ఆ రైతు, అతనితోపాటు ఒక డాక్టరు చనిపోడానికి సిద్ధంగా
వున్న ఆ ముసలామె మంచం ఎదురుగా నిలబడ్డారు. ఆమె స్థబ్దుగా వుంది. ఆమె అన్ని
వదిలేసినట్లు స్థిరంగా ఆ ఇద్దరి సంభాషణ వింటూ, వాళ్ళనే చూస్తూ వుంది. ఆమె
చావడానికి సిద్ధంగా వుంది. వచ్చే చావుని ఎదిరించాలన్న కోరిక ఆమెలో లేదు. తొంభై
రెండేళ్ళ వయసు అంటే అది చివరి అంకం అని ఆమెకి తెలుసు.
జేష్ఠ మాసపు సూర్యుడు
కిటికీలో నుంచి, తెరిచి వుంచిన తలుపులోనుంచి మంటపుట్టించే వేడి కిరణాలను
ప్రసరిస్తున్నాడు. అవి బురదమట్టితో అలికిన ఇంటి నేలపైన అడ్డదిడ్డంగా పడుతున్నాయి.
నాలుగు తరాల మోటు మనుషులు వేసిన అడుగుల కింద నలిగిన నేల అది. ఎండతో పాటు వచ్చిన
సన్నటి గాలులు పొలాల వాసనను వెంటబెట్టుకొస్తున్నాయి. వాటితోపాటే మిట్టమధ్యాన్నపు
ఎండ వల్ల ఎండిపోయిన ఆకుల వాసన కూడా వస్తోంది. మిడతలు, కీచురాళ్ళు చేస్తున్న
తీక్ష్ణ ధ్వనులు వూరంతా వినపడ్తున్నాయి. చిన్నపిల్లలకి సంతలో కొనిచ్చే
చెక్కబొమ్మలు చేసే చప్పుడు లాంటి ధ్వని అది.
డాక్టరు తన గొంతుపెగిల్చి
కాస్త గట్టినా మాట్లాడటం మొదలుపెట్టాడు.
“హోన్రే, మీ అమ్మ పరిస్థితి
ఇలా వున్నప్పుడు నువ్వు ఆమెను వదిలి పెట్టడం మంచిది కాదు. ఆమె ఆ క్షణంలోనైనా
ప్రాణాలు వదలచ్చు”
రైతు చాలా బాధపడి సమాధానం
ఇచ్చాడు – “కానీ పొలం నుంచి గోధుమలు తెచ్చుకోవాలి. కుప్పలూడ్చి అలాగే వదిలేసి చాలా
రోజులైంది. వాతావరణం కూడా అనుకూలంగా వుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
తెచ్చుకోగలను. ఏమంటావు అమ్మా?” అన్నాడు.
మరణశయ్య మీద వున్న ఆమె,
కొడుకు లోభత్వానికి బాధపడ్డా, సరే అన్నట్లు కళ్ళతో, ముఖకవళికలతో చెప్పింది. కొడుకు
గోధుమలు తెచ్చుకోడానికి వెళ్తే, ఆమె ఒంటరిగా ప్రాణం వదలాలని సిద్ధపడ్డట్టుగా
వున్నదా సమాధానం.
కానీ డాక్టరు కోపం నషాళాన్ని
తాకింది. గట్టిగా కాలిని నేలపైన మోదాడు. “నీ అంత దుర్మార్గుడు వుంటాడా? నేను
నిన్ను అడుగు కూడా బయటపెట్టనివ్వను. అర్థం అయ్యిందా? కాదూ కూడదూ వెళ్ళాల్సిందే
అంటే వెళ్ళే ముందు నర్స్ రాపెట్ ని తీసుకురా. ఆమెకు నీ తల్లిని దగ్గరుండి చూసుకోమని
చెప్పి అప్పుడు కదులు. ఆ మాత్రమైనా చెయ్యలేవా? నా మాట వింటావా లేదా? నీకు మాత్రం
ఇలాంటి పరిస్థితి రాదా? అప్పుడు కుక్కకన్నా హీనంగా చస్తావ్... నేనే నీకు అలా జరగాలని
కోరుకుంటాను. వింటున్నావా?”
సన్నటి పొడుగాటి ఆ రైతు
చిన్న చిన్న అడుగులు వేస్తూ వెనకముందు ఆడాడు. నిర్ణయం తీసుకోలేక
తర్జనభర్జనపడ్డాడు. ఓ పక్క డాక్టరు అంటే భయం. మరో పక్క డబ్బులు వృధా అయిపోయే
పరిస్థితి. స్వతహాగా రూపాయి రూపాయి కూడబెట్టడాన్ని ఎంతో ఇష్టపడే పొదుపరి.
వెనుకాడాడు. లెక్కలు కట్టాడు. తడబడుతూ మాట్లాడాడు – “ఆమె ఎంత తీసుకుంటుంది?”
అన్నాడు.
“నాకేం తెలుసు? ఎన్ని గంటలు?
ఎన్ని రోజులు? అన్నదానిబట్టి లెక్క వుంటుంది. ఆమెతోనే మాట్లాడుకో! కానీ
చెప్తున్నా. ఒక గంటలో ఆమె ఇక్కడుండాలి. వినపడుతోందా?”
రైతు ఒక నిర్ణయానికి
వచ్చాడు. “కోప్పడకండి డాక్టరుగారూ. నేనే వెళ్ళి తీసుకొస్తాలెండి.” అన్నాడు.
డాక్టరు అక్కడ్నుంచి కదిలి వెళ్ళబోయేముందు మళ్ళీ హెచ్చరించాడు – “జాగ్రత్త.. నాకు
కోపం వచ్చిందంటే తెలుసుగా?”
డాక్టరు వెళ్ళిపోయాక రైతు తన
తల్లి వైపు తిరిగి తప్పదని ధ్వనిస్తున్న గొంతుతో – “నేను వెళ్ళి రాపెట్ ని
పిల్చుకొస్తాను. లేకపోతే ఆయన ఒప్పుకునేలా లేడు. త్వరగా వచ్చేస్తానులే, ఖంగారు
పడకు” అని చెప్పి అక్కడ్నుంచి బయటపడ్డాడు.
లా రాపెట్ ముసల్ది. బట్టలు
వుతకడం ఆమె వృత్తి. ఆ చుట్టుపక్కల ఎంతో మంది చావుల్ని చూసింది. వాళ్ళు చనిపోతుండగా
చూసింది. తెల్లటి గుడ్డలో వాళ్ళను చుట్టిపెట్టి, తిరిగిరాని లోకాలకు పంపించేదాకా
వెంటే వుంది. అది అయిపోగానే బతుకున్నవాళ్ళ గుడ్డల్ని ఇస్త్రీ చేసే పని చేసుకునేది.
ఆమె సంవత్సరం క్రితం ఏపిల్
పండులా ముడుతలుపడ్డ శరీరంతో వుంటుంది. ఎవరిమీదో విరోధమున్నట్లు, ఇంకెవరినో చూసి
అసూయపడుతున్నట్లు వుంటుంది. దానికి తోడు డబ్బు ఆశ. బట్టలమీద ఇస్త్రీ పెట్టెని అటూ
ఇటూ తిప్పడంవల్లనేమో ఆమె నడుములు సగానికి వంగిపోయాయి. చనిపోయేవాళ్ళ యాతన చూడటం
అంటే ఆమెకు ఒక పైశాచిక ఆనందం వున్నట్లు అందరూ అనుకుంటారు. ఆమె చూసిన చావుల గురించి
తప్ప ఇంకో విషయం మాట్లాడదు. ఆ చావుల్లో రకాలు వర్ణించి చెప్తుంది. చాలా శ్రద్ధగా
ప్రతి చిన్న విషయాన్ని వదలకుండా చెప్తుంది. ఒక ఆటగాడు తన నైపుణ్యాన్ని
గుర్తుచేసుకున్నట్లుగా వుంటావి ఆమె మాటలు.
మన రైతు హాన్రే బాన్టెంప్స్
ఆమె ఇంట్లో అడుగుపెట్టేసరికి ఆమె బట్టలకోసం గంజి తయారుచేస్తూ వుంది. “ఏమ్మా
రాపెట్? ఏంటి విశేషాలు?” అన్నాడు పలకరిస్తూ.
ఆమె తల వెనక్కి తిప్పి
అతన్ని చూసింది. – “ఏముంటాయి. అంతా మాములే. నీ సంగతులు చెప్పు” అంది.
“నేనా? నాకేం? నేను బాగానే
వున్నాను. మా అమ్మ ఆరోగ్యమే సరిగాలేదు”
“మీ అమ్మా?”
“అవును మా అమ్మే”
“ఏమైందామెకి?”
“ఏముంది. అంతా
అయిపోయింది. చావడానికి సిద్ధంగా వుంది”
“అయ్యో మరీ అంత దారుణంగా
వుందా?” ముసలామె గంజి కలుపుతున్న నీటిలో నుంచి చేతులు బయటికి తీసి జాలిగా అడిగింది
“డాక్టరు రేపు వుదయం దాకా
కూడా వుండదేమో అన్నాడు”
“అయ్యే అయితే పరిస్థితి అసలు
బాలేదన్నమాట”
హాన్రే కాస్సేపు తటపటాయించాడు.
అసలు విషయం చెప్పే ముందు ఇంకేదన్నా మాట్లాడాలని అనుకున్నాడు. అలాంటిదేమీ
తోచకపోవడంతో నేరుగా విషయంలోకి రావాలని వెంటనే నిర్ణయించుకున్నాడు.
“ఆమె వెళ్ళిపోయేదాకా ఆమెతో
వుండాలి. ఎంత తీసుకుంటావు? నేనేం డబ్బులున్నవాణ్ణి కాదు. కనీసం పనిమనిషిని
పెట్టుకునే స్థోమత కూడా లేదు. అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా అదే. పనులు
చేసిన శ్రమ, నాకు డబ్బులేదన్న ఆందోళన. తొంభైరెండేళ్ళ వయసులో కూడా పదిమంది చెసే పని
చేసింది. ఈ రోజుల్లో అలాంటి మనిషి చూద్దామన్నా దొరకదు”
అవన్నీ పట్టనట్లు అతనివైపు
చూసింది లా రాపెట్.
“రెండు రేట్లు వున్నాయి.
పగటిపూట నలభై సౌలు, రాత్రికి మూడు ఫ్రాంకులు. ఈ రేటు డబ్బు వున్నవాళ్ళకి. ఇరవై
సౌలు పగటికి, నలభై రాత్రికి ఇది మిగతావాళ్ళకి రేటు. నువ్వు కూడా ఇరవై, నలభై ఇవ్వు”
అంది.
రైతు ఆలోచించాడు. తన తల్లి
గురించి తనకు బాగా తెలుసు. ఆమె పట్టు పట్టిందంటే వదిలే రకం కాదు. ఎప్పుడూ తలవంచిన
ఘటం కాదు. డాక్టర్లు ఎన్ని చెప్పినా కనీసం ఇంకో వారం బండి లాగేయ్యగలదు. ఇదంతా
ఆలోచించుకోని అతను ఆమెకు కొత్త ప్రతిపాదన పెట్టాడు.
“అలా కాదు. నువ్వు ఆమె
చనిపోయేదాకా ఆమెకు సేవ చెయ్యాలి. మొత్తానికి కలిపి ఇప్పుడే ఒక రేటు అనేసుకుందాం.
ఎలా జరిగినా సరే! డాక్టర్లేమో ఇవాళో రేపో అంటున్నారు. అలా జరిగితే నీకే లాభం, నాకు
నష్టం. అలా కాకుండా ఆమె తట్టుకోని నిలబడిందనుకో నీకు నష్టం, నాకు లాభం.
నర్స్ ఆ మనిషి వైపు ఆశ్చర్యంగా
చూసింది. చావుతో పందేలు వేయడం ఆమెకు కొత్త. అంచేత కాస్త తటపటాయించింది. నాలుగు
డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం వుందని అనిపించింది. ఇంతలో వచ్చినవాడు ఏదైనా మోసం
చేసే అవకాశం కూడా లేకపోలేదు అనుకుంది.
“మీ అమ్మను చూస్తేగానీ నేను
ఏ విషయం చెప్పలేను” అంది.
వెంటనే చేతులు కడుక్కోని,
అతని వెంటే బయల్దేరింది.
దారిలో ఒక్క మాట కూడా
మాట్లాడలేదు ఇద్దరూ. ఆమె చిన్న చిన్న అడుగులు వడివడిగా వేస్తుంటే అతను తన పొడుగు
కాళ్ళతో కాలువలు దాటుతున్నట్లు పెద్దపెద్ద అంగలు నెమ్మదిగా వేస్తూ నడుస్తున్నాడు.
వీధుల్లో వున్న ఆవులు, ఎండకి
అల్లాడిపోయి వచ్చేపోయేవాళ్ళ వైపు పచ్చగడ్డి అడుగుతున్నట్లుగా మోరలు చాస్తున్నాయి.
ఇంటికి చేరుకున్న తరువాత
హోన్రే బోన్టెంప్స్ సన్నగా గొణిగాడు: “ఇపాటికే అంతా అయిపోయిందేమో” అన్నాడు. అలా
జరిగి వుంటే బాగుండునన్న కోరిక అతని గొంతులో అస్పష్టంగా వినిపించింది.
లోపల ముసలామె బతికేవుంది. ఆ
దరిద్రపు మంచం మీద అలాగే వెల్లకిల పడుకోని వుంది. దారుణంగా సన్నబడిపోయి వున్న చేతులపైన
వంగపండు రంగు దుప్పటి కప్పివుంది. ఆమె చేతివేళ్ళు కొంగర్లుపోయి, వంగిపోయి,
ఎండ్రకాయ కాళ్ళలా వున్నాయి. దాదాపు నూరు సంవత్సరాలు ఆమె సాధించినవాటన్నింటికీ
ఇప్పుడు అలిసిపోయినట్లు పడివుంది.
లా రాపెట్ మంచం దగ్గరకు
వెళ్ళి చావటానికి సిద్ధంగా వున్న ముసలామెను చూసింది. ఆమె నాడి పరిశీలించి, గుండె
పైన చిన్నగా తట్టింది. ఆమె శ్వాస విని, కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాలని
ప్రయత్నించింది. అలా కొంతసేపు పరిశీలించిన తరువాత ఆ గదిలో నుంచి బయటకు నడిచింది.
ఆమె వెంటే అతను కూడా కదిలాడు. ఆ ముసలామెకి ఆ రాత్రి గడిస్తే గొప్ప అని అనుకుంది
రాపెట్.
“ఏమంటారు” అడిగాడతను.
“బహుశా రెండురోజులు
వుంటుందేమో! మహా అయితే మూడు అంతే. నాకు మొత్తం అన్నీ కలిపి ఆరు ఫ్రాంకులు ఇవ్వు
చాలు” అంది.
“ఆరు ఫ్రాంకులా? ఆరు
ఫ్రాంకులు!” అంటూ అరవడం మొదలుపెట్టాడు. “నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను
చెప్తున్నాను కదా! ఆమె ఓ ఐదారు గంటల కన్నాబతకదని.”
ఇద్దరి మధ్యా తీవ్రమైన వాదన
జరిగింది. ఆమె ఇంటికి వెళ్ళాలి కాబట్టి త్వరగా తేల్చమంది. ఇతనికి కూడా పొలానికి
వెళ్ళకపోతే గోధుమల పనికాదని తెలుసు. చివరికి ఆమె చెప్పిన రేట్లకే అంగీకారం
కుదిరింది.
“సరే అయితే. ఆరు ఫ్రాంకులు.
అన్నీ అందులోనే, శవం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేదాకా” అంది ఆమె.
అతను అంగలు వేసుకుంటూ ఎండకు
గోధుమలు ఆరబెట్టిన పొలానికి అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె ఇంట్లోకి నడిచింది.
ఆమె ఎప్పుడూ తనతో పాటు ఏదో
ఒక పని తెచ్చుకుంటుంది. చనిపోతున్నవాళ్ళ పక్కనే తన పని కూడా చేసుకుంటూ కూర్చుంటుంది.
ఒకసారి తన పని చేసుకుంటే, ఒకసారి తనని నియమించుకున్న కుటుంబానికి పని చేసేది.
ఒకసారి పనికి కుదిరాక ఎంత పనైనా చేసేస్తుంది.
ఉన్నట్టుంది ఆమెకు ఏదో
జ్ఞాపకం వచ్చింది.
“నీ గొంతులో ఎవరైనా కాసిని
పవిత్రజలం పోశారామ్మా?” అంది
ముసలామె లేదన్నట్లు తలాడించి
చెప్పింది. లా రాపెట్ కాస్త భయం భక్తి వున్న మనిషే. అందుకే ఆ సమాధానం విని
చటుక్కున లేచి నిలబడింది.
“భగవంతుడా! అలా ఎలా
జరిగింది. వుండు నేను ఇప్పుడే వెళ్ళి నీకు పవిత్రజలం పోసే ఏర్పాటు చేస్తాను” అంటూ
పాస్టరు ఇంటికి పరుగులుపెట్టింది. ఆమె ఉరుకులు చూసి వీధుల్లో వుండే జులాయివాళ్ళంతా
ఏదో ప్రమాదం జరిగిందేమో అనుకున్నారు.
ఫాదరు వెంటనే తన తెల్లగౌను
వేసుకోని ఆమె వెంట బయల్దేరాడు. అతతో పాటే చర్చిలో కాయిర్ నిర్వహించే బృందంలో
పిల్లవాడు కూడా వచ్చాడు. అతని చేతిలో గంట- ఒక ప్రాణం ఈ ఎండిన వీధుల్నీ,
ప్రపంచాన్నీ వదిలిపోయిందని ప్రకటించడానికి సిద్ధంగా వుంది. వాళ్ళు వస్తున్న దారికి
దూరంగా పనులు చేసుకుంటున్నవాళ్ళు తలపైన టోపీలని శ్రద్ధాంజలిగా తొలగించి, పాస్టరు
తెల్లగౌను తెరమరుగయ్యేదాకా కదలకుండా నిలబడ్డారు. పనులు చేసుకుంటున్న ఆడవాళ్ళు
నిలబడి తమ గుండెలమీద శిలువ గుర్తు వేసుకోని ప్రార్థించారు. నల్ల కోళ్ళు భయంతో
పరుగులుపెట్టి తమకి అలవాటైన గుంతల్లో దాక్కున్నాయి. గుంజకి కట్టిన గుర్రపిల్ల ఒకటి
ఇదంతా చూసి ఖంగారు పడి గుంజ చుట్టూ దూకడం మొదలుపెట్టింది. ఎర్రటి బట్టలు వేసుకున్న
పాస్టరుగారి శిష్యుడొకడు ఏవో ప్రార్థనలు చదువుతూ గబగబా ఆయన వెనుక నడిచాడు.
అందరికన్నా చివరగా లారాపెట్ చేతులు జోడించి సాష్టాంగపడుతోందేమో అనేంతగా ముందుకు
వంగిపోయి చర్చిలో నడిచినట్లు నడుస్తోంది.
వీళ్ళంతా ఇలా నడుస్తుంటే
హోన్రే దూరం నుంచి చూశాడు. “పాస్టరుగారు
ఎక్కడికి వెళ్తున్నారో” అన్నాడు.
అతనికన్నా తెలివైన మరో మనిషి
సమాధానం చెప్పాడు. “ఇంకెక్కడికీ! అదిగో ఆయన మీ అమ్మకోసమే పవిత్రజలం
తీసుకెళ్తున్నాడు” అన్నాడు.
హోన్రో ఏమాత్రం
ఆశ్చర్యపోలేదు. పైగా “అంతే అయ్యుంటుందిలే” అని తన పనిలో నిమగ్నమైపోయాడు.
అతని తల్లి పాస్టరు ముందు తన
తప్పులన్నీ చెప్పి క్షమాపణలు అడిగింది. స్వచ్చతను, శాంతిని పొందింది. ఆ తరువాత
పాస్టరు వెళ్ళిపోయాడు. ఆ ఇరుకు గదిలో ఇద్దరే మిగిలారు. లా రాపెట్ చావడానికి
సిద్ధంగా వున్న ముసలామెను చూసి ఇంకా ఎంతకాలం ఇలా ఆయిష్షుని సాగదీస్తుందో అని
ఆలోచిస్తూ వుండిపోయింది.
కృష్ణపక్ష రోజులు కావటంతో
గాలులు వీచడం మొదలైంది. గోడకు వేలాడదీసిన కేలండర్ టపటపమని కొట్టుకుంటోంది.
ఒకప్పుడు తెల్లగా వుండి ఇప్పుడు పచ్చగా మారిన కర్టన్లు గాలికి ముసలి ప్రాణంలాగే
ఎగిరిపోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి.
మంచంలో కదలకుండా, కళ్ళు
మాత్రం తెరిచి మనసులో ఏ భావం లేకుండా చావుకోసం ఆమె ఎదురుచూస్తున్నట్లుంది.
వచ్చినట్లే వచ్చి రాకుండాపోతున్న మృత్యువు ఆమెతో ఆటలాడుతోంది. భారంగా తీస్తున్న
ఊపిరి ఆమె నోటినుంచి సన్నటి ఈలలా వస్తోంది. ఆ శబ్దం ఏ క్షణంలోనైనా ఆగిపోతుంది. ఈ
భూమి మీద మరో ఆడమనిషి తగ్గిపోతుంది. అలా జరిగినా ఎవరికీ పెద్ద బాధ కలిగేలా లేదు.
పొద్దుగుంకుతుండగా హాన్రో
తిరిగి వచ్చి నేరుగా ఆమె మంచం దగ్గరకు వెళ్ళి ఆమె ఇంకా ప్రాణాలతోనే వుందని
తెలుసుకున్నాడు.
“ఎలా వుంది” అన్నాడు
అక్కడికి ఆమెకి ఏదో తగ్గిపోయే అనారోగ్యం వున్నట్లు. ఆ తరువాత లారాపెట్ ని
వెళ్ళిపొమ్మని చెప్పాడు. “రేపు ఉదయం ఐదుగంటలకి వచ్చేసెయ్” అన్నాడు.
“అలాగే. ఐదుకే వస్తాను”
అన్నదామె.
తెల్లవారుతుండగా ఆమె ఆ
ఇంటికి వచ్చేసరికి హాన్రో సూప్ తయారు చేసుకోని తాగుతూ కనిపించాడు.
“మీ అమ్మ చనిపోయిందా లేదా?”
అడిగిందామె.
“లేదు. కాస్త కుదుటపడినట్లు
వుంది” అంటూ సమాధానం చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు రాపెట్ వైపు కనుచివర్ల నుంచి
దొంగచూపు చూశాడు. ఆ తరువాత లేచి పనికి వెళ్ళిపోయాడు.
లారాపెట్ ఆందోళనగా
చావుబతుకుల్లో వున్న ముసలామె దగ్గరకు వెళ్ళింది. ఆమె అలాగే వుంది. కదలకుండా కళ్ళు
మాత్రం తెరిచి, చేతులతో మంచం కోళ్ళను బలంగా పట్టుకోని వుంది. ఇది ఇలాగే సాగితే ఆమె
ఇంకో రెండు రోజులో, నాలుగు రోజులో బతకచ్చు. ఎనిమిది రోజులు కూడా పట్టచ్చు. అసలే
అత్యాశ వున్న ఆమెకు మోసపోయానేమోనన్న భయం కలిగింది. జిత్తులమారి రైతుమీద, చావడానికి
సిద్ధంగా లేని తల్లిపైనా చాలా కోపం వచ్చింది.
అయినా సరే ఆమె తన పని
మానుకోలేదు. అన్ని సేవలు చేసి ముడతలు పడ్డ ముసలామె ముఖాన్నే చూస్తూ ఎదురుచూసింది.
కాస్సేపటికి టిఫిన్ చెయ్యడానికి తిరిగివచ్చిన హాన్రే సంతోషంగానూ, తృప్తిగానూ
వున్నట్లు ప్రవర్తించాడు. కాస్త పరిహాసంతో కూడిన చణుకులు విసిరాడు. అతని గోధుమపంట
సకాలంలో చేతికి వచ్చిన ఆనందం అతని మాటల్లో వుంది.
లారాపెట్ లో అసహనం
పెరిగిపోయింది. గడుస్తున్న ప్రతి నిముషం ఆమె నుంచి సమయాన్ని, డబ్బుని
దొంగిలిస్తున్నట్లుగా అనిపించసాగింది. ఆమెలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఈ రోగిష్టిదాన్ని,
దిక్కుమాలిన పక్షిని, లేకుండా చేస్తే? తన డబ్బుని తనకి కాకుండా చేస్తున్న ఆ
ఎగశ్వాసని అసలు లేకుండా చేస్తే? ఆమె గొంతుని నులిమేస్తే? అంతలోనే అలా చేయడంలో
వున్న సమస్యలను తలచుకుంది. మరో రకంగా పథకం వెయ్యసాగింది. మంచం దగ్గరగా వెళ్ళి –“మీరెప్పుడైనా
మృత్యుభూతాన్ని చూశారా?” అంది.
“లేద”ని ముసలామె సమాధానం
చెప్పింది.
ఇక అక్కడ్నుంచి నర్స్ ఆమెకు మృత్యుభూతం
గురించి భయపెట్టేలా చెప్పడం మొదలుపెట్టింది. చావుబతుకుల్లో వున్న ముసలామె బలహీనమైన
మనసును భయంతో వణికించేసింది. చావడానికి కొన్ని నిముషాల ముందు ఓ భూతం
కనిపిస్తుందనీ, మరణయాతన నుంచి ఆ భూతం విముక్తిని ఇస్తుందని చెప్పింది. ఆ భూతం
చేతిలో ఓ చీపురు వుంటుందనీ, తలపైన కవచం వుంటుందనీ, భయంకరమైన అరుపులు అరుస్తుందని
చెప్పింది.
“ఒక్కసారి ఆ మృత్యుభూతాన్ని
చూస్తే ఇక అంతా అయిపోయినట్లే. కొన్ని నెలల ఆయుష్షు వున్నవాళ్ళు కూడా ఆ క్షణమే
ప్రాణాలు వదిలేస్తారు” అంటూ తన అనుభవంలో చివరి క్షణాలలో భూతాన్ని చూసిన వాళ్ళు
అంటూ చాలామంది పేర్లు చెప్పింది.
ముసలామెకి అదంతా విని
భయంగానూ, ఇబ్బందిగానూ అనిపించింది. అసహనంగా కదిలి అతి కష్టం మీద తలని గది రెండో
వైపుకు తిప్పుకుంది. అదే అదనుగా లారాపెట్ అక్కడ్నుంచి తప్పుకుంది. కబోర్డ్ దగ్గర
వున్న ఓ పెద్ద గుడ్డని తీసి తన చుట్టూ చుట్టుకుంది. ఇనుప మూకుడు ఒకటి తీసుకోని
తలపైన బోర్లించుకుంది. దాని కాడలు కొమ్ముల్లా కనపడేట్లు పెట్టుకుంది. ఒక చేతిలో
చీపురు తీసుకోని, మరో చేతితో ఇంకో గిన్నని పట్టుకుంది. ఉన్నట్టుండి ఆ గిన్నెని నేల
మీదకు విసిరికొట్టింది.
అది నేల తాకుతూనే పెద్ద
శబ్దం చేసింది. ఆ తరువాత ఆమె కుర్చీ పైకి ఎక్కి, మంచానికి కట్టిన తెరని కిందనుంచి
పైకి ఎత్తి ఒక్కసారిగా తన ముఖాన్ని ముసలామెకు చూపించింది. చేతులు భయంకలిగించేలా
తిప్పుతూ, కీచు గొంతుతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ముఖం కనపడకుండా కప్పుకున్న
మూకుడులో ఆ అరుపులు ప్రతిధ్వనించి ఇంకా భయంకరంగా వినపడసాగాయి. భయంతో బిక్కచచ్చిన
ముసలామెని చీపురుతో తడుతూ ఇంకా బెదరకొట్టింది.
అదిరిపోయిందామె. ఆమె ముఖం
పిచ్చిపట్టినట్లుగా మారిపోయింది. చావడానికి సిద్ధంగా వున్న ఆమెలో ఏదో చిత్రమైన
శక్తి ప్రవేశించినట్లు బలమంతా కూడదీసుకోని లేచి పారిపోవాలని ప్రయత్నం చేసింది.
భుజాలు, సగం శరీరం పైకి లేపింది కూడా. అంతే! ఒక్కసారి గట్టిగా నిట్టూరుస్తూ
వెనక్కిపడిపోయింది. అయిపోయింది.
లారాపెట్ ఏమీ ఎరగనట్లు
ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసింది. చీపురు మూల పెట్టేసింది, కప్పుకున్న గుడ్డ
మళ్ళీ కబోర్డ్ లో పెట్టేసింది. మూకుడు, గిన్నలను గట్టుపైన, కుర్చీని గోడవారగా
సర్దేసింది. ఆ తరువాత అనుభవం నేర్పిన చాకచక్యంతో చనిపోయిన ముసలామె పెద్ద కళ్ళను
మూసేసింది. ఓ ప్లేటు మంచం మీద పెట్టి అందులో కాసిన పవిత్రజలం పోసింది. ఆ తరువాత
మంచపక్కనే మోకరిల్లి, ఎంతో కాలంగా చదివి చదివి నోటికి వచ్చేసిన ప్రార్థనలన్నీ
చదివింది.
హాన్రే సాయంత్రం తిరిగి వచ్చేసరికి ప్రార్థనలు
చేస్తున్న రాపెట్ ను చూశాడు. వెంటనే లెక్కలు వేసి ఆమెకు ఇరవై సౌలు లాభం వచ్చిందని
గుర్తించాడు. ఆమె గడిపిన రెండు రోజులు, ఒక రాత్రికి అయిదు ఫ్రాంకులే అయ్యేది కానీ
ఒప్పందం ప్రకారం ఆరు ఫ్రాంకులు ఇవ్వాల్సివస్తోందని నష్టం లెక్క వేసుకున్నాడు.
***
1 వ్యాఖ్య(లు):
Very Touching. aadam baagaa chESaaru. kaanee, mRtyu bhootam .. badulu inkEdainaa padam unTE baavunDunEmO anipichindi.
కామెంట్‌ను పోస్ట్ చేయండి