వీడొక సామాజికుడు

సావిత్రి మొగుడికి ఏక్సిడెంట్ అయ్యిందని తెలిసేటప్పటికి నేను విజయవాడలోనే వున్నాను. అయితే ఏం? నేనేం హడావిడి పడలేదు. సావిత్రి మొగుడు నాకేమన్నా చుట్టమా? బంధువా? ఇక సావిత్రంటారా కాలేజీలో స్నేహితురాలు. అంతే కదా? అంత మాత్రానికే హైరానా పడిపోయి హాస్పిటల్ కి పరుగెత్తిపోవాలా? రోజు ఉదయాన్నే భగవద్గీత చదివే నాలాంటి వాడే స్థితప్రజ్ఞత అనేది మర్చిపోతే ఎట్లా? నిదానంగా నింపాదిగా నా వ్యాపారం పనులు చూసుకోని సాయంత్రంగా వీలైతే వెళదాంలే అని నిర్ణయించుకోని ఆ నిర్ణయాన్ని అమలుపరుస్తూ వుండిపోయను. స్వార్థం, మిత్రద్రోహం అని అంటే ఎలా? ఎవరైనా అదే చేస్తారు... మీరు నా స్థానంలో వుంటే అదే చెయ్యరూ?

వెధవది.. మనసొకటి వుండి ఏడ్చింది కదా..! మనల్ని సామాజికులుగా బ్రతకనిస్తుందా అది? ఎంతసేపు ఒకటే రొద. పాపం సావిత్రి అంటుంది.

నిజం చెప్పద్దూ.. మా రవిగాడు ఫోన్ చేసి “సావిత్రి మొగుడి ఏక్సిడెంట్ అయ్యిందటరా” అనగానే మనసు రెండు అంగుళాలు మేర కుంగింది. అప్పుడే ఒక మంచి హోటల్లో పెసరట్ ఉప్మా తింటున్నాను నేను. సరే.. విషాద వార్తే కావచ్చు. అంత మత్రాన నెయ్యి వేసి సన్నగా రోస్ట్ చేయించుకున్న పెసరట్టు వదిలేస్తామటండీ? అదీ ఇలాంటి మూడు ముక్కల పెసరట్టుకు పేరుగాంచిన బెజవాడలో? శవం లేచిన ఇంట్లో అన్నం వండరా ఏమిటి? ఇదీ అంతే..!!

“అయ్యో... ఇప్పుడెలాగ వుందట?” అన్నాను ఒక్క ముక్క పెసరట్టు నోట్లో కుక్కుతూ.

“కండీషన్ సీరియసే... రాత్రి బైక్ మీద వస్తుంటే ఏదో వ్యాన్ గుద్దిందట..!! నువ్వు అక్కడే వున్నావు కదా అని ఫోన్ చేశాను” చెప్పాడు రవి.

“చూస్తాను రవీ... నా పనులు అయ్యాక ఒకసారి వెళ్ళి వస్తాను..” చెప్పి ఫోన్ కట్టేశాను. వెళ్తానో వెళ్ళానో... కానీ అలాగే చెప్పాలి..!! లౌక్యం తెలిసినవాణ్ణి కదా? మూడు ముక్కల పెసర ముఫై ముక్కలై మాయమైంది.

దీని దిబ్బలో కొట్ట..!! అబ్బే పెసరట్టుని కాదండీ... మనసుని. ఈ దిక్కుమాలిన మనసుందే దాన్ని తీసుకెళ్ళి దిబ్బలో కొట్టాలి. మరే పనీ లేనట్టు సావిత్రి ముఖాన్నే రీలు వేసి చూపిస్తోంది. అవునులే అప్పట్లో ఈ మనసునే కదా ఆ పిల్లని ప్రేమించింది. దానికి ఆ మాత్రం కృతజ్ఞత అనేది వుంటుంది కదా..!!

ప్రేమలేదు.. దోమ లేదు. భగవానుడు చెప్పినట్లు అంతా ఖర్మ. సావిత్రి ఖర్మ. ఆ పిల్ల హాయిగా నన్ను చేసుకోని సుఖంగా బతికుండకూడదూ..! వాణ్ణెవడినో చేసుకోని ఈ అగచాట్లు పడకపోతే. సరే అప్పుడు నేనే ధైర్యం చెయ్యలేదనుకో... అయినా నాకు అప్పుడు ధైర్యం రాకపోవటం కూడా సావిత్రి ఖర్మే..!! దాని ముఖాన ఆ తాగుబోతు మొగుడు రాసిపెట్టి వుంది కాబట్టే నేను ముందుకి అడుగెయ్యలేక పోయాను.

“ఆ ఏముంది తాగుబోతు వెధవట కదా... రాత్రి ఫుల్లుగా తాగేసి వుంటాడు. ఏ రాంగు రూట్‍లోనో వచ్చి వ్యాన్‍కి గుద్ది వుంటాడు. మందు తాగి తాగి ఎప్పుడో చస్తాడనే అనుకున్నా... చంపింది మందేకానీ, కోంచెం ముందే చంపింది..” చెప్పాను మరో ఫ్రెండ్‍తో. నేను బెజవాడలో వున్నానని, పాత స్నేహితులందరూ సావిత్రి మొగుడు గురించి ఎంక్వైరీలు మొదలుపెట్టారు.

“నువ్వు కలిశావుట్రా?” అడిగాడు వాడు.

“కలుస్తాలేరా... సాయంత్రం. ఇప్పుడంతా బిజీగా వున్నాను. అయినా నేను చెప్పినట్లే జరిగుంటుంది. మ్యాటర్ సీరియస్సే..” చెప్పాను నేను. నేను వూహించుకున్న కథ మీద నాకు ఎంత నమ్మకమో. సావిత్రి మొగుడు తాగి బండి నడపడం, వ్యాన్‍కి గుద్దడం నాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా వుండగలను?

మధ్యాహ్నం భోజనం తరువాత ఒక్క క్షణం నిద్రపోదామని నడుం వాల్చానా? అబ్బే కునుకైనా వస్తే కదా? పాడు మనసు. ఒకటే గోల...! సావిత్రి కనిపిస్తుంది. నవ్వుతుంది. ఆ నవ్వు నా చావుకొచ్చింది. నవ్వుతుండే సావిత్రి ముఖం చూస్తే వెంటనే ఆ పిల్ల కష్టం వచ్చిందనీ గుర్తొస్తుంది.

ఈ మనసుకో దణ్ణం పెట్టాలి. ఈ మనసు చేసే పని ఏమిటో తెలుసా? ఎక్కడో లోపల సావిత్రి పైన వున్న ప్రేమ, అనురాగం, కోరిక అన్నింటినీ బయటికిలాగి, వాటిమీద సావిత్రి నవ్వుతున్న ముఖాన్ని చూపించి, వెనకాల రవి ఫోన్‍లో చెప్పిన “కండీషన్ సీరియసే” అనే మాటని పదే పదే వినిపిస్తూ వుంటుంది. దీని దుంపతెగ మనసు.

సరే కానీ వెళ్దాంలే అని దానికి నచ్చచెప్పుకోని, ఒక్క చిన్న కునుకుతీసా. మధ్యాన్నం ఒక్క అరగంటైనా నిద్రపోలేదా ఇక ఆ రోజు నా తలనొప్పి ఇంతా అంతా కాదు. సరే స్నేహం, ప్రేమా అన్నీ వున్నాయి... కాదనటంలేదు. కానీ వ్యవహారికంలో బ్రతకాలి కదా. ఎక్కడో ఊహల్లో, కథల్లో, సినిమాల్లో జరిగినట్లు జరగాలంటే ఎలా జరుగుతుంది? కేవలం కలల్లో మాత్రమే జరుగుతుంది. అందుకే కలగన్నాను.

వంటినిండా కట్లు కట్టుకోని సావిత్రి మొగుడు.

“నేను ఇంకా ఎంతోసేపు బతకను... నా భార్యను నీకు అప్పజెప్తున్నాను...” నా చేతిలో ఆమె చెయ్యిపెట్టి కొనసాగించాడు. “సావిత్రి జా... గ... ర్” పోయాడు.

“ఏమండీ..” సావిత్రి ఏడ్చింది.

“ఊరుకో సావిత్రి... నేనున్నానుగా...” ఆమెను గట్టిగా గుండెలకి హత్తుకున్నాను. ఆమె నా చుట్టూ చేతులు వేసింది.

అంతే చిత్రం...!! సావిత్రి మొగుడి శవం ఏమైందో తెలియదు. మేమిద్దరం పచ్చని పార్కులో తిరుగూ, పూలపరిమళాల మధ్య ముద్దాడుతూ, సలయేర్ల సరసాలాడుతూ...తేలిపోతూ, తూలిపోతూ, సోలిపోతూ... ఎక్కడో తెలియని చీకటిలో పట్టెమంచం పైన ఒకరితో ఒకరం...!!

ఛీ.. ఛీ.. ఛీ... పాడు కల... పాడు కలని..!! ఇలాంటి కలలు వస్తాయంటే అసలు నిద్ర పొయ్యేవాడినే కాదు. ప్రేమించుకున్న మాట నిజమే... నాకు కోరిక వున్న మాట కూడా నిజమే. అయినా సావిత్రిని అలా వూహించచ్చా మనసు. పాడు మనసు... పాడు మనసుని. దీన్ని కాష్టంలో తగలెయ్య..!!

ఇంకేం చేస్తాం. నిద్ర ఎలాగూ చెడింది. అనుకున్న బిజినెస్ పనీ అయ్యేటట్టులేదు. రేపు ఇక్కడే వుండి అన్నీ చక్కబెట్టుకోని వెళ్ళాలి. సాయంత్రం ఖాళీనేగా... పోనీ ఒకసారి అలా హాస్పిటల్ వైపు పొయ్యొస్తే పోలా?

వెళ్దాం..! వెళ్దాం..! వెళ్దాం...!! నసపెట్టే మనసుతో ఇదే గొడవ. ఒక ఆలోచన వచ్చిందే అనుకో, దాన్ని పట్టుకోని ఇలా నక్షత్రకుడిలా వేధిస్తే ఎట్లా? ఈ మనసునీ తొక్కి పట్టి...

అయినా మనసు చెప్పేదే రైటు... ఒకసారి వెళ్ళివస్తే రేప్పొద్దున ఏ తలకుమాసిన వెధవ నన్ను పట్టుకోని – “ఎరా అక్కడే వుండి అంత కష్టంలో వున్న పిల్లని పలకరింఛలేక పోయావా?” అని అడగకుండా సరిపోతుంది. సదరు తలకుమాసిన వెధవ ఇక్కడ వున్నా వాడికీ వెళ్ళాలని వుండకపోవచ్చు... వెళ్ళాకపోనూవచ్చు...!! కానీ అడుగుతాడు. ఎందుకు అడిగించుకోవాలి? పోదాం.

ఆసుపత్రికి వెళ్ళి సావిత్రి మొగుడు అంటే వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది? వాడికీ ఏదో పేరు వుండే వుంటుంది. ఏ సుబ్బారావో... గోపాలరావో...!!

“రాత్రి తాగి స్కూటర్ నడుపుతూ వ్యాన్‍ని గుద్దిన ఏక్సిడెంట్ కేసండీ... ఇక్కడే వున్నారని చెప్తేనూ...” నా కల్పిత కథే నాకు ఆసరా.

“రాత్రి ఒక ఏక్సిడెంట్ కేస్ వచ్చిందండీ... కానీ తాగి డ్రైవింగ్ చెయ్యలేదు... వ్యాన్ డ్రైవరే రాంగ్ రూట్‍లో వచ్చి గుద్దాడు... అతని పేరు అభిరామ్.. ఐ.సీ.యూ. లో వున్నారు..” చెప్పింది ఆ అమ్మాయి.

పరమ తాగుబోతు అని విన్నానే...!! తాగలేదా? వీళ్ళు అవన్నీ ఎందుకులే చెప్పడంలేదా? నిన్న గురువారం కదూ అందుకని తాగుండడు... అయినా గురువారాలు శనివారాలు నాలాంటి భయం భక్తి వున్నవాళ్ళకి కానీ, ఇట్లాంటి పచ్చి తాగుబోతులకి ఎందుకు వుంటాయి...!

ఏమిటో ఈ మనసు... ఎం జరిగిందో.. ఎలా జరిగిందో అన్నీ కావాలీ మనసుకు. బస్సులో పోతూ పోతూ ఏదో ఒకచోట ఏక్సిడెంట్ అనగానే తలకాయలు కిటికీలోంచీ కొంగల్లా బయటికి సాగదీసి చూసే మనసు..!! ఎక్కడలేని కుతూహలం..! దీనెమ్మ మనసు..!!

పేరేదో చెప్పారే...!! గుర్తొచ్చింది... అభిరామ్ కదూ... అబ్బో మంచి పేరే..! నా పేరు కన్నా... అయినా నా పేరుతో ఏం పనిలే...!

“అభిరామ్...?” అడిగాను అక్కడ కూర్చున్న ఒక పెద్దమనిషిని. నా ప్రశ్నకు అర్థం ఏమిటి? “అభిరామ్ రూమ్ ఇదేనా?” అనా? “మీరు అభిరామ్ తాలూకా” అనా? లేకపోతే “అభిరామ్ వున్నాడా పోయాడా?” అనా? నువ్వు నోరు ముయ్యవే ముదనష్టపు మనసా.

“అవును బాబూ.. లోపల వున్నాడు. నువ్వెవరు బాబూ? అబ్బాయి స్నేహితుడివా?”

“అవునండీ...” చెప్పాను అక్కడే కూర్చుంటూ. సావిత్రి స్నేహితుణ్ణి, కావల్సినవాణ్ణి, మొగుడు కావల్సినవాణ్ణి ఇవన్నీ ఎలా చెప్తాం మరి? సావిత్రి గురింఛి అడగాలా వద్దా అని సంశయం. బహుశా లోపలే వుండి వుంటుంది.

“ఎలా జరిగిందండీ?” అడిగాను. అన్ని దొంగవేషాలు. అక్కడ నర్సు చెప్పింది కదా... అయినా అడగాలి. అదే పద్దతి.
ఆయన చెప్తున్నాడు. మధ్య మధ్యలో నేను – “అయ్యయ్యో.... చ్చొ.. చ్చొ... చ్చొ... పాపం” అంటూ శబ్దాలు చేస్తున్నాను.

అయిపోయింది. నా వూహకి నిజానికి ఏ మాత్రం సంబంధంలేదు. అభిరామ్ తాగుబోతూ కాదూ, కనీసం సిగెరెట్‍బోతు కూడా కాదట. సావిత్రిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడట. ఇద్దరూ మొగపిల్లలే. సుఖం, సంతోషం అన్నీ వున్న సంసారం.

ఛీ... ఇక్కడికి రాకపోయినా బాగుండేది. నా వూహల్లో ఏదో సాంత్వన దొరికేది. నిజం కనపడితే ఎలా తోసిపుచ్చేది. సావిత్రిని ఒక్కసారి బయటికి రానీ... ఒకే ఒక్కసారి పలకరింఛి, ఆ అమ్మాయి కన్నీళ్ళు తుడిచి, నీకు నేనున్నాను బాధ పడకు అని చెప్పి...  నువ్వు నోరు ముయ్యవే మనసా...!! చూడటం. అయ్యో అనడం వెళ్ళిపోవడం. అంతే..!!
మళ్ళీ అంచనా తప్పు. సావిత్రి గదిలో నుంచి కాదు, వెనక నుంచి వచ్చి పలకరించింది.

“ఏం సుందరం బాగున్నావా?” అంది. ఇదెక్కడి చోద్యం... నేను కదా పలకరించాలి.. ఆమె భర్త గురించి వాకబు చెయ్యాలి.. ఆమెకు అయ్యో పాపం అని సానుభూతి వ్యక్తం చెయ్యాలి...

“ఏదో వున్నాలే... ఎలా వుంది మీ ఆయనకి?” అడిగాను బాధగా ముఖం పెట్టి.

“గంటలో రోజులో తెలియదు... డాక్టర్ల  వాళ్ళ చేతిలో ఏమీ లేదన్నారు..” చెప్పింది బాధగా. అంత బాధలోనూ ఏడవలేదు. ఎందుకేడుస్తుందీ... ఆ మొగుడిమీద కొండంత ప్రేమ వుంటే ఏడుస్తుందికానీ... వాడి సంగతి ఇంతకు ముందు ఎన్నిసార్లు వినలేదూ... ఉత్త సన్నాసిట...!!

“వెళ్ళకు... వుండు..” నా చెయ్యి పట్టుకోని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.

ఇంకేముంది... దీని సిగదరగ మనసు... కుప్పిగంతులు మొదలుపెట్టింది. చెయ్యి పట్టుకుందా? లేదా? ఒక పక్క మొగుడు చచ్చే పరిస్థితిలో వుంటే నిమ్మళంగా మాట్లాడిందా లేదా? వుండు.. వుండిపో అని అన్నదా లేదా? ఇంకేముంది కల నిజమాయగా... ఛీ.. ఛీ.. ఛీ దుర్మార్గపు మనసా. మంఛితనం ముసుగేసుకోని ప్రశాంతగా సామాజికుడిగా బ్రతుకుదామంటే బ్రతకనీయవు కదా..!!

సావిత్రి వెళ్ళి గంటైంది. చీకటి పడుతోంది. ఒక్కణ్ణే కూర్చోని ఆశతో పొంగుతున్న మనసుపై సంస్కారం నీళ్ళు చల్లుతూ కూర్చున్నా. నా పక్కనే ఉన్న సావిత్రి బంధువులు చర్చ మొదలుపెట్టారు. వాళ్ళేమనుకుంటే మనకెందుకు అని అనుకున్నానుకానీ, చెవినపడుతున్న మటలు వినపడకుండా ఎలా పోతాయి..?

“డాక్టర్లు బ్రతకడంటున్నారట..”

“అయ్యో పాపం... ఇద్దరు చిన్న పిల్లలు..”

“పిల్లల సంగతి సరే... ఊరికే హాస్పిటల్‍లో పెట్టుకున్నందుకు రోజుకి పదివేలు అవుతాయట... ఇంతా చేస్తే బ్రతుకుతాడా అంటే అదీ లేదు... చావుని ఇంకో రోజో పూటో పొడిగించడానికే ఈ అనవసరపు ఖర్చు..” ఆయన చెప్తుంటే నేను అనుకున్నదే జరుగుతున్నందుకు తెలియని సంబరం మొదలైంది నా మనసులో.

“అవునండీ సావిత్రి కూడా చెప్పింది... పాపం ఆ అమ్మాయి దగ్గర అట్టే డబ్బుకూడా వున్నట్టులేదు... వున్నదంతా ఇలా వైద్యానికి తగలేస్తే రేపు ఆమె బ్రతికేది ఎట్లా చెప్పండి?” అడిగాను నేను కలగజేసుకుంటూ.

“మరే.. పైగా ఇద్దరు పిల్లలు కూడానూ..” అందించాడు మరోకాయన.

“డాక్టర్లే కాదనిన తరువాత ఇంకా ఎందుకండీ... ఆ అబ్బాయి ఎలాగూ కోమాలో వున్నాడు... బ్రతికే అవకాశమూ లేదు...” చెప్తూ ఆగిపోయాను. నాకు నచ్చింది నేను చెప్పచ్చు కానీ నేను చెప్పింది వాళ్ళకి నచ్చకపోతేనే సమస్య.

“ఏమంటున్నారండీ మీరు?” అడిగాడు మరో పెద్దాయన.

“కొంచెం ప్రాక్టికల్‍గా ఆలోచించండి... డబ్బులు ఖర్చు తప్ప ఆ అబ్బాయి బ్రతికేది లేదు.. అలాంటప్పుడు ఆ డబ్బు మిగిలిస్తే ఆమెకో పిల్లలకో పనికొస్తాయి కదా..” అడిగాను. అడ్డెడ్డేడ్డే... చూశారా... చూశారా నా మనసు ఎంత గొప్పదో. సావిత్రికి డబ్బు మిగల్చడానికి, అవసరమైతే ఆమెను ఆదుకోడానికి కూడా సిద్ధపడింది. అందుకే ఈరకంగా ప్రతిపాదన చేసింది. కానీ పాడు జనం ఆ విషయాన్ని అర్థం చేసుకుంటేనా?

“అంటే ఆ కుర్రాణ్ణి చంపేస్తారా?” అడిగాడు ఒక బట్టతల పెద్దాయన.

“హరి హరీ... మనం ఎందుకు చంపుతామండీ... మనమేమీ కిరాతకులమా? అయినా చంపేదీ, బ్రతికించేదీ మనమటండీ... ఏదో భ్రమ కాకపోతే... ఆ అబ్బాయి మరణం భగవంతుడి చేతుల్లో వుంది... డాక్టరుతో మాట్లాడి డిస్చార్జి చేయిద్దాం... కారులోనో, అంబులెన్స్ లోనో తీసుకోని ఇంటికి పోతామా... ఆయుష్షు వుంటే వుంటాడు... లేదా దైవేఛ్ఛ..” చెప్పాను దణ్ణంపెట్టి పైన వున్న దేవుణ్ణి తల్చుకున్నట్లుగా.

“అవునులెండి... మీరు చెప్పింది సబబుగానే వుంది...” మరోకాయన నన్ను సమర్థించాడు. మనుషులంతా ఒకటే, ఆయనకి ఏం స్వార్థముందో ఇందులో..!!

“అయితే సావిత్రికి ఏం చెప్తాము...” బట్టాతలాయన మళ్ళీ ఒక పాయింటు పీకాడు. అందరూ సమాధానం కోసం నా వైపే చూశారు.

తప్పదు... బాధ్యత తీసుకున్నాను కదా. ఇదంతా నిర్వహించాలి... ఆ తరువాత అదే చేత్తో సావిత్రి బాధ్యత కూడా తీసుకోవాలి. తప్పనిసరై ఇదంతా చేస్తున్నాను కానీ, సావిత్రి మీద ఇంకా మోజు చావలేదని ఎవరైనా అనుకుంటే వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు.

“ఇదంతా సావిత్రికి చెప్తామటండీ... ఆ అమ్మాయి భోజనానికి వెళ్ళినప్పుడో ఎప్పుడో డిశ్చార్జి చేయిద్దాం... పోయిన తరువాతే డిశ్చార్జి చేశారని చెప్పేద్దాం... ఎలాగూ అంబులెన్స్ లో ఎక్కించగానే పోతాడు కదా...” నా తెలివితేటలన్నీ ఉపయోగించి సమస్యకు పరిష్కారం ఇచ్చాను.

అందరూ ఆమోదించారు. సమస్య పరిష్కారమైన సందర్భంగా తలా ఒక కూల్ డ్రింకు కూడా తాగాం. ఇంక ఎవడో ఒకడు మొగుడు పోయిన తరువాత సావిత్రి పరిస్థితి ఏమిటి? అన్న పాయంటు లాగాలి. నేను బట్టతలాయన వైపు చూశాను.

“ఏమైనా గొప్ప నిర్ణయం తీసుకున్నామండీ... ఆ కుటుంబాన్నీ అనవసరపు ఆర్థిక కష్టాలనుంచి కాపాడటానికి, ఒకరకంగా ఇది కారుణ్యమరణమే... ఇతోపినేషియా...” అన్నాడు కూల్డ్ డ్రింక్ చప్పరిస్తూ.

“ఇతోపియా కాదండీ.. ఈతనేషియా..” నా పరిజ్ఞానం ప్రకటించాను.

“అదే... అదే... అయినా పాపం సావిత్రికి చిన్న వయసులో ఈ ఖర్మేమిటీ...” సానుభూతి ప్రకటించాడు ఆయన. సరిగ్గా అదే... నేను అనుకున్న పాయంటులోకి సరిగ్గా వచ్చాడు.

“నిజమేనండీ... ఖర్మ కాకపోతే ఆ ఏక్సిడెంటు ఎందుకు జరగాలీ... ఇలా చావు బతుకు మధ్య ఆమె మొగుడు ఊగిసిలాడటమేమిటి.... ఏదో మనలాంటి పెద్దమనుషులం ఆదుకోని ఆ అబ్బాయికి ఆ బాధ నుంచి విముక్తి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి సరిపోయింది... అలాగే మనమే పూనుకోని సావిత్రి జీవితాన్ని కూడా ఆదుకోని...” చెప్తున్నాను నేను.

ఇంతలో ఎక్కడినుంచో సావిత్రి గొంతు – “ఒరేయ్...” అంటూ. తిరిగి చూద్దునుకదా సావిత్రి ఆవేశంగా అంగలు వేసుకుంటూ వచ్చి నా కాలర్ పట్టుకుంది.

“ఎరా ముదనష్టపు ఎదవల్లారా? నేనేమన్నా మీ సాయం అడిగానా? నన్ను నా జీవితాన్ని కాపాడమని మిమ్మల్ని అడిగానా? నా మొగుణ్ణి చంపడానికి నిర్ణయం తీసుకోడానికి మీరెవర్రా?...”

సావిత్రి అరుపులకు విషయం అర్థమై బట్టతలాయన, మరో పెద్దమనిషి నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి జరుగుతున్న తంతుని చూస్తున్నారు. సావిత్రి నా చొక్క కాలర్ పట్టుకోని వదలడంలేదు.

“నా మొగుణ్ణి నేను కాపాడుకుంటానురా... అవసరం అయితే ఇల్లు, నగలు మొత్తం అమ్మేస్తాను... నా పిల్లల భవిషత్తుని కూడా పణంగా పెట్టైనా సరే ఆయన్ని కాపాడుకుంటాను... ఎందుకంటే ఆయనే మా భవిష్యత్తు... అసలు ఒక మనిషిని చంపాలన్న ఆలోచన మీకెలా వచ్చిందిరా... థూ.. మీ బతుకులు చెడ...” ఇంకా ఏమిటేమిటో అంటోంది. నా కాలర్ వదిలిపెట్టగానే గబగబా నాలుగైదు అడుగులు అవతలికి వెళ్ళి ఆమెనే చూస్తూవున్నాను.
ఎబ్బే... కొంత మంది ఇంతే. అవతలి మనిషి సహాయానికి వస్తే అర్థం చేసుకోకపోగా... ఛీ ఛీ ఛీ... చూడండి ఆ సావిత్రిని... అలగా జనంలాగా హాస్పిటల్ లో ఆ అరుపులేంటి? ఆ గోలేంటి? ఒక పట్టాన ఆపేటట్టిలేదు.... ఆమేదో పురాణాల్లో సావిత్రిలా మొగుణ్ణి కాపాడుకుంటుందట. అక్కడికి మేమేదో యమధర్మరాజు అయినట్లు. అరుచుకోనీ... మనకెందుకు..!!

అక్కడి నుంచి బయటికి కదిలాను.

కొంతమంది అంతే జీవితంలో ఏం కోల్పోయామో తెలుసుకోకుండా, తాము బతికేదే జీవితం అనుకోని బ్రతికేస్తుంటారు. అయ్యో రామా... నా గురించి కాదండీ... సావిత్రి గురించి చెప్తున్నా...!!

***

(నవ్య వీక్లీ 23 జులై, 2014)
Category: