దాదాపు పదిహేనేళ్ళైంది ఆ వూరికి వెళ్ళి. నా స్నేహితుడు సెర్వల్ తో కలిసి వేటకు వెళ్ళాలన్న ఆలోచనతో ఓ శరత్కాలంలో అక్కడికి వెళ్ళాను. ప్రష్యాసేనలు ధ్వంసం చేసిన తోటబంగ్లాని మళ్ళీ కట్టించాడట వాడు.
నాకెంతో నచ్చిన ప్రాంతమది. కంటికింపైన
మనోహర దృశ్యాల సమాహారంలా వుంటుంది. అక్కడికి వెళితే ఆ ప్రాంతంతో ప్రేమలో పడటం
ఖాయం. పల్లెటూరి అందాలంటే మంత్రముగ్ధులయ్యే నా లాంటివాళ్ళైతే ఇక్కడ చూసిన ఓ ఏరో,
అడవో, ఒక కాలువో, ఒక కొండో ఇలా ఏదో ఒక సుందరమైన, ఆనందరకరమైన విషయాలను పదే పదే
జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఒకోసారి ఆలోచనలు వెనక్కి మళ్ళిస్తే, చక్కటి పగటి
వెలుతురులో ఏదో ఒక రోజు, కేవలం ఒకే ఒక్కసారి
చూసిన అడవిలో ఏదో ఒక ప్రాంతంగానీ, ఏటి ఒడ్డుగానీ, పూలతో నిండిన తోటలు కానీ
– ఇలాంటివేవో గుర్తుకొస్తాయి. ఆహ్లాదమైన వసంతకాలం ఉదయం పల్చటి దుస్తుల్లో కనిపించి
కవ్వించి, కోరికలు రేకెత్తించిన అమ్మాయిలాంటి లాంటి మత్తైన భావనలు ఈ జ్ఞాపకాలు.
ఇవి సంతోషానికి ఒక మెట్టు పైనే వుంటాయి.
ప్రత్యేకంగా ఈ వూరంటే నాకు చాలా ఇష్టం. పచ్చని తోటలు, వాటి
మధ్యలో ప్రవహించే వాగులు – సూర్యకిరణాలు పడినప్పుడు చూడాలి తళుక్కుమని మెరుస్తూ,
భూదేవికి ప్రాణవాయువు మోసుకెళ్తున్న జీవనాడుల్లా వుంటాయి. ఆ వాగుల్లోనే మేము చేపలు
పట్టేవాళ్ళం. గాజురొయ్యలు, జెల్లచేపలు, బుక్కడాలు..!! స్వర్గంలా వున్నట్లుండేది. ఆ
వాగుల్లోనే ఎక్కడపడితే అక్కడ స్నానులు చేసేవాళ్ళం. ఒకోసారి ఏటి ఒడ్డున ఎత్తుగా
పెరిగిన గడ్డి మధ్యలో ఉల్లాం పిట్టలు కూడా దొరికేవి.
ఆ వూరెళ్ళాక ఒకరోజు సూర్యుడు పరిచిన వెలుతురు వెంట
మేకపిల్లలా నడుస్తున్నాను. నాకు కొన్ని అడుగుల ముందు నా వేటకుక్కలు నడుస్తున్నాయి.
నా మిత్రుడు సెర్వెల్ నాకు కుడివైపు ఓ వంద మీటర్ల దూరంలో వాడి మెంతి పొలాలు చదును
చేస్తున్నాడు. దడిలా పెంచిన పొదల చాటు నుంచి చూస్తే నాకు ఓ పాడుపడ్డ భవంతి
కనపడింది.
నాకు జ్ఞాపకం వచ్చింది. ఇంతకు ముందు 1869లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఇంటిని చూశాను. చక్కగా, ఇంటి పై కప్పుపైన
తీగలు పాకి వుంది. ఇంటి ముందంతా కోళ్ళు తిరుగుతుండేవి. ఇప్పుడిదేంటి? ప్రాణం పోయి,
అస్తిపంజరంలా మిగిలిన ఇల్లు? ఇంతకన్నా అమంగళం ఇంకేముంటుంది చెప్పండి?
అంతే కాదు, అప్పుడు రోజంతా అలిసిపోయేట్లు తిరిగి ఇక్కడికి
వస్తే ఎవరో ఒక పెద్దావిడ పిలిచి చెరో గ్లాసెడు వైన్ ఇచ్చింది. సెర్వెల్ ఆ ఇంటివారి
గురించి చాలా చెప్పాడు. ఆ ఇంటి యజమానిని వేటాడకూడని
ప్రదేశంలో వేటాడాడని మిలటరీ పోలీసులు కాల్చి చంపారుట. వాళ్ళబ్బాయిని ఒకసారి
అనుకుంటా చూశాను. బాగా పొడుగ్గా, ఎండిపోయినట్లు వుండేవాడు. అతనిలో భయంకరమైన వేటగాడి
లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. ఆ కుటుంబాన్ని చుట్టుపక్కల వాళ్ళు ’లే సువాజ్’1
అని వ్యవహరించేవారు. (’సువేజ్’ అనే పదానికి ఫ్రెంచ్ లో ఉగ్రమైన,
భయానకమైన, క్రూరమైన మొదలైన అర్థాలు వున్నాయి)
అది ఇంటిపేరా? లేకపోతే ఎవరైనా గేలి చెయ్యడానికి పెట్టిన
పేరా? తెలియదు.
సెర్వెల్ ని పిలిచాను. వాడు పొడుగైన కాళ్ళతో కొంగలాగా
నడుచుకుంటూ వచ్చాడు.
“ఏమైందిరా ఇక్కడి మనుషులకి?” అడిగాను.
వాడి చెప్పిన కథ ఇదీ –
యుద్ధం ప్రకటించేటప్పటికి
ఈ సువాజ్ ల కొడుకు వున్నాడు కదా, వాడికి అప్పుడు ముప్ఫై ఏళ్ళు
వుంటాయి. అతను సేనలో చేరి తల్లిని ఒక్కదాన్నే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు.
ఆమెను చూసి పెద్దగా ఎవరూ జాలిపడలేదు. ఆమె దగ్గర కాస్తో
కూస్తో డబ్బు వుంది. ఆ సంగతి అందరికీ తెలుసు.
అంచేత, ఎప్పుడూ ఒక్కతే ఈ ఇంట్లో వుండేది. పైగా ఇది వూరికి
దూరం కూడా కదా.. ఇంక నాలుగు అడుగులేస్తే చెట్లు చేమలు, అడవి.!! ఆమె మాత్రం ఎప్పుడూ
భయపడలేదు. ఒక మగవాడిలాగే ధృఢంగా తిరుగుతుండేది. సన్నగా పొడుగ్గా వుండేది. ఎప్పుడూ
నవ్వేది కాదు. ఆమెతో ఎవరూ సరదాగా మాట్లాడింది కూడా లేదు.
ఈమెలాగ వ్యవసాయం చేసుకునే ఆడవాళ్ళు
మామూలుగా నవ్వేది తక్కువే అనుకో.. మగవాళ్ళంటావా వాళ్ళ పనే అది. అయినా వాళ్ళ
మనసుల్లో కూడా దుఖం గూడు కట్టుకోని వుంటుంది. వాళ్ళు కూడా విషాదమైన చీకటి బతుకులు
బతుకుతుంటారు. సరదాగా ఏ కల్లుపాక దగ్గరన్నా, సంబరాలప్పుడన్నా మగవాళ్ళు హడావిడి చేస్తూ ఆనందిస్తారు కానీ వాళ్ళ ఆడవాళ్ళు
మాత్రం ఇలాగే గంభీరమైన, ధృడమైన ముఖాకృతి కలిగివుంటారు. బహుశా
వాళ్ళ జీవితం వారి ముఖంలోని కండరాలకి నవ్వటం నేర్పించలేదేమో.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఈమె చాలా సాదా సీదాగా ఈ కాటేజ్ లో
వుంటుండేది. ఆ మధ్య మంచుకురిసి ఇంటిని తెల్లగా కప్పేసిన కాలంలో ఆమె వారం వారం పల్లెలోకి
వచ్చి కాస్త మాంసం, బ్రెడ్ తీసుకెళ్తుండేది. ఆ ప్రాంతంలో
తోడేళ్ళు తిరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారని ఒక తుపాకీ భుజానవేసుకోని వచ్చేది.
ఆమె కొడుకు తుపాకీ అది. కాస్త తుప్పుపట్టి, చేతులు తగిలే
చివర్లలో అరిగిపోయి వుండేది. ఆమెను చూడటానికి చాలా చిత్రంగా కనిపించేది. పొడుగ్గా
వుండి, ముందుకు కాస్త వంగినట్లు నడిచేది. మంచులో జాగ్రత్తగా
అంగలేస్తూ ముందుకు పోతుంటే, ఆమె తుపాకీ మోరఎత్తి వెనక్కి
చూస్తున్నట్లుండేది. తల మీద ఎప్పుడూ ఒక పాగా కట్టుకోని వుండేది. ఆ పాగా ఎవరికీ
కనపడకుండా ఆమె తెల్లజుట్టుని బంధించినట్లు వుండేది.
ప్రష్యా సైనికులు
వూర్లోకి అడుగుపెట్టారు. వూర్లో వున్న కుటుంబాల
ఆస్తినీ, స్థోమతనీ పరిశీలించి దానికి అనుగుణంగా
సైనుకులను ఇంటింటికీ పంచారు. ఈ ముసలామెకు వున్న ఆస్థిని అనుసరించి నలుగురు సైనికులుని
అప్పగించారు.
నలుగురూ బాగా దిట్టమైన వాళ్ళు. మంచి రంగు, నీలం రంగు కళ్ళు, గోధుమరంగు గడ్డాలు చూడ్డానికి ఇలా
వుండేవారు. ఇంతకాలం యుద్ధంవల్లా, అలుపు అలసటల వల్లా శరీరం
సన్నబడాలా? ఊహూ.. బలంగా వున్నారు. దేశాన్ని ఆక్రమించిన పొగరు
లేకపోగా దయ, జాలితో వ్యవరించేవారిలా వున్నారు. ఆ పెద్దామెతో
వున్నంతకాలం ఆమె మీద అభిమానంతో ఆమెకు శ్రమకానీ, ఖర్చుకానీ
వుండకూడదని సాయశక్తులా కృషి చేసేవారు. తమ బట్టలను తామే శుభ్రం చేసుకుంటూ
అప్పుడప్పుడు బావి దగ్గర కనపడేవారు. పచ్చటి తమ శరీరాల మీద నీళ్ళు చిమ్ముకుంటూ
నవ్వుకునేవారు. ఒకోసారి కిచెన్ శుభ్రం చేస్తూనో, బండలు
కడుగుతూనో, కట్టెలు కొడుతూనో, బంగాళాదుంపల
తోలు వలుస్తూనో లేకపోతే ఇంకేదో సాయం చేస్తూనో కనిపించేవారు. విధేయులైన నలుగురు
కొడుకులనీ, వాళ్ళ తల్లిని చూస్తున్నట్లుందని
చుట్టుపక్కవాళ్ళు అనుకునేవారు.
ముసలామె మనసు మాత్రం ఎప్పుడూ సన్నగా పొడుగ్గా వుండే కన్నకొడుకు
మీదే వుండేది. వాడి కోటేరు లాంటి ముక్కు, దట్టమైన నల్లటి మీసాలు ఇవన్నీ గుర్తు
చేసుకునేది. "నాయనా, 23వ నెంబరు ఫ్రెంచ్ కాల్బలాన్ని ఎటు వైపు పంపారో
నీకేమైనా తెలుసా? నా బిడ్డ అందులో వున్నాడు" అంటూ
ప్రతిరోజూ నిప్పుగూడు దగ్గర చేరే ఆ నలుగురు సిపాయిలను ప్రశ్నించేది.
"మాకు తెలియదంటే మాకు తెలియదమ్మా"అంటూ వాళ్ళ
భాషలో స్థిరంగా చెప్పేవాళ్ళు ఆ సైనికులు. వాళ్ళు కూడా ఒక తల్లి బిడ్డలే కదా, అంచేత ఆవిడ బాధని, కష్టాన్ని అర్థం చేసుకోని ఆమెకు
చిన్నా చితక సాయం చేయసాగారు. ఆ నలుగురూ శత్రుదేశం వాళ్ళైనా ఆమె వాళ్ళని ప్రేమగానే
చూసుకుంది. అయినా ఇలాంటి రైతులకీ, కూలీలకి స్వదేశాభిమానం వల్ల కలిగే శత్రుత్వాలు
వుండవు. అవన్నీ డబ్బున్న పెద్దవాళ్ళకే. వీళ్ళంతా నిజాయితీగా బతికేవాళ్ళు. అంచేత
అన్ని కష్టాలు భరిస్తారు. ప్రతి కొత్త భారం వాళ్ళని కుంగదీస్తూనే వుంటుంది. ఫిరంగి
గుళ్ళకి గుంపులు గుంపులుగా వధించబడేది వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు కలసికట్టుగా
వుంటారు కాబట్టి. యుద్ధం వల్ల వచ్చి పడే పాపిష్టి దుర్దశలన్నీ భరించేది వీళ్ళే.
ఎందుకంటే వీళ్ళు దుర్బలురు, బలహీనులు, తిరగబడటం
తెలియనివాళ్ళు. అసలు ఈ గొడవలు పెట్టుకునే తత్వాలేమిటో, గౌరవం,
ప్రతిష్ట పేరుతో పుట్టుకొచ్చే కోపాలేమిటో, రాజకీయ కూటములాడే
నాటకాలేమిటో ఆ నాటకాలలో రెండు ఇరుగుపొరుగు దేశాలు ఆక్రమించిన దేశం, ఆక్రమించబడిన దేశంగా మారిపోవటమేమిటో - ఇవేమీ అర్థంకాదు వీళ్ళకు.
ఏది ఏమైనా జిల్లా అధికారులు ఆమె ఇంట్లో వున్న జర్మన్
సిపాయిల విషయంలో సంతృప్తిగానే వున్నారు.
"ఆ నలుగురుకి మాత్రం ప్రశాంతమైన చోటు దొరికింది"
అనుకునేవారు.
ఇలా వుండగా ఒకరోజు ఉదయం ఆమె ఒక్కతే ఇంట్లో వున్నప్పుడు, దూరం నుంచి ఎవరో తన ఇంటివైపే వస్తున్నట్లు గమనించింది. పరీక్షగా చూస్తే
అతను ఉత్తరాలు బట్వాడా చేసే పోస్టుమాన్ అని గ్రహించింది. అతను వచ్చి మడతపెట్టిన ఓ
ఉత్తరాన్ని ఆమె చేతిలో పెట్టాడు. ఆమె కుట్టుపని చేసుకునేటప్పుడు పెట్టుకునే
అద్దాలు తీసి పెట్టుకోని చదవటం మొదలుపెట్టింది -
మేడమ్ సువాజ్ గారు: ఈ ఉత్తరం ఓ దుర్వార్తని మోసుకొచ్చింది.
మీ కొడుకు విక్టర్ నిన్న చనిపోయాడు. ఓ ఫిరంగిలో నుంచి వచ్చిన గుండు అతన్ని దాదాపు
రెండుగా చీల్చివేసింది. సైన్యంలో మా ఇద్దరి స్థానాలు పక్కపక్కనే. అందువల్ల నేను ఆ
దగ్గరలోనే వున్నాను. వాడు మీ గురించి చెప్పి, వాడికి ఏదైనా జరిగితే మీకు తెలియజేయమని
చెప్పాడు. వాడు పోయాక వాడి పాకెట్ లో వున్న వాచి నేను తీసిపెట్టాను. యుద్ధం
పూర్తైన తరువాత మీకు తెచ్చి ఇవ్వగలను.
ఇట్లు: సీజారె రివోట్, సెకండ్ క్లాస్ సిపాయి, 23వ నెంబరు కాల్బలం
మూడు వారాల క్రితం రాసిన ఉత్తరమని తేదీ చెప్తోంది.
ఆమె ఏడవలేదు. ఏదో ఆవహించినట్లు, స్మృతిలేనట్లు,
కదలకుండా కట్టెలా నిలబడిపోయింది. అసలు ఏ బాధ కలగనట్లే వుండిపోయింది. "విక్టర్
ఇక లేడు. రాడు" అనుకున్నది తనలో తానే. అంతే..! దుఃఖం క్రమ క్రమంగా, ఒక్కొక్క కన్నీటి చుక్కగా కళ్ళలోనుంచి కన్నీరై కారింది. క్రమంగా ఆమె
గుండెలో బాధ నిండుకోవడం మొదలైంది. ఆమెను ఆలోచనలు చుట్టుముట్టాయి. బాధాకరమైనవి,
బాధించేవి కూడా. ఇక వాణ్ణి ముద్దు పెట్టుకోలేదు. తన బిడ్డని,
చెయెత్తు ఎదిగిన బిడ్డని ఎప్పటికీ ముద్దు పెట్టుకోలేదు. తండ్రిని మిలట్రీ
పోలీసులు చంపారు. ఇప్పుడీ ప్రష్యన్లు బిడ్డని పొట్టనపెట్టుకున్నారు. ఫిరంగి గుండు
పిల్లాడిని రెండు ముక్కలుగా చేసిందట. కళ్ళ ముందు ఆ దారుణ దృశ్యం కనపడింది.తెగిపోయిన
తల కనపడిండి. వాడు కళ్ళు తెరిచి - మీసం ఒక చివరని కోపం వచ్చినప్పుడల్లా ఎలా
కొరుకుతాడో సరిగ్గా అలాగే కొరుకుతూ కనపడ్డాడు..!!
ఆ తరువాత వాడి శవాన్ని ఏం చేశారు? కనీసం వాడి తండ్రి శవాన్ని చూడనైనా చూడగలిగింది. వీడి విషయంలో ఆ అదృష్టం
కూడా లేదా?
అంతలో ఏదో అలికిడి అయ్యింది. ఆమె దగ్గర వుంటున్న ప్రషియన్
సైనికులు పల్లె లోకి వెళ్ళి తిరిగి వచ్చారు. ఆమె వెంటనే ఆ ఉత్తరాన్ని దాచేసి, కన్నీళ్ళని తుడుచుకోని ఏం జరగనట్లే వాళ్ళని ఆహ్వానించింది.
ఆ నలుగురూ ఎంతో ఉత్సాహంగా నవ్వుకుంటూ వచ్చారు. వాళ్ళ
ఆనందానికి కారణం వాళ్ళు పట్టుకొచ్చిన కుందేలు. ఖచ్చితంగా దొంగతనం చేసిందే
అయ్యుంటుంది. వాళ్ళంతా ఆమెకు కుందేలుని చూపించి వండిపెట్టమని సైగలు చేశారు.
ఆమె అలాగే బ్రేక్ ఫాస్ట్ చేయడానికి సిద్ధపడింది. అయితే ఆ
కుందేలుని చంపడానికి ఆమెకు చేతులు రాలేదు. చంపడం ఆమెకి కొత్తేం కాదు, కానీ ఏదో
అశక్తత. నలుగురిలో ఒక సైనికుడు ఆ కుందేలు చెవుల వెనక ఒక పిడిగుద్దు గుద్ది ఆ పని
కానిచ్చాడు.
ఆ కుందేలు చనిపోయిన తరువాత దాని చర్మం తొలగించింది. అప్పుడు
ఆమె చేతికి గడ్డకట్టినట్లు చల్లగా తగిలిన రక్తం చూడగానే ఆపాదమస్తకం వణికిపోయింది.
రెండు భాగాలుగా విడిపోయిన కన్న కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు. గిలగిలలాడిన కుందేలులో
ఆమెకి తన కొడుకు కనిపించాడు.
ప్రషియన్ సైనికులతో కలిసి టేబిల్ దగ్గర కూర్చుంది కానీ ఒక్క
ముద్ద కూడా తినలేకపోయింది. ఆమె సంగతి పట్టించుకోకుండా వాళ్ళంతా తెచ్చుకున్న
కుందేలుని స్వాహా చేశారు. ఆమె వాళ్ళ వైపు క్రీగంట చూసింది కానీ ఏమో మాట్లాడలేదు.
ఆమె ముఖం ఎంత అభావంగా వుందంటే వాళ్ళు ఆమె ముఖం చూసి ఏమీ గ్రహించలేకపోయారు.
ఉన్నట్టుండి ఆమె మాట్లాడింది - "కనీసం మీ పేర్లైనా
తెలియదు. నెల నాళ్ళు కలిసి గడిపేశాం" వాళ్ళకి అట్టే కష్టపడకుండానే ఆమెకి ఏం
కావాలో అర్థం అయ్యింది. సైనికులందరూ తమ తమ పేర్లు చెప్పారు.
ఆమె అది సరిపోదంది. అందరి కుటుంబ వివరాలు,
అడ్రసులు ఒక కాగితం మీద రాసిచ్చారు. కళ్ళద్దాలను ముక్కుమీదకు జార్చి వాళ్ళ రాతల్ని
పరిశీలనగా చూసింది. ఆ తరువాత ఆ కాగితాన్ని మడిచి, కొడుకు మరణవార్త మోసుకొచ్చిన
ఉత్తరం మీద పెట్టింది.
వాళ్ళు తినడం పూర్తయ్యాక - "మీకు కొంత
సాయం చేస్తాను" అందామె.
వాళ్ళకు తాత్కాలిక వసతిగా మార్చిన ధాన్యపు
గోదాము ఇంటి పై భాగంలో వుంది. అక్కడికి ఊక బస్తాలు మోసుకెళ్ళిందావిడ.
ఆమె పడుతున్న శ్రమ చూసి ఆ నలుగురూ
ఆశ్చర్యపోయారు. అలా బస్తాలు అడ్డుగా పెట్టుకుంటే చల్లగాలి రాదనీ, చలి పుట్టదనీ ఆమె
చెప్పడంతో అంతా ఆమెకు సాయం చేసేందుకు ఉపక్రమించారు.
వాళ్ళంతా కలిసి ఊక మూటల్ని పైకప్పు తాకేంత ఎత్తుగా
అమర్చారు. దాంతో నలుగురికీ నాలుగు గదుల్లాగా ఏర్పడింది. నాలుగు ఊక గోడల మధ్య
వెచ్చగా ఓ చిత్రమైన పరిమళాన్ని ఆస్వాదిస్తూ పడుకోవచ్చని అనుకున్నారు.
రాత్రి భోజనాలప్పుడు ఆమె ఏమీ తినటంలేదన్న సంగతి ఒక సిపాయి
గ్రహించి ఆమెను అడిగాడు. కడుపులో నొప్పిగా వుందని సర్దిచెప్పింది. ఆ తరువాత
నిప్పుగూడు దగ్గరకు చేరి మంట రాజేసి వెచ్చగా కూర్చుంది. నా నలుగురు రోజుటిలాగే
నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళడానికి కట్టిన తలుపుద్వారా తాము నిద్రపోయే ప్రదేశానికి
చేరుకున్నారు.
వాళ్ళు పైద్వారాన్ని మూసేసిన మరుక్షణం ముసలామె
నిచ్చన తొలగించింది. ఆ తరువాత పెరటి తలుపు
చప్పుడు కాకుండా జాగ్రత్తగా తెరిచింది. బయటనుంచి ఇంకా మోపులు మోపులుగా గడ్డి, ఊక
తెచ్చి వంట ఇల్లు మొత్తం నింపేసింది. అంత చలిలో కూడా అడుగుల చప్పుడు వినపడకూడదని
మంచులో వట్టికాళ్ళతో నడిచింది. మధ్యమధ్యలో నిద్రపోతున్న ఆ నలుగురు సైనికులు
గట్టిగా విడివిడిగా పెడుతున్న నాలుగు గురకలు వింటూ తన పని తాను చేసుకుపోయింది.
చేసిన పని సరిపోతుందని తృప్తి కలిగాక ఒక గడ్డి
మూటని నిప్పుగూట్లో పడేసింది. అది అంటుకోగానే తీసి మిగిలిన మోపులన్నింటి మీద
వేసింది. ఇక అక్కడ్నుంచి బయటకు వెళ్ళి జరుగుతున్నదానిని చూస్తూ నిల్చుంది.
కొద్ది క్షణాల్లో కాటేజ్ లోపల భాగమంతా అంటుకోని
వెలిగిపోయింది. కాసేపటికి వెలుగు భయానకమైన జ్వాలగా, పెద్ద ఎత్తుకు మంటలు ఎగసే
అగ్నికుండంలా తయారైంది. ఆ మంటల వెలుగు సన్నటి కిటికీలో నుంచి ఒక వెలుగు రేఖలా
పరుచుకోని తెల్లటి మంచుపైన పడి పరావర్తనం చెందుతోంది.
ఇంతలో ఇంటి పైభాగం నుంచి అరుపులు వినపడ్డాయి.
అవి ఆ నలుగురు సైనికుల బాధ, భయం కలగలసిపోయిన ఆర్తనాదాలు. పై భాగానికి వెళ్ళే తలుపు
తగలబడి విరిగిపోయింది. ఒక సుడిగాలి పైకి లేచినట్లు అగ్నికీలలు ఆ తలుపుగుండా
పైభాగంలోకి వెళ్ళిపోయి, అంతెత్తున లేచి ఇంటి కప్పుని కాల్చేసి ఆకాశానికి దివిటీ
పెట్టినట్లు నిలిచాయి. కాటేజ్ మొత్తం ఆ మహాగ్నికీలల్లో జ్వలించింది.
ఆ తరువాత ఏ అరుపులూ వినపడలేదు. నిప్పు కణికెలు
పగులుతున్న చప్పుడు, గోడలు కూలుతున్న చప్పుడు, దూలాలు విరుగుతున్న చప్పుడు మాత్రమే
వినపడింది. ఉన్నట్టుండి ఇంటి కప్పు కూలి, శవంలా తగలబడుతున్న కింద భాగంలో పైన పడి
నిప్పురవ్వల్ని వెదజల్లింది. దాని వెనకే దట్టమైన పొగ పైకి లేచింది.
మంచు వల్ల తెల్లగా వున్న ఆ ప్రాంతమంతా ఈ
మంటలవల్ల వల్ల ఎర్ర జరీ వున్న వెండి రంగు చీర కట్టినట్లు అనిపించింది.
దూరంగా గంట మోగింది.
ఆ పెద్దామె మాత్రం శిధిలంగా పడిపోయిన ఇంటి
ముందు నిలబడే వుంది. ఆమె చేతిలో తుపాకీ.. కొడుకు సావేజ్ తుపాకి. ఆ నలుగురులో
ఒక్కరు కూడా తప్పించుకోకూడదని ఆమె చేతిలో సిద్ధంగా వుంచుకున్న తుపాకీ..!!
అంతా ముగిసిందని నిర్థారించుకోని చేతిలో
తుపాకిని మంటల్లోకి విసిరేసింది. వెంటనే అది పేలిపోయింది.
జనాలు గుమికూడారు. రైతులు, కూలీలు, ప్రష్యన్లు
కూడా.
ఓ చెట్టు మొదట్లో ప్రశాంతగా, తృప్తిగా కూర్చోని
వున్న ఈమెను చూశారు.
ఒక జర్మన్ అధికారి ముందుకొచ్చాడు. అతనికి ఫ్రెంచ్
భాష తెలిసినట్లే వుంది.
"నీకు అప్పగించిన సైనికులేరి?" అని
గద్దించాడు.
ఆమె సన్నటి తన చేతిని పైకెత్తింది. దాదాపు
ఆరిపోడానికి సిద్ధంగా వున్నఎర్రటి నిప్పుల కుప్పని చూపించి బలమైన గొంతుతో గట్టిగా
చెప్పింది -"అక్కడున్నారు" అని.
జనం ఆమె చుట్టూ చేరారు.
"మంట ఎలా అంటుకుంది?" అధికారి మళ్ళీ
ప్రశ్నించాడు.
"నేనే అంటించాను"
ముందు ఎవరూ నమ్మలేదు. అనుకోని ఈ దుర్ఘటన వల్ల
ఆమెకు మతిస్థిమితం తప్పిందేమో అనుకున్నారు. అందరూ చుట్టూ మూగి చెవులు ఒగ్గి
వింటుండగా ఆమె జరిగినదంతా చెప్పుకొచ్చింది. మొదట్నుంచి చివరిదాకా, ఉత్తరం రావటం
నుంచి చివరిగా తగలబడ్డ సైనికుడు ఆఖరి కేక వరకు పొల్లు పోకుండా చెప్పింది.
చెప్పడం పూర్తయ్యాక ఆమె దగ్గరే వున్న రెండు
కాగితాలను తీసింది. ఏది ఏ కాగితం గుర్తించడానికి నిప్పుల నుంచి వస్తున్న ఆఖరి
వెలుగులో కళ్ళజోడు సర్దుకుంటూ పరిశీలించింది. అందులో నుంచి ఒకటి తీసి చూపించింది.
"ఇదిగో ఇది.. విక్టర్ చావు కబురు
మోసుకొచ్చిన ఉత్తరం." రెండో ఉత్తరం తీసి చూపించింది. తల తిప్పి నిప్పుల్లో
వున్న మనుషుల అవశేషాలను చూస్తూ - "ఇవిగో... ఇవీ వాళ్ళ పేర్లు, వివరాలు. వాళ్ళ
ఇంటికి విషయం తెలియజేయండి." అంటూ కాగితాన్ని ఆఫీసర్ చేతిలో పెట్టింది. అతను
ఆమె భుజం మీద చేతులు వేసి పట్టుకున్నాడు. అయినా అమె చెప్పడం కొనసాగించింది -
"ఇది ఎలా జరిగిందో వివరంగా రాయడం
మర్చిపోకండి. ఆ పిల్లల తల్లులతో ఇది నేనే చేశానని ఖచ్చితంగా చెప్పండి. సావేజ్ అనే
సైనికుడి తల్లే ఈ బిడ్డల్ని తల్లుల నుంఛి వేరు చేసిండని వ్రాయండి.
గుర్తుపెట్టుకుంటారుగా?" అంది.
ఆఫీసర్ జర్మన్ భాషలో ఏవో ఆర్డర్లు వేశాడు.
ఆమెను దొరకబుచ్చుకొని ఇంకా వేడిగా వున్న ఇంటి గోడకి ఆనించి నిలబెట్టారు. పన్నెండు
మంది సైనికులు చకచకా వచ్చి ఓ ఇరవై అంగల దూరంలో ఆమె ఎదురుగా నిలబడ్డారు. ఆమె
కదల్లేదు. ఏం జరగబోతోందో అర్థం చేసుకుంది. అది జరిగేదాకా ఎదురుచూస్తూ నిల్చుంది.
ఆజ్ఞ జారీ అయ్యింది. దడ దడ మంటూ కాల్పుల శబ్దం.
ఆలస్యంగా పేలిన చివరి తుపాకీ శబ్దం ఒంటరిగా మోగిన తరువాత మొత్తం నిశబ్దంగా
మారిపోయింది.
ఆమె పడిపోలేదు. మొదలు నరికినట్లు కిందకు
కూలబడిపోయింది.
ప్రష్యన్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి చూశాడు. ఆమె
దాదాపు రెండు ముక్కలుగా చీలిపోయింది. ఆమె పల్చటి అరచేతిలో రక్తంలో తడిసిన ఉత్తరం
అలాగే వుంది.
నా మిత్రుడు సర్వెల్ ఇదంతా చెప్పి కొనసాగించాడు
-
"ఆ పగతోనే జర్మన్లు ఊరిని నాశనం చేశారు.
నా ఇల్లు కూడా అప్పుడే కూల్చారు" అన్నాడు.
నాకు ఎందుకో ఆ ఇంట్లో తగలబడిపోయిన అ నలుగురు
సైనికుల తల్లులు మదిలో మెదిలారు. ఆ తరువాత బులెట్లకు ఎదురొడ్డి నిలబడ్డ ఆ వీరమాత
ధీరత్వం మెదిలింది.
కిందనుంచి ఒక గులక రాయిని ఏరుకున్నాను. మంటల్లో
కాలినట్లు నిండా మసి పట్టి నల్లగా వుందది.
<< ?>>
(ఈ రోజు మొపాస వర్థంతి)
(ఈ రోజు మొపాస వర్థంతి)
0 వ్యాఖ్య(లు):
కామెంట్‌ను పోస్ట్ చేయండి