నా పెళ్ళాం పిల్లలకి ఆకలేస్తే
నేను దేవుణ్ణి రోడ్డుమీదకు లాగుతాను
నాకు అన్నం పెట్టాలని నా దేవుళ్ళు
ఎంతోమందితో తొక్కించుకుంటారు
రంగులడబ్బా పట్టుకొని ఇంటినించి కదలగానే
నా బొమ్మ వెయ్యమంటే నా బొమ్మ వెయ్యమని
సాయిబాబా, సిలువెక్కిన ఏసు, వినాయకుడు
కలిసి నా బుర్రలో రంగులు కలిపినట్టు గిలక్కొడతారు
చెప్పులులేని నా కాళ్ళను చూసి తారురోడ్డు ఆబగా చుర్రెక్కుతుంది
దేవుళ్ళకి రంగులు రుద్ది రుద్ది నా వేళ్ళు అరిగిపోతాయి
మోకాళ్ళపై కూర్చొని బొమ్మవేసేసరికి ఏసుప్రభువు శిలువపై రక్తపు మరకలౌతాయి
బొమ్మలో అందంకన్నా మనసులో భక్తి చిల్లర పైసలై రాలుతుంది
నేను వేరే బొమ్మలు ఇంతకంటే బాగా వెయ్యగలను కానీ
వేసేది దేవుడి బొమ్మకాకపోతే మీ కాళ్ళకింద రంగులు నలిగిపోతాయి
అందుకే దేవుణ్ణి తెచ్చి రోడ్డుపై పరుస్తుంటాను
ఆ దేముణ్ణికి దణ్ణంపెట్టి పక్కనున్న నన్ను ఛీ కొట్టి వెళ్తారు జనం
ట్రాఫిక్ పోలీసు వస్తే నా రంగుడబ్బాని తన్ని కొత్త రంగులు పుట్టిస్తాడు
కారుపార్కింగ్లో బొమ్మేమిటని షాపువాడు నీళ్ళు కుమ్మరిస్తాడు
అయినా నా ఆకలి ఏ గుడి ముందో జాగా వెతికేస్తుంది
నా పేదరికం పేరు చెప్పుకొని ఒక కళ బతికేస్తుంది
ఈసారెప్పుడైనా నా బొమ్మ కనిపిస్తే మీరు కళను చూడపోయినా పర్లేదు
దాని వెనక నా కాలే కడుపును చూస్తే చాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
9 వ్యాఖ్య(లు):
aakali kekalu baagaa pasigattaaru.dhanyavaadamulu
Baagumdi..vasilisuresh teluguneastamaa..
చాలా బాగా వ్యక్తీకరించారు.వేసిన బొమ్మలు చూసి బాగున్నాయని అనుకుని తప్పుకుని వెళ్ళిపోయిన రోజులున్నాయి.ఇకనుండి అలా జరగదు.ఈవిషయం నాకు తెలియదని కాదు,కొన్ని కొన్ని అంతే..ఎవరన్నా చెపితేనే గానీ సరిగ్గా అర్ధం కాదు/అలా చెయ్యాలన్న ఊహ రాదు.
మీ రచనలో ఫీలింగ్ చాలా ఆర్ద్రంగా ఉంది.
@ దుర్గేశ్వరగారు,
@ సురెష్‌గారు
@ కొత్తపాళిగారు,
నెనర్లు,
@ రాధికగారు,
చాల సంతోషం. నెనర్లు.
వేసేది దేవుడి బొమ్మకాకపోతే మీ కాళ్ళకింద రంగులు నలిగిపోతాయి
అందుకే దేవుణ్ణి తెచ్చి రోడ్డుపై పరుస్తుంటాను
ఎంత వాస్తవం అండీ.
చాలా బాగుంది.
ఆర్ధ్రంగా ఉంది.
http://sahitheeyanam.blogspot.com/2008/07/blog-post_10.html లోని
పెయింటరు కవితను చదివారా. పాపం ఈ పెయింటరు ఎందుకలా అయ్యాడో ......
మీ కవిత చాలా ఆర్ధ్రతతో నిండియుంది.
మొన్ననే మీ కార్పొరేట్ కాశీమజిలీ కధలు చదివాను.
చాలా నచ్చాయి. అక్కడ వ్యాఖ్య రాద్దామంటే, ఎంత
ప్రయత్నించినా వీలు కాలేదు. "రిసెషన్" పైన మీ
టపా కూడా చాలా బావుంది. చాలా క్లిష్టమైన
విషయాన్ని, మీరు ఎంతో సరళంగా చెప్పారు. ధన్యవాదములు.
బాబాగారు,
నెనర్లు. ఇంతకు మునుపు మీ పేయింటరు కవిత చదివాను. ఇప్పుడు మళ్ళీ చదివితే.. అరే నా బొమ్మలవాడు ఆ పేయింటరు రెండో అవతారంలాగా వుందే అనిపించింది..!!
భవానిగారూ,
అభినందనలకి నెనర్లు. కాశీమజిలీ కథలలో కామెంటడానికి వచ్చిన ఇబ్బంది వివరంగా చెప్తే సరిదిద్దగలను. మీకు కుదరలేదా... బ్లాగులో కుదరటంలేదా..??
బ్లాగులో కుదరలేదు సార్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి