(కథా నేపధ్యం: దక్షిణమధ్య
ఫ్రాన్స్ లో “ఫై ది డోమ్” అనే పర్వతం దగ్గర ఈ కథ జరుగుతుంది. ఈ పర్వతం ఒకప్పటి
అగ్నిపర్వం కావటం వల్ల, ఆ పర్వత ప్రాంతంలో వేడి నీటి ఊటలు (hot springs) చాలా
ఏర్పడ్డాయి. ఈ నీటికి అనారోగ్యాలను బాగుపరిచే శక్తి వుందని ఒక నమ్మకం. అందువల్ల
అక్కడికి వచ్చి, అక్కడే ఏదో ఒక హోటల్లో బస చేసి ఆ నీటి ద్వారా స్వస్థత పొందాలని
చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఒక హోటల్లో కథ మొదలౌతుంది.)
–
అనువాదకుడు
ఆ హోటల్లో బస చేసిన అతిథులు
ఒక్కొక్కరే వచ్చి డైనింగ్ రూమ్ లో కూర్చుంటున్నారు. వెయిటర్లు ఏ మాత్రం
తొందరపడకుండా ఆలస్యంగా వచ్చి చేరే అతిథులు కూడా వచ్చేదాకా ఎదురుచూస్తున్నారు.
అలాగైతే మళ్ళీ మళ్ళీ పదార్థాలు తీసుకొచ్చే పని తప్పుతుందని వాళ్ళ ఆలోచన. ఎప్పటి
నుంచో ఇక్కడికి వచ్చేవాళ్ళు, దాదాపు ఆరోగ్యాలు కుదుటపడి చివరి అంకంలో వున్నవాళ్ళు
అక్కడ చేరి తలుపు తెరుచుకున్నప్పుడల్లా తల తిప్పి ఎవరివైనా కొత్త ముఖాలు
కనిపిస్తాయేమోనని చూస్తున్నారు.
ఇలాంటి పర్యాటక స్థలంలో ఇదే
సమస్య. ఇక్కడికి వచ్చేవాళ్ళంతా ఎప్పుడెప్పుడు రాత్రి భోజనాల వేళ అవుతుందా, ఎప్పుడు
కొత్తగా వచ్చిన వాళ్ళ ముఖాలని చూద్దామా అని ఎదురు చూస్తుంటారు. వచ్చిన వాళ్ళు ఎవరు?
ఎందుకు వచ్చారు? వాళ్ళ మనసులో ఏ ఆలోచనలు వున్నాయి? అని గుచ్చి గుచ్చి చూస్తుంటారు.
సాధారణంగా మనందరికి కూడా కొత్తవాళ్ళని అందునా కాస్త ఆహ్లాదాన్ని ఇచ్చే వాళ్ళని
కలవాలని, పరిచయాలు పెంచుకోవాలని అనిపిస్తూనే వుంటుంది. బహుశా ఏదైనా ప్రేమ సంబంధమైన
సాహసాలు చేసే ఉద్దేశ్యాలు కలగవచ్చు కూడా. ఒకళ్ళనొకళ్ళు తోసుకుబతికే ఈ జీవితాలలో
అపరిచితులతో పరిచయం ఎంతో ప్రాధాన్యత కలిగివుండటంలో ఆశ్చర్యమే లేదు. వాళ్ళ వల్ల ఏదో
కుతూహలం కలుగుతుంది, వాళ్ళపైన కురిపించడానికి జాలి కరుణ పొంగుకొస్తుంటుంది,
కలుపుగోలుతనం ఒక నియమంలా తయారౌతుంది.
మన స్నేహాల కాలం
నెలనాళ్ళైతే, వైరాల వ్యవధి వారాలు మాత్రమే. ఇలాంటి చోట పరిచయస్తులను చూసే
విధానంలోనే మార్పు వుంటుంది. పరిచయమైన కొత్తల్లో అంతా బాగానే వుంటుంది. రాత్రి
భోజనం తరువాత, పార్కులో చెట్టు నీడన, ఔషధ ఊటల దగ్గర ఓ గంట మాట్లాడితే చాలు – ఆ
మనిషిలో ఎంతో విద్వత్తు, ఆశ్చర్యపరిచే విజ్ఞానం కనిపిస్తాయి. ఓ నెల తిరిగిన తరువాత
మనల్ని అబ్బురపరిచిన ఆ కొత్త స్నేహితుడు కనీసం గుర్తు కూడా వుండడు.
అలా కాకుండా చిరకాలం నిలిచే బలమైన
బంధాలు కూడా ఇలాంటి చోట ఏర్పడచ్చు. అదే మనుషుల్ని పదే పదే చూడటం వల్ల త్వరగా
పరిచయస్థులుగా మారే అవకాశం కూడా వుంది. ఆ పరిచయంలో ఒకలాంటి తియ్యందనం వుంటుంది.
అదే ఎంతో కాలం ఏ ఆటంకం లేకుండా నిలిచే ఆత్మీయతకు కారణం అవుతుంది. ఆ తరువాత ఎంతో
కాలం గడిచిపోయినా సరే ఆ స్నేహపరిమళం జ్ఞాపకం వస్తూనే వుంటుంది. మొదటి సారి
కలిసినప్పుడు మనసుల్ని ఆవిష్కరించిన సంభాషణలు, చూపులతోనే వేసుకున్న ప్రశ్నలు,
చెప్పుకున్న సమాధానాలు, చెప్పాలని చెప్పకుండా ఆగిపోయిన రహస్యాలు, మొదటిసారి కలిగిన
నమ్మకం, ఆ నమ్మకం ఆధారంగా ఎదుటి వాళ్ళు మనతో మనసు విప్పి మాట్లాడతారని నమ్మి వారి
ముందు ధైర్యంగా మనసు విప్పి చెప్పిన సంగతులు, ఇవన్నీ గుర్తుకువస్తూనే వుంటాయి.
వైద్యానికి ఊటనీటిని వాడే
ఇలాంటి ప్రదేశాలలో విషాదాలకూ కరువేముండదు. ఆ విషాదాల మధ్య ఏ మాత్రమూ మార్పు
లేకుండా ఏకరీతిన సాగిపోయే రోజులలోని ప్రతి నిముషమూ మనసు వైశాల్యాన్ని పెంచుకోమని
ప్రోత్సహిస్తుంటాయి.
ఇంతకూ జరిగిందేమిటంటే, ప్రతి
రోజులాగే ఈ సాయంత్రం కూడా మేమంతా కలిసి, ఎవరివైనా కొత్త ముఖాలు చూసే అవకాశం
వస్తుందేమోనని ఎదురుచూస్తూ వున్నాం.
రెండు కొత్త ముఖాలు వచ్చాయి.
అయితే రెండూ విలక్షణమైనవి. ఒక ఆడ, ఒక మగ – తండ్రి, కూతురు. నాకెందుకో ఎడ్గర్ పో
కథల్లో పాత్రలు గుర్తొచ్చాయి. వెంటనే వాళ్ళ ముఖాలు నన్ను ఆకర్షించాయి. వాళ్ళ
ముఖాలలో కనపడిన దురదృష్టం వల్ల కలిగిన ఆకర్షణ అది. నాకు వాళ్ళు విధి వంచితులుగా
కనిపించారు.
మగమనిషి బాగా పొడుగ్గా
సన్నగా, కాస్త ముందుకు వంగిపోయి వున్నాడు. పూర్తిగా తెల్లటి జుట్టు. అతని శరీరం
యువకుడిలా వున్నదన్న మాటే గానీ జుట్టు అలా లేదు. ప్రొటెస్టెంట్లలో మాత్రమే కనపడే
కాఠిన్యం అతనిని ఆవరించి వుంది. కూతురి వయసు ఇరవై నాలుగు-ఇరవై ఐదు వుండచ్చు.
గువ్వలా చిన్న శరీరం. ఆమె కూడా బాగా సన్నగా పాలిపోయినట్లు వుంది. మొత్తం మీద ఆమె
బడలిక వల్ల సోలిపోయిన లక్షణం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మనకి ఇలాంటి మనుషులు
అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. దినచర్యలను కూడా చేసుకునే ఓపిక లేని మనిషుల్లా
కనిపిస్తారు. కనీసం కదలడానికి కూడా ఓపికలేనట్లు వుంటారు. చూడటానికి చక్కగానే
వుంది. ఏదో దైవత్వం పల్చటి పొరగా కనిపిస్తోంది. ఆమె చాలా నెమ్మదిగా తింటోంది.
చేతిని కదపడానికి కూడా శ్రమ పడుతున్నట్లుగా అనిపిస్తోంది.
ఖచ్చితంగా ఆమెకు ఈ వూరి
జలాలని ఇప్పించడానికే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
నేను కూర్చున్న టేబుల్
దగ్గరే, నాకు ఎదురుగా కూర్చున్నారిద్దరూ. నేను వెంటనే గమనించింది ఆయన చేతుల
కదలికలు. ఏదో నరాలు బలహీనత వున్నట్లు చేతిని ఒక రకంగా విదిలిస్తున్నాడు. ఏదైనా
వస్తువుని అందుకోవాలని చేతిని చాస్తే అది వంకర టింకరగా కదిలి అందుకోవాల్సినది
అందుకునేది. అలా అతను చేస్తున్న కొద్దీ, కొంతసేపటికి నాకు చిరాకనిపించి, అటు
చూడకుండా తల తిప్పుకున్నాను.
అంతే కాదు, నేను
గమనించినదాని ప్రకారం, ఆ అమ్మాయి భోజనం చేస్తున్నంత సేపూ చేతికి గ్లవ్స్ వుంచుకోనే
వుంది.
భోజనం అయిన తరువాత పర్యాటకుల
కోసం ఏర్పాటు చేసిన పార్కులో అలా తిరిగొద్దామని బయల్దేరాను. ఆ
దారి వెంటే వెళితే ఛాసెల్-గుయాన్ ప్రాంతానికి చెందిన లిటిల్ ఔవర్గ్నెస్ స్టేషన్
చేరుకోవచ్చు. పెద్ద పెద్ద పర్వతాలు ప్రారంభమయ్యే ఆ ప్రాంతంలోనే వేడి జలాల ఊటలు
ఉంటాయి. ఎప్పుడో అంతరించిపోయిన అగ్నిపర్వాల కారణంగా ఈ జలాలు పుట్టుకొస్తుంటాయి. మన
తలలు ఎత్తి దూరంగా చూస్తే అక్కడ ఆరిపోయిన అగ్నిపర్వాతాలు గోపురాల్లాగా బూడిద
రంగులో, మిగిలిన పర్వతాలకన్నా ఎత్తుగా కనిపిస్టాయి. ఛాసెల్-గుయాన్ ఆ పర్వతాలకు
మొదట్లో వుండటం వల్ల అలా ఎత్తుగా కనిపిస్తుంది.
ఆ కొండకు ఆవల ప్రాంతమంతా
పర్వతాలతో నిండి వుంటుంది. ఇంకా అవతల అన్నీ మొనదేలిన శిఖరాలు కనిపిస్తాయి.
“పై ది డోమ్” అని పిలవబడే
పర్వతం అన్నింటికన్నా ఎత్తైనది. “పీక్ ఆఫ్ సాన్సీ” అన్నింటికన్నా ఎత్తులో
వుంటుంది. “కాన్టల్” మిగిలిన పర్వతాల కన్నా ఎక్కువగా మొనదేలి వుంటుంది.
వెచ్చని సాయంత్రం కావడంతో
చెట్ల నీడల వెంటే నడుస్తూ ముందుకు సాగాను. దూరంగా పార్కు వైపుకు కట్టిన స్టేజ్ పైన
క్యాసినో బాండ్ వాళ్ళు వాయిస్తున్న సంగీతం వింటూ నడుస్తున్నాను.
అంతకు ముందు కనపడ్డ తండ్రీ
కూతుర్లు నా వైపే నెమ్మదిగా నడుచుకుంటూ రావడం గమనించాను. ఆ ప్రాంతంలో హోటల్లో తమతో
పాటే వున్న వారికి తోటివారు అభివాదం చేసే విధంగా నేను కూడా వాళ్ళ వైపు కొద్దిగా
వంగి అభివాదం చేశాను. నడుస్తున్న వాడల్లా అతను ఉన్నట్లుండి ఆగి నాతో మాట్లాడాడు.
“మాన్సియర్, ఇక్కడ్నుంచి
చిన్నగా కాస్త దూరం ఆహ్లాదంగా నడవాలనుకుంటున్నాము. ఎత్తులు ఎక్కాల్సిన అవసరం
లేకుండా ఎటు వెళ్తే మేలో కాస్త చెప్పగలరా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని మాత్రం
అనుకోకండి” అన్నాడు.
నేనే దారి చూపించడానికి
సిద్ధపడ్డాను. అటూ ఇటూ పచ్చని చెట్లతో, మధ్యలో సన్నగా పారుతూ లోయ వైపు సాగే నది
వెంబడి తీసుకెళ్తానని చెప్పాను.
వాళ్ళిద్దరూ సంతోషంగా
ఒప్పుకున్నారు.
దారి వెంట ఊహించినట్లుగానే
అక్కడి నీటి సద్గుణాల గురించి మాట్లాడుకున్నాము.
“అన్నట్లు నా కూతురికి ఒక
ఆరోగ్య సమస్య వుంది. ఆ రోగం ఎందువల్ల వచ్చిందో కూడా తెలుసుకోలేకపోయాము.
ఉన్నట్లుండి కారణంలేకుండా నరాలు పట్టు తప్పుతుంటాయి. ఇదేదో గుండెకు సంబంధించిన
రోగమని కొంతకాలం డాక్టర్లు భావించారు. మరోసారి ఇది కాలేయానికి సంబంధించినది
కావచ్చని ఊహించారు. ఇంకోసారి చూపిస్తే వెన్నెముకలో ఏదో సమస్య అన్నారు. గడియకో
రకంగా మారిపోయే రోగం ఇది. వెయ్యి రకాలుగా మారుతుంది, వెయ్యి రకాలుగా దాడి
చేస్తుంది. ఇప్పుడిది కడుపుకి సంబంధించిన రోగమేమో అని అనుమానిస్తున్నారు. కడుపు
శరీరం మొత్తానికి సంబంధించిన బాన లాంటిది కదా అంచేత అలా అంటున్నారు. ఆ కారణంగానే
ఇక్కడికి వచ్చాము. నా మటుకు నేను ఇది నరాల సమస్య అనే అనుకుంటుంటాను. ఏదైతేనేమి ఇది
మా ఖర్మ. అంతే” అన్నాడాయన.
నాకు వెంటనే అతను చేతిని
విసిరినట్లు కదిలించినది గుర్తుకు వచ్చింది.
“బహుశా ఇది వంశపారంపర్యంగా
వచ్చిందేమో. మీకు కూడా ఏదో నరాల సమస్య వున్నట్లుందీ?” అడిగాను నేను.
ఆయన చాలా ప్రశాంతంగా సమాధానం
చెప్పసాగాడు:
“నాకా? నా నరాలు ఎప్పుడూ
స్థిరంగానే వున్నాయే” అన్నాడు. ఆ తరువాత కొద్దిసేపు మౌనం వహించి మళ్ళీ
కొనసాగించాడు.
“ఓహో... నేను ఏదైనా
అందుకోడానికి చెయ్యి చాపినప్పుడల్లా చేతిని విసురుగా కదిలించడం గురించి
ప్రస్తావిస్తున్నట్లున్నావు కదూ? దానికి కారణం ఓ దారుణమైన సంఘటన. నువ్వు ఊహించలేవు
కూడా. ఇదిగో నా కూతురు, దీన్ని బత్రికి వుండగానే సమాధి చేసేశాము.!”
ఒక్కసారిగా ఆశ్చర్యానికి
గురై “అయ్యో” అని మాత్రం అనగలిగాను.
అతను కొనసాగించాడు:
జరిగిందేమిటంటే జూల్యట్
గుండెకి సంబంధించిన సమస్య కొంతకాలంగా వుంది. మేము కూడా ఆ విషయం తెలుసుకున్న తరువాత
ఏమైనా జరగవచ్చని సిద్ధపడే వున్నాము.
ఒకరోజు ఆమెను ఇంట్లోకి
మోసుకురావాల్సి వచ్చింది. అప్పటికే ఆమె ప్రాణంలేకుండా చల్లగా గడ్డకట్టుకుపోయి
నిర్జీవంగా వుంది. తోటలో స్పృహతప్పి పడిపోయిందట. డాక్టర్లు పరీక్షించి ఆమె
మరణాన్ని ధృవీకరించారు. ఆమెనే అంటిపెట్టుకోని ఒకరోజు రెండు రాత్రులు గడిపాను. నా
చేతులతో ఆమెని శవపేటికలో పడుకోబెట్టాను. స్వయానే నేనే ఆమెను స్మశానానికి
తీసుకెళ్ళాను. మా కుటుంబాన్ని ఖననం చేసిన చోటే ఆమెను కూడా చేర్చాము. లోరైన్ నగరం
నడిబొడ్డున నా కూతురిని పూడ్చిపెట్టాను.
నేనే కోరి ఆమె నగలను,
కడియాలను, నక్లేసులను, ఉంగరాలను, ఆమెకి లభించిన బహుమతులను, తొలిసారి వేసుకున్నబాల్
డ్రస్సును – అన్నింటినీ ఆమెతో పాటే వుంచేశాను.
తిరిగి ఇల్లు చేరుకునేసరికి
నా మనఃస్థితి ఏమైవుంటుందో మీరు ఊహించుకోగలరు కదా. ఒక్కగానొక్క కూతురు. ఎన్నో ఏళ్ళ
క్రిందట నా భార్య చనిపోయిన తరువాత మిగిలిన ఏకైక బంధం. పరధ్యానంగా
నడుస్తూ నా అపార్ట్మెంట్ చేరుకున్నాను. మనసంతా ఖాళీగా అయిపోయింది. వచ్చి ఇంట్లో నా
పడకకుర్చీలో కూలబడ్డాను. కనీసం ఆలోచించడానికి కూడా శక్తిలేక పోయింది. కదులుతున్న
యంత్రంలా, ఆ క్షోభని అనుభవిస్తూ నిస్సారంగా వుండిపోయాను. మనసు గాలికి వదిలేసిన
గాయంలా వుంది.
ప్రాస్పర్ అని ఎంతో కాలంగా
నా దగ్గర పనిచేస్తుండేవాడు. జూల్యట్ ని శవపేటికలో పెట్టడంలో నాకు సహాయపడ్డాడు
కూడా. ఇద్దరం కలిసే నా కూతుర్ని సాగనంపాము. అతని చప్పుడు చేయకుండా నా గదిలోకి
వచ్చాడు.
“మాన్సియర్ మీకు ఏమన్నా
ఇవ్వమంటారా?” అన్నాడు.
నేను వద్దన్నట్లు తలవూపాను.
“తప్పండీ అయ్యగారు. ఇలా
చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోను? పోనీ పక్క సర్దమంటారా? కాస్సేపు పడుకుంటారా?” అన్నాడు.
“వద్దురా. నన్ను వంటరిగా వదిలేయ్”
సమాధానం చెప్పాను. అతను వెళ్ళిపోయాడు.
ఎన్ని గంటలు కరిగిపోయాయో
తెలియదు. ఎంత దారుణమైన రాత్రి అది. చలిగా అనిపించింది. నేను నిప్పుగూటిలో
వేసుకున్న మంట ఆరిపోయింది. చల్లటి శీతాకాలపు గాలి, గడ్డకట్టించే గాలి ఆగి ఆగి
కిటికీలో నుంచి దుష్టసంకేతంలా చొచ్చుకొస్తోంది.
ఎన్ని గంటలు గడిచిపోయాయో?
నేను అలాగే పడివున్నాను. నిద్రపట్టలేదు. శక్తి లేదు. శరీరాన్ని అణిచేసి పిప్పి
చేసినట్లు వుంది. కళ్ళు తెరుచి, కాళ్ళు చాపుకోని
అచేతనంగా వున్నాను. నిరాశతో మెదడు కూడా స్తబ్ధుగా వుండిపోయింది. సరిగ్గా
అప్పుడే, ఉన్నట్టుండి కాలింగ్ బెల్ మోగింది. అవును మా వాకిట్లో వున్న బెల్లే...
గట్టిగా మోగింది.
నేను ఒక్కసారి
ఉలిక్కిపడేసరికి నా కుర్చీ కిర్రుమని చప్పుడు చేసింది. ఆ బరువైన, గంభీరమైన చప్పుడు
ఏదో గుహలో మోగినట్లు నా ఖాళీ ఇంటిలో ప్రతిధ్వనించింది. వెనక్కి తిరిగి గడియారంలో
టైమ్ చూసాను. రాత్రి రెండు గంటలైంది. ఈ సమయంలో ఎవరు వచ్చివుంటారా అని అనుకున్నాను.
మళ్ళీ బెల్ రెండు సార్లు
మోగింది. నా పనివాళ్ళు భయంతో బిగుసుకుపోయి వుంటారని నేనే మైనపు కొవ్వొత్తి
వెలిగించి మెట్లు దిగాను.
“ఎవరూ? ఎవరు వచ్చింది?” అంటూ
అడుగుతూనే వున్నాను.
నా భయానికి నాకే సిగ్గుగా
అనిపించింది. తలుపుకున్న పెద్ద పెద్ద గడులను తీశాను. నా గుండె పిచ్చిపట్టినట్లు
కొట్టుకుంటోంది. భయం ఆవహించింది. ఉన్నట్టుండి అప్రయత్నంగా తెరిచినట్లు తలుపులు
తెరిచాను. ఆ చీకట్లో ఏదో తెల్లటి ఆకారం గుర్తించాను. స్థిరంగా నిలబడి వుంది.
చూడటానికి ఏదో దయ్యంలా అనిపించింది.
వెనక్కి గెంతి, భయంతో
బిగిసుకుపోయాను.
“ఎ..ఎ.. – ఎవరు – ఎవరు
నువ్వు?” అన్నాను తడబడుతూ.
ఒక గొంతు సమాధానం చెప్పింది.
“నేనే నాన్నా” అని.
నా కూతురు!
నాకు పిచ్చి
పట్టిందనుకున్నాను. ఆ ఆకారం ముందుకు వస్తుంటే నేను వెనక్కి అడుగులు వేశాను. నా
చేతిని పైకెత్తి భూతాన్ని తరిమేస్తున్నట్లు వూపుతూ వెనక్కి నడిచాను. మీరు ఇందాక
గమనించారే నా చేతిని కదిలించడం గమనించారు కదా అలాగన్నమాట - అప్పటి నుంచి ఆ చేతి
కదలిక నాతో అలాగే వుండి పోయింది.
“భయపడకండి పాపా” అంది ఆ
దయ్యం. “నేను చనిపోలేదు. ఎవరో నా ఉంగరం కాజేయాలని ఒక వేలిని కోసేశారు. రక్తం
పారడంతో మెలకువ వచ్చింది. నాలోకి జీవం వచ్చింది.
నిజమే, ఆమె చేతి నిండా రక్తం
కనపడతోంది.
నేను మోకాళ్ళ మీద
కూర్చుండిపోయి వెక్కిళ్ళు గొంతుకు అడ్డపడుతుండగా వలవలా ఏడ్చాను.
అలా కాస్సేపటి తరువాత
ఆలోచనలన్నీ కూడగట్టుకున్నాను. ఇంకా నాలో భయం పూర్తిగా పోలేదు. అది ఎంత ఆనందకరమైన
సంఘటనో అప్పటికి ఇంకా గుర్తించే స్థితిలో కూడా లేను. అమ్మాయిని పైన నా గదిలోకి
వెళ్ళి నా పడక్కుర్చీలో కూర్చోమని చెప్పాను. ఆ తరువాత ఆతృతతో ప్రాస్పర్ ని
పిలిచాను. నిప్పు గూట్లో మంట కాస్త రగిల్చి, వైన్ ఇస్తాడనీ, సాయంగా వుంటాడాని నా
వుద్దేశ్యం.
వాడు లోపలికి వచ్చి నా
కూతుర్ని చూడగానే బిత్తరపోయి నోరు తెరిచి గట్టిగా గాలి వదులుతూ మైకం కమ్మినవాడిలా
తూలి వెనక్కిపడ్డాడు. అంతే, ప్రాణం పోయింది.
వాడే సమాధి పగులకొట్టినవాడు.
నా కూతురి వేలు కత్తిరించి అలా వదిలేసినవాడు. దొంగతనం చేసిన తరువాత ఆ విషయం
పదిమందికి తెలియకుండా వుండాలన్న ప్రయత్నం కూడా లేకుండా అలా వదిలేశాడు వాడు. కనీసం
శవపేటికని తిరిగి పెట్టేయాలని కూడా అనుకోలేదు. నేను వాణ్ణి అనుమానించనని వాడికి
నమ్మకం. నాకు కూడా వాడి మీద పూర్తి నమ్మకం వుండేది.
అది మాన్సియర్ జరిగింది.
అందుకే మేము దురదృష్టవంతులం అంటున్నాను.
అతను మౌనంగా వుండిపోయాడు.
చీకట్లు పరుచుకున్నాయి.
నల్లటి నీడలు నిర్మానుష్యమైన ఈ కొండల మధ్య దుఃఖంలా వ్యాపించాయి. సమాధి నుంచి లేచి
వచ్చిన అమ్మాయి, అనూహ్యంగా చేతిని విసిరే తండ్రి, ఈ ఇద్దరు అపరిచితులు నా పక్కనే
వున్నారన్న గమనింపు ఏదో తెలియని చిత్రమైన భయం నన్ను ఆవహించేలా చేసింది.
అతను చెప్పిన భయంకరమైన కథ
గురించి ఏం మాట్లాడానికీ సాధ్యం కాదని అనిపించింది.
“ఎంత దారుణం” అని మాత్రం
గొణిగాను.
ఓ నిముషం మౌనం తరువాత మళ్ళీ
నేనే మాట్లాడాను: “చలి పెరుగుతోంది. మనం గదుల్లోకి వెళ్దామా”
అందరం హోటల్ కి తిరుగు
ప్రయాణం అయ్యాము.
2 వ్యాఖ్య(లు):
మొన్నే కనిపించింది మీ బ్లాగ్.మొదటి పోస్ట్ నుండి మొదలు పెట్టి అన్నీ వదలకుండా చదివాను..
అన్నిట్లోకి "చినుకులా రాలి.." మళ్ళీ మళ్ళీ చదివాను..ఈ 3 రోజుల్లో రోజుకొకసారైనా చదివా అది.చాలా మంచి కథలు..
ధన్యవాదాలు అనామిక గారు... _/\_
కామెంట్‌ను పోస్ట్ చేయండి