ్యలో సన్నగా పారుతూ లోయ వైపు సాగే నది వెంబడి తీసుకెళ్తానని చెప్పాను.
వాళ్ళిద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు.
దారి వెంట ఊహించినట్లుగానే అక్కడి నీటి సద్గుణాల గురించి మాట్లాడుకున్నాము.
“అన్నట్లు నా కూతురికి ఒక ఆరోగ్య సమస్య వుంది. ఆ రోగం ఎందువల్ల వచ్చిందో కూడా తెలుసుకోలేకపోయాము. ఉన్నట్లుండి కారణంలేకుండా నరాలు పట్టు తప్పుతుంటాయి. ఇదేదో గుండెకు సంబంధించిన రోగమని కొంతకాలం డాక్టర్లు భావించారు. మరోసారి ఇది కాలేయానికి సంబంధించినది కావచ్చని ఊహించారు. ఇంకోసారి చూపిస్తే వెన్నెముకలో ఏదో సమస్య అన్నారు. గడియకో రకంగా మారిపోయే రోగం ఇది. వెయ్యి రకాలుగా మారుతుంది, వెయ్యి రకాలుగా దాడి చేస్తుంది. ఇప్పుడిది కడుపుకి సంబంధించిన రోగమేమో అని అనుమానిస్తున్నారు. కడుపు శరీరం మొత్తానికి సంబంధించిన బాన లాంటిది కదా అంచేత అలా అంటున్నారు. ఆ కారణంగానే ఇక్కడికి వచ్చాము. నా మటుకు నేను ఇది నరాల సమస్య అనే అనుకుంటుంటాను. ఏదైతేనేమి ఇది మా ఖర్మ. అంతే” అన్నాడాయన.
నాకు వెంటనే అతను చేతిని విసిరినట్లు కదిలించినది గుర్తుకు వచ్చింది.
“బహుశా ఇది వంశపారంపర్యంగా వచ్చిందేమో. మీకు కూడా ఏదో నరాల సమస్య వున్నట్లుందీ?” అడిగాను నేను.
ఆయన చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పసాగాడు:
“నాకా? నా నరాలు ఎప్పుడూ స్థిరంగానే వున్నాయే” అన్నాడు. ఆ తరువాత కొద్దిసేపు మౌనం వహించి మళ్ళీ కొనసాగించాడు.
“ఓహో... నేను ఏదైనా అందుకోడానికి చెయ్యి చాపినప్పుడల్లా చేతిని విసురుగా కదిలించడం గురించి ప్రస్తావిస్తున్నట్లున్నావు కదూ? దానికి కారణం ఓ దారుణమైన సంఘటన. నువ్వు ఊహించలేవు కూడా. ఇదిగో నా కూతురు, దీన్ని బత్రికి వుండగానే సమాధి చేసేశాము.!”
ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై “అయ్యో” అని మాత్రం అనగలిగాను.
అతను కొనసాగించాడు:
జరిగిందేమిటంటే జూల్యట్ గుండెకి సంబంధించిన సమస్య కొంతకాలంగా వుంది. మేము కూడా ఆ విషయం తెలుసుకున్న తరువాత ఏమైనా జరగవచ్చని సిద్ధపడే వున్నాము.
ఒకరోజు ఆమెను ఇంట్లోకి మోసుకురావాల్సి వచ్చింది. అప్పటికే ఆమె ప్రాణంలేకుండా చల్లగా గడ్డకట్టుకుపోయి నిర్జీవంగా వుంది. తోటలో స్పృహతప్పి పడిపోయిందట. డాక్టర్లు పరీక్షించి ఆమె మరణాన్ని ధృవీకరించారు. ఆమెనే అంటిపెట్టుకోని ఒకరోజు రెండు రాత్రులు గడిపాను. నా చేతులతో ఆమెని శవపేటికలో పడుకోబెట్టాను. స్వయానే నేనే ఆమెను స్మశానానికి తీసుకెళ్ళాను. మా కుటుంబాన్ని ఖననం చేసిన చోటే ఆమెను కూడా చేర్చాము. లోరైన్ నగరం నడిబొడ్డున నా కూతురిని పూడ్చిపెట్టాను.
నేనే కోరి ఆమె నగలను, కడియాలను, నక్లేసులను, ఉంగరాలను, ఆమెకి లభించిన బహుమతులను, తొలిసారి వేసుకున్నబాల్ డ్రస్సును – అన్నింటినీ ఆమెతో పాటే వుంచేశాను.
తిరిగి ఇల్లు చేరుకునేసరికి నా మనఃస్థితి ఏమైవుంటుందో మీరు ఊహించుకోగలరు కదా. ఒక్కగానొక్క కూతురు. ఎన్నో ఏళ్ళ క్రిందట నా భార్య చనిపోయిన తరువాత మిగిలిన ఏకైక బంధం. పరధ్యానంగా నడుస్తూ నా అపార్ట్మెంట్ చేరుకున్నాను. మనసంతా ఖాళీగా అయిపోయింది. వచ్చి ఇంట్లో నా పడకకుర్చీలో కూలబడ్డాను. కనీసం ఆలోచించడానికి కూడా శక్తిలేక పోయింది. కదులుతున్న యంత్రంలా, ఆ క్షోభని అనుభవిస్తూ నిస్సారంగా వుండిపోయాను. మనసు గాలికి వదిలేసిన గాయంలా వుంది.
ప్రాస్పర్ అని ఎంతో కాలంగా నా దగ్గర పనిచేస్తుండేవాడు. జూల్యట్ ని శవపేటికలో పెట్టడంలో నాకు సహాయపడ్డాడు కూడా. ఇద్దరం కలిసే నా కూతుర్ని సాగనంపాము. అతని చప్పుడు చేయకుండా నా గదిలోకి వచ్చాడు.
“మాన్సియర్ మీకు ఏమన్నా ఇవ్వమంటారా?” అన్నాడు.
నేను వద్దన్నట్లు తలవూపాను.
“తప్పండీ అయ్యగారు. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోను? పోనీ పక్క సర్దమంటారా? కాస్సేపు పడుకుంటారా?” అన్నాడు.
“వద్దురా. నన్ను వంటరిగా వదిలేయ్” సమాధానం చెప్పాను. అతను వెళ్ళిపోయాడు.
ఎన్ని గంటలు కరిగిపోయాయో తెలియదు. ఎంత దారుణమైన రాత్రి అది. చలిగా అనిపించింది. నేను నిప్పుగూటిలో వేసుకున్న మంట ఆరిపోయింది. చల్లటి శీతాకాలపు గాలి, గడ్డకట్టించే గాలి ఆగి ఆగి కిటికీలో నుంచి దుష్టసంకేతంలా చొచ్చుకొస్తోంది.
ఎన్ని గంటలు గడిచిపోయాయో? నేను అలాగే పడివున్నాను. నిద్రపట్టలేదు. శక్తి లేదు. శరీరాన్ని అణిచేసి పిప్పి చేసినట్లు వుంది. కళ్ళు తెరుచి, కాళ్ళు చాపుకోని  అచేతనంగా వున్నాను. నిరాశతో మెదడు కూడా స్తబ్ధుగా వుండిపోయింది. సరిగ్గా అప్పుడే, ఉన్నట్టుండి కాలింగ్ బెల్ మోగింది. అవును మా వాకిట్లో వున్న బెల్లే... గట్టిగా మోగింది.
నేను ఒక్కసారి ఉలిక్కిపడేసరికి నా కుర్చీ కిర్రుమని చప్పుడు చేసింది. ఆ బరువైన, గంభీరమైన చప్పుడు ఏదో గుహలో మోగినట్లు నా ఖాళీ ఇంటిలో ప్రతిధ్వనించింది. వెనక్కి తిరిగి గడియారంలో టైమ్ చూసాను. రాత్రి రెండు గంటలైంది. ఈ సమయంలో ఎవరు వచ్చివుంటారా అని అనుకున్నాను.
మళ్ళీ బెల్ రెండు సార్లు మోగింది. నా పనివాళ్ళు భయంతో బిగుసుకుపోయి వుంటారని నేనే మైనపు కొవ్వొత్తి వెలిగించి మెట్లు దిగాను.
“ఎవరూ? ఎవరు వచ్చింది?” అంటూ అడుగుతూనే వున్నాను.
నా భయానికి నాకే సిగ్గుగా అనిపించింది. తలుపుకున్న పెద్ద పెద్ద గడులను తీశాను. నా గుండె పిచ్చిపట్టినట్లు కొట్టుకుంటోంది. భయం ఆవహించింది. ఉన్నట్టుండి అప్రయత్నంగా తెరిచినట్లు తలుపులు తెరిచాను. ఆ చీకట్లో ఏదో తెల్లటి ఆకారం గుర్తించాను. స్థిరంగా నిలబడి వుంది. చూడటానికి ఏదో దయ్యంలా అనిపించింది.
వెనక్కి గెంతి, భయంతో బిగిసుకుపోయాను.
“ఎ..ఎ.. – ఎవరు – ఎవరు నువ్వు?” అన్నాను తడబడుతూ.
ఒక గొంతు సమాధానం చెప్పింది. “నేనే నాన్నా” అని.
నా కూతురు!
నాకు పిచ్చి పట్టిందనుకున్నాను. ఆ ఆకారం ముందుకు వస్తుంటే నేను వెనక్కి అడుగులు వేశాను. నా చేతిని పైకెత్తి భూతాన్ని తరిమేస్తున్నట్లు వూపుతూ వెనక్కి నడిచాను. మీరు ఇందాక గమనించారే నా చేతిని కదిలించడం గమనించారు కదా అలాగన్నమాట - అప్పటి నుంచి ఆ చేతి కదలిక నాతో అలాగే వుండి పోయింది.
“భయపడకండి పాపా” అంది ఆ దయ్యం. “నేను చనిపోలేదు. ఎవరో నా ఉంగరం కాజేయాలని ఒక వేలిని కోసేశారు. రక్తం పారడంతో మెలకువ వచ్చింది. నాలోకి జీవం వచ్చింది.
నిజమే, ఆమె చేతి నిండా రక్తం కనపడతోంది.
నేను మోకాళ్ళ మీద కూర్చుండిపోయి వెక్కిళ్ళు గొంతుకు అడ్డపడుతుండగా వలవలా ఏడ్చాను.
అలా కాస్సేపటి తరువాత ఆలోచనలన్నీ కూడగట్టుకున్నాను. ఇంకా నాలో భయం పూర్తిగా పోలేదు. అది ఎంత ఆనందకరమైన సంఘటనో అప్పటికి ఇంకా గుర్తించే స్థితిలో కూడా లేను. అమ్మాయిని పైన నా గదిలోకి వెళ్ళి నా పడక్కుర్చీలో కూర్చోమని చెప్పాను. ఆ తరువాత ఆతృతతో ప్రాస్పర్ ని పిలిచాను. నిప్పు గూట్లో మంట కాస్త రగిల్చి, వైన్ ఇస్తాడనీ, సాయంగా వుంటాడాని నా వుద్దేశ్యం.
వాడు లోపలికి వచ్చి నా కూతుర్ని చూడగానే బిత్తరపోయి నోరు తెరిచి గట్టిగా గాలి వదులుతూ మైకం కమ్మినవాడిలా తూలి వెనక్కిపడ్డాడు. అంతే, ప్రాణం పోయింది.
వాడే సమాధి పగులకొట్టినవాడు. నా కూతురి వేలు కత్తిరించి అలా వదిలేసినవాడు. దొంగతనం చేసిన తరువాత ఆ విషయం పదిమందికి తెలియకుండా వుండాలన్న ప్రయత్నం కూడా లేకుండా అలా వదిలేశాడు వాడు. కనీసం శవపేటికని తిరిగి పెట్టేయాలని కూడా అనుకోలేదు. నేను వాణ్ణి అనుమానించనని వాడికి నమ్మకం. నాకు కూడా వాడి మీద పూర్తి నమ్మకం వుండేది.
అది మాన్సియర్ జరిగింది. అందుకే మేము దురదృష్టవంతులం అంటున్నాను.
అతను మౌనంగా వుండిపోయాడు.
చీకట్లు పరుచుకున్నాయి. నల్లటి నీడలు నిర్మానుష్యమైన ఈ కొండల మధ్య దుఃఖంలా వ్యాపించాయి. సమాధి నుంచి లేచి వచ్చిన అమ్మాయి, అనూహ్యంగా చేతిని విసిరే తండ్రి, ఈ ఇద్దరు అపరిచితులు నా పక్కనే వున్నారన్న గమనింపు ఏదో తెలియని చిత్రమైన భయం నన్ను ఆవహించేలా చేసింది.
అతను చెప్పిన భయంకరమైన కథ గురించి ఏం మాట్లాడానికీ సాధ్యం కాదని అనిపించింది.
“ఎంత దారుణం” అని మాత్రం గొణిగాను.
ఓ నిముషం మౌనం తరువాత మళ్ళీ నేనే మాట్లాడాను: “చలి పెరుగుతోంది. మనం గదుల్లోకి వెళ్దామా”

అందరం హోటల్ కి తిరుగు ప్రయాణం అయ్యాము.

మొపాస కథలు: వీరమాత


దాదాపు పదిహేనేళ్ళైంది ఆ వూరికి వెళ్ళి. నా స్నేహితుడు సెర్వల్ తో కలిసి వేటకు వెళ్ళాలన్న ఆలోచనతో ఓ శరత్కాలంలో అక్కడికి వెళ్ళాను. ప్రష్యాసేనలు ధ్వంసం చేసిన తోటబంగ్లాని మళ్ళీ కట్టించాడట వాడు.
నాకెంతో నచ్చిన ప్రాంతమది. కంటికింపైన మనోహర దృశ్యాల సమాహారంలా వుంటుంది. అక్కడికి వెళితే ఆ ప్రాంతంతో ప్రేమలో పడటం ఖాయం. పల్లెటూరి అందాలంటే మంత్రముగ్ధులయ్యే నా లాంటివాళ్ళైతే ఇక్కడ చూసిన ఓ ఏరో, అడవో, ఒక కాలువో, ఒక కొండో ఇలా ఏదో ఒక సుందరమైన, ఆనందరకరమైన విషయాలను పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఒకోసారి ఆలోచనలు వెనక్కి మళ్ళిస్తే, చక్కటి పగటి వెలుతురులో ఏదో ఒక రోజు, కేవలం ఒకే ఒక్కసారి  చూసిన అడవిలో ఏదో ఒక ప్రాంతంగానీ, ఏటి ఒడ్డుగానీ, పూలతో నిండిన తోటలు కానీ – ఇలాంటివేవో గుర్తుకొస్తాయి. ఆహ్లాదమైన వసంతకాలం ఉదయం పల్చటి దుస్తుల్లో కనిపించి కవ్వించి, కోరికలు రేకెత్తించిన అమ్మాయిలాంటి లాంటి మత్తైన భావనలు ఈ జ్ఞాపకాలు. ఇవి సంతోషానికి ఒక మెట్టు పైనే వుంటాయి.
ప్రత్యేకంగా ఈ వూరంటే నాకు చాలా ఇష్టం. పచ్చని తోటలు, వాటి మధ్యలో ప్రవహించే వాగులు – సూర్యకిరణాలు పడినప్పుడు చూడాలి తళుక్కుమని మెరుస్తూ, భూదేవికి ప్రాణవాయువు మోసుకెళ్తున్న జీవనాడుల్లా వుంటాయి. ఆ వాగుల్లోనే మేము చేపలు పట్టేవాళ్ళం. గాజురొయ్యలు, జెల్లచేపలు, బుక్కడాలు..!! స్వర్గంలా వున్నట్లుండేది. ఆ వాగుల్లోనే ఎక్కడపడితే అక్కడ స్నానులు చేసేవాళ్ళం. ఒకోసారి ఏటి ఒడ్డున ఎత్తుగా పెరిగిన గడ్డి మధ్యలో ఉల్లాం పిట్టలు కూడా దొరికేవి.
ఆ వూరెళ్ళాక ఒకరోజు సూర్యుడు పరిచిన వెలుతురు వెంట మేకపిల్లలా నడుస్తున్నాను. నాకు కొన్ని అడుగుల ముందు నా వేటకుక్కలు నడుస్తున్నాయి. నా మిత్రుడు సెర్వెల్ నాకు కుడివైపు ఓ వంద మీటర్ల దూరంలో వాడి మెంతి పొలాలు చదును చేస్తున్నాడు. దడిలా పెంచిన పొదల చాటు నుంచి చూస్తే నాకు ఓ పాడుపడ్డ భవంతి కనపడింది.
నాకు జ్ఞాపకం వచ్చింది. ఇంతకు ముందు 1869లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఇంటిని చూశాను. చక్కగా, ఇంటి పై కప్పుపైన తీగలు పాకి వుంది. ఇంటి ముందంతా కోళ్ళు తిరుగుతుండేవి. ఇప్పుడిదేంటి? ప్రాణం పోయి, అస్తిపంజరంలా మిగిలిన ఇల్లు? ఇంతకన్నా అమంగళం ఇంకేముంటుంది చెప్పండి?
అంతే కాదు, అప్పుడు రోజంతా అలిసిపోయేట్లు తిరిగి ఇక్కడికి వస్తే ఎవరో ఒక పెద్దావిడ పిలిచి చెరో గ్లాసెడు వైన్ ఇచ్చింది. సెర్వెల్ ఆ ఇంటివారి గురించి చాలా చెప్పాడు. ఆ ఇంటి యజమానిని వేటాడకూడని ప్రదేశంలో వేటాడాడని మిలటరీ పోలీసులు కాల్చి చంపారుట. వాళ్ళబ్బాయిని ఒకసారి అనుకుంటా చూశాను. బాగా పొడుగ్గా, ఎండిపోయినట్లు వుండేవాడు. అతనిలో భయంకరమైన వేటగాడి లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. ఆ కుటుంబాన్ని చుట్టుపక్కల వాళ్ళు ’లే సువాజ్’1 అని వ్యవహరించేవారు. (సువేజ్’ అనే పదానికి ఫ్రెంచ్ లో ఉగ్రమైన, భయానకమైన, క్రూరమైన మొదలైన అర్థాలు వున్నాయి)
అది ఇంటిపేరా? లేకపోతే ఎవరైనా గేలి చెయ్యడానికి పెట్టిన పేరా? తెలియదు.
సెర్వెల్ ని పిలిచాను. వాడు పొడుగైన కాళ్ళతో కొంగలాగా నడుచుకుంటూ వచ్చాడు.
“ఏమైందిరా ఇక్కడి మనుషులకి?” అడిగాను.
వాడి చెప్పిన కథ ఇదీ –
యుద్ధం ప్రకటించేటప్పటికి ఈ సువాజ్ ల కొడుకు వున్నాడు కదా, వాడికి అప్పుడు ముప్ఫై ఏళ్ళు వుంటాయి. అతను సేనలో చేరి తల్లిని ఒక్కదాన్నే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమెను చూసి పెద్దగా ఎవరూ జాలిపడలేదు. ఆమె దగ్గర కాస్తో కూస్తో డబ్బు వుంది. ఆ సంగతి అందరికీ తెలుసు.
అంచేత, ఎప్పుడూ ఒక్కతే ఈ ఇంట్లో వుండేది. పైగా ఇది వూరికి దూరం కూడా కదా.. ఇంక నాలుగు అడుగులేస్తే చెట్లు చేమలు, అడవి.!! ఆమె మాత్రం ఎప్పుడూ భయపడలేదు. ఒక మగవాడిలాగే ధృఢంగా తిరుగుతుండేది. సన్నగా పొడుగ్గా వుండేది. ఎప్పుడూ నవ్వేది కాదు. ఆమెతో ఎవరూ సరదాగా మాట్లాడింది కూడా లేదు.
ఈమెలాగ వ్యవసాయం చేసుకునే ఆడవాళ్ళు మామూలుగా నవ్వేది తక్కువే అనుకో.. మగవాళ్ళంటావా వాళ్ళ పనే అది. అయినా వాళ్ళ మనసుల్లో కూడా దుఖం గూడు కట్టుకోని వుంటుంది. వాళ్ళు కూడా విషాదమైన చీకటి బతుకులు బతుకుతుంటారు. సరదాగా ఏ కల్లుపాక దగ్గరన్నా, సంబరాలప్పుడన్నా మగవాళ్ళు హడావిడి చేస్తూ ఆనందిస్తారు కానీ వాళ్ళ ఆడవాళ్ళు మాత్రం ఇలాగే గంభీరమైన, ధృడమైన ముఖాకృతి కలిగివుంటారు. బహుశా వాళ్ళ జీవితం వారి ముఖంలోని కండరాలకి నవ్వటం నేర్పించలేదేమో.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఈమె చాలా సాదా సీదాగా ఈ కాటేజ్ లో వుంటుండేది. ఆ మధ్య మంచుకురిసి ఇంటిని తెల్లగా కప్పేసిన కాలంలో ఆమె వారం వారం పల్లెలోకి వచ్చి కాస్త మాంసం, బ్రెడ్ తీసుకెళ్తుండేది. ఆ ప్రాంతంలో తోడేళ్ళు తిరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారని ఒక తుపాకీ భుజానవేసుకోని వచ్చేది. ఆమె కొడుకు తుపాకీ అది. కాస్త తుప్పుపట్టి, చేతులు తగిలే చివర్లలో అరిగిపోయి వుండేది. ఆమెను చూడటానికి చాలా చిత్రంగా కనిపించేది. పొడుగ్గా వుండి, ముందుకు కాస్త వంగినట్లు నడిచేది. మంచులో జాగ్రత్తగా అంగలేస్తూ ముందుకు పోతుంటే, ఆమె తుపాకీ మోరఎత్తి వెనక్కి చూస్తున్నట్లుండేది. తల మీద ఎప్పుడూ ఒక పాగా కట్టుకోని వుండేది. ఆ పాగా ఎవరికీ కనపడకుండా ఆమె తెల్లజుట్టుని బంధించినట్లు వుండేది.
ప్రష్యా సైనికులు వూర్లోకి అడుగుపెట్టారు. వూర్లో వున్న కుటుంబాల ఆస్తినీ, స్థోమతనీ పరిశీలించి దానికి అనుగుణంగా సైనుకులను ఇంటింటికీ పంచారు. ఈ ముసలామెకు వున్న ఆస్థిని అనుసరించి నలుగురు సైనికులుని అప్పగించారు.
నలుగురూ బాగా దిట్టమైన వాళ్ళు. మంచి రంగు, నీలం రంగు కళ్ళు, గోధుమరంగు గడ్డాలు చూడ్డానికి ఇలా వుండేవారు. ఇంతకాలం యుద్ధంవల్లా, అలుపు అలసటల వల్లా శరీరం సన్నబడాలా? ఊహూ.. బలంగా వున్నారు. దేశాన్ని ఆక్రమించిన పొగరు లేకపోగా దయ, జాలితో వ్యవరించేవారిలా వున్నారు. ఆ పెద్దామెతో వున్నంతకాలం ఆమె మీద అభిమానంతో ఆమెకు శ్రమకానీ, ఖర్చుకానీ వుండకూడదని సాయశక్తులా కృషి చేసేవారు. తమ బట్టలను తామే శుభ్రం చేసుకుంటూ అప్పుడప్పుడు బావి దగ్గర కనపడేవారు. పచ్చటి తమ శరీరాల మీద నీళ్ళు చిమ్ముకుంటూ నవ్వుకునేవారు. ఒకోసారి కిచెన్ శుభ్రం చేస్తూనో, బండలు కడుగుతూనో, కట్టెలు కొడుతూనో, బంగాళాదుంపల తోలు వలుస్తూనో లేకపోతే ఇంకేదో సాయం చేస్తూనో కనిపించేవారు. విధేయులైన నలుగురు కొడుకులనీ, వాళ్ళ తల్లిని చూస్తున్నట్లుందని చుట్టుపక్కవాళ్ళు అనుకునేవారు.
ముసలామె మనసు మాత్రం ఎప్పుడూ సన్నగా పొడుగ్గా వుండే కన్నకొడుకు మీదే వుండేది. వాడి కోటేరు లాంటి ముక్కు, దట్టమైన నల్లటి మీసాలు ఇవన్నీ గుర్తు చేసుకునేది. "నాయనా, 23వ నెంబరు ఫ్రెంచ్ కాల్బలాన్ని ఎటు వైపు పంపారో నీకేమైనా తెలుసా? నా బిడ్డ అందులో వున్నాడు" అంటూ ప్రతిరోజూ నిప్పుగూడు దగ్గర చేరే ఆ నలుగురు సిపాయిలను ప్రశ్నించేది.
"మాకు తెలియదంటే మాకు తెలియదమ్మా"అంటూ వాళ్ళ భాషలో స్థిరంగా చెప్పేవాళ్ళు ఆ సైనికులు. వాళ్ళు కూడా ఒక తల్లి బిడ్డలే కదా, అంచేత ఆవిడ బాధని, కష్టాన్ని అర్థం చేసుకోని ఆమెకు చిన్నా చితక సాయం చేయసాగారు. ఆ నలుగురూ శత్రుదేశం వాళ్ళైనా ఆమె వాళ్ళని ప్రేమగానే చూసుకుంది. అయినా ఇలాంటి రైతులకీ, కూలీలకి స్వదేశాభిమానం వల్ల కలిగే శత్రుత్వాలు వుండవు. అవన్నీ డబ్బున్న పెద్దవాళ్ళకే. వీళ్ళంతా నిజాయితీగా బతికేవాళ్ళు. అంచేత అన్ని కష్టాలు భరిస్తారు. ప్రతి కొత్త భారం వాళ్ళని కుంగదీస్తూనే వుంటుంది. ఫిరంగి గుళ్ళకి గుంపులు గుంపులుగా వధించబడేది వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు కలసికట్టుగా వుంటారు కాబట్టి. యుద్ధం వల్ల వచ్చి పడే పాపిష్టి దుర్దశలన్నీ భరించేది వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు దుర్బలురు, బలహీనులు, తిరగబడటం తెలియనివాళ్ళు. అసలు ఈ గొడవలు పెట్టుకునే తత్వాలేమిటో, గౌరవం, ప్రతిష్ట పేరుతో పుట్టుకొచ్చే కోపాలేమిటో, రాజకీయ కూటములాడే నాటకాలేమిటో ఆ నాటకాలలో రెండు ఇరుగుపొరుగు దేశాలు ఆక్రమించిన దేశం, ఆక్రమించబడిన దేశంగా మారిపోవటమేమిటో - ఇవేమీ అర్థంకాదు వీళ్ళకు.
ఏది ఏమైనా జిల్లా అధికారులు ఆమె ఇంట్లో వున్న జర్మన్ సిపాయిల విషయంలో సంతృప్తిగానే వున్నారు.
"ఆ నలుగురుకి మాత్రం ప్రశాంతమైన చోటు దొరికింది" అనుకునేవారు.
ఇలా వుండగా ఒకరోజు ఉదయం ఆమె ఒక్కతే ఇంట్లో వున్నప్పుడు, దూరం నుంచి ఎవరో తన ఇంటివైపే వస్తున్నట్లు గమనించింది. పరీక్షగా చూస్తే అతను ఉత్తరాలు బట్వాడా చేసే పోస్టుమాన్ అని గ్రహించింది. అతను వచ్చి మడతపెట్టిన ఓ ఉత్తరాన్ని ఆమె చేతిలో పెట్టాడు. ఆమె కుట్టుపని చేసుకునేటప్పుడు పెట్టుకునే అద్దాలు తీసి పెట్టుకోని చదవటం మొదలుపెట్టింది -
మేడమ్ సువాజ్ గారు: ఈ ఉత్తరం ఓ దుర్వార్తని మోసుకొచ్చింది. మీ కొడుకు విక్టర్ నిన్న చనిపోయాడు. ఓ ఫిరంగిలో నుంచి వచ్చిన గుండు అతన్ని దాదాపు రెండుగా చీల్చివేసింది. సైన్యంలో మా ఇద్దరి స్థానాలు పక్కపక్కనే. అందువల్ల నేను ఆ దగ్గరలోనే వున్నాను. వాడు మీ గురించి చెప్పి, వాడికి ఏదైనా జరిగితే మీకు తెలియజేయమని చెప్పాడు. వాడు పోయాక వాడి పాకెట్ లో వున్న వాచి నేను తీసిపెట్టాను. యుద్ధం పూర్తైన తరువాత మీకు తెచ్చి ఇవ్వగలను.
ఇట్లు: సీజారె రివోట్, సెకండ్ క్లాస్ సిపాయి, 23వ నెంబరు కాల్బలం
మూడు వారాల క్రితం రాసిన ఉత్తరమని తేదీ చెప్తోంది.
ఆమె ఏడవలేదు. ఏదో ఆవహించినట్లు, స్మృతిలేనట్లు, కదలకుండా కట్టెలా నిలబడిపోయింది. అసలు ఏ బాధ కలగనట్లే వుండిపోయింది. "విక్టర్ ఇక లేడు. రాడు" అనుకున్నది తనలో తానే. అంతే..! దుఃఖం క్రమ క్రమంగా, ఒక్కొక్క కన్నీటి చుక్కగా కళ్ళలోనుంచి కన్నీరై కారింది. క్రమంగా ఆమె గుండెలో బాధ నిండుకోవడం మొదలైంది. ఆమెను ఆలోచనలు చుట్టుముట్టాయి. బాధాకరమైనవి, బాధించేవి కూడా. ఇక వాణ్ణి ముద్దు పెట్టుకోలేదు. తన బిడ్డని, చెయెత్తు ఎదిగిన బిడ్డని ఎప్పటికీ ముద్దు పెట్టుకోలేదు. తండ్రిని మిలట్రీ పోలీసులు చంపారు. ఇప్పుడీ ప్రష్యన్లు బిడ్డని పొట్టనపెట్టుకున్నారు. ఫిరంగి గుండు పిల్లాడిని రెండు ముక్కలుగా చేసిందట. కళ్ళ ముందు ఆ దారుణ దృశ్యం కనపడింది.తెగిపోయిన తల కనపడిండి. వాడు కళ్ళు తెరిచి - మీసం ఒక చివరని కోపం వచ్చినప్పుడల్లా ఎలా కొరుకుతాడో సరిగ్గా అలాగే కొరుకుతూ కనపడ్డాడు..!!
ఆ తరువాత వాడి శవాన్ని ఏం చేశారు? కనీసం వాడి తండ్రి శవాన్ని చూడనైనా చూడగలిగింది. వీడి విషయంలో ఆ అదృష్టం కూడా లేదా?
అంతలో ఏదో అలికిడి అయ్యింది. ఆమె దగ్గర వుంటున్న ప్రషియన్ సైనికులు పల్లె లోకి వెళ్ళి తిరిగి వచ్చారు. ఆమె వెంటనే ఆ ఉత్తరాన్ని దాచేసి, కన్నీళ్ళని తుడుచుకోని ఏం జరగనట్లే వాళ్ళని ఆహ్వానించింది.
ఆ నలుగురూ ఎంతో ఉత్సాహంగా నవ్వుకుంటూ వచ్చారు. వాళ్ళ ఆనందానికి కారణం వాళ్ళు పట్టుకొచ్చిన కుందేలు. ఖచ్చితంగా దొంగతనం చేసిందే అయ్యుంటుంది. వాళ్ళంతా ఆమెకు కుందేలుని చూపించి వండిపెట్టమని సైగలు చేశారు.
ఆమె అలాగే బ్రేక్ ఫాస్ట్ చేయడానికి సిద్ధపడింది. అయితే ఆ కుందేలుని చంపడానికి ఆమెకు చేతులు రాలేదు. చంపడం ఆమెకి కొత్తేం కాదు, కానీ ఏదో అశక్తత. నలుగురిలో ఒక సైనికుడు ఆ కుందేలు చెవుల వెనక ఒక పిడిగుద్దు గుద్ది ఆ పని కానిచ్చాడు.
ఆ కుందేలు చనిపోయిన తరువాత దాని చర్మం తొలగించింది. అప్పుడు ఆమె చేతికి గడ్డకట్టినట్లు చల్లగా తగిలిన రక్తం చూడగానే ఆపాదమస్తకం వణికిపోయింది. రెండు భాగాలుగా విడిపోయిన కన్న కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు. గిలగిలలాడిన కుందేలులో ఆమెకి తన కొడుకు కనిపించాడు.
ప్రషియన్ సైనికులతో కలిసి టేబిల్ దగ్గర కూర్చుంది కానీ ఒక్క ముద్ద కూడా తినలేకపోయింది. ఆమె సంగతి పట్టించుకోకుండా వాళ్ళంతా తెచ్చుకున్న కుందేలుని స్వాహా చేశారు. ఆమె వాళ్ళ వైపు క్రీగంట చూసింది కానీ ఏమో మాట్లాడలేదు. ఆమె ముఖం ఎంత అభావంగా వుందంటే వాళ్ళు ఆమె ముఖం చూసి ఏమీ గ్రహించలేకపోయారు.
ఉన్నట్టుండి ఆమె మాట్లాడింది - "కనీసం మీ పేర్లైనా తెలియదు. నెల నాళ్ళు కలిసి గడిపేశాం" వాళ్ళకి అట్టే కష్టపడకుండానే ఆమెకి ఏం కావాలో అర్థం అయ్యింది. సైనికులందరూ తమ తమ పేర్లు చెప్పారు.
ఆమె అది సరిపోదంది. అందరి కుటుంబ వివరాలు, అడ్రసులు ఒక కాగితం మీద రాసిచ్చారు. కళ్ళద్దాలను ముక్కుమీదకు జార్చి వాళ్ళ రాతల్ని పరిశీలనగా చూసింది. ఆ తరువాత ఆ కాగితాన్ని మడిచి, కొడుకు మరణవార్త మోసుకొచ్చిన ఉత్తరం మీద పెట్టింది.
వాళ్ళు తినడం పూర్తయ్యాక - "మీకు కొంత సాయం చేస్తాను" అందామె.
వాళ్ళకు తాత్కాలిక వసతిగా మార్చిన ధాన్యపు గోదాము ఇంటి పై భాగంలో వుంది. అక్కడికి ఊక బస్తాలు మోసుకెళ్ళిందావిడ.
ఆమె పడుతున్న శ్రమ చూసి ఆ నలుగురూ ఆశ్చర్యపోయారు. అలా బస్తాలు అడ్డుగా పెట్టుకుంటే చల్లగాలి రాదనీ, చలి పుట్టదనీ ఆమె చెప్పడంతో అంతా ఆమెకు సాయం చేసేందుకు ఉపక్రమించారు.
వాళ్ళంతా కలిసి ఊక మూటల్ని పైకప్పు తాకేంత ఎత్తుగా అమర్చారు. దాంతో నలుగురికీ నాలుగు గదుల్లాగా ఏర్పడింది. నాలుగు ఊక గోడల మధ్య వెచ్చగా ఓ చిత్రమైన పరిమళాన్ని ఆస్వాదిస్తూ పడుకోవచ్చని అనుకున్నారు.
రాత్రి భోజనాలప్పుడు ఆమె ఏమీ తినటంలేదన్న సంగతి ఒక సిపాయి గ్రహించి ఆమెను అడిగాడు. కడుపులో నొప్పిగా వుందని సర్దిచెప్పింది. ఆ తరువాత నిప్పుగూడు దగ్గరకు చేరి మంట రాజేసి వెచ్చగా కూర్చుంది. నా నలుగురు రోజుటిలాగే నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళడానికి కట్టిన తలుపుద్వారా తాము నిద్రపోయే ప్రదేశానికి చేరుకున్నారు.
వాళ్ళు పైద్వారాన్ని మూసేసిన మరుక్షణం ముసలామె నిచ్చన తొలగించింది.  ఆ తరువాత పెరటి తలుపు చప్పుడు కాకుండా జాగ్రత్తగా తెరిచింది. బయటనుంచి ఇంకా మోపులు మోపులుగా గడ్డి, ఊక తెచ్చి వంట ఇల్లు మొత్తం నింపేసింది. అంత చలిలో కూడా అడుగుల చప్పుడు వినపడకూడదని మంచులో వట్టికాళ్ళతో నడిచింది. మధ్యమధ్యలో నిద్రపోతున్న ఆ నలుగురు సైనికులు గట్టిగా విడివిడిగా పెడుతున్న నాలుగు గురకలు వింటూ తన పని తాను చేసుకుపోయింది.
చేసిన పని సరిపోతుందని తృప్తి కలిగాక ఒక గడ్డి మూటని నిప్పుగూట్లో పడేసింది. అది అంటుకోగానే తీసి మిగిలిన మోపులన్నింటి మీద వేసింది. ఇక అక్కడ్నుంచి బయటకు వెళ్ళి జరుగుతున్నదానిని చూస్తూ నిల్చుంది.
కొద్ది క్షణాల్లో కాటేజ్ లోపల భాగమంతా అంటుకోని వెలిగిపోయింది. కాసేపటికి వెలుగు భయానకమైన జ్వాలగా, పెద్ద ఎత్తుకు మంటలు ఎగసే అగ్నికుండంలా తయారైంది. ఆ మంటల వెలుగు సన్నటి కిటికీలో నుంచి ఒక వెలుగు రేఖలా పరుచుకోని తెల్లటి మంచుపైన పడి పరావర్తనం చెందుతోంది.
ఇంతలో ఇంటి పైభాగం నుంచి అరుపులు వినపడ్డాయి. అవి ఆ నలుగురు సైనికుల బాధ, భయం కలగలసిపోయిన ఆర్తనాదాలు. పై భాగానికి వెళ్ళే తలుపు తగలబడి విరిగిపోయింది. ఒక సుడిగాలి పైకి లేచినట్లు అగ్నికీలలు ఆ తలుపుగుండా పైభాగంలోకి వెళ్ళిపోయి, అంతెత్తున లేచి ఇంటి కప్పుని కాల్చేసి ఆకాశానికి దివిటీ పెట్టినట్లు నిలిచాయి. కాటేజ్ మొత్తం ఆ మహాగ్నికీలల్లో జ్వలించింది.
ఆ తరువాత ఏ అరుపులూ వినపడలేదు. నిప్పు కణికెలు పగులుతున్న చప్పుడు, గోడలు కూలుతున్న చప్పుడు, దూలాలు విరుగుతున్న చప్పుడు మాత్రమే వినపడింది. ఉన్నట్టుండి ఇంటి కప్పు కూలి, శవంలా తగలబడుతున్న కింద భాగంలో పైన పడి నిప్పురవ్వల్ని వెదజల్లింది. దాని వెనకే దట్టమైన పొగ పైకి లేచింది.
మంచు వల్ల తెల్లగా వున్న ఆ ప్రాంతమంతా ఈ మంటలవల్ల వల్ల ఎర్ర జరీ వున్న వెండి రంగు చీర కట్టినట్లు అనిపించింది.
దూరంగా గంట మోగింది.
ఆ పెద్దామె మాత్రం శిధిలంగా పడిపోయిన ఇంటి ముందు నిలబడే వుంది. ఆమె చేతిలో తుపాకీ.. కొడుకు సావేజ్ తుపాకి. ఆ నలుగురులో ఒక్కరు కూడా తప్పించుకోకూడదని ఆమె చేతిలో సిద్ధంగా వుంచుకున్న తుపాకీ..!!
అంతా ముగిసిందని నిర్థారించుకోని చేతిలో తుపాకిని మంటల్లోకి విసిరేసింది. వెంటనే అది పేలిపోయింది.
జనాలు గుమికూడారు. రైతులు, కూలీలు, ప్రష్యన్లు కూడా.
ఓ చెట్టు మొదట్లో ప్రశాంతగా, తృప్తిగా కూర్చోని వున్న ఈమెను చూశారు.
ఒక జర్మన్ అధికారి ముందుకొచ్చాడు. అతనికి ఫ్రెంచ్ భాష తెలిసినట్లే వుంది.
"నీకు అప్పగించిన సైనికులేరి?" అని గద్దించాడు.
ఆమె సన్నటి తన చేతిని పైకెత్తింది. దాదాపు ఆరిపోడానికి సిద్ధంగా వున్నఎర్రటి నిప్పుల కుప్పని చూపించి బలమైన గొంతుతో గట్టిగా చెప్పింది -"అక్కడున్నారు" అని.
జనం ఆమె చుట్టూ చేరారు.
"మంట ఎలా అంటుకుంది?" అధికారి మళ్ళీ ప్రశ్నించాడు.
"నేనే అంటించాను"
ముందు ఎవరూ నమ్మలేదు. అనుకోని ఈ దుర్ఘటన వల్ల ఆమెకు మతిస్థిమితం తప్పిందేమో అనుకున్నారు. అందరూ చుట్టూ మూగి చెవులు ఒగ్గి వింటుండగా ఆమె జరిగినదంతా చెప్పుకొచ్చింది. మొదట్నుంచి చివరిదాకా, ఉత్తరం రావటం నుంచి చివరిగా తగలబడ్డ సైనికుడు ఆఖరి కేక వరకు పొల్లు పోకుండా చెప్పింది.
చెప్పడం పూర్తయ్యాక ఆమె దగ్గరే వున్న రెండు కాగితాలను తీసింది. ఏది ఏ కాగితం గుర్తించడానికి నిప్పుల నుంచి వస్తున్న ఆఖరి వెలుగులో కళ్ళజోడు సర్దుకుంటూ పరిశీలించింది. అందులో నుంచి ఒకటి తీసి చూపించింది.
"ఇదిగో ఇది.. విక్టర్ చావు కబురు మోసుకొచ్చిన ఉత్తరం." రెండో ఉత్తరం తీసి చూపించింది. తల తిప్పి నిప్పుల్లో వున్న మనుషుల అవశేషాలను చూస్తూ - "ఇవిగో... ఇవీ వాళ్ళ పేర్లు, వివరాలు. వాళ్ళ ఇంటికి విషయం తెలియజేయండి." అంటూ కాగితాన్ని ఆఫీసర్ చేతిలో పెట్టింది. అతను ఆమె భుజం మీద చేతులు వేసి పట్టుకున్నాడు. అయినా అమె చెప్పడం కొనసాగించింది -
"ఇది ఎలా జరిగిందో వివరంగా రాయడం మర్చిపోకండి. ఆ పిల్లల తల్లులతో ఇది నేనే చేశానని ఖచ్చితంగా చెప్పండి. సావేజ్ అనే సైనికుడి తల్లే ఈ బిడ్డల్ని తల్లుల నుంఛి వేరు చేసిండని వ్రాయండి. గుర్తుపెట్టుకుంటారుగా?" అంది.
ఆఫీసర్ జర్మన్ భాషలో ఏవో ఆర్డర్లు వేశాడు. ఆమెను దొరకబుచ్చుకొని ఇంకా వేడిగా వున్న ఇంటి గోడకి ఆనించి నిలబెట్టారు. పన్నెండు మంది సైనికులు చకచకా వచ్చి ఓ ఇరవై అంగల దూరంలో ఆమె ఎదురుగా నిలబడ్డారు. ఆమె కదల్లేదు. ఏం జరగబోతోందో అర్థం చేసుకుంది. అది జరిగేదాకా ఎదురుచూస్తూ నిల్చుంది.
ఆజ్ఞ జారీ అయ్యింది. దడ దడ మంటూ కాల్పుల శబ్దం. ఆలస్యంగా పేలిన చివరి తుపాకీ శబ్దం ఒంటరిగా మోగిన తరువాత మొత్తం నిశబ్దంగా మారిపోయింది.
ఆమె పడిపోలేదు. మొదలు నరికినట్లు కిందకు కూలబడిపోయింది.
ప్రష్యన్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి చూశాడు. ఆమె దాదాపు రెండు ముక్కలుగా చీలిపోయింది. ఆమె పల్చటి అరచేతిలో రక్తంలో తడిసిన ఉత్తరం అలాగే వుంది.
నా మిత్రుడు సర్వెల్ ఇదంతా చెప్పి కొనసాగించాడు -
"ఆ పగతోనే జర్మన్లు ఊరిని నాశనం చేశారు. నా ఇల్లు కూడా అప్పుడే కూల్చారు" అన్నాడు.
నాకు ఎందుకో ఆ ఇంట్లో తగలబడిపోయిన అ నలుగురు సైనికుల తల్లులు మదిలో మెదిలారు. ఆ తరువాత బులెట్లకు ఎదురొడ్డి నిలబడ్డ ఆ వీరమాత ధీరత్వం మెదిలింది.
కిందనుంచి ఒక గులక రాయిని ఏరుకున్నాను. మంటల్లో కాలినట్లు నిండా మసి పట్టి నల్లగా వుందది.

<< ?>>
(ఈ రోజు మొపాస వర్థంతి)