ఈరేశంగాడి ముచ్చట..!

మా ఈరేశం గురించి చెప్పాలంటే ఎవరికైనా నవ్వొచ్చేస్తుంది. మరదేంటొగాని ఆణ్ణి చూసినోళ్ళంతా నవ్వుకోవాల్సిందే. ఆడికి బట్టలు కుట్టే టైలరు కొలతలు తీసుకునేకాడ తెగ ఐరానా పడిపోతాడని చెప్పుకుంటుంటారు సరదాగా మా వూరోళ్ళు..! ఆడి కర్రినలుపు, బట్టపుర్రె, బానబొజ్జ గురించి కాదుగాని, ఆడి ఇశయం ఇంకోటి చెప్తాను నేను.. ఇనండి..!!

ఆడికి నాకు సిన్నప్పట్నుంచి స్నేగం. బడెగ్గొట్టే కాడ నుంచి బస్సెనకాల లగెత్తేదాక ఇద్దరం కలిసే సేసేవాళ్ళం. ఆడు పట్నంబోయి నాలుగేళ్ళు తెగ సదివేసి పశువుల డాక్టరుకాడ కాంపౌండరి అయిపోయినాడు. నేను ఇంకా ఐనోళ్ళం గలిసి పెళ్ళి గుదిర్చినాము.. సక్కని పిల్ల ఆడికి ఆలైంది. అదంటే ఆడికి పేనం. బాగా జూసుకుంటాడు...! పూలెడతాడు.. పళ్ళేడతాడు.. పండగలకి పబ్బాలకి చీరకొనెడతాడు. అంటా బాగానే వుంటది గాని ఒక్కసోట సిక్కొస్తది. అది ఇప్పుడో అప్పుడో సిరంజీవి సినిమా వచ్చినప్పుడు గారంగా "పొయ్యొద్దాం మామా.." అంటది. ఈడు గైమంటూ లేత్తాడు..!!

ఆడెందుకంత కోపం జేత్తాడో సీలచ్చికి అర్ధమయ్యేది కాదు..! (సీలచ్చంటే ఆడి పెళ్ళామన్నమాట..!) అసలు సంగతేందంటే - ఈడు అది కలిసి సినిమాకి బోతే 'కాకి - దొండపండు ' సామెత గుర్తొచ్చేస్తది ఎవరికైనా..! సీలచ్చి బంగారంలాగుంటే ఈడేమో బొంగరంలాగుంటాడు. ఆడికీ పాపం సిగ్గుగానే వుండేది మరి..! అందుకే దాన్ని బయటకి తీస్కెళ్ళేవాడుగాదు. ఇదంతా ఆడు పట్నంలో వున్నప్పటి ముచ్చట..!

అట్టాటి ఈరేశం కొన్నాళ్ళకి బదిలి సేపించుకొని మళ్ళా మా వూరికొచ్చేసినాడు. ఇక్కడ గొడ్లాసుపత్రిలో కాంపౌండరిగా జేరాడు. మా బోటి వూర్లో కాంపౌండరి అంటే డాట్టరైపోయినట్లే..! అసలు డట్టరేమో పక్కూరినించి రావాల..! ఆయన ఏ కాలునొప్పో, కన్ను నొప్పో చెప్పి సెలవలెడతావుంటాడు. ఇక గొడ్లకు కడుపొచ్చినా కష్టమొచ్చినా కాంపౌండరీ ఈరేశంగాడే డాట్టరు..!

సరే..! అసలు సంగతేందంటే, ఆడు ఆసుపత్రి పక్కనే ఇల్లేసుకొని సీలచ్చితో కాపురమెట్టాడు. నిజం జెప్పద్దూ..! సీలచ్చికి సినిమాలమీద యావ ఎక్కువే..! అది సంజేళ సింగారించుకొని 'సినిమాకి పోదామా' అనేది. ఈడు మళ్ళి గైమంటాలేసేవాడు. అట్టాగని ఇద్దరూ అరుసుకుంటారనుకుంటే తప్పే..! లచ్చికి ఇదంతా అలవాటవడం మూలాన గమ్మునే వుండేది.

రోజూ సీలచ్చి మద్దేనం పూట మంచి వంటలన్నీ వండి గిన్నెల్లో సర్ది తెచ్చిపెట్టేది. అదేటోగాని అది రాగానే ఆసుపత్రి తలుపులేసేవాడు ఈరేశం. అసలు దాని మొగం ఊర్లో ఎవరూ సూన్నేలేదంటే సత్యం..! అట్లాగ దాచుకునేవాడు ఈరిగాడు.

ఇట్టాగనే సానా రోజులు గడిచినాయి. ఒక యాళ సాయంపూట ఈరేశంగాడు, సీలచ్చిని యేంటేసుకొని సినిమాకొచ్చాడు. ఇద్దరూ దర్జాగా ఈదెమ్మటి వత్తావుంటే నేను సూసి నోరెళ్ళబెట్టినా..! లచ్చి సినిమా అంటేనే 'సీరేత్తా.. సంపేత్తా.. ' అని సిందులేసి ఈరంగంజేసే ఈరిగాడేంది, ఇంత ఇదిగా మారిపోయాడని అనుకున్నాను.

ఇక్కడ మా సినిమా హాలు గురించి కొంత సెప్పుకోవాల.

మాదొక టురింగు టాకీసు..! పట్నంలో హాలుకి ఒకటే ఇశ్రాంతైతే మాకు నాలుగుంటాయి..! నల్లులు, సీమలు సుర్రు, సుర్రున కుడతాంటె నా సామిరంగ సినిమాలు భలేగుంటాయి..! అసలు సినిమా బొమ్మ సరింగా పడదు.. బొమ్మపడితే ఇనపడదు..! ' సిరంజీవి భలే యాక్టింగు సేసినాడురోయ్.. ' అంటే, "సెత్.. ఎదవ.. ఆడు బెమ్మానందంగాడు.." అంటాడు పక్కనోడు. ఈ లోపల కాళ్ళ కింద కుక్క దూరిపోద్ది. అదే ఆడొళ్ళైతే కెవ్వున కేకేత్తంటారు..! బీడీల వాసన గుప్పు గుప్పు మంటది... ఆడ, ఈడ తుపుక్కు.. తుపుక్కున వూసేత్తుంటారు. నాకే సిరాకేసి మద్దేలో లేచొత్తుంటా.. అది యంటీవోడి సినిమా ఐయినా సరే..!

మరి పట్నంలో ఏసీ హాలుకే దీస్కెల్లని ఈరేశంగాడు ఇట్టాటి టాకీసుకి సీలచ్చిని దీస్కొచ్చాడు. ఇసిత్రమే గదా..! ఇదే ఇసిత్రమైతే.. ఆ యాళనుంచి బొమ్మ మారినప్పుడల్లా సీలచ్చితో వచ్చేవాడు. 'ఇదేందిరా నాయనా..' అనుకొని నేను ఒక రోజు సల్లగా యిశయం అడిగా..!

ఆడు ముందు సెప్పలేదు..! నేనొదుల్తానేటి..? "అరే మనం స్నేగితులం.. సిన్నప్పుడు గోలీలాడినాం.. గిల్లీలాడినాం.." అన్నా.

"అవును" అన్నాడు.

"నీ పెళ్ళి నే గుదిర్చినా.."నన్న

"ఆవు" నన్నాడు.

ఆ మాటా ఈ మాటా జెప్పి ఇశయం జెప్పరా అన్నా..! ఆడు సెప్పేశాడు..!! అదేంటో మీకు జెప్తా ఇనండి -

ఓ నాడు డాట్టరుబాబు రాలెదు.. (వత్తే గదా సెప్పాల్సిన ఇశయం) నేను, ఈరేశంగాడు కూకోని కబుర్లు సెప్పుకుంటండాం..! ఈ రైతొచ్చినాడు.

"ఏందిరా సాములు ఇట్టొచ్చినావు..?" అన్నాన్నేను
"నువ్వుండెశె.." అని ఈరేశంగాడితో - "బాబు ఇట్టా సూడండి.." అన్నాడు.
అంటానే ముందుకు వంగి నాలుగు కాళ్ళ మీద నిలబడ్డాడు. నాలక బయట పెట్టి, గుడ్లు తేలేసి ముందుకి ఎనక్కి వూగటం మొదలుపెట్టాడు.

"ఒరెయ్.. సాములు ఏమైందిరా.. ఇప్పటిదనకా బాగానేవుండావు గదా.." అని నేను ఈరిగాడు ఖంగారుగా నిలబడ్డాం.

సాములు గాడు వూగడం ఆపి..

"నా గొడ్డు ఇట్ట కొట్టుకుంటందయ్యా.." అన్నాడు

"దానికి నువ్వుకొట్టుకొని సూపించాలట్రా.. సెప్తే సాలదు" అన్నాడు ఈరిగాడు

"వోర్నీ.. అదే కానుపైతే ఎట్టా సూపించేవాడివిరా.." అన్నాన్నేను.

"సరే డాట్టరు బాబు లేడుగాని.. ఇదో ఈ మందు తవుడులో కలిపెట్టు తగ్గిపోద్ది" అన్నాడు ఈరిగాడు.

సాములు ఆ మందుతీసుకున్నోడు గొడ్డుకేమైందో అని లగెత్తాలా? వూహు.. మాతో పాటే కూకొని బీడీ ముట్టించాడు.

"ఏందిరా ఇంకా కూకున్నావు. అవతల గొడ్డుకట్టావుంటే..?"

"కాదులే మామా.. ఈరేశంగోరిని ఒక ఇశయం అడగాల.."

"ఏందది?" అడిగాడు ఈరేశం.

"తమరేటి అనుకోకూడదు మరి.."

"సెప్పేహే.. సొద బెట్టకుండా.."

"బాబుగోరు ఎవర్నో సెటప్పు జేసినట్టున్నారు.. ఎవరు బాబు పిల్ల..?" అన్నాడు వాడు.

"ఏందిరా సాములు.. నేనేంది సెటప్పేందిరా..?" ఈరిగాడన్నాడు.

"కాదు బాబూ.. మన రైల్వేటేసను మాట్టరు లేడూ.. అదే రమణయ్య.. ఆరు కనుక్కు రమ్మన్నారు.."

"ఏం కనుక్కురమ్మన్నారురా.." నేనెనడిగా. వాడు నాతో పలక్కుండా ఈరిగాడితొ అన్నాడు -

"కాదు బాబు.. మొన్న ఎవతో పిల్ల మీ ఆసుపత్రిలో దూరడం సూసాడట.. పిల్ల భలేగుంది.. ఎవరా పిల్లా ఏంటి కథ కన్నుకోమన్నాడు.."

ఈరేశం కోపంతో వూగిపోయాడు."రేయ్..ఎదవ నాయాల.. అది నా పెళ్ళంరా.."

"వూరుకోండి బాబూ.. పెళ్ళమైతే దర్జాగా రాదా దర్జాగా పోదా.. ఇట్టా సాటుగా రావడామెందుకు.. అదిరాగానే మీరు తలుపైయ్యడమేంది.. సెప్పండి బాబు ఎవత్తది.."

"సెండాలు తీత్తా నాయాల.. నా పెళ్ళం గురించి తప్పుడుకోతలు కూత్తావట్రా.." అంటూ వాణ్ణి పట్టుకొని చావమోదాడు. నేను అడ్డం పోయి ఈరిగాణ్ణి పట్టుకున్నానో లేదో సాములుగాడు దొరికిందే సందు నారాయణా అని లగెత్తాడు.

"మీరు సెప్పకపోతే నేను కనుక్కొలేననుకున్నారా.. సూడండి కనిపెట్టేత్తా.." అంటూ లగెత్తాడు వాడు.

ఈరిగాడు ఈ కథనతా సెప్పగానే నేనడిగాను - "అవున్రా.. నేనూ అక్కడే వున్న కదా.. దానికి సినిమాకి సంబధం ఏందని.."
"ఏముంది మామా.. సీలచ్చి అందరికి కనపడపోవటం వల్లే కద అందరు ఇట్టగనుకుంటున్నారు.. నేను ఎవ్వరికి కనపడకుండా దాచటం వల్లె కదా సాములులాటోళ్ళు రంకు అనుకుంటున్నారు.."
"అవును.. ఐతే"
"ఇంక ఐతే గీతే ఎందిరా.. నా పెళ్ళం అందరికి కనిపించాల.. అది నా పెళ్ళమని అందరికి తెలియాల.. అందుకే వారం వారం సినిమాకి దాన్నేసుకోని వచ్చేది.."
"వోర్ని భలేటొడివిరా... సరేలే సాములుగాడి పున్నెమా అని మా సీలచ్చి ఎంతో సంబరపడిపోతోంది.. అది సాలు" అనుకున్నా నేను మనసులో.

(విద్యుల్లత, ఆగష్టు 1998)

Category:

4 వ్యాఖ్య(లు):

Kranthi M చెప్పారు...

ha ha haaaaaa....... good one.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీకథ చదువుతుంటే నామిని సుబ్రమణ్యం కథలు గుర్తుకువచ్చాయి.బాగుంది.

Unknown చెప్పారు...

క్రాంతి కుమార్ గారు
కృతజ్ఞతలు

విజయ మోహన్ గారు
నామిని సుబ్రమణ్యంని చదివే అవకాశం రాలేదు... మీరిచ్చిన వ్యాఖ్య చదివాక చదవాలనివుంది.

రానారె చెప్పారు...

వహ్వా! :-))