నానోలు

ఈగ హనుమాన్ రూపొందించిన నానో అనే కొత్త ప్రక్రియ గురించి తెలిసే వుంటుంది..!! అది కవిత్వమా కాదా అని అంతర్జాలంలో విస్తృత చర్చే జరిగింది - జరుగుతోంది..!! అవి అలా పక్కన పెడితే - ఒక రోజు ఇలాంటివి నేను ఎందుకు ప్రయత్నించకూడదు అని అనిపించింది. కవిత్వం సంగతి ఎలా వున్నా "నాలుగే పదాలు" అన్న నియమంలో ఇమిడి చెప్పదల్చుకున్న విషయం చెప్పడం కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది.. ఆ ప్రయత్న ఫలితమే ఈ నానోలు..

1
చెట్టుకు
పూయని
పూవు
సీతాకోకచిలక-

2
చీకటి
చివరి
మజిలి
వెలుగేగా-

3
చలికాలం
పేదవాడి
వెచ్చదనం
ఆకలిమంట-

4
బ్రతుకుబడిలో
తీపిగుర్తులు
కలలు
కల్లలు-

5
ప్రేమవనంలో
పూలూ
మూళ్ళూ
కలిసేవుంటాయ్-

6
చింపేసిన
క్యాలండర్
తిరిగిరాని
కాలం-

7
పూల
పెదాలపై
తుమ్మెద
ముద్దుగుర్తులు-

8
మనసుకు
నేత్రదానం
కవితకు
భావుకత్వం-

9

పక్షులు
వలసెళ్ళాక
కిలకిలలన్నీ
గిలకబావివే-

10
చెట్టుకొట్టే
గొడ్డలికర్ర
చెట్టుకు
పుట్టిందేగా-

11
ఆలోచన
మహావృక్షం
బోన్సాయ్
నానో-

Category:

4 వ్యాఖ్య(లు):

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

సత్యప్రసాద్ గారూ ..... నాలోని కవిని రెచ్చగొడుతున్నారు... :) తదుపరి పరిణామాలకు మీదే బాధ్యత... :)

జీడిపప్పు చెప్పారు...

సత్యప్రసాద్ గారు, "నానీ"లను మొదట కనిపెట్టింది ఎవరో తెలుగు ప్రొఫెసరు అనుకుంటాను. నోటికొచ్చిన పదాలను ఇష్టమొచ్చిన రీతిలో "అమర్చి" సాహిత్యం అంటున్నారు అని నానీల పైన విమర్శలు వచ్చాయి, నానీలు సాహిత్య ఖూనీలు అంటున్నారు అందరూ. అందుకే గత కొద్ది రోజులుగా నానీలకంటే మూడు రెట్లు సాహిత్య విలువలున్న "బర్గరములు" బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. తెలుగు సాహితీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న బర్గరముల వివరాలు ఇక్కడ చూడండి.

Unknown చెప్పారు...

వంశీగారు..
మరెందుకు ఆలస్యం..!!

జీడిపప్పు..
మహత్తరంగా వుంది ఇది
బర్గరములనే కొత్త ప్రక్రియ
బరికేస్తా కాచుకో ఇంక..!!

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

congratulations for attempt