రాజుకాయ - దోసకాయ - తులసి - వాము

నాకు పదేళ్ళ వయసున్నప్పుడు ఒకసారి మా పెదనాన్న ఒక పద్యం చెప్పాడు. గజేంద్రమోక్షం గురించిన ఆ పద్యం ఇదిగో -

ఎంతదయో దాసులపై
పంతంబున మకరి పట్టి బాధింపంగా శ్రీ
కాంతుడు చక్రం పంపెను
దంతావళి రాజుకాయ దత్తాత్రేయా

నాలుగుసార్లు అదే పద్యం చెప్పాడేమో ఆ పద్యం నా నోటికొచ్చేసింది. కాని చాలా రోజులదాకా ఆఖరి పంక్తిలో వున్న రాజుకాయ ఏమిటో అర్థమయ్యేదికాదు. మామిడికాయ, అరటికాయ లాగా ఇది కూడా ఏదో కాయ కాబోలని సరిపెట్టుకున్నాను. ఈ మధ్యే మళ్ళీ ఆ పద్యం గుర్తుకొచ్చి నవ్వుకున్నాను. దంతావళి (దంతములు కల - ఏనుగుల) రాజు - కాయ (కాపాడను) అని అర్థమని మీకిప్పటికే అర్థమయ్యే వుంటుంది.

ఆ తరువాత అదే పెదనాన్న ఈ పద్యానికి పేరడీ పద్యం కూడా చెప్పాడు -

ఎంతదయో దోసకాయలపై
పంతంబున చెక్కుతీసి భాగింపంగా శ్రీ
కాంతుడు కారం పంపెను
దంతాలకు చేటు వచ్చే దప్పిక తీరన్.


కవిగారి చెమత్కారం కాకపోతే శ్రీకాంతుడి కారం పంపటమేమిటి..? అది రాజుకాయ నుంచి దోసకాయ దాకా కథ.

***

ఇదిలావుంటే చిలకమర్తివారి గణపతి గుర్తున్నాడుగా.. సదరు గణపతి "శ్రీ రఘురామ" పద్యానికి చెప్పిన వివరణ గుర్తుందా -

"శ్రీరఘురామ చారు తులసీ దళ" - శ్రీరాముడు ఒకసారి చారు కావాలనుకున్నాడట.. ఆ వూరిలో (ఏదీ అయోధ్యా నగరంలో...హతవిథీ) కర్వేపాకు దొరకటం దుర్లభం కావటంతో తులసీ దళములను ప్రత్యామ్నాయంగా వాడారుట. అట్టి చారు తాగడంతో శ్రీరాముడికి "సమక్షమాది శృంగార గుణాలు" కలిగి, అన్నిలోకాలను జయించే "శౌర్య రమాలలాముడై", "దాశరధి కరుణాపయోనిధియై " వెలుగొందాడట.

ఇలాంటిదే మా నాయనమ్మ ఒక పద్యం చెప్పేది -

వామే భూమి సుత, పురస్చ హనుమాన్
పస్చాత్ లక్ష్మణహ సుగ్రీవో జాంబవాన్...


ఇలా సాగుతుందీ పద్యం (తరువాత పంక్తులు గుర్తులేవు..!)

ఈ పద్యానికి చాలాకాలం నేను నమ్మిన అర్థం ఏమిటంటే (మా నాయనమ్మ చెప్పిందే) -

ఒకసారి శ్రీరాముడికి కడుపులొ నొప్పివచ్చిందట. "సీతా..! కాస్త "వాము" తెచ్చిపెట్టవే" అన్నాట్ట శ్రీరాముడు. సీత - "నేను పోలేను ప్రభు కిందే కూర్చొని హనుమంతుడున్నాడుగా" అన్నది. హనుమంతుడు లక్ష్మణుడి పేరుచెప్పి తప్పుకున్నాడట, లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి అడగచ్చుగా అన్నాడు... అక్కడినుంచి జాంబవంతుడు, భరతాదులు ఇలా అందరూ ఒకరంటే ఒకరనుకున్నారు కాని రాములవారికి వాముతెచ్చేవాడే లేకపోయారట.

ఒకరోజు ఏదో పుస్తకంలో ఆ పద్యం చదువుతూవుంటే ఆ అర్థం సరికాదేమో అనిపించింది. అప్పుడు వెలిగింది - వామే భూమిసుత అంటే ఎడమవైపు (వామహస్తం అంటే తెలుసుగా..!) సీతాదేవి వుంది, కాళ్ళదగ్గర హనుమంతుడు - అంటే ఈ పద్యం శ్రీరామపట్టాభిషేకం గ్రూప్ ఫొటో వర్ణనన్నమాట. వామ వైపు కాస్తా వామైపోయిన విధం గుర్తొస్తే ఇప్పటికి నవ్వొస్తుంటుంది.

ఇది తులసి - వాముల కథ.

2 వ్యాఖ్య(లు):

రవి చెప్పారు...

బావుంది. ఇప్పుడే "గణపతి" పుస్తకం విశాలాంధ్రలో చూశాను. కొందామా వద్దా మీమాంసలో పడి వదిలేశాను. వచ్చే వారం కొనాలి.

అజ్ఞాత చెప్పారు...

"సీతా..! కాస్త "వాము" తెచ్చిపెట్టవే" అన్నాట్ట శ్రీరాముడు

hehheee