పులికాటి గట్టుమీద ఆ పసివాడు జాగ్రత్తగా తన పని చేసుకుంటున్నాడు. వాడి చేతులు అతి లాఘవంగా కదులుతున్నాయి. వడ్డున దొరికిన రబ్బరు చెప్పుకు ఒక పుల్లను గుచ్చి దానికి గుడ్డకట్టి పడవలా తయారుచేస్తున్నాడు. వాడి పేరు చంద్రిగాడు.
"రేయ్ సెంద్రిగా.. ఈ పాలి పడవని నేనిడుత్తారా" సెల్వం అడిగాడు. వాడు చంద్రిగాడి స్నేహితుడు.
"సెత్.. పోయిన తడవ నువ్ ఇడిత్తే ఏటైనాదిరా.. నట్టేటికిబోయి.. బుడుంగున మునిగిపోయిళ్ళా... రేయ్.. సెంద్రిగా నువ్వే ఇడురా.. నువ్వు ఇడిత్తే.. బలేగ పోతాది పడవ.." పక్కనే వున్న మరొకడన్నాడు.
"రేయ్.. సెంద్రిగా నువ్వు పొద్దస్తమానం ఇంకా సదువులు సదివి పెద్ద పెద్ద పడవలు సేత్తానంటావు కదరా.. ఎప్పుడురా అది.." ఇంకొకడు అడిగాడు.
చెంద్రిగాడు మాట్లాడలేదు. తయారైన పడవ వంక తృప్తిగా చూసుకొని కొల్లేరు వైపు పరుగు తీసాడు - వాడి వెనకే పిల్లలందరూ. పడవని నీళ్ళలోకి వదిలిపెట్టి చిన్నగా ఒక్క తోపు తోసాడు. అది వయ్యారంగా వూగుతూ ముందుకు కదిలింది. దానివైపే చూస్తూ చంద్రం అన్నాడు -
"పెద్ద పడవలంటే ఇట్టాటివి కాదురా.. మరపడవలు.. నేను సదూకొని సేసేవి అయ్యే.. అట్టాటియి యేసుకొని యేటగిన పోతే ఎన్ని సేపలైనా దొరుకుతాయి.. మా అయ్యకింక కట్టమే వుండదు.."
పడవ కనుమరుగౌతూ వుంది.
ఛెళ్ళున వీపున ఎవరో చరిచినట్లయ్యి నీళ్ళలో పడ్డాడు చంద్రం. పిల్లలందరూ పరుగుదీసారు. వెనక్కి చూసాడు చంద్రం.
"అయ్యా.. నువ్వా.. ఎందయ్యా" అన్నడు వీపు రుద్దుకుంటూ
"నాయాల.. ఏడబోయినావురా.. పైటాల కూడు దినక అమ్మకి సెప్పకుండా సస్తే.. ఏడెతికేది నేను..? నడువ్ ఇంటికి.." శీనయ్య అన్నాడు.
చంద్రం మాట్లాడలేదు. శీనయ్య చెయ్యి పట్టుకొని కదిలాడు. ఇద్దరూ నడక సాగించారు.
"రేయ్.. రేపటాలనించి నువ్ నాతో గూడా యేటకి రావాల.."
"అయ్యా.. బడికి బోవద్దా మరి..?"
"బడేందిరా.. సదువొద్దు ఏటొద్దు.. ముందు మన తిండి సంగతి సూసుకోబళ్ళే.. సదివేం సేత్తావురా.. ఎదవా.."
"అయ్యా.. నే సదివి.. పెద్ద పెద్ద పడవలు సేసేత్తానయ్యా.. అప్పుదు నువ్వు నేను ఆటిమీనే బోయి సేపలేసకరావచ్చు.."
"ఏందిరా నువ్ సేసే పడవలు.. బిన్నా నడువ్ పొద్దేలౌతాంది..రేపటేళ నించి నువ్వు సేపలేటకి రావాల"
"అయ్యా.. నువ్ ఎల్తావుండావు గదా మళ్ళా నేనెందుకు యేటకి.."
"సంపుతా ఎదవాని.. ఇయ్యాల వలేత్తా వుండానా.. నడుం పట్టుకుపోయింది.. నువ్వుగోడా రేపొచ్చి యేటాడాల.. నాయుడుగోరికాడ దుడ్డు అప్పెట్టినాకా.. ఒక్క పైసాకూడా జమెయ్యలేదు..." శినయ్య గబగబ నడుస్తూ చంద్రాన్ని లాక్కుపోయినంత పనిచేసాడు. అతని గుండెలో సుడిగుండాలు తిరుగుతున్నాయి.
పులికాటు జాలర్లందరికి ఇది మామూలే. దొరికిన రోజు ఎంత దొరుకుతాయంటే అవి అమ్ముకోటానికి ధర విపరీతంగా తగ్గించుకోవాల్సి వస్తుంది. అందరు కలసి ధరలు నిర్ణయించడం అక్కడ సాధ్యం కాని పని. సరుకును దాచుకునే కొల్డ్‌స్టోరేజీల గురించి వాళ్ళలో చాలామందికి తెలియదు. దళారులు నిర్ణయించిన ధరకి అమ్ముకోవడం.. వచ్చిన డబ్బును తాగడానికి, పండగలకి జాతర్లకి ఖర్చు పెట్టటం, గ్రూపులుగా విడిపోయి తెడ్లతో ఈటెలతో తన్నుకోవడం మాత్రమే వీరికి తెలుసు. దొరికిన రోజు దర్జా దొరకని రోజు పస్తులు ఇదీ వాళ్ళ జీవితం.
"ఏందిరా శీనయ్యా.. బుడ్డోణ్ణి అట్టా లాక్కపోతుండావు.." రాజయ్య ఎదురొచ్చి అడిగాడు.
"ఏటి సేసేది మావా.. ఈడు మాట ఇంటావుంటెగదా.. నేను ఇట్టాగిట్టాగే ముసలోణ్ణవతావుండానా.. యేటకి రారాఅయ్యా అంటే ఇననే ఇనడబ్బా.."
"సదువుకుంటండాడు గదరా.."
"సట్టుబండల సదువు.. ఆడు ఎపుడో సదివి సేసేదేంది మావా.." శీనయ్య అంటుండగానే చెంద్రిగాడు అందుకున్నాడు.
"సదివినాక నేను పడవలు సేత్తా నయినా.. మర పడవలు.."
"నీ పాసుగొల.. భలేటోడయ్య.. బిన్నాబో రేయౌతాంది..మర పడవలు తయారుజేత్తా.." అంటూ చెంద్రిగాణ్ణి ముద్దుపెట్టుకొని కదిలాడు రాజయ్య.
"అయ్యా మనం అటు దిక్కు పోదామయ్యా.."
"అటెందుకురా ఇటు అడ్డదోవన పోదాం.. నడువ్.."
"కాదు నయినా.. ఆడ మూల మీద పడవలు సెత్తావుంటారు.. సూసుకుంటూ యెల్లదాం.. "
"సెండాలు వలుత్తా ఎదవ.. పొద్దాకల అదే యావ? పడవలు.. పడవలు.." కోపంగా అరిచి చెంద్రిగాణ్ణి అడ్డదోవవైపు లాక్కబోయాడు శీనయ్య.
"అయ్యా.." నడుస్తూనే పిలిచాడు చెంద్రిగాడు.
"ఏందిరా"
"పడవలు సెయ్యడానికి అంతంత సెక్కలేడనించి వత్తాయి..?"
"నోర్ముయ్యరా.."
"కాదయ్యా.. మరి మర పడవల్లో మన యేటలోకి పోడానికి కుదురుద్దా..?"
"పీకపిసుకుతా.. కుర్రనాయాల.. ఎందిరా ఇదె.. ఇదేనేట్రా నువ్ సదుతుండాది.. పొద్దాకల పడవలో.. మర పడవలో అంటాంటావు.." కోపంగా అరిచాడు శీనయ్య.. "నోరు గినా లేచిందా నరుకుతా.. " భయపెట్టాడతను
చెంద్రిగాడు మరింకేమి మాట్లాడలేదు. వాడికి మాత్రం తాను పెద్ద పెద్ద పడవలు చెయ్యటం, అవి నీళ్ళలో తేలడం కళ్ళముందు కనపడుతూవుంది.
"అమ్మా.." అరిచాడు ఒక్కసారిగా
"ఏందిరా.. ఏటైనాది.." శీనయ్య ఆత్రంగా అడిగాడు
"ఏదో కుట్టిందయ్యా.." కూలబడ్డాడు చెంద్రిగాడు. శీనయ్య ముందుకు వంగి చూసాడు.
పాము..!
కట్లపాము..!!
"పాము.." అరిచాడు అప్రయత్నంగానే
"ఆ.. పామా.. ఓర్నాయనో.. పాము.." గట్టిగా ఏడుపందుకున్నాడు చెంద్రిగాడు.
"లేదులేరా.. నడువ్.. నడువ్.. బిన్నా డాక్టరుతానకి పోదాం.." చెంద్రిగాడి చెయ్యి పట్టుకొని లేపబోయాడు శీనయ్య.
"అయ్యా.. నే సచ్చిపోతానా.. పాము కరిస్తే సస్తారుగా.." ఏడుస్తూనే అడిగాడు. శీనయ్యకి ఏమి చెప్పాలో అర్థంకాలేదు.
"లేదురా నికేమిగాదు.. లే నడువ్.. అది పాము కాదులే.. లే నాయనా.."
చెంద్రిగాడు లేచి రెండడుగులు వేశాడు. కాళ్ళు తిమ్మిరెక్కినట్లుంది.ఇక కాళ్ళు కదపలేనట్లు కూలబడిపోయాడు. స్పృహ నెమ్మదిగా కోల్పోతున్నాడు.
"అయ్యోవ్.. నా వల్లగాదు.."
శీనయ్య వంగి చెంద్రిగాడ్ని పైకెత్తబోయాడు. నడుం దగ్గర కలుక్కుమంది. అయినా ఆగలేదు. చెంద్రిగాణ్ణి రెండు చేతుల్లోకి తీసుకొని నడవడం మొదలుపెట్టాడు. అది నడక కాదు .. పరుగు. గసపెడుతున్నాడు- నడుంలో బాధను పంటికింద తొక్కిపెట్టాడు.
"రేయ్ సెంద్రమా.. సూడరా అయ్యా.. కళ్ళు మూతెయ్యబాక.. మాటాడరా.. మాటాడు.."
చెంద్రిగాడి కళ్ళు మూసుకుపోతున్నాయి.. బలవంతంగా కళ్ళు తెరిచాడు.
"మాటాడరా.. నిద్రలోకిపోతే ఇసం పాకిపోతది.. సూడిట్టా.. సెప్పు నువ్వు పడవలెప్పుడు సేత్తావురా.. ఇదుగో ఇందాకల సేసినావే అదెట్టా సేసావో సెప్పరా.." పరుగెడుతూనే అడుగుతున్నాడు. అడుగుతూనే పరుగెడుతున్నాడు. ఇంక ఎంతో దూరం పరుగెత్తలేడని అతనికి అర్ధమౌతూనేవుంది. చెంద్రిగాడు మత్తుగా ఎదో గొణుగుతున్నాడు.
"అదీ.. చెప్పుదొరికితే దానికి..అబ్బా.. ఒక పామును తెచ్చి... అహ పాముకాదు.. కట్టె తెచ్చి.. అబ్బా అయ్యా నెప్పెడతాంది.."
శీనయ్య నడుంనొప్పి ఇంక ఎక్కువైతోంది. ఇక పరుగెత్తలేనని ఆగిపోయాడు. ఒక చెట్టుకింద చెంద్రిగాణ్ణి కూర్చోబెట్టాడు. 'నేనే ఇక దాక్టర్ దగ్గరకి వెళ్ళి పిల్చుకురావాలి..' అనుకున్నాడు.
"సూడయ్యా.. సంద్రమా.. నేనెళ్ళి డాకటరుని పిల్చుకొస్తా.. నువ్వీడనే కూకో.. నిద్రపోబాక అయ్యా.. ఇదో నిద్రపోయినావా ఇసం నెత్తికెక్కుద్ది.. సూడు.. ఈ సెట్టుతోటో.. పుట్టతోటో మాట్టాడతావుండాల.."
"పుట్టనా.. అందులో పాముటదయ్యా.."
"అయ్యో.. పాములేదు.. ఏటిలేదు బిడ్డా.. ఏదోకటి సేత్తావుండరా నేనుబోయి బిన్నావత్తా.." పరుగెత్తబోయి ఆగాడు శీనయ్య. అక్కడ దగ్గర్లో ఒక పుస్తకం కనపడింది. అది తీసుకొని చెంద్రిగాడి దగ్గరికి వెళ్ళాడు.
"రేయ్.. సెంద్రమా.. సూడునాయనా.. ఇదో పుస్తకం.. సదూకుంటూ వుండాల.. నిద్రపోబాకయ్యా.."
అంతే..! శీనయ్య పరుగుతీసాడు. నడుంనొప్పిని ఏ మాత్రం లెక్కచెయ్యలేదు. స్పృహ తప్పుతున్న చెంద్రిగాడే కళ్ళముందు కనపడుతున్నాడు. డాక్టరు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి ఆయన్ని వెంటబెట్టుకొని మళ్ళి పరుగుతీసాడు. ఇద్దరూ చెంద్రిగాడు వున్న చోటికి వచ్చి ఆగిపోయారు. అక్కడ -
శీనయ్య చదువుకొమ్మని ఇచ్చిన పుస్తకంలో కాగితాలన్నీ చించి పడవల్లాగ చేసివున్నాయి. ఆ పడవల మధ్యలో అచేతనంగా పడివున్నాడు చెంద్రిగాడు. వాడి చేతిలో ఒక పడవ అసంపూర్ణంగా మిగిలి వుంది.
ఇది జరిగి చాలా రోజులైంది.
(అముద్రితం)